Friday 31 January 2014

అమరావతి కథల పై సమీక్ష

సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో



“అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గల గల పారుతున్న కృష్టానది. అద్గదీ అమరావతి.”
అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన 100 కథల సంపుటి. సత్యంగారి రచనకు బాపూ గారి బొమ్మలు, ముళ్ళపూడి వెంకట రమణగారి ముందు మాట మరింత వన్నెతెచ్చాయి. ఈ కథల్లో తనకు పరిచయమున్న ఊరిని, ఊరివారినీ మనకు పరిచయం చేసారు. కథ నిడివి చిన్నదైనా కథ చెప్పిన తీరు, కథా amaravathi_kadhaluవిషయం నిరాడంబరంగా ఉంది. అమరావతి ఊరితో ఆయనకున్న అనుబంధం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రాజులు, దొరలు, దొంగలూ, సామాన్య ప్రజలూ, అందరూ కథా పాత్రలే. ఒకింత హాస్యము, వ్యంగ్యమూ కలబోసి చెప్తారు. ప్రతీ కథా క్లుప్తంగా, సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఈ కథలను చదువుతున్న పాఠకుడి మనసుకు కృష్ణానది గలగలలు వినిపిస్తాయి. అమరావతి పరిసరాలు ఒక్కసారి పలకరిస్తాయి. అతి సరళంగా ఉండే ఆయన శైలి మామూలు పాఠకుడు కూడా సులువుగా అర్థం చేసుకోగలడు.
ఒకనాటి అమరావతి నగరం దేదీప్యమానంగా వెలగడం చూపుతూనే, ఈనాడు ఎంత నిరాదరణకు గురౌతున్నదో చెప్పుకొచ్చాడు రచయిత. ఒకనాడు రథాలతో, గుర్రాలతో, సైనిక విన్యాసాలతో పురవీధులు ఎంతో రమణీయంగా ఉండేవి. ఇప్పుడు ఆ వీధుల వెంట కుక్కలూ, గాడిదలూ నడుస్తున్నాయి. ముత్యాల మూటలు బళ్ళకెత్తి నడిచిన ఆ వీధులంట ఇప్పుడు పొట్టు బస్తాల వెళుతున్నాయి. శుభ్రం తగ్గిపోయి, రోడ్లంట చెత్త పేరుకుపోయింది. ఆ గుడిగోపురాలు, బౌధ్ధారామము అన్నీ పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. వీటన్నింటినీ చూస్తూ మౌన సాక్షిగా నిలిచింది కృష్ణవేణి.
మొత్తం పుస్తకంలో నాకు నచ్చిన కొన్ని కథల గురించి చెప్తాను:
వరద:— కృష్ణ పొంగి ప్రళయ రూపం దాల్చింది. అమరావతిని అతలాకుతలం చేసేసింది. పూరిళ్లూ భవంతులూ అన్నీ మూకుమ్మడిగా కొట్టుకుపోయాయి. వరద శాంతించాకా పేదా, గొప్ప భేధం పోయింది. శాస్త్రిగారికీ, సంగడికీ ఉన్న దూరాన్ని చెరిపేసిందీ వరద. ఆకలికి కులంలేదంటూ మనషులు తమ చుట్టూ కట్టుకున్న గోడల్ని కూల్చి వెళ్ళి పోయింది. ఊరి వారంతా సహపంక్తి భోజనాలరగించారు. కృష్ణకు మళ్లీ వరద వచ్చే నాటికి కొత్త గోడలు పుట్టుకొస్తాయి.
సుడిగుండంలో ముక్కుపుడక:— ఎలికలోళ్ల బాచిగాడి తాతలు తండ్రులూ అంతా రత్నాల కోసం కృష్ణ సుడిగుండాలు గాలించినవారే. ఒక్క రత్నమూ దొరకలేదు, శ్రమకు ఫలితం దక్కలేదు. ఒకరోజు యధావిధిగా బాచిగాడూ, భార్య సింగి సుడిగుండం ఎండిన గుంటలో రతనాల కోసం వెతుకుతున్నారు. వీళ్ల పని చూసిన భూమయ్య భార్య సూర్యకాంతానికి అక్కడే పోయిన తన ముక్కుపుడుక సంగతి గుర్తొస్తుంది. భార్య ఈ సంగతి చెప్పేసరికి భూమయ్య తెల్లారే లోగా ఆ ముక్కుపుడుక వెతికి తేవాలని జంటకి హుకుం జారీచేస్తాడు. పసివాడి ఆకలిని కూడా లెక్కచేయక అదే పనిగా వెతుకుతారు. చివరికా ముక్కుపుడక దొరికే సరికి పెద్ద రత్నమే దొరికినంత ఆనందిస్తారు. ఆశ చావని ఆ జంట పరుల సొమ్ము ఆశించక ఇంకా కృష్ణలో వెతుకుతూనే ఉంది.
పుణుకుల బుట్టలో లచ్చితల్లి:— ధనానికి మనిషి ఇచ్చే ప్రాముఖ్యం, ఆ ధనంతో మనిషికి వచ్చే ప్రాముఖ్యాన్ని చక్కగా తెలుపుతుందీ కథ. పుణుకుల సుబ్బాయి కాస్తా డబ్బురాగానే సుబ్బారావుగారు గా మారినట్టు.
రాగి చెంబులో చేపపిల్ల:— ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల? బాంఢ శుద్ధిలేని పాకమేల? చిత్త శుద్ధిలేని శివ పూజలేలరా? అని వేమన అన్నట్లు, ఆచారాలనేవి మనం తెచ్చి పెట్టుకున్నవే. సుబ్బమ్మగారు అచారం పేరుతో ఎంత మూఢత్వంలో కూరుకుపోయి ఉన్నదో ఈ కథ చెపుతుంది.
అన్నపూర్ణ కావిడి:— అన్నపూర్ణకావిడితో యాచించి తెచ్చుకున్న కాస్తలో తనకన్నా బీదవారికి అన్నం పంచి, తాను మిగిలితే తింటాడు లేదంటే కృష్ణాజలంతో కడుపు నింపుకుంటాడు శరభయ్య. జీవితం పై విరక్తి నుండి వైరాగ్యంలోకి వచ్చిన శరభయ్య, తనకున్న దాంట్లోనే నలుగురికీ పంచుతూ తృప్తిగా పోయాడు.
కాకితో కబురు:— జువ్వి తన మనసులోని బాధనంతా కాకులతో, ఉడతలతో, రామ చిలకలతో చెప్పుకునేది. వేయి కళ్లతో అతని రాక కోసం ఎదురు చూసేది. ధ్యాసంతా మామ చింతాలు మీదనే, ఎప్పటికైనా తన బతుకు పండిస్తాడని ఆ చిన్నదాని ఆశ. ఎప్పటికీ తీరని ఆశ. నేను ఏడవటం లేదని మామతో చెప్పమంటూ కాకితో కబురంపిస్తుంది.
తులసి తాంబూలం:— సుష్టిగా భోజనం చేసాకా, కమ్మగా వేసుకునే తాంబూలమే ఆ ఇంటి వారికి భోజనమై ఆకలి తీర్చింది. వామనయ్య, తాయారమ్మల నోరు పండించింది.
బాకీ సంతతి:— తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం తన రక్తాన్ని కరిగించాడు. ఏడాదంతా కష్టించి పండించిన పంటను కళ్ళెం నుండే తీసుకెళ్ళినా సహించాడు, కడుపుకు గంజి తాగాడు, బాధ పెట్టినా ఊరుకున్నాడు కానీ, బాకీ మొత్తాన్ని జమచేసుకోడానికి పొలం దున్నే ఎద్దుల్ని జప్తు చేయటం దాకా వచ్చేసరికి సహించలేకపోయాడు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకు పడ్డాడు. కోపంతో బుసలు కొట్టాడు. కానీ తన ఎద్దుల్ని తిరిగి ఇచ్చేస్తాననే సరికి అంత ఆవేశమూ చల్లారిపోయింది. కృతజ్ఞతతో చిన్న పిల్లాడై ఏడుస్తాడు.
అంపకం:— శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతూ, అల్లుడికి కూతురి మీద కోపం వస్తే తనకు కబురు చేయమని తాను తక్షణమే ఇంటి ముందుంటాననీ అంటాడు. ఆ కోపం తన మీద తీర్చుకో మంటాడు. ఆడపిల్లను కన్న ప్రతి తండ్రీ తన బిడ్డను అత్తవారింటికి పంపేటప్పుడు పడే ఆవేదనా రూపమే అంపకం.
తృప్తి:— పది మందికి వంట చేసి వడ్డించే వారికి, అతిథులు కడుపు నిండుగా భోంచేసి వంటకాలు బాగున్నాయంటే చాలు, ముఖంలో వేయి తారా జువ్వల వెలుగు వస్తుంది, ఆ మాటలతోనే కడుపు నిండి పోతుంది. పూర్ణయ్య తీరు అదే. పది మందికీ పెట్టడంలోనే తన తృప్తి చూసుకుంటాడు.
ఈ కథలు మచ్చుతునకలు మాత్రమే. ఇంకా ఈ 100 కథల్లో మనకు గుర్తుండిపోయే కథలు చాలానే ఉన్నాయి. ఈ పుస్తకం 1979 సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకుంది. వీటిని ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ హిందీలో ధారావాహికగా నిర్మించారు. సత్యం శంకరమంచి ఈ కథల ద్యారా అమరావతికి చెరగని గుర్తింపు తెచ్చారు.
– శ్రీశాంతి దుగ్గిరాల

Saturday 18 January 2014

నా మొదటి కథ "పొరుగింటమ్మాయి"



నా మొదటి కథ "పొరుగింటమ్మాయి"http://patrika.kinige.com/?p=1038&view-all=1 కినిగె పత్రికలో చదవండి.


ప్రపంచం అంతా నిద్రావస్థలో ఉంది. నాకు మాత్రం నిద్ర కరువయింది. మనసెందుకో అలజడిగా, అలసటగా ఉంది. వీధి తలుపు తెరిచి గేటు దగ్గరకు వచ్చాను. పోనీ వాకింగ్ కు వెళదామన్నా తెల్లవారడానికి ఇంకా చాలా సమయమే ఉంది. మా వీధిలో ఎప్పుడూ వెలిగే ఆ కాసిని దీపాలు ఈ రోజు వెలగడం లేదు.

ఎదురింట్లో మాత్రం పెద్దగా లైట్లు వెలుగుతున్నాయి. ఆ ఇంటి నుండి చిన్నగా ఎవరివో ఆడవారి ఏడుపులు వినిపిస్తున్నాయి. చెవులు రిక్కించి అక్కడ నేను విన్నది ఏడుపేనని మరోసారి రూఢీ చేసుకున్నాను.

రాకూడని కష్టం ఏదో వచ్చిందా కుటుంబానికి. ఏం జరిగిందో తెలియాలంటే తెల్లవారాలి. అంతవరకు నా మనసు ఆగలేదు, ఏం జరిగిందో తెలుసుకోవాలి.

కానీ నేను వెళ్ళినా వాళ్ళు బహుశా నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే ఉద్యోగ కారణంగా నేను నెలలో ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ. నాకు అంతగా ఎవరితోనూ పరిచయాలు లేవు. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. నా భార్య నాలా కాదు, అందర్నీ కలుపుకుపోయే మనిషి. ఒకటి రెండు సార్లు ఎదురింటి వారి గురించి ఏదో మాట్లాడటం విన్నాను.

నా మనసు నిలవటం లేదు, సాటి మనిషి కష్టంలో ఉంటే ఓదార్చడానికీ సాయం చేయడానికీ పరిచయం అవసరంలేదు. వెంటనే లోపలికి వెళ్లి బెడ్ రూంలో పడుకున్న నా భార్యను నిద్ర లేపాను. పగలంతా ఇంటి పనులతో అలసిపోయి పడుకున్న తనకి నిద్రాభంగం కలిగించకూడదని మనసు చెపుతున్నా వినలేదు.

మొదట నిద్ర మత్తులో నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదు. మళ్ళీ చెప్పుకొచ్చాను. మొదట కంగారు పడ్డా తమాయించుకుని, మంచం మీద నుండి లేచి నుంచుంది. చెదిరిన జుట్టును సవరించుకుని, చీర సరిచేసుకుంది.

ఇద్దరం ఇంటి ప్రహారీ దగ్గరకు వచ్చాం. తన చెవులతో విన్నాకా, నా వైపు తిరిగి నిజమే నండి, నేను వెళ్ళి విషయం కనుక్కుని వస్తానుఅంటూ బయలుదేరింది.

ఎవరిదో బాధకు ఎందుకు నాకీ తపన. చుట్టుపక్కల ఎవరికీ లేని ఆరాటం నాకు మాత్రమే ఎందుకు? ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు.

ఇంతలో రాధ తిరిగి వచ్చింది. వస్తూనే వరండాలో మెట్ల మీద కూలబడి పోయింది. నాకు నోటి మాట రావడం లేదు. ఏంఏం జరిగింది,” నా గొంతులోని తడబాటు నాకు తెలుస్తూనే ఉంది.

వాళ్ళ పెద్దమ్మాయి చనిపోయిందండి. ఎలాగో నేనెవరినీ అడగలేదుగానీ, ఏదో ప్రమాదంలో చనిపోయిందని మాత్రం తెలుస్తుంది. శవాన్ని కాసేపటి క్రితమే తీసుకు వచ్చారనుకుంట, అంతా అదే బాధలో ఉన్నారు. ఎవరినీ పలకరించి కారణాలు అడగాలని పించలేదు. ఇద్దరు పిల్లలు, చక్కని సంసారం, పాపం నిండా ముప్ఫయ్యేళ్ళు కూడా లేవు. ఎప్పుడూ నవ్వు ముఖంతో కనపడేది. పచ్చని వంటి ఛాయ, పెద్ద కళ్ళు, గుండ్రటి ముఖానికి దోసగింజ బొట్టు, కళ్ళకు కాటుకతో, నుదుటన సింధూరంతో, చీర కట్టులో లక్ష్మీ దేవిలా ఆ ఇంటికే కళగా మసిలేది. అలాంటమ్మాయి ఇంత తొందరగా అందరినీ వదిలి వెళిపోయిందంటే నాకే మనసంతా ఎదోలా ఉంది, పాపం మరి ఆ కుటుంబం పరిస్థితి వేరే చేప్పాలా,” అంటున్న రాధ మాటలతో మునుపు నేను  చూసిన ఆ అమ్మాయి రూపం నా కళ్ళ ముందు కాసేపు కదలాడి మాయం అయిపోయింది.

నా ఆలోచనల నుండి బయటకు వస్తూ, “నీకు ఎలా తెలిసింది ఆమె ప్రమాదంలో చనిపోయిందని,” అని అడిగాను.

ఆ అమ్మాయి తల నిండుగా ముఖం కనిపించకుండా బేండేజీ కట్టి ఉంది. అంటే ఏదో ప్రమాదంలో చనిపోతే పోస్టుమార్టం జరిగి ఉండాలి,” అంది.

సరే నువ్వు ఇలా వెంటనే వచ్చేస్తే వాళ్ళు వేరేగా అనుకుంటారు. పద నేనూ నీతో పాటు వస్తాను ఇద్దరం వెళదాం,” అంటూ లోనికి వెళ్ళాను.

నా వెనకాలే తనూ వస్తూ, “రాత్రి నుండి వాళ్ళు ఏం తిన్నట్టులేదు. కాస్త టీ చేసుకు వస్తాను,” అంటూ వంట గదిలోకి వెళిపోయింది.

వంట గదిలోనుండి రాధ మాటలు వినిపిస్తున్నాయి. పోనీ ఆత్మహత్య లాంటిది చేసుకున్నదనుకున్నా, అంత కష్టం ఏమోచ్చిందో ఎంత ఆలోచించినా తెలీటం లేదు. ఆమెను మేనమామకే ఇచ్చి చేశారు. అతను ఇంట్లో ఉన్నా లేనట్టే ఉంటాడు. రత్నాలాంటి ఇద్దరు బిడ్డలు. ఆర్థికంగా బాగానే ఉన్నవాళ్లు. తల్లితండ్రీ, అంతా ఉమ్మడిగానే ఉంటారు. కానీ చాలా కాలంగా ఆ అమ్మాయి ఈ కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఏం గొడవలో ఏమో. ఆ లోగుట్టు పెరుమాళ్ళకెరుకబయటకు మాత్రం ఇంటిలో అత్తకూ (అంటే అమ్మమ్మకూ), ఆ పిల్లకూ క్షణం పడటం లేదని వేరుగా రాజమండ్రిలో కాపురం పెట్టారని చాలా రోజుల క్రితం నాతో చెప్పింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు ప్రమాదం కూడా ఆ ఊళ్ళోనే జరిగిందనుకుంటా,” రాధ తన ధోరణిలో తాను మాట్లాడుకుంటూ పోతోంది.

నన్నేవో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతలో రాధ వెళదామా అనే సరికి తిరిగి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఇద్దరం ఆ ఇంటి వాకిట్లోకి వెళ్లాము.

మేము వెళ్ళే సరికి ఇంకా ఎవరూ వచ్చినట్టులేదు. వరండాలో ఆ ఇంటి మగవారు నలుగురూ విచారంగా కూర్చుని ఉన్నారు. మేం తిన్నగా గదిలోకి నడిచాం. పెద్దగా ఉంది గది. ఆ గదికి మధ్యగా పడుకోబెట్టారు శవాన్ని. ముఖానికి బేండేజీ కట్టి, పై నుండీ దుప్పటి కప్పి ఉంది. తల దగ్గర కొంత బియ్యం పోసి, అగరవత్తులు వెలిగించారు. రాధ ఆమె గురించి చెప్పిన రూపు రేఖలు ఏమీ తెలియడం లేదు.

శవానికి కొంత దూరంగా కూర్చుని ఉన్నారు నలుగురు ఆడవాళ్ళు. బహుశా ఆమె తల్లి, అత్త, తోబుట్టువులు అయి ఉంటారు. ఆ గది నంతా ఎక్కువగానే వ్యాపించి ఉంది అగరబత్తుల వాసన. వాళ్లంతా శవానికి అంత దూరంగా ఉండటం, తల్లి తప్ప మిగతావారంతా మౌనంగా ఉండటం, పైగా అందరూ ముక్కులకు గుడ్డలు అడ్డం పెట్టుకు మరీ కూర్చుని ఉండడం, అంత దూరంగా ఉండి రోదించడం కొంచె చిత్రంగా అనిపించింది.

జీవం ఉన్నపుడు మనిషితో ఉండే అనుబంధాలూ ఆప్యాయతలూ అన్నీ, ఆ గూటిలోని చిలక ఎగిరిపోయాకా మాయమైపోతాయి కాబోలు, ఎప్పుడు కాటికి తీసుకుపోతారా అని చూస్తారు కాబోలు. కన్న తల్లి కూడా బిడ్డ శరీరం కుళ్లి పోయిందని ముక్కు మూసుకుంటుంది. అక్కడితో తల్లి, బిడ్డా బంధాలు ఆవిరై, కాటికి తీసుకు పోవాలనే బాధ్యత మాత్రమే మిగిలి ఉంటుంది కాబోలు. ఇంతేనా శరీరానికి, మనిషికీ ఉన్న సంబంధం. మరి ఎందుకు శరీరం మీద ఈ వ్యామోహం. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఆ గది నుండి వీధి అరుగు మీదకు వచ్చాను.

బయట ఉన్న మగవాళ్లు నలుగురిలోనూ పెద్దాయన ఆమె తండ్రి అనుకుంటాను. నన్ను కూర్చోమంటూ కుర్చీ చూపించాడు. నేను ఇబ్బందిగానే వెళ్ళి కూర్చున్నాను. ఆయనతో మాటలు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. నేను అడిగే లోపే ఆయనే మొదలు పెట్టాడు, “పెళ్ళయి పదేళ్ళయింది, ముత్యాల్లాంటి బిడ్డలు, కళ్ళ ముందే ఉంటుంది కదాని నా బావమరిదికే ఇచ్చి చేశాను. అందరం కలిపే ఉంటున్నాం. కొద్దికాలంగా అత్తకీ తనకూ పడేది కాదు. ఆవిడా కూడా అంతే. మనవరాలే లెమ్మని ఎక్కడా తగ్గేది కాదు. ఓ ఏడాది క్రితం మేము వేరుగా ఉంటాం అంటూ గొడవ చేసింది. ఎంత నచ్చచెప్పినా విన్నదికాదు. చివరికి రాజమండ్రిలో కాపురం పెట్టించింది. సంవత్సరం మధ్య కావడం వల్ల పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. అల్లుడు వారానికి రెండురోజులు వెళ్ళి వస్తున్నాడు. దానికి చిన్నతనం నుండీ భక్తి ఎక్కువ. ఎంత అనారోగ్యంగా ఉన్నా, కార్తీకమాసం నెలంతా పూజలు చేయడం మానదు. మొన్న ఆఖరు రోజు దీపాలు వదలడానికి వెళ్లిందల్లా కనిపించటం మానేసింది. వెతకని చోటు లేదు. చివరకు గోదావరిలో శవం దొరికిందని కబురు వస్తే అల్లుడు రాత్రే వెళ్లాడు. దీపాలు వదులుతూ కాలుజారి పడిపోయి ఉంటుందని అంటున్నారు. పోలీసులు పోస్టుమార్టం అయ్యాక శవాన్ని ఈ రోజే అప్పగించారు,” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. భర్త వైపు చూశాను. అతను మా మాటలు వినపడనట్టు ఏదో లోకంలో ఉన్నాడు. కనుబొమలు ముడేసి వేళ్లు నలుపుకుంటున్నాడు.

తెల్లవారుతోంది నేను ఓసారింటికి వెళ్ళి శ్మశానానికి మీతో వస్తానని చెప్పి బయలుదేరాను.

మనసంతా చికాకుగా ఉంది, కళ్ళు మంటగా ఉన్నాయి, మంచం మీద పడుకున్నానే గానీ మనసంతా తెలియని బాధ, అది ఎందువల్ల కలిగిందో కూడా చెప్పలేను. ఆ ఆలోచనల నుండి నన్ను నేను బలవంతంగా తప్పించుకోవడానికి మార్గం ఒక్కటేనిద్ర. అలా కళ్ళు మూసుకున్న నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఏదో అలికిడికి మెలకువ వచ్చింది, ఎదురుగా రాధ నన్ను నిద్ర లేపుతుంది. వాళ్ళంతా శ్మశానానికి వెళ్ళి చాలా సేపయిందండి లేవండి”. అప్పుడు వదలిపోయింది నిద్ర మత్తు. పావు గంటలో తెముల్చుకుని బయలుదేరాను.

శ్మశానం చేరుకునేసరికే జరగాల్సిన తంతు అంతా అయిపోయింది. ఆమె తండ్రి, భర్త, వచ్చిన వారంతా స్నానాలు చేసి ఇంటికి బయల్దేరుతున్నారు. తమతో వెనక్కి వచ్చేయమన్నారు గానీ, కాసేపు అక్కడే గడపాలనిపించించి ఆగాను. ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందీ చోటు. ఆమె చితికి నిప్పంటించి ఎంతో సమయం కాలేదు. జన్మనిచ్చిన కన్న తల్లి కూడా చీదరించుకున్నా, ఈ అగ్ని కీలలు మాత్రం ప్రేమగా తమ ఒడిలోకి చేర్చుకున్నాయి. ఎంత గొప్ప బతుకు బతికినా మనిషి చేరుకోవలసిన ఆఖరు మజిలీ ఇదే కదూ. ఏదో సత్యం తెలిసినట్టు మనసులో వైరాగ్య భావన అలముకుంది నాలో.

అయినవాళ్ళే అన్నీ ముగించుకుని వెళిపోయారు నేను మాత్రం ఇంకా మథన పడుతున్నాను అనుకుంటూ బయటకు నడిచాను. నేను ఆ గేటు దాటుతుండగా నా ముందుకు స్పీడుగా వచ్చి ఆగిందో ఆటో, అందులో నుండి ఒక అమ్మాయి దిగింది. నన్ను దాటుకుంటూ శ్మశానం గేటు వైపు వెళ్లింది. అక్కడే ఆగి, పొగల్లేస్తున్న చితి వైపు చూస్తూ నిలబడిపోయింది. ఎందుకో ఆమె ఏడుస్తోందని నాకనిపించింది. దగ్గరకు వెళ్లాను. ఏమ్మా, మీ వాళ్లందరూ ఇప్పుడే ఇంటికి వెళ్లిపోయారు,” అన్నాను. ఆమె కన్నీరు కారుతున్న చెంపలతో నా వైపు చూసింది. ఎందుకో అడగాలనిపించింది, “ఆమె నీకే మవుతుంది?” అన్నాను. ఆమె కళ్లు తుడుచుకుంటూ నాకేమీ కాదుఅంది.

నాకు చిత్రంగా అనిపించింది. అయినా అంత భావోద్వేగంలో ఉన్న ఆ అమ్మాయిని ఇంకా ప్రశ్నలడగటం ఇష్టం లేక, “నేను బండి మీద వచ్చాను. మళ్లీ ఇంటికే వెళ్తున్నాను. అక్కడ దింపమంటే దింపేస్తాను,” అన్నాను.

చితి పేర్చి కాల్చి మరీ నన్ను వదిలించుకున్నారు. వాళ్ల దృష్టిలో ప్రస్తుతం నేను కాలిపోయిన శవాన్ని. వట్టి బూడిదని. నన్ను ఇంటికెలా తీసుకెళ్తారు?” అంది.

నాకు చుట్టూ అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది.

ఏంటమ్మా నువ్వనేది?” ఏదో అనబోయాను.

ఆమె ఇక ఏడుపు పట్టలేక అక్కడే కూలబడిపోయింది.

ఇంతలో ఇంతదాకా ఆమె తప్ప ఎవరూ లేరనుకున్న ఆటో లోంచి ఒక యువకుడు దిగాడు. వడి వడిగా ఆమె పక్కన మోకరిల్లాడు. భుజాల మీద చేతులు వేసి ఓదార్పుగా మాట్లాడుతున్నాడు. ఆమె తనను తాను సంభాళించుకుంది. అతను ఆసరాగా ఆమెను పొదివి పట్టుకుని ఆటో వైపు నడిపించుకెళ్లాడు. నా నోరు పెగిలేలోగానే వాళ్ల ఆటో కదిలి వెళిపోయింది.

నేను చితి వైపు చూశాను. కాలుతోన్న అనాథ శవం వైపు.


*

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...