Friday 21 May 2021

విముక్తి...




ఎగిరే పక్షి స్వేచ్ఛను 

దొంగిలించాలనిపిస్తుంది

పారే నది పరవళ్ళు 

ఎత్తుకుపోవాలి

ఉరకలేసే లేగదూడతో 

స్నేహం చేయాలి

ఊరంతా తిరిగిచూపే 

రంగుల రాట్నానై

పోవాలి

రాలిన స్వప్నరాగాల 

ముందు విరాగినైపోయి

కలల తీరాలను నెట్టేసి

చినుకు తెరల మాటున 

ఉరుమునైపోవాలి

భయాల చెట్టుకింద నిద్రపోయి

రోగాన్ని విదిలించుకుంటున్నాను.

వారాలు నెలలు చుట్టాలైపోయాయి

నీడలన్నీ వాదులాడుతున్నాయి

విముక్తి కోసం వెంపర్లాట

నిలువుటద్దం చెప్పే నిజాలు




ఒక్కోసారి ఈ అద్దం నాతో 

ఊసులాడుతుంది

నన్ను చంద్రవంకను చేస్తుంది

తారలు నాముందు 

చిన్నబోతాయంటుంది

మనసు దిగులుకు 

మత్తుపూసి చిరునవ్వును

కట్టబెడుతుంది

మకిలిపట్టిన ఆలోచనలన్నీ 

కడిగి కన్నీటిని బయటేస్తుంది

గాజురాళ్ళ దుద్దుల్ని 

రత్నాలకు మల్లే మెరిపించి 

మాయ పులుముతుంది.

అందాన్ని తన వెంటేసుకుని తిరుగుతుంది..

నీ అంతవారు మరి లేరంటుంది.

నన్ను యువరాణిని చేసి 

నా సమయమంతా కాజేస్తుంది.

పగిలిన అద్దంలో బ్రతుకు భద్రం 

చేసుకోమంటుంది.

పదునైన వలపుల్లో పడి 

తనలా పగిలిపోవద్దంటుంది.

ఏంటో ఈ నిలువుటద్దం 

నాకన్నీ నిజాలే చెపుతుంది.

Thursday 20 May 2021

నీ ముందు నిశ్శబ్దాన్ని....



ఎప్పుడూ కలలో కొచ్చే గోదారి 

ఒడ్డున ఈసారి మనమిద్దరం

ఓ జతైపోయి,గలగల పారే నీటి 

సవ్వడిలో మన వలపును 

పండించుకుంటాం.

మౌనంగానే ఎన్నో ఊసులు పలికే

నీ ముందు నేను మూగనై కూర్చుంటాను.

నీ ఓర చూపులో తొంగిచూసే

కొంటేదనం మనసులోని

కోరికనంతా బయటేస్తుంది.

మనసును గిల్లుకుంటూ మొహమాటం 

మాటున నువ్వు దాచే రహస్యాలన్నీ 

పసిగడతాను.

నా మాటలెన్ని పుట్టినా ఒక్కోసారి

నీ ముందు తేలిపోతాయి. 

నీ సమక్షంలో నులివెచ్చని సాయంత్రపు

స్పర్శను అనుభవిస్తాను.

అరవిరిసిన పూమొగ్గలా నా చేయి

నీ చేతుల్లో వాలిపోతుంది.

జీవితపు ఆస్వాదనను నీ ఒడిలోనే

కలగంటాను.

అప్పుడూ నా నుంచి నీకు నిశ్శబ్దమే

సమాధానం అవుతుంది.

Friday 7 May 2021

అతడు..






 వలపు దారుల జాడతెలియక నిన్నటి రాత్రి

కలియ తిరిగాను అతని జాడ పట్టుకోవాలని
ఆశ..
నిదురంతా చెదిరేంత కల అది
బాధామయ చీకట్ల కావల
అతని జాడ.., అతని ధ్యాసే నాకు
మానస సాగరాన్నై ఎప్పుడూ
అతని తలపును కలగంటాను
జ్వాలలా క్రమంగా ఆక్రమించే అతని ఛాయ
తనువును ఛిద్రం చేనే అతని స్పర్శ
ఎన్ని భారమైన నిట్టూర్పులో
విడుస్తూ కాచుకున్నాను
కలల ఆనకట్ట వేసినప్పుడల్లా
అతని వైపే పయనిస్తాను
నా హృదయ ద్వారాల ముందు
వేకువ చుక్కై మెరుస్తాడు అతడు
నా వలపు తలపులన్నీతెరిచి చూస్తానా
మళ్ళీ అందనంత దూరంగా జరిగిపోతాడు
ఎక్కడో ఏటి ఒడ్డున నిలబడి నాకేసి చూస్తూ..,
శిలగా మారిపోతాడు
ఎంత ఆరాటమో సృష్టించి పోతాడు
సుళ్ళు తిరిగే ఆశల అలజడిలో నన్నో
చకోరాన్ని చేసి..పోతాడు
ఎంత దయలేని హృదయమో..

Wednesday 5 May 2021

నేను..



భరించలేని నిశ్శబ్దాన్ని

పుస్తకం వైపు చూపును

మల్లెల సువాసనను

జీవితపు ఆస్వాదనను

నేను..

మంద్రంగా వినిపించే సంగీతాన్ని

చెదిరి వర్షించే మేఘాన్ని

సహనం కోల్పోయిన ఆలోచనను

నీతో మాటలు లేని రోజును

మౌనం మింగిన అగాధాన్ని

నేను..

ఎండకు పుట్టిన చెమటచుక్కను

వెలిసిపోయిన ఇంధ్రధనస్సును

నడిరాతిరి గొంతెత్తి పాడే కీచురాయిని

Sunday 2 May 2021

ఎదురు చూస్తాను



గాలి కదిలిన ప్రతిసారి ఎత్తుకొచ్చే కబుర్ల

దొంతరను తడిమి చూస్తాను

అక్కడంతా నా పెదాలనంటిన తడి ఆనవాళ్ళే

కనిపిస్తాయి.

నిలిచిపోయిన కాలానికి దగ్గరలో 

నాకోసం చూసే నీ చూపును వెతుకుతాను

అందులోనూ నీ చేతి స్పర్శలో పండిన రోజులే

ఆనతాయి.

దూరం పెరిగి విరిగిపోయిన మనసు

ముక్కలను జతచేస్తాను

గిల్లికజ్జాల మన వాదులాటల మధ్య నలిగిన ప్రేమే

కనిపిస్తుంది

ఇద్దరం కలిపి వెళ్ళదీసిన కాలానికి వెళ్ళి 

మన జ్ఞాపకాల పుస్తకాన్ని తిరగేస్తాను

అందులోనూ బిగికౌగిలి ఇచ్చిన సుఖమే

నిండి ఉంటుంది.

నీ ఆనవాళ్ళను ఎత్తకువచ్చే 

ఆలోచనలకు ఊతమై

రాగల రోజులన్నీ మనవని భ్రమ పడతాను.

నిజానికి కరిగిన కాలమంతా తీయగా

నీ స్పందన లేని హృదయం

తో నడక భారంగా ఉంది.

అయినా నువ్వంటే గత 

జన్మాల తాలుకు సాక్షానివి. 

ఎదురుచూస్తాను.. ఆ కాలానికి 

ఎత్తుకుపోతావని ఆశగా..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...