Monday 27 September 2021

కొంచెం స్వేచ్ఛ కావాలి..


అవును..కొంచెం స్వేచ్ఛ కావాలి.
కాలపు అంచులు సవరించి
జ్ఞాపకపు ఆవిరి కాచుకునే స్వేచ్ఛ
గుంపు గుంపులుగా
ఎగిరే పక్షుల రెక్కలకు
అంటుకుని ఎగిరే
స్వేచ్ఛ కావాలి.
చిక్కటి చీకటిలో వెలుతురు
విత్తనాలు చల్లే స్వేచ్ఛ కావాలి.
పిట్టవాలని తోటనుంచి కొరకని
జాంపడును ఎత్తుకు రావాలి.
కిటికీ ఊచకు ఊహలు
తగిలించి ప్రియునితో
కబుర్లు చెప్పే స్వేచ్ఛ కావాలి.
ప్రేమ తొడిగిన హృదయాన్ని
బహుకరించాలి.
పొద్దుటి పూట ప్రశాంతంగా
నిద్ర లేచే పూలతో కొత్త
మొలకల సందేశాన్ని పంపాలి.
వినడం మరిచిపోయి
మాట్లాడే స్వేచ్ఛ కావాలి.
దూరాన్ని దగ్గరచేసే స్వేచ్ఛ
కొత్త దారులను పట్టుకునే
నేర్పు కావాలి.
లాంతర్లు వెలుగులో మేఘాల
లెక్క తేల్చాలి. చినుకుల లెక్క
రాసి పెట్టుకోవాలి.
కొంచెం స్వేచ్ఛ కావాలి.
UshaJyothi Bandham, Arun Deep Chinthala and 29 others
6 Comments
Like
Comment
Share

Friday 24 September 2021

నీలపు నది ఒడ్డున వెన్నెల




 నీలపు నది ఒడ్డున వెన్నెల

చల్లగా పరుచుకుంది
పిల్లగాలి ప్రేమలేఖలను
అందుకుని హృదయం
ఆకాశ అంచులను
తాకి వచ్చింది
ఎవరు చెప్పారు
నీవక్కడ లేవని..
ఆకుల గుసగుసలు
సద్దుమణిగాకా నువ్వు
నాకోసం వస్తావు..
పచ్చిక మీద ఏకమైన
దేహాలు మన ప్రేమను
కంటాయి.
అప్పుడే
నిగూఢమైన సృష్టి
రహస్యాల్ని
చూసివస్తాము.

Saturday 18 September 2021

ఆకాశ రహస్యాల్ని




 ఆకాశ రహస్యాల్ని

ఛేదించే శాస్త్రవేత్తలు
అర్థరాత్రి పొంచిఉన్న కోరికలను
హృదయంలో నింపుకోమనీ
చెపుతున్నారు.
గడిచి గతించిన క్షణాలను
సాక్ష్యంగా పట్టుకోకు..అలా చూడు
లజ్జతో గర్వంగా పరుగులెత్తే
ఆ చేపలేం చేస్తాయో తెలుసా?
తమ ఉనికిని తెలుపుతూ
గొంతెత్తి పాడుతాయి.
ఈ మల్లెలేం చేస్తాయంటే..
మధురానుభూతిని
పంచి ఇస్తూ..మధుర పరిమళ
రహస్యాన్ని బయట పడేస్తాయి.
మరీ ఆ పక్షులో
ఎత్తైన కొండలు.,కోనల
చుట్టరికాలన్నీ రెక్కల్లో కట్టుకుని
ఈ ఒడ్డుకు చేరతాయి.
మరి నేనో..
నా చేతిలో..చేయివేసి
నాతో ప్రయాణించేందుకు
నువ్వు కాచుకున్నావనీ
నిన్ను తప్పుకుపోలేక
ఇక్కడే ఆగాను.

Sunday 12 September 2021

ఈ హృదయానికి హద్దులు ఉన్నాయా?



ఇప్పటి వరకూ నువ్వు ఎవరనే
ప్రశ్న రాలేదు నాకు.
నువ్వు ఉషోదయానివి.
పగలు దాటి మధ్యాహ్నం
వెళ్ళగానే సిగ్గును
ముంగిట్లోనే వదిలి..
చీర కొంగు పరచి రాతిరి
నా హృదయానికి
తెరగా మారిపోయింది.
ఏకాంతంలో సంధ్యాకాంతినై
పెదవులను అందుకున్న వేళ
కడలి నురుగుల్లా
మాటలెన్నో పుట్టుకొస్తాయి.
ప్రణయ వాంఛలతో
మనసు చెప్పే ఊసులు వింటూ
నువ్వు స్వర్గానికి దారులు వేస్తావు.
వెదురు కొమ్మల మాటున
చంద్రుని మెరుపు వెన్నెలై
వెచ్చని సెగలను చల్లబరుస్తుంది.
అయినా చెట్ల నీడనీ..
పచ్చిక మైదానాన్నీ
కలుపుతూ..దాటిపోతున్న ప్రేమ
హృదయానికి లంకె వేసి
లాగుతూనే ఉంది.

Tuesday 7 September 2021

ఆకుపచ్చని రాత్రి


నీరు ప్రవహిస్తుంది..
గాలి వీస్తుంది..
మరి నువ్వు ఆవరిస్తావు.
ఒక్కోనీటిబొట్టూ ఒంటి మీంచి జారిపోతుంటే
జ్ఞాపకాల దొంతరలో ఆరోజును వెతుకుతాను.
నీ స్పర్శతో చలించిపోయిన రాత్రికి
పయనం కడతాను.
గాలి సవ్వడి ఊళపెడుతూ
నన్ను పిలుస్తూ ఉంటే..
సీతాకోకల సందడి మధ్య ఎతైన
కొండ ఒంపున కలుస్తాను నిన్ను
లేలేత రెక్కలు తొడిగిన పిట్టలు
ఆకుపచ్చని తోటలో
నిదురకు కరువైన కళ్ళు
నన్ను పలకరిస్తాయి.
నారాకతో ఒక కొత్త రోజు ఉదయిస్తుంది. ఆ దారులన్నీ నిశ్శబ్దాన్ని కన్నాయి. ఎల్లలు లేని ఏ అదృశ్య నగరానికో పయనిస్తావు నాతో. ఎప్పుడూ తోడుగా ఉండే చిరునవ్వు విచ్చుకున్న మొగ్గలా పూస్తుంది. ఆ నీలి ఆకాశానికీ మనం పరిచయమే.. నీతో కూడిన ఆనందక్షణాలు పరిచమున్నాయి. నిప్పుకణికలాంటి చూపులు చల్లబడ్డాకా.. చెదిరిన జుట్టు సవరించుకుంటూ నీ ఒడిలో సేదతీరుతాను. మరో సంగమం కోసం.. ఆర్తిగా ఎదురుచూస్తాను. రాబోయే ప్రతి ఆనంద క్షణాన్నీ నీతో లెక్కగడతాను.
May be a closeup

Monday 6 September 2021

ఆ రాత్రి




చిక్కని రాత్రికి చెక్కుచెదరని
కథలెన్నో చేరాయి. రేపటిని
కలగంటూ నిన్నటిని మరిచిపోతూ..
దారపు పోగుల్లాంటి బతుకులు
ఒకేచోట పెనవేసుకుపోయి
బ్రతుకుదారిని వెతుకుతున్నాయి.
కాళ్ళీచ్చుకుంటూ
ఇంటికి చేరిన ఆసామికి పిల్లాడి
చిరునవ్వు చెదరని కానుకైంది
పైరుకు శ్రమను ధారపోయడం
తెలుసుగానీ ఆకలికి మంత్రం
తెలీదు మరి..
నాగలి ఆడించే రైతున్నకు
ఇల్లాలి చేతి బువ్వే ధాన్యరాశి..
కేరింతలు కొట్టే బాల్యం, కళతప్పని
యవ్వనం, కన్నెతనాన్ని గుమ్మానికి
పసుపుగా పూసి ముగ్గులా పరిచింది.
ముసలితనం 'ఆరోజుల్లో
అంటూ' గతాన్ని వర్తమానంతో
ముడి వేస్తూ.., కాలాన్ని గెంటేస్తూ
ముచ్చట్లలో పడింది..
వాకిట్లో పక్కలపై పుట్టుకొచ్చిన..
పెదరాశి పెద్దమ్మ రాజ్యాలు..
రాజులు, రాణులు.
జోలపాటలు, బుజ్జగింపులు
ముద్దుమురిపాలకు వెన్నపూసల్లే
కరిపోయింది వెన్నెల
నిరాశలో ఆశను పోగుచేసి బతుకు
చల్లిన విత్తులు మొక్కలై మానులై
బిడ్డలుగా పుట్టుకొస్తే..
మురిసిపోతూ పక్కమీద వాలిన
అమ్మనాన్నలు..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...