Saturday 29 July 2023

చలం తలంపై నేను.. (శ్రీశాంతి మెహెర్)





చలం సాంగత్యం ఉదయం పూట నాకు కొత్తకాకపోయినా, ఈరోజు ప్రత్యేకంగా చలాన్ని మనసుకు హత్తుకున్న ఫీలింగ్ కలిగింది. అతను మరింత దగ్గరగా అనిపించాడు. మెహెర్ వాక్యాలు ఎప్పుడో చదివేసిన అనుభూతి కలిగింది. గతంలోనే అమీనాపై మెహెర్ వ్యాసం రాసినా, ఇప్పుడే మొదటిసారి చదివాను. మామూలు నా రద్దీ సమయంలో ఆ వ్యాసాన్ని చదవబుద్దేయలేదు. చక్కని ప్రశాంత ఉదయంలో చలాన్ని ఆకళింపు చేసుకోవడం నిజంగా గొప్ప అనుభవం. 



అలాంటి రచనను అందులోని అద్భుతమైన ఘట్టాలను, వ్యాక్తులను, పాత్రలను తలుచుకోవడం అదీ ఉదయంలో నాకు చాలా మంచి అనుభూతిని ప్రసాదించింది. మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఒక్కద్దాన్నే కూర్చుని చదివాను. అచ్చులో లోపాలను వెతికేందుకు చదువుతున్నానన్న మాట మరిచిపోయాను. చలం తనలోకి లాగేసుకుంటాడు. నాకు అర్థం అయిన అతని రాత తాలూకు స్పర్శ అలాంటిదని నా అభిప్రాయం. అతనితో అతని రచనతో కలిసిపోవడం బావుంటుంది. అమీనాలో అతను చూసిన అమాయకత్వాన్ని, ఆమె మీద ఇష్టాన్ని, ప్రేమని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు, చూపించలేకపోయాడనే ఆలోచన నాకు అస్తమానూ కలుగుతుంది. అదే ఈరోజూ కలిగింది. సంఘం కట్టుబాట్లను పట్టించుకోని చలం, గౌరవమైన ఉద్యోగం అంటాడు.. కట్టుబాట్లలో లేని వాడికి ఉద్యోగం మీద అంత మమకారం ఎందుకో అర్థం కాలేదు. కట్టుబాట్లను తెంచుకున్నవాడిలా పూర్తిగా లేనందుకు విచారం అనిపిస్తుంది. అతనిలోని ఏ క్వాలిటీ అయితే నాకు నచ్చుతుందో ఆ అరాచకత్వానికి పూర్తిగా లోబడకుండా ఏదో తెగని బంధంతో అటు ఇటు ఊగిసలాడుతున్నట్టుగా ఉంటాడు. ఏమో మొత్తం తెంపుకువెళిపోతే అతగాడు బైరాగి అయ్యేవాడేమో.. తెలీదు. కానీ చలాన్ని అలా పరిస్థితుల మధ్య నలిగి, తెగతెంపులు చేసుకోలేని వ్యక్తిగా అతని మథనాన్ని చూడటం కాస్త చివుక్కువనే సంగతే నాకు. 



కుటుంబం, బిడ్డలు, ప్రేమలు, ఉద్యోగం అనే సంకెళ్ళు కూడా ఉండకుండా ఉండి ఉంటే చలాన్ని ఎలా చూడగలమో అనే ఆలోచన కలిగినపుడు నవ్వు వస్తుంది. నేను అలా చూడలేననే విషయం స్పురణకు వచ్చి నన్ను యావగించుకుంటాను. నలుగురు చూస్తారని, సభ్యతగా ఉండడానికి ప్రవర్తించే నేను.. చలాన్ని ఎందుకు తెంపుకు పొమ్మంటున్నానా అని.. నిజానికి మనం చాలావాటికి బద్ధులం. చాలావాటికి లోబడే బతుకుతాం. కానీ మన రచయితలు, మన హీరోలు అలా ఉండకూడదని కోరుకుంటాం. ఇది మనసు చేసే యాగీ.. పైకి కప్పుకుని తిరుకుతాం కానీ లోపల ఎప్పుడూ ముల్లుగా గుచ్చుకుంటూనే ఉంటుంది. 



నిజాన్ని అబద్ధంగా మారుస్తూ, అబద్ధాన్ని నిజంచేస్తూ,, లోపల గింగిర్లుతిరిగే ఆలోచనలకి నవ్వును పులిమేసి బయటకు బట్వాడా చేస్తూ రోజులో ఎన్ని రంగులు మారుస్తామో.. కదా.. నా వరకూ నేను చాలా ఆలోచనలను, చిలిపి తనాన్ని లోపలే కుక్కేస్తూ ఉంటాను. క్షణకాలం నాలా ఉంటే.. ఎన్నో సమయాలు నాలా ఉండను. రోజులో నన్ను నేను వెతుక్కునే తరుణంలో ఎన్ని ముసుగులేసుకుంటూ ఉంటానో.. ఎందుకో చలాన్ని చదివితే ఈ ముసుగు విప్పదీసి బయటకు బలంగా వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ రద్దీ అని ప్రశ్న వేసుకోబుద్దవుతుంది. చాలా హడావుడిగా భూమిమీదకు బట్వాడా అయిపోయి పొడిచేసింది ఏమిటనే ఆలోచన ఇంకా లోతులోకి భూమిలోకి కూరుకుపోయేలా చేస్తుంది. ఏమో ఉదయం చలాన్ని పలకరించాకా.. బండి మీద ఆఫీసుకు వస్తూ ఇంకా బలంగా ఆలోచించాను. అతన్ని నా బండి వెనుక సీటులో బరువుగా ఎక్కించుకుని తీసుకువచ్చినట్టు అనిపించింది. కానీ ఇప్పుడో వాక్యాల్లో తేలిపోతున్నాడు. ఆ బరువు ఇప్పుడు లేదు. ఉద్యోగపు రాపిడిలో, ఒత్తిడిలో ఉదయం ఉన్న అతను ఇప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్యాసంలో కూర్చున్నాడేమో.. సాయంత్రం మరోమారు చదవాలి. 

Friday 7 July 2023

హృదయమా..!




ఒంటరితనంతో హృదయం కాచుకున్నప్పుడు

నీ వలపు గుర్తుకొచ్చినపుడు

నేనా ఆలోచనలో ఉన్నప్పుడు

ఈ ఏకాంతాన్ని నీడ కప్పేసినప్పుడు

నీ ఆలోచన చుట్టుకుంటుంది.


చిగురు కొమ్మను పలకరించినట్టు

మొగ్గ తొడుగు విడినట్టు

పూల సువాసనలు గాలిని పులుముకున్నట్టు

ఇటుగా వచ్చి పలకరించే 

మనిషి నీవే కావాలనుకుంటాను.


అట్లా కూచుని గాలికి గుమ్మంలో 

ఊగే చెట్టు ఆకుల్ని చూస్తున్నప్పుడు 

దీపాన్ని దాచుకోవాలనే 

ఆలోచనలో తెల్లవారుతున్నప్పుడు

హృదయమా..! 


ఈ మనసుకు వచ్చి అతుక్కునే 

ఆలోచనల్లో నువ్వూ 

జతౌతావు.

Wednesday 5 July 2023

ఏం అర్హతలుండాలో చెప్పు కాస్త..



నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయని

కాసేపు కూర్చుంటే నీ ఆలోచన అల్లింది


నలుపు చారల చీరలో ఆమె ఎదురైంది

అలసిన ముఖం, చెమటకు కరిగిన కుంకుమ

అచ్చం నువ్వు చెప్పిన పాత్రలానే ఉంది ఆమె


కుచ్చిళ్ళను ఓ చేత్తో పట్టుకుని, కాలి పట్టీలు 

మోగిస్తూ నాలుగు అంగల్లో నన్ను దాటుకు

వెళ్లింది.


నలుపుదనం, పసుపు పాదాలు, నుదుట కుంకుమ

మైదానంలో కలిసుంటానా ఆమెను

లేక అనసూయనా, సులోచనేమో

గుర్తురావడం లేదు. 


నీలా అల్లిక నాకు కుదరదు కానీ

నీ చూపు ఆమెను తాకి అక్షరమైంది కాబోలు

నేను అచ్చంగా పట్టుకోలేకపోయాను. నీ కథానాయిక

పోలికలు నాకు పాత్రపరంగానే తెలుసు. మరి నువ్వో కళ్ళతోనే స్కేన్ చేసి రాసి ఉంటావు.

 

ఏం మాయ చేస్తావో.. ఆ పాత్రలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తెలీదు. నిజంగా ఉన్నారా ఇక్కడ? లేక దేవలోకంలోంచి పట్టుకొచ్చావా?  నీకథల్లో పాత్రలయ్యేందుకు, నీ కథలో కథానాయిక కావాలంటే ఏం అర్హతలుండాలో చెప్పు, ఈసారి సరిగ్గా పట్టుకుంటాను. వెతుకుతాను. ఏ దేవాలయానికో వస్తుందేమో.. సరేనా.

Sunday 2 July 2023

నొప్పి తెలియని ప్రయాణం కావాలి





ఈదుకుంటూ గడిచిపోతున్న 

కాలం కొలనులో గాలం వేస్తే

నేనే చిక్కాను.


ఒంటరి కాగితం పడనై

తేలుతూ, ఈదుతూ

ఆకాశాన్ని అందుకుంటాననే ఆశతో

పోతున్నాను పైపైన ఊగుతూ..


గురుతుపెట్టుకున్న దారులు లేవు

ఒకటే ప్రయాణం, సాఫీగా చేరాలని

ఈలోపు నీళ్ళు పడవలోకి రాకూడదు.

నొప్పి తెలియని ప్రయాణం కావాలి.


వాన చినుకులకు నానకూడదని, 

అసలు వానే రాకూడదని

మొక్కుతూ, ఊగుతూ ప్రయాణిస్తున్నాను.

ఒడ్డుకు చేరిపోతే చాలు

ఊపిరి బిగబట్టే బాధ తప్పుతుంది. 

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...