Tuesday 29 June 2021

వికసించిన తామరల్లే...

 




వికసించిన తామరల్లే...

చుట్టుకుపోయే అందం 

ఆ రాతిరి సొంతం.

చందమామ చెదిరిన 

మబ్బల్లే మెరుస్తుంది

చుక్కలు తోకచుక్కల్లా 

రాలి పడుతున్నాయి

చప్పుడు లేని వీధులంట 

నా చూపులు చక్కర్లు 

కొడుతున్నాయి.

అంతా నిశ్శబ్దం..

ఓ ఇంట దిగాలుపడి 

మినుకు మినుకు మనే దీపం

మరో ఇంట వాలిన చీకటి

నగరం మౌనంలోకి జారిన వేళ

నేనో బాటసారిని

వెతుకుతున్నాను వీధి వీధి

నీకోసమే

నన్ను విడిచి పోయిన నా నీడ కోసం

వెతుకుతున్నాను విరాగినై..

Monday 28 June 2021

ఇదంతా ఎంత స్వార్థం



 నాది ఎంత చిత్రమైన హింసో

తెలుసా!

కలలు, కన్నీళ్లు రెండూ నాకు

బంధువులు

దివిటీలకు మల్లే ఈ కళ్ళు 

కాచుకుంటాయి నీకోసం

చీకటిలో కూడా 

నీ ఛాయనే కలగంటాను

దారిలో ఆ ఇసుక నేలల్లో

నీకోసం అడుగులు వేస్తూ

వస్తాను

ఇదంతా ఎంత స్వార్థం

మేఘాలు నాతో అంటాయి

ఎందుకు అంత ఆత్రమనీ..

నీరు, ఈ గాలి జత చేరి 

వెక్కిరిస్తాయి

కాలానికీ వెక్కిరింపే

తీరా నువ్వొచ్చే ఘడియ కనురెప్ప

వాలినంత సేపు ఉండదు

ఇట్టే మాయమవుతావు

నా వగలన్నీ మూట గడతానా!

అవీ ముట్టుకోవు..

ఏం ప్రేమో ఇది.

Sunday 27 June 2021

నేను...





పరిమళాలు విరిసిన వనంలో 

విహరిస్తున్న వేళ నేనో చకోరాన్నై 

కొమ్మల్లో వాలిపోతాను.

గాలి విసురుకు ఎగిరి 

వచ్చిన ధూళి కణంలా

ఆటలాడే వేళ చిన్న 

పాపాయినైపోతాను.

కళ్ళు మిరుమిట్లు గొలిపే 

కాంతి సోకినపుడు

చిత్రమైన చిరునవ్వుగా 

పూస్తాను.

వానాకాలం వచ్చిన 

మట్టి వాసనలతో

మకరందమై మెరుస్తాను.

రాతిరి కన్న కలలన్నీ

సాయంత్రాలు నిజమైనప్పుడు

నేనో రాకుమారినైపోతాను.

తేనెపట్టును రుచి చూసేప్పుడు

ముసలామె నోటికి పూసినంత

ఆనందపడతాను.

ఒక్కోసారి పూలమాలలు కట్టి

చిన్ని కన్నయ్యకు వేస్తూ

గోపికనైపోతాను.

వసంతం వచ్చి వాలిన వేళ

కోయిలమ్మనై మావిచిగురుకై

కాచుకుంటాను.

కలగన్న ప్రియుని ఒడి చేరినపుడు

ఎన్నో స్వయంవరాలు గెలిచిన

వీరుడిమల్లే మురిసిపోతాను.

Friday 25 June 2021

ఈ గాలికి...




ఈ గాలికి సుగంధాన్ని 

ఎత్తుకెళ్ళడం తెలుసు

మనసులో మరిగే ఆలోచనలకు 

రూపం ఇవ్వడం తెలుసు

చెవిలో గుసగుసలు 

ఆడటం తెలుసు

ఈ తెమ్మరకు వయసు

గిలిగింతలు తెలుసు

నీ జ్ఞాపకాలన్నీ ఎగిరి 

వచ్చి వాలినపుడు

పెదాల మీద చిరునవ్వయి 

మెరవడం తెలుసు

వేళకాని వేళ నీ రాకను 

కలగనడం తెలుసు

వేడి నిట్టూర్పులు వదలి 

వెచ్చదనాన్నివ్వడం తెలుసు

ఏం తెలియదని ఊరికే అలా 

వచ్చాననీ చెప్పి 

పోవడమూ తెలుసు..

నీకు తెలుసా!

ఈ గాలికి మాయమవడం 

తెలుసు

Monday 21 June 2021

చీమలు

 


చీమలు

పంచదార డబ్బా చుట్టూ

నేల పడ్డ పాల చుక్క చుట్టూ

ఎక్కడ చూడు చీమలు

హడావుడిగా తిరిగేస్తూ, 

ఆహారాన్ని

ఎత్తుకుపోతూ..

బానిసత్వం మరిగిన చీమలు

మట్టిని దొలిచి పుట్టలు 

గుట్టలు చేసి

రాజ్యాలు ఏలే చీమలు

మనిషికి మల్లే స్వేచ్ఛ 

కోసం పోరాడవు

బానిసలుగా జీవితాన్ని 

సాగనంపే చీమలు

వగల యువరాణికి 

వంగి వంగి వందనాలు

పెట్టె శ్రమ జీవులు

కాళ్ళకింద ప్రాణాలు 

విడిచి

క్షణ బంగురపు

జీవితాలు గడిపే 

చీమలు

Thursday 17 June 2021

నువ్వు నా సమస్తానివి..







చెట్లు పోగేసుకు వచ్చిన వసంతానివి

ఆ పూమాలలోని మల్లేల సుగంధానివి

పాత పుస్తకంలో చదివి వదిలిన పేజీవి

చీకటిలో వెలిగే దీప కాంతివి

ఒక్కోసారి...

పాపాయికి పాడే జోల పాటవు

నాలో ధైర్యాన్ని నింపే స్నేహానివి

గాలికి ఎగిరే చీర కొంగువు

హద్దులే లేక పొంగే ప్రేమవు

మరోసారి... 

ఉరిమే మేఘానివి

వేళ దాటిన భోజనానివి

జడలోని మందారానివి

ఇంకోసారి...

నాలో ఉరకలేసే ఉత్సాహానివి

నన్ను దోచుకున్న హృదయానివి

అలకలన్నీ తీర్చి బుజ్జగించే అమ్మవు

ఇప్పుడు మాత్రం నా సమస్తానివి

Thursday 10 June 2021

ఎవరికి తెలుసు...





కలలు అలలుగా జారుకున్న నిద్ర 

ఎప్పటిమల్లే అదే నిరాశ

అవే ఉదయపు నీడలు

రాత్రి లోకి కుంగిపోతున్న 

సాయంత్రాలు

వాలు కళ్ళలో ఆ చీకటి వెనుక

నేలరాలని కన్నీళ్ళు

మనసు కావల దాగున్న 

రూపమే లేని ఆవేదన

వెలుగు లోతుల్లోకి ప్రయాణం 

కట్టిన సూరీడు

నిలువుటద్దం ముందు తేలని 

సొయగపు లెక్కలు

గడిచిన ఏకాంతపు 

ఆనవాళ్లు తడుముతూ

విరహంతో మెరిసిన చిరునవ్వు

జరగని సమయానికి 

చీదరింపులతో వేసిన సంకెళ్లు

దీవిటీలకు మల్లే వెలుగుతూ 

నాకంటి పాపలు

Tuesday 8 June 2021

నీ నవ్వును వెతకాలి

 



చిలిపి నవ్వది..చిత్రం చేసే నవ్వు

మర్మం తెలిసిన నవ్వు

వర్షంలో తడిచిన పైరంత 

అందం అది

గలగల పారే గోదారి

ఆ నవ్వెక్కడ దొరుకుతుంది

భుజాన వాలినప్పుడు

నెమ్మదిగా నీ చేతుల్లోకి తీసుకుంటావే

అప్పుడే నా!

వెలితిలేని జీవితపు ఆస్వాదన

మనసుకు నచ్చిన పాట ఆ నవ్వు

నా బాధనంతా పెనవేసుకుని నీలోనికి

లాక్కున్నప్పటి..సంగతి

చేపకళ్ళదాన అనీ నువ్వు నాకిచ్చిన

ముద్దుపేరులోనూ నీనవ్వును వెతికే

పిచ్చి మనసు నాది

మధ్యాహ్నపు ఆకలి ఆ నవ్వు

ఏ కాలానికైనా వలసలు 

కట్టే విరహం మనది

వగరు, తిపి కలగలిపిన 

ముద్దుల నవ్వది

రాగాలు మీటే వీణాధ్వనిలో 

పుట్టిన స్వరమది

ఎగిరే పావురాయికి 

ఇచ్చిన స్వేచ్ఛది

గాలివాటుకు ఊగే 

మువ్వల తోరణం

మిగిన జీవితమంతా నీతో 

గడిపే వరమడిగాను

నాకోసం ఏం మొక్కావో...

నీముద్దును అందుకుంటూ 

అడగాలి.ఓ

Monday 7 June 2021

రెండూ నువ్వే..




జీవితాన్ని ఓ కోణంలో 

పరికించే పేదవాడికి

ఎదురయ్యే ప్రశ్న..

ఈరోజు ఏలాగా అని

మెలకువ రాగానే ఆవేళకి

కడుపుకి సరిపడినంత

దాచుకున్నామనే తృప్తి

గుడిసలోని ముసలి అవ్వకు

మేడలోని పెద్దావిడకూ

తేడా జానడంతే

నరాల బిగింపులో 

శ్రమించే శరీరం

ఎండ వేడిలో మాగిపోయే

దేహం రెండూ నీవే

ఈ బ్రతుకు క్షణ కాలం

రెక్కలు మొలిస్తే ఎగిరిపో

రాగల కాలం రాళ్ళే కురుస్తాయో

రతనాలే దొరుకుతాయో

ఆలోచించకు ఎగిరిపో

Saturday 5 June 2021

అందానికే అందం



 చుట్టూఉన్న దిగులును

పక్కకు తోసి

ఆ మర్రిచెట్టుకు కట్టిన

ఊయల ఊగుతున్నానే

ఆ కాలానికేనా మన ప్రయాణం

ఎక్కడికి వెళతావు

ఆ చోటుకేనా!

ఆటలన్నీ ఆడి అలసిపోతామా

అప్పుడూ నేనే సేద తీర్చాలి.

ఎన్నివేల క్షణాలో అలా

నిన్ను ప్రేమించే సమయాలకై 

ఎదురు చూస్తూ...

ఎప్పుడు వస్తుందది

నేను నీరసించాకనా!

అలసి ఆవిరైపోతున్న వేళనా!

ఏం దేహాలివి

ముట్టుకుంటే మాసిపోతాయి

ఊపిరాడక గాలికోసం

తడిముకుంటాయి.

ఇప్పుడు ఈ ముడుచుకున్న

దేహం వద్దు కదూ నీకు

వెగటేస్తుందా..!

అందానికే అందంగా 

ఉన్నానంటివి..నిజం కాదా!

Friday 4 June 2021

బోలెడు దిగులు..


 ఎంతటి చిక్కని ప్రేమ ప్రయాణం 

మనది

పక్షులకు మల్లే ఎగిరే ఆశలు 

మనవి

మనం ఇద్దరం కలిస్తే పౌర్ణమే 

వికసించే తామరపూల 

సొగసందం ఆరోజు

అద్దానికి మన ఊసంతా తెలుసేమో

నన్ను చూసి నవ్వుతుంది

మన ముచ్చట్లు అడుగుతుంది

బోలెడు దిగులు

కమ్మెసిన సాయంత్రం ఇది

కింద భూమి కదులుతున్నంత

కుదుపు

ఏం రాత్రి ఇది

చీకటి కమ్మేసిన చంద్ర కాంతిలో

గూటికి చేరిన కొంగల జంట

ఎప్పటి మాటలివి.. ఎప్పటి చేతలు

ఆ మందారాలకు ఆకాశాన్ని గుచ్చి

నా తలలో తురిమిన వెన్నెల రాత్రి

వర్షాన్ని అడ్డం పెట్టుకుని తిరిగిన 

దారులు

తడిచిన తడి దేహాల గుసగుసులు

ఇంకాస్త దగ్గరితనాన్ని వెతుక్కునే 

మనసులు..

నీకోసం వేచి చూస్తానా

ఎప్పుడు వచ్చి

ఎంత ఎత్తుకు ఎగిరి పడతామోనని

రెక్కల మాటున నీ ప్రేమలో 

ఉన్న మైకమే నేమో

మరేదీ సాయం లేదు నాకు

ఎప్పటికి చేరుకుంటానో నిన్ను

Tuesday 1 June 2021

నీ ప్రేమకు కొలమానం..




మాటలన్నీ మన మధ్య చేరలేక

మౌనవ్రతం తీసుకున్నాకా..

నీ బిగి కౌగిలి చెప్పే విషయం ఏమంటే 

నీకు నామీద వల్లమాలిన ప్రేమని..

ఈ ప్రేమకంతా కొలమానం  

వెతకాలంటావా..

అది నీవిచ్చే ముద్దులోనే 

అందుకోగలను నేను..

జాలిగా.,కవ్వింపుగా నువ్వు చూసే

చూపులో చిక్కుకున్న 

నా హృదయానికి తెలుసు..

అవి ఎంత వాడైనవో..

కాలంలో వెనక్కు వెళ్లి గతకాలపు

మన జ్ఞాపకాలను ఏరి తెచ్చుకున్నప్పుడు

అప్పుడు కనిపిస్తుంది నీ కళ్ళలో

దివిటీల వెలుగు..

భవిష్యత్ ఎంత అందంగా అల్లుకోవచ్చో

ఆశ చూపిస్తావు చూడు

అలజడంతా మరిచి నీ ఆలింగనంలో

మరోసారి కరిగిపోతాను.

నా గుండెకు తగిలిన గాయాలన్నీ 

నీ చల్లని స్పర్శానందంలో 

కరిగిపోతాయి చూడు

అప్పుడు తెలుస్తుంది..  

నీ మనసెంత స్వచ్ఛమైన

వెన్నముద్దో..

వదలలేక వదలేక నన్ను 

వదిలి వెళతావే..అప్పుడే

కంట కన్నీరు పొంగి 

వస్తున్నప్పుడు తెలుస్తుంది 

నువ్వేం చేసావో ఈ హృదయాన్ని..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...