Wednesday 27 September 2023

అవలోకనం..



మబ్బు పట్టడం, వర్షం చినుకు నేలకు రాలినపుడు మట్టివాసనేయడం, గాలిలో ధూళి కణాలు ఎగిరి ముఖాన్ని తాకడం, నీటిలో చిట్టి చేపలు గంతులేయడం. కొబ్బరి ఆకులు గాలికి తలలూపడం, అమ్మ గట్టిగా అదిలించి పిలవడం, నాన్న గుండెల మీద ఆడుకోవడం, ముద్దొచ్చి బుగ్గగిల్లితే నా ఏడుపు నాకే కొత్తగా అనిపించడం అంతా నేను కొత్తగా ప్రపంచంలోకి వచ్చానని తెలిపిన సమయాలు. నా అనే ఎరుకను ఇచ్చిన సందర్భాలు... ఇదే నా ప్రపంచం అని.. ఇక నుంచి నేను ఇక్కడే మనాలని,, గత జన్మ వాసనలు మరిచిపోయి.. కొత్త జన్మలో ఇమిడిపోయిన సందర్భాలు అవి. అన్నీ కొత్తగా వింతగా దోచిన విషయాలివి. నాతో పాటు తోబుట్టువులు, స్నేహితులు, చుట్టాలు ఎందరో, నేను అని, నాకు అని తెలియని రోజుల్లో బాల్యంలోకి చొచ్చుకుని పోయినపుడు నాకు కనిపించే దృశ్యాలు ఎన్నెన్నో.. వాటికి తోడుగా నాకు మిగిలిన జ్ఞాపకాల దొంతరలో తిప్పే ప్రతి పేజీలో ఓకథ.



చిన్నతనం ఎంత గొప్పది.. అప్పుడు కనిపించే దూరాలు, చేసే సాహసాలు, కలిగే ప్రేమలు, దూరం పెట్టేసే చికాకులు.. అన్నీ విడ్డూరమే.. అది నేనేనా అనిపించేంత చిత్రవిచిత్ర సంఘటనలు.. ఎక్కడో నటి చనిపోతే.. ఇక్కడ గొయ్యితీసి, పూలు చల్లి, శిలా ఫలకం పెట్టేంత ఆలోచన ఆ వయసులో కలగడం ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు. దివ్యభారతి చనిపోయిందని తెలిసాకా నేను చేసిన మొదటి పని ఆమెకు సమాధి కట్టడం. 



ఎర్రగాజులు, ఎర్రని లంగా వేసుకుని ముస్తాబై స్కూలుకి వెళ్ళాలని తెగ తాపత్రయపడ్డ క్షణాలు. అందుకున్న ప్రేమలేఖలో ప్రేమ ఎంత ఉందోనని అతని కోసం వీధులన్నీ తిరుగుతూ ఇంటిదాకా వెళ్ళి నిఘా పెట్టిన క్షణాలు.. దోబూచులాటలు.. ఓర చూపులు.. వయసు చిన్నదే కానీ.. మనసు పెద్దదని తెలుసుకున్న సమయం అది. 



నాచురంగు పావడా కట్టుకుని గుడిలో ఆడుకుంటుంటే.. సువర్ణగన్నేరు పూలు నేలంతా పరుచుకుని తెల్లని దీపాల మాదిరి కనిపించి మురిసిపోయిన క్షణం. అతనితో అక్కడే ఎన్నో మరిచిపోలేని ఆడలాడిన సాయంత్రాలు..



చాక్లెట్ కాగితంతో బొమ్మలు చేసుకోవచ్చని తెలిసి.. స్నేహితురాలి ఇంటికి వెళ్ళి మరీ తెచ్చుకుని సంబరపడ్డరోజు..



చెల్లి కాలువలో పడిపోతే దానికోసం ఆలోచించకుండా దూకేసి కొట్టుకుపోయిన రోజు..



ఈ ప్రపంచంలో నేను ఉన్నానని చెప్పేందుకు బాల్యం నుంచి పునాది వేసుకుంటూ వస్తుంటే.. దానితో పాటు వయసు ఎదిగి ఎన్నో ఎదురు దెబ్బల్ని కొట్టి, రాటుదేలేలా చేస్తే.. అక్కడా నేను ఎదురుగా నిలబడగలిగానంటే.. ఈ జీవి ఎంత మొండిదై ఉంటుంది. నన్ను చూసి నేను గర్వపడే స్థితిలోనే ఎప్పుడూ ఉండాలని.. నన్ను నేను కొత్తగా రోజూ నిర్మించుకుంటూ.. సాగిపోవడం.. ఈ జన్మకు నేను చెప్పుకునే కొత్త భాష్యం. 

Tuesday 19 September 2023

ఆనందం నన్నడిగేది..

ఆనందం నన్నడిగేది..
నన్ను ఎక్కడ దాచావని
అతని చూపులో, మాటలో,
మనసులో, సాంగత్యంలో అన్నాను.
హృదయాన్ని వదిలేసానని,
నింపుకోలేదని పాపం దానికి అనుమానం

నక్షత్రకాంతిలో గాలి రేగింది..
చూపులు కలిసే చోటికి ప్రయాణం
ఆనందాన్ని వెతుకుతూ దారికాని దారుల్లోకి..
ఎండుటాకుల శబ్దానికి మల్లే గుండె శబ్దం..
పిలుపు వినిపించేంత దగ్గరగా
జీవిత రహస్యాన్ని తెలుసుకున్నట్టుగా..

ఆకాశాన్నంతా పూడుస్తున్నాను,
ఇంకా ఆనందం పట్టలేనంత ఉంది.
నింపుతున్నాను, అంతటా, అతనితో కలిసి..
ప్రేమ పుష్పాన్ని వికసింపచేయడానికి.. 


 

Monday 18 September 2023

నీ రూపాన్ని చూసే వీలు లేకపోతే..

 ఎప్పటికీ నాకు ప్రేమ దొరక్కపోతే..
పగటిని రాత్రి కలిసే చోట
కలిసిపోతాను.

నీ రూపాన్ని చూసే వీలు లేకపోతే
ఉదయకాంతిని అరువడుగుతాను.
విషాదాన్ని, ఒంటరితనాన్ని మోయలేక
అలలపై విడిచిపెడతాను.

అప్పటికీ నువ్వు కనిపించకపోతే
అంతులేని విషాదంలోకి దూకిపోతాను.
ఉదయాన్ని శపించే వీలులేదుకానీ,
లేకుంటే వెలుగునే బహిష్కరిస్తాను.

గుస గుసగా ప్రేమ కబుర్లు వినిపిస్తే..,
నేల చూపులు చూడలేను.. వెతుకుతాను. అన్నివైపులా
నువ్వు కలిపించే దారలంట..


Friday 15 September 2023

కళ్ళు..




కొత్తవారిని కళ్ళు వెంబడిస్తాయి.
రెండు కళ్ళను నాలుగు చేసి
చూపులు కలిపేందుకు చూస్తాయి.


 
దారులన్నీ తిరుగుతుంటే కొత్త ముఖాలు
విడివడి జతపడి
ముఖాలకు తగిలించుకున్న చూపుల లెక్కలు
దొంగచూపులు కొన్ని, దొరచూపులు కొన్ని
దోబూచులాటలు కొన్ని, అన్నీ కళ్ళే ఇక్కడ.

 

 
ఆరాధనలు కొన్ని, ఆత్రాలు కొన్ని.
ఇన్ని చూపులు దారులు తప్పినపుడు
చీకటిని మింగి నిదరోయినప్పుడే శాంతి.




Friday 8 September 2023

పువ్వుల మల్లే ఊగుతూ..

కదలని ఆలోచనలతో, ముతకబడి
ఖైదీగా ఆలోచిస్తోన్న క్షణాన
ద్వారం ముందు
స్వేచ్ఛగా ఊగుతున్న మందార పువ్వు
నవ్వుతుంది నన్ను చూసి..

బద్దలైన కాంతి బండారానికి,
తలుపులన్నీ తీసుకుని
బైట తిరిగే స్వేచ్ఛకోసం
నిద్రలోంచి మేల్కొని
పువ్వుల మల్లే ఊగుతూ
పోతాను. స్వేచ్చకోసం..
ప్రేమంటే ఏమిటని నీ హృదయాన్ని అడిగిచూసావా?నీకోసం తపించే మనసు, నీకోసమే దేహంతోటి రక్తంతోటీ పెనుగులాడి గాఢమైన దుఃఖంలో ఒదిగిపోయి నిన్ను అడుగుతున్నాను ప్రేమంటే ఏమిటి? నువ్వంటే ఓ బలహీనత
రెండు హృదయాల మధ్య మంచు పల్లకీ నువ్వు.. కలం అంచులకు వ్రేలాడే స్వప్నాక్షరం నువ్వు. సూక్ష్మంగా వినిపించే నాగుండె సవ్వడి నువ్వు.


 

నువ్వు..


నువ్వంటే ఓ బలహీనత

రెండు హృదయాల మధ్య మంచు పల్లకీ


కలం అంచులకు వ్రేలాడే స్వప్నాక్షరం

సూక్ష్మంగా వినిపించే నాగుండె సవ్వడి..



Thursday 7 September 2023

నీకిచ్చిన కాన్కను పోగొట్టుకున్నావా..



చీకటి నలుపులను దాటి
వేకువ దారులంట పయనించి
చినుకుల తోరణాలను కట్టి,
హృదయాన్ని అద్దంగా చూపితే
అందుకోలేక జారవిడిచావా..



ఫలించని కలలా..
తక్కిన జీవితంలోకి..
అలముకున్నట్లుగా..
అజ్ఞానంలో కొట్టుకుపోతున్న మేఘంలా



మిగిలిపో..
పిలిచినా పలకకు. ఆగిపో అక్కడే..
వాన చినుకుల చిటపటలన్నీ
రమ్మని పిలిచినా సరే..
రాకు ఇటువైపు..

 

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...