Sunday 27 August 2017

ఈమధ్య నేను చదివిన కథ.......



“ఏ నిముషానికి ఏమి జరుగునో” ఈ కాలం, ఈక్షణం అపురూపమైనవి. నిన్న ఇదే కాలంలో, నిన్న ఇదే క్షణంలో నేను ఎక్కడున్నాను అన్న ప్రశ్న వేధిస్తుంది నన్ను అస్తమానూ.  ఆ క్షణంలో నేను ఉండే ప్రదేశాలు, కలిసే మనుషులు అన్నీ ఓ వింత అనుభూతిని మిగుల్చుతాయి. అలా ప్రతి మనిషీ ఓ అపరిచిత వాతావరణంలో గడిపే క్షణాలు రాకపోవు. అందులోని మనుషులు, పరిసరాలు అన్నీ నువ్వు ప్రస్తుతం నీదనుకుంటున్న ప్రపంచానికి కాస్త భిన్నమే, అయినా ఆ క్షణాలను ఆస్వాదించి, ఆ కొత్త ప్రపంచాన్ని ఆహ్వానించే మనసు నీకుండాలి. నువ్వు అనుకోని ఊహకందని వ్యక్తులను కలిసి వారితో గడిపినప్పుడు నీ ప్రపంచానికీ వారి ప్రపంచానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతాయి. అప్పుడు నీకెంత పలుకుబడి ఉన్నా, సమాజంలో ఎంత పేరున్నా, నిన్నో సామాన్యుడిగా, సాటిమనిషిగా మాత్రమే చూసే క్షణాలు గొప్పవి. అవి నిన్ను నువ్వు తెలుసుకునే క్షణాలు.
“అతడు మనిషి” అద్దేపల్లి ప్రభు రాసిన ఈ కథ అదే చెపుతుంది. ఈయన రచనలు నేను ఇదే తొలిగా చదవడం. మామూలు శైలిలో చక్కగా సాగింది కథ.
ఒక కోట్:
“మనిషి సుఖంగా ఉన్నప్పుడు యాపారం చెయ్యచ్చు బాబూ..... కట్టంలో ఉన్నప్పుడు యాపారం చైకూడదు. రాత్రి మీరు కట్టంలో వచ్చారు. మీరు మడిసి..... నేను మడిసిని.... వానకి ముద్దైన పిట్ట చెట్టు మీద వాలబోతే చెట్టొద్దంటాదా.... ఇదీ అంతే... అలాంటి పరిస్థితిలో మడిసిని మడిసి సాయపడకపోతే ఇంకాణ్ణి మడిసనెలా అంటాం... ఇలాగే నాలాంటి మడిసి నీ ఇంటి ముంగిట నిలిస్తే లోనికి రమ్మంటావా.... బయటకు పొమ్మంటావా...?” ఈ కథలోని ఈ ఆఖరు మాటలు నన్ను కాసేపు వెంటాడాయి.

Saturday 26 August 2017

ఈమధ్య నేను చదివిన కథ..........



నవమాసాలూ బిడ్డను తన కడుపులో మోసిన తల్లి బరువు దిగిందని కాస్తన్నా విరామం తీసుకోలేని స్థితి, ఆ ఆడబిడ్డను తమలో మరో మనిషిని దాస్తున్న మృగాల నుండీ అనుక్షణం కాపాడుతూ మరో అయ్య చేతికి అప్పగించేంత వరకూ నిత్యం మోస్తూనే ఉంది. ఎటునుండీ ఏ మృగం తమ ముక్కుపచ్చలారని బిడ్డపై పడతాడోనన్న భయం. అంతటి భయానక వాతావరణంలోకి జారిపోతున్నాం మనం. ఆడబిడ్డకు స్వేచ్ఛ, రక్షణా రెండూ లేవు. అది ఐదేళ్ళ పసికందైనా, అరవైయ్యేళ్ళ అమ్మమ్మైనా. కాలం మారుతున్నకొద్దీ పక్కవాడిని నమ్మలేని తనం నిండా ఆవరించేస్తుంది.
కాశీభట్ల వేణుగోపాల్ గారు రచయితగా నాకు తెలీదు. ఆయన రచనలు చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని నేను అర్థంచేసుకోగలనా అనే మీమాంసతో ఉన్న నాకు ఆయన రాసిన కథ ఒక్కటన్నా చదవాలని అనిపించి “బృందా” కథ మొదలు పెట్టాను. ఇప్పుడన్నా అంతటి సాహసం చేసినందుకు ఆనందిస్తున్నాను. ఈ కథలో ఎక్కడా రచయిత కనిపించడు, ఓ అమ్మ, ఆమె తన బిడ్డలను రక్షించుకోడానికి పడే తపనే కనిపిస్తుంది. రచయిత కథనంతా తనలోకి ఓ తల్లి హృదయాన్ని ఆవాహన చేసుకుని రాసాడా అనిపిస్తుంది. కథ శాంతం ఓ తల్లి మనసే కనిపిస్తుంది. రచయిత తన పదునైన మాటలతోనో, లేదా కథా వస్తువుతోనో సమాజాన్ని ఉద్ధరించే బాధ్యతను తన భుజాలకెత్తుకోలేదు. ఆ మాట ఆయన మొదటి పరిచయంలోనే చెప్పారు.
బృందా ఓ అమాయకపు ఆడపిల్ల, మానసికంగా సరిగా ఎదుగుదల లేని ఆమెను వికారపు చూపుల నుండీ కాపాడాలనే ఆమె ప్రయత్నం, ఓ తల్లిగా నన్ను కన్నీరు పెట్టించింది. ఈ కథను 2005 వ సంవత్సరంలో కాశీభట్లగారు రాసారు. అప్పటి ఆయన ఆలోచనల్లో నలిగి వచ్చిన ఈ కథకన్నా, ఇప్పటి 2017 మన ఆలోచనలకు అందనంత విధంగా ఆడవారి పట్ల నిముషానికో అత్యాచారంతో కృరంగా మారింది. నా ఉద్దేశంలో కాశీభట్లగారు ఇప్పుడు ఈ కథను రాయవలసి వస్తే ఏలా ఉండేదా అని.
ఈ కథలో కాశీభట్లగారు వాడిన అర్థంకాని పదాలు చాలా తక్కువే, శైలి అద్భుతం, ఓ ప్రవాహం. ఈకథ ఆయన మరిన్ని కథలు చదివే ధైర్యాన్ని ఇచ్చింది.
నాకు నచ్చిన పేరా....
“మబ్బు పట్టినాకాశం.... ఈదురుగాలిలో తేలివస్తున్న వాన పరిమళం... గుండెల్నిండా చెమ్మ నిండిన గాలిని పీల్చికున్నాను. పరిచిత గత ఖేదం... ఎప్పటికో ఘనీభవించింది. కరిగి గుండెల నిండా నిండిన చెమ్మ గాలితో చేరి.... కళ్ళల్లోకి చేరుకుంది... కరెంటు పోయింది. వెలుగుతున్న కొవ్వొత్తి శిఖ రెపరెపలాడుతోంది... గది చీకటి నలుపుదనాన్ని పలుచబరచడానికి లేత బంగారు కాంతి బలహీనంగా ప్రయత్నిస్తోంది.”

Friday 25 August 2017

ఈమధ్య నేను చదివిన కథ....


చెదిరిపోయిన బంధాలు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీలో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అవి నిన్ను విడిచి దూకంగా పోయినప్పుడు నువ్వు పడ్డ బాధనంతా పంటికింద నొక్కిపెట్టి ఒక్కసారిగా కట్టలు తెంచుకు వస్తున్న దుఖాఃన్నంతా కంటి కొనల్లో ఆపి నీ ముందున్న నీ పేగు బంధాన్ని గుండెలకు హత్తుకున్న నీలో దాగున్నది మానవత్వం అనాలా దైవత్వం అనాలా?
"ఎడారి కోయిల" మధురాంతకం రాజారాం గారు రచించిన ఈ కథ చదువుతున్నప్పుడు నాలో దాచేసుకున్న గతాన్ని కాసేపు తాకింది. పల్లెటూరు, అక్కడి మనుషులు, వారి జీవితాలు, ప్రేమలు, ఆప్యాయతలు, పాడి పంటలు, ఉన్నతనానికీ లేనితనానికీ మధ్యగా ఉన్న గీతను చాలా దగ్గరగా చూపించారు.
పేగుతెంచుకుని పుట్టిన బిడ్డ ఆ బంధాన్ని కాదని దూరంగా పోతే ఆ తల్లితండ్రులు సమాజంతో కలిసి మనడానికో, లేదా వాడి తరవాత పుట్టినవాళ్ళను బ్రతికించుకోవడంలోనో నిన్ను కాసేపు మరిచిపోవచ్చు. నువ్వు రావని జీవితంతో రాజీ పడిపోవచ్చు కానీ నువ్వు పుట్టినప్పుడు ఆ తల్లి పడ్డ పురిటినొప్పులు ఆమె ఊపిరి ఉన్నంతవరకూ మరవదు.
కొడుకు రాకపోయినా తన మూలాలు వెెతుక్కుంటూ వచ్చిన మనవడిని చూసి "సుబ్బారాయుడి కళ్ళు పెద్దవయ్యాయి. ఫాలతలంలో గీతలు పడ్డాయి. ముఖంలో ఆళ్చర్యం చిందులు తొక్కింది. ఎండుపుల్లాంటి చేతులు, పైకిలేచి, రవిబాబును మంచంపైన కూచోబెట్టుకున్నాయి. ముఖమంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయాడు."
1986లో రాసిన ఈ కథ అప్పటి ఉమ్మడి కుటుంబాల వాతావరణానికి సరిపడకపోవచ్చు,లేదా కాస్త కొత్తదనంతో కనిపించవచ్చు. కానీ ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్న ఊరిలో 50 కుటుంబాల వాళ్ళ పిల్లలు అమెరికా ప్రయాణం కడుతున్నారు. ఇక తిరిగివస్తున్నారా ఇక్కడి తల్లితండ్రులను చూస్తున్నారా అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇక్కడి తల్లితండ్రులు కూడా బిడ్డల్ని అమెరికా పంపేటప్పుడే వీడు ఇక తిరిగి ఇక్కడకు రాడు. అక్కడే స్తిరపడిపోతాడు అన్న ఉద్దేశానికి వచ్చే పంపుతున్నారు. అదే వారికి సమాజంలో ఖ్యాతి కూడాను.
అందువల్ల నన్ను ఈ కథ పెద్దగా బాధించకపోయినా, రాజారాంగారి శైలి, కథ సాగిన తీరు నన్ను కట్టిపడేసాయి.
ఈకథలో నాకు నచ్చిన పేరా................
"పగటి వెలుగులు క్రమక్రమంగా తరిగిపోయి, రేజీకట్లు మెల్ల మెల్లగా ముసురుకుంటున్న ఆ మునిమాపువేళ, అపరిచితుడైన పడుచువాడొకడు కాలిబాట వెంట ఊరివైపు నడిచి రావడం గమనించి ఆడుకుంటున్న పిల్లలందరూ ఊరి ముందర గుమిగూడిపోయారు. బావిదగ్గర నీళ్ళు చేదుతున్న ఆడవాళ్ళు విగ్రహాల్లా స్తంభించిపోయి విస్మయంతో చూస్తున్నారు. రచ్చబండమీద కూచున్న మగవాళ్ళ దృష్టికూడా కాలిబాటవైపు కేంద్రీకృతమైంది."
ఊరిలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులను ఇలా వింతగా చూడటం అన్నది ఎంతో బాగా చెప్పారు.

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...