Friday 22 March 2019

నాయనమ్మ పూనకం......



 ద్వారపూడి వచ్చిన కొత్తల్లో నాకు పరిచయం అయిన ఇల్లు అది. వాళ్ళ చిన్న కూతురు లక్ష్మి మాతోనే చదివేది. తనతో స్నేహం మామూలుగానే కుదిరినా...దాన్ని నిలుపుకోడానికి మాత్రం చాలా తంటాలే పడ్డాను. లక్ష్మి వాళ్ళకి రొట్లు తయారుచేస్తారే ఓ బేకరీ ఉండేది. అందులో ఎన్నో రకాల బిస్కెట్లు, కేకులు, రొట్లు తయారుచేసేవారు. వాళ్ళ ఇల్లు మా స్కూలుకి ఆనుకునే ఉండేదేమో..ఇంట్రవెల్లో పిల్లలంతా వాళ్ళ కొట్లో కొనుక్కోడానికి వచ్చేవాళ్ళు. ఇక నాలా రోజూ కొనుక్కోడానికి డబ్బులు లేనివాళ్ళంతా లక్ష్మితో స్నేహం చేసేవారు. అది రోజూ మాకోసం స్కూలుకి బిస్ కెట్లు తెచ్చేది. వాటికోసమన్నా దానితో స్నేహం చేయాలనిపించేది.

లక్ష్మి ఓ మోస్తరుగా చదివే రకమే..  అంత అమాయకురాలేంకాదు. పైకి కనిపించని గడుసుదనం దానిలో చాలా ఉంది. కానీ సందర్భం వస్తేగానీ ఆ గడుసుదనాన్ని ఉపయోగించేదికాదు. తనకి ఓ అక్క, ఓ అన్న. అక్కకు పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారు. అన్నగాడు మిస్టర్ అమాయక చక్రవర్తి. మన నోట్లో వాడి వేలు పెట్టి గట్టిగా కొరుక్కోపరవాలేదనే రకం. మా తోబుట్టువులమంతా మా ఇల్లు తరవాత వీళ్ళ ఇంట్లోనే సరదాగా ఆడుకునేవాళ్ళం. లక్ష్మి అమ్మానాన్నలు నేనంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు.. ఇక అసలు ఘటం బామ్మ లక్ష్మికి నాయనమ్మ... నేనంటే అస్సలు గిట్టేదికాదు.. అసలు నేనేకాదు స్కూలుకొచ్చే పిల్లలు ఎవరిని చూసినా దుమదుమలాడిపోయేది. చేతిలో పెద్ద కర్రపట్టుకుని ఎప్పుడూ కొట్టడానికి వచ్చేది. ఆమంటే చచ్చేంత భయం పిల్లలందరికీ.  

లక్ష్మి నాతో పాటు తిరగడం వాళ్ళ నాయనమ్మకు నచ్చేది కాదు. "ఎప్పుడు చూడు ఆ మొద్దు పిల్లతో తిరుగుతావేమే.. వాళ్ళ చెల్లిలా చదువుకో" అనేది. దేవుడా దీనికీ నాగురించి తెలిసిపోయిందే అని నాయనమ్మను చూసిన ప్రతిసారి తిట్టుకునేదాన్ని. పైగా సాయంత్రాలు అరుగెక్కి దారిన పోయోవాళ్ళకు పంచాయితీలు చెప్పేది. ఇంట్లో రాకాసి, వీధిలో పేదరాసి పెద్దమ్మ టైపులో.

మేమంతా రోజు మొత్తం ఎంత ఆడుకున్నా, లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఆ రొట్టెలు, బిస్ కెట్లు ఎలా తయారుచేస్తారో చూడాలని తెగ ఆశగా ఉండేది. కానీ వాళ్ళ ఇంట్లోకి కొన్ని వేళల్లోనే వెళ్ళనిచ్చేవాళ్ళు మిగతా సమయంలో లోపలికి రాకుండా బామ్మ కాపలా కాచేది. ఇంటి వరండాలో మైదా బస్తాలు, పంచదార మూటలు ఉండేవి. వాళ్ళిల్లు ఎప్పుడూ పులిసిన వాసనతో కలసిపోయి రొట్లు కాలుతున్న వాసన వచ్చేది. 

వీటన్నింటికన్నా నన్ను బాగా ఆకర్షించింది లక్ష్మి వాళ్ళ పూజగది. వాళ్ళ ఇంట్లో పెద్దవరండాకు చేర్చి మూలగా ఉన్న గదిలో ఎప్పుడూ పూజ జరుగుతూనే ఉండేది. గోడల నిండా దుర్గాదేవి, శివుడు, విష్ణువు పెద్ద పెద్ద ఫోటోలు తగిలించి ఉండేవి. పూజగదిలో పెద్ద దుర్గాదేవి విగ్రహానికి  లక్ష్మి వాళ్ళ నాన్న పూజచేసేవారు. బుధవారం, శుక్రవారం ఇంటినిండా సాంబ్రాణి ధూపం వేసి మా అందరికీ దద్దోజనం ప్రసాదంగా పెట్టేవాళ్ళు. అందుకేనేమో నాయనమ్మ ఎవరినీ అటుపోనిచ్చేది కాదు. నెమ్మదిగా లక్ష్మితో మా స్నేహం రోజురోజుకూ పెరిగి మా అమ్మానాన్నలు, లక్ష్మి అమ్మానాన్నలు స్నేహితులైపోయారు. 

మా అమ్మావాళ్ళు పొరుగూరు వెళ్ళినప్పుడు లక్ష్మీ వాళ్ళ ఇంట్లోనే రాత్రిళ్ళు మా అందరినీ వదిలి వెళ్ళేవాళ్ళు. లక్ష్మితో రాత్రంతా కబుర్లుచెప్పుకుని వాళ్ళ అన్నయ్యను బాగా ఆటపట్టించేవాళ్ళం. వాళ్ళింటికి ఎదురుగా ఉన్న రైస్ మిల్లులో ఆడుకునేవాళ్ళం. ఇక ఉగాదికి సత్తమ్మతల్లి జాతరప్పుడు లక్ష్మివాళ్ళ ఇల్లు వచ్చేపోయేవాళ్ళతో తెగ సందడిగా ఉండేది. లక్ష్మి వాళ్ళ చుట్టాలంతా వచ్చేవాళ్ళు. గంగమ్మకు, మసానమ్మకు, సత్తెమ్మకు వాళ్ళ ఇంటి నుండే గరగలు, పసుపు కుంకుమలు తీసుకువెళ్ళేవాళ్లు. ఆరోజు ప్రతి ఇంటివారు కోళ్ళు కోసేవాళ్ళు. లక్ష్మి వాళ్ళనాన్నరోజంతా పూజలోనే ఉండేవాడు. మేకలు బలిచ్చేవాళ్ళు. ఆ సాయంత్రం అందరికీ వాళ్ళింట్లోనే భోజనాలు.,  


ఆ ఏడు సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేనాటికి లక్ష్మివాళ్ళ ఇంట్లో చాలా మార్పులు వచ్చేసాయి. లక్ష్మి వాళ్ళ నాన్న బాగా జబ్బుచేసి మంచాన పడ్డాడు. చుట్టాల్లో ఎవరో చేతబడి చేసారని అంతా తగువులాడుకున్నారు. రొట్లు వ్యాపారం కుంటుబడింది. లక్ష్మి అన్నయ్యకు ఏం చేయాలో తెలీలేదు. స్కూలు గోడకు ఆనించి ఉన్న కొట్లో పుస్తకాలు, పెన్నులు షాపు పెట్టాడు.

ఇదంతా ఇలా ఉంటే ఇంట్లో అమ్మవారి పూజలు చేసేవారు లేకపోయారు. పక్కూరి నుండీ వచ్చిన వైద్యులు ఎన్ని చేసినా రోగం నయంకాలేదు. ఇంట్లో అంతా చేతబడేనని బాగా నమ్మేసారు. ఓ సాయంకాలం పూట నాయనమ్మ అరుగుమీద కూచుంది.. ఎవరో అటుగా పోతూ రెడ్డిగారి దగ్గరకి తీసుకెళ్ళమని చెప్పారు. ఆయనే మీ భారాన్ని దింపే దేవుడన్నారు. మరునాడు సాయంత్రం నాయనమ్మకు పూనకం వచ్చింది. రెడ్డిగారి దగ్గర చేతబడికి విడుపుందని చెప్పింది. తల్లి ఇక నుండీ ఆయనే నీకు మార్గం చూపుతాడంది.


అంతే నాలుగో నాడు తెల్లారే ఇంట్లో దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో తేలాయి. దుర్గాదేవి పీఠాన్ని సత్తెమ్మతల్లి గుళ్ళో అప్పగించేసారు. లక్ష్మివాళ్ళ నాన్నజబ్బుకురెడ్డిగారి ఇచ్చిన నూనెతో నయమయ్యిందని అంతా మతం మారిపోయారు. 

బుధవారాలు దుర్గమ్మకు పూజలుచేసే లక్ష్మి ఇప్పుడు ఆదివారాలు చర్చిలో కనిపిస్తుంది. 
కుటుంబం అంతా అంత శ్రద్ధగా పూజలుచేసేవాళ్ళు ఒక్కసారిగా మతం మారిపోవడం ఊళ్ళోవాళ్ళకి అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. లక్ష్మి వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా దేవుని కృప అంటారేగానీ.. బలమైన కారణం ఏమిటో ఇప్పటికీ చెప్పరు.  







7 comments:

  1. # శ్రీశాంతి గారు
    ఇవాళ ఉదయం చూసినపుడు ఈ పోస్ట్ "లోగుట్టు పెరుమాళ్ళ కెరుక" లాంటి పేరుతో ఉన్నట్లు గుర్తే 🤔? ఇప్పుడేమిటీ "నాయనమ్మ పూనకం" గా మారింది !?

    ReplyDelete
    Replies
    1. నమస్తే నరసింహా రావుగారు... నా బ్లాగ్ ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. చెప్పాలనుకున్న విషయానికి తగిన పేరుగా లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అనిపించలేదు అందుకే మార్చాను..

      Delete
  2. # శ్రీశాంతి గారు
    సీనియర్ బ్లాగర్ శ్యామలరావు గారి "శ్యామలీయం" బ్లాగ్ మీకు తెలుసు కదా? మీరు వ్రాసిన ఈ "నాయనమ్మ పూనకం" అనే బ్లాగ్ పోస్ట్ ను చదివి వారు తన అభిప్రాయాలను / అనుభవాలను పంచుకుంటూ తన బ్లాగ్ లో "దేవుడి పటాలన్నీ దిబ్బకింది చెరువులో" అని ఒక పోస్ట్ వ్రాశారు ఇవాళ (23-03-2019). చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చదివారా?

    శ్యామలీయం గారి 23-03-2019 నాటి బ్లాగ్ పోస్ట్ "దేవుడి పటాలన్నీ దిబ్బకింది చెరువులో"

    ReplyDelete
    Replies
    1. # దుగ్గిరాల శ్రీశాంతి
      మీరు శ్యామలీయం బ్లాగులో దేవుడి పటాలన్నీ దిబ్బకింది చెరువులో టపా చదివారా? ఎందుకంటే మీ స్పందన అక్కడా ఇక్కడా కూడా చెప్పలేదు కదా.

      Delete
    2. చదివానండి.. నేను రాసింది నాకు మిగిలిన చిన్ననాటి జ్ఞాపకాలు.. అందులో కల్పనలు లేవు. ఇక శ్యామలీయం బ్లాగులో చదివింది సగం వరకే జ్ఞాపకంలా అనిపించింది.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. హల్లో నీహారిక గారు.. రాగింగ్ చేస్తారా.. ఇదేమన్నా కాలేజీయా? ఇప్పుడు మీకన్నా ముందు నించీ బ్లాగుల్లో ఉంటే నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేయొచ్చా? ఈ జబర్దస్త్ కామెడీ వేరేక్కడన్నా చెల్లుతుందేమో ట్రై చేయండి. శాంతికి బ్లాగు నేనే పెట్టాను, నచ్చిందేదో వచ్చినట్టు రాసుకుంటానంటే. తను అదే చేస్తుంది. చదివినవాళ్ళు చదువుతారు, లేనివాళ్ళు తప్పుకుపోతారు. ఒక పోస్టు నచ్చకపోతే, అచ్చుతప్పులు మీకంత కన్నీరు తెప్పిస్తుంటే, ఎందుకు ఏడవటం తుడుచుకోవటం, తప్పుకుపోయి మీ పని మీరు చూసుకోక? "పాఠకులూ.. లోకువా" ఆ సోదంతా ఎందుకులెండి- నేను పన్నెండేళ్ళ నించీ బ్లాగు రాస్తున్నాను, ఈ బ్లాగుల నూతిలో పాఠకులెవరో, ఏం సీనో నాకు తెలుసు. మహ అయితే చదివేది తోటి బ్లాగర్లు, వాళ్ళు కామెంట్ పెట్టేది కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళ బ్లాగులు చదివి కామెంట్ పెడతామని. అలాంటి వాళ్ళెవరికి కావాలి? అయినా అందరూ పాఠకుల కోసం రాయరు. కొందరు ఇక్కడ దొరికే receptive void నచ్చి రాస్తుంటారు. అసలు పాఠకులంటూ ఒకరు దృష్టిలో ఉంటే కదా, లోకువా మర్యాదా అన్నవి వచ్చేది. మొదట్లో ఈ బ్లాగుకి కామెంట్ మోడరేషన్ ఉండేది, తనే తీసేయమంటే తీసేసాను, ఇలా వచ్చి నచ్చిందంతా కక్కుతుంటారని తెలీక. మోడరేషన్ మళ్ళీ పెడుతున్నాను. ఇలాంటి ఘరానా కబుర్లు ఇంకెక్కడన్నా చెప్పుకోండి మరి, మీ చోట్లూ మీకూ ఉంటాయిగా. కానీ లెక్క చేయమని మాత్రం అడక్కండి. వేరే పన్లున్నాయి.

      Delete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...