Tuesday 10 December 2013

బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ”


ఓల్గా గారి నవల "స్వేచ్ఛ" రివ్యూ కినిగె పత్రిక డిసెంబరు సంచికలో పడింది. దాని లింక్: 



పిడిఎఫ్ లింక్: 


http://patrika.kinige.com/wp-content/uploads/2013/12/Review-of-Swetcha.pdf


ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత ఓల్గా స్వేచ్ఛ గురించి ఇలా అంటారు:
ఈ స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి ఇది సాధించడమే చాలా కష్టం. మన నుండి మనకు స్వేచ్ఛ. మనకు పుట్టుక నుండీ అలవాటైన భావాల నుండీ అభిప్రాయాల నుండీ ఆచారాల నుండీ స్వేచ్ఛ. మనలో జీర్ణించుకు పోయిన నమ్మకాల నుండీ విడుదల.
అరుణ ఎమ్మే ఆఖరి సంవత్సరం పరిక్షలు రాసింది. మధ్యతరగతి కుటుబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్న నాటి నుండి అదుపాజ్ఞలతో పెరిగింది. వయసు రాగానే తండ్రీ, అన్నగారూ అరుణకు హద్దులు నిర్ణయించేవారు.
దీనికి కొంత కారణం అరుణ మేనత్త కనకమ్మ, భర్త చిన్నవయసులోనే చనిపోవడంతో తమ్ముడి (అరుణ తండ్రి) ఇంటికి కొంత ఆస్తితో చేరింది. వయసులో జరగాల్సిన ముచ్చటలేమీ జరగని కనకమ్మ తమ్ముని భార్య సీతమ్మ పైన, ఆ ఇంటివారి పైన తన పెత్తనాన్ని, కసినీ వెళ్ళగక్కుతూ ఉంటుంది. ఆమె ఆస్తి మీద ఆశతో ఎవరూ మారు మాట్లాడేవారుకాదు. ముఖ్యంగా అరుణను అనుక్షణం అణిచి వేయాలని చూసేది. అరుణ అక్కను 15 సంవత్సరాలకే పెళ్ళి చేసి పంపినట్లే అరుణను కూడా పంపాలని ఆమె ఆలోచన. అక్కకు మనవరాలు పుట్టినా ఇంకా చెల్లెలికి పెళ్ళి చేయలేదని తమ్ముడిని పోరేది. ఈ అణిచివేతను, ఆంక్షలనూ అరుణ చిన్న వయసు నుండీ మనసులోనే వ్యతిరేకిస్తూ ఉండేది.
ఇలాంటి కుటుంబంలో అరుణ ఆ మాత్రమైనా చదువుకోవటానికి కారణం తండ్రి జానకి రామయ్య దగ్గర పెళ్ళి చేయడానికి తగిన డబ్బు లేకపోవడమే, లేదంటే ఏనాడో పెళ్ళి చేసి గుండెల మీద భారాన్ని దింపుకునే వాడు.
ఆర్థిక స్వాతంత్రం కోసం ఉద్యోగం సంపాదించి, తాను ప్రేమించిన ప్రకాశాన్ని పెళ్ళాడితే తనకు స్వేచ్ఛ లభిస్తుందని అరుణ ఆలోచన. ఉద్యోగం రాగానే ప్రకాశాన్ని వివాహం చేసుకుంటుంది. అప్పుడే పిల్లలు వద్దన్నా ప్రకాశం వినిపించుకోడు, మొండి వైఖరితో అనుకున్నది సాధిస్తాడు. అతనికి మొదట్నుంచీ అరుణ ఉద్యోగం చేయటమూ, స్వతంత్రించి ఆర్థిక నిర్ణయాలు తీసుకొవటమూ పెద్దగా నచ్చదు. అరుణ ఉద్యోగం చేస్తూనే కుటుంబ భాధ్యతలనూ సమర్థంగా నిర్వహిస్తున్నా ప్రకాశం ఆమెను తన మాటలతో బాధ పెడుతుంటాడు. ఆమె కాలేజీలో పూర్తి జీతం కోసం సమ్మెలు చేయడం, అభ్యుదయ పత్రికకు పని చేయడం, అందుకోసం నలుగురిలోనూ తిరగడం, మెహందీ మహిళల్ని ఇంటర్యూ చేయడం, ఇవన్నీ చూసి అతనిలో వ్యతిరేకత పెరుగుతుంది. తన భార్య పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితం కావలన్నది అతని అభిప్రాయం. సమాజంలో జరిగే విషయాలన్నీ నెత్తి మీదకు వేసుకోవద్దంటాడు. చివరకు సంసారం కావాలో, సమాజ సేవ కావాలో తేల్చుకోమంటాడు.
ప్రకాశం మనస్తత్వం లోని మార్పును, మాటలతో అవమానించే తీరును అరుణ సహించలేకపోతుంది. చుట్టూ స్త్రీలంతా పైకి ఎలా ఉన్నా తనలాంటి సమస్యలతోనే సతమతవుతున్నారని అరుణ నెమ్మదిగా గ్రహిస్తుంది. చివరకు పైకి ఎంతో అభ్యుదయవాదిలా కనిపిస్తూ సమాజ చైతన్యం అంటూ కబుర్లు చెప్పే తోటి ఉద్యోగి కేశవరావు సొంత ఇంటిలో మాత్రం భార్యను కట్టు బానిసలా వంటింటికే పరిమితం చేయటాన్ని చూసి భరించలేకపోతుంది.
బంధనాల స్వభావం తెలిసే కొద్దీ అరుణకు స్వేచ్ఛ స్వరూపం కూడా అర్థమవుతుంది. చివరకు బంధాల నుండి విముక్తురాలు కావాలన్న నిర్ణయానికి వస్తుంది. తనకు చేతనైనంత వరకు సమాజానికి, తోటి ఆడవారికి సాయపడాలనే ఆలోచనకు వస్తుంది.
నా అభిప్రాయం:—
స్వేచ్ఛ ఇది ఒకరు ఇచ్చేదికాదు, ఒకర్నుంచి పుచ్చుకునేదీ కాదు. ప్రతీ స్త్రీ తన మనుగడకు తాను స్వతంత్రంగా జీవించడానికి చేసే పోరాటమే స్వేచ్ఛ. కాలం మారిందంటారు గానీ స్త్రీలు ఇప్పటికీ బంధితులే. ఆ బంధనాల స్వభావం మారిందంతే.
ఒకప్పడు తల్లిదండ్రులు అమ్మాయిలకు బాల్యంలో ఎంత స్వేచ్ఛ ఇచ్చినా వయసుకు రాగానే ఆమెను కట్టడిలో పెట్టేవారు. చూసే చూపు, మాట్లాడే తీరు, నడక, నడత అన్నింటిలోనూ లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టేవారు. ఇంటి పరువు, ప్రతిష్టా నీ చేతల్లోనే ఉన్నాయనేవారు. తోబుట్టువుల భవిష్యత్తు నీ నడవడిక మీదే ఆధారపడిందనేవారు. ఆమె ఆ మాటలనే వేదంగా పాటించేది. తనకు తాను హద్దులను ఏర్పరుచుకునేది. ఈ స్త్రీలకు చదువు కూడా ఒక సమస్యే.
అలా స్వేచ్ఛ లేని జీవితంలోనే పుట్టి పెరిగి, పెళ్ళి, సంసారం, భర్త, పిల్లలు, అత్త, మామా, బంధువర్గం అంటూ బంధాల వలయంలో చిక్కుకునేది. కుటుంబ భాధ్యతలు, పిల్లల పెంపకంలో పడి ఎన్నడూ తన అభిప్రాయాలను, ఆలోచనలనూ బయట పెట్టే వీలుండేది కాదు. ఆఖరు నిముషం వరకూ ఆ పరిధిలోనే జీవించేది. ఆ ప్రపంచంలోనే తనువు చాలించేది.
ఆ కట్టుబాట్లు దాటాలనిగానీ, తన సమస్య పై పోరాడాలని గానీ ఆమెకు ఆలోచన లేదు. తాను అణిచివేతకు, గృహహింసకూ గురి అవుతున్నా ధైర్యం చేయదు సరి కదా, సాటి స్త్రీ ఎవరన్నా ఆ సమస్య పై పోరాడుతుంటే చులకనగా చూస్తుంది.
నేటి స్త్రీ జీవితం పైకి ఇందుకు భిన్నంగా కనిపించినా, అంతర్లీనంగా ఆమెకుండే బంధనాలు ఆమెకూ ఉన్నాయి. ఆమె చదువు వల్ల వచ్చిన వివేకమూ విజ్ఞానమూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైన పదవి, ఆర్థిక స్వాతంత్రమూ ఉంది. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోగలదు. సమాజానికి సేవచేయాలనే అభ్యుదయ భావాలు కూడా లోపల ఉంటాయి. అయినా ఆమె కూడా కుటుంబానికీ, భర్తకూ లోబడే నడుచుకుంటుంది.
ఇలాంటి కనపడని బంధనాల్ని చిత్రిస్తుందీ నవల. ఇది 1987లో రాసిన నవల. ఈ పాతికేళ్లలో కొంతలో కొంత మార్పు వచ్చింది. స్త్రీ  మగవానితో సమానంగా అన్ని రంగాలలోనూ రాణిస్తోంది. సమాజంలో స్త్రీ మీద జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటుంది. సాటి స్త్రీ కి అన్యాయం జరిగితే మహిళా సంఘాల ద్వారా నిరసనల ద్వారా పోరాడుతుంది. మీడియా సహకారాన్ని తీసుకుంటుంది. ఒకప్పుడు చదువున్నా కుటుంబానికే పరిమితమై అణిచివేతనూ, గృహహింసనూ, మౌనంగా భరించిన  స్త్రీ నేడు తనను తాను ప్రశ్నించుకుంటుంది, తాను ఎందుకు భరించాలంటూ  సమాజాన్నీ ప్రశ్నిస్తుంది.
జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యల పై ధైర్యంగా పోరాడ గలిగిన రోజున వరకట్నచావులు, బలవన్మరణాలూ ఉండవు. ఓల్గా గారి మాటల్లో చెప్పాలంటే:
ఇంట్లో అణిగి మణిగి పరాధీనగా ఉన్న స్త్రీ, ఉద్యోగంలో ధైర్యంగా, నైపుణ్యంగల దానిగా, పట్టుదలతో లక్ష్యం సాధించేదానిలా, తెలివితో బాధ్యతతో ప్రవర్తించాలి. ఉద్యోగంలో, సమాజంలో ఇంత తెలివిగా బాధ్యతగా ప్రవర్తించటం నేర్చుకున్న స్త్రీ ఆ తెలివినీ బాధ్యతనూ ఇంటికి కూడా తీసుకువస్తుంది.
మగవాడు కూడా తాను స్త్రీ కన్నా అధికుడననే భావనను వదిలి పెట్టి సమదృష్టితో ఆలోచించి అర్థం చేసుకున్ననాడు, భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్ననాడు, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించిన నాడు, వారి మధ్య గొడవలూ కీచులాటలూ పెరగవు. సమస్య ముదిరి విడాకుల వరకూ రాదు.
~ దుగ్గిరాల శ్రీశాంతి
స్వేచ్ఛ ఓల్గాప్రాప్తి: ఈ-బుక్ – కినిగెలో 



Friday 22 November 2013

విలువల్ని నిలదీసే శారద నవలలు

శారద గారి అసలు పేరు ఎస్. నటరాజన్ గారు. ఈయన తమిళదేశస్తుడు. పన్నెండేళ్ళప్పుడు తెనాలి వచ్చారు. చిన్ననాటి నుండి తమిళ సాహిత్యంపై మక్కువతో ఆ వయసులోనే పలు రచనలు చదవారు. తనకున్న పఠనాశక్తి వల్ల తెనాలి రాగానే తెలుగు భాష కూడా నేర్చుకొని ఎన్నో రచనలు చదవడమే కాక తోటివారికి చెపుతుండేవారు.

నటరాజన్ గారు తెలుగు భాషలో పలు కథా, నవలా రచనలను చేసారు. వారి మొదటి రచన “ప్రపంచానికి జబ్బు చేసింది”. ఆయన రచనల్లో నేను ప్రస్తుతం చదివింది పర్‌స్పెక్టివ్స్ వాళ్లు ప్రచురించిన “శారద నవలలు”. ఇందులో మెుత్తం మూడు నవలలు ఉన్నాయి. అవి: “ఏది సత్యం”, “మంచీ చెడు”, “అపస్వరాలు”.

ఏది సత్యం

పార్వతి భర్త సాంబశివరావు. రైసు మిల్లులో సూపర్ వైజర్ గా పనికి కుదిరాడు. వారి సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో, సాంబశివరావుకు రైసు మిల్లులో ఒక ప్రమాదం జరిగి కాలు విరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, సుఖంగా సాగుతున్న వారి సంసారంలో కష్టాలు ప్రవేశించాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. సంసార భాధ్యత అమాయకురాలైన పార్వతి పై పడింది. పొరుగింటి వారి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరింది పార్వతి.
పార్వతి ఉద్యోగం చేయడం సాంబశివరావుకు ఇష్టం ఉందదు గానీ, పొరుగు వారి బలవంతం మీద, ఇల్లు గడవడానికి వేరే మార్గం లేక ఒప్పుకుంటాడు. రోజంతా ఇంటిపట్టున ఒంటరిగా గడిపే సాంబశివరావు పార్వతి మీద అకారణంగా ద్వేషాన్నీ, అనుమానాన్నీ పెంచుకున్నాడు. అకారణంగా భార్యని బాధించి కొంత ఆనందించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలోని అనుమానం పెనుభూతమై వారి సంసారాన్ని దహించివేసింది.
అణుకువ, అందం, అమాయకత్వం కలిగిన అమాయకురాలు. భర్తను కాపాడుకోవాలనే ఆశతో ఎన్ని కష్టాలు ఎదురైనా మెుండిగా ఎదిరించింది. శరీరమే కాదు మనసూ అవిటిదని తన చర్యల ద్వారా నిరూపించాడు సాంబశివరావు.

మంచీ చెడు

యాభై ఏళ్ళ భద్రయ్య ఇరవై కూడా నిండని అమ్మాయిని పెళ్ళాడతాడు. భద్రయ్య ఇరవై ఏళ్ళ కుమారుడు భాస్కర్రావు పట్నంలో చదువుకుంటున్నాడు. పెళ్ళి విషయం తెలిసినా తండ్రి నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోతాడు. తన కంటే చిన్నదాన్ని తండ్రి పెళ్ళాడటంతో మనసులోనే బాధ పడతాడు.

భద్రయ్య వ్యాపార మిత్రుడు సుదర్శనం. అతని మొదటి భార్య చనిపోయాకా రెండో పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్యతో అతనికి ఒక కూతురు. ఆమె పేరు సరోజిని. కొత్తగా వచ్చిన సవతి తల్లి ఆమెను నానా బాధలు పెడుతుంది. ఒకసారి పొయ్యిలో తోస్తే ఆమె ముఖం కాలి అందవిహీనంగా తయారవుతుంది. అప్పటి నుంచీ తండ్రి సుదర్శనం ఆమెను మేలి ముసుగులో దాచి ఉంచుతాడు. అతను ఆమెను తన స్నేహితుడు భద్రయ్య కొడుకు భాస్కర్రావుకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కాని సరోజిని రూపు నచ్చని భాస్కరం ఆమెను తిరస్కరిస్తాడు. కోపం పట్టలేని సుదర్శనం వారిపై పగ పట్టి వారి ఆస్తిని కాజేస్తాడు.

ఆస్తిపోయి పేదవారుగా మిగిలిన భద్రయ్య కుటుంబానికి కొడుకే ఆదారమౌతాడు. పుండు మీద కారంలా వాళ్ల ఇల్లు కూడా తగలబడటంతో అంతా కట్టు బట్టలతో రోడ్డున పడతారు. భాస్కర్రావు చిన్న బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేస్తూ కుటుంబ బాధ్యత మోస్తాడు.  కొన్ని రోజులకు భద్రయ్య కాలం చేస్తాడు.

భద్రయ్య భార్య పద్మ ఆ పేదరికాన్ని భరిచలేక పెడ దారి పడుతుంది. ఫలితంగా గర్భం దాల్చి ఎవరికి కనిపించకుండా వెళిపోతుంది. భాస్కర్రావు ఎన్నో కష్టలు అనుభవించి అందరిలో మంచి పేరు సంపాదించుకుంటాడు. పెడదారి పట్టిన పద్మ జీవితం ఎన్నో చేతులు మారి చివరకు వెలయాలిగా మిగిలిపోతుంది.
ఈ కథకు సమాంతరంగా సుదర్శనం కూతురు సరోజిని కథ కూడా నడుస్తూంటుంది. భాస్కర్రావు కాదన్నాడన్న పట్టుదలతో సుదర్శనం ఆమెను శంకరం అనే అనామకునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అతను దుర్వ్యసనపరుడు. సుదర్శనం డబ్బుకు ఆశపడి సరోజినిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను నానా బాధలు పెడతాడు. అతని సుఖవ్యాధులన్నీ ఆమెకు సంక్రమించి ఆమె అకాల మరణం చెందుతుంది.

అపస్వరాలు 

రంగయ్యగారు తెలుగు పండితుడు. కొడుకు సదానందం మృదు స్వభావం, కళలయందు ఆసక్తి కలవాడు. కూతురు జయ పెళ్ళయినా కట్నం డబ్బులు ఇచ్చుకోలేక పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ మధ్య తరగతి సంసారాన్ని రంగయ్యగారే ఎన్నో ఆర్థిక ఇబ్బందులకోర్చి నెట్టుకొస్తున్నాడు.

రంగయ్య గారి వియ్యంకుడు వకీలు శేషాద్రిరావు ధనవంతుడే అయినా డబ్బు మీది వ్యామోహం చావని వాడు. ఈయన వంశోద్ధారకుడు త్రయంబకరావు. కూతురు రమణమ్మ వైదవ్యంతో పుట్టినింటే ఉంటుంది. తల్లితండ్రులు తమ్ముని సంసారం చేజేతులా నాశనం చేస్తున్నారని గమనించి, ధైర్యంగా వ్యవహరించి భార్యను కాపురానికి తెచ్చుకోమని తమ్ముణ్ణి హెచ్చరిస్తూ ఉంటుంది.

రంగయ్యగారు వచ్చే రెండు వందలూ సరిపోక రచనలు చేస్తూంటాడు. పబ్లిషరు మోసగిస్తాడు. చివరికి ఆయన తన కంటి చూపును కూడా పోగొట్టుకుంటాడు.

వరదరాజులు మరో పాత్ర. రౌడీగా జీవితం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాడు. కానీ తప్పు చేసి సంపాదించిన డబ్బు సుఖాలిచ్చినా మనశ్శాంతిని ఇవ్వలేక పోయింది. ఉన్న డబ్బుతో ఎవరికీ సాయపడడు గానీ, అందరిపై జాలిని ప్రేమను మాత్రం ప్రదర్శిస్తాడు. అది ఎవరికీ అక్కరకు రాదు.

కట్నాల దాహం వల్ల కుటుంబాల్లో సంభవించే అనర్థాలు, చదువు సంధ్యాలేని పబ్లిషర్లు రచయితలపై చూపే అనాదరణ, ఎన్నికల్లో డబ్బును ఎరగాచూపి అక్రమంగా గెలవాలని చూసే రాజకీయ నాయకులు, నాటకాల పేరుతో తమ కళాకారులను వశపరచుకొనే స్వార్థపరులు... ఇలాంటి పాత్రలతో కిక్కిరిసిన ఈ నవల సాటివారి కోసం ఆలోచించలేని సమాజాన్ని చిత్రిస్తుంది.

నా అభిప్రాయం

డబ్బు జీవించడానికి ఎంతో అవసరం, కానీ దాన్ని కష్టించి సంపాదించినపుడే విలువ. అలాక్కాక అన్యాయంగా ధనాన్ని అర్జించటం, ఇంకా ఇంకా అర్జించాలనే పేరాశ, దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక స్వార్థంతో కరుడుగట్టిపోవటం, పేదవారనే కనికరం లేకపోవడం... ఇలా ధనం వల్ల మనుషుల మనస్తత్వాలు క్రమేణా ఎలా మారతాయో ఈ నవలల్లో చూపిస్తాడు రచయిత. ఆనాటి మధ్యతరగతి సమాజంలో ఆడదానికి ఉన్న విలువను, వారికి జరిగిన అన్యాయాలను ఎత్తి చూపిస్తాడు. సమాజంలో చోటు చేసుకున్న వ్యాపార విలువల నగ్న స్వరూపాన్ని చిత్రిస్తాడు.

శారద నవలలన్నీ ఆయన చుట్టూ ఉన్న ఆనాటి కాలమాన పరిస్థితుల నుండి, ఆయన అనుభవించిన కటిక దారిద్ర్యం నుండి పుట్టినవి గానే తోస్తాయి. తన లాంటి బడుగు జీవుల కథల్నే ఇతివృత్తాలుగా తీసుకున్నాడు. ఆనాటి సమాజంలో అరాచకాన్నీ, అవినీతిని తనదైన బాణిలో ఎదుర్కొన్నాడు.

ఆయన శైలి సరళంగా ఉండి చదివేవారికి కథ తప్ప వేరే ఆలోచన రాకుండా చేస్తుంది. ఎక్కడా తమిళ వాసనలు లేకుండా అచ్చ తెలుగు గుభాళింపులతో సాగుతుంది. తెలుగువాళ్లే తెలుగు సరిగా రాయలేకపోతున్న కాలం ఇది. నేటి తరానికి ఆయన ఒక ప్రేరణగా నిలుస్తాడు.

ఏ వ్యక్తినైనా మన కళ్ళ ముందు ఉండగా వారి గొప్ప తనాన్ని గుర్తించలేని గుడ్డి సమాజంలో  జీవిస్తున్నాం మనం. అలా నిర్లక్ష్యానికి గురై చిన్న వయసులోనే చనిపోయిన రచయిత శారద. ఆయన మరణించినా ఆయన చేతి నుండి రాలిన అక్షరాలు  మన హృదయ ఫలకాలపై శాశ్వతంగా నిలిచే ఉంటాయి.

Tuesday 12 November 2013

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి పూర్తిగా చదివాను. ఈ కథ మనిషి మనసు ఎన్ని రకాలుగా మారుతుందో ఎలాంటి నిర్ణయాలను తీసుకునేలా చేస్తుందో తెలుపుతుంది. కృష్ణచైతన్య, గీతాదేవి అనే పాత్రల చుట్టూ నడుస్తుంది కథ.

కథావిషయం:—

ఉన్నతమైన కుటుంబానికి చెందిన కృష్ణచైతన్య కాలేజీ లెక్చరర్. ఒకనాడు రోడ్డు మీద అతనికి అపస్మారక స్థితిలో తారసపడుతుంది గీతాదేవి. ఆమెది మధ్యతరగతికి కుటుంబ నేపథ్యమైనా ఉన్నత చదువులు చదివింది.

ఒంటరిగా ఉన్న అతనికి మొదటిసారిగా ఆమెపై కలిగిన  అనురాగం ఆరాధనలను ప్రేమ పూర్వకంగా కాక కోరికగా తెలుపుతాడు. అతని నుండి ఆమె దూరంగా వెళిపోతుంది.

బొంబాయిలో ఉన్న స్నేహితురాలి దగ్గరకు చేరుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెను వేధించటంతో, చివరకు కృష్ణచైతన్య స్నేహితుడైన శశాంక్ సహాయంతో ఒక పత్రికలో చేరుతుంది. కొన్నాళ్ళకు లెక్చరర్ గా స్థిర పడుతుంది.

అక్కడే శివరాం తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. అతనితో కొత్తజీవితం కొన్నాళ్ళు సరదాగా సాగుతుంది. శివరాంది ఫక్తు మధ్యతరగతి మనస్తత్వం. అతను శృంగారంలో తన అసమర్థతల్నీ, ఆత్మన్యూనతల్నీ కప్పిపుచ్చలేక ఆమెను దూరం పెడతాడు. మళ్లీ గీతాదేవిని ఒంటరితనం వేధిస్తుంది. ఒకసారి ఇద్దరూ అరకులోయకు వెళతారు అక్కడి అందాలకు ముగ్ధురాలైన గీతాదేవి ప్రకృతి సమక్షంలో భర్త సాంగత్యాన్ని కోరుతుంది. అది తప్పుగా భావించిన శివరాం ఆమెను దూషించి వెళిపోతాడు.

ఆవేశంగా భర్త నుండి దూరంగా వచ్చేసిన గీతాదేవి గమ్యం తెలియక నడకసాగిస్తుంది. ఆ దారిలో విజయ సారథి వయసుమళ్లిన వ్యక్తి ఆమెకు తారసపడతాడు. ఇద్దరి ఒంటరితనాలు పోయి, ఒకరికి ఒకరు తోడౌతారు. విజయసారథి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడే కృష్ణచైతన్య తండ్రే విజయసారథి అని ఆమెకు తెలుస్తుంది. అయినా అది బయటపెట్టకుండా అతని ప్రియురాలి హోదాలో ఆ ఇంట్లో ఉండిపోతుంది.

గీతాదేవికి దూరమైన తర్వాత కృష్ణచైతన్య ఊటీకి బయలుదేరతాడు. అక్కడ   చిదంబరరావుతో పరిచయం అవుతుంది. అతనికి ఉన్న అనారోగ్యం వల్ల మరి ఎంత కాలమో బతకడని తెలుస్తుంది. భర్త అనారోగ్యన్ని ఆసరాగా తీసుకుని అతని భార్య మాధురీ దేవి , కృష్ణచైతన్యను లోబరుచుకుంటుంది. ఒక ముని ఇచ్చిన మూలిక కారణంగా పూర్తి ఆరోగ్యవంతుడైన చిదంబరరావు భార్యను తీసుకుని తన ఊరికి వెళిపోతాడు.

మరోసారి తిరస్కారానికి గురి అయిన కృష్ణచైతన్య అది భరించలేక చెడుసావాసాలకూ అలవాట్లకూ బానిస అవుతాడు. చివరకు అఖిలానంద ఆశ్రమంలో చేరతాడు. తండ్రి మరణ వార్తవిని ఇంటికి వెళతాడు. అక్కడ గీతాదేవిని చూసి ఆశ్చర్యపోతాడు.

బంధువులంతా గీతాదేవిని ఆస్తి కోసం వలపన్ని విజయ సారథిని వశపరచుకున్నదని నిందిస్తారు. కృష్ణచైతన్య గీతాదేవిని ప్రేయసిగా చేరదీయాలనుకుంటాడు, అతని ఉద్దేశం తప్పనీ, తాను అతని తండ్రి ప్రియురాలిననీ, అతనే తన సర్వస్వమనీ అంటుంది. ఆమె మాటలను కృష్ణచైతన్య నమ్మనంటాడు.

బంధువులని సాగనంపడానికి రైల్వేస్టేషన్ కి వచ్చిన వాళ్లకు శివరాం తారసపడతాడు. మాట్లాడాలని బలవంతం పెట్టి కృష్ణచైతన్య ఇంటికి వస్తాడు. అక్కడ గీతాదేవితో గొడవకు దిగుతాడు. ఆమెను తనతో రమ్మంటాడు. గీతాదేవి తాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని అతనితో రావడం కుదరదని చెపుతుంది. ఆమె నిరాకరించడం భరించలేని శివరాం ఆమెను తన తలతో పదే పదే మోదుతాడు ఇద్దరి ప్రాణాలు పోతాయి.

పాత్రలపై నా అభిప్రాయం:—

కృష్ణచైతన్య: ఉన్నతమైన చదువు, విజ్ఞానం కలిగినవాడైన కృష్ణ చైతన్య తన జీవితానికి సరైన  మార్గాన్ని ఎన్నుకోలేకపోయాడు. ఆడదాని మనసు అర్థం చేసుకోలేకపోయాడు. విచక్షణను వదలి స్నేహితుని భార్యతో వ్యామోహంలో పడతాడు. తాను చేస్తున్నది తప్పని తెలిసుకునే నాటికి అతని నుండి అందరూ దూరం అవుతారు.

గీతాదేవి: వెంటనే కోపం, వెంటనే ప్రేమ, వెంటనే ద్వేషమూ, వెంటనే వైరాగ్యం ప్రదర్శించే పాత్ర ఆమెది. స్పృహ తప్పి ఒంటరిగా రోడ్డు మీద పడి ఉన్న తనను చేరదీసి, ఆశ్రయం కల్పించి, ఆదరించాడు కృష్ణచైతన్య. అతడు తనను ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా మౌనం వహించింది.

తనను కష్టంలో ఆదుకున్న వ్యక్తి పట్ల అభిమానంతో కృతజ్ఞతతో వ్యవహరించి, ఆదరించిన ఆ పందిరికి తీగలా అల్లుకుని ఉంటే తన జీవితం మరింత అందాన్ని సంతరించుకుని ఉండేది. అతని నుండి వెళ్ళి తన జీవితానికి గమ్యమనేది లేకుండా చేసుకుంది.

ప్రేమ అన్న మనిషితో మరో మారు ఆలోచించకుండా అంగీకరించడం, పెళ్ళి అనే పెద్ద నిర్ణయాన్ని ఒక్క గడియలోనే తీసుకోవడం, పెళ్లి తర్వాత జీవితాన్నీ, ఆ ఇంటి పరిస్థితులనూ, అతని మనస్తత్వాన్ని సరిగా అర్థం చేసుకోపోవడం ఆమె వివాహం విఫలమవటానికి కారణం.

భర్త నుండి గొడవ పడి ప్రేమను, పెళ్ళినీ, తెంచుకున్న మరు నిముషంలోనే ఇంకో వయసు మళ్ళిన వ్యక్తికి చేరువవుతుంది, అతను పెళ్ళి మాట ఎత్తినా వారించింది. గతంలో తనకు ఆశ్రయం ఇచ్చి, తనను ఇష్టపడిన వ్యక్తికి ఇతడు తండ్రని తెలిసినా మాట్లాడక ఆ ఇంట్లోనే ఉండిపోయింది.

ఆమె జీవితంలో ఈ మలుపులన్నీ ఆమె మొండి వైఖరిని ఫలితాలే. సంఘపు కట్టుబాట్లను గౌరవించకపోయినా, తన మనస్సాక్షికి కూడా కట్టుబడలేని ఈ పాత్రని చూసి నాకు జాలి కలిగింది. చదువుతో వచ్చిన విజ్ఞానాన్ని ఎక్కడా ఉపయోగించుకోలేకపోయింది. లోకం పోకడ తెలిసీ తెలివిగా వ్యవహరించలేకపోయింది. ఎన్నో మలుపులు తిరిగి ఎక్కడా తృప్తి తీరం చేరలేక చివరకు చావు ఒడిలోకే చేరింది.

* * *

ప్రకృతి వర్ణనలను మన కళ్ళ ముందు మెదిలేలా రచించారు రచయిత. ముఖ్యంగా అరకులో జరిగే సన్నివేశాలు చాలా నచ్చాయి. ఒక వర్ణన:

"పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగకొద్దీ కాల్చి - అక్కడికీ కసి తీరక దోసిళ్ళతో మసి యెత్తి గాలిలోకి యెగబోసి, వెళ్ళిపోయాడు సూర్యుడు."

Monday 28 October 2013

మునెమ్మ ప్రతీకారం...

మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి.

కథా విషయం:– 

మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు. 

మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా. 

ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ. 

జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. జయరాముణ్ణి తిడుతుంది. అతనికి ఈ మొండితనమూ, అకారణంగా కోపం తెచ్చుకోవటము లాంటి లక్షణాలన్నీ అతని తండ్రి (తన భర్త) దొరసామి నుంచే వచ్చాయంటుంది. 

సాయమ్మ భర్త దొరసామి తాగుబోతు, వ్యక్తిత్వ పరంగా మొరటువాడు, ఎవరికీ తలవంచడు. నాటకాలంటే ఆసక్తి లేకపోయినా ఆ హడావుడిని ఇష్టతాడు. ఊళ్లో నాటకాలొస్తే దొరసామి భార్య సాయమ్మ తన పట్టుచీరను అతనికి తెలియకుండా నాటకాలవాడికి ద్రౌపది వేషం కోసమని ఇస్తుంది. దొరసామి తన భార్య చీర పరాయి మగవాడు కట్టుకోవడాన్ని భరించలేక ఆవేశానికి లోనై నాటకాల వాణ్ణి కత్తితో నరికి చంపుతాడు. జైలుపాలవుతాడు. అక్కడ కూడా తోటి ఖైదీలతో గొడవలు పడుతూ, అధికారుల్ని ఎదిరిస్తూ, ఒక రోజు కొందరు ఖైదీలతో  కలిసి జైలు నుండి పారిపోతాడు. వారిలో కొంతమంది పోలీసు కాల్పుల్లో చనిపోతారు. వాళ్లలో దొరసామి ఉన్నదీ లేనిదీ ఎవరూ నిర్థారించి చెప్పకపోవటంతో ఎప్పటికీ అతని ఆచూకీ తెలియకుండా పోతుంది. సాయమ్మ మాత్రం భర్త బుద్ధులు తన కొడుక్కీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ కథనంతా ఆమె సినబ్బతో నెమరు వేసుకుంటుంది. 

ప్రస్తుతంలోకి వస్తే... ఇంటికి వచ్చిన జయరాముడు సంతకి బొల్లిగిత్తను అమ్మడానికి తీసుకు వెళ్తున్నట్టు చెప్తాడు. సాయమ్మ మొదట వ్యతిరేకిస్తుంది గానీ, మునెమ్మ పట్ల బొల్లిగిత్త ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాకా, అమ్మేయటమే మంచిదంటుంది. 

పొరుగూరిలోని పశువుల సంత దాకా తన ప్రయాణ ప్రణాళిక ఏమిటన్నది మొత్తం జయరాముడు ఆ రాత్రి తన తల్లికి చెప్తాడు. ఒంటరిగా కాకుండా, పశువుల దళారి తరుగులోడిని కూడా వెంటబెట్టుకు వెళ్తున్నట్లు చెప్తాడు. 

అలా వెళ్లినవాడు రెండ్రోజులైనా తిరిగి రాకపోయేసరికి సాయమ్మ, మునెమ్మ కంగారు పడతారు. ఇంతలో మునెమ్మకు కల వస్తుంది. దాని ఆధారంగా తన భర్త బతికి లేడనే నిర్ణయానికి వస్తుంది. పైగా మరుసటి రోజు బొల్లిగిత్త ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది. దాని కొమ్ముకున్న సంత చీటీ అనే ఒక్క ఆధారాన్నీ పట్టుకుని మునెమ్మ భర్త కోసం బయల్దేరుతుంది. వెళ్తూ సినబ్బ (మనకు కథ చెప్తున్న పాత్ర)ను కూడా వెంటబెట్టుకు వెళ్తుంది. 

దళారి తరుగులోణ్ణి ఆరా తీస్తుంది. అతని మాటల్లో తడబాటును బట్టి అతను చెప్తున్నది అబద్ధమని మునెమ్మకు రూఢీ అవుతుంది. పూటకూళ్ల ముసలి దంపతులను, సంత సంచాలకుణ్ణి, సంతలో కల్లుపాక యజమానినీ విచారించిన తర్వాత, తన భర్త జయరాముడు బొల్లిగిత్తను పశువుల వైద్యం చేసే మందులోడికి అమ్మినట్టు తెలుసుకుంటుంది మునెమ్మ. సినబ్బతో కలిసి అతని ఊరు రామినాయుడు పల్లెకు వెళ్తుంది. అక్కడికి చేరే సరికి మందులోడు మరణశయ్య మీద ఉంటాడు. ఆవుకి వైద్యం చేయబోతే కొమ్ము విసిరిందని అతని భార్య అబద్ధం చెపుతుంది. అసలే చావుబతుకుల్లో ఉన్న మందులోడు మునెమ్మ ఎడం చేతి మీద బొల్లిగిత్త పచ్చబొట్టు చూసి భయంతో చచ్చిపోతాడు. దాంతో బొల్లిగిత్తే మందులోడి చావుకి కారణమని మునెమ్మ అనుమానిస్తుంది. తర్వాత అతని పెద్ద కొడుకు ద్వారా నిజం తెలుసుకుంటుంది మునెమ్మ. మందులోడూ తరుగులోడూ ఇద్దరూ కలిసి తన భర్తని చంపేశారని ఖాయపర్చుకుంటుంది. ఇక మిగిలిన తరుగులోడిపై మునెమ్మ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే ముగింపు. 

నా అభిప్రాయంలో మునెమ్మ:– 

కథ ప్రారంభంలో మునెమ్మ పాత్ర అమాయకంగా కనిపించినా, భర్త హంతకుల్ని వెతికే క్రమంలో ఆమె ఎక్కడ లేని మొండి ధైర్యాన్ని, ప్రవర్తనలో పరిణతినీ ప్రదర్శిస్తుంది. భర్త ఇక లేడు అనే భావనే ఆమెలో అంతకుముందు లేని ఈ నిబ్బరాన్నీ, నేర్పరితనాన్నీ కల్పించాయనిపిస్తుంది. నాకు ఇక ఎవరూ లేరు అనే భావన రాగానే ప్రతి స్త్రీలోనూ మొండిధైర్యం ప్రవేశిస్తుంది. 

మునెమ్మ తనలోని అనుమానాలను చూపుల ద్వారా తెలుపుతుందే కానీ, మనసు విప్పి ఎవరితోనూ పంచుకోదు. మాట్లాడిన కాసిని మాటల్లోనూ తాత్త్విక ధోరణి తొంగి చూస్తుంది. ఆ మాటలు ఎక్కడా పల్లెపడుచు మాటలుగా మనకు అనిపించవు. 
“కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం? ఇవన్నీ ఆలోచించే వచ్చామా?” 
“అడుగుదాం. సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినప్పుడు గదా గాలాన్ని లాగుతాం.”
ఇలాంటి తాత్త్విక ధోరణీ, ఈ అరుదైన పోలికలూ మునెమ్మవా, లేక రచయితవా అనే సందేహం కలుగుతుంది. 

కానీ ఆమె ఇలా ఎంత అరుదైన ఉపమానాలు వాడినా, ఎంత లోతైన తాత్విక ధోరణి ప్రదర్శించినా, ఆమె మాటల్లోని యాస వల్ల  మనం కాస్త సులువుగానే సమాధాన పడతాం. కానీ కథను మనకు చెప్పే సినబ్బ విషయంలో అలా సమాధాన పడలేం. అతని మాట తీరూ, అతను వాడే పదజాలమూ, కథను నేర్పుగా వెనకా ముందులు చేసి చెప్పటం... వీటి వల్ల మనకు కథ చెప్పేది ఒక పల్లెటూరి యువకుడని అనిపించదు. బాగా విజ్ఞానవంతుడెవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది. 
“వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అలాగే స్వప్న జగత్తులో జరిగిన సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపి వేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్ళు, ఆమెలోని సకల సందిగ్ధతలను, సకల సంశయాలను, సకల జడత్వాలను కడిగి వేశాయి.” 
ఇలా సాగుతుంది సినబ్బ కథనం. మునెమ్మకు రచయిత తన ఉపమానాల్ని మాత్రమే అరువిచ్చాడు. సినబ్బకు తన శైలి కూడా అరువిచ్చేశాడని అనిపిస్తుంది. ఈ శైలి కథా వాతావరణానికి నప్ప లేదు. సినబ్బ కూడా మునెమ్మలా యాసలో మాట్లాడి ఉంటే కథకు బాగా నప్పేదేమో అనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని లోటుపాట్లుగా అనిపించినా కథలో ఉత్కంఠ కారణంగా మనం మనసులోనే సమాధాన పడుతూ చదువుకుంటూ పోతాం. పైగా ఈ రచన మేజికల్ రియలిజం అనే ధోరణి ఆధారంగా రాసిందని అన్నారు గనుక, ఇలాంటి పొసగని అంశాలు ఎన్నో ఆ పేరు మీద చెల్లిపోతాయి. 

భర్త హంతకుల్ని చంపటమే భర్తకు తాను చేసే అంత్యక్రియలుగా భావిస్తుంది మునెమ్మ. పట్టుదలగా వాళ్లని వెంటాడి తుదముట్టిస్తుంది. ప్రతీకారం కోసం ఆమె ప్రయాణమే ఈ నవల.     

ఈ సమీక్ష పుస్తకం.నెట్‌లో ప్రచురితం

Wednesday 16 October 2013

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోయే వేళ దోసిళ్ల కొద్దీ అమృతాన్ని తాగిన కవిగానే తిలక్ నాకు తెలుసు. ఈ కథతో ఆయన నాకు కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యాడు.

కథా విషయం:– ఊరికి దూరంగా పచ్చని పొలాల నడుమ, చింత చెట్లు తుమ్మ చెట్ల మధ్య, చూరు వంగి, గోడలు బెల్లులు ఊడి ఉందా ఇల్లు. మనుష్య సంచారం ఆ ఇంట ఉందా అనే సందేహం కలగక మానదు కొత్త వారికి. ఆ ఇంటిలో ఒక యువతి, ఆమెతో పాటు ఒక అవ్వ ఉన్నారు.

వాతావరణం దట్టమైన మబ్బులతో కప్పి ఉండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇరవై మూడేళ్ళ ఆ యువతి ఇంటి వరండా లోంచి అలా కురుస్తున్న వర్షాన్ని చూస్తూంది. తనలో రేగుతోన్న ఆలోచనలకు, దిగులుకు, దుఃఖానికి రూపాన్ని వెతుకుతున్నట్లు ఉన్నాయామె శూన్యపు చూపులు.

రోడ్డంతా గతుకులతో బురదతో నిండి ఉంది. వర్షపు నీరు ఆ ఇంటిముందు కాలువలుగా ప్రవహిస్తుంది. చలిగాలి కూడా తోడయింది ఆ వాతావరణానికి.

అంతలో వర్షంలో తడుస్తూ, బురదలో కాళ్లీడ్చుకుంటూ ఆ ఇంటి మందుకు వచ్చాడో యువకుడు. తాను తన మిత్రుణ్ణి కలవడానికి గాను ఈ ఊరు రావలసి వచ్చిందని, తిరిగి రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సిన తనకు వర్షం అడ్డంకిగా మారిందని అంటాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి వాన తెరిపిచ్చాకా తెల్లవారి వెళ్ళమంటుందామె. అవ్వ అతన్ని లాంతరు వెలుగులో చూసి  లోపలికి రమ్మంటుంది. అతను తన పేరు జగన్నాధం అని చెపుతాడు. కమ్మని భోజనం తిని, తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఆ యువతి తన పేరు రమ అని పరిచయం చేసుకుంటుంది. ఆమె మనసు మూలలో ఎక్కడో అతడు తన చిన్ననాటి మిత్రుడేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ అతని గతం విన్నాకా అది నిజం కాదని తెలుసుకుంటుంది.

తనకు ఒక ఊరంటూ లేదని, ఎవరు లేని ఒంటరినని, గతంలో సైన్యంలో పని చేసి ఎన్నో దేశాలు తిరిగి వచ్చానని చెపుతాడు. ప్రస్తుతం ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నానని చెపుతాడు. అలాగే ఆమె ఇంకా పెళ్ళి చేసుకోపోవడానికి కారణం ఏమిటని చొరవగా ప్రశ్నిస్తాడు. రమ ఆ ప్రసక్తి తప్పించుకోజూస్తుంది. అతను పట్టుబట్టి పదే పదే అడిగేసరికి తన గతాన్ని పంచుకుంటుంది.

రమ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఆమెను అనాధాశ్రమంలో చేర్పించి ఎటో వెళిపోయాడు. ఆ చిన్నతనంలో ఆమెకు ఏకైక స్నేహితుడు విజయుడు. అతనికి రమ అంటే వల్లమాలిన ప్రేమానురాగాలు. సవతి తల్లి చేత దెబ్బలు తిని మరీ ఆమెను సంతోషపెట్టేవాడు. వయసుతో పాటూ ప్రేమ పెరిగింది. సవతి తల్లి బలవంతంగా మరో పెళ్ళి చేయాలని చూస్తే ఆమెను కొట్టి ఊరు నుండి పారిపోయాడు. కొన్నాళ్ళకు తాను సైన్యంలో చేరానని, బతికి ఉంటే మళ్ళీ కలుస్తానని అతణ్ణించి రమకు ఉత్తరం అందింది. యుద్ధం ముగిసిన ఎన్నాళ్ళయినా అతను మాత్రం తిరిగి రాడు. ఈలోగా అనాథాశ్రమంలో రమను చేరదీసిన వార్డెన్ చనిపోవడంతో ఆమెకున్న ఆ ఒక్క నీడ కూడా కరువవుతుంది. ఓ పెద్దమనిషి మాయమాటలతో ఆమెను ఈ ఊరు తీసుకువచ్చి అవసరం తీరాకా ఒంటరిగా వదిలేస్తే చివరకు అవ్వే ఆమెకు దిక్కైంది.

ఈ కథంతా విన్నాకా చలించిపోయిన జగన్నాధం రమకు తోడుగా నిలవాలనుకుంటాడు. ఆ మాటతో ఆమెలో బతుకుపై ఆశ చిగురించింది. అతను తనకు ఉన్నాడన్న భద్రతలో హాయిగా నిద్రపోతుంది.

వీరి మాటలన్నీ చాటుగా విన్న అవ్వ, జగన్నాధాన్ని గది నుంచి బయటకు పిలుస్తుంది. రమ డబ్బు కోసం ఇలాంటి అబద్దాలనే ఇంటికి వచ్చే ప్రతీ విటునితోనూ చెపుతుందని అవి నమ్మవద్దనీ అతని మనసు కలుషితం చేస్తుంది. అది నమ్మిన జగన్నాధం మనసు వికలమై, తన డబ్బు పర్సును రమ పడుకుని నిద్రపోతున్న మంచం మీదకు విసిరి ఆ ఇంటి నుండి వెళిపోతాడు.

మర్నాడు రమ నిద్రలేచి జగన్నాధం కోసం వెతుక్కుంటుంది. అవ్వని అడిగితే డబ్బు ఇచ్చి వెళిపోయాడంటుంది. రమ నివ్వెరపోయి, అతనికి నువ్వేం చెప్పావని నిలదీస్తుంది. నువ్వు వెళిపోతే నా దిక్కేం కాను, అందుకే నీదంతా నటన అనీ, వచ్చిన ప్రతి వాడి దగ్గరా ఇదే వేషం వేస్తావనీ చెప్పానంటుంది.

రమ ఆవేశంతో శివాలెత్తి అవ్వని ముక్కాలిపీటతో కొడుతుంది. జగన్నాధం విసిరేసిన పర్సు తీసుకుని ఆదరాబాదరాగా రైల్వే స్టేషన్‌కు పరుగుపెడుతుంది. గోతుల్లో పడి లేస్తూ వళ్లంతా బురద గొట్టుకుపోయి స్టేషన్‌కు చేరుకుంటుంది. అప్పటికే రైలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చేసి ఉంటుంది. ఆమె పెట్టెలన్నీ వెతుకుతుంది. ఆఖరు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చున్న జగన్నాధం ఆమె కంటపడతాడు. ఈలోగా రైలు కదలడం మొదలవుతుంది. ఆమె కిటికీ పక్కన పరిగెడుతూ చేతిలోని పర్సును పెట్టెలోకి విసురుతుంది. జగన్నాధం మొదట ఆమెని పోల్చుకోలేకపోతాడు. ఫ్లాట్‌ఫాం మీద కుప్పకూలిన ఆమెను చూసి జాలిపడుతూ పర్సు తీసి చూసుకుంటాడు. పర్సులో అతని డబ్బులన్నీ యథాతథంగా ఉంటాయి. అతని ఫొటో తప్ప.

నా అభిప్రాయం:– కాలం ఆడిన ఆటలో ఓడిపోయి అవ్వ చెంతకు చేరిందా అభాగ్యురాలు. ఆమె అందాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించాలని ఆశించిందా అవ్వ. ఆమె కంటూ బంధాలు ఉంటే ఎక్కడ తనకు రాబడి పోతుందో అనే భయంతో పసికందును కూడా దూరం చేసింది అవ్వ.

చిన్న ఓదార్పు కోసం ఎదురు చూసే అమాయకురాలు తనకు ఎదురైన మనిషిని మనసున్నవాడిగా భావించి తన మనసులో చెలరేగుతున్న గతం తాలూకు జ్ఞాపకాలను, చేదు నిజాలను, తాను బతుకుపై పెట్టుకున్న ఆశలను అతనితో పంచుకుంది. ఈ అనుకోని అతిథి తన గతం తెలిసీ భర్తగా తన చేయందుకుంటాడనీ, తన జీవితానికి చిరు దివ్వెగా ఉంటాడనీ ఆశపడింది. పెళ్ళి అనే బంధంలోని తీయదనాన్ని తలచుకుంటూ, తెల్లవారితే తన జీవితంలో ప్రకాశించే వెలుతుర్ని కలగంటూ నిదురలోకి జారుకున్న ఆమెకు అంతా కల్ల గానే మిగిలిపోయింది. మళ్ళీ తన జీవితంలో చీకటే మిగిలింది.

నిజ జీవితానికి దగ్గరైన కథను రచయిత సరళంగా చెప్పిన తీరు మనసు కదిలించేలా ఉంది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడి ఓడిపోయిన జీవితం ఆమెది. ఒక్కరాత్రిలో ప్రేమించిన వాడు, అంత త్యరగానూ ద్వేషించాడు. తన జీవితానికే గమ్యం లేని వాడు, చివరకు ఆమెనూ ఒక గమ్యానికి చేర్చలేకపోయాడు.

Tuesday 8 October 2013

ఉత్కంఠ భరితం "చంద్రగిరి శిఖరం"


బిభూతి భూషణ్ గారు బెంగాలీలో ప్రముఖ రచయిత. పదహారుకు పైగా నవలలూ, రెండొందల పైచిలుకు కథలూ రాశాడు. వాటిలో బాగా ప్రసిద్ధి పొందినవి “పథేర్ పాంచాలి”, “అపరాజితుడు”, “వనవాసి” అనే మూడు నవలలు. ఇవన్నీ ఇదివరకే తెలుగులో వచ్చాయి. ఇపుడు వీటిలా ఆత్మకథాత్మకంగా కాక, కాల్పనిక శైలిలో రచించిన “చంద్రగిరి శిఖరం” (చందే పహార్) కూడా కాత్యాయని గారి అనువాదంతో తెలుగులో వచ్చింది.

స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, అందులోని విలయాలను, వింతలను, విశేషాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు.

కథా విషయం:- శంకర్ ఓ పల్లెటూరి కుర్రవాడు. చదువు పూర్తి చేసుకొని గ్రామానికి వస్తాడు. కుటుంబ పరిస్థితుల వల్ల కెన్యాలోని మెుంబాసా దగ్గర రైల్వేశాఖలో గుమస్తాగా పనిలో చేరతాడు. అత్యంత ప్రమాద భరితమైన ఆ ప్రాంతం మానవుని రక్తాన్ని మరిగిన సింహాలకు నిలయమని తెలుసుకుని అక్కడికి ముఫ్పై మైళ్ల దూరంలోని కిసుమూ రైల్వే స్టేషన్‌కి స్టేషన్ మాస్టరుగా కొత్త ఉద్యోగంలో చేరతాడు. అక్కడ జనసంచారం తక్కువ. ఒక రోజు ఆ అటవీ ప్రాతంలో ఒక పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్ అపస్మారక స్థితిలో కనిపిస్తాడు. శంకర్ అతణ్ని బతికిస్తాడు. అతను వజ్రాలకై తాను చేసిన సాహసయాత్రను గురించి చెప్తాడు. సాహసాలంటే మక్కువ గల శంకర్ అతనితోపాటూ తానూ సాహసయాత్రకు సిద్ధపడతాడు. ఇద్దరూ వజ్రాల కోసం ఆఫ్రికా అటవీ ప్రాంతంలోని చందేర్ పహార్ చేరుకుంటారు. ఈ యాత్రలో వారు దట్టమైన అడవుల్నీ, వింత జంతువుల్నీ, పక్షుల్నీ, సెలయేళ్ళనీ, వర్షాలు వరదలూ తుఫాన్లనీ, ఎడారుల్నీ... ఎన్నింటినో దాటుకు సాగుతారు. అగ్నిపర్వతం బద్దలవటం కూడా తమ కళ్ళతో చూస్తారు. ఏన్నో కష్టాలతో సాగిన ఈ యాత్రలో శంకర్ వజ్రాలగనిని చేరాడాలేదా అనే దాని కన్నా, అతడు ఆ భయంకర పరిస్థితుల నుండి ప్రాణాలతో బయటకు రాగలడా అనే ఉత్కంఠే మనకు ఎక్కువ కలుగుతుంది.

బిభూతి భూషణ్ గారి శైలి సరళంగా సాగుతుంది. ప్రకృతి వర్ణనలు స్వయంగా అనుభవించి రాసినట్టు స్వచ్ఛంగా ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే, తాను ఎరిగిన బెంగాల్ సరిహద్దులతో పాటూ, తాను ఎప్పుడూ చూడని ఆఫ్రికా అరణ్యాల అందాలను, అందులోని ప్రమాదాలను ఎంతో మనోహరంగా వర్ణించగలిగాడు. ఆయన శైలికి మచ్చుతునకగా ఈ భాగాన్ని ఉదహరిస్తాను:
ఎంతటి భయద దృశ్యమది! వాళ్ళిద్దరూ ఆ వైపునుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు. నిప్పు ముద్దల్లా ఉన్న మేఘాలు కిందికి దిగి అగ్ని పర్యతపు ముఖ భాగాన్ని సమీపించి, మరుక్షణంలోనే అగ్నిజ్యాలలుగా మారి వెయ్యి అడుగుల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. ఆ పగలూ, రాత్రీ కూడా అగ్ని పర్వతం మీదనుండి బాణాసంచా పేలుస్తున్న వెలుగులాంటిది కనబడుతూనే ఉంది. ఆ పర్వతం కింది భాగాన ఉన్న లోయలోని పెద్దపెద్ద వృక్షాలన్నీ రాళ్ల వర్షంతోనూ, అగ్నిజ్యాలలతోనూ ధ్యంసమయ్యయి. రాత్రి బాగా పొద్దుపోయాకా మళ్ళీ ఒకసారి పర్యతం బద్దలై నిప్పులు చిమ్మే అద్బుత దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ మంటల వెలుగు, కనుచూపు మేరదాకా అడవికంతటికీ రుధిరవర్ణం పులిమింది. రాళ్ళవర్షం మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. అగ్ని పర్వతపు అరుణ వర్ణాన్ని ప్రతిఫలిస్తున్న ఆకాశంలో నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి మేఘాలు.
దృశ్యాన్ని తెచ్చి ముందు నిలిపే ఇలాంటి వర్ణనలతో పాటూ, ఊహాశక్తిని వింత దారుల్లో నడిపించే కథనం మనలో ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగుతుంది, ఆద్యంతం ఒక సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. మన ఆలోచనల్లో ఆ ప్రాంతాలను, ఆ ప్రకృతినీ చిత్రించుకుంటూ చదువుకుంటూ పోతాం. ఆ సాహస యాత్రలో, ఆ ప్రమాదాల మధ్య మనమూ ఉన్నామా అనే భ్రమకులోనవుతాం. అనువాదకురాలు కాత్యాయని గారి శైలి సరళంగా ఉండి ఎక్కడా అనువాదంగా తోచలేదు. అచ్చ తెలుగు కథగానే అనిపించింది.

Monday 30 September 2013

మనం కోల్పోయిన ప్రపంచాన్ని గుర్తు చేసే "బంగారు మురుగు"



శ్రీరమణ గారు రాసిన "బంగారు మురుగు" కథ చదివాకా, నా బాల్యం గుర్తుకు వచ్చింది. బామ్మ అందరికీ బాల్యపు తీపి గుర్తు. ఈ కథ చదువుతుంటే, మా బామ్మ కూడా ఇలానే ఉండేది అనో, ఇలాంటి బామ్మ నాకూ ఉంటే ఎంత బాగుండేది అనో అనుకోని వారు ఉండరు.

ఇది అరవై ఏళ్ల బామ్మకూ, ఆరేళ్ల మనవడికీ మధ్య సాగే కథగా మాత్రమే గాక, మన మధ్య జరుగుతున్నదా అన్నట్టూ, ఆ కథలో మనమూ పాత్రలై ఉన్నామా అనిపించేట్టూ సాగుతుంది. గట్టి పిండంగా పేరు తెచ్చుకున్న బామ్మకు మనవడన్నా, తన చేతికున్న బంగారు మురుగు అన్నా, తాను పుట్టింటి నుంచి కాపురానికి వస్తూ తెచ్చుకున్న పెరటిలోని బాదం చెట్టన్నా ప్రాణసమానాలు. ఈ బాదం చెట్టే బామ్మా మనవళ్ల స్థావరం. ఇద్దరికీ రోజులో మూడు వంతులు అక్కడే కాలక్షేపం. బామ్మ తత్త్వం ఎవరికీ బోధపడదు. ఎదుటివారిని మాట్లాడనీయక, తన దైన వాగ్ధాటితో, ప్రేమావాత్సల్యంతో అబద్ధం చెప్పాలనుకున్న వారితో కూడా నిజం చెప్పించగలదు. కొడుకూ కోడలూ ఆస్తిని స్వామీజీలకు కైంకర్యం చేస్తూంటారు. బామ్మ మాత్రం వచ్చే పోయే స్వామిజీలను ఆటపట్టిస్తూంటుంది. ఒక స్వామీజీ దృష్టి బామ్మ బంగారు మురుగు మీద పడుతుంది. దాన్ని ఎలాగైనా తనకు దక్షిణగా దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. బామ్మ మాత్రం ససేమిరా అంటుంది. స్వరాజ్య పోరాటమప్పుడు గాంధీ గారు తమ ఊరు వచ్చి గుమ్మం ముందు జోలె పట్టినా ఇవ్వనిదాన్ని ఇప్పుడీ సర్కస్ కంపెనీకి ఎందుకు ఇస్తానంటుంది. కూతురి కళ్లూ దాని మీద పడతాయి. ఐనా బామ్మ పట్టువిడవదు. దాని మీద ఆమెకు కాపీనమని మనకు అనిపిస్తుంది. కాలం గడుస్తుంది. బామ్మ ఎంతో చొరవతో మనవడి పెళ్లి చేయిస్తుంది. మనవడు వేరే ఊళ్లో కాపురం పెడతాడు. బామ్మని రమ్మన్నా రాదు "నా ఊరు నా నేల.. ఇక్కడే మట్టయిపోవాలిరా..." అంటుంది. జబ్బు పడి మంచం పట్టిన రోజుల్లో చూట్టానికి వచ్చిన మనవడి కంగారు చూసి "నిన్ను వదిలి ఎక్కడికి పోతాన్రా వెర్రి నాగన్నా... అలా వెళ్లి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా..." అంటూ ధైర్యం చెప్తుంది. చనిపోయాకా, తీరా చూస్తే ఆమె బంగారు మురుగు గిల్టుదని తేలుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మనవడు మాత్రం గ్రహిస్తాడు, బామ్మ తన పెళ్లి జరిపించింది ఆ బంగారు మురుగుతోనే అని.

శ్రీరమణ గారు ఈ కథను మలచిన తీరు, ఆయన శైలి నాకు నచ్చాయి. శ్రీరమణ గారు బామ్మలో చాలా కోణాలనే చూపించారు. మాటల్లో దర్జా, దర్పం, నేర్పుగా మాట్లాడి ఎదుటివాళ్లని ఆట కట్టించగల వాక్చాతుర్యం, తను అనుకున్నది సాధించగల పట్టుదల, ప్రేమా, వాత్సల్యమూ, దయా... ఆమె సుగుణాలు.

ఈ కథలో బామ్మ మాటలు కొన్ని:
"దయ కంటే పుణ్యంలేదు, నిర్దయ కంటే పాపం లేదు. నాది అనుకుంటే దుఖం, కాదు అనుకుంటే సుఖం."
"చెట్టుకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం... నాకు తెలిసిందవే."
"ఆ పిల్ల గోరంటాకుతో పారాణీ పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి, నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడు నోరు పండాలి. మీ కడుపు పండాలి,  నేను మళ్ళీ నీ ఇంటికి రావాలి."
అమ్మ తరువాత తన పొత్తిళ్లలో దాచుకుని ఆప్యాయంగా గారాబం చేసేది బామ్మ ఒక్కతే. ఆమె దగ్గర ఉన్న చొరవ మరెక్కడా ఉండదు. అమ్మ పెట్టడం ఆలస్యం చేస్తే తాను ఆప్యాయంగా కడుపు నిమిరి అన్నం తిన్నా్వా నాన్నా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కడుపు తడుముతుంది.

ఉమ్మడి కుటుంబాలు పోయాయి, ఒంటరి జీవితాలు వచ్చాయి. ఈ హైటెక్ యుగంలో అలాంటి ఆప్యాయతలకు అనురాగాలకు దూరంగా చాలా దూరంగా వెళిపోతున్న మనం, మన కడుపున పుట్టిన పిల్లల గురించి మాత్రమే ఆలోచించే మనం,  ఒక సంపాదనా యంత్రాలుగా మనుగడ సాగిస్తున్నాం. ఇలాగే సాగితే ఈ ఆప్యాయతలు మనకు పుస్తకాల్లో మాత్రమే చదువుకోవటానికి మిగిలిపోతాయి. మన చిన్నతనంలో పొందిన ఆప్యాయతను మన పిల్లలకు అందీయలేకపోతున్నాం. వాళ్ళకు ఏం దూరం చేస్తున్నామో ఆలోచింపజేస్తుంది ఈ కథ.

Wednesday 25 September 2013

అల్లం శేషగి రావు కథ "చీకటి"

“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణనలతో కూడినది, మేధస్సుకు పదును పెట్టే శైలితో నన్ను ఆకట్టుకున్నదీ ఈ కథ. ఇది ఇద్దరి వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణ. వారిలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల సమాహరం.

ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్పా, ఎవరు తక్కువ అన్నది చూపకుండా ఇద్దరినీ స్నేహితులుగా చూపుతూ, చదువుతోనే రాని, లేని జ్ఞానాన్ని చూపుతూ కథ నడిపిన తీరు నాకు నచ్చింది. ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు చాలామందే ఉంటారు, కానీ చీకటిని ఇష్టపడేవారు చాలా తక్కువ.  మన లోకం వెలుగు ఉన్నంత వరకే. కానీ దీపం వెలుతురు లేని చీకట్లోనూ అందం ఉందని ఈ కథ చెప్తుంది. పాఠకుడు ఈ కథ చదువుతున్నపుడు తన మదిలో ప్రతీ దృశ్యాన్నీ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతీ దృశ్యం మన ముందే జరుగుతుందనే మాయాజాలం చేయటం రచయిత గొప్పదనం.

ఒకే చీకటిలో ఇద్దరు తమ నివాసాల నుంచీ వేటకని బయల్దేరతారు. ఒకరు వర్మ, ఒకరు డిబిరిగాడు. వర్మకి వేట వినోదం, డిబిరిగాడికి అదే జీవనాధారం.  మనం రోజూ చూస్తున్న మన చుట్టూ సంచరిస్తున్న వ్యక్తుల్లో చాలామందిని పట్టించుకోము. అలా పట్టించుకునేందుకు మనకు టైం లేదు. నా అనే స్వార్థంతో ఆలోచించే మనకు చుట్టూ ఉన్న వాళ్లతో సంబంధం ఎంత వరకూ అంటే మన పని చేయించుకునేవరకూ మాత్రమే.

మన పనులకు ఉపయోగించుకునే వాళ్లే కాదు, మనం పట్టించుకోని తక్కువ స్థాయికి చెందిన వాడే డిబిరి గాడు. వాళ్లకూ మనలాగే బాల్యం యవ్వనం వాటితో జ్ఞాపకాల ప్రపంచం ఉంటుందని, అందులో కష్టం సుఖం అన్నీ మిళితమై ఉంటాయనీ, రచయిత వాళ్ల జీవిత శైలిని చాలా క్షుణ్ణంగా విపులీకరించాడు. డిబిరిగాడు నక్కలోళ్ల జాతికి చెందిన సంచారజాతి వాడు. తన వృత్తిలో నైపుణ్యంతోనే గాక, జీవిత సాంరాంశాన్ని కాచి వడపోసినవాడిలా గతాన్ని గురించి తన జ్ఞాపకాల పొరలను తనకు ఎదురైన వ్యక్తి (వర్మ)తో చెప్పుకున్నాడు. డిబిరిగాడు వర్మలో సాటి వేటగాణ్ణి చూశాడే గానీ అతని స్థాయిని చూడలేదు.

తన తండ్రితో అతని అనుబంధం, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వృత్తిలోని అతని కఠినత్వం అతని స్వభావం చెప్పుగోదగ్గవి. రచయిత డిబిరిగాడిని నిజాయితీకి ఒక గీటురాయిగా సూచించాడు. దీనివల్ల వాళ్ల జాతి ఒకటుందని పాఠకుడు ఒక్క క్షణం ఆలోచించేలా చేశాడు.

నన్ను కదిలించిన సన్నివేశం: ఉరి తీసే ముందు నీ ఆఖరు కోరిక ఏమైనా ఉందా చెప్పమని డిబిరిగాడి తండ్రిని అడిగితే అతడు జొన్న రొట్టెలు తెమ్మంటాడు. ఆకుల్లో రొట్టెల్ని చూస్తూ: “బాబూ నా కొడుకు ఇంకా రాలేదు. కానీ వస్తాడు. రాత్రంతా తిండి లేక కడుపు నకనకలాడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆకలితో కరకరలాడిపోతూ ఉంటాడు. ఈ రొట్టెల్ని వాడికి ఇవ్వండి బాబూ. వాడికి బీడీలంటే చాలా ఇష్టం. నా కొడుక్కి నేనిచ్చానని చెప్పండి బాబూ. ఇక నాకు ఏ కోరికా లేదు.”

ఆ తండ్రి తన చావు గురించి విచారించక, తన బిడ్డ ఎలా ఈ ప్రపంచంలో బతుకుతాడో అని ఆఖరి నిముషం వరకూ అతని ఆలోచనలు బిడ్డ చుట్టూ తిరగడం, చివరి కోరిక కూడా వాడి కోసమే కోరడం... మనసులో నిలిచిపోతుంది.

ఉరిశిక్ష తీయబడుతున్న తండ్రిని కలుసుకోవాలని డిబిరిగాడు పరుగుపరుగున ఊళ్లు దాటుకుంటూ రావడం, అతని ఆత్రం, చివరికి తండ్రి శవాన్ని మాత్రమే చూడగలగటం... ఇదంతా నా కళ్ల ముందు జరిగినట్టు భావించాను.

నాకు నచ్చిన దృశ్యం (శేషగిరి రావు శైలిని ఈ పేరా పట్టిస్తుంది):

"బార్... బక్... గొగ్గొగ్గొ..." మని తుంగ దుబ్బుల్లో నుంచి గూడకొంగ రెక్కలు కొట్టుకుంటూ లేచింది. డిబిరిగాడు చటాలున తుపాకీ ఎత్తి దాని గమనంతో పాటే గురి సారిస్తున్నాడు. మెడ సాగదీసుకుంటూ, వెనక్కాళ్లు చాచి గాలిలో రెక్కలు కొట్టుకుంటూ అపుడే లేచిన సూర్యుడికి అడ్డంగా నల్లగా దాటబోతోంది. తుపాకీ గురి వెంటాడుతోంది. 'ధూమ్'! డిబిరిగాడి తుపాకీ పేలింది. దెబ్బకి ఠప్ మని దూది పింజె పిట్లిపోయినట్టు గుప్పెడు వెంట్రుకలు గాలిలో మెరుస్తూ తేలుతున్నాయి. గాలిలోనే చచ్చిన గూడ కొంగ నిండుగా లేస్తున్న ఎర్రటి సూర్యబింబం నేపథ్యంలో విరిగిపడిన చీకటి పెళ్లలా బరువుగా దబ్బున నీటిలో పడిపోయింది. 

ఈ సన్నివేశాన్ని నేను నా కళ్లతో చిత్రించుకున్నపుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేను. నా దృష్టితో ఒక కెమెరా లోంచి చూసినట్లుగా అనిపించింది.

ఈ కథతో సాహిత్యం ఒక స్థాయి నుంచే రాయాలని, రచన చేయాలని హద్దులను చెరిపేసింది. రచనకు హద్దులు లేవు. పేద గొప్ప బేధాలు లేవు. నగరీకరణే కాదు, బడుగు జీవుల జీవితాల్లోనూ ఎన్నో ఎత్తు పల్లాలను ప్రకృతిలోని అందాలను పాఠకుల హృదయాల్లోకి తుపాకీ గుండులా దూసుకుపోయేలా చేయొచ్చు. అని రచయిత తెలియజేశాడు.

జోహార్లు అల్లం శేషగిరి రావు గారు!  

Tuesday 24 September 2013

జీవం


నా సుగంధ పరిమళాలు 
దిగంతాలు వ్యాపించడం తెలుసు
ఏటి ఒడ్డున నిలుచున్న నాకు నీటి గలగలలు తెలుసు
నా నీడన శయనించిన ప్రేమ జంటల కిలకిలలు తెలుసు
ప్రతి వెన్నెల రాత్రి నెలరాజు పలకరింపుగా నవ్వింది తెలుసు
పక్షులు నాపై వాలి పాడిన విరహగీతాలు తెలుసు
చిట్టి చేపలు నీట తేలి నా నీడతో సయ్యాటలాడటం తెలుసు
కానీ ఇప్పుడన్నీ 
చాలా దూరంగా
 పారిపోయాయి 
ఎందుకనో
మరి నాలో 
పూర్వపు
జీవం లేదనో
ఆకులు రాలి
పువ్వులు వడలి
మోడుగా మిగిలాననో

Friday 30 August 2013

శ్రీకారం

లోపల అలలుగా వచ్చే ఆలోచనల్ని ఇక్కడ వెలిబుచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది నా మొదటి బ్లాగు. ఏదో డైరీ రాతలు తప్ప పెద్దగా రాసిన అనుభవం కూడా లేదు. ఈ బ్లాగు అలవాటైనా నాకు రాయడం నేర్పుతుందని ఆశ. తప్పులుంటే క్షమించి ప్రోత్సహించండి. మంచి సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను. 

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...