Wednesday 6 September 2017

ఈమధ్య నేను చదివిన కథ.......






బిడ్డను పోగొట్టుకోవడం అన్నది ఓ శాపం. చెట్టుకు వచ్చిన పిందెలన్నీ నిలవనట్టే పుట్టిన బిడ్డలందరూ నూరేళ్ళు ఉండాలని లేదు. కానీ కలనైనా తన బిడ్డలు దీర్ఘాయువుతో ఉండాలనే కోరుకుంటుంది ప్రతి తల్లీ. విధి మోసం చేసినప్పుడు. తన బిడ్డను ఎత్తుకుపోయినప్పుడు. ఆమెకు మిగిలేది మరో ప్రపంచమే. తను తప్ప ఎవరూలేని ప్రపంచం.  ఈ ప్రపంచాన్ని, ఈ బాధను నేను ఇంతకముందు ఎరిగి ఉన్నాను కనుక ఈకథ నన్ను చాలా సులువుగా తనలోనికి లాగేసుకోగలిగింది.

“బదిలీ” ఇది కథకాదు. ఓ అమ్మ ఆక్రోశం. ఆమె పోగొట్టుకున్న బిడ్డకోసం పడే వేదన. ఆమెకు మాత్రమే సొంతమైన ప్రపంచానికి కాసేపు మనల్నీ తీసుకువెళ్ళి తన కథ చెప్పి, తిరిగి పంపేస్తుంది. ఆమెతో పాటుగా ఆ కథలోకి వెళ్ళినప్పుడు కన్నీరు ఎప్పుడు నాకళ్ళలో పుట్టి చెంపల మీదుగా జారిందో గమనించనేలేదు నేను. అలా వెళ్ళడం ఒక్కటే నా చేతుల్లో ఉంది. కథ చదవడం పూర్తి కాగానే నేను ఎంత బలంగా ప్రయత్నించినా అణువంతైనా ఈ కథ తప్ప మరోటి ఆలోచించలేని స్థితికి వచ్చేసాను. ఏదో బాధ. అందులోంచి కథలో ఉన్న సారాంశం అంతాపట్టుకుని ఆలోచించే శక్తిని కోల్పోయాను అనిపిస్తుంది. నన్ను పట్టి ఆపేసింది. ఆ తల్లీ బిడ్డలే. వారే ఉన్నారు నేను చదివిన, నాకు అర్థమైన చోటల్లా.

కొన్ని కథలు, అందులోని పాత్రలు మనల్ని వెంటాడటం మామూలే, కానీ అదే కథ నీ జీవితంలో జరిగి, నీకూ ఆ బాధ తెలిసినప్పుడు అప్పుడు నీ మానసిక స్థితి ఏలా ఉందో రచయిత(త్రి) కచ్చితంగా చెప్పగలగటం ఓ అద్భుతమే.

రచయిత్రి ఆర్. వసుంధరా దేవి గారు రాసిన ఈ “బదిలీ” కథ ఓ తల్లి బిడ్డను పోగొట్టుకున్నప్పుడు ఆమె అనుభవించే మానసిక స్థితి. మిగతా కథంతా కొత్తగా ఏం అనిపించలేదు. పట్టలేనంత బాధను భరించాల్సి వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్నవారు ఆ బాధను పంచుకోనప్పుడు ఆమె పడే వేదన అక్షరాల్లో వర్ణించలేనిది. ఎవరు మరిచిపోయినా ఆ బాధను తల్లి మాత్రం ఎప్పటికీ మరువలేదు.

ఒక కోట్ : నాకు ప్రపంచం లేదు. బదిలీ అయిపోయింది. నాలోకి బదిలీ అయిపోయింది. ఇప్పుడు నేనే ప్రపంచాన్ని.

Saturday 2 September 2017

ఈమధ్య నేను చదివిన కథ..........




చలం ఈ పేరు వెనక ఓ అగాథం, ఓ అంతుచిక్కని రహస్యం కనిపిస్తాయి ఎప్పుడూ. నిజానికి ఆయన నాకు ఎప్పటికీ అర్థం అయ్యీ అవ్వనట్టు ఉండిపోతాడు కామోసు. ఆయన రచనలు ఏది చదివినా కొన్ని రోజులపాటు వెంటాడి వేధిస్తాయి. ఈమధ్య నేను చదివిన “సుశీల” కూడా అలానే అనిపించింది. ఓ వందేళ్ళ తర్వాత కూడా మనిషి ఆలోచనా తీరుకు సరిపడా చలమే ఆలోచించేసి తన వాదనలని లేదా సందేశాల్ని ఇలా కథల రూపంలో మన మీదకి వదిలేసాడా అనే అనుమానమూ కలుగుతుంది నాకు. ఆడదానికి స్వేచ్ఛ లేదు అని తన ప్రతి కథలోనూ చెప్పుకొచ్చే చలం ఈ కథలో పూర్తి స్వేచ్ఛ ఉండీ ఆకర్షణలో పడే స్త్రీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ కథకు సుశీల అని పేరు పెట్టినా నాకు ఆమె భర్త అయిన నారాయణప్పగారి గురించే కథ చెప్పాడు అనిపించింది. అతని చుట్టూ మాత్రమే సుశీల ఉంది అనిపించింది.

ప్రేమకి, ఆకర్షణకి, వాత్సల్యానికి, బాధ్యతకి తేడాను చూపుతూ సాగుతుంది కథ. అతడు ఓ సంఘసంస్కర్త, భార్యను అప్పటి సమాజ కట్టబాట్లకు తగ్గట్టు వంటగదిలో కూర్చోబెట్టలేదు. ఆమెకు ఆస్తి, హోదా, తన స్నేహితులతో కలిసి తన వాదనలు వినిపించే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె చేస్తున్నది తప్పని తెలిసినా ఎక్కడా సుశీలను కట్టడి చెయ్యాలనే ఉద్దేశ్యం లేనివాడిగా కనపడతాడు. ఓ కోణంలోంచి ఆలోచిస్తే అసమర్థునిగా కూడా కనిపిస్తాడు.

ఇటు భర్తను మోసగించి మరో వ్యక్తితో ప్రేమలో పడటం అన్నది సులువుగా జరిగినా భర్తను వదిలివెళ్ళేందుకు ఆమె చెప్పే కారణాలు సుశీలకు తన భర్తమీద ఉన్న ప్రేమను, భార్యగా ఆమెకున్న బాధ్యతను చూపుతుంది. నేను ఆలోచించింది సుశీల వైపు నుండీ కాదు. అలా అని ఆమె చేసింది తప్పనీ అనను. ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న చిన్న గీతను మాత్రమే చూసాను. కథ అంతలోనూ నాకు నారాయణప్పగారి వ్యక్తిత్వం నచ్చింది. అదే నన్ను ఇంకా లోతుగా ఈ కథ గురించి ఆలోచించేలా చేసింది.

ఒక కోట్:  “కొందరు స్త్రీలు వారినెవరికిచ్చి పెళ్ళి చేస్తే వారిని వెంటనే ప్రేమిస్తారు. ప్రేమించినట్టే వుంటారు. ప్రేమించామనే వారూ అనుకుంటారు. దాంట్లో యేమీ మోసం లేదు. చాలా నమ్మకస్తులు. కానీ యెప్పుడో వొకప్పుడు, యెవరో కొత్తవారి మీద నిలపరాని ప్రేమ కలుగుతుంది వారికి. వారి హృదయాలు యెవరికోసం చెయ్యబడ్డాయో అటువంటి వారిని కలుసుకుంటారు. అపుడు ఆ మహాగ్నిలో ఈ పూర్వపు ప్రేమా, నీతీ, విశ్వాసమూ అన్నీ దగ్ధమవుతాయి. యెవరూ ఆపలేరు. కొన్ని బయటకి వస్తాయి. కొన్ని ఒకరిద్దరికి తెలిసి ఆగుతాయి. కొన్ని బైటకి రానేరావు యీ విషయాలు.”

Sunday 27 August 2017

ఈమధ్య నేను చదివిన కథ.......



“ఏ నిముషానికి ఏమి జరుగునో” ఈ కాలం, ఈక్షణం అపురూపమైనవి. నిన్న ఇదే కాలంలో, నిన్న ఇదే క్షణంలో నేను ఎక్కడున్నాను అన్న ప్రశ్న వేధిస్తుంది నన్ను అస్తమానూ.  ఆ క్షణంలో నేను ఉండే ప్రదేశాలు, కలిసే మనుషులు అన్నీ ఓ వింత అనుభూతిని మిగుల్చుతాయి. అలా ప్రతి మనిషీ ఓ అపరిచిత వాతావరణంలో గడిపే క్షణాలు రాకపోవు. అందులోని మనుషులు, పరిసరాలు అన్నీ నువ్వు ప్రస్తుతం నీదనుకుంటున్న ప్రపంచానికి కాస్త భిన్నమే, అయినా ఆ క్షణాలను ఆస్వాదించి, ఆ కొత్త ప్రపంచాన్ని ఆహ్వానించే మనసు నీకుండాలి. నువ్వు అనుకోని ఊహకందని వ్యక్తులను కలిసి వారితో గడిపినప్పుడు నీ ప్రపంచానికీ వారి ప్రపంచానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతాయి. అప్పుడు నీకెంత పలుకుబడి ఉన్నా, సమాజంలో ఎంత పేరున్నా, నిన్నో సామాన్యుడిగా, సాటిమనిషిగా మాత్రమే చూసే క్షణాలు గొప్పవి. అవి నిన్ను నువ్వు తెలుసుకునే క్షణాలు.
“అతడు మనిషి” అద్దేపల్లి ప్రభు రాసిన ఈ కథ అదే చెపుతుంది. ఈయన రచనలు నేను ఇదే తొలిగా చదవడం. మామూలు శైలిలో చక్కగా సాగింది కథ.
ఒక కోట్:
“మనిషి సుఖంగా ఉన్నప్పుడు యాపారం చెయ్యచ్చు బాబూ..... కట్టంలో ఉన్నప్పుడు యాపారం చైకూడదు. రాత్రి మీరు కట్టంలో వచ్చారు. మీరు మడిసి..... నేను మడిసిని.... వానకి ముద్దైన పిట్ట చెట్టు మీద వాలబోతే చెట్టొద్దంటాదా.... ఇదీ అంతే... అలాంటి పరిస్థితిలో మడిసిని మడిసి సాయపడకపోతే ఇంకాణ్ణి మడిసనెలా అంటాం... ఇలాగే నాలాంటి మడిసి నీ ఇంటి ముంగిట నిలిస్తే లోనికి రమ్మంటావా.... బయటకు పొమ్మంటావా...?” ఈ కథలోని ఈ ఆఖరు మాటలు నన్ను కాసేపు వెంటాడాయి.

Saturday 26 August 2017

ఈమధ్య నేను చదివిన కథ..........



నవమాసాలూ బిడ్డను తన కడుపులో మోసిన తల్లి బరువు దిగిందని కాస్తన్నా విరామం తీసుకోలేని స్థితి, ఆ ఆడబిడ్డను తమలో మరో మనిషిని దాస్తున్న మృగాల నుండీ అనుక్షణం కాపాడుతూ మరో అయ్య చేతికి అప్పగించేంత వరకూ నిత్యం మోస్తూనే ఉంది. ఎటునుండీ ఏ మృగం తమ ముక్కుపచ్చలారని బిడ్డపై పడతాడోనన్న భయం. అంతటి భయానక వాతావరణంలోకి జారిపోతున్నాం మనం. ఆడబిడ్డకు స్వేచ్ఛ, రక్షణా రెండూ లేవు. అది ఐదేళ్ళ పసికందైనా, అరవైయ్యేళ్ళ అమ్మమ్మైనా. కాలం మారుతున్నకొద్దీ పక్కవాడిని నమ్మలేని తనం నిండా ఆవరించేస్తుంది.
కాశీభట్ల వేణుగోపాల్ గారు రచయితగా నాకు తెలీదు. ఆయన రచనలు చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని నేను అర్థంచేసుకోగలనా అనే మీమాంసతో ఉన్న నాకు ఆయన రాసిన కథ ఒక్కటన్నా చదవాలని అనిపించి “బృందా” కథ మొదలు పెట్టాను. ఇప్పుడన్నా అంతటి సాహసం చేసినందుకు ఆనందిస్తున్నాను. ఈ కథలో ఎక్కడా రచయిత కనిపించడు, ఓ అమ్మ, ఆమె తన బిడ్డలను రక్షించుకోడానికి పడే తపనే కనిపిస్తుంది. రచయిత కథనంతా తనలోకి ఓ తల్లి హృదయాన్ని ఆవాహన చేసుకుని రాసాడా అనిపిస్తుంది. కథ శాంతం ఓ తల్లి మనసే కనిపిస్తుంది. రచయిత తన పదునైన మాటలతోనో, లేదా కథా వస్తువుతోనో సమాజాన్ని ఉద్ధరించే బాధ్యతను తన భుజాలకెత్తుకోలేదు. ఆ మాట ఆయన మొదటి పరిచయంలోనే చెప్పారు.
బృందా ఓ అమాయకపు ఆడపిల్ల, మానసికంగా సరిగా ఎదుగుదల లేని ఆమెను వికారపు చూపుల నుండీ కాపాడాలనే ఆమె ప్రయత్నం, ఓ తల్లిగా నన్ను కన్నీరు పెట్టించింది. ఈ కథను 2005 వ సంవత్సరంలో కాశీభట్లగారు రాసారు. అప్పటి ఆయన ఆలోచనల్లో నలిగి వచ్చిన ఈ కథకన్నా, ఇప్పటి 2017 మన ఆలోచనలకు అందనంత విధంగా ఆడవారి పట్ల నిముషానికో అత్యాచారంతో కృరంగా మారింది. నా ఉద్దేశంలో కాశీభట్లగారు ఇప్పుడు ఈ కథను రాయవలసి వస్తే ఏలా ఉండేదా అని.
ఈ కథలో కాశీభట్లగారు వాడిన అర్థంకాని పదాలు చాలా తక్కువే, శైలి అద్భుతం, ఓ ప్రవాహం. ఈకథ ఆయన మరిన్ని కథలు చదివే ధైర్యాన్ని ఇచ్చింది.
నాకు నచ్చిన పేరా....
“మబ్బు పట్టినాకాశం.... ఈదురుగాలిలో తేలివస్తున్న వాన పరిమళం... గుండెల్నిండా చెమ్మ నిండిన గాలిని పీల్చికున్నాను. పరిచిత గత ఖేదం... ఎప్పటికో ఘనీభవించింది. కరిగి గుండెల నిండా నిండిన చెమ్మ గాలితో చేరి.... కళ్ళల్లోకి చేరుకుంది... కరెంటు పోయింది. వెలుగుతున్న కొవ్వొత్తి శిఖ రెపరెపలాడుతోంది... గది చీకటి నలుపుదనాన్ని పలుచబరచడానికి లేత బంగారు కాంతి బలహీనంగా ప్రయత్నిస్తోంది.”

Friday 25 August 2017

ఈమధ్య నేను చదివిన కథ....


చెదిరిపోయిన బంధాలు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీలో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అవి నిన్ను విడిచి దూకంగా పోయినప్పుడు నువ్వు పడ్డ బాధనంతా పంటికింద నొక్కిపెట్టి ఒక్కసారిగా కట్టలు తెంచుకు వస్తున్న దుఖాఃన్నంతా కంటి కొనల్లో ఆపి నీ ముందున్న నీ పేగు బంధాన్ని గుండెలకు హత్తుకున్న నీలో దాగున్నది మానవత్వం అనాలా దైవత్వం అనాలా?
"ఎడారి కోయిల" మధురాంతకం రాజారాం గారు రచించిన ఈ కథ చదువుతున్నప్పుడు నాలో దాచేసుకున్న గతాన్ని కాసేపు తాకింది. పల్లెటూరు, అక్కడి మనుషులు, వారి జీవితాలు, ప్రేమలు, ఆప్యాయతలు, పాడి పంటలు, ఉన్నతనానికీ లేనితనానికీ మధ్యగా ఉన్న గీతను చాలా దగ్గరగా చూపించారు.
పేగుతెంచుకుని పుట్టిన బిడ్డ ఆ బంధాన్ని కాదని దూరంగా పోతే ఆ తల్లితండ్రులు సమాజంతో కలిసి మనడానికో, లేదా వాడి తరవాత పుట్టినవాళ్ళను బ్రతికించుకోవడంలోనో నిన్ను కాసేపు మరిచిపోవచ్చు. నువ్వు రావని జీవితంతో రాజీ పడిపోవచ్చు కానీ నువ్వు పుట్టినప్పుడు ఆ తల్లి పడ్డ పురిటినొప్పులు ఆమె ఊపిరి ఉన్నంతవరకూ మరవదు.
కొడుకు రాకపోయినా తన మూలాలు వెెతుక్కుంటూ వచ్చిన మనవడిని చూసి "సుబ్బారాయుడి కళ్ళు పెద్దవయ్యాయి. ఫాలతలంలో గీతలు పడ్డాయి. ముఖంలో ఆళ్చర్యం చిందులు తొక్కింది. ఎండుపుల్లాంటి చేతులు, పైకిలేచి, రవిబాబును మంచంపైన కూచోబెట్టుకున్నాయి. ముఖమంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయాడు."
1986లో రాసిన ఈ కథ అప్పటి ఉమ్మడి కుటుంబాల వాతావరణానికి సరిపడకపోవచ్చు,లేదా కాస్త కొత్తదనంతో కనిపించవచ్చు. కానీ ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్న ఊరిలో 50 కుటుంబాల వాళ్ళ పిల్లలు అమెరికా ప్రయాణం కడుతున్నారు. ఇక తిరిగివస్తున్నారా ఇక్కడి తల్లితండ్రులను చూస్తున్నారా అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇక్కడి తల్లితండ్రులు కూడా బిడ్డల్ని అమెరికా పంపేటప్పుడే వీడు ఇక తిరిగి ఇక్కడకు రాడు. అక్కడే స్తిరపడిపోతాడు అన్న ఉద్దేశానికి వచ్చే పంపుతున్నారు. అదే వారికి సమాజంలో ఖ్యాతి కూడాను.
అందువల్ల నన్ను ఈ కథ పెద్దగా బాధించకపోయినా, రాజారాంగారి శైలి, కథ సాగిన తీరు నన్ను కట్టిపడేసాయి.
ఈకథలో నాకు నచ్చిన పేరా................
"పగటి వెలుగులు క్రమక్రమంగా తరిగిపోయి, రేజీకట్లు మెల్ల మెల్లగా ముసురుకుంటున్న ఆ మునిమాపువేళ, అపరిచితుడైన పడుచువాడొకడు కాలిబాట వెంట ఊరివైపు నడిచి రావడం గమనించి ఆడుకుంటున్న పిల్లలందరూ ఊరి ముందర గుమిగూడిపోయారు. బావిదగ్గర నీళ్ళు చేదుతున్న ఆడవాళ్ళు విగ్రహాల్లా స్తంభించిపోయి విస్మయంతో చూస్తున్నారు. రచ్చబండమీద కూచున్న మగవాళ్ళ దృష్టికూడా కాలిబాటవైపు కేంద్రీకృతమైంది."
ఊరిలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులను ఇలా వింతగా చూడటం అన్నది ఎంతో బాగా చెప్పారు.

Saturday 28 January 2017

“దివాణంలో దొంగలు పడ్డారు”




ఎప్పటిలానే ఓ మామూలు సాయంత్రం వేళ కాకినాడ టూ కోటనందూరు బస్సు దిగి మట్టిరోడ్డు గుండా  చేతిలో బట్టల సంచితో దివాణం వైపు నడుచుకొస్తుంది పార్వతి. చాకలి రేవు, రాములవారి గుడి పక్కనున్న రచ్చబండ దాటాకా, మట్టి వంతెన మీద నడుస్తుంటే ఉప్పుటేరులో ఎండాకాలం అంతగా నీటిమట్టం లేనప్పుడు తను, సరోజా గుజ్జన గూళ్ళు ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. చీకటి పడటంతో ఆంజనేయస్వామి గుడి దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. నిలువు చేతుల కుర్చీలో కాళ్ళు బార జాపుకుని కూర్చున్న ఎదురింటి రామం కళ్ళు మూసుకునే పెద్దగా విష్ణుసహస్రనామాలు చదువుతున్నాడు. మెట్లు ఎక్కుతున్న తనవైపు “ఈ వేళప్పుడు వచ్చావేమిటీ” అన్న ప్రశ్నను ముఖం మీద ముద్రగా వేసుకుని లోపలికెళుతున్న ఆమె వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తూండిపోయాడు. తన ఇంటికి ఎదురుగా ఉండే ఆ దివాణంలో జరిగే సంగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కొన్నేళ్ళుగా రామానికి అలవాటుగా మారిపోయింది. తన రెండు కళ్ళకు కూతురు విశాలి కళ్ళు జోడించి “ఎవరా వచ్చేది” అంటూ నిత్యం ఆరాల పరంపర సాగిస్తాడు. నడుం లాగినపుడు గొలుసుల ఉయ్యాలపై పడుకుంటూ, మామూలు సమయాల్లో గుమ్మానికి పక్కగా వాల్చిన చేతుల వాలు కుర్చీలో కూర్చుని కాలాన్ని వెళ్ళదీయడం అతని రోజువారి దినచర్య.
కొన్నేళ్ళుగా ఈ దివాణంలో వరుసగా జరుగుతున్న చావులు ఆ ఊరి ప్రజల్లో ఒకింత కుతూహలాన్ని మరింత దిగులునూ కలిగిస్తూనే ఉన్నాయి. రెండస్థుల ఆ భవనం రోడ్డుకు వారగా ఉండి చుట్టుప్రక్కల ఇళ్ళన్నింటికీ తలమానికంగా ఉంటుంది. కంచికి చేరని ఎన్నో కథలను, అంతుక్కని రహస్యాలను తనలో దాచుకుని నవ్వూతూ నించున్న ఈ కట్టడం ఓ రహస్యాల పుట్ట.  నలుగురు మనుషులు చేరే రచ్చబండ దగ్గరా, రాములోరి గుడి అరుగుమీద, కోతల రాయుళ్ళ నోళ్ళలోనో, దివాణం సంగతులు దొర్లనిదే ఆరోజు సమావేశం చివరిదాకా సాగదనే చెప్పాలి. ఆ ఊరి పెద్ద నాయుడుగారి చావుతోనే దివాణం కళ తప్పిపోయింది. ఆయన ఉన్నప్పుడు ఉన్న రాచఠీవీ ఇప్పుడు లేదు. ఆ మందీ మార్బలం కూడా ఇప్పుడు లేదు. తరాలుగా దివాణాన్ని అంటిబెట్టుకున్న ఒకరిద్దరు పనివాళ్ళు తప్ప.  రంగులు మాసిపోయి, దాదాపు పాడుపడి ఉన్న ఈ భవంతి లోపలున్న మనుషులు కూడా ప్రపంచంతో సంబంధం లేనట్టు బ్రతకడం అలవాటు చేసుకున్నారు.
గేటు తీసికుని లోపలికి వెళుతూ వెనక్కు తిరిగి రామాన్ని చూసి పలకరింపుగా చిన్న నవ్వు నవ్వింది పార్వతి. గుమ్మం ముందున్న మాలతీ తీగా, గేటువారగా ఉన్న వినాయకుడి  గూడు, వెనగ్గా ఉన్న పెరడు పరిసరాలు అన్నీ పలకరిస్తుండగా, వాటితో ఉన్న జ్ఞాపకాలు తన ప్రమేయం లేకుండానే తలపుకొచ్చాయి. మెట్లు దాటగానే హాలులో ఠీవీగా తెల్లపంచె, పైజామాలో నవ్వుతూ ఉన్న తండ్రి ఫోటోకు కన్నీళ్ళతో నమస్కరించి, వసారాలోకి వచ్చేసరికి గుమస్తా నారాయణ ఎదురైయ్యాడు. చేతిలో ఉన్న గళ్ళ రుమాలు భుజాలమీదకు మార్చుకుంటూ గదిలోంచి బయటకువస్తున్న నారాయణ “పార్వతమ్మా బాగున్నారా, ఇన్నేళ్ళకు గుర్తుకొచ్చామా మేము” ముఖంలో ఆశ్చర్యాన్ని దాచుకుంటూ గరుకుబారిన స్వరంతో పలకరించాడు.
సమాధానంగా చిన్నగా నవ్వింది పార్వతి.
“పిన్నిగారు ఇప్పుడే నిద్రలేచారు లోనికి వెళ్ళండమ్మా”, అని చెప్పి బయటకు వెళిపోయాడు.
వసారాకు పక్కగా ఉన్న పెద్దగుమ్మం గదిలో పందిరి మంచానికి జారబడి కళ్ళు మూసుకుని ఉంది రమణమ్మగారు. పార్వతి కాస్త మొహమాటంగా గడప దగ్గరే ఆగి, “ఆరోగ్యం బావుంటుందా పిన్నీ మీకు” అని పలకరించింది.
కళ్ళు తెరిచి అసలు ఈమధ్యకాలంలో తన ఆలోచనలలో లేని ఈ మనిషి ఎదురుగా నిలుచోవడం చూసి చిన్న బలవంతపు నవ్వు నవ్వింది రమణమ్మగారు. “ఊ.... ఏ ఇలా వచ్చావ్?, “ఏదన్నా”..... ఆమె తరువాత మాట పార్వతికి తెలిసినట్టుగా “అవును పిన్నీ పనుండేవచ్చాను”. పొడిగా కాస్త నొక్కినట్టు మాట పూర్తిచేసింది.
“అది”.... కారణం చెపుతుండంగానే
మరో మాట పెంచకుండానే “పొద్దుపోయింది ఉదయం మాట్లాడుకుందాం”. “లోపలికి వెళ్ళు” అంటూ నౌకరుని పిలిచింది రమణమ్మ.
అతను వచ్చాకా “పూజగది పక్కన ఉన్న పడకగది చూపించు” అని పురమాయించింది.
పార్వతి చేతిలోని బట్టల సంచి అందుకుని లోపలికి నడిచాడు నౌకరు.
పదేళ్ళనాడు రమణమ్మ మాటల్లో, రూపంలో ఉన్న గంభీరతను, వయసు తెచ్చిన పెద్దరికంతో ఎంత పోల్చుకున్నా ఎక్కడా తేడా కనపడటంలేదు. దాయాదులతో కలిసి తనను, తన తల్లినీ కులం తక్కువదంటూ తండ్రి శవం నుండీ, ఈ ఇంటి నుండీ గెంటేయడం గుర్తుకువచ్చింది పార్వతికి. గొంతును ఎవరో బలంగా పిసికేస్తున్నంత బాధ,  కన్నీళ్ళను పవిటచెంగుతో కప్పేస్తూ ఆగది దాటివచ్చింది పార్వతి.
మేడ మెట్లు పక్కగా ఉన్న దర్బారు గదికి పెద్ద తాళం వేసి ఉంది. తన తండ్రి బ్రతికున్నప్పుడు వచ్చే, పోయేవాళ్ళతో ఎంతో కోలాహలంగా ఉండే దర్బారు ఇప్పుడు మగత నిద్రలో ఉన్నట్టుగా తోచింది పార్వతికి. హాలు గోడకు తగిలించిన ఏనుగు, పులి, దుప్పి తలలు దాటుకుంటూ వస్తుంటే తండ్రి తన చిన్నతనంలో వాటిని చూపించి భయపెట్టడం, తను జడుసుకుంటే జ్వరం రావడం లీలగా గుర్తుంది. ఏళ్ళు గడిచినా, ఎక్కడా వీసమెత్తు మార్పు రాలేదు ఆ ఇంట్లో, అంతా తన చిన్ననాడు ఉన్నట్టే ఉంది.
· * * *
తెల్లని మేనిఛాయతో, కాస్త పొట్టిగా, లావుగా ఉండే నాయుడుగారు, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు ముద్రతో, నుదిటిన తిరుచూర్ణం దిద్ది, భుజాలమీదుగా కండువా వేసుకుని, తలపాగాతో ఠీవీగా బండిదిగేవారు. వందల ఎకరాల మాగాడీకీ, రైసుమిల్లులకు యజమాని అయినా ఎక్కడా గర్వం పోకడ లేకుండా, శాంతంగా ఉండేది ఆయన స్వభావం. నాయుడుగారి సాయం కోరి వచ్చే ఊళ్ళో వారికి ఏవేళన్నా కాదనకుండా సాయపడేవారు. ఆయన హయాంలో వ్యవసాయం, రాజకీయం, విందులు, వినోదాలతో ఎప్పుడూ కోలాహలంగా ఉండేదా భవంతి. నాయుడిగారి మొదటి భార్య రాజేశ్వరమ్మకు పిల్లలు పుట్టకపోవటంతో తన పిన్నికూతురైన రమణమ్మను భర్తకిచ్చి రెండో పెళ్లి చేసింది. రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్కరికీ పిల్లలు కలగకపోడంతో చివరికి ఆయనకు మిగిలిన ఒక్కగానొక్క సంతానం ఈ కళావంతుల పిల్ల పార్వతే అయింది. కూతురంటే అమితమైన ప్రేమ ఉన్నా అందరిలోనూ తన బిడ్డగా పరిచయం చేయలేకపోయారు నాయుడుగారు. ఎప్పుడన్నా కూతురు మీద మనసుకలిగితే వెళ్ళి చూసివచ్చేవారు. కుదరనప్పుడు బండి పంపి పార్వతిని దివాణానికే పిలిపించేవారు. వయసుకు రాగానే పార్వతికి వరసకు మేనమామ నిచ్చి పెళ్ళి చేసారు. ఆస్తిలో భాగం ఇచ్చి, కూతురికి ఏలోటూలేకుండా చూసుకోవాలన్న కోరిక నాయుడుగారికి ఉండేది. ఆయన పోయాకా అంతా తలకిందులైపోయింది.
తండ్రి చనిపోవడంతోనే ఆయనతోనూ, ఆ దివాణంతోనూ పార్వతికి పూర్తిగా సంబంధం తెగిపోయింది. అప్పుడప్పుడూ పుట్టింటి సంగతి గుర్తుకు వచ్చినా ఇక్కడ తనకు మిగిలింది ఏమీలేదని, ఓ పరాయి భావన చుట్టూ అల్లుకుంటున్న ఊహలేనని అనిపించి ఏడుపు ఆగేది కాదు. గది ముందుకు రాగానే నౌకరు చేతిలో సంచి అందుకుని అతన్ని పంపేసింది, స్నానం చేసి మంచం మీద వాలిపోయింది. మనసును మెలిపెడుతున్న ఆలోచనలతో కాస్త ఆలస్యంగానే భోజనాల గదికి వచ్చింది పార్వతి.“ఎప్పుడనగా బయలుదేరావో ఏమో త్వరగా భోజనానికి కూచోమ్మా వడ్డించేస్తాను” అంటూ నేలమీద అరిటాకులు పరిచింది వంటమనిషి. దీపాల కాంతిలో మెరిసిపోతున్న గదులన్నీ చూసుకుంటూ వస్తున్న పార్వతికి పై అంతస్తులోని తండ్రిగది దగ్గర చీకటిగా ఉండటం గమనించి మెట్లకింద ఉన్న లైటు వేసి వచ్చింది.“అలా ఉండనీలేమ్మా, చాలారోజులుగా అటు మసిలేవారు లేక లైటు వేయడం లేదు”. కాస్త సాగదీస్తూ చెప్పింది వంటామె. పార్వతి మనసు నొచ్చుకుంది. మౌనంగా వెళ్ళి భోజనానికి కూర్చుంది. అవే వంటకాలు ఏం మార్పులేదు, అదే కారం పెట్టిన వంకాయ కూర, దొండకాయ వేపుడు, పప్పు, నెయ్యి, గడ్డ పెరుగు అవే వంటలు.
“పిన్ని భోజనం చేసారా”
“లేదమ్మా చానాళ్ళుగా రాత్రిపూట భోజనం మానేసారు . రాత్రికి కాసిని పాలు మాత్రమే తీసుకుంటారు. అదికూడా ఒకొక్కప్పుడు ఉండదు”. పొడిగానే సమాధానం.
త్వరగా భోజనం కానిచ్చి పెరడులో చేతులు కడుక్కుంటూ చూసింది, చలిగాలి జోరుగా వీస్తుంది. దూరంగా ఉన్న పసుల కొట్టం దగ్గర ఎండిపోయిన చెరుగు గడలతో అప్పన్న చలిమంట కాగుతున్నాడు. చిన్నతనంలో అతనితోనే ఆడుకుంది. ఇలానే చలిమంటలు కాగింది. చిక్కని వెన్నెల్లో ఆవులన్నీ వెండి కొండల్లా మెరుస్తున్నాయి. పెరడంతా పసూల ఎరువుతో చల్లిన కళ్ళాపి చల్లి, ముగ్గులతో అందంగా ఉంది. దాయలు మీద కాగుతున్న పాల వాసన ఆ పరిసరాలని మత్తుగా కమ్మేసింది.
“ఎప్పుడొచ్చారమ్మా, బువ్వ తిన్నారా” ఆప్యాయంగా పలకరించాడు అప్పన్న. “ఆ అయ్యింది అప్పన్నా, నువ్వు తిన్నావా”.
“ నాకు మాణిక్యం ఇంతకితం గిన్నెలో పెట్టి పోయింది, ఆకలవగానే తింటానలే. “అయ్యగారు, పెదపాప, బాబుగారు ఎల్లాగున్నారమ్మా” ఆత్రంగా అడిగాడు అప్పన్న.
“అందరూ బాగున్నారు అప్పన్నా, నువ్వెలా ఉన్నావ్”
“నాకేంటమ్మా దిట్టంగా ఉన్నాను.
“ఇంకేంటి అప్పన్నా, దివాణం సంగతులు”
“నాకేటి తెలుత్తాయమ్మా, ఏదన్నా ఆ వంటామె, నాగన్నలే చెప్పాలి, గుమస్తా నారాయణ బాబు ఈ కులంతక్కువోడితో మాట కలపడు కదా ”. నొచ్చుకుంటూ చెప్పాడు అప్పన్న.
“నా సంగతికేం గానీ.....ముందుగా కబురన్నా లేకుండా ఇట్లా ఒక్కళ్ళే ఒచ్చారేటమ్మా” ఆత్రంగా అడిగాడు అప్పన్న.
“బాబుకి ఉద్యోగానికి డబ్బు సర్దమని పిన్నిని సాయం అడుగుదామని వచ్చాను. ఉదయం మాట్లాడమంది”. కాస్త మొహమాట పడుతూనే చెప్పింది పార్వతి.
“అదేటమ్మా, ఇది మీ ఆస్తి, అయ్యగోరు బతికుంటే ఈపాటికి నీ బిడ్డలు మారాజుల్లా ఇక్కడే తిరిగేటోళ్ళు, ఈ మహాతల్లి ఏ గడియలో ఇక్కడ కాలుమోపిందో దివాణం ఒల్లకాడైపోయింది. ఒకరెనక ఒకరు కాటికిపోతానే ఉన్నారు, అందర్నీ తన పొట్టన పెట్టుకుని ఒక్కత్తి రాజ్య మేలుతుంది”. అప్పన్న మాటల్లో కసి ఎగిసిపడుతున్న మంటలతో సమానంగా ఉంది.
అయ్యగోరు పోయాకా వారసులు లేని ఈ దివాణం లెక్కలన్నీ అమ్మగోరే దగ్గరుండి చూత్తన్నారు. అయినోళ్ళందరూ ఒరసగా పోయాకా పిచ్చిపట్టిందని, ఎవరినీ నమ్మడంలేదని వంటామె చెప్పింది. ఆ మధ్య తానాల గదిలో చక్కరొచ్చి పడిపోతే పట్నం నుండీ డాక్టరుబాబుని పిలిపించి సూపించారంట, మనువుకి ముందే ఆమెగోరికి మూర్చరోగం ఉందని ఊళ్ళో అంటారు. “నేను అయ్యగోరు పోయాకా, దివాణం కేసి పోటంలేదు, ఇన్నేళ్ళలో ఓ నాలుగుమార్లు ఎల్లుంటాను అంతే, పగలంతా పొలంలో ఉండి, సందేళకు ఇదిగో ఈ పశుల కొట్టంలోనే ఉండిపోతాను, ఎందుకో దివాణం కేసి పోబుద్ది కాదు. మీ నాయనగోరు ఎవరికి ఏ అన్నాయమూ చేసి ఎరుగడు ఆయనే పోయాకా ఇక్కడ ఉండబుద్ది కాలేదు కవతం మానేసి పోదారనిపించింది. కానీ, మా తాతా, నాయనా, అంతా చచ్చేదాకా ఇక్కడే కవతమున్నారు. ఆ ఇదితోటే దివాణంలో ఉండిపోయాను. అంత మంచోరికి విషం పెట్టడానికి దానికి చేతులెలా ఒచ్చాయో,  ఒక్కోసారి అనిపిత్తా ఉంటాది అమ్మోరికి ఏటపోతును బలిచ్చినట్టు ఆ మహాతల్లి తల నరికేయాలని. మళ్ళీ నన్ను నేనే తమాయించుకుంటాను”.  కన్నీళ్ళు ముఖం మీద పడ్డ ముడతల నుండీ కిందకుదిగుతున్నాయి.
“అంతేనా పెద్దమ్మగోరిని పిచ్చిదాన్ని చేసింది, ఆ కటకటాల్లోనే గొలుసులేసి కట్టేవోరు, రాత్రేళ ఆ మిద్ది గదిలోంచి బాధగా అమ్మగోరి మూలుగు ఇనపడేది, అది ఇంటావుంటే కడుపులో కెలికిసినట్టయ్యేది. బిడ్డలు కలగడం లేదని పిన్ని కూతురైన రమణమ్మగోరి నిచ్చి మీ నాయనగోరికి పెళ్ళి చేసింది పెద్దమ్మగోరు. ఆమెగోరు పుట్టింటి నుండీ వత్తా వత్తా అప్పటికే మనసిచ్చిన సూర్యంబాబుని తన ఎంటపెట్టుకుని సారట్టుకొచ్చినట్టు తన కూడా ఈ దివాణానికి పట్టుకొచ్చింది. ఆ బాబుకి అయ్యగోరు నమ్మి దివాణంలో గుమస్తాగిరీ ఇచ్చేరు. ఒమారు అయ్యగోరు ఇద్దరినీ చనువుగా ఉండటం చూసారంట అది మొదలు ఈ సంగతి బయటికి ఎక్కడ పొక్కుతుందో ఏమో అని, ఇద్దరూ కలిసి పెద్దమ్మగోరికి తెలీకుండా కాఫీలో ఇషం కలిపి ఆవిడచేతే మీ నాయనగోరికి ఇప్పించారు. అయ్యగోరు చనిపోయిన్నాడు ఆయనకి ఇషం ఎట్టారని తెలిసాకా, నెపాన్నంతా పెద్దమ్మగోరి మీదకి గెంటేసి, తప్పుకున్నారు. ఏ పాపం తెలీని పెద్దమ్మగోరు మతి చలించిపోడానికి కూడా రమణమ్మగోరే ఏదో పసరుమందు పెట్టారని దివాణం పెద్దపాలేరు మొన్నటేడాది చనిపోయిన నాగన్న అనేటోడు”.
తనకు తెలిసిన సంగతులే అయినా అప్పన్న నోటితో వింటుంటే పొంగుకొస్తున్న కన్నీళ్ళను ఆపడం పార్వతి వల్లకాలేదు.
ఎప్పుడొచ్చిందో  ఇద్దరూ మాటల్లో ఉండగా పార్వతికి వెనుకగా వచ్చి నిలబడింది మాణిక్యం “బాగా చలిగా ఉందమ్మా, జలుబు చేస్తుంది. లోపలికి రండమ్మా, కుక్కల్ని వదిలే వేళయింది. రండి పడుకుందురు” అంటూ పలకరించింది.
“ఆ వస్తున్నా”
కుక్కలేమిటి అప్పన్నా?
"అవా!  అమ్మగోరు రెండేళ్ళ నుండీ దివాణం కాపలాకి  అడివి జాతి కుక్కల్ని తెచ్చి పెంచుకుంటోందమ్మా".
"ఆటికి రోజూ రాజభోగమే. పెద్ద ఇత్తడి పళ్ళాల్లో పాలోసి, నెయ్యి కలిపిన అన్నంతో బాగా మేపి, పగలంతా మండువాలో, సండేళకి దొడ్లో వదిలేత్తారమ్మా. తెల్లార్లు దివాణం చుట్టూ మొరుగుతూ తిరుగుతుంటాయి. ఆటి అరుపులు చుట్టుప్రక్కల ఉన్న పొలాల్లో నక్కల ఊళలకు సమానంగా ఉంటాయి.
చలిమంట అణిగిపోయింది.
" పడుకోమ్మా, బాగా పొద్దోయింది".
అప్పన్నకు చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకున్న పార్వతికి దివాణంలో జరిగిన, జరుగుతున్న సంగతులు మెదడులో తిరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుంది.
· * * *
ఉదయాన్నే ఫలహారం అయ్యకా, వంటామె  “అమ్మగారు మధ్యాహ్నం భోజనాలు అయ్యకా మిమ్మల్ని కలుసుకోమన్నారమ్మా” అని చెప్పి వెళ్ళిపోయింది.
భోజనం అవ్వగానే రమణమ్మదగ్గరకు బయలుదేరింది పార్వతి. గది తలుపులు వారగా వేసి ఉన్నాయి. గుమ్మం ముందు నిలబడి “పిన్నీ ఉన్నారా” అంటూ పిలిచింది పార్వతి.
లోపలి నుండీ రమ్మంటూ వినిపించింది రమణమ్మ స్వరం. కిటికికి వారగా చిలకాకు పచ్చ బంగారు జరీ చీరలో, జుట్టు విరబోసుకుని టేకు చేతుల కుర్చూలో కూర్చుని ఉంది రమణమ్మ.
“ఊ ఏం పని మీద ఒచ్చావ్” గుర్తుచేస్తున్నట్టు, ఇద్దరి మధ్య మరే సంగతులేవన్నట్టు అసలు విషయం దగ్గరకే వచ్చింది రమణమ్మ.
“మీ మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది. అందుకు రెండు లక్షలు కట్టమంటున్నారు. ఇప్పటికిప్పుడు అంతమొత్తం  సర్దటం మావల్ల కాలేదు. మిమ్మల్ని సాయం అడుగుదామనే వచ్చాను”.
ఎర్ర బడిన కళ్ళతో “ఏమన్నావ్, నా మనవడా.... ఎవడువాడు,  నా మనవడా... ఈ కులం తక్కువది కూతురు, దాని కొడుకు నాకు మనవడు”. గదంతా ప్రతిధ్వనించేలా గట్టిగా నవ్వుతూ “ఇంకెప్పుడూ ఇప్పుడు అన్నట్టుగా మరెవరితోనూ ఈ దివాణంలోవాళ్ళతో, నీవాళ్ళకు చుట్టరికాలు కలపకు. అసలు నీ తల్లన్నా, నీ పుట్టుకన్నా నాకు చెప్పలేనంత అసహ్యం.
ప్రతి వస్తువులోనూ తన హోదాను, దర్జానూ వెతుక్కునే ఆ నాయుడికి వేషాలు కట్టుకునే ఆ కులం తక్కువుది ఏలా నచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నాయుడి చావుతోనే పీడాపోయిందనుకుంటే, ఇన్నేళ్ళకు నీ బిడ్డలకు ఆస్తి పంపకాల కోసం వచ్చావా?”
“నన్ను ఎన్ని అన్నా పరవాలేదు, నీ మాటలతో చనిపోయిన వాళ్ళను అవమానపరచకు పిన్నీ. నేను, నా బిడ్డలు ఆస్తిలో వాటాకొస్తామని నువ్వు భయపడక్కరలేదు. నాకెప్పుడూ ఈ ఆస్తి మీద ఆశ లేదు”.
“అంత అవసరం లేనిదానివి, ఇప్పుడు మాత్రం ఏ ముఖంతో వచ్చావ్, సాయం చెయ్యమంటూ”... వెక్కిరింపుగా నవ్వింది రమణమ్మ.
“అవసరం ఉండే వచ్చాను, కానీ అప్పుగా అడిగేందుకు వచ్చాను”.
“అప్పా... నీకా ఏం చూసి ఇవ్వను, నీ మొగుడి గుమస్తా గిరీ చూసా”? గర్వంగా నవ్వింది.
“అవును, నా మొగుడు గుమస్తానే, నీలా అడ్డువచ్చిన వారినందరినీ విషం పెట్టి చంపడం మా ఆయనకు చేతకాదు, అందుకనే గుమస్తాగా మిగిలిపోయాడు. లేదంటే నేనూ ఆస్తి కూడబెట్టేదాన్ని”. లోపలి బాధను మాటల రూపంలో అనేసింది పార్వతి.

“అవును విషం పెట్టాను. అరవై ఏళ్ళ ముసలాడికి పదహారేళ్ళ పడుచుపిల్లను అంటగట్టి, నాకలలను, నా కోరికలను నాశనం చేసింది నా అక్కగారు, ఈ నిర్భంధపు బతుకు బ్రతకమని ఈ ఆస్తినీ, ఈ అధికారాన్ని నా వాళ్ళకు ఎరగా వేసి నా బ్రతుకు నాశనం చేసింది. ప్రేమించిన వాడికి దగ్గరకు చేరలేక, కట్టుకున్నవాడితో అన్నీ మరిచిపోయి ఉండలేక నా యవ్వనాన్నంతా ఈ నాలుగు గోడలకూ బలిచ్చాను. నన్ను కట్టుకున్న రోజునే పెళ్ళి మండపంలో నీ తల్లిని చూసి దానివలలో పడిపోయాడు నాయుడు. పారాణీ ఆరకముందే నాకు జీవితఖైదు వేసి, తనుమాత్రం నీ తల్లితో కులికి, ఓ కూతుర్ని కన్నాడు. అతగాడు చేసినదంతా న్యాయం, నేను మాత్రం మనసిచ్చిన వాడితో కలివిడిగా ఉండటం చూసి పరువుపోయిందంటూ, నెత్తీనోరుబాదుకున్నాడు. పంట డబ్బులు ఒచ్చిన రాత్రి ఆస్తినంతా నీకే రాస్తానని బెదిరించాడు. నేను ఊరుకుని ఉంటే నీకే రాసేసి ఉండేవాడేమో, సూర్యం కూడా నా ఆస్తిమీదనే ఆశపడ్డాడని తెలిసాకా అతగాడి మీద మనసు విరిగిపోయింది.
నా బ్రతుకులో జరిగేది ఏదీ నాకు నచ్చలేదు. అందుకే అంతా నాకు నచ్చినట్టు చేసుకున్నాను. అందుకు అడ్డం వచ్చిన ప్రతీవాళ్ళనూ తొలగించాను.
“పిన్నీ.....  అందర్నీ చంపి, ఇంత ఒంటరితనాన్ని మోస్తూ నువ్వు బాగుకున్న అంతస్తు, రాజభోగం ఇవా!  అరిచింది పార్వతి.
“ఎందుకు గట్టిగా అరుస్తావ్, ఒంటరితనమా, కాదు ఇది నా సామ్రాజ్యం, ఇందులో నేను చేసిందే సాసనం. ఇక్కడ నాకు ఎదురొచ్చిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు. “నా చూపు నుండీ తప్పించుకున్నదానివి నువ్వు ఒక్కత్తివే. అప్పుడే నిన్ను కూడా నాకు అడ్డం తొలగించుకుని ఉండి ఉంటే, ఈరోజు ఇలా ఈ రమణమ్మను నిలదీయడానికి వచ్చేదానివే కాదు” అంటూ, వేగంగా ముందుకు వచ్చి పార్వతి గొంతుని తన పదునైన గోళ్ళతో గట్టిగా గోడకు ఆన్చి గట్టిగా నొక్కి పెట్టింది. పార్వతి పుట్టుక, జాతి మీద తనకున్న కసి మరింత రెట్టింపైనట్టు, కొంచెం కొంచెం పట్టు బిగిస్తూ, పిచ్చిదానిలా నవ్వుతుంది రమణమ్మ.
పట్టు తప్పిపోతున్న శరీరంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తూ అరిచింది "పిన్నీ... పి....న్నీ" ఉబ్బిపోతున్న నారాలతో ముఖంలో రక్తం చేరుకుని కళ్ళ నుండీ కన్నీళ్ళు జారుతున్నాయి. శరీరంలోని శక్తినంతా కోల్పోతూ బ్రతుకు మీద ఆశ చచ్చిపోయినదానిలా పూర్తిగా రమణమ్మకు వశం అయిపోతుంది.
· * * *
నెమ్మదిగా కళ్ళు తెరచి కిందపడి ఫిడ్స్ తో కొట్టుకుంటున్న రమణమ్మను చూసి తేరుకుని ఆ గదినుండీ బయటకు నడిచింది పార్వతి. తూర్పు దిక్కున సూర్యుడు మణిగాడు. సాయం సంధ్య ముసురుకుంటుంది. ఆ భవంతి మీదా చుట్టూ ఉన్న పరిసరాల మీదా నల్లని దట్టమైన మేఘం కమ్ముకుంది. ఎక్కడో దూరంగా కీడు సంకిస్తూ తీతువు కూసి, కాసేపటికే నిశ్శబ్దం అయిపోయింది. చుట్టూ గాలి స్తంభించి పోయింది. ఆకు గానీ, గడ్డిపోచగానీ కదలడంలేదు. దూరంగా చెరుకు రసం కాగుతున్న వాసన కొంచెం సేపు బలహీనంగా కొంచంసేపు గాఢంగా చుట్టూ పరిసరాల్ని వ్యాపించింది. పార్వతి చుట్టూ ఆవిరి మేఘంగా కొన్ని క్షణాల పాటు అల్లకుని కాసేపటికే దూరంగా పోయిందా పరిమళం. యమపాశంలా ఉన్న దివాణం వైపు చూస్తూ, తండ్రిని తలుచుకుని గండెల్లోని బాధని కన్నీళ్ళతో నింపేస్తూ  రోడ్టు మీదకు నడిచింది పార్వతి.
* * *
పార్వతి తిరిగి వచ్చేసిన చాలా రోజులకి కొడుకుకి ఓ ఉత్తరం వచ్చింది. ఎదురింటి రామం రాసాడు. దివాణంలో దొంగలు పడి, అంతా దోచుకుని కాపలాగా ఉన్న కుక్కల్ని చంపేసారని, రమణమ్మగారిని చంపేసి చాపలో చుట్టి గదిలో మంచంకింద దాచారని, దోపిడి జరిగిన వారానికి గానీ జరిగిన సంగతి బయటకు తెలీలేదని ఆ ఉత్తరం సారాంశం.
*

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...