Tuesday 13 December 2016

మా సుబ్బయ్యగారింట్లో దొంగలు పడ్డారు.




ఓ పక్కగా తెల్లారిందో లేదో ఈ వార్త వినగానే ఉలిక్కిపడ్డారు పెద్దోళ్ళంతా. పొద్దున్నే ఊడ్చి, కళ్ళాపి జల్లి, పొయ్యిలెలిగించే ఆడాళ్ళయితే, జుట్టుముడి ఊడిపోయినా పట్టించుకోకుండా ఓ గుంపుగా చేరిపోయి ఆ గొడవే మాట్లాడేసుకుంటున్నారు. అయ్యో పాపం ఇరవైతులాల బంగారం, నలభై వేలరూపాయల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇంకా ఏం ఎత్తుకుపోయారోనమ్మా సచ్చినోళ్ళు” “సుబ్బయ్యగారు బాగానే సంపాదించాడులే, పార్వతమ్మ ఓ వెలుగు వెలిగింది. అంతా పోయే ఉంటాది.” “పోతేపోయింది రేపట్నుండి మనల్ని అప్పులడగకుండా ఉంటే నయ్యంఅంటూ మూతులు తిప్పుకుంటా, మనకెందుకొచ్చిన గొడవలే అంటా సాగదీసుకుంటున్నారు.

 ఇక మగాళ్ళయితే పంచలెగ్గట్టి ఒకరి తరువాత ఒకరు రచ్చబండ మీద మీటింగులెట్టేసారు. పాపం సుబ్బయ్యగారు ఎంత దజ్జాగా ఉండేవోడు. యాభై తులాల బంగారం, లక్షరూపాల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇకపోయిన సొమ్ముతోనే ఆయన దజ్జాకూడా పోయినట్టేరా ఎంత కష్టం వచ్చింది ఆ కుటుంబానికిఅనుకుంటూ తెచ్చిపెట్టుకున్న బాధతో తెగ జాలిపడిపోతున్నారు.

తెల్లారినంతనే ఏదో ఉపద్రవం వచ్చిపడిపోయి ఆరోజు బడి ఎగ్గొట్టేయాలని రాత్రే దేవుడికి తెగ దండాలెట్టేసి పడుకున్న నాలాటోడికి, ఏ ప్లాన్లు గీయకుండానే పాచిక పారినట్టయింది. ఈ వార్త మా పాలిటి ఓ కులాసా కబురే అయింది. ఏదో అర్జంటు రౌండు టేబుల్ సమావేశమున్నట్టు పిలకాయలంతా కూడా మా చిన్నగాడింటి ముందున్న గానుగచెట్టుకింద కలిసేసుకుని మాలో మేమే తెగ మల్లగుల్లాలు పడిపోతున్నాం. ఎక్కడా పెద్దోళ్ళకు తీసిపోకూడదని.
పాపంరా చిట్టి రోజుకో మంచి పావడా కట్టుకొచ్చేదల్లా ఈకాడ్నించీ సినిమాలో చూపించినట్టు పాచ్చీలేసిన గౌనులు
కట్టుకొస్తుందా ఏం”.

సుబ్బయ్యగారి మనవరాలు చిట్టి (చారులత) మాతోడిదే. పక్కనున్న బడిలో నా తరగతిలోనే ఆరు చదువుతుంది. మంచి తెలివైన పిల్లలే. పాపం ఎంత కష్టం వచ్చిందో కదా పలకరించి రావాలిఅన్నాను. మా చిన్నాగాడు నా మాటకడ్డొచ్చి చాల్లే పాపం దేశం మీద నీ ఒక్కడికే వుందిమరి జాలి. అసలు మీకు తెలుసా ఇప్పుడేం జరుగుతాదో, మా నాన్న చెప్పాడు ఇప్పుడు వాళ్ళింటికి పోలీసోళ్ళొత్తారంటా అక్కడ ఉన్నవాళ్ళల్లో అనుమాన మొచ్చిన ప్రతీ వాడినీ జీపులో ఏసుకుపోతారంట తెలుసా వద్దు ఎవరూ ఎల్లకండిఅన్నాడు. నిజమే అని మాలో ఎవరం ఎల్లకూడదని ఓ తీర్మానం చేసుకున్నాం. భోజనాల వేళకి ఈ కబురు మా పాలకొల్లు పెదబ్రిజ్జీ దాకా పాకిపోయింది.
రోజూ బడికి రాగానే తను తినడానికి ఏ మిఠాయి తెచ్చుకున్నా నాకు పెడుతుంది చిట్టి, అలాటిది తనకి ఇంత కష్టం వస్తే నేను మిన్నకుండిపోయానా పాపం కదూ ఎలాగైనా ఎల్లాలి అనుకున్నాను. ఇక ఆలస్యం చేయకూడదని నేను మా పెరడెనక సందులోనుండీ సుబ్బయ్యగారింటికి బయలుదేరిఎల్లాను. మా చిట్టి వాళ్ళిల్లు మా అందరిళ్ళ మాదిరిగా పాక కాదు పెద్ద డాబా ఇల్లు. కొట్టచ్చినట్టు కనబడేది మా వీధిలోకే ఆ ఇల్లు. ఇలా గుంటే మరి పడరా దొంగోళ్ళుఅనుకున్నాను మనసులో.

నేనెళ్ళే సరికి ప్రెసిడెంటు రాయుడుగారు పదిమంది నేసుకుని అప్పటికే సుబ్బయ్యగారింటికి బయలుదేరిపోయాడు. ఆళ్ళు ఇంట్లో కెళ్ళకుండా కాస్త దూరంగా మాటాడుకుంటున్నారు. ఇప్పటిదాకా కూడబెట్టిందంతా పోయిందంటా! పాపం ఏం వత్తాడు బైటకు. ఎవరో ఆనూపానూ చూసుకునే చేసారీ దారుణం. ఈ రోజు ఈ ఇల్లయింది రేపు మన ఇల్లుకాదనేంటి గేరంటీ. అయినా డబ్బున్నాదికదా అని మరీ అంత డాబుసరికి పోకూడదు. కాస్త అణిగీ మణిగీ ఉండాలి. మరీ అంత మిడిసిపడితే ఇదిగో ఇలాగే ఉంటాయి పరియవసానాలు. తెలిసిందా”... ఇదీ పెసిడెంటుగారి మీటింగు సారాంశం.

ఆ మాటలు నన్ను మరింత కంగారు పెట్టేసాయి ఓ పరుగందుకుని చొరవగా లోపలికెళ్ళాను చిట్టికోసం. ఇంట్లో పెద్దోళ్ళంతా చాలా కంగారుగా దేనికోసమో వెతుకులాడుతున్నారు. అప్పుడే లేచింది కాదోలు చిట్టి ఇంకా మత్తుగానే ఉంది చూపు. ఏం చిట్టి ఏం జరిగిందిఅన్నానో లేదో పెద్దగా ఏడుపు లంకించుకుంటూ సోఫాలో కూచుండిపోయింది.
పాపం అంతా పోయిందని ఏడుస్తుంది. నిజంగా చానా కష్టమొచ్చింది మా చిట్టికిఅనుకున్నాను మనసులో. దగ్గిరికెళ్ళి పక్కన కూచుని బాధపడకు చిట్టీఅన్నాను. కానీ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళుగా ఏడ్చేస్తుంది. ఎక్కిళ్ళ మధ్య ఆపుకుంటూ చెప్పింది నిన్నే పెరళ్ళో మట్టి కలుపుకుని ఎంతో బాగా చేసుకున్నాను. కిరీటం మురళీని. అచ్చం ఎంత బాగా వచ్చాయో తెలుసా. బంగార్రంగు సిగరెట్టు కాయితం అంటించి రోజంతా మేడ మీద ఎండబెట్టుకున్నాను. అక్కడే ఉంచేసినా పోయేది. అమ్మకి చెప్పి ఆ డబ్బులపెట్లో దాయమని ఇచ్చాను. దొంగెదవలు నా బంగారం ఎత్తుకుపోయారు.అని బోరున అందుకుంది.

ఇంట్లో వాళ్ళు చిట్టి వైపు అదోలా చూస్తూండిపోయారు. ఆళ్ళ ముందు చిట్టిని ఓదారిస్తే నన్ను పట్టుకు కొడతారనిపించి నోర్మూసుకుండిపోయాను.

Saturday 3 December 2016

అందుకే నేనటుగా వెళ్ళను.





ఊహతెలిసాకా నా తొలి జ్ఞాపకం నాన్నగారి వేలు పట్టుకుని నడుస్తున్నాను. ఎక్కడికో తెలీదు. తెలతెలవారుతుంది. మంచాల పై నుండీ నిద్రను వదిలించుకోని జనం. పాచి ముఖాలతో వాకిళ్ళు ఊడుస్తున్న ఆడవాళ్ళు. పాల సైకిళ్ళు. నాన్నగారిని దారంటా అంతా పలకరిస్తున్నారు. ఆయన  చాలా వేగంగా నడుస్తుంటే ఆయన్ను అందుకోవాలనే నా ప్రయత్నం.
  • *  *  *

సాయంత్రం అవుతుంది, పెద్ద చెరువు, దాని గట్టు చుట్టూ ఎతైన కొబ్బరి చెట్లు, పిట్టల కూతలు, వాతావరణం చల్లగా ఉంది. సంతోషి మాత గుడిలో ప్రసాదం కోసం పార్కు బెంచీ మీద కూర్చుని గుడివైపే చూస్తున్నాం నేను, చెల్లి. గుడికి కాస్త దూరంలో పశుల ఆసుపత్రి. కటకాల గదికి పెద్ద తాళం కప్ప వేళాడుతూ ఉంటుంది ఎప్పుడూ. మేమొచ్చిన దగ్గరనుండీ ఓ రెండు మార్లు చూసుంటాను డాక్టర్నిఅంతే.

ఈ ఆసుపత్రికి కాస్త దూరంలోనే ఉంటాం మేము. మొదటిసారి  ఈ వీధికి అద్దె ఇంటికోసం వచ్చినపుడు, "పెద్ద అరుగుల ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందండి ఓసారి కనుక్కోండి" అన్నాడు పోస్టుమాస్టారు. అంతే నాన్నగారు నన్ను తీసుకుని ఇటుగా వచ్చారు. అదే నేను చేసిన పెద్ద తప్పని చాలాసార్లు ఫీలయ్యాను. లేదంటే ఎవరు రాకాసి పాపమ్మ ఇంట్లో అద్దెకుంటారు.

ఆరోజు నాన్నగారితో ఆలమూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే,  మంచాలు వాకిట్లో వేసి, వాటి మీద కొబ్బరిచిప్పలు ఆరబెట్టి ఉన్నాయి. ఇల్లంతా కొబ్బరి చిప్పలే. ఇల్లు చూడడానికి వచ్చిన మాకు కూడా చిన్న చంబులతో కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. నాకు కొబ్బరి నీళ్ళంటే చాలా ఇష్టం. సరే ఆడుకోవడానికి ఎదురుగా పెద్ద స్థలం ఉందికదాని, నాన్నగారు "ఇల్లు బాగుందా" అని అడగగానే "ఆఆఆ బాగుంది నాన్నగారు" అనేసాను. కానీ పాపమ్మ పరమ గయ్యాళి. ఆ సంగతి అప్పుడు తెలీలేదే. మేము బారెడు పొద్దెక్కేదాకా నిద్ర లేవమని, రెడియోకి అతుక్కుపోతామని, ఎప్పుడూ అల్లరి చేస్తామని, ఓఓ తిడుతూనే ఉండేది. అమ్మకు ఆమెకూ ఎప్పుడూ గొడవలే.

 మా అల్లరి భరించలేక ఇల్లు ఖాళీ చెయ్యమన్నపుడు, ఆవిడతో అమ్మ చేతులూపుతూ వాదులాడటం  ఇప్పటికీ లీలగా గుర్తుంది. కొత్త ఇంటికి వచ్చేసాం గానీ, శుక్రవారం నాడు పెట్టే సంతోషిమాత ప్రసాదం మీదనే ఉండేది మనసు. ఇంటి ఎదురు పార్కులో నా నేస్తాలతో ఆడుకోలేకపోతున్నందుకు, తెగ బాధ పడిపోయేదాన్ని. ఎన్ని ఆటలాడుకున్నానో ఆ పార్కులో.

కొన్ని జ్ఞాపకాలు ఎంత వయసొచ్చినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలు నాకు కాస్త ఎక్కువే. ఎందుకంటే నేను జ్ఞాపకాలతోనే ఎక్కువ కాలం గడుపుతాను గనుక. కొన్ని లీలగా గుర్తుంటే, మరికొన్ని చాలా బలంగా, గాఢంగా గుర్తుండిపోయాయి. బాల్యం దేవుడు నాకిచ్చిన వరం. అందులో ఎందరి ముఖాలో, భుజాలపై చేతులు వేసుకుని తిరిగిన స్నేహితులను, ఆటలాడుకున్న బడిని, గుడిని, కోనేరును, ఉయ్యాలలూగిన మర్రిచెట్టును ఎప్పటికీ మరిచిపోలేను.

"you may forget your childhood, 
but your childhood does not forget you"- michael dibdin


చాలాసార్లు అనిపిస్తుంది ఈ జ్ఞాపకాలను వెతుక్కుంటూ, మళ్ళీ ఆ పరిసరాలకు వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. మళ్ళీ కాస్త భయం వెనక్కులాగుతుంది. ఏమో నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఊరు తన రూపు మార్చుకుని, అప్పటి పెంకుటిళ్ళ స్థానంలో నేటి కాంక్రీటు భవనాలు రావచ్చు. మా బడి పడగొట్టి, పెద్ద ధాన్యపు గొడౌనే కట్టచ్చు. నా చిన్ననాటి జ్ఞాపకాల తెరలో వచ్చి చేరే కొత్తమార్పులను నేను ఎప్పటికీ స్వగతించలేను. ఆ జ్ఞాపకాలన్నీ నా మనుగడ ఈ భూమి మీద ఉన్నంత వరకూ ఓ మధుర స్వప్నమల్లే నిలిచిపోవాలనే కోరుకుంటాను. అందుకే నేనటుగా వెళ్ళను.




















Friday 25 March 2016

“చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్


నిన్నటి తరం రేడియో అభిమానులను తన స్వరంతో అలరించి, శ్రవ్య నాటకాల ద్వారా సాహిత్యంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. - శ్రీశాంతి దుగ్గిరాల


1. మీ తల్లితండ్రులు, తోబుట్టువులు, బాల్యం, గురించి?

మాది చాలా పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ములూ, నలుగురు అక్కచెల్లెళ్ళం. మా నాన్నగారు ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసారు. మాలో అన్నదమ్ములంతా పెద్దవాళ్ళు. మగపిల్లలు త్వరగా చేతికందిరావాలని వారిని చదివించడంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు. నేను కూడా బాగా చిన్నతనంలో స్కూలుకి వెళ్ళాను కానీ తర్వాత మా నాన్నగారు ఇంటి దగ్గరే చదువు చెప్పించారు. నాన్నగారికి బదిలీలు ఎక్కువగా అయ్యేవి. దానివల్ల మా చదువులు సరిగా సాగేవి కాదు. ఊరు మారినప్పుడల్లా కొత్త ఇంటి తో పాటు ఓ డాక్టర్ని, సంగీతం మాస్టారుని కూడా చూసేవారు నాన్నగారు. ఇక ఆడపిల్లల చదువుల విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఆయన. కానీ మేము తణుకు వచ్చే సరికి, అప్పటికి నాకు పదీపదకొండేళ్ళు ఉంటాయి, మా అమ్మ గొడవ పెట్టి అక్కడి బాలసరస్వతి స్త్రీ సమాజం అనే పాఠశాలలో చేర్పించింది. నన్ను మా చిన్న చెల్లినీ పంపారు. అక్కడ నా చదువు మరో మూడేళ్ళు సాగింది. అక్కడే నాకీ నాటకాలతో పరిచయమయింది. తోటి ఆడపిల్లలతో స్టేజి మీద చిన్న చిన్న నాటకాలు వేసేదాన్ని. అక్కడే నాకు హిందీ బాష కూడా అబ్బింది. హిందీ పరీక్షలు రాసి పాసయ్యాను. ఓ పరీక్ష ఫలితం పేపర్ లో రావడంతో నాకు ఇంకా శ్రద్ధ పెరిగింది. తణుకులోనే ‘రాష్ట్ర భాష’ వరకూ చదవగలిగాను. ఈలోపు మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఇక అక్కడి నుండీ నా చదువంతా ఇంట్లోనే సాగింది. మాస్టారుగారు ఇంటికి వచ్చి చెప్పేవారు. అప్పుడు ‘విశారద’ పాస్ అయ్యాను. ‘ప్రవీణ ప్రచారక్’ కు మాత్రం బెజవాడ మా అన్నయ్యగారింటికి వచ్చిన తరువాత అక్కడ కాలేజీలో చేరాను. అప్పుడే నాకు రేడియోతో పరిచయం అయ్యింది.

మాలో ఇద్దరు మగపిల్లలు తరువాత మధ్యలో ఒకమ్మాయి. ఆమెకి చిన్నతనంలోనే మా మేనత్త కొడుకిచ్చి వివాహం చేసారు. ఒక రకంగా బాల్యవివాహం. అప్పటికి మన రాష్ట్రంలో బాల్యవివాహాలు నేరం అంటున్నారని తెలంగాణాలో ‘మధిర’ తీసుకువచ్చి అక్కడ పెళ్ళి చేసారు. ఇక మా సంగతికొచ్చే సరికి నాన్నగారు రిటైర్ కావడం, పెద్దవారైపోవడం వల్ల పెళ్ళిళ్ళు కాస్త ఆలస్యంగానే అయ్యాయి. నాన్నగారు రిటైర్ అయ్యాకా మా ఊరు వెళిపోయారు. అక్కడ మా పొలాలు కౌలుకు తీసుకున్న రైతులు అక్రమంగా వాటిని తమ సొంతం చేసేసుకున్నారు. మిగిలిన వాటిని సగానికి తెగనమ్మి మొత్తం కుటుంబం అంతా బెజవాడ అన్నగారి దగ్గరకు వచ్చేసింది.

అమ్మ గృహిణి, ఇంత మంది పిల్లలతో ఆవిడకు సరిపోయేది. అయితే ఆవిడ నుండీ మాకు అబ్బిన మంచి గుణం ఏమిటంటే పుస్తకాలు చదవటం. మా అమ్మ బాగా పుస్తకాలు చదివేది. మా నాన్నగారు బదిలీల మీద ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి లైబ్రెరీ నుండీ పుస్తకాలు తెప్పించేసుకునేది. మామూలు వచనమే కాకుండా పద్యకావ్యాలు కూడా చదివి అర్థం చేసుకునేది. అలాగని పెద్దగా చదువుకోలేదు కూడా. చిన్నతనంలో ఏదో మిషనరీ స్కూలులో ఐదు వరకూ చదివినట్టు చెప్పేది. కొందరు పిల్లలు పుట్టి పోయారు, నాకు తెలిసే ఇద్దరు బిడ్డలు పోయారు. అప్పట్లో ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అవీ లేవు కదా! ఇక బతికిన తొమ్మండుగురు సంతానమూ, వాళ్ళ ఆలనా పాలనా చూస్తూనే తన అభిరుచిని కొనసాగించారు అమ్మ.

నా తరువాతి చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటున్నారు. చివరి చెల్లెలే ఆడపిల్లల్లో బాగా చదివింది. ఇక పెళ్ళిళ్ళ విషయానికి వస్తే మమ్మల్ని కావాలనుకుని వచ్చి చేసుకున్నవే. నేనూ, శ్రీనివాసన్ గారూ ఇద్దరం ఇష్టపడి మా పెద్దలను ఒప్పించి చేసుకున్నాం. మగపిల్లలు నాన్నగారు ఆశించినట్టుగా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడలేదు.

2. శ్రీనివాసన్ గారితో మీ వివాహం ఏలా జరిగింది?

మేము రేడియో స్టుడియోలోనే కలిశాం. అక్కడే పనిచేసేవాళ్ళం. ఆయన మంచి జోకులు చెప్పేవారు. నేను, సావిత్రిగారు, వీవీ కనకదుర్గ, ఇంకా మిగతా వారంతా పడిపడి నవ్వేవాళ్ళం. మేము భక్తి రంజని పాడుతుంటే ఆయన మురళి వాయించేవారు. అలా మాకు మంచి స్నేహం. మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ హాల్ దగ్గరి మైసూరు కేఫ్ కి టీకి వెళ్ళేవాళ్ళం. మా అమ్మవాళ్ళు పెళ్ళికి మొదట ఒప్పుకోలేదు, వాళ్ళు తమిళ అయ్యర్స్, మేము బ్రాహ్మిన్స్. వాళ్ళ వాళ్ళకు అసలు తెలీదు. శ్రీనివాసన్ గారు చెప్పడానికి ఇష్టపడలేదు. నెమ్మదిగా చెపుతాను అన్నారు. చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాం. తర్వాత తెలిసాకా నెమ్మదిగా వాళ్ళలో కలుపుకున్నారు.

3. మీ రేడియో నాటకాల పట్ల మీ అమ్మగారు, నాన్నగారు ఎలా స్పందించేవారు?

నాన్నగారికి బహుశా ఆడపిల్లలు నాటకాలు వేయడం అన్నది ఇష్టంలేదు అనుకుంటా. అయితే స్టేజి నాటకాలే ఆయనకు తెలుసును తప్ప ఇలా మైకు ముందు ఎవరి పాత్రలు వాళ్ళు చదువుతారని ఎరగరు. ఇంతకీ ఆయన మనసులో ఏముందో నాతో ఎప్పుడూ అనలేదు. ఇదంతా నేను ఊహించుకోవడమే. ఆయన నా నాటకాలను ఎప్పుడూ వినలేదు. అమ్మ కి నేనంటే చాలా ఇష్టం. నేను హైదరాబాదులో ఉంటే తను బెజవాడలో ఉండేది. నన్ను చాలా మిస్ అయ్యేది. రేడియోలో నా మాట వింటుంటే నేనేదో దగ్గరకు వచ్చినట్టు ఉండేదామెకు. విని తెగ సంతోషపడిపోయేది. ‘ఎంత బాగా చేసావురా’ అని మెచ్చుకునేది.

4. మీలోని రచయిత్రికి ప్రేరణగా నిలిచిన రచయితలు, రచయిత్రులు ఎవరు?

నేనొక పెద్దరచయిత్రిని అనుకోవడంలేదు. అయితే కథలు రాయాలనే కోరిక ఉండేది. మా అమ్మాయి మెంటల్లీ ఛాలెంజ్డ్. ఏదన్నా ఆలోచన రాగానే పాప గుర్తుకు వచ్చేది, అక్కడితో ఆలోచన ఆగిపోయేది. అయినా పిల్లలకు సంబంధించి కొన్ని రచనలు చేసాను. ‘ఉత్తమ ఇల్లాలినోయి’, ఇంకా పేర్లు గుర్తుకు రావడం లేదు గానీ, అవి ఆంధ్రప్రభ, మహిళావాణి లాంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అయితే ఎక్కువగా రాయలేకపోయాను. చాలామంది ఈ రేడియో విషయాలను గురించి రాయమని అడిగారు. ఎప్పుడన్నా ఎవరి గురించైనా రేడియో సంగతులవీ మాట్లాడుతుంటే ఆ విన్నవాళ్ళు “అయ్యో ఇవన్నీ పుస్తకరూపం చేస్తే బాగుంటుందండీ” అనేవారు. ఆ విషయంలో నన్ను ప్రోత్సహించింది మాత్రం నా తోటి రేడియో ఆర్టిస్టు చిరంజీవిగారే. అలా రాసిందే ‘నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు’.

అసలు మొదట అనుకున్న దాని ప్రకారం అది నేను రాయాల్సింది కాదు. ఒక రచయిత్రి రాసిపెడతానంది. నేను కొంత రికార్డు చేసి కూడా ఇచ్చాను. నేను ఓ సంవత్సరన్నర చూసాకా, అప్పుడు చిరంజీవి గారు, “మీరు ప్రయత్నం చేసి చూడండి రాకపోతే చూద్దాం” అన్నారు. అనగా అనగా నాకే రాయాలని అనిపించింది. రాస్తూన్న కాలంలోనే ఒక యాక్సిడెంట్ లో చెయ్యి కాస్త దెబ్బతింది. పట్టులేక అక్షరాలు సరిగా వచ్చేవి కావు. అయినా పట్టుదలతో ఓ 80 పేజీల దాకా అయ్యాకా అది చిరంజీవి గారికే వినిపించాను. ‘అసలు రచయిత్రి రాసినట్టు వచ్చిందా’ అని నా సందేహం. ఆయన చాలా బాగా వచ్చింది ఆలస్యం చెయ్యకుండా రాయడం పూర్తి చేయమన్నారు. అప్పుడు ఆమెను పిలిచి ‘మీరు ఏమీ అనుకోవద్దు, నేనే రాసుకుంటాను’ అని చెప్పి రాయడం మొదలు పెట్టాను. మా చిన్న చెల్లెలు ఫెయిర్ కాపీ చేసి పెట్టింది.

ఇక ఇప్పుడు మళ్ళీ ‘చిరంజీవి సాహిత్య సమాలోచనం’ అనే పుస్తకం రాసాను. చిరంజీవిగారి వీధినాటకాలు, స్టేజి నాటకాలు, రేడినాటకాలు, నవలలు వీటి మీద రాసిన పుస్తకమది. దీనికి సహ రచయిత్రిగా మా చెల్లెలు పని చేసింది.

ఇక నాకు నచ్చిన రచయిత్రుల విషయానికి వస్తే రంగనాయకమ్మగారు, మాలతీ చందూర్, వాసిరెడ్డి సీతాదేవి, ఇక తర్వాత వాళ్ళల్లో వరలక్ష్మిగారు, ఆదూరి సీతారాం గారు వీళ్ళ నవలలైతేనేం, కథలైతేనేం చాలా ఇష్టంగా చదువుతాను.

మనల్ని ప్రభావితం చెయ్యడానికి పెద్ద గ్రంథాలే అవసరం లేదు. చిన్న కథ చదివి కూడా ప్రభావితం కావచ్చు. మొదటి నుండీ రంగనాయకమ్మగారి కథలు, నవలలూ నా మీద ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పాలి. అలాగే మాలతీ చందూర్ పాఠకులను తన రచనలతో చాలా గైడ్ చేసేది. నా చిన్నతనం నుండీ ఆవిడ రచనల్ని కూడా ఎక్కువగా ఇష్టపడేదాన్ని.

5. రేడియో హవా తగ్గిన ఇప్పటికాలంలో మీరు పుట్టి ఉంటే మీ ఆసక్తులు మరెటువైపు మళ్ళేవనుకుంటున్నారు?

చెప్పలేనండీ. ఇప్పుడు పుట్టుంటే ఇపటి పిల్లలతో సమానం అయిపోయేదాన్నేమో, అప్పటి మనసుతో ఇప్పుడు ఆలోచించలేను కదా! నా కాలంలో రేడియో నాకు తగినట్టుగానే ఉంది. ఇప్పటి రేడియో అలా లేదనుకోవాలి. ఇప్పుడు ఎఫ్.ఎం స్టేషన్లు ఎక్కువ ఆదరణలో ఉన్నాయి. వాటిలో ప్రసారమయ్యేవి అధికం సినిమాపాటలే. నాకు సినిమా పాటలు నచ్చక కాదు. కానీ రేడియోలో అవి రావటం నచ్చదు. ఎందుకంటే రేడియో ద్వారా చెప్పేందుకు చేసేందుకు ఎంతో ఉంది. రేడియో ఆ కాలంలో ఎన్నో విషయాల్లో ప్రజల్ని చైతన్యపరిచింది. అలాంటి చైతన్య సాధనాన్ని రోజంతా సినిమా పాటలతో నింపేస్తున్నాం. ప్రజలకు సందేశం ఇచ్చేది తక్కువ, వారిని వినోదపరిచేది ఎక్కువగా తయారైంది పరిస్థితి. ప్రజలు కూడా వినోదానికే అలవాటు పడిపోయారు. మీరు మధ్యలో ఏదన్నా చెప్పడానికి చూస్తే “ఆ ఎప్పుడీగోలైపోతుంది, తరువాతి పాట ఎప్పుడేస్తారు” అన్న ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అప్పట్లో అలా ఉండేది కాదు. ఎప్పుడో ఓ పాట వేసేవారు. నాటకాలు, నాటికలు ఒకటేమిటి ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజలను చైతన్యపరచాలనే కోరిక బలంగా ఉండేది. అందులో కుటుంబ నియంత్రణ, అంటరానితనం నిరక్షరాస్యతల నిర్మూలన, ఆరోగ్యం, వైద్యం ఇంకా ఎన్నో విషయాల్లో వారిని ప్రభావితం చేసింది.

6. మీరు ఎన్నో నాటకాలలో నటించారుకదా మీకు నచ్చిన నాటకమేది?

అన్ని నాటకాల్ని ఇష్టం తోటే వేసాను. బాగా నచ్చిన నాటకం ‘సుప్తశిల’ నాటకం, తరువాత ‘పురూరవ’ నాటకం. ‘సుప్తశిల’ చాలా చిన్న నాటకం, పెద్దగా డైలాగులు కూడా లేవు అందులో, కానీ ఆ మాటలను చాలా బాగా రాసారు తిలక్ గారు. అందువల్లనో ఏమో, మిగతా ఏ నాటకమన్నా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించేది కానీ ‘సుప్తశిల’, ‘పురూరవ’ మాత్రం ఇక చెయ్యాల్సింది ఏమీ లేదు అనే తృప్తినిచ్చిన నాటకాలు.

7. లక్కాకుల సుబ్బారావుగారు అనువదించిన “రాజా ఇడిపస్” నాటకంలో “రాణి జొకాస్తా” పాత్ర మిమ్మల్ని వెంటాడిందని చెప్పుకున్నారు?

రాణీ జొకాస్తా ఇడిపస్ తల్లి. ఇడిపస్ పుట్టగానే ‘ఈ పిల్లవాడి పుట్టుక రాజ్యానికి అశుభం, జాతకం మంచిది కాదు, రాజ్యంలో ఎన్నో అరిష్టాలు జరుగుతాయి, కాబట్టి బ్రతకకూడద’ని చెపుతారు జ్యోతిష్యులు. రాజు చంపించేయమని చెపుతాడు బటులకు. పిల్లవాడిని తమ చేతులతో చంపడం ఇష్టంలేక అడివిలో మృగాలు తినేస్తాయని వదిలి వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఆ పిల్లవాడు ఓ తెగవాళ్ళకు దొరుకుతాడు. అక్కడ పెరిగి పెద్దయి వీరుడై ఆ తెగకు రాజవుతాడు. చుట్టుపక్కల మిగతా తెగలనన్నింటినీ జయిస్తూ ఈ రాజ్యం మీదకు దండెత్తుతాడు. రాజ్యాన్ని జయించి రాజును చంపేసి రాజ్యం చేజిక్కించుకుంటాడు. రాజ్యంలోని రాణులందరినీ తన వశం చేసుకుని జొకార్తాని కూడా పెళ్ళి చేసుకుంటాడు. ఆవిడకు పిల్లలను కంటాడు. అప్పటికి రాజ్యంలో విపరీత పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు రాజ పురోహితులు రాణికి పుట్టిన బిడ్డ వల్ల జరగాల్సిన విపరీతాలు ఇప్పుడెందుకు జరుగుతున్నాయని శోధన చేసి, రాజైన ఇడిపస్ జొకార్తా కొడుకే అని నిర్ధారిస్తారు. ఆమెకు ఈ విషయం తెలియగానే బాకుతో పొడుచుకుని చనిపోతుంది. తల్లిని భార్యను చేసుకున్నాని తెలియగానే ఇడిపస్ తన కళ్ళను పొడిచేసుకుంటాడు. ఇంత విషాదం నిండిన కథను నాటకంగా వేయడం, అందులో నేను రాణీ జొకార్తా కింద నటించడంతో నన్ను ఏదో గిల్టీనెస్ వెంటాడింది. అప్పటికి నా వయసు ముఫ్పైఐదు నలభై మధ్యలో ఉంటాయ్. ఆ తల్లి పడ్డ బాధనంతా నేను పడ్డాను చాలా రోజులు. నవ్వుతూ కూర్చున్న సమయాల్లో కూడా ఆ సంగతి గుర్తొస్తే నేను ఏదోలా అయిపోయి కాసేపు ఎవరితోనూ మాట్లాడలేకపోయేదాన్ని. అంటే ఒక వేషం వేసినప్పుడు దాన్ని ఒక రకంగా ఆవాహన చేసుకుంటాం. దానిలో జీవించాలని చూస్తాం. ఎంత మన ఒళ్ళు మనకు తెలిసి చేస్తున్నా, పాత్ర పడే బాధ మన మనసుకు పట్టుకుంటుంది. రాత్రులు నిద్రలో సడెన్ గా మెలుకువ రావడం లేచి కూర్చుంటే ఏవో ఆలోచనలు వెంటాడటం… ఇలా చాలా రోజులు కుదురు లేదు నాకు. ఇక ఈ బాధ పడలేక చిరంజీవి గారితో చెప్పాను “తీసేద్దామండీ ఈ నాటకాన్ని” అని. అంటే, “అదేమిటి ఇంత మంచి నాటకం, ఎంతమంది మెచ్చుకున్నారు. అది కేవలం నాటకం ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు” అన్నారు. కానీ నాకు కుదురులేదు. ఏలాగైనా తీసేయండంటూ ఆయనను సంవత్సరం పోరి చివరికి తీయించేసాను.

8. సినిమా అవకాశాలు వచ్చినా ఎందుకు కాదన్నారు?

నాకు ఆరంగం మీద ఆసక్తి లేదు. ఆ కెమెరాలు, ఆ హడావుడి నచ్చలేదు. సినిమా మీద ఓ మోజుండాలి. నాకు ఉద్యోగం మీద మోజుంది. అసలు పెళ్ళే వద్దనుకున్నాను.

9. అప్పటి రచయితలు, రచయిత్రులతో మీకు ఉన్న స్నేహం గురించి చెపుతారా?

నాకు యద్దనపూడి సులోచనారాణి బాగా తెలుసు. దాదాపు నా వయసుదే తను. ఆమె రాసిన ‘సెక్రటరీ’ నవలను నేను వేసాను. “శారదా నువ్వు వేస్తానంటే నా నవల ఇస్తాను” అనేది. అలా ఉండేది మా స్నేహం. వాసిరెడ్డి సీతాదేవిగారి ‘బంధితుడు’, ‘మట్టిమనిషి’ వేసాను. పి. శ్రీదేవి గారి ‘కాలాతీతవ్యక్తులు’, అలాగే ద్వివేదుల విశాలాక్షిగారి నవల నాటకంగా వేసాను. పీవీ నరసింహరావు గారు ఒక మరాఠీ నవలను ‘ఎవరు లక్ష్యపెడతారు’ అని తెలుగులోకి అనువదించారు. దాన్ని నండూరి విఠల్ గారు రేడియోకి నాటకంగా చేసారు. దాన్ని వేశాం. ఆయన ఎంత సంతోషించారో, “ఎంతబాగానో వేసారమ్మా మీరు” అని చెప్పి మెచ్చుకున్నారు. రంగనాయకమ్మగారి ‘బలిపీఠం’ రేడియోకి నాటకంగా చేసివేశాం. ఆవిడదే ‘స్త్రీ’ నవలను రేడియోలో నవలా పఠనం స్త్రీల కార్యక్రమంలో చదివాను. చాలా మంది రచయితల,రచయిత్రుల ప్రసంశలు పొందాను.

10. ఓ నాటకాన్ని వేసే ముందు మీరు ప్రత్యేకించి ఎలాంటి శ్రద్ధ తీసుకునేవారు?

నాటకాన్ని మైక్ ముందు చదివే ముందు రిహార్సల్స్ ఉండేవి. అందరితో కలిసి రెండు మూడు రోజులు బాగా చదివి ఎవరి వేషాన్ని వారు ఆకళింపు చేసుకోవాలి. నేను అలాగే ఇంట్లో పనిచేస్తున్నా నాలోనేను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ పాత్రలోకి ప్రవేశించడానికి, ఆ పాత్రను ఆవాహం చేసుకోడానికి ప్రయత్నించి చేసినవే నా నాటకాలన్నీను. ఇంకోమాట ఏమిటంటే రేడియోకి ప్రతీ అక్షరమూ క్షుణ్ణంగా పలకాలి. అలా ప్రతీ అక్షరాన్ని పలకడంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకునేదాన్ని. లేకపోతే వినే వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళకు అర్థం కానిది చదివేసి ఏదో ప్రోగ్రాం పూర్తి చేసానని ఎప్పుడూ అనిపించుకోలేదు. దానికోసం తపన పడి అదే తలంపుగా చేసాను. కాబట్టే ఈరోజు ఇంత మంది గుర్తుపెట్టుకోవడం జరిగింది నన్ను.

11. ఎందరో కలల స్వర సుందరి తన గాత్రాన్ని ఎలా కాపాడుకునేది?

(నవ్వుతూ) ఏమీ చేయలేదు. అది అలా పుట్టుకతో వచ్చిందే, దేవుడిచ్చిందీను. దాన్ని కాపాడుకోడానికంటూ ప్రత్యేకించి నేను చేసిందేమీ లేదు. నా గొంతు నా పనికి సహకరించింది అని మాత్రం చెప్పగలను. జలుబు చేసినప్పుడు తప్పితే గాత్రంలో పెద్దగా తేడా ఏం రాలేదు. ఇప్పటికీ కూడా.

12. మీ గొంతును ఇష్టపడి మిమ్మల్ని ఆరాధించిన అభిమానుల గురించి చెపుతారా?

అభిమానులు రేడియో ఆర్టిస్టుల గొంతును మాత్రమే గుర్తు పెట్టుకుని అభిమానించేవారు. ఎందుకంటే టీవీలోలా మేం కనపడం కదా. ఇంత శ్రద్ధగా రేడియో విని నన్ను గుర్తుపెట్టుకున్నారా – అనే ఆశ్చర్యం కలిగేలా ఇప్పటికీ నన్ను కలుస్తున్నవాళ్ళను చూస్తే అనిపిస్తుంది. ‘ఎంతకాలం నుండో మేము మీ అభిమానుల’మంటూ ఇన్నేళ్ళ తర్వాత కూడా మొన్న వైజాగు వెళ్ళినపుడు ఎంతోమంది అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు.

13. జనగణమన, వందేమాతరం ఎందరో ప్రముఖుల ముందు ఆలపించారు కదా. అప్పుడు మీకు గురుతుండిపోయిన సంఘటనలు కొన్ని పంచుకుంటారా?

అలా ఏం లేవండి. ఆ నెహ్రూ గారి దగ్గర పాడినప్పటి సంగతి మాత్రం భలే అనిపిస్తుంది ఇప్పటికీ. దేశ ప్రధాని ముందు పాడటం అంటే మరిచిపోలేని అనుభవం. మేము పాడుతున్నప్పుడు ఆయన జమ్మంటూ కుర్చీలో నుంచీ లేచి స్టేజి మీద మా పక్కన నించుని మాతో పాటు పాడుతుంటే కంగారేసిపోయింది. మొన్ననే నేనూ, సావిత్రి గారు అనుకున్నాం ‘అయ్యో మనకు ఓ ఫోటో తీసుకోవాలని కూడా అనిపించలేదే’ అని. ఇప్పుడైతే సెల్ఫీ కూడా తీసుకునేవాళ్ళు.

ఒకసారి ఇందిరాగాంధీ మా రేడియో స్టేషన్ కే వచ్చారు. ఆవిడ పక్కన నిలబడి ఫోటో తీయించుకోవాలని నేను, సావిత్రిగారు చెరో పక్కా నిలబడ్డాం. ఇంతలో వింజమూరి సీతాదేవి, రతన్ ప్రసాద్ గారు వచ్చారు. మేము వాళ్ళకు దారి ఇచ్చి వెనక్కు నిల్చున్నాం. మాకే కాదుకదా, అందరికీ ఆమెతో ఫోటోలు తీయించుకోవాలని ఉంటుంది కదా. అందులోనూ నేను అందరి కన్నా కాస్త పొడవు కావడంతో, వెనక్కు వెళ్ళి నిలబడేదాన్ని. మెత్తానికి ఆ ఫొటోలో మా ముఖాలు కనిపించాయి.

ఇక పీవీ నరసింహరావుగారు మాత్రం ఏ మీటింగులో కనిపించినా పలకరించేవారు. “అదిగో అక్కడ కూర్చున్నారే ఆవిడ చాలా గొప్ప కళాకారిణి” అంటూ ఏదో మాట్లాడేసేవారు. నేను మాత్రం సిగ్గుతో మునగదీసుకు పోయేదాన్ని.

14. మీకు మాత్రమే తెలిసిన శారదాశ్రీనివాసన్ గారు ఏలా ఉంటారు. ఆవిడ స్వభావం ఎలాంటిది?

అందరిలో కలిసే మనస్తత్వమా అంటే, తోసుకుని ముందుకు వెళ్ళే మనిషిని కాను. నేను, నా వృత్తి అంతే. దానిని పట్టుకుని పేరు సంపాదించేయాలనే యావ ఉన్నదాన్ని కాను. నలుగురిలో దూసుకుపోయే మనిషిని అంతకన్నా కాదు. ఫోటోకి కూడా ముందుకు వచ్చేదాన్ని కాను. వెనగ్గా నించుంటే “రండి మీదే నాటకంలో ప్రధాన పాత్ర మీరు ముందుకు రావాలని” తోటివారు బలవంత పెట్టి ఫోటో తీయించే వారు. నేను పొడుగు కదా వెనక వాళ్ళు కనిపించరేమోనని వెనక్కు పోయేదాన్ని. కాస్త వెనక బెంచీ విద్యార్థిని నేను.

15. ప్రస్తుత కాలం ఏలా గడుపుతున్నారు?

మొన్నటి వరకూ చిరంజీవి గారి పుస్తకం రాయడంతో సరిపోయింది. పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఇక ఓపిక కూడా లేదనిపిస్తుంది. పాపకు సాయంత్రాలు టీవీలో హిందీ కార్యక్రమాలు చూడటం ఇష్టం, దానికి నేను దగ్గర ఉండాలి. ఇంటిపని చేసుకుంటూ పాపని చూసుకోవడంతో సమయం తెలీకుండానే గడిచిపోతుంది.



**** (*) ****

వాకిలి సాహిత్య పత్రిక 2016 మార్చి 

Sunday 24 January 2016

చలం గేలానికి...


 

నాలో చిన్నగా రాపిడి మొదలైంది. అది దేన్ని పుట్టిస్తుందో తెలీదు. ఈ రాపిడిలో నాకు తెలిసే విషయాలు చాలా ఉన్నాయని మాత్రం అర్థమవుతోంది. నన్ను ఒక్కసారిగా ఈ లోకం నుండీ బదిలీ చేస్తాయి ఆ ఆలోచనలు. ఎక్కడికి వెళ్తానో తెలియదు, తిరిగి రావడం తెలుస్తుంది.

ఇదంతా ఎందుకు జరుగుతుంది. ​నేను కొత్తగా పరిచయం చేసుకున్న రచయిత చలమే దీనికంతటికీ ​కారణమని తెలుస్తుంది నాకు. మొదట్లో రచయితగానే​ పరిచయం అయ్యాడు, క్రమంగా అతని రచనలు నాకేమిస్తున్నాయీ, అని ఆలోచించి​ తేల్చుకునేలోపే​ మెల్లగా సందుచేసుకుని నాలో దూరిపోయాడు. ఎవరతను, ఎందుకు పరిచయం అయ్యాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఎప్పుడూ మామధ్య సాగేది ప్రశ్నల వర్షమే. ఏదో రమ్మన్నాడు కదాని​ ​కూడా వెళ్ళడం, అతను​ పుట్టించే​ ప్రశ్నలూ సందేహాలతో బిక్కమొహం వేసుకుని అంత అయోమయంతోనూ వెనుతిరగటం, ఆ సంభాషణలన్నీ నేను అనంతమైన అజ్ఞానంలో కూరుకుపోయున్నానని​ పదేపదే గుర్తుచేయడం... ఇదే సాగుతుంది కొంత కాలంగా.

మొదట ​ సంభాషణ​ ప్రారంభిస్తాడిలా.. "అసలు ఎవరు నువ్వు, ఎందుకు జీవిస్తున్నావు? నేనూ, నాదీ అని కాకుండా నీలోని కోరికా, వ్యసనం, ఆనందం, చింతా అన్నీ వదిలి దీనికి మించి నీలో దాగున్న చైతన్యం గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఏం చేస్తావు, జీవించి ఓ వందేళ్ళు బతుకుతావు. అసలు​ బతకడం ఎందుకు?​ బతికి ఏం చెయ్యాలి? ఆలోచించు, ఏం చేయాలనుకుంటున్నావో" అంటాడు. మచ్చుకి అతని గురించి మొన్న జరిగిన సంగతోటి చెపుతాను. నేను బస్సులో వెళుతున్నాను. నీరసంగా ఉండి పడుకోవాలనుకుంటున్నాను. ఇంతలో అతడు నన్ను పిలుచుకెళ్ళాడు తన వెంట. "ఏమిటి నిద్రపోతున్నావా?" అవునని తలూపాను. "ఎందుకు నిద్రపోతున్నావు? అసలు నీవున్నది పూర్తి నిదురలోనే కదా మళ్లీ నిదుర​పోవడం దేనికి? ఎప్పుడు ఆ చీకటి నుండీ నిద్దుర నుండీ మేల్కొంటావో అని నేనిక్కడ ఎదురు చూస్తున్నాను.​ నీలోని దాగున్న చైతన్యం గురించి తెలుసుకుంటావని అనుకుంటుంటే నీవేమో అజ్ఞానాన్నే లోకంగా భావించి నిద్రపోతున్నావు. చూడు నీ శరీరంలో పుట్టే ఆకలిని గుర్తించినట్టుగానే నీలో పురుడుపోసుకుంటున్న ఆలోచనల్నీ అనుమానాల్ని ఎందుకు గుర్తించవు? వాటి గురించి ఎందుకు ఆలోచించవు. ఏమిటి నీ బాధ, ఆ లోకంలోని సుఖాలకు దూరమైపోతావనేనా? అదే అయివుంటుంది. మరో కారణమేమీ ఉన్నట్టు నాకు తోచడం లేదు. సరేలే..."
ఇలా ప్రశ్నల శస్త్రాలు నాపై సంధించి మాత్రమే ఊరుకోడు. మళ్లీ మేం కలుసుకున్నప్పుడు, వాటి గురించి ఏం ఆలోచించావూ అంటూ నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. గొప్పరచయిత​అని అతని రచనలు చదవడం మొదలు పెట్టాను. కానీ చదువుతూ చదువుతూ​ -​ ఎందుకివన్నీ, అతను ఎక్కడ పుడితే నాకెందుకు అతని పుట్టు పూర్వోత్తరాలు నాకు అంత అవసరమా? తెలుసుకుని నేనేం చేయాలి? అసలు అలా ప్రపంచాన్ని ఎదిరించి, సమాజమంతటినీ​ గేలిచేసిన వాడు ఏం తెలుసుకున్నాడని ఎక్కడికో బైరాగిలా వెళ్ళిపోయాడు? అతనికి తెలిసినదేమిటో​ నేను తెలుసుకోలేనా?... ఇలా నెమ్మది నెమ్మదిగా నన్ను తనలో కలిపేసుకుంటాడు. ఇలాంటి అనుమానాలను నాలోనూ సృష్టించి మాయం అయిపోతూ ఉంటాడు. 

నిజానికి నాకేదో తెలిసిందని అనుకోను. అతని గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది. అతను ఈ విశాల సృష్టిలో దాగున్న మర్మాన్ని బట్టబయలు చేయడానికి భూమి మీదకు వచ్చిన వాడు. అందుకోసం ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు.​ ​అన్నిటితోనూ సమన్వయం కుదుర్చుకున్నాడు.​ ప్రతి జీవినీ పరిచయం చేసుకున్నాడు. ​ప్రకృతిలో కలిసిపోయాడు. గాలీ, ధూళి, నీరు అన్నీ తాకి పరవశించాడు. ఇంతా చేసి అన్నిటికీ చేరువయ్యాడు​ కానీ, అతి తెలివిగల ఈ మూర్ఖపు మనుషులకే అర్థం కాలేకపోయాడు. జీవాన్ని గుర్తించని వీళ్ళు నిర్జీవం అయ్యాకా కీర్తించడం శిలువు వేసింతర్వాత చేతులెత్తి మొక్కడమే కదా. ఏదన్నా విషయాన్ని చర్చించే ముందు అందులోని అసలు విషయం కన్నా దానికి​మనం ఆపాదించే శీలమూ అశ్లీలాలే​ ముందుగా​ మన​ చర్చకు వచ్చేది. అదే చర్చిస్తాం మనం. లాభాన్ని, నష్టాన్ని​ బేరీజు వేసుకుని​ అటు వెళ్తాం. ఎంత లాభం కిడుతుందో లెక్క​ తేలాకే ముందుకు పోతాం. నష్టం వస్తే వెళ్ళనే​ వెళ్ళంగా. మనిషి పోయాక విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేస్తాం.
ఇక అతడి గురించి ఏదో​ చెప్పబోతుంటే​ మొన్న​ ఒకావిడ నాతో "ఆయన బూతు రచయిత కదమ్మా... మాఇంట్లో చదవనిచ్చేవారు​ ​కాదు. అయినా దొంగతనంగా చదివేవాళ్ళం" అంది. అంటే ఆమెకు అతడు ఏం రాసాడో అన్నదానికంటే అందులో ఎంత శాతం అశ్లీలాన్ని చొప్పించాడో తెలుసుకోవాలనే కుతూహలమే ఎక్కువగా ఉందనిపించి ఊరుకున్నాను. అతడు ఆడదానిలో అందరికీ అర్థం కాని ఏదో కోణాన్ని చూసాడనిపిస్తుంది నాకు. ఆమెకు హృదయంతో దగ్గర కావడానికి ప్రయత్నించాడు. సంఘం అనే ఉచ్చులో పడకుండా,​ ​కులం అడ్డుగోడల్ని కూల్చేసి​ బతికినవాడు చలం. అందుకే సంఘం నుండీ వెలివేయబడ్డాడు. అతడి గురించి తెలుసుకున్నవాళ్ళకు తెలుసుకున్నంత.

నీవు నమ్మిన దైవం గురించి నీలో ఇటువంటి ఆలోచన ఎప్పుడన్నా అంకురించిందా?----- 
"వేద పురుషుడివి నీకు తెలియనిదేముంది!" అని చల్లగా తప్పుకుంటారు. ప్రతి వాడికీ, ప్రతి రుషికీ, కోతికీ, బైరాగికీ రాముడు లోకువ. ప్రతివాడూ, యోగమూ, ధర్మమూ, వైరాగ్యమూ, మాట్లాడేవాడే, బోధించేవాడే. పైగా ధర్మాలు వెలిగే యుగంలో స్వయంగా విష్ణులో ముప్పాతిక అంశతో పుట్టాట్ట శ్రీరాముడు. ఆయనకి ఈ భోధనలు అవసరమేమిటో! శ్రీరాముడికీ, ధర్మరాజుకీ ఎవరు భోధింనా, చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్టు లేదు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణునికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా అతడే ప్రపంచానికి భగవద్గీత భోధించాడు. అతను రసికాంతుడు, ప్రేమలో, మోహంలో, ఛాతుర్యం, తీవ్రత, లీల, శృంగారం, - ఎంత వుందో అంతా చిరకాలం నించి కవులు తమ భావ వీధుల్లో అందుకోగలిగిందంతా శ్రీకృష్ణుడి మీద వర్షించారు. అట్లాంటి వ్యభిచారి చేత (అస్కలిత బ్రహ్మచారి చేత ) ఉపనిషత్సారం అనుకుని సన్యాసులు పూజించే భగవద్గీతను చెప్పించడంలో ఉన్న రహస్యాన్ని, సత్యాన్ని ఎవరన్నా గమనించారా?
బాల్యం వైపు జాలిగా చూసావా?----- 
పిల్లలు - ఉత్తనెత్తురు, ఎదిగే ఎముకలు, ఆత్రుతతో విశ్వాసంతో నిండిన చూపులు, ముద్దు మాటలు, అర్థంలేని అల్లరి, నిష్కపటమైన మనసులూ, - చవక, అతిచవక - పిల్ల చస్తే పిల్లను కనడం సులభం. పురుగుల మల్లేలోకమంతా పిల్లలు - ఎన్ని కోట్లు - ఏమైతేనేం - బాధ ఏమిటో, ఎందుకు కలుగుతుందో తెలుసుకోలేని పాపలు. బలపం పట్టుకుని, తలవంచుకుని ఐదు గంటలు..... ఒక వంకర గీత మీద అట్లా రుద్దుతూ ఒక్క అక్షరాలేమిటి, సమస్తమున్నూ, టీచరు ప్రశ్నలూ, ఈ దరిద్రగొట్టు ఇనస్పెక్టర్ల తనిఖీలూ, అంత నవ్వు రాకపోతే, ఈ కోపమే దహించకపోతే ఏడుద్దును.
నీలో అహంకారానికి చోటీయకు----
ఎరుకపడని దేవుడిలో భక్తి లేకపోయినా, మానవుడిలో, ప్రాణుల్లో, సృష్టిలో ఉండే దేవత్వం కనిపెట్టగలిగి, దాని ముందు తలవొంచ లేకపోతే పోనీ, రాత్రి అగాధాకాశాల ముందు, ప్రజ్వలమైన సూర్యాస్తమయాల ముందు, హృదయాన్ని అద్భుత పడచేసే కళ ముందు తాను ఏమీకాననే వినమ్రత భావంతో తలవొంచలేకపోతే, మానవుడిలో బోలు అహంకారమూ, అహంకారపు కర్కశత్వమూ, అతన్నే కరుచుకు తింటాయి.
అతడు చెప్పి చర్చించిన చాలా విషయాలను నేను విస్మరించి ఉండవచ్చు,​ ఎందుకంటే​ నాకు అవి​పూర్తిగా​అనుభవంలోకి రానివి అవటం వల్ల కావచ్చు. అతడు చెప్పే విషయం పక్కకుపోయి మరేదో బోధపడుతూ ఉంటుంది చాలా సార్లు. నేను ఇది రాస్తున్నానే​ కానీ,​ కొంత కాలం తరువాత ఇతగాడి పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు అయ్యో ఇతడు చెప్పిన సంగతులన్నీ పక్కన పెట్టేసి మరేదో రాసేశానే అని నాలిక కరుచుకునే సంధర్భం రాకపోదు. ఎందుకంటే అతను అన్ని స్వరూపాలను తన రచనలో, వ్యక్తీకరణలో చూపించాడు. ఈ సమస్యలు, సందేశాలు, స్పందనలూ మనమీదకు ఎక్కుపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే చలం చదువుకున్నవాళ్ళకు చదువుకున్నంత. అతని రాతలు ఓ గ్రంథాలయం. అందులో ప్రస్తావించని విషయం లేదు. పరిచయం కాని సంగతిలేదు. అతని వెలుగులు​ ఇంకా ఈ భూమ్మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. అవి ఈలోకంలోని అజ్ఞానాన్నీ​ చీకటిని తీసేసి​ మనలో వెలుగుల్ని నింపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మన మత గ్రంథాలు మనకు నేర్పే భక్తి, విశ్వాలతో పాటు మనలో దాగున్న మరో కోణాన్ని మనలో చైతన్యాన్ని​ అద్దంపట్టి చూపిస్తాయా రాతలు.
* * *
చలం ఇంటర్వ్యూ---

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...