Wednesday, 13 March 2019

మొదటి రోజు తెలుగు క్లాసు ....
ఈ పెద్దాళ్ళున్నారే ఎప్పటికీ పిల్లల్ని అర్థం చేసుకోరు. చెప్పాపెట్టకుండా ఊరు మార్చేస్తే వాళ్ళకు అప్పటివరకూ ఉన్న స్నేహాలు, పరిచయాలు ఏమైపోవాలి. అందరిసంగతీ నాకు తెలీదుకానీ నా సంగతి మరీ గడ్డుగా తయారైంది. ఏదో ఊరెళుతున్నాం అన్నారు. ఓహో అమ్మమ్మ ఊరు కాకుండా కొత్త ఊరని సంబర పడిపోయాం.. నాతో సహా మిగతా ముగ్గురూను. సరే పరీక్షలు అయిపోయాయి, ఈ సెలవులు అయ్యాకా తిరిగి వచ్చేస్తాకదాని వెళుతున్న సంగతి ఎవరికీ అసలు ఎవరికీ చెప్పనే లేదు.

అలా ఏఫ్రియల్ 23, 1993 బయలుదేరి ద్వారపూడి వచ్చేసాం...సెలవులైపోయాయి. తిరిగి ఆలమూరు వెళ్ళడం లేదన్నారు. ఇకపై ఇక్కడే చదువుతున్నారు మీరంతా అన్నారు. అది విని నా చిట్టి గుండె బరువెక్కింది. నాకు మాత్రమే తెలుసు నేను ఆలమూరులో వదిలేసిన స్నేహం ఎంత విలువైనదో.. లోలోపలే చాలా బాధ పడ్డాను. ఇక కొత్త స్కూలు సంగతికొస్తే....

ఇదిగో ఇక్కడ కథ అడ్డం తిరిగింది. ఇప్పటి వరకూ సదరు నా తండ్రిగారు నా మీద పెట్టుకున్న ఆశల సౌధాలన్నీ కూలిపోయింది ఇక్కడే. అప్పటివరకూ నేను బాగా చదువుతానన్న ముసుగు కాస్తా పీకిపారేసారు, ఇక్కడి మాస్టార్లు. నేను దద్దమ్మల జాబితాలో కలిసిపోయిందీ ఇక్కడే..

స్కూలు మొదటి రోజు.. నన్ను వెంటబెట్టుకుని తెలుగు క్లాసు జరుగుతున్న బంగాళా పెంకులతో వేసిన షెడ్ వైపు తీసుకువచ్చారు నాన్నగారు. నాకు తెలుసు కొత్త చోటులో మన ప్రతిభ బయటపడిపోతుందని. అయినా గొప్పగా సర్టిఫికెట్ చదువులు చదివేసి ఎవరు బాగుపడ్డారో చెప్పండి. అహా చెప్పండి. వంట చేసుకుంటూ, ఇంటి వాళ్ళు పొరుగింటోళ్ళు ఏం కొనుక్కున్నారో తెలుసుకుని ఏడిచి చావడమో, లేదా ఈ సోదంతా ఫోనుల్లో వెళ్ళబోసుకోవడమో, అదీ కాదంటే సీరియళ్ళను చూస్తూ గయ్యాళి గంపల్లా తయారవ్వడము. ఇప్పుడు ట్రెండ్ ఇదే నడుస్తుంది. హమ్మయ్య నేను ఈ కోవకు అస్సలు చెందను కాబట్టి ఇంత ధైర్యంగా రాసేయగలుగుతున్నాను... సరే.. విషయానికి వస్తున్నా...

తెలుగు క్లాసులోంచి డూ, మూ, ఊ, లు ప్రధమా విభక్తి...  అని ఆడపిల్లలు, మగపిల్లల గొంతులు తెలుగు మాస్టారు శర్మగారి గొంతుతో కలిసిమరీ గట్టిగా వినిపిస్తుంది. గుమ్మం ముందు నన్ను, నాన్నగారిని చూసి ఆపండిరా... అని గట్టిగా అరిచాడాయన. క్లాసంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇదిగో ఇప్పుడు నాకు తెలుస్తుంది నా గుండె ఎంత గట్టిగా వినిపిస్తుంది.ఇంత గట్టిగా కొట్టుకుంటుందని తెలిసి ఆశ్ఛర్యం కలిగింది. నాకు తెలుసు అది భయమని. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు కొన్ని సందర్భాలు నాకు ఇప్పటికీ పల్స్ రేటు పెంచేస్తాయి. మమ్మల్ని చూసి ఎవరు, ఎందుకు వచ్చారు అన్నట్టు చూసారు పెట్టుకున్న కళ్ళద్దాల్లోంచి. నాన్నగారు నమస్కారం చెప్పి నన్ను ఏడోతరగతిలో ఆరోజే జాయిన్ చేస్తున్నట్టు చెప్పారు. ఆయనకు నా గురించి బాగా చదువుతానని, లేక్కలు చించేస్తానని ఏదో పుత్రోత్సాహం.. పుత్రుడు జన్మించినపుడే.. లేవల్లో... ఎక్కడ చెప్పకూడదో అక్కడే చెప్పి నన్ను ఇరికించి వెళ్ళిపోయారు నాన్నగారు.

మామూలుగా కొత్తగా క్లాసులో ఎవరు జాయిన్ అయినా మొదటి రోజు మాస్టార్లు చేసేపని ఏంటో తెలుసా.. తరగతిలో మొదటి వరసలో కూర్చోనివ్వడం. అదిగో అప్పుడు ఏం తెలియని ముఖం వేసుకుని గొప్పగా ఫీలైపోతూ కూర్చుంటామా.. అప్పుడే సరిగ్గా అప్పుడే మన మీద పరిక్షలు, ప్రశ్నలు సంధిస్తారు. ఈలోపు మన ప్రతిభ ఏమిటన్నది బయటపడిపోతుంది. ఇక నాలుగో వరసకో.. ఆపై మూలకో నెమ్మదిగా నెట్టివేయబడతాం... అదీ సంగతి.

ఊ.. నేను కాస్త సర్దుకున్నాకా... మా శర్మగారు నెమ్మదిగా తన చూపును నా మీద నిలిపారు. నన్ను తేరిపారా చూసి.. ఆ..ఆ.. చెప్పమ్మాయ్.. నీ పేరిమిటన్నావ్ అన్నారు. నెమ్మదిగా గుండెల్లో దడకు తోడు ఈ మాటతో కాళ్ళల్లో వణుకు మొదలైంది. లేచి నించున్నాను. నా పేరు శ్రీశాంతి.. అప్పటికింకా వెనక..ముందూ ఈ ఇంటిపేర్లు తగిలించడం లేదు కదా లేదంటే గొప్పగా శ్రీశాంతి దుగ్గిరాలని చెపుదును. ఓ... శాంతా.. బావుంది.. ఓరే పిల్లలూ శ్రీశాంతి ఇక మీ క్లాసులో చదువుతుంది. అందరూ స్నేహంగా ఉండాలి.. ఆ.. సరే ఎక్కడ చదివావమ్మాయ్ ఆరో తరగతి.... నేను .. ఆ.. నేను.. ఆలమూరులో చదివానండి... సరే అయితే నువ్వు బాగా చదువుతావని మీ నాన్నగారన్నారు. ఏదీ విభక్తులు చెప్పు అన్నారు.

చచ్చింది గొర్రె.. మన కవి ఏమిటో..... వాటి రంగేమిటో అసలు అవి ఏలా ఉంటాయో తెలిసి చావదే.. ఇప్పుడెలా కాసేపు వేళ్ళు నలుపుకుని .. ఆయన ముఖంలోకే చూస్తూ కూచున్నాను. ఏంటమ్మా.. ఆరో తరగతిలో చదివావు కదా.. పరీక్షలు కూడా అయిపోయాయ్.. చెప్పు.. అంతా వింటారు. అన్నారు.


నాకు కాళ్ళు, చేతులూ చెమటలు మొదలై.. తల తిరిగిపోకుంది.. ఇంకాసేపు ఈయన ఇలానే అడిగితే కళ్ళుతిరిగి పడిపోతానేమో అనిపించింది. నెమ్మదిగా మాస్టారూ.... మా తెలుగు మాస్టారు విభక్తులు చెప్పలేదండి అన్నాను. అంతే క్లాసంతా విరగబడి నవ్వింది. అలా నవ్వుతూనే ఉంది. ఈసారి మన ప్రతిభ అర్థమైపోయిన శర్మగారు ఆహా.. పోనీలేమ్మా... అసలు తెలుగు సబ్జట్ మీకు లేదనలేదు.. మంచిది.. అన్నారు.. ఎంత అవమానం.. ఎంత నామోషీ...కదా..


No comments:

Post a Comment

వ్యక్తా వ్యక్తం