Monday 26 April 2021

నేటి చిత్రాలు



జీవితం చెక్కిన శిల్పాలన్నీ

ఒక్కోతీరు
చక్రం తిరిగితేనే గానీ
పూటగడవని పిన్ని
పాతికేళ్ళకే పెద్దరికాన్ని
మీదేసుకున్న అనుభవం
తో మాట సాగేసే ఆరిందా చెల్లి
ఎదురింటి గోడపై వాలిపోయి
పొరిగింటి కబుర్లు సేకరించే
యాభైఏళ్ళ పడుచుపిల్ల
దొడ్లో ములగచెట్టు కాయల్ని
వేళతెలీకుండా లెక్కేసుకునే
ముసలామె
సహదర్మచారిణికి బట్టలు ఉతికి
సహాయం చేసే కాంపౌండరు
ఆటోలో బడి పిల్లల్ని తీసుకెళ్ళె
పక్కింటి డ్రైవరు
సగం రోజుని ఫోనులోనే గడిపేసే
బాల మేధావులు
కరెంటు పోగానే టీవీ సిరియళ్ళ
కథలతో పంచాయితీలు
సాగించే గృహ లక్ష్ములు

Thursday 22 April 2021

ఈ గాలికీ నువ్వు గుర్తే




వాస్తవానికి నేను నీలో ఇంకిపోయి

మాటిమాటికి నీ కలను కంటున్నాను

వేల వసంతాలను ఒక్కసారే ఎత్తుకు వచ్చిన

ఊహవు నువ్వు

వయసు ఆరాటాన్ని తీర్చే జతగాడివి

మనసు భారాన్ని దింపే ప్రేమికుడివి

నీ నవ్వును గురుతుపెట్టుకున్న మనసు

నిన్ను ఇక్కడికీ మొసుకొచ్చింది

గతానికి వాస్తవాన్ని కలిపి నిచ్చెన వేసి

నీతో నడిచిన దారిలో నడుస్తోంది

వికసించే మల్లెలన్నీ నిన్ను గురించి అడిగాయి

నీ మనసుకు అద్దిన పరిమళాలు తమవే

అన్నాయి

వాటైన ఆ సిరులన్నీ పోగేసి నిన్ను పట్టుకున్నాను

చేతికంది మాయమైంది ఒక్క క్షణం నీరూపం

అప్పుడూ ఎంత నిజమైన ఆకారానివో నువ్వు

Sunday 18 April 2021

చీకట్లో కొన్ని దృశ్యాలు




సూరీడు ఇంకా కనికరం చూపలేదు

ఈ ప్రకృతిని రాతిరి విడవలేదు
పైరునంటిన పొగమంచు వాసన
పచ్చదనాన్ని కప్పేసిన చీకటి
పూరిపాకలో ప్రశాంతమైన నిద్ర
కుక్కపిల్లను వెక్కిరిస్తున్న వీధిలైటు
ఇళ్ళను కావలించుకున్న చెట్ల నీడ
ఫారాల్లో నిద్దరోతున్న కోళ్ళు
పలకరించిన గబ్బు వాసన
దీపాన్ని చుట్టుముట్టిన పురుగులు
మర్రిచెట్టు మీది కాకులు
కప్పల బెక బెకలు
కన్ను పొడుచుకున్నా కానని దారి
వేగమందుకున్న రైలు బండి
పెద్దవై చిన్నబోతున్న దీపాలు
కాంతిని కాసేపు ఆర్పేసిన గుడ్డి ఇళ్ళు
ఊగుతున్న కట్టవ మీది తాటిచెట్లు
కీచురాళ్ళ పలకరింపులు
కాలాన్ని చక్రాలకు కట్టుకుని
దూసుకొచ్చిన గూడ్సు రైలు
గమ్యాన్ని చేరాలని ఆరాటం
దూరంగా నిద్దరలో జోగుతున్న ఊళ్ళు

Friday 16 April 2021

ఎవరెరిగేరు..


నిన్నటి కలలో

చంద్రకాంతలన్నీ సాలభంజికలై
నిలువుటద్దం ముందు
నీ ఊసులాడాయి
ఎవరెరిగేరు నీ జాడ ఎవరెరిగేరు
కడలి నురుగల్లే నీ నవ్వు జాబిలై కాసింది
ఆ నవ్వు నాగమల్లెలై పూసి చింతపువ్వు
సిగ్గు నేర్చింది
ఆకాశాన..ఆ కడలిపైన నీ ఊసు
మరవక మనసు పరుగులందుకుంది
నీ జాడ అందని దిగులు ఈ వైపు
ఆ వైపు వెన్నెల వానల్లే కురిసింది
నడిరేయి తారల్లే చెంతకు వస్తావనీ
నేతాళ భేతాళ కథలెన్ని చెప్పినా
కునుకునే మరిచాయి కళ్ళు
ఆ మేఘాలమాటున దాగున్నావో
ఏ లతాంగి ఒడిలో జోగుతున్నావో
నేనున్నానని మరిచేవో మరి..ఇంతకీ
నేనున్నానా..!!!

Tuesday 13 April 2021

మల్లె పందిరి కింద



మసకబారేటి రాతిరికి

పాడే దీపాల జోల
నిదురకన్నులకు వెన్నెల
అద్దిన సోయగపు సోన
మల్లె పందిరి కింద
మగనితోడుగా
వదులుచేసుకున్న
హొయలు ఎన్నో
జార విడిచిన కోక,
ముడివిడిన కురులు తప్ప
ఎవరు ఎరిగేరు
ఏంకాంత ఏమంత సొగసో
కునుకు ఎరుగని రాత్రి
కన్నులు కలువలై మెరిసి
అమృతపు అనుభవాలను
దాచుకుంది.
మధూదయంలో గేలిచేసిన
మధవీ లతలకేం తెలుసు
గతరాత్రి ప్రణయాన్ని పట్టుకున్న
వాడిన మల్లెలే సాక్ష్యం

Monday 12 April 2021

మనవి చిగురుల..ఉగాది



జీవితకాలపు కలబోతల 

వెనుక  బుగ్గనంటిన 

తీపికారాల చేదువగరుల

ముద్దులన్నీ తలపుకొచ్చాయి

చైత్రమాసపు పూల గుభాళింపు

నీ మమతనంతా వొలకబోసింది

మామిడి తోరణాలు ఊగుతూ 

నీకోసం చూస్తున్నాయి

వేప పువ్వు నీ కోపాల

తాపాలను తడిమి పోయింది

చెరకు రసం నీ తీపి కబుర్లను

ఎత్తు కొచ్చింది.

మామిడికాయ పులుపు నీ 

అలకనే గుర్తు చేసింది.

ఎంత గట్టి వాడవో బెల్లమల్లె 

కరిగిపోతావు.

మాయ పన్నిన మనసు నీ 

తలపున తడిచి

ఆరు రుచులను మించిన 

రుచిని వెతుకుతుంది.

వాకిట ముగ్గులు తెచ్చే కళ నీ

ముందు చిన్నబోయింది

పండగంతా నీ నవ్వులోనే ఉంది

ఎన్ని మార్లు ఇది ఉగాదనీ

హృదయాల కలబోతల 

కాలమనీ చెప్పాలీ..

🌺 ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🌺

Friday 9 April 2021

చెదరని హృదయాన్ని..





శిశిరం తాకిన వృక్షానికి తెలుసు 

ఇది శాస్వతం కాదని

అమృతం ఒంపుకుని అందంగా

మెరిసే ఆ చందమామే సాక్ష్యం

ఆ..ఎగిరేవన్నీ కపోతాలే..

ఒక్క నా ఊహ తప్ప

గాలితో కబుర్లు మోసుకొచ్చిన  

పక్షి ఈకను నేను

కలల కోరికల పచ్చదనాన

తొలకరి వానకు తడిచిన 

వృక్షానికి అంటిన అందం

పచ్చని తోటలో పున్నమి వెన్నెల్లో 

పండిన నిండైన రాతిరి

నాలో దాగి మెరిసే నీ రూపు 

నీకూ నాకూ మధ్య నడిమి స్వర్గంలో

మన ప్రేమ మరు మజిలీకి

విసిరికొడుతూ వీగిపోతూ

అలలతో సముద్రం ఆడుకుంటుంది

ఈదే చేపలన్నీ పెట్టే గిలిగింతలతో

నురుగులు కక్కుతూ

బెదిరిపోను, బిడియపడను

నీ రాకకై చెదరని హృదయాన్ని

సిద్ధం చేస్తున్నాను..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...