Thursday 14 March 2019

ఓ.. దొంగచూపు.....


నాలుగింటి వేళ నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నాను. ఎండకు వెచ్చబడిన నేల పొగలు కక్కుతుంది. దూరంగా కల్లుపాక దగ్గర సైకిళ్ళ మధ్య మగవాళ్ళంతా గుమిగూడి ఉన్నారు. తలపాగాలు, సంగం గోచీలు, తాటి కల్లు కంపు, చీకులు కాలుతున్న పొగ. చాలా రోజులుగా చూస్తున్నదే..  ఆ వేళ కొత్తగా ఏం లేదుగానీ... పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టి, తాటాకు ఈనెలతో వరసగా గుచ్చి, సైకిళ్ళకు వేలాడేసారు. ఇళ్ళకో.. లేక అమ్మకానికో అనుకుంటాను.
వాటిని దాటుకుని వెళుతుంటే ఒకటే నీచు వాసన. రోడ్డుకి ఆ పక్కనున్న కట్టవకి బ్రహ్మజముడు పొదలకు రెండు రోజులుగా కొత్తకళ వచ్చి చేరింది. అంతటి ముళ్ళున్న పొదలకు ఎంతో అందంగా పూసాయి పూలు. ఓసారి ఇంటికి తెంపుకు వెళ్ళాను. అమ్మ ఆ పొదల కింద పాములుంటాయే , మళ్ళీ పట్టుకొస్తే కాళ్ళు విరగకొడతాఅంది.

కబాడ్డీ బాగా ఆడేసానేమో నీరసంగా పడుతున్నాయ్ అడుగులు. చెల్లివాళ్ళతో కాకుండా ఇంటికి విడిగా వెళ్ళడం ఇదే మొదటిసారి. రేపు లెక్కల పరీక్ష కదా తరగతిలో అందరూ తెగ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరి నేనో..  కబాడ్డీలో ఓడిపోయి నీరసంగా ఇంటికెళుతున్నాను. మా బక్కది ఇంకా స్కూల్లోనే ఉందో చెల్లీ, తమ్ముడితో ఇంటికి వెళిపోయిందో...తెలీదు

వచ్చేసాను. ఇంటికి కాస్త దూరమే ఉంది. ఇంతలో పక్కనే ఉన్న రైస్ మిల్లు నుండీ సుబ్బారావు సైకిలు మీద స్పీడుగా వచ్చి నా ముందు సడెన్ గా  బ్రేక్ వేసాడు. కంగారు పడలేదుగానీ కస్సున చూసాను. అమ్మాయిగారు... మిమ్మల్ని ఓ మాట అడగాలండి అన్నాడు. ఆ..చెప్పు ఏంటి.. అన్నా. అదే మా గుమస్తా గారికి మీ యార్డ్ లో చింతకాయలు కాసిని కావాలట కోసుకోమంటారా.. అన్నాడు. నాన్నగారిని అడుగు. అనేసి ఆగకుండా వచ్చేసాను.

మరనాడు సాయంత్రం సదరు గుమస్తాగారు తన కూడా తోకతో సహా మా ఇంటి ముందు ప్రత్యక్షం.. మా అమ్మ ఇలాంటి వాటిని ఇట్టే పట్టేస్తుంది. గుమ్మం ముందు నించుని చూస్తున్న నన్ను ఒక్కతోపు తోసి, అలా వెళ్ళి ఆ పాతింటి గుమ్మం ముందు ఉన్న చింత చెట్టు కాయలు తెంపుకోండి అంది. తోక సరేనమ్మా అన్నాడు. గుమస్తాగారు హీరో ఫోజుతో సొల్ల కారుస్తూ, దొంగచూపులు చూసుకుంటూ, తోకతో తప్పనట్టు... ముందుకి నడిచాడు.

అమ్మ వంట గదిలోకి వెళ్ళగానే అసలు ఈ గుమస్తాగాడి సంగతి తేల్చేయాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను. ఎప్పుడూ పుస్తకం తీయని నేను వరండాలో పుస్తకం  పట్టుకుని దూరంగా కాయలు తెంపుతున్న బడుద్దాయిల్ని చూస్తూనే ఉన్నాను. అమ్మ ఓసారి ఏం చేస్తున్నావే... చిన్నది  ఇంకా  స్కూలు నుండీ రాలేదు.. ఓసారి వెళ్ళు అంది.

ఇక సమాధానం ఏం చెప్పలేదు. సరే అనలేదు. ఉదయం గడ్డిమోపు కట్టి ఉందని ఇంట్లోనే వదిలేసిన రథాన్ని, అందుకుని ఒక్క గెంతులో గెటు వరకూ వెళ్ళిపోయాను. స్కూలుకి వెళ్ళాలని కాదు ఆత్రం. ఇదేంటో చూడాలని,,,. ఇంటికి దగ్గరగా ఉన్న గ్రంథిగాడి కిరణాషాపు ముందు సైకిల్ ఆపి, నాలుగు చెగోడీలు కొనుక్కుని,  తింటూ సైకిలు మీద కూర్చున్నాను. ఇంతలో తోకలు మా ఇల్లు దాటి కొట్టు మీదుగా రైస్ మిల్లు వైపు వస్తున్నారు. నన్ను చూసి ఒక్క పిచ్చినవ్వు. సరే.. నని నేనూ ప్రతి నవ్వు.

ఇంతలో తోక అమ్మాయిగారు... మీరు ఏ క్లాసు చదువుతున్నారు అన్నాడు కొట్టువైపుకు వస్తూ.. నేనా తొమ్మిది..., ఏ... నువ్వు చెరతావా... అన్నాను. అబ్బే... కాదండి మా గుమస్తాగారు అడగమన్నారు అన్నాడు. అవునా.. పాపం మీ గుమస్తా గారికి మాటలు రావా మూగోడా..మరి లెక్కలేలా చూస్తాడు అన్నాను. నేను మాట్లాడుతుంటే కొట్టు రాటకు నిలబడి కళ్ళతో సొల్లు... ఓ.. చలీ జ్వరం వచ్చినట్టు మొలికెలు తీరిగిపోతున్నాడు. ఏంటి సంగతి మా ఇంటికి వచ్చే ధైర్యం వచ్చిందా.. అన్నాను. అబ్బే అదేం లేదండీ మామూలుగా వచ్చామంతే అనేసి ఇద్దరూ వెళ్ళిపోయారు.

అది మొదలు నేను ఎక్కడ కనిపించినా నవ్వడాలు, నాతో సమానంగా సైకిల్ తొక్కాలని ఆరాటం.. అంతా గమనించేదాన్ని. ముఖ్యంగా మా స్కూలు పక్కనున్న అప్పాజీ రొట్టెల కొట్టుకు మాత్రం ఇంటర్ వెల్లో స్కూలు బెల్లు మోగే సమయానికి వచ్చేవాడు.

పెద్దగా పట్టించుకునట్టు కనిపించకపోయినా .. ఆ చూపులు ఎక్కడో పరిచయం అయినట్టు ఉండేవి. అయితే నేనంటే భయం తప్ప మరే చర్యా ఉండేదికాదు ఆ ముఖంలో. కానీ ఓ రోజు స్కూలు నుండీ వస్తుంటే.. కల్లు కొట్టు దాటాకా రెస్ మిల్లు వెనక గేటు లోపలి నుండీ నేను రావడం ఎవరో గమనించడం, ఆ తలుపు సందులోనించి నన్ను చూస్తున్నారని తెలుసుకున్నాను..మరనాడు సుబ్బారావుని గట్టిగా అడిగితే అది గుమస్తా సూర్యం పనేనని చెపితే, ఏదో  హడావుడిలో పట్టించుకోకుండా వెళిపోయాను. ఈ దొంగచూపులు  చాలా రోజులు గమనించాను. టీ కొట్టు దగ్గర నేను రావడం చూసి, తాగుతున్నటీ కింద పెట్టేసి, లేచి నిలబడేవాడు.. ఇదంతా నేను తీసుకున్నంత తేలికగా అతడు తీసుకోలేకపోయాడు. చాలారోజులు కనిపించకుండా తిరిగేవాడు. నేను అతనికోసం చూసానంటే అది ఆ రైస్ మిల్లు దాటుతున్నప్పుడు దొంగచూపులు ఏవని వెతికేదాన్ని.కనిపించని రోజు సరేలేమ్మని వెళిపోయేదాన్ని. కనిపిస్తే గద్దించి చూసేదాన్ని. ఒక్కోసారి ధైర్యం చెయడం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో, ఒక్కోసారి పిరికితనమూ అంతే చేటు చేస్తుంది. ఎవరు ఎటు మొగ్గుతారనేది వాళ్ళవాళ్ళ నిర్ణయాలను బట్టి ఉంటుంది. నాలోని ధైర్యం అతనిలో లేదేమో.. అతనిలోని అణుకువ నాకు రాదేమో.. తెలీదు.. ఏది ఏమైనా.. కేవలం చూసుకుని మాట్లాడుకున్నది ప్రేమగా మారాలని ఎక్కడా లేదుగా..

మనసులో ఏమున్నా.. పిరికితనం అతని నోరు నొక్కేసింది. అటుపైన అతనికి పెళ్ళి కుదిరింది.  ఓ వారంలో పెళ్ళి ఉందనగా సత్తెమ్మతల్లి గుడి దగ్గర.... నేను అతడితో అన్నమాటలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తాయి. సైకిల్ మీద నుండీ దిగకుండా భవానీ కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడికి వచ్చిన సూర్యం తనకు పెళ్ళి కుదిరిన సంగతి చెప్పకుండా పెళ్ళి శుభలేక చేతిలో పెట్టాడు. పెళ్ళికి తప్పకుండా రావాలని చెపుతూ.., కార్డు మీద నా పేరు రాసి, పెళ్ళికి తప్పకుండా రావాలన్నాడు. నేనేం మాట్లాడలేదు. కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాకా.. నేనే అన్నాను. అసలు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా ...

ఎంతో దీనంగా  ముఖం పెట్టి, నాకు.. ఇష్టం  లేదు. కానీ ఇంట్లో బలవంతంగా చేస్తున్నారు అన్నాడు. నేనేం అనుకుంటున్నానో.. అనుకున్నాడో ఏమో... కానీ నాకు నువ్వంటే ఇష్టం అన్నాడు...మరి ఎందుకు అంత నచ్చని పెళ్ళి చేసుకోవడం. సరే అయితే.. నేనొకటి చెప్పనా...పెద్దాళ్ళకోసం ఆ పిల్లనీ.., నీ కోసం నన్ను రెండో పెళ్ళి చేసుకో.. ఇద్దర్నీ చక్కగా చూసుకోవచ్చు అన్నాను. 

ఏం మాట్లాడకుండా గిర్రున సైకిల్ ఎక్కి వెళిపోయాడు. నా మాటలకి గురుడి గుండె మోకాల్లోకి జారిపోయిందనుకుంటా.. మళ్ళీ నా వంక చూడకుండా ఎక్కిన సైకిల్ దిగకుండా, వెనక్కి చూడకుండా చక్కా పోయాడు.

తరవాత చాలా ఏళ్ళకు తనని మళ్ళీ చూసాను. రైలు పట్టాలు దాటుతూ బండిమీద కనిపించాడు. నన్ను గుర్తుపట్టనట్టే ఉంది వాలకం. బాగా మారిపోయాడు. బండి ముందు చిన్నపిల్ల కూతురనుకుంటాను. 




2 comments:

  1. అక్కో, నీ బయో లో description లో , "గడుసుదానిని" అని కూడా చేర్చుకోవచ్చేమో అని అనిపోయిస్తుంది ఈ ఎంట్రీ చూసిన తర్వాత🤣

    ReplyDelete
    Replies
    1. ఎందకమ్మా..నేనేం గడుసుదాన్ని.. మంచోరే బాగా చెప్పారు :)

      Delete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...