Thursday 2 June 2022

కొన్ని జీరపోయిన ఆలోచనలతో నేను...



కొన్నిసార్లు మనలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉంటాం. మనిషి ఆశ మోహం నాకు కావాలన్న కోరికతో ఈ లోకంలోకి అడుగుపెడతాడు చివరి వరకూ అదే అతన్ని నడిపిస్తుంది. నా లోకంలోకి నేనూ అలాగే అడుగుపెట్టాను. ఎప్పుడూ ఏదీ కావాలని బలంగా కోరుకున్నది లేదు. చాలా జీవితం గడిచిపోయాకా.., చాలా దూరంగా జరిగిపోయాకా.. పోగొట్టుకున్నది ఎప్పటికీ తిరిగిరాదని.. నేను ఎవరికీ అవసరం లేదని తేలిపోయాకా.. ఇప్పుడున్న నా బంధాలను కాపాడుకోవాలనే సృహ కలిగాకా.. నాలో శక్తి అంతా కరిగిపోయాకా...ఇదంతా నా చుట్టూ జరుగుతున్న నాటకంగా మాత్రమే నాకు కనిపించడం మొదలు పెట్టింది. ప్రతి చర్య వెనుక మరో అర్థం కనిపిస్తుంది. నేను ఇక్కడ గడుపుకుని కొద్దిరోజుల్లో వెళిపోవాలనే సృహ నాకు కలుగుతుంది.


నేను ఆరాధించే చలాన్ని ఎందరో ఆరాధించారు. ఎందరో కావాలనుకున్నారు. ఎందరో అసహ్యించుకున్నారు. మరెందరో దూషించారు. అంతకన్నా ఎక్కువమంది ఆయన్ని ప్రేమించారు. ఈ ప్రేమ అనే భావం మాత్రమే ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన పేరు చుట్టూ వలయంలా ఆక్రమించుకుని ఉండిపోయింది. ఆ ప్రేమే ఆయన్ని గుర్తుంచుకుని తరిమేట్టు చేస్తుంది. నాకు అక్షర జ్ఞానం తెలిసాకా రాయడం చదవడం అబ్బాకా నాతో ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ఉన్నది చలం మాత్రమే.. ఏ చిన్న దిగులు వచ్చినా అతనే నాకు స్నేహితుడు.. అతను పలవరించిన భగవాన్ నాకు తెలియదు. నాకు తెలిసినవాడు ఆ ఈశ్వరుడు మాత్రమే.. చలం ఇచ్చిన బలమే ఏదో చేయాలనే తపనను నాకు ఇచ్చింది. రాయగలననే ధైర్యం నాలోకి ఒంపింది. ఇప్పుడు ఈ చేతులు పదాలను రాస్తున్నాయంటే నాకే చిత్రంగా తోస్తుంది.అలాంటి వాడి బాధలు నేను ఇన్నాళ్ళు పట్టించుకోలేదేమిటా అని లోపల ఎక్కడో బాధ.. తీరా తెలుసుకున్నాకా ఇప్పుడు ఇతను కూడా అందరిలా బాధ పడినవాడే.. నాకు ఇన్నాళ్ళు అంత భరోసాను ఇచ్చి ఇప్పుడు ఎందుకు నన్ను మీమాంసలో పడేసాడా అని అనిపిస్తుంది.

ఎప్పుడూ ఏ విషయంలోనూ నేను లోతుగా వెళ్ళి ఆలోచించి దాని అంతు చూడాలనుకోను. నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. ఎందుకో తెలీదు. అలా తెలుసుకోవడం నన్ను ఆ విషయం మీద ఇష్టం లేకుండా చేస్తుందని భావిస్తాను. భయపడతాను. అందుకే చలం గురించి అతని ప్రేమల గురించి, అతని అవమానాల గురించి నేను ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకోలేదు. ఇన్నాళ్ళూ అతన్ని ఆరాధిస్తు నా లోకంలో నేను విహరించాను. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరగటం నాకు నేను గమనించుకున్న విషయం. నేను ఆరాధించే మనిషి నన్ను సాహిత్యం వైపు కాస్తన్నా నడిపించే మనిషి ఓ సాధారణమైన వాడిలా కనిపించడాన్ని నేను భరించలేకపోతున్నాను. ఎందుకో జీర్ణం కావడం లేదు.

ఏంటి చలం ఇలా ఆలోచించాడా.. ఇలా బాధ పడ్డాడా ఇలా ఎదుటివారి ప్రేమల కోసం అర్రులు చాచాడా.. ఏమిటి ఇదంతా ఇంత లోకంలో అలాంటి వాడు బ్రతకడానికి కన్నీళ్ళు, కష్టాలు ఎన్ని నరకపు రాత్రులు, పగళ్ళు.. చావుకై.. ఎదురుచూపులు.. అబ్బా.. అవన్నీ నన్ను కుచించుకుపోయేట్టు చేసాయి.

కానీ అర్థం అయిన సంగతి ఏమిటి అంటే ఇదేదో వలయం లాంటిది. అదే ఈ లోకంలోకి వచ్చిన ప్రతి జీవీ ప్రతి క్షణాన్ని తన్నుకుని కొట్టుకుని సాగదీసి ఆఖరుకి కొన్ని జ్ఞాపకాలను, కొన్ని బంధాలను పెద్ద మూటగా చేసుకుని తన భుజాన వేసుకుని మోస్తూ చివరి క్షణాలకై ఎదురుచూస్తూ ఎప్పుడు ఈ దేహంలోంచి జీవుడు వదిలిపోతాడా అని ఎదురుచూస్తూ ఉండటమే జీవితం.

మనం కోరనిది.. మనకు తెలియకుండా జరిగిపోయే పుట్టుకతో మనతో వచ్చేవి కొన్ని స్నేహాలు, మరికొన్ని ప్రేమలు, ఇంకొన్ని బంధాలు, బరువులు వాటితో కష్టాలు కన్నీళ్ళు,ఆర్థిక పరమైన ఇబ్బందులు,డబ్బు, ఇవన్నీ కలగలిపి ఎక్కడో ఇరుకుని మనల్ని కాసేపు ఈ తత్వం నుంచి బయటపడేసిన మనకు మాత్రమే సొంతమైన ఆనందపు క్షణాలు, అవన్నీ అలా కలలా వీటిమధ్యలోకి వచ్చి అలరించి ఉన్నస్థితిని మరిచిపోయేట్టు చేస్తాయి. నా అనే సృహలేకుండా వేరే లోకంలోకి తీసుకుపోతాయి. ఇన్నీ మన చుట్టూ ఉన్నా మనం ఒంటరిమే.. ఒంటరిగానే బ్రతికి ఒంటరిగానే పోవాలి. ఈ ఒంటరితనాన్ని అందరూ మోస్తారు. కొందరు అందరిలో ఉంటూ ఒంటరిమి కామని బ్రమలో బ్రతుకుతారు, కానీ ఈ ఒంటరితనం కాచుకు ఉంటుంది. నీ ప్రేమలు, పెళ్ళిళ్లు, పిల్లలు బాధ్యతలు అన్నీ అయ్యాకా నెమ్మదిగా మళ్ళీ నిన్ను చేరుతుంది. అందులోనే జీవుడు పోయేదాకా మనతో సావాసం చేస్తుంది. ఎంత చిత్రం ఎంత బాధ ఎవరు అడిగారు ఇలా పుట్టించమని.. నేనైతే కోరుకోలేదు ఈ జన్మని.. ఈ బ్రతుకుని.. ఈ కదలని సమయాన్ని.. అందులో ఆనందమయమైన పసివాడి నవ్వులు తప్ప మరేదీ నాకు ఆనందాన్ని పంచలేకపోవడం నేను అనుభవించలేకపోవడం..

కొన్ని వృధా జన్మలు.. వృధా బ్రతుకులు.. వేగంగా వెళుతున్న ఆటోలోంచి చూస్తే పుట్ పాత్ మీద దొల్లుతూ.. కుచించుకుపోయిన దేహాలు కనిపిస్తాయే వాటికన్నా నీచమైన జన్మ.. ఏదో చేసి ఇది తప్పుకోలేము.. అనుభవించాలి. అందరితోపాటు కాదు. ఒంటరిగా.. అవును ఒంటరిగానే..

మన చుట్టూ ఏదో జరుగుతుంది. జరుగుతూనే ఉంటుంది. 

Wednesday 1 June 2022

మోసం తెలీని పూలు..

 



పూలకు తెలీదు మోసపోవడం ఏమిటో.. రోజుల తరబడి పూయడం..సువాసనలు వెదజల్లడం..వాడి నేల రాలడం..మధ్యలో అలంకారాలకు అతిథులుగా వెళ్ళడం.. కురుల మధ్య చేరి మురిసిపోవడం ఇదే వాటి జీవితకాలంలో జరిగేది...వీటికి మధ్య మూగ ప్రేమలకు సాక్ష్యాలుగా పోయి రెండు మనసుల్ని ఏకం చేస్తాయి..నలిగిపోతాయి..రాలిపోతాయి..మళ్ళీ మొగ్గల్లా పుట్టుకొస్తాయి. తేనెను పధిల పరుచుకోవడం ఎరుగవు..పసిదాని హృదయమంత స్వచ్ఛత వాటి సొంతం..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...