Thursday 21 March 2019

నీ ఆశ అడియాస... లంబాడోళ్ళ రాందాస....




ఏరా ఆ బాత్రూమ్ నుండీ ఈ రోజుకి బయటకు రావా.. మీతో వేగలేక చస్తున్నా.. మీ నాన్న పూజకు టైం అయ్యింది. ఇటు వస్తే నన్ను అంటాడు.. బయటికి రా త్వరగా గట్టిగా అరిచింది నాన్నమ్మ. ఊ.. ఊ.. లోపలి నుంచీ మూలుగుతున్నాడు బాబాయ్. అరుగుమీద ఆడుకుంటున్న నాకు తెలుసు తను లోపల చేసే పనేంటో... కిసుక్కున నవ్వాను. నాన్నమ్మ కోపంగా చూసింది నావైపు. ఏంటే ఆ నవ్వు. మరీ నవ్వితే పళ్ళు ఊడిపోతాయ్. పో.. లోపలికి గద్దించింది.

నన్నంటావే.. బాబాయ్ బాత్రుంలోంచి రాకపోతే.. నాదా తప్పు. గట్టిగా అనేసి సూరి వాళ్ళ ఇంటికేసి పరుగెత్తాను. రవి బాబాయ్ నాన్నగారి ఆఖరు తమ్ముడు. ఇంకా పెళ్ళికాలేదు. మరీ ముదిరిపోయాడు కూడా.. ఏ పిల్లను చూసినా నచ్చలేదంటాడు. తనకు నచ్చిన అందమైన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని, అమ్మానాన్నా చెప్పారని ఎవరిని పడితే వాళ్ళను చేసుకోనని ఏదో చెప్పేవాడు. నాన్నమ్మకు కట్నం ఆశ బాగానే ఉంది. ఇక తాతయ్య పరిచయస్తుల్లో చూస్తున్నాడు పిల్లని. వారానికి రెండు పెళ్ళి సంబంధాలు చూసిరావడం తీరిగ్గా బాబాయ్ వంకలు పెట్టడం ఇదే తంతు. వీధిలో గచ్చుమీద కూర్చుని ఎప్పుడూ పిల్లబావుంటే, కట్నం తీసుకోకూడదని తెగ ఉపన్యాసాలు ఇచ్చేవాడు.

నాన్నమ్మ దగ్గరకు నేను వేసవి సెలవులకి వచ్చాను. వచ్చిన దగ్గరనుండీ కుళాయి దగ్గర నుంచీ నీళ్ళు మోసుకువచ్చే పని బాగా ఉంటుంది. ఏదో ఆడుకుందామని వస్తే రోజూ ఉదయం సాయంత్రం నీళ్ళు మోయాలి. నాకేమో నాన్నమ్మ దగ్గర కాకుండా అమ్మమ్మ దగ్గర ఉండాలని ఉంది. అక్కడకు పంపరు. అమ్మమ్మది కూడా ఇదే ఊరు. ఇంచక్క అక్కడైతే తాతగారు హోటల్ నుండీ చాలా రకాల కూరలతో భోజనం పెట్టిస్తారు. అమ్మమ్మ ఎప్పుడూ ఆడుకోనిస్తుంది. అస్సలు ఏం అనదు. మరి ఇక్కడ అలా కాదు. నాన్నమ్మకు పనులు చేయాలి. తాతయ్యకు కాళ్ళు పట్టాలి. పైగా అస్తమానూ అమ్మను తిడతారు. నన్ను విసుక్కుంటారు. నాకు అస్సలు ఇక్కడ నచ్చడం లేదు. అలా అని చెపుదామంటే నాన్నగారు ఎప్పుడో ఇక్కడ వదిలిపెట్టారు గానీ, నన్ను చూడడానికి రానేలేదు. నాకు ఇంటి మీద చాలా బెంగగా ఉంది. అమ్మా, నాన్న, తమ్ముడు, చెల్లెళ్ళు గుర్తుకొస్తున్నారు. నేను వెళిపోతాను పంపేయమంటే బాబాయ్ ఏం మాట్లాడడు.

ఐదుగురు అన్నదమ్ముల్లో నాన్నగారంటే ఎందుకో చిన్నచూపే అందరికీ.. చిన్నతనంలో తన చదువు పక్కన పెట్టి మరీ ఇంటి బాధ్యతల్లో పంచుకున్న నాన్నగారు తోబుట్టువుల్ని ఓ గట్టుకు చేర్చి చతికిలబడ్డారు. తల్లితండ్రులకు ఇష్టంలేని పెళ్ళి అందరికీ దూరంగా నిలబెట్టింది. మేమంతా పెరిగి పెద్దయ్యాకా కూడా నాన్నమ్మ మాతో సరిగాలేదు.
తాతయ్య రామాలయం దాటి మా వీధి మలుపు తిరిగాడు. సూరిగాడి ఇంటి ముందు ఆడుకుంటున్న నాకు తాతయ్య రావడం కనిపించింది.

 వెంటనే నాన్నమ్మ ఇంటివైపు పరుగెత్తాను. రొప్పుతూ తాతయ్య వస్తున్న సంగతి బాబాయ్ తో అరుస్తూ చెప్పాను. వెంటనే ధడేలున బాత్రూం తలుపు తెరుచుకుంది.  నడుంమీద ఉన్న చిన్న తువ్వాలు సరిచేసుకుంటూ నాలుగు అడుగుల్లో ఇంట్లోకి వెళిపోయాడు బాబాయ్. తన వెనకాలే గాల్లో తేలుతూ సిగరెట్ పొగకూడా వెళిపోయింది. బాబాయ్ చాలా అందంగా ఉంటాడు. చిరంజీవంటే చాలా పిచ్చి, తాతయ్య కొట్టు మూసి ఇంటికి వచ్చే వేళకు రావడం., మళ్ళీ వాళ్ళు పడుకున్నాకా అర్థరాత్రి వరకూ స్నేహితులతో సినిమాలకు వెళ్ళడం, ఉదయాన్నే బాత్రూంలో దూరి సిరగెట్టు కాల్చడం, ఇంటి గోడలనిండా మసిబొగ్గుతో చిరంజీవి బొమ్మలు గీయండం, అప్పుడప్పుడూ మా రామాలయానికి వచ్చే ఆడపిల్లల్ని ఏడిపించడం ఇదే మా బాబాయ్ పని.

ఇక సందులో భాగ్యం అత్తయ్య దగ్గర సాయంత్రాలు మీటింగ్ వేసేవాడు. ఈ వారం తను చూసిన పిల్లకు ముక్కువంకరని, మూతి నల్లగా ఉందని, పొట్టిగా ఉందని, ఇప్పుడు చూసిన సంబంధం అసలు తనకు ఏమాత్రం సరిపోదని ఇలా చెప్పేవాడు. భాగ్యం అత్త కూడా నీకేం రా రాజాలా ఉంటావ్. మీ అన్నలందరూ మంచి పెళ్ళాలని కట్టుకున్నారు. నీకూ ఎక్కడో రాజకుమారి వస్తుంది. కంగారు పడకు అనేది.

ఓరోజు తాతయ్య తన స్నేహితుడు బంగార్రాజుని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, నలుగురు కొడుకులు, రెండో అమ్మాయి పెళ్ళికి ఎదిగిందని సంబంధాలకోసం చూస్తున్నారు. ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి బాబాయ్ విషయం విని అందరినీ వాళ్ళ పిల్లను చూసుకోడానికి రమ్మని చెప్పి వెళ్ళాడు.

నాలుగురోజుల్లో మంచిరోజున పిల్లని చూసుకునేందుకు వస్తామని కంబురంపారు. ఇక తాతయ్య అయితే ఎలాగన్నా ఈ సంబంధం కుదురిపోవాలనే పట్టుమీద ఉన్నాడు. బాబాయ్ ఇంకో పది సంబంధాలన్నా చూసి అప్పుడుగానీ పెళ్ళి చేసుకోకూడదనే పట్టుమీద ఉన్నాడు. ఇక నాన్నమ్మ కట్నం సంగతి తేలితేనే ముందుకు వెళదామని పట్టుగా ఉంది.

అందరం బస్సులో రాజావరం బయలుదేరాం. తాతయ్య తెల్ల పంచెలో, నాన్నమ్మ జరీ అంచు చీరలో, బాబాయ్ బెల్ ఫేంట్, గళ్ళ చొక్కాలోముస్తాబయ్యారు. ముగ్గురు వెళ్ళకూడదని నన్నూ వెంటబెట్టుకుని తీసుకెళ్ళారు. ఉళ్ళోకి వెళ్ళగానే గోళీసోడా తాగి, రెండు రిక్షాల్లో వాళ్ళ ఇంటిముందు దిగాం. ఇల్లు విశాలంగా ఉంది. గుమ్మం ముందు వరండాలో పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళతో చేరి నేనూ కూచున్నాను. లోపల గదిలో పెద్దాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు.

ఇంతలో నాయనమ్మ పళ్ళెం నిండా మిఠాయి పట్టుకుని వరండాలో ఉన్న మా దగ్గరకు వచ్చి మీ బాబాయ్ కి పెళ్ళి ఖాయం అయ్యిందే. ఇదిగో ఇందా తిను అని చేతిలో పెట్టింది. నేను ఆనందంగా పిన్నిని చూడాలని లోపలికి పరుగెత్తాను. బాబాయ్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు, చుట్టూ అంతా అల్లుడుగారు అని మాట్లాడుతున్నారు. లోపలి గదిలో కూర్చున్న పిన్నిని చూసి వచ్చాను. పట్టుచీరలో ఒంటి నిండా నగలతో పిన్నిని ముస్తాబుచేసారు. అస్సలు ఆమెలో బాబాయ్ చెప్పిన పోలికలేమీ లేవు. నల్లగా, పొట్టిగా ఉంది. మరెందుకు పెళ్ళికి ఒప్పకున్నాడో ఇప్పటికీ తెలీదు.

అందగత్తెని చేసుకోలేదని బాబాయ్ బాధపడిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇద్దరూ చక్కగా కాపురం చేసుకున్నారు. బాబాయ్ అంటే పిన్నికి ప్రాణం. చూస్తుండగానే కాలం గడిచిపోయింది. రూపం చూసి ఎంచుకున్నా మనుషులు గుణవంతులవుతారని ఎక్కడాలేదుగా.. తరువాత అందరి కోడళ్ళలోకీ మా పిన్నే తాతయ్యనూ, నాయనమ్మనూ బిడ్డల్లా సాకింది. తన చేతుల మీదనే వాళ్ళను సాగనంపింది.


4 comments:

  1. చాలా బా వచ్చిందిరా..

    ReplyDelete
    Replies
    1. అమ్మాయిని పట్టుకుని రా అంటావేమిటి బ్రో

      Delete
    2. మీరెవరో తెలీదు గానీ... ఆయన మావారండి. ఆయన నాకన్నా గొప్ప రైటర్.. :)

      Delete
  2. శాంతక్కా,మెహెర్ భాయ్ "చాలా బా వచ్చింది" అన్నాడంటే,నాకు ఆనందం వేసింది. ఎందుకంటే, అన్న ఏదైనా నిక్కచ్చిగా చెప్తాడు కదా☺️.
    అక్కా, నువ్వు ఇలానే రాస్తుండు, చక్కగా, నీకు నచ్చిన విధంగా.

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...