Thursday 25 February 2021

నా ఊహకు ఊతమై..



ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తానా 

ఎప్పుడో తెలీకుండానే నీ ఊహ 

అల్లుకుంటుంది

వేల ఊహలను కుప్పగా పోసి 

నీ ఊహను కంటాను నేను

వెలుగుపరుచుకోని దారులంట

నీతో ప్రయాణిస్తాను

ప్రకృతి విలాశాన్నంతా 

చూసి మనమూ ప్రేమ పక్షులమై

వేగం తెలియని పరుగులు 

పెడుతూ ఎన్ని మైళ్ళో అలా

ఆ చేల పచ్చదనంలో 

పసుపద్దుకుంటుంది మన ప్రేమ

సూర్యాస్తమయంలో కుంకుమ 

దిద్దుకుంటుంది

మన చెలిమి చూసి త్వరపడి 

కలువలు వికసిస్తాయి

వీచే చిరుగాలికి నా నిదుర 

చెదరి నీలోకి ఒదిగిపోతాను

అలా నిజంలోకి మారానోలేదో

పక్కన నిన్ను వెదుక్కుని వెక్కి

ఏడుస్తుంది హృదయం

నీ కౌగిలి స్పర్శను మరువలేక

నీ జ్ఞాపకాలతో గుబులు పడుతుంది

తోవ తెలియని పక్షికి మల్లే రెక్కలాడిస్తూ

మళ్ళీ నిన్ను వెతకడానికి సిద్ధమవుతాను

Tuesday 23 February 2021

మనసు




ఒకరి చేయి ఒకరం

అందుకుని పరుగందుకోలేదూ
ఏదీ అప్పుడు!
విశ్రమమే లేని పరుగది
నా బద్దకాన్నంతా నీకు బదిలీ చేసి
నీ ముఖపు కాంతిని నాలోకి ఒంపుకుని
నీతో సాగిపోయాను చూడు అప్పటిమాట
మేలుకొలుపులోనూ మళ్ళీ నీవే
ఈ మనసు ప్రతి కదలికకూ మళ్ళీ నీవే ప్రాణం
నీ భుజాన వాలుతుంది గారాలు పోతుంది
ఎక్కడికో నీతో ఎగిరిపోవాలనీ
ఆశ పాపం.. గడిచిన రోజులన్నీ
నావంటుంది..లెక్కవేస్తుంది.
ఆ ఎగిరే పిట్టలపై పాట
కట్టడం ఇదే చేతనవును దానికి
గిరికీలు కొట్టే గాలితో నీకు
ప్రేమ సందేశం పంపుతుంది
మేలిముసుగులో ముఖాన్ని దాచి
నీ పెదవులను అందుకున్నట్టు
కలకంటుంది
రాలిపడే ఆకులమల్లే ఎన్ని కలలో దానికి

Saturday 20 February 2021

నువ్వు నా అనంతానివి



ఆ దారిన పోయినట్టు ఆనవాళ్ళు 

నీ అడుగుల గుర్తులు

మరోమారు చెరిగిపోయి కనిపిస్తాయి

నిన్ను కలిసేనాటికి నేను కాలాన్ని 

పట్టుకుని నీ అడుగులో అడుగునైపోతాను.

నీ ప్రేమకు చిహ్నంగా నీ తలపులతో 

నీడనై నీతోనే ఉంటాను.

ఈ గుండె మీద నువ్వు పరుచుకున్న 

చోటును ఎంతని చెప్పను.

కంగారుగా సాగిపోతున్న 

సాయంత్రానికి నువ్వో ఆస్వాదనవు

తలనిమిరి నుదుటున ముద్దాడినపుడు 

నువ్వో చెలికాడివి

పున్నమినాడు ఆ చంద్ర కాంతిలో 

నీ భుజాన ఆనినపుడు నువ్వు నా అనంతానివి

వేగం తెలియని ఈ ఆలోచనలకు 

కట్టడి నేర్పిన నా సమస్తానివీ

దూరంగా పొద్దు జరిగిపోతున్న చోట 

నిన్ను కలవాలని ఎదురుచూస్తున్న

నేనో చకోరాన్ని..

Wednesday 17 February 2021

నిశ్శబ్దం లోంచి నిశ్శబ్దంలోకి




ఇంత నిశ్శబ్దాన్ని ఎవరు మోస్తారు

సుడులు తిరిగే ఆలోచనలు

నిండుకున్న కోరికలు

నీ చేతుల బిగింపులో 

ఓడిపోయిన దేహం

ఎప్పుడు వినగలనో నీ స్వరాన్ని

నడిరాతిరి నీ తలపుల అలజడిలో

చీకటి పొదల మాటున నిన్ను కల

కంటాను

జ్వలిస్తున్న నా కళ్ళల్లోని 

కాంతులు వెదజల్లే మోము నీదేనా

వేడి నిట్టూర్పుల మధ్య

అలవాటైపోయిన నీ చేతి స్పర్శ

నిశ్శబ్దం అంతా నిశ్శబ్దం

నువ్వున్నావన్న ఆశ

మచ్చుకైనా లేదు

నీ తలపులు వేల వేల ప్రశ్నలై 

వేధిస్తున్నాయి నన్ను

ఈ గుండెల్లోని దిగులు నిశ్శబ్దం లోంచి

నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తుంది

Tuesday 16 February 2021

ప్రియా..ఏవి నీ చేతులు


నిశ్చలమైన నది పై 

ప్రయాణిస్తున్నాను

నదిని దాటి నిన్ను 

చేరాలని ఆశ లోపల

ఈ తెరచాటు పరదాలో నా 

ముఖాన్ని దాచుకున్నాను

శూన్యాన్ని ప్రశన్నంగా చూస్తూ

లోపలి దిగులు నీకు

మాత్రమే చెప్పాలనీ

చీకటిని ప్రశ్నిస్తూ వెలుగు

వెలుగును ప్రశ్నిస్తూ చీకటి

పోటీ పడుతున్నాయి.

నీటి లోపలి

రాళ్ళు నవ్వుతున్నాయి..

చిట్టి చేపల అల్లరి, నీటి బాతుల

ఊసులు చెప్పనే అక్కరలేదు

అక్కడే నేను ఎదురు 

చూస్తున్నాను

ప్రియా.. ఏవి నీ చేతులు 

నన్ను చుట్టేందుకు

గమ్యం తెలీని ప్రయాణంలో

నీ తలపే వెలుగు 

ఈ దేహానికి

నీ కౌగిలే మందు..

Monday 15 February 2021

ఎంతకోత..ఈ హృదయానికి



వంకర్లు తిరిగి గాలితో 

కలిసి ప్రయాణిస్తున్న 

ధూళికణాల మూకతో 

కబురంపాను

ఎంత రొద ఈ హృదయానికి

నీ మౌనంతో ఎంత కోత 

గుండెకు 

కన్నీటితో  వెనక్కువెళ్ళి 

మన మజిలీలను 

కలుపుకుని వస్తున్నాను

బరువెక్కిన మనసుకు 

ఎవరు చికిత్స చేస్తారు

ఎందుకు ఈ అలంకారమో 

నీ చూపు సోకని నా

మేనుకు మెరుపులేదు

నిముషాలకు వెలకట్టి 

నిన్ను ఎత్తుకురమ్మన్నాను

నీ స్పర్శ లేని దేహం 

ఇరుకై నన్ను వేధిస్తుంది

భారంగా జరిగే రోజుతో 

కునికిపాట్లు పడుతున్నాను

ఏమౌతానో తెలీని నీ 

ఆలోచనలతో సావాసం రోజంతా

Sunday 14 February 2021

అడిగి చూడు..



కాలాన్ని లెక్కపెట్టు

ఎన్ని దోసిళ్ళ నవ్వులు

నీకందిస్తుందో

మండిపడిపోతున్న సూరీణ్ణి

కళ్ళప్పగించి

చూసే బలాన్ని ఇమ్మను

తొడిమలేని సన్నజాజులు పెట్టే

సువాసనల చక్కిలిగిలిని 

ఆస్వాదించు

చంద్రుడు గిల్లిన వెన్నెలను

అడుగు

మనసెన్ని సార్లు పారేసుకుందో

ఎర్రగా పండిన తాంబూలాన్ని అడుగు

ఎవరి మనసు పండించిందో

విచ్చుకున్న పూరేకుల అందాలను

గిచ్చుకుపోయే తుమ్మెదనడుగు

ఆ ఆత్రం ఎందుకనీ

నీ నీలి కన్నుల్లో దాచిన నా 

రూపాన్ని అడుగు

ఎప్పుడు ప్రేమ పుట్టిందనీ

Saturday 13 February 2021

అప్పుడే...



ప్రేమకబుర్లు, విరబూసిన నవ్వులు

నిన్ను ప్రేమించడం తెలియని కాలంలో

ఎవరు వెలిగించారీ ప్రేమ జ్యోతిని

మిరిమిట్లు గొలిపే కాంతి కిరణం నన్ను

వెతుక్కుంటూ వచ్చిన క్షణాన

ఎవరది? నిదురే తెలియని 

నా కన్నులను ముద్దాడింది

ఏకకాలంలో మనం 

కల్పించున్న ఏకాంతంలో

నీ ఒడిలో తలవాల్చి 

ఓ కమ్మని కల కంటాను

నీరూపానికి నా రూపాన్ని 

ధారపోస్తాను

ఆ కలలల్నీ బిడ్డలై రేపటిని 

మన చేతికిస్తాయి

అప్పుడే..

ఎదుటనున్న కాలమంతా 

ఏకాంతపు క్షణాలేననీ

నిన్ను నమ్మిస్తాను

చెట్లపొదలమాటున మన 

సమావేసాలు చాలించి

నేను అల్లుకున్న గూటిలోకి 

నిన్ను ఎత్తుకుపోతాను

Friday 12 February 2021

ఏది కల?






చలి సాయంత్రాలు 

నిశ్శబ్దపు లోతులు

వెలుగు పరచుకోని మూలలు

ఈ ఏకాకి జీవితంలో

నా రోజును సగానికి నరికేసే 

నీ ఆలోచన ముందు 

పెదాలనంటుకున్న పసినవ్వు

రాలిపడే ప్రతి ఆకుపైనా 

గతకాలపు మరకలు

జీవం తెలియని ఈ మేను 

పై నీ సంతకం

వీళ్ళంతా అంటారుకదా 

నేను కలగంటున్నాననీ

ఏది కల?

జోరుగా వీచే గాలికెరటాలకు 

ఊగిసలాడే ఈమనసుకు 

అంటుకున్న నీ పరిమళం

నా చుట్టూ వ్యాపించినపుడు

నీ చేతి స్పర్శకు నేను తడబడినప్పుడు

రెండుగా చీలిపోయే ఆలోచనలతో

ఒక్క క్షణం కాలం ఆగిపోయి 

మళ్ళీ సర్దుకుంటుంది

Thursday 11 February 2021

కలలాంటి నిజానివి.



నిద్దురలో కలగనడం..

మళ్ళీ మేలుకోవడం

ఒక్కోసారి నువ్వు నిజమనిపిస్తావు

చేతిలో చెయ్యి వేసి నిమిరినంత సుఖం

మాటల వరాలు కురిపిస్తావు

కలలోకి లాక్కుపోతావు

కరిగిపోయేదంతా కలే అయినా

నువ్వో నిజానివి నాకు

నా నిదురంతా ఆక్రమించి నిర్దయగా

చెరిగిపోయిన కలను కాసేపు 

తిట్టుకుంటాను

అసహ్యించుకుంటాను

కఠినంగా మారిపోతాను

Tuesday 9 February 2021

బావున్నావా?


ఏం చెప్పాలో తెలియనితనంలో నువ్వు

గుర్తొస్తావు..గుబులు పెడతావు

సాయం సంధ్యలో నిన్ను చూస్తాను

ఆ గన్నేరు చెట్టుకింద బుగ్గనిమిరి నన్ను

ముద్దాడావే..అదే గుర్తు తెచ్చుకుంటాను

మందారమంత నవ్వు నవ్వేసి ముఖం తిప్పుకుని

వెనక్కు వాలినపుడు

అచ్చం అలాగే ఇప్పటికీ నువ్వు గుర్తు

సిగ్గుగా పైట సవరించుకుంటూ

తల పైకెత్తి చిరు నవ్వును

పెదాల మాటున దాచుకుంటూ

ఓర కన్నులతో నన్ను చూసింది

ఏలా మరిచిపోనూ

ఎప్పుడూ నన్ను వెంటాడే ఓ కల అది

కలలాంటి మైకం కమ్ముతుంది నిన్ను తలచినపుడు

పైరగాలిలా మనసు పసిదాని పరుగులందుకుంటుంది

నీలి మబ్బుల మేలి ముసుగులో నువ్వు చేసే

సవ్వడి ఈ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది

నీ ఊహలన్నీ కుప్పగా పోసి చూసుకుంటాను 

బావున్నావనుకుంటాను మనసులో 

ఏలావున్నావు!

Monday 8 February 2021

మంత్ర నగరం వీధుల్లో నేను


తెరచిన కిటికీ లోంచి చూస్తున్నాను 

చలికి ముడుచుకున్న మనుషులు

ఇరుకు గుండెకాయలు

నిశ్శబ్దపు మధ్యాహ్నాలు ఇవే కనిపించాయి

పసికళ్ళల్లో ధైన్యం

చుట్టూ గిరికీలు కొట్టే గాలి, చాపలా పరుచుకున్న ఆకాశం ఇవే చూడగలిగాను

గగుర్పాటు తెచ్చిన దిగులు

స్పృహ కోల్పోయిన నీడలు ఇవే ఆనాయి

మకిలి పట్టిన ముసలితనం

కాంతిని తీసుకోలేని వీధి వాకిలి ఇవే ఎదురుపడ్డాయి

మంత్ర నగరపు వాసనలు వేస్తూ 

రెక్కలు కొట్టుకునే ఈ పావురాళ్ళ నగరానికి నేను బంధువును

ఎవరెవరో వస్తారు

ఓ చెదిరిన కలను కని వెళ్ళిపోతారు

గాలి జాడలు లేని ఊరికి దూరంగా వచ్చాననీ

మెలకువ రానంత దాకా తెలీలేదు నాకు

Sunday 7 February 2021

ఓమారు వచ్చి పోతావా

 

ఏకకాలంలో రెండు ప్రయాణాలు 

చేస్తుంది మనసు

నీ జ్ఞాపకాలను గుండెకు 

అదుముకుని ప్రయాణిస్తుంది

నిదురించే కన్నులతో పసి 

కలను కంటుంది

ముంగురులను సవవరించుకుని 

తలెగరేస్తూ గీరపోతుంది

మరోమారు ఇటుతిరిగి..

నువ్వెవరో తెలీదంటుంది

నంగనాచి మనసు..వెక్కిరిస్తుంది నిన్ను

చూసి పైకి నవ్వుకుంటుంది..

లోపల ఏడుస్తుంది

ఎవరికి చెప్పుకోగలదు..

నిన్ను అట్లాగే గుండెల్లో పొదుముకుంటుంది

రెప్పలువాల్చి మనకబార్చుకుని 

నీరూపానికి ప్రాణం పోస్తుంది

ఎన్నిచేసినా నువ్వు అల్లిన దూరాన్ని 

మాత్రం మాపలేదు కదా

పుస్తె కడతావని కలవరిస్తుంది..

పెనివిటివి కావాలని ఆశ పాపం

ఆరుగదుల ఇల్లు అక్కరలేదట..

నీ గుండెగది చాలంటుంది

గుండెల్లో గూడల్లుకుని 

నీతో కాపురముంటుంది

నిన్ను ఇబ్బంది పెట్టి తను 

ఇబ్బంది పడుతుంది

సన్నటి గాలి గదినంతా పలకరిస్తే 

నీ ఒంటి వాసనను వెతుక్కుంటుంది..

ఆ గాలితో ఓమారు వచ్చి పోరాదూ..

Saturday 6 February 2021

ఓమాట చెప్పనా..


ఎన్ని పొద్దులో దాటిపోతున్నాయి

పగళ్ళురాత్రుళ్ళుగా 

విడిపోతున్నాయి

నీ అన్వేషణకు అంతంలేదని తెలిసి 

దిగులెరిగిన హృదయాన్ని 

బుజ్జగించాను 

ఆ చుక్కల మాటున నక్కిన చంద్రకాంతిలో వెతుకుతాను నిన్ను

వెర్రి కదూ నాది..

అర్థంతరంగా వాలిపోతున్న కాలానికి 

ఆనవాలుగా మిగిలామేమో మనం

ఎప్పటిమాట ఇది.. 

యుగాల నాటి చెలిమికదూ మనది.

గాలి తరగల చల్లదనానికి ఒణుకుతున్న 

మేనుతో ఎన్ని ఏకాంత క్షణాలను ఖర్చు చేసాను

తనివితీరా నీ స్పర్శను అనుభవించి 

తీరాలనే కాంక్షకాబోలు

నీ జ్ఞాపకాలతో నిండిన సమక్షాన్ని 

కలగంటూ చీకటిగొన్న రహదారుల్ని దాటి

ఆ నది ఒడ్డున నీ జాడలను వెతుకుతున్నాయి కళ్ళు

నీ ప్రేమతో చిరునవ్వును నింపుకోవడం 

తెలిసిన ఈ హృదయానికి నిన్ను 

దాచుకోవడం తెలీదంటావా

నా స్వప్నన్ని కూడా నీ తలపు 

ఆక్రమించేసింది తెలుసా!

Friday 5 February 2021

మసకబారిన రూపానివి


ఈరోజు నీ జాడను వెతుకుతూ

ఎక్కడెక్కడో తిరిగింది మనసు

ప్రతిచోటా గంభీరంగా నిలబడే 

అక్షరాలను వెంట తెచ్చుకుని 

నిన్ను కూర్చింది

మంచుబిందుల అలంకారాలతో 

మెరిసిపోతున్న గడ్డి పొదల మాటున 

గతకాలపు నీ జాడను వెతికింది

చెట్టు ఆకుల చివర్ల చిందే 

చినుకులను ఒడిసిపట్టి మనం

ఆడిన ఆటలను గుర్తుచేసుకుంది

ఇద్దరం తిరుగాడిన దారులన్నీ 

మసకబారి కనిపించాయి ఇప్పుడు

కొత్తగా పంచుకునేందుకు నీ ప్రేమ 

తరగలు కనిపించలేదు మరి

జగడాలాడే నీ మాటిప్పుడు మచ్చుకైనా 

గురుతులేదు. ఎంత పాతబడిపోయాయి 

నీ జ్ఞాపకాలు

నీ స్పర్శను అనుభవించిన ఈ దేహం..

ఇప్పుడు నీ జాడలన్నీ కలిపి ఓచోట 

ముద్రిస్తుంది నీ రూపాన్నీ..


Thursday 4 February 2021

మనసు..


ప్రేమ గాఢత తెలిసిన

లోపలి స్వరమిది

గాఢంగా పెనవేసుకున్న 

ఈ ఒంటరితనంతో ఎంత చిక్కనీ

నేలను తాకే వాన చినుకుల్ని 

లెక్కకడుతూ 

ఆ తడిగడ్డి మీద గతకాలపు 

నీ అడుగులను వెతుకుతుంది మనసు

అడివిని ముసురుకున్న 

పొగమంచు చందాన

గాలికి ఊగే గడ్డిపూల 

పరిమళాన్ని పట్టుకోవాలనేంత 

పేరాశ కదూ

నిన్ను వెతకడం అంటేనూ

పగలల్లా ఇంతే

నువ్వు విసిరిన నవ్వుల జాడలే 

ఊహలకు ఊతాలు

రాత్రికి వెన్నెలకు మగ్గిన 

చందమామ సాయంతో నిన్ను 

పట్టుకోవాలని చూస్తుంది మనసు

ఎంటో ఈ వెతుకులాట

నాలోకి తొంగిచూసి మరీ 

నీ జాడను పట్టుకుంది.. 

ఈ ఏకాంతంలో మనసు 

ఎంత నంగనాచిదో కదూ

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...