Wednesday 25 September 2013

అల్లం శేషగి రావు కథ "చీకటి"

“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణనలతో కూడినది, మేధస్సుకు పదును పెట్టే శైలితో నన్ను ఆకట్టుకున్నదీ ఈ కథ. ఇది ఇద్దరి వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణ. వారిలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల సమాహరం.

ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్పా, ఎవరు తక్కువ అన్నది చూపకుండా ఇద్దరినీ స్నేహితులుగా చూపుతూ, చదువుతోనే రాని, లేని జ్ఞానాన్ని చూపుతూ కథ నడిపిన తీరు నాకు నచ్చింది. ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు చాలామందే ఉంటారు, కానీ చీకటిని ఇష్టపడేవారు చాలా తక్కువ.  మన లోకం వెలుగు ఉన్నంత వరకే. కానీ దీపం వెలుతురు లేని చీకట్లోనూ అందం ఉందని ఈ కథ చెప్తుంది. పాఠకుడు ఈ కథ చదువుతున్నపుడు తన మదిలో ప్రతీ దృశ్యాన్నీ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతీ దృశ్యం మన ముందే జరుగుతుందనే మాయాజాలం చేయటం రచయిత గొప్పదనం.

ఒకే చీకటిలో ఇద్దరు తమ నివాసాల నుంచీ వేటకని బయల్దేరతారు. ఒకరు వర్మ, ఒకరు డిబిరిగాడు. వర్మకి వేట వినోదం, డిబిరిగాడికి అదే జీవనాధారం.  మనం రోజూ చూస్తున్న మన చుట్టూ సంచరిస్తున్న వ్యక్తుల్లో చాలామందిని పట్టించుకోము. అలా పట్టించుకునేందుకు మనకు టైం లేదు. నా అనే స్వార్థంతో ఆలోచించే మనకు చుట్టూ ఉన్న వాళ్లతో సంబంధం ఎంత వరకూ అంటే మన పని చేయించుకునేవరకూ మాత్రమే.

మన పనులకు ఉపయోగించుకునే వాళ్లే కాదు, మనం పట్టించుకోని తక్కువ స్థాయికి చెందిన వాడే డిబిరి గాడు. వాళ్లకూ మనలాగే బాల్యం యవ్వనం వాటితో జ్ఞాపకాల ప్రపంచం ఉంటుందని, అందులో కష్టం సుఖం అన్నీ మిళితమై ఉంటాయనీ, రచయిత వాళ్ల జీవిత శైలిని చాలా క్షుణ్ణంగా విపులీకరించాడు. డిబిరిగాడు నక్కలోళ్ల జాతికి చెందిన సంచారజాతి వాడు. తన వృత్తిలో నైపుణ్యంతోనే గాక, జీవిత సాంరాంశాన్ని కాచి వడపోసినవాడిలా గతాన్ని గురించి తన జ్ఞాపకాల పొరలను తనకు ఎదురైన వ్యక్తి (వర్మ)తో చెప్పుకున్నాడు. డిబిరిగాడు వర్మలో సాటి వేటగాణ్ణి చూశాడే గానీ అతని స్థాయిని చూడలేదు.

తన తండ్రితో అతని అనుబంధం, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వృత్తిలోని అతని కఠినత్వం అతని స్వభావం చెప్పుగోదగ్గవి. రచయిత డిబిరిగాడిని నిజాయితీకి ఒక గీటురాయిగా సూచించాడు. దీనివల్ల వాళ్ల జాతి ఒకటుందని పాఠకుడు ఒక్క క్షణం ఆలోచించేలా చేశాడు.

నన్ను కదిలించిన సన్నివేశం: ఉరి తీసే ముందు నీ ఆఖరు కోరిక ఏమైనా ఉందా చెప్పమని డిబిరిగాడి తండ్రిని అడిగితే అతడు జొన్న రొట్టెలు తెమ్మంటాడు. ఆకుల్లో రొట్టెల్ని చూస్తూ: “బాబూ నా కొడుకు ఇంకా రాలేదు. కానీ వస్తాడు. రాత్రంతా తిండి లేక కడుపు నకనకలాడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆకలితో కరకరలాడిపోతూ ఉంటాడు. ఈ రొట్టెల్ని వాడికి ఇవ్వండి బాబూ. వాడికి బీడీలంటే చాలా ఇష్టం. నా కొడుక్కి నేనిచ్చానని చెప్పండి బాబూ. ఇక నాకు ఏ కోరికా లేదు.”

ఆ తండ్రి తన చావు గురించి విచారించక, తన బిడ్డ ఎలా ఈ ప్రపంచంలో బతుకుతాడో అని ఆఖరి నిముషం వరకూ అతని ఆలోచనలు బిడ్డ చుట్టూ తిరగడం, చివరి కోరిక కూడా వాడి కోసమే కోరడం... మనసులో నిలిచిపోతుంది.

ఉరిశిక్ష తీయబడుతున్న తండ్రిని కలుసుకోవాలని డిబిరిగాడు పరుగుపరుగున ఊళ్లు దాటుకుంటూ రావడం, అతని ఆత్రం, చివరికి తండ్రి శవాన్ని మాత్రమే చూడగలగటం... ఇదంతా నా కళ్ల ముందు జరిగినట్టు భావించాను.

నాకు నచ్చిన దృశ్యం (శేషగిరి రావు శైలిని ఈ పేరా పట్టిస్తుంది):

"బార్... బక్... గొగ్గొగ్గొ..." మని తుంగ దుబ్బుల్లో నుంచి గూడకొంగ రెక్కలు కొట్టుకుంటూ లేచింది. డిబిరిగాడు చటాలున తుపాకీ ఎత్తి దాని గమనంతో పాటే గురి సారిస్తున్నాడు. మెడ సాగదీసుకుంటూ, వెనక్కాళ్లు చాచి గాలిలో రెక్కలు కొట్టుకుంటూ అపుడే లేచిన సూర్యుడికి అడ్డంగా నల్లగా దాటబోతోంది. తుపాకీ గురి వెంటాడుతోంది. 'ధూమ్'! డిబిరిగాడి తుపాకీ పేలింది. దెబ్బకి ఠప్ మని దూది పింజె పిట్లిపోయినట్టు గుప్పెడు వెంట్రుకలు గాలిలో మెరుస్తూ తేలుతున్నాయి. గాలిలోనే చచ్చిన గూడ కొంగ నిండుగా లేస్తున్న ఎర్రటి సూర్యబింబం నేపథ్యంలో విరిగిపడిన చీకటి పెళ్లలా బరువుగా దబ్బున నీటిలో పడిపోయింది. 

ఈ సన్నివేశాన్ని నేను నా కళ్లతో చిత్రించుకున్నపుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేను. నా దృష్టితో ఒక కెమెరా లోంచి చూసినట్లుగా అనిపించింది.

ఈ కథతో సాహిత్యం ఒక స్థాయి నుంచే రాయాలని, రచన చేయాలని హద్దులను చెరిపేసింది. రచనకు హద్దులు లేవు. పేద గొప్ప బేధాలు లేవు. నగరీకరణే కాదు, బడుగు జీవుల జీవితాల్లోనూ ఎన్నో ఎత్తు పల్లాలను ప్రకృతిలోని అందాలను పాఠకుల హృదయాల్లోకి తుపాకీ గుండులా దూసుకుపోయేలా చేయొచ్చు. అని రచయిత తెలియజేశాడు.

జోహార్లు అల్లం శేషగిరి రావు గారు!  

7 comments:

  1. మంచి కథని గుర్తు చేశారు. సమీక్ష ఒరిజినల్‌గా ఉంది. కథ చదివాకా ఇక్కడ కోట్ చేసిన పేరా నాకూ గుర్తుండిపోయింది. అందులో ప్రతీ వాక్యం cinematic swiftness తో పని చేస్తుంది.

    ReplyDelete
  2. Ravi Kiran Muthyala8 October 2013 at 03:40

    నాకు ఇష్టమైన కథ గురించి బాగా వ్రాసారు.

    "ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది."

    - అవును నిజం. ఈ మధ్య విడుదలైన "కథ నేపథ్యం" అనే పుస్తకంలో ఈ కథ వెనుక కథ గురించి చెప్పారు. ఉరికంబం మీది తండ్రి తన చివరి కోరిక గా తనను చూడటానికి వచ్చే కొడుకు కి తిండిపెట్టమని అడగటం అనేది నిజంగా జరిగిన సంఘటన ను స్ఫూర్తి గా తీసుకుని రాశారట. ఆ పుస్తకంలో చెప్పారు.

    మరిన్ని సాహిత్య విషయాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన కథ వెనుక కథ బాగుంది. మీరు కూడా మీ అభిప్రాలూ, సాహిత్య విషయాలూ ఇలాగే పంచుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.

      Delete
  3. i read this story long ago. the name dibiri gadu helped me recollecting the story. thx.

    ReplyDelete
  4. reviews excellent.neenundi inka yenno rachanalu ravalani manasa korukuntunna.

    ReplyDelete
  5. చీకటి కథ మెరుపులను బాగా రాశారు.అభినందనలు!

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...