Friday 29 March 2019

గొడ్డొచ్చిన వేళ...



ఆలమూరు నుంచి ఇక్కడికి వచ్చి నెలరోజులు మాత్రమే అయ్యింది. చుట్టూ పచ్చదనం మాపిల్లలతో పాటు అమ్మకు కూడా తెగ నచ్చేసింది. మొత్తం చిన్న సైజు అడివిలాంటి ఆ ప్రదేశంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నోరకాల  చెట్లు, చాలా రకాల పక్షులు, పెద్ద  గదుల పెంకుటిల్లు, ఎప్పుడూ చూడని ఎన్నోజాతుల పూలు, పళ్ళు ఇంకేం కావాలి. మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి. అంతా ఇక్కడే ఉండిపోవాలని అనుకున్నాం.

అప్పటివరకూ అమ్మ మిషన్ కుడుతూ, నాన్న ఉద్యోగం చేసి, ఇద్దరూ కలిపి మమ్మల్ని చూసుకున్నారు. ఈ కొత్త చోటులో అదీ ఈ అడవిలాంటి ప్రదేశంలో ఎవరు కుట్టమని బట్టలు ఇస్తారు. ఆ ఆశా పోయింది. అందుకే వారంలోనే అమ్మ ఇంతటి విశాల ప్రదేశంలో తనేం వ్యాపారం చేయగలదు అనే అలోచనలో పడింది. నాన్నగారు చేస్తున్న చిన్న ఉద్యోగం మమ్మల్ని ఓ దరిచేర్చలేదని అందరికీ తెలుసు., అందుకే అమ్మ తపన. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన సాయం ఇంటికి చాలా అవసరం.

ఈ పచ్చదనంలో మనం ఓ ఆవును పెంచుకోవచ్చండి, అదైతే పెద్దగా పెట్టుబడి లేకుండానే, ఇక్కడే మేసి, పాలు ఇస్తుంది. ఊళ్ళో ఉన్న పాలకేంద్రంలో మీరు పాలు పోసి వద్దురుగానీ.. కాస్త అందులో లాభం ఉంటే మరోటి కొని పాల వ్యాపారం పెంచుకోవచ్చు.. ఏమంటారునాన్నగారిని అడిగింది అమ్మ. నాన్నగారికి పాడి విషయంగా ఏం తేలీదు. ఏలా ఒప్పుకుంటారు.

వద్దులేవే.. నాకు పాలు పోయడం కుదరకపోతే మళ్ళీ ఇబ్బంది.. ఎవరు ఆవుకు కావలసినవన్నీ చూస్తారు.. దానికి పాలు తీసి, పేడ శుభ్రం చేసి పెట్టాలన్నా ఒకళ్ళ సాయం కావాలి. ఇవన్నీ ఈ కొత్త చోటులో మనకు వీలవుతాయా... వద్దు.. మరోటి చెప్పు. ఏ అప్పడాల వ్యాపారమో, లేదంటే మనకు తెలిసిన పొగాకు వ్యాపారం చేసుకుందాంలే.. అన్నారు.

 అవును మరి అలానే ఉంటాయ్ బుద్దులు... పొగాకు పని మీకు తెలుసు.. సరే.. నాకు ఇక ఆ పనిచేయబుద్దికావడంలేదండి. ఎన్ని చుట్టలు చుడితే దానిమీద మనం పెట్టిన డబ్బులు కనిపిస్తాయి చెప్పండి. మీ నాన్నగారికి అలవాటైందంటే ఇక ఆయన అందులోనే ఉండిపాయారు కనక. మనం నలుగుర్ని పెంచాలి. మన వల్ల కాదు. నేను చెప్పిన పాడి పనైతే బావుంటుంది. ఆలోచించండి. మేతకు కూడా పెద్దగా ఖర్చు పెట్టక్కరలేదు. ఏమంటారు...

ఏమంటాను. నువ్వు మొత్తం బాధ్యత తీసుకుంటానంటే నాకేం పరవాలేదు. నన్ను నా ఉద్యోగాన్ని సరిగా చేసుకోనీ అంతే.. తర్వాత వీలైతే నా సాయం చేస్తాను.

 సరే అయితే ఎప్పుడు వెళదాం సంతకి.

ఉండవే. ఆలోచన రావడమే పోదాం అంటే ఏలాగ.. ఈ కొత్త చోటులో ఎవరినైనా అడగాలి కదా..

ఏం అడుగుతారు. పాడి ఏలా చేయాలనా? అంతా నవ్వుతారు. నా చిన్నతనంలో మాకు గేదెలు ఉండేవి. నాలుగు రోజులు తంటాలు పండితే అదే తెలుస్తుంది. ఎవర్నీ అడిగి ఏం తెలుసుకోలేం... నేను పాలు తీస్తాలెండి. మీరు కంగారు పండకండి.

ఏదో అభయం అయితే ఇచ్చేసింది.

**

ఓ మంచి రోజున, బుధవారం నాడు ఊళ్ళో జరిగే పశువుల సంతకు వెళ్ళాం. సంతంతా నాలుగు వైపుల వెళ్ళేందుకు మార్గంలతో, చుట్టూ పెద్ద గోడ, చేవతేలిన టేకు, మావిడి చెట్లు, కాస్త పెద్ద మర్రి చెట్లు పశువులకు నిడగా ఉన్నాయ్. బేరగాళ్ళతో ఆ ఉదయం చాలా హడావుడిగా ఉంది సంత. 

ఓవైపు ఈనడానికి సిద్ధంగా ఉన్న గేదెలు, ఆవుల చుట్టూ, నలుగురురేసి జనం గుమిగూడి ఉన్నారు. ఓవైపు బేరాలు, సారాలు.. మరోవైపు పాలిగాళ్ళ ముచ్చట్లు. దూరంగా ఉన్న పాకల్లో జున్నుపాలు అమ్మే అంగళ్లు, మరోపక్క కొత్తగా కొన్న గిత్తలకు, పెయ్యలకు తాళ్ళు, ముట్టు బుట్టలు, దిష్టిపూసల దండలూ వేలాడుతున్నాయి. దూరంగా కల్లు దుకాణం చుట్టూ బేరగాళ్ళ బేరాలు సాగుతున్నాయ్.  

సంతలోకి వెళ్ళిన మాకు సూర్యం అనే దళారి కనిపించాడు. మాసిన లుంగీ, సగంచేతుల చొక్కా, బొత్తాలు ఊడిపోయి లోపల మాసిన చిల్లుల బనీను కనిపిస్తుంది. మెడచుట్టూ గళ్ళ తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు. నోట్లో నిప్పు ఆరిపోయి ఉమ్ముకు తడిచి నానిక చుట్టపీక. మనిషి మొత్తంగా మురికిగా ఉన్నాడు.

వాడే నాన్నగారికి ఎదురొచ్చి తెలిసినట్టుగా పలకరించాడు. నాన్నగారు మాకు పాలిచ్చే ఆవుకావాలని చెప్పగానే రండి సార్ మా బావమరిది దగ్గర ఇంట పుట్టిన ఆవు సూలితో ఉంది. వారంలో ఈనతాది. మీరు ఇక్కడే ఉండండి.. మా బావగాణ్ణి పిలుచుకొస్తాను. నాలుగు అంగల్లో ఎదురుగా ఉన్న పాకలోకి వెళ్లాడు.

మేము నించున్న మామిడి చెట్టుకు పక్కన చిన్న గునపం పాతి దానికి తెల్ల ఆవు పిల్లని కట్టారు. దాని ముందు పచ్చగడ్డి పన వేసి ఉంది. ఆవు పిల్ల చూడడానికి ఎంత ముద్దుగా ఉందో..

 ఒరే.. శీను

అప్పారావు బావేడి

ఇప్పుడే ఆ చెట్టుకాడికి పోయాడు.. పిలుత్తాలే.. ఏంటి బేరమా..

నీకెందుకురా.. పో.. పోయి.. బావని పిలుచుకురా..బేగా

**

నలుపు మీద తెలుపు మచ్చలతో, బొద్దుగా, పొట్టిగా ఉంది ఆవు, కొమ్ములు మెలితిరిగి , పక్కకున్నాయి. భారంగా మసులుతుంది. అమ్మకు నచ్చింది. ఇరవై వేలకు ఒక్కరూపాయి తగ్గదన్నాడు. మొత్తానికి నాన్న అమ్మా బేరాలాడి పదిహేనవేలకి తీసుకున్నారు. అమ్మ తన కూడా తెచ్చిన ఆరువేలు బజానాకింద ఇచ్చి ఇంటికి తోలుకు వచ్చింది.

మొదటిసారి ఆవును తీసుకురావడం, మహాలక్ష్మినే తీసుకువస్తున్నంత హడావుడి చేసింది. పసుపు, కుంకుమ బొట్లుపెట్టి హారతి ఇచ్చి గుమ్మానికి ఎదురుగా ఉన్న జీడిమామిడి చెట్టుకింద కట్టేసింది. నాగులు పరకలు పచ్చగడ్డి కోసుకొచ్చి ఏసింది.

సూర్యం చెప్పిన వారం రెండువారాలైంది. అమ్మ ఈలోపు పచ్చగడ్డి, దాణా అంటూ ఆవుని మేపడమే పనిగా పెట్టుకుంది. ఏమే.. ఈ ఆవుని తెచ్చి రెండువారాలైపోయింది ఇంకా ఈనడంలేదేంటి. ఓసారి సూర్యం దగ్గరకెళ్ళి వస్తానుండు. ఎందుకండి.. వాళ్ళు టైం తప్పుగా వేసుకున్నారేమో.. ఇంకో నాలుగురోజులు చూద్దాం.

**

రెండోనాడు నాన్నగారు ఊరిలో నుంచి వచ్చీ రావడమే చాలా కంగారుగా కనిపించారు. వాకిట్లో సైకిల్ దిగీదిగటంతోనే జీడిచెట్టు కింద పడుకుని నెమరేసుకుంటున్న ఆవుని ఒక్క అదిలింపు అదిలించి లేవగొట్టేసారు. గదిలోంచి ఇవతిలికి వస్తున్న అమ్మ..

అయ్యో దాన్ని ఎందుకు లేపుతున్నారు. ఇప్పుడే దాణా తిని పడుకుంది.

ఆ పడుకుంటుంది. అంతకన్నా ఏం చేస్తుంది..

అదేంటి.. ఎందుకంత కోపంగా ఉన్నారు. ఏమైందిప్పుడు

ఏమైందా.. ఆ..ఆ.. సూర్యంగాడు మనల్ని మోసం చేసాడే.. ఇది చూలి ఆవుకాదు.. పాలిచ్చే ఆవు అంతకన్నా కాదు..

ఆ.. మరి

చూడు దీనికి పొదుగులో ఐదు చనుకట్లున్నాయ్..

ఈసారి తెల్లముఖం వేయడం అమ్మ పనైంది.

*





2 comments:

  1. బావుందండి మీ కథ. ఒక్కటి మాత్రం అర్థం కాలేదు… పాలిచ్చే ఆవుని గుర్తించడమెలా?

    "ఇది చూలి ఆవుకాదు.. పాలిచ్చే ఆవు అంతకన్నా కాదు..”
    … …
    “చూడు దీనికి పొదుగులో ఐదు చనుకట్లున్నాయ్..”

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...