Thursday 25 December 2014

కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........

ఈమధ్య వెళ్ళిన ఒక పెళ్ళిలో కలిగిన అనుభవాలను మ్యూజింగ్స్ రూపంలో ఇలా పంచుకున్నాను.

http://patrika.kinige.com/?p=4573



Sunday 2 November 2014

వాకిలి పత్రికలో నాకథ బామ్మగుట్టు ప్రచురితమైంది.

వాకిలి నవంబర్ సంచికలో నాకథ బామ్మగుట్టు ప్రచురితమైంది.
http://vaakili.com/patrika/?p=6681















మిట్టమధ్యాహ్నం సూరీడు నడినెత్తిన ఉండి తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ స్కూలు వదలగానే రోడ్డు మీద పడ్డాను మాసిపోయిన యూనీఫాంతో, అవ్వాయి చెప్పులేసుకుని. ఓపక్క ఆకలి, మరోపక్క వేడెక్కిన రోడ్డుమీద నడక, ఎంత తొందరాగా ఇంటికి వెళ్ళి అన్నం తింటానా అనే తొందరలో ఉన్నాను. సరిగ్గా మా గుడి సందు దాటుతుంటే, ఎత్తరుగు మీద ఇంటి చూరు కిందగా, కాళ్ళు బారజాపుకుని చేతి కర్రతో కాకుల్ని తోలుతూ వడియాలకు కాపలాకాస్తూ కూచునుంది సిద్ధేర్వరి బామ్మ. ఆకలి వల్ల కళ్లానక ఇలావచ్చేసాను. “చచ్చానురా దేవుడా… ఉత్తపుణ్యాన బామ్మకు పలారమైపోతానే” పక్కదారిగుండా పోకుండా ఎందుకు గుడి దారిన వచ్చానురా అనుకున్నాను. నేను తనను చూడక మునుపే బామ్మ తన గుడ్ల గూబకళ్ళేసుకుని నన్ను చూసేసింది.
“ఏమిటే సుబ్బి ఇలా వస్తున్నావ్, ప్రసాదం కోసమేనా… అంత తిండియావ ఏమిటే… చదువు సంధ్యా ఏవన్నా ఉందేమిటే, ఇంత మిట్టమధ్యాహ్నపు వేళ ఏమిటే నీకు ఈవీధిలో పని… ఓ పక్కతెల్లారకుండానే గుడి దగ్గర వాలిపోతావు. దీపాలవేళా గుడి దగ్గరే ఉంటావు. ఇప్పుడెందుకు వచ్చావే… వేళాపాళా లేదా ఏం… అంటూ ఆపకుండా తిడుతూనే ఉంది. నా మాట వినడం అన్నదే లేదు.
బామ్మదంతా అదో సంత ఎవ్వురినీ నమ్మదు. ఉత్త పిసినారి, చాదస్తం మనిషి. ఆ ఇంటి గుమ్మం ముందు నుండీ పొరపాటుగా వచ్చామా చచ్చామే. ముఖ్యంగా పిల్లలంటే అస్సలు పడదు. ఎప్పుడూ ఎదవ అనుమానం కళ్ళేసుకుని చూస్తూ, అందరి మీదా నోరు పారేసుకోవడమే అలవాటు. బామ్మ అందరితోనూ కాస్త బాగా మాట్లాడేది కార్తీకమాసంలోనే… అదెళ్ళిపోగానే మళ్ళీ మామూలు సూరేకాతం అయిపోద్ది.
“ఏంటే పిల్లదానా నేను అరుస్తున్నా మాటన్నా మాటాడవేమే… మంచి పొరుగే దాపురించింది… ఈ పిల్లల్ని గుళ్ళోకి రానీయకురా అంటే మా వాడు వినిచస్తేగా వెదవసంత. ఏ చెట్టుమీద ఏ కాయలున్నాయా, పూలున్నాయా అని చూసి ఎత్తుకు పోడానికీ ఈ పచారిలు…” బామ్మ ఇంకా తిడతానే ఉంది. నేను ఒక్క పరుగందుకుని మా ఇంట్లోకొచ్చి పడ్డాను.

సిద్ధేశ్వరి బామ్మ గురించి ఇంకా చెప్పాలంటే, ముందు మా ఊరు గురించీ మా గుడి గురించీ కాస్త చెప్పాలి. మాది తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు. పక్కనే ఉన్న రావులపాలెం, మండపేటలు కాంక్రీటు బిల్డింగులతో, ఎటుచూసినా నిరంతరం రద్దీగా తిరిగే వాహనాలతో ఎంత మారిపోయినా, ఈనాటి వరకూ ఎలాంటి మార్పులూ లేకుండా అదే బెల్లులూడిపోయిన పాత మేడలు, చెద పురుగులు తినేసిన చెక్కమెట్లు, నాచు పట్టిన గోధుమరంగు సున్నం గోడలు, పల్లెటూరి వాసన్ని వదిలించుకోవాలని తెగ తాపత్రయపడే జనాలు, చుట్టూ పొలాలు, చెరువుగట్టు, చిన్న బడి, మర్రిచెట్టు ఉయ్యాలా, బుధవారం సంత, సైకిలుషాపు, మిఠాయి కొట్టు, బట్టీవిక్రమార్కుని గుడి… వీటన్నింటి మధ్యా ఎన్నాళ్ళైనా తనలో మార్పురాలేదని స్వగతంలో ఆనందపడే మా ఊరు. మాఇంటికి నాలుగు ఇళ్ళ తరువాత ఉంది భట్టీవిక్రమార్కుని గుడి. మా దొడ్డివైపు గుమ్మంలో నిలబడి చూస్తే ఆలయగోపురం, వెనకవైపు రోడ్డుకానుకున్న పూజారిగారి ఇల్లూ కనిపిస్తాయి.
మా ఊరికంతా పెద్దదేవాలయమైన భట్టీవిక్రమార్కుని గుడి ఏనాడో దేవతలు కట్టారంటారు. రోడ్డుకి ఎత్తులో ఉంటుంది. ఎతైన గాలిగోపురం, ధ్వజస్తంభం, శివునికి ఎదురుగా పెద్ద నంది, కొక్కానికి వేలాడదీసిన బరువైన గంట, అగరబత్తి, సాంబ్రాణి కలిపి వచ్చే కమ్మని వాసనతో ఉంటుంది గుడి.
సువర్ణ గన్నేరు చెట్ల పూలు రాలి విశాలమైన గుడి ప్రాంగణం తెల్లని తివాచిలా మారిపోతుంది, తెల్లవారేసరికి తరుముకొచ్చే పూల పరిమళాలతో చూడచక్కగా ఉంటుంది వాతావరణం. ఇక మా గుడి పంతులుగారు సుబ్రమణ్యం దీక్షితులు చాలా మంచోరు, పిలిచిమరీ ప్రసాదం పెడతారు. పంతులిగారి భార్య సీతమ్మ సోమవారం చెక్కరపొంగలి మా భలేగా చేస్తారు. ఈళ్ళ అమ్మాయి రాజ్యం మా బడిలోనే ఆరోతరగతి చదువుతుంది. చాలా కొంటిది నన్ను కొడుతుంది. రాజ్యం బామ్మే సిద్దేశ్వరి.
కొన్నాళ్ళ క్రితంవరకు బాగానే ఉన్న మా ఊరి పెద్దలు ఈమధ్య ఆలమూరును ఓ పుణ్యక్షేత్రంగా తయారు చేయాలని కంకణం కట్టేసుకున్నారు. చెరువు గట్టంపటా అన్ని దేవుళ్ళగుళ్ళూ కట్టించేసారు. ఆదివారం మొదలుకుని శనివారందాకా రోజుకో గుడిలో ఒక్కోరకం ప్రసాదం తినే భాగ్యం మా పిల్లకాయలకు దక్కింది. కొత్తగా స్నేహం దొరికిందని పాత స్నేహాన్ని వదలగలమా, అలానే కొత్తగుళ్ళొచ్చాయని పాత గుడిని వదలలేంకదా.
ఎన్ని గుళ్ళు వచ్చినా మా గుడి అందం ఏ గుడికీ లేదు. కార్తీకమాసంలో గుడి నిండుగా దీపాలు పెడితే అచ్చం ఆకాశంలో నక్షత్రాలు నేలమీద వెలుగుతున్నట్టే ఉంటుంది.
ఓరోజు బడి వదిలేసాకా ఇంటికొస్తున్న దారిలో రాజ్యాన్ని అడిగాను “ఏమే రాజ్యం మీ బామ్మ ఎందుకే అందరి మీదా ఉత్తనే కేకలేస్తాది”.
“ఏమోనే నాకు తెలీదంది”. తెలిసినా చెప్పుద్దా చుప్పనాతిది. అదేదో పరమ రహస్యం అన్నట్టు.
కొంత కాలానికి బామ్మ చనిపోయింది. రాజ్యం చాలా ఏడిచింది, నాకూ ఏడుపొచ్చింది. గుడివైపుగా వెళుతుంటే పదేపదే బామ్మ గుర్తొస్తుంది. బామ్మ బ్రతికుండగా ఏనాడూ వాళ్ళ ఇంటివైపు రానీలేదు. నన్ను చూస్తేనే చీదరించుకునేది.
ఓసారి మా అమ్మను అడిగితే, “ఆళ్ళు మనలా ఎండలో నడుమొంచి పన్జేయ్యరే, రెండు మంత్రాలు చదివితే కడుపు నిండిపోద్ది, పైగా గుడి మీద బోలెడు సంపాదనా, అమ్మవారికివచ్చే పట్టుచీరలన్నీ కొత్తమాయగానే ఇంట్లో పెట్టేసుకుంటారా… పైకి మాత్రం ఏం లేనట్టుగా ఉంటారు. అవన్నీ చూత్తామని ఆళ్ళిళ్ల వైపు మనల్ని రానీరు” అంది.
బామ్మ చనిపోయి నెలరోజులైపోయింది. ఆళ్ళ ఇల్లు చూడాలన్న నా కోరికా అలానే ఉండిపోయింది.
ఓరోజు రాజ్యాన్ని బతిమాలి ఇల్లు చూడ్డానికి వెళ్ళాను. ఎత్తరుగు మీద ఆరబోసిన వడియాలు ఎవరూ కాపలాలేకుండా ఉన్నాయి. ఇల్లంతా చాలా పాతగా బీటలువారి ఉంది. రెండే గదులు. అందులోనే చిన్న వంటగది. చూడ్డానికి చాలా ఇరుగ్గా ఉంది ఇల్లు. దండెం మీద మాసిన రెండు పంచెలు, చిరుగుల చీరె వేలాడుతున్నాయి. అమ్మ చెప్పినట్టు ఈళ్ళు ఉన్నోళ్ళు కాదనిపించింది.
పెరడులోకి తీసుకెల్లింది. రకరకాల మొక్కలతో, పువ్వులతో ఉంది పెరడంతా… ఓ మూల చిన్నదడి కట్టి ఉంది. “అదేంటే స్నానాలదడా” అని అడిగాను. “కాదు అది బామ్మ వేసుకున్న మొక్కలకు చుట్టూ దడికట్టింది. అటువైపుగా మా ఎవర్నీ పోనీయదు. ఆఖరుకి నాన్నను కూడా” అంది.
“ఓసారెల్లి చూద్దామే అందులో ఏం మొక్కలున్నాయో” అని దాని చెయ్యపుచ్చుకుని లోపలకు వెళితే దడినిండా బంతిమొక్కలున్నాయి.
వాళ్ళమ్మగారు పిలిచే సరికి బయటకొచ్చేసాం. చాన్నాళ్ళకు తెలిసిందేంటంటే కార్తీకమాసంలో త్రిమూర్తుల వ్రతానికి అందరికీ గంజాయి అమ్మేది బామ్మ, ఎవరికీ అనుమానం రాకుండా బంతి మొక్కల్లో గంజయి పెంచేదని. *

Monday 27 October 2014

నాకథ లచ్చి కినిగే పత్రికలో ప్రచురితమైంది.

నాకథ లచ్చి కినిగే పత్రికలో ప్రచురితమైంది.
http://patrika.kinige.com/?p=3992

Add caption



తనలో వయసుతో వస్తున్న మార్పులు నాకు తెలియవు. నాకు వయసొచ్చే నాటికి తను నా దగ్గరలేదు. బహుశా నాకు లచ్చి అందరికన్నా ప్రత్యేకంగా కనిపించడానికి ఆ వయసే కారణమేమో.
చిన్నతనంలో ఎప్పుడూ నీడలా వెంటాడేవి తనని నా చూపులు. తను ఎక్కడికివెళ్ళినా వెంట వెళ్ళేదాన్ని. లచ్చికి నేరేడు పళ్ళంటే భలే ఇష్టం. నాలాంటి పిలకాయలందరినీ వెంటేసుకుని నేరేడు చెట్లదగ్గరకు తీసుకుపోయేది.
పండిన పళ్లు మామూలుగా చెట్లకింద రాలేవి. కాని ఆ నేల పశువులు తిరిగేది కావడం వల్ల అవి బాగుండేవి కావు, పైగా అంతెత్తు నుండి పడి చితికిపోయేవి. అందుకోసం మాలో ఒకరిని వంతుల వారిగా చెట్టు ఎక్కించేది. ఎవరూ లేని రోజు తనే ఎక్కేసేది. అందిన మట్టుకు, పండిన మట్టుకు చెట్టు దగ్గరే తినేసి ఇంటికి చక్కా వచ్చే వాళ్ళం.
అందరం బలే అల్లరి చేసేవాళ్ళం. మాకు నచ్చిన కాయా పువ్వూ ఏ దొడ్డో వున్నా దొబ్బుకొచ్చేయాల్సిందే అన్నట్టుండేది మాయవ్వారం. ఇళ్ళల్లో మా ఈపులు సాపైపోయినా మా అల్లరి అగేది కాదు. చిన్నపిల్లలం మాకు తగిలినట్టుగానే లచ్చికి కూడా ఇంట్లో ఆళ్ళమ్మ తెగ తన్నేది. అన్ని తన్నులు తిన్నా మా తీరు ఏం మారేది కాదు. అంతేకాదు మా ఏషాలకు బాగా ఇసుగొచ్చి దుర్గమ్మ అని మా పొరుగింటి గయ్యాళి మేమంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా మాకు పరమ శత్రువైపోయింది. ఎప్పుడెప్పుడు మమ్మల్ని పట్టుకుందారా అని దాని ఎత్తు. మేం చిక్కితే కదా…
ఓరోజు మా గుంపులో మహా పిరికిదైన సరోజను పక్కింటి దుర్గమ్మ దొడ్డో ఎర్రగులాబి ఎత్తుకు రమ్మన్నాం. అది గజగజా వణికిపోయింది “నాకు భయంగా ఉందే లచ్చి ఆ దుర్గమ్మసలే రాకాసి. మాయమ్మకి నేను బడిఎగ్గొట్టానని చెప్పిందనుకో, మాయమ్మ కోడి పీక కొరికినట్టు నాపీక కొరికేద్ది. మీకు దండం ఎడతాగానీ నన్నొదిలేయండే.”
“ఆ నువ్వు బడి కెళ్ళి పెద్ద గోడిమెడలు తెత్తవని పాపం నీ మీద పాణాలెట్టుకుంది మీయమ్మ. మాఎంట తిప్పుకుని అమ్మాయిగారిని బలవంతంగా పాడుచేసేత్తన్నాం మరి.”
“మరాదగా చెప్పిన పని చేత్తే సరి నెదంటే నువ్విచ్చిన పార్టీ ఇషయం మీయమ్మతో చెప్పేత్త” అంది చిట్టి.
“నువ్వు ఒట్టి పిరికిగొడ్డువని ఒప్పేసుకో” అన్నాన్నేను.
“నీతో కాదుగానీ ఆ చిట్టినంపుతాలే, అదయితే కళ్ళు మూసి తెరిచే లోగా నా ముందుంటాది” అంది లచ్చి.
మొత్తానికి చచ్చినట్టు ఒప్పుకుంది సరోజ. అదొప్పుకోడానికి చిన్న కిటుకుందిలెండి. చాలా రోజుల క్రితం ఆళ్ళమ్మ పోపులడబ్బాలో దాచిన పదిరూపాయలు నెమ్మదిగా ఎత్తుకొచ్చేసింది సరోజ. ఆ డబ్బుతో జీళ్ళ అప్పన్నదగ్గర తినగలిగినన్ని జీళ్ళు తినేసి మిగిన డబ్బుతో మా అందరికీ పార్టీ ఇచ్చింది. తినడం అయిపోయాకా గానీ గుర్తురాలేదు దానికి ఆళ్ళమ్మ ఒళ్ళూనం చేసేద్దని. ఇక ఒకటే ఏడుపులంకించుకుంది. మీయమ్మొచ్చి అడిగినా నీ ఇషయం చెప్పం అని ఏదో నచ్చజెప్పి ఇంటికి పంపేశాం. అదీ కారణం, ఆ విషయం ఎక్కడ బైటికొచ్చేద్దోనని దాని భయ్యం. ఇంకోటేంటంటే ఆళ్ళమ్మ ఈరమ్మ అంత తేలిగ్గా మరిచిపోయే రకంకాదు. కితం సంవత్సరం నాగులచవితి నాడు దొగతనంగా తిన్న కొబ్బరుండ కోసం ఆరునెల్ల తర్వాత కొట్టింది సరోజను. మాచెడ్డ మనిషిలెండి. పతి ఇషయానికీ ఊరంత నోరెసుకుని ఎదుటోళ్ల మీద పడిపోద్ది.
ఆళ్ళమ్మను తలుచుకుని నిప్పంటుకున్న తారాజువ్వలాగా సర్రున దుర్గమ్మ పెరడు వైపు పరుగెత్తి పోయింది సరోజ. చేయెత్తు గోడ చిన్న మెట్టెక్కి అందుకుని ఎలాగో పువ్వు కోయబోయింది సరోజ. ఈలోపల గోడెనక గేదెకు గడ్డేస్తున్న దుర్గమ్మ పెద్దకర్రట్టుకుని సరోజెనక పడింది. దుర్గమ్మ గోడెనకే కాపుకాచిన మేమూ పరుగందుకున్నాం. ఇలాంటి దొంగపనుల్లో సులువు తెలిసిన మేము అందలేదుగానీ పాపం బక్కది సరోజ చిక్కేసింది.
పారిపోయి ఇంటికి చేరుకున్న మాకు సరోజ చిక్కిన విషయం చాలా సేపటికి గానీ తెలియలేదు. ఆళ్ళమ్మకి తెలిత్తే సరోజీపు చాకిరేవు బండయిపోద్ది, ఏలాగైనా ఇడిపించాలని మళ్ళీ దుర్గమ్మింటికి బయలుదేరాం. అప్పటికే సరోజని పెరట్లో చెట్టుకట్టేయడం అది ఊరంతా ఏకమైనట్టు సోకాలెట్టేయడం ఐపోతున్నాయి.
మా లచ్చి ఏదో ప్లాను అప్పటకే రడీ చేసేసింది. నేను సాయంకాలం దుర్గమ్మింటికి పాలుకి ఎళతాను, అలానే వెళ్ళమంది. నాకు పాలు పోయడానికి ఆవిడ లోనికెళ్ళినపుడు సరోజను ఇడిపించేయాలి అదీ ప్లాను.
లచ్చి చెప్పినట్టే చెంబట్టుకెళ్ళాను. ఈలోపు ఆవిడలోనికెళ్ళగానే లచ్చి, చిట్టి కలిసి సరోజను ఇడిపించేసారు. దుర్గమ్మొచ్చేసరికి అంతా అక్కడి నుండి పారిపోయాం. మా వెనక దుర్గమ్మ అరుపులు ఇనిపిత్తానే ఉన్నాయి.
“ఆగండే పిల్లముండల్లారా ఈ కోలనీకే మాయదారి సంతైపోయారు గదే, ఓ పూవుండనీరు, కాయుండనీరు మాయదారి సంతాని…” అందరం నవ్వుకుంటూ ఇంటికొచ్చేసాం. గులాప్పువ్వులే కాదు జామకాయలూ ఉండనిచ్చేవాళ్ళం కాదు. దుర్గమ్మకు మాంచి జాంచెట్టు కూడా ఉంది. ఆ పళ్లు భలే రుచిగా ఉంటాయి.
దసరా రాత్రుల్లో అమ్మోరి గుడి దగ్గర తెర మీద వేసే సినిమాలకోసం పందేలు వేసుకుని మరీ పరిగెట్టిపోయేవాళ్ళం. మాకన్నా ముందుగా గోనిపట్టా పరుచుకున్న పక్కీది పిల్లలతో తగువులాడి కూచోపెట్టేది లచ్చి. సగం సినిమా నడుస్తుండగానే నిద్రకు ఆగలేక ఊగిపోతున్న మమ్మల్ని చెరోచేత్తోనూ పట్టుకుని ఇంటికి తీసుకువచ్చేది లచ్చి.
మా ఊళ్ళో మాబాగా జరుగుతాయి అమ్మోరి జాతర, తిరనాళ్ళు. చూడ్డానికి రెండు కళ్లు చాలవు. రంగురంగు బుడగలు, రబ్బరు బొమ్మలు, కొయ్య గుర్రాలున్న రంగుల రాట్రాలు, చల్లయిసు, చెరుకురసం ఇంకా చాలా బాగుంటాది. లచ్చేకాదు పిలకాయమంతా వారం అంతా కూడబలుక్కుని ఓణీలేసుకుని తయారైపోయాం. లచ్చికన్నా చిన్నోళ్ళమైన మాకు లచ్చికి నప్పినంతగా నప్పలేదు ఓణీ. నాకు, సరోజకు పరవాలేదన్నట్టున్నా, మాకన్నా చిన్నదైన చిట్టికి దారిలోనే జారిపోయింది. “నీకెందుకే బక్కదానా ఓణీ అని ఎంత నచ్చజొప్పినా” ఒప్పుకుంటేగా ఆ బక్కది తెగ యాగీ చేసేసింది దారంటా.
తిరనాళ్ళంతా తిరిగి రకరకాలు బొమ్మలు కొనుకున్నాం. చిట్టి డప్పువాయించే కోతి కొనుక్కుంది. దాన్ని చూసి లచ్చి తెగ ఏడిపించింది చిట్టిని. అది బుంగమూతి పెట్టింది. లచ్చి రంగురంగు జడ రిబ్బన్నులు కొనుక్కుంది. నేను రంగు తిలకం బుడ్డి కొనుక్కున్నాను. ఇక పిసినారి సరోజేమో నాకెం నచ్చలేదబ్బా అన్నీ నాసిరకాలు ఒద్దులే అంటా మూతి తిప్పుకున్నాది.
Lachchiఅందరం రంగుల రాట్రం ఎక్కాము. లచ్చికి బాగా అలవాటు లాగుంది. నాకు ఎక్కగానే కళ్ళు తిరిగి వాంతులైపోయాయి. పాపం లచ్చినాకు కలరు షోడా పట్టించి ఇంటికి తీసుకొచ్చింది. లచ్చితో తొక్కుడు బిళ్ళ ఆడ్డం చాలా కష్టం ఎంతో హుషారుగా ఆడేది. అలానే అష్టాచెమ్మా కూడా ఎప్పుడూ తనచేతిలో ఓడిపోయేదాన్ని. నన్ను ఓడించినప్పుడల్లా నాకు బాధకన్నా తన ముఖంలోకి ఆనందం వెలుగు బలే తమాషాగా అనిపించేది. నిజానికి తనకు నాకు పదేళ్ళు తేడా.
ఎక్కడా ఆడపిల్ల కుండాల్సిన సుకుమారంలేదు లచ్చిలో. ఎక్కడో చిన్న తేడా, కాస్త మెరటుతనం, మగరాయుడితనం ఉన్నాయి తనలో. మాకన్నా వయసులో పెద్దదైనా ఎక్కడా పెద్దరికం కనబడనీయక మాతో సమానంగా ఆడేది. పరికిణీ నుండి ఓణీకి మారినా తనకు పెళ్ళి చేయాలని పెద్దాళ్ళు కంగారు పడేవారుగానీ దానికి ఆ వూసే లేదు. ఎప్పుడూ ఆటలే.
గుంపంతా ఆదివారం మెట్లకింద చేరిపోయి తాటాకు, కొబ్బరాకులతో బొమ్మ పెళ్ళికి ఏర్పాట్లు చేసేవారం. చిన్న చీరముక్కలతో బట్టలు చుట్టి, బొట్టూకాటుకా పెట్టి, చిన్న పూసలతో దండలు చేసి వేసేవాళ్ళాం. సినిమాపాటలతో మంత్రాలు చదివి, తలంబ్రాలు పోసేవాళ్ళాం. అందరికీ పప్పూబెల్లాలు పంచేవాళ్ళాం. ఆటలమీద చూపించిన ఇష్టం లచ్చి బొమ్మ పెళ్ళిలో చూపేది కాదు. అసలు రానని తెగ యాగీ చేసేది. బొమ్మ పెళ్ళేకాదు. తన ఈడువారికి పెళ్ళవుతుందని తెలిస్తే ఆనందంకన్నా తన మనసులో విచారమే ఎక్కువ కనిపించేది నాకు.
అందరినీ వదిలివెళిపోవాలనే దానికంటే మించిన దిగులు పడేది లచ్చి. ఏం కారణమో పైకి చెప్పేది కాదు. అంత సరదా అయిన మనిషి ఒక్కసారిగా మూగనోము పట్టిన దానిలా అయిపోతే మాకేం బాగుండేదికాదు. ఏం అడిగినా చెప్పేదికాదు. చాలా బతిమాలి చక్కిలిగిలి పెడితేనేగానీ మాతో ఆటకొచ్చేదికాదు.
కాలం అంతా ఒకేలా సాగిపోదుగా. లచ్చికి పెళ్ళి సంబంధం కుదిరిపోయింది. అది తెలిసిన దగ్గరనుండీ తను మాకు దూరమైపోతుందన్న దిగులు ఎక్కువైపోయింది నాకు. అందరికీ పెళ్ళికి కొత్తబట్టలు కొంటారు. ఇంచక్కా స్వీట్లు తినచ్చునని సరోజా, చిట్టీ తెగ సంబర పడిపోయారు.
ఇక ఆరోజు నుండీ లచ్చి మాతో ఆటలకు రావడం మానేసింది. చెట్టెక్కడానికి పరికిణీ కచ్చాపోసే లచ్చి చేత చక్కగా చీర కట్టించింది వాళ్ళమ్మ. మాతో ఆటలకు రాటంలేదని బాధకన్నా పెళ్ళి చేసుకు వెళిపోతున్నందుకు దిగులు పెట్టేసుకుంది లచ్చి.
చాలా తొందరగానే ముహుర్తం కుదిరిపోయింది. పెళ్ళికన్ని ఏర్పాట్లు చేసేసారు. రెండురోజుల ముందు లచ్చిని పెళ్ళికూతుర్ని చేసారు. ఇప్పుడు మరింత అందంగా ఉంది లచ్చి. పాములాంటి కళ్ళు, తెల్లని మేనిఛాయ, ఎర్రని సిల్కులాంటి జుట్టు, వంటినిండా లేత గోధుమ రంగు నూగుతో సీమ దొరసానిలా ఉంది. మొదటిసారిగా చాలా బాగుంది లచ్చి అందంగానే కాదు దానికన్నా చెప్పలేనితనంతో.
* * *
నాకు తెలుసు లచ్చి ఇక ఎప్పుడూ మాతో ఆడదని ముందులా పూలు, కాయలు దొంగతనంగా కోయదని. నేరేడు పళ్ళు అందరిలా కొనుక్కొని తింటుంది కానీ మాతో కలిసి చెట్టెక్కి కోసుకు తినదని.
తెల్లారితే ఆదివారం అనగా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళికొడుకుని దుర్గమ్మ నిద్రముఖాలతో కుర్చీల్లో వాలిపోతున్న మాదగ్గరకు తీసుకొచ్చి “వీళ్ళేనయ్య నీ పెళ్ళం అల్లరి గుంపు. ఈళ్లంతా కలిసి చుట్టుపక్కల ఏ దొడ్డోనూ పూలుగానీ కాయలు కానీ ఉండనిచ్చేవారు గాదు. గుంపు నాయకురాలు ఎళిపోతుందిగా, ఇక ఈళ్ళ తోకలు నేను కత్తిరించేస్తాను” అంది మమ్మల్ని చూపించి.
అందరిముందూ ఎంతో అవమానం జరిగిపోయిందని గంటు ముఖాలెట్టుకున్నాం. ఈలోపులో లచ్చి రానేవచ్చింది. అప్పటి వరకు ఆడుకోవడం ఒక్కటే తెలిసిన లచ్చి నోటివెంట మొదటిసారి తన మొగుడితో కమ్మగా మాట్లాడటం విన్న నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అసలు ఇంత సిగ్గుపడుతున్న పిల్ల మా లచ్చేనా అనిపించింది.
బుధవారానికి లచ్చి అత్తారింటికెళిపోయింది. రోడ్డు మలుపు తిరిగే వరకూ చేయూపుతూనే ఉంది. చిట్టి, నేను, సరోజా ముగ్గురం ఒకరినొకరం గట్టిగా పట్టుకు ఏడిచేసాం. మా పెద్దోళ్ళంతా కాస్త బాధపడినా మమ్మల్ని ఊరడించడానికి “మళ్లీ ఓ నెల్లో వచ్చేద్ది బావ దగ్గర ఆషాడంలో ఉండకూడదుకదా” అన్నారు. ఆరోజుకోసం ఎదురుచూస్తూ తప్పదన్నట్టు బడికెళుతున్నాం.
నెల రోజులకు లచ్చి వచ్చింది. తనని చూడాలని వెళ్ళిన మా ఎవరితోనూ మాట్లాడలేదు. మేం ఎంత పలకరించినా పలకలేదు. చాలా దిగులేసింది. పెళ్ళికాగానే లచ్చిలో అనుకోని ఈ మార్పుతో చాలా ఏడుపొచ్చేసింది.
సరోజ లచ్చి దగ్గర గట్టిగానే అనేసింది. “ఆ పెళ్ళవగానే నువ్వు ఇలా మారిపోతావని మునిపటిలా మాట్లాడవని, అసలు గుర్తే పట్టవని మాయమ్మ ముందే చెప్పింది. పదే చిట్టీ పోదాం,” అంటూ మూతి మూడొంకర్లు తిప్పుకుని చిట్టీ, సరోజా అక్కడి నుండి వెళిపోయారు. నేను ఎంత మాట్లాడించినా బతిమాలినా ఏం చెప్పలేదు. చక్కిలిగిలి పెట్టినా నవ్వలేదు.
అప్పుడనిపించింది నాకు పెళ్లికాగానే అందరినీ మరిచిపోతారా, ఆఖరుకి చక్కిలిగిలి కూడా పోతుందా అని. చేసేదేంలేక ఇక అక్కడినుండి ఇంటికొచ్చేసాను. ఆరోజు నుండీ సరోజా చిట్టీ లచ్చి ఊసే ఎత్తడం మానేసారు.

*


Monday 1 September 2014


 జమీల్యా ప్రేమ కథపై సమీక్ష కినిగె పత్రికలో





గుమస్తా మరణం

నేను చేసిన మొదటి అనువాదం కినిగె పత్రికలో



(ఆంటన్ చెఖోవ్ “డెత్ ఆఫ్ ఎ క్లర్క్” కు శ్రీశాంతి దుగ్గిరాల అనువాదం)
ఒక మంచి సాయంత్రవేళ, అంతకన్నా మంచివాడైన ఆఫీసు గుమస్తా ఇవాన్ దిమిత్రిచ్ చెర్వియాకో నాటకశాల రెండవ వరసలో కూర్చుని ఒపెరాకళ్ళద్దాలలోంచి ప్రదర్శనలో లీనమైపోయి చూస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి… ఈ “కానీ ఉన్నట్టుండి” అనే మాట కథల్లో తరచుగా వస్తుంది. రచయితలు చెప్పేది ముమ్మాటికి నిజం. మనిషి జీవితంలో ఉన్నట్టుండి జరిగే సంఘటనలు ఎక్కువే. కానీ ఉన్నట్టుండి అతని ముఖం ముడుచుకుంది, అతని కళ్ళు చక్రాల్లా గుండ్రంగా తిరిగాయి, అతని ఊపిరి నిలిచిపోయింది. చేతిలోని కళ్ళద్దాలను కిందకు దించి ముందుకు వంగుతూ “హాచ్…!” అంటూ తుమ్మాడు చర్వియాకో. తుమ్మటం అనేది ఏం నిషిద్ధం కాదు. ఎవరైనా ఎక్కడైనా తుమ్మచ్చు. రైతులు తుమ్ముతారు. కొన్నిసార్లు పోలీసు అధికారులూ తుమ్ముతారు, అంతెందుకు కౌన్సిలర్లు కూడా తుమ్ముతారు. మనుషులందరూ తుమ్ముతారు. చర్వియాకో ఈ పరిణామానికి ఏమీ ఇబ్బంది పడలేదు. చేతిరుమాలుతో తన ముక్కును మర్యాదపూర్వకంగా తుడుచుకున్నాడు. తర్వాత చుట్టూ చూసి తాను తుమ్మడం వల్ల ఎవరికైనా నష్టం కలిగిందేమోనని చూశాడు. కానీ ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. స్టాల్స్ లో తాను కూర్చుని ఉన్న వరుసకు ముందు వరసలో ఓ ముసలి వ్యక్తి జాగ్రత్తగా తన బట్టతలను, మెడను చేతి తొడుగులతో తుడుచుకుంటూ ఏదో చిన్నగా గొణిగాడు.
చెర్వియాకో ఆయన్ని రవాణాశాఖలో ఉన్నతోద్యోగి జనరల్ బ్రిజలోవ్‌గా గుర్తించాడు.
“నా నోటి తుంపర్లు ఆయనపై పడ్డట్టున్నాయి. ఆయన నాపై అధికారి కాకపోయినా, ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. వెంటనే క్షమాపణ కోరాలి” అనుకున్నాడు చెర్వియాకో.
అతడు చిన్నగా దగ్గుతూ ముందుకు వంగి జనరల్ చవిలో రహస్యంగా, “క్షమించాలి, నేను పొరబాట్న మీమీద తుమ్మాను…”
“పరవాలేదు, పరవాలేదు…”
“నేను… నేను కావాలని చేసిన పనికాదు. ఏదో పొరబాట్న…”.
“సర్సరే! మీరు దయుంచి కూర్చోండి నన్ను ప్రదర్శన చూడనీయండి”.
చెర్వియాకోకి ఏం చేయాలో తెలియలేదు. వెర్రి నవ్వు నవ్వాడు. మరలా స్టేజీ వైపు దృష్టి సారించాడు. ప్రదర్శనను చూస్తున్నాడు కానీ, మునుపటిలా ఆనందించలేకపోయాడు. ప్రదర్శనకు విరామం ఇవ్వగానే చెర్వియాకో జనరల్ వైపు వెళ్ళి, కాసేపు చుట్టూ తిరిగి, చివరకు తన జంకును అణుచుకుని, దగ్గరగా వెళ్ళి ఇలా గొణిగాడు:
“నేను మీమీద తుమ్మాను. క్షమించండి సార్… నేను అలా చేసి ఉండకూడదు”.
“అయ్యో, ఇక ఆ విషయం వదిలేయండి… నేను ఎప్పుడో మరిచిపోయాను. మీరు మాత్రం ఇంకా అదేపట్టుక్కూచున్నారు,” అన్నాడు జనరల్, తన కింద పెదవిని కొరుకుతూ.
“ఆ విషయాన్ని మరిచిపోయానంటున్నాడు గానీ అతని కళ్ళు మాత్రం ద్వేషంతో మండుతున్నాయి” అనుకున్నాడు చెర్వియాకో. “కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. నేను ఆయనకి సంజాయిషీ చెప్పి తీరాలి. ఇక్కడ జరిగింది ఒక ప్రకృతిసహజమైన కార్యమని వివరించాలి. లేదంటే ఆయనపై ఉమ్మానని అనుకుంటాడు. ఇప్పుడలా అనుకోకపోయినా, మున్ముందు అనుకోవచ్చు”.
తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు చెర్వియాకో. తన మర్యాదహీనమైన ప్రవర్తన గురించి భార్యకు చెప్పుకున్నాడు. ఆమె అతని మాటల్ని మొదట తేలిగ్గా తీసుకుంది. బ్రిజలోవ్ గురించి తెలుసుకున్న మీదట కాస్త కంగారు పడింది. కానీ బ్రిజలోవ్ పని చేసేది వేరే విభాగంలో అని తెలుసుకుని కాస్త కుదుట పడింది.
“ఏది ఏమైనా నీవల్ల పొరపాటు జరిగింది కనుక ఆయనకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆయన నీకు ఇతరుల ముందు ఎలా ప్రవర్తించాలో బొత్తిగా తెలియదనుకుంటాడు,” అంది.
“అదేకదా! నేను ఆయనకి క్షమాపణ చెప్పాను. కానీ ఆయన ప్రవర్తన చిత్రంగా ఉంది. ఒక్కముక్క సరిగా మాట్లాడలేదు. పైగా అక్కడ మాట్లాడటానికి అంత సమయం కూడా లేదనుకో,” అన్నాడు చెర్వియాకో భార్యతో.
ఆమర్నాడు శుభ్రంగా క్షవరం చేయించుకుని, కొత్త యూనీఫాం వేసుకుని తయారై, బ్రిజలోవ్ కు క్షమాపణ చెప్పటానికి బయలుదేరాడు చెర్వియాకో. జనరల్ ఆఫీసులో అతిథుల గదిలోకి ప్రవేశించగానే అక్కడ చాలామంది అర్జీదారులు కనిపించారు. వారి అర్జీలు అందుకుంటూ జనరల్ కూడా అక్కడే ఉన్నాడు. వరుసగా అందరి అర్జీలూ అందుకుంటూ చెర్వియాకోవ్ వంతు వచ్చేసరికి కళ్ళెత్తి చూశాడు జనరల్.
“నిన్న… ప్రదర్శనశాలలో మీకు గుర్తుండేవుంటుంది… సార్ నేను హఠాత్తుగా తుమ్మాను సార్, పొరబాట్న మీమీద ఆ తుంపర్లు పడ్డాయి సార్” చెప్పడం మొదలు పెట్టాడు గుమస్తా…
“ఏమిటీ గోల… ఇక చాలు! నేను మీకేం చేయగలను” అంటూ ఆయన తర్వాతి అర్జీదారు వైపు చూశాడు.
“ఆయనకు నాతో మాట్లాడటం ఇష్టం లేనట్టుంది,” అనుకున్నాడు పాలిపోయిన ముఖంతో. “దీని అర్థం అతడు కోపంగా ఉన్నాడు. నేను ఇలా ఊరుకోకూడదు. ఎలాగైనా వివరించాలి.”
జనరల్ తన ఆఖరు అర్జీదారు నుండి అర్జీ తీసుకుని లోపలి గదిలోనికి ప్రవేశిస్తుండగా చెర్వియాకో జనరల్ వెంటనడుస్తూ చిన్నగా గొణిగాడు:
“సార్ మిమ్మల్ని ఇలా ఇబ్బందిపెడుతున్నానంటే దానికి కారణం నాలోని పశ్చాత్తాపం అని అర్థం చేసుకోండి… నేను అలా కావాలని చేయలేదు, మీరు నమ్మాలి!”
జనరల్ ఓ విషాదపూరితమైన ముఖం పెట్టి చేయి విదిలించాడు. “వేళాకోళంగా ఉందా” అంటూ తలుపు భళ్ళున ముఖం మీద వేసుకున్నాడు జనరల్.
“ఏంటి వేళాకోళమా! ఇందులో వేళాకోళం ఏముంది!” అనుకున్నాడు చెర్వియాకోవ్, “ఈయన అవటానికి మళ్ళా జనరల్! కానీ ఇంత చిన్న విషయం అర్థంచేసుకోలేకపోతున్నాడు. ఇలాగే ఐతే ఇంక ఈ గీరమనిషిని క్షమాపణ అడగను గాక అడగను. ఏదైతే అదవనీ. ఇక ఉత్తరం ద్వారానే నా క్షమాపణలు కోరాలిగానీ నేనుగా రానే కూడదు ఇక్కడికి!”
అనుకుంటూ చెర్వియాకోవ్ ఇంటికి నడిచాడు. కానీ ఉత్తరం రాయలేదు. ఎంతగా ఆలోచించినా ఆ ఉత్తరం ఎలా రాయాలో తెలియలేదు. మరుసటి రోజు మరలా స్వయంగా తనే వెళ్లాల్సివచ్చింది.
జనరల్ ఎందుకొచ్చావన్నట్టుగా చెర్వియాకో ముఖంలోకి చూడగానే, “మీరన్నట్టు నిన్న నేను ఇక్కడికి వచ్చింది మీతో వేళాకోళం ఆడటానికి కాదు సార్. ఆరోజు నేను తుమ్మినపుడు ఆ తుంపరలు మీమీద పడటం వల్ల క్షమాపణ అడుగుదామని వచ్చాను. మీతో కలలోనైనా వేళాకోళమాడగలనా? అలా వేళాకోళమాడుతూపోతే ఇక మర్యాదస్తులకు మిగిలే మర్యాద ఏముంటుంది సార్…”
“బయటకు పో!” గట్టిగా అరిచాడు జనరల్, కోపంతో కమిలిపోయిన ముఖంతో ఊగిపోతూ,
గట్టిగా కాలిని నేలకు తాకిస్తూ.
ఆ మాటలకు చెర్వియాకోకి కడుపులో ఏదో నరం తెగినట్టయింది, ఏం కనపడక ఏవీ వినపడక అలాగే నెమ్మదిగా ద్వారం వద్దకు నడిచాడు. కాళ్ళీడ్చుకుంటూ యాంత్రికంగా ఇంటికి చేరుకుని, ఎవరితోనూ మాటయినా మాట్లాడక, యూనిఫాం కూడా తీయకుండా, అలాగే సోఫాలో కూలబడి ప్రాణాలు విడిచాడు గుమస్తా.

 *


Friday 1 August 2014

* నీ వెనక మాటలు *


 

చిరునవ్వులు ఒలకబోయకు చిత్రాలు జరుగుతాయని గుబులు నాకు

ప్రాణంలో ప్రాణమవకు ఎప్పుడో జారిపోతావని భయం నాకు

నీరుగారిన ఉత్సాహానికి ఊపిరి నీవౌతుంటే

లోపలెక్కడో దిగులు అందకుండా ఆవిరైపోతావని

ప్రేమ నిండిన నీ నిజాయితీ చూపులతో నువ్వు పలికే ప్రతి మాటా

తూర్పుకాంతిలో వెలిగే పచ్చిక మీది బొట్టులా అనిపిస్తుంది నాకు.

చిప్పిల్లే ప్రతి చుక్కకీ తెలుసు మనం జంటని, మనది నూరేళ్ళ పంటని.

ఏలెక్కలూలేని ఉదయం మనది గడియారంతో పనిలేని పయనం మనది.

Monday 21 July 2014

నా మూడో కథ "వేపచెట్టు" కినిగె పత్రికలో





ఆ ఇంట్లోకి మేం అద్దెకొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. ఏడాదిలో ఓసారి ఆకస్మిక తనిఖీ చేసి వెళుతుంది మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మిగారు. ఆ ఏట ఇంటి మరమ్మత్తులేమన్నా ఉంటే చేయించేసి వెళుతుంది. మనిషి చాలా మంచిది, జాలీ, ప్రేమా ఎక్కువే. కాస్త అమాయకురాలు కూడాను. ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది.
నెలనెలా అద్దె మాత్రం రమణమూర్తి అని ఆదిలక్ష్మిగారి దూరపు బంధువు వసూలు చేస్తాడు. ఈ మనిషి పైకి కనిపించినంత మంచోడేంకాదు. ఆదిలక్ష్మిగారికి ఈ ఊళ్ళో ఆస్తులు చాలానే ఉన్నాయి. ఆమెకి అద్దె ఓ లెక్కకాదు. రమణమూర్తి అది అలుసుగా తీసుకుని సంవత్సరం వసూలు చేసిన అద్దెనంతా తన దగ్గరే ఉంచుకుని వడ్డీకి తిప్పుతాడు. ఆవిడొచ్చే సమయానికి జమవేస్తూ ఉంటాడు.
పైకి మా అందరితో “ఈ చాకిరీ ఎవరు చేస్తారు. నాకా వయసైపోతుంది. ఆదిలక్ష్మిగారు రాగానే అన్నీ అప్పగించేస్తాను” అంటూ తెగ రాగాలు తీస్తాడు. ఈ పదేళ్ళమట్టీ మాకా మాటలు వినీ వినీ అలవాటైపోయాయి.
మేమాఇంట్లో దిగేటప్పటికి ఓ మొక్క కూడా ఉండేది కాదు. నాకు మొక్కల్లేకపోతే ఊపిరాడనట్టు ఉంటుంది కాబట్టి వచ్చిన ఏడాదిలోనే గేటువారగా ఇరుపక్కలా ఓ పసుపుపువ్వుల చెట్టు, పారిజాతం, ఆపైన నూతివారగా అరటి చెట్లు, బోన్సాయి మర్రి చెట్టు, గోరింట చెట్టు పెంచాను. ఇంకా ఇంటి చుట్టూ కుండీల్లో రకరకాల గులాబీలు ఒకదాంతో ఒకటి పోటీపడుతూ ఉంటాయి. “ఇవిచాలవన్నట్టు వీధిలోకొచ్చే ప్రతి మొక్కలాడి సైకిలూ ఎందుకాపిస్తావే” అని నాన్నగారు తిట్టేవారు. రోజంతట్లోనూ నేను మనసుపెట్టి చేసే పనులలో మొక్కలకు నీళ్ళు పోయడం ఒకటి. అమ్మానాన్నలకు మొక్కలంటే ఉన్న ఇష్టం నాకూ అంటింది.
నా మొక్కలపెపకం రమణమూర్తికి సుతరామూ ఇష్టంలేదు. ఆదిలక్ష్మిగారు కూడా మొక్కలంటే ఇష్టపడతారు. నా ఇష్టాన్ని చూసి రెండు మల్లె మొక్కలు ఇచ్చారావిడ. కనుక రమణమూర్తి మారు మాట్లాడలేక మిన్నకుండిపోయాడు.
కొన్నాళ్ళకు ఉదయం నీరెండ పడేచోట లోపల ప్రహారీకానుకుని మొలిచిందో వేపచెట్టు. ఎవరో శ్రద్దగా తెచ్చినాటిన మొక్కకాదది. బాగా పండిన వేపపళ్ళను తిన్న కాకి వేసిన విత్తు అది.
ఉదయం లేవగానే చిన్నగాలికే ఊగిపోతూ పలకరించేది నన్ను. దాని సమక్షంలో గడపడం అలవాటైపోయింది నాకు. నా ఆనందం, విచారం అన్నీ దానితో చెప్పుకునేదాన్ని. దాని ప్రతి కదలికలోనూ నీకు నేను ఉన్నాను అన్న ఆప్యాయత కనిపించేది నాకు. వీధి పక్క గుమ్మానికి ఎదురుగా నిలబడి కొమ్మలన్నీ ఊపుతూ చూసేది నన్ను. తొలి కిరణాలు పడే వేళ పలకరింపులైపోయినా సాయంత్రం మళ్ళీ దాని సమక్షంలోనే గడపాలనిపించేది. గులాబీలతో చెప్పిన ఊసులకన్నా, వేపచెట్టుతో పంచుకున్న రహస్యాలే ఎక్కువ నాకు. మిగతా మొక్కలన్నా అభిమానమే గానీ ఎందుకో ఈ వేపచెట్టంటే చెప్పలేని ఇష్టం ఏర్పడిపోయింది.
రెండేళ్లకి అది పెద్ద మానయిపోయింది. ఈ సంవత్సరం ఉగాదికి కాపు పడుతుందన్నారు చుట్టు ప్రక్కలవాళ్ళు. అందరి కళ్ళూ నా వేపచెట్టు మీదనే.
నేను కనిపించినప్పుడల్లా…. పక్కింటి పార్వతమ్మయితే “హూ ఈ సంవత్సరం వేప్పువ్వుకు ఎక్కడికీ వెళ్ళక్కరలేదులే పక్కింట్లోనే ఉందిగా” అంటూ సాగదీసేది.
ఇక మా అమ్మయితే వేపచెట్టు ఉపయోగాల గురించి పెద్ద పాఠమే చెప్పేది వేపచెట్టు గాలి ఎంతో మంచిది. వేపచెట్టులో మనిషికి ఉపయోగపడనిదంటూ ఏదీలేదు. ఇరుగుపొరుగోళ్ళు దాని గురించి ఏం మాట్లాడినా ఏదో చెప్పలేని గర్వంగా అనిపించేది నాకు.
వాళ్ళంతా అనడం కాదుగానీ వేపచెట్టు నిండుగా కొమ్మ కొమ్మకూ విడవకుండా పూతపూసింది. రాత్రిపూట నక్షత్రాల్లా మెరుస్తున్నాయి ఆ పూలు. కమ్మని వేప్పువ్వు వాసన గుండెనిండా పీలుస్తూ లోలోపలే ఆనందపడిపోతున్నాను. చూస్తేనే దిష్టి తగిలేట్టుగా, రెండుకళ్ళూ సరిపోనంత బాగుంది నా వేపచెట్టు.
ఈ సంవత్సరం ఆదిలక్ష్మిగారు ఓ రెండు నెల్లు ముందుగానే వస్తానని కబురంపారు. నాకూ ఆవిడకు వేపచెట్టు చూపించాలని తెగ తొందరగా ఉంది. ఆదివారం నాడు రమణమూర్తి వచ్చాడు. ఆదిలక్ష్మిగారు రేపు ఉదయానికి వస్తున్నారు పైన గది సిద్ధం చేయాలనిచెప్పి, ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండానే వెళిపోయాడు.
మరునాడు ఉదయం పదిగంటలు కావస్తుండగా వచ్చారు ఆదిలక్ష్మిగారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ ముఖం ఈరోజెందుకో కాస్త చిరాకుగా ఉన్నదనిపించింది. రావడమే ఇంటి చుట్టూ తిరిగి మొక్కలన్నీ చూడడానికి బైలుదేరింది. నేను వెంటనడిచాను.
అన్నీ చూసాకా వేపచెట్టు దగ్గర ఆగిపోయింది. నేను ఉత్సాహంగా చెప్పడం మొదలు పెట్టాను. “ఈ వీధివాళ్ళ కళ్లంతా దీని మీదనేనండి. పూత చూసారా… అసలు మొదటిసారి పూతలా పలుచగా లేదు కదూ” అంటూ తెగవాగుతున్నాను.
ఆమె నా మాటలు లెక్కచేయనేలేదు. ఎంతో కరుకుగా వచ్చాయి మాటలు. “ఏంటిది గోడవారగా వేపచెట్టు మొలిచి ఇంత పెద్దదైపోయినా నాకు చెప్పనేలేదు. గోడ పాడయిపోతుందని ఎక్కడన్నా అనిపించిందా మీకు! మీ సొంతిల్లైతే ఇలానే చేస్తారా”. ఆవిడ అనాలనుకున్నవి, రమణమూర్తి ఎక్కించినవీ కలిపి అన్ని మాటలూ అనేసింది.
ఆవిడ మాటలకు కోపం వస్తున్నా ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నా నా మాటలకు అడ్డు వచ్చి “రెండు రోజుల్లో ఈ చెట్టు కొట్టించేయండి ఆ పని నేనుండగానే జరిగిపోవాలి తెలిసిందా చెప్పు మీ నాన్నగారితో” అంటూ రుసరుసా వెళిపోయింది.
నా గుండె జారిపోయింది. కళ్లమ్మటా నీళ్ళు కారుతున్నది కూడా గమనించలేదు. ఏంటీవిడ ఇంత ఎదిగిన మొక్కను తీసేయమంటుంది, ఇంటి యజమాని కదా ఏం చేసినా చెల్లుతుందనుకుంటుందేమో.
నాన్నగారితో విషయం చెప్పాలని పరుగెత్తాను. ఆయనంతా విని “నిజమేకదే ఆవిడ ఏదో రోజు అంటారనుకుంటూనే ఉన్నాను. ఆ మొక్క పెరిగే కొద్దీ గోడ కూలిపోతుంది. ఈ పని మనం చిన్న మొక్కగా ఉన్నపుడే చేసి ఉండాల్సింది. చాలా ఆలస్యం అయిపోయింది” అన్నారు.
నాకా రోజంతా మనసు దిగాలుగా ఉంది. దొడ్లో వేపచెట్టు చూసిన ప్రతీసారి కన్నీళొస్తున్నాయి. ఈ విషయాలేవీ తెలీని ఆ పిచ్చి మొద్దు నన్ను చూసి కొమ్మలన్నీ ఊగేలా నవ్వుతుంది.
ఆ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే ఆదిలక్ష్మిగారు, రమణమూర్తీ వచ్చేసారు. వస్తూనే వాళ్ళకూడా ఇద్దరు కూలీలను తీసుకొచ్చారు.
నేను ఎంత వాదిస్తున్నా “నీకేవమ్మా ఎన్నయినా చెపుతావు ఇలాగే వదిలేస్తే గోడ బీటలు బారి, కొన్నాళ్ళకు కూలిపోతుంది” అంటూ నాకు అడ్డు తగిలాడు రమణమూర్తి.
నాన్నగారిని పట్టుకు ఏడ్చాను. ఆయన వాళ్ళకు అడ్డురాకపోగా నాకే నచ్చజెప్పారు. “చూడు మన సొంతింట్లో ఎన్ని మొక్కలేసుకున్నా పరవాలేదు. అంత స్తోమత మనకులేదని నీకూ తెలుసు ఇప్పుడు ఇంకా రభస చేస్తే మనల్నే ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటారు. అంతవరకు తీసుకురాకు, జరుగుతున్నది చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేం” అని చెప్పి పని మీద బైటకెళ్ళిపోయారు.
నేను బైటికి వెళ్ళలేక కిటికీలోంచి చూస్తూ ఉండిపోయాను. చెట్లు కొట్టే వాళ్లు వేపచెట్టు దగ్గరకు రాగానే పక్కింటి పార్వతమ్మ పెద్ద నోరుతో “ఏవండో ఆదిలక్ష్మిగారు చెట్టు ఒక్కసారిగా కొడితే మా ఇంటి ప్రహారీ మీదపడుతుంది కొంచెం చూసి కొట్టించండి” అంది.
దాంతో అంతా కలిసి ఆ జాగ్రత్త తీసుకోవడంలో పడ్డారు. ముందు వేపచెట్టు పెద్దమానుకి ఒక తాడు బిగించారు. పైనున్న కొమ్మలన్నీ నరికేసారు. తర్వాత కింద వేళ్ల దగ్గర మాను కొట్టి, ఇంక పడిపోతుందనగా కొట్టడం ఆపి, అంతా కలిసి బలంగా తాడు పట్టుకుని ఇవతలికి గుంజారు. వేపచెట్టు కాళ్లు నరికిన మనిషిలా కుప్పకూలిపోయింది. ఒక్కరోజులో నాతో ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్న నా నిలువెత్తు నేస్తం నిర్జీవమైపోయింది. ఆకాశం బోసిపోయినంత ఖాళీ మా ఇంటిని ఆవరించింది. చాన్నాళ్ల వరకూ బయట నుంచి చూసినపుడు మా ఇల్లు కళ కోల్పోయినట్టు కనిపించేది.
రమణమూర్తి పనివాళ్ళ చేత కొమ్మలూ మిగతా తుక్కూ అంతా ఏరించాడు. మాను మాత్రం “ఎందుకన్నా పనికొస్తుంద”ని చెప్పి మా ఇంటి బయటి గేటు ముందు పెట్టించాడు. అది ఎండకి ఎండుతూ వానకు నానుతూ చాన్నాళ్లు అక్కడే పడి ఉంది. వంటింట్లోంచి చూసినా కూడా పచ్చగా ఆకులు ఊపుతూ పలకరించే చెట్టు ఇప్పుడు ప్రాణం లేని వస్తువైపడి ఉంది. ఇప్పటికీ నిశ్శబ్దంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో దాని ఆకుల గలగలలు వినపడని లోటు తెలుస్తుంది. బాగా పూసిన ఏ వేపచెట్టు చూసినా నా వేపచెట్టే గుర్తొస్తుంది.

*


Tuesday 24 June 2014

స్త్రీ లోకపు వెలుగు నీడలు : ఇస్మత్ చుగ్తాయ్ కథలు

పి. సత్యవతి గారి అనువాదంలో ఇస్మత్ చుగ్తాయ్ కథలు చదివాకా నా అభిప్రాయాన్ని కినిగె పత్రికలో క్లుప్తంగా చెప్పాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీరూ చుగ్తాయ్ కథలు చదవండి. లింక్ ఇదిగో:--



ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న విషయాన్నయినా ఆమె కథగా రాయగలరని ఈ పుస్తకం నిరూపిస్తుంది. బేగమ్‌ జాన్‌, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్‌, బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్‌, ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్‌… ఇలా పాత్రలన్నీ ఆమె పెరిగిన, ఎరిగిన వాతారరణంలో నుండి వచ్చినవే. చెప్పాలనుకున్నది సూటిగా, నిక్కచ్చిగా చెప్పడం చుగ్తాయ్ కథల ప్రత్యేకత. ఆమె ఈ కథలు రాసింది ఉర్దూలోనే అయినా తెలుగులోకి భావం ఏ మాత్రం చెడకుండా వచ్చింది. దీనికి అనువాదకురాలు పి. సత్యవతిగారిని అభినందించాలి. అన్నీ స్త్రీ చుట్టూ తిరిగే కథలే ఐనా ఏ కథా మరో కథలా ఉన్నట్టు అనిపించదు. ఆడపిల్లలపై ఆంక్షలు, సాంప్రదాయికమైన కట్టుబాట్లూ వీటన్నింటికీ చుగ్తాయ్ బద్ధవ్యతిరేకి అని ఆమె కథలు చెప్తాయి.
సంప్రదాయ ముస్లిమ్ కుటుంబంలో అన్నల తర్వాత ఆడపిల్లగా పుట్టి, అన్నలానే ఆటపాటలలోనూ, చదువులోనూ పోటీ పడుతూ పెరిగింది చుగ్తాయ్. బాల్యంలో లేని ఆంక్షలు ఎదుగుతున్న కొద్దీ ఎదురవటంతో ఆమె ఎదురుతిరిగింది. ఆడపిల్లకు ఉత్తరం రాసే చదువు చాలునంటూ, ఇక చదవటం ఆపి వంటా కుట్లూఅల్లికలూ నేర్చుకోమంటే, కిస్టియన్ మతంలో కలిసిపోయి కాన్వెంట్లో చదువుకుంటాను గానీ ఇంట్లో కూర్చోనంటూ మొండికేసి ధైర్యంగా తన నిర్ణయాన్ని తెలిపింది. ఆడవారి జీవితాల గురించి చిన్నతనం నుండే నిశితమైన పరిశీలన కనిపిస్తుంది ఆమెలో. ఎదుటివారిని కూర్చోబెట్టి మాటలాడి వారి రహస్యాలు చాకచక్యంగా తెలుసుకోగల నేర్పరి. తన తోటి స్త్రీ జీవితాలనూ ఆమె అంత చాకచక్యంగానే తెలుసుకొని తన కథల్లో ఇమిడ్చింది. కొన్ని కథల ఇతివృత్తాలు ఇలా సాగుతాయి:
లిహాఫ్:— భర్తతో వివాహబంధం సరిగాలేని స్త్రీ, అతని ప్రేమను, అనురాగాన్నీ పొందలేని స్త్రీ లైంగికంగా దిగజారిపోయిన కథ ఇది. దీన్ని తన చిన్ననాటి జ్ఞాపకంగా చెప్పుకొచ్చింది చుగ్తాయ్. ఇలాంటి కథలను రాసి, సమాజంలోనికి తీసుకురావడానికి ఎంతటి గుండె ధైర్యం, సాహసం కావాలి. ఈ కథతో ఏంతటి దుమారం లేచినా చలించలేదు ఆమె. దాన్నంతట్నీ ధైర్యంగా ఎదుర్కొన్నది.
మేలిముసుగు:— ఈ కథ చెపుతున్న గోరీబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై ఏళ్ళ కన్య. కోటి ఆశలతో కొత్తగా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన గోరీబీ, భర్తకు ఎదురైన ఓ చిన్న ఆత్మనూన్యతా భావం, అర్థం చేసుకోకలేనితనం వల్ల ఓ నిండుజీవితం శిక్ష అనుభవిస్తుంది.
శిల:— భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన చుగ్తాయ్ వదిన కథ ఇది. బంధాలకు విలువ ఇచ్చింది కానీ, కరిగిపోతున్న అందాల గురించి పట్టించుకోలేదామె.
ఒక ముద్ద:— నర్సు సరళాబెన్‌కు పెళ్ళి చేసుకోవాలని మనసులో ఎంత ఉన్నా సరైన వయసులో ఆ ముచ్చట జరగలేదు. అందరికీ తలలో నాలుకలా ఉన్న ఆమె ఓ ఇంటిది ఐతే బాగుంటుంది అనుకున్నారు ఇరుగుపొరుగు వాళ్ళు. బస్సులో ఒక వ్యక్తి సరళాబెన్‌కు రోజూ లేచి సీటు ఇవ్వటం చూస్తాడు ఆమె పొరుగింటతను. అంతా సరళాబెన్‌కు ఆ వ్యక్తికీ ముడిపెడదామని ప్రయత్నిస్తారు. ఆమెని అలంకరించి పంపిస్తారు. కానీ విధి ఆమెను వెక్కిరిస్తుంది.
బిచ్చు అత్తయ్య:— అన్నగారి మీద ప్రేమను తిట్లతోనే చూపిస్తుంది బిచ్చు అత్తయ్య. మాట కరుకేగానీ మనసు వెన్న. అన్నగారంటే పంచప్రాణాలు.
అమృతలత:— దేవుడిచ్చిన అందం ఆమెకు శాపమే అయింది. వయసులో తనకంటే పెద్దవాడైన భర్తను అమితంగా ప్రేమించింది. తరుగుతున్న వయసు అతనిలో అసూయను నాటింది.
ఇలా సాగుతాయి చుగ్తాయ్ కథలు. తన చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలను చుగ్తాయ్ జీవితాంతం గుర్తుంచుకున్నది. “ఇది పురుషుల కోసం పురుషులు తయారు చేసిన ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర మాత్రమే. పురుషుని ప్రేమకో, ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ. అతని చిత్తవృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమో, తిరస్కరించడమో జరుగుతుంది.” ఈ మాటల్లోని సారం ఆమె ప్రపంచాన్ని చూసే విధాన్ని చాలా ప్రభావితం చేసిందని అనిపిస్తుంది. ఆమె కథలన్నీ ఈ సారాన్నే పదునుగా వ్యక్తం చేస్తాయి. ఒకరకంగా ఇస్మత్ మన చలానికి ఆడవెర్షను అనిపిస్తుంది.
– శ్రీశాంతి దుగ్గిరాల

Thursday 19 June 2014

కర్కశత్వాల మధ్య కమలిన సాత్వికత: మూలింటామె


                                   
                                                                                                                                                                                                                                     
మూలింటామె నవల చదువుతున్నంత సేపు ఏదో ఆశక్తి చివరకు ఆమె వస్తుందా తన సంసారాన్ని, భర్తను కాదనుకున్నా, బిడ్డలను కూడా వదిలేస్తుందా? ఇలానే ఏన్నో అనుమానాలు. జీవితంలోంచే కథలు పుడతాయంటారు. హాస్యంగా చెప్పినా, ఆలోచింపచేసినా అది నామిని గారికే చెల్లింది. మూలింటామె నవల ఓ కథకన్నా మించి పాఠకుడిని ఆలోచింప జేసే నవల.  మూలింటామె నమినిగారి రచనల్లో ఓ కొత్త కోణాన్ని చూపించింది.

ఓ చిన్న ఊరు. అందులో తల్లీకూతుళ్ళు, మనవరాలు. ముగ్గురి ఆడవాళ్ళకు ఓక్కో కథ. అందరికంటే అమాయకంగా కనిపించే కొనమ్మ
ఊరికి దూరంగా ఉన్నారని కుంచమమ్మ కాస్తా తన ఈడు వాళ్లకు కూడా మూలింటామె అయిపోయింది. కూతురికి తనలాంటి రాత కలిగిందని ఆమెను, బిడ్డనూ ఆదరించి పెంచి పెద్ద చేసి తన కొడికిచ్చి పెళ్ళి చేసింది. ఉన్నట్టుండి మనవరాలు సంసారాన్ని, భర్తను, బిడ్డలను విడిచి వెళ్ళిందనే విషయాన్ని నమ్మలేకపోయింది. అమాయకమైన మనవరాలి ముఖం గుర్తుచేసుకుంది. అమాయకురాలు, జాలి గుండెది, అందరినీ అదరించే ఆమె, ఆ ఇంటి దీపం లేకపోతే ఆ ఇల్లు, పిల్లలు, చెట్లు, చేలు, పశువులు అన్నీ అనాధలైపోతాయి. ఏం చెప్పాలి నువ్వు లేనిదే ఓరోజు గడవదమ్మా అన్నా వినలేని అంత దూరం నువ్వెళ్ళి పోయావు. మరి తిరిగిరావు. 

కూతురు తమ పరువుతీసిందంటూ ఊరితో నోరుకలిపింది నడిపామె. తన కుటుంబం ఊళ్ళో తలేత్తుకు జీవించాలని తమ్ముడికి మరో పెళ్ళి చేసింది. రెండో పెళ్ళాంగా వచ్చిన  వసంత తన మాటతీరుతో చుట్టు పక్కల వారితో మంచిగా ఉంటూ  పరాయి మగవాళ్ళతో బరితెగించి ప్రవర్తించినా కళ్ళున్న గుడ్డి లోకం మాట కూడా మాట్లాడదు. ఇవన్నీ చూస్తూ మాటైనా మాట్లాడక సమర్థించిన కొడుకు పౌరుషంలేని తనం చాలా చిత్రంగా అనిపిస్తుంది మూలింటామెకు. 

ఇద్దరు బిడ్డలను, భర్తను విడిచి వెళిపోయిన తన మనవరాలి గురించి మనసులోనే మథన పడింది. తన మనవరాలి మంచితనం  పరులనోటితో విన్నపుడు మూలింటామె మనసు ప్రేమగా మూలిగింది. ఎంత సుకుమారంగా చూసుకున్నామమ్మా, ఇలాంటి ఆలోచనచేసి ఎందుకు నాకు దూరమయ్యావంటూ  రోధించింది మూలింటామె. తన ఇంటికి రెండో కోడలిగా మనవరాలి స్థానంలోకొచ్చిన వసంత మాలింటామెకు మనవరాలిపై ఉన్న మమకారాన్నీ, ప్రేమను, ఆస్థానాన్ని అందుకోలేకపోతుంది. అందరికీ తెలిసేలా తప్పుచేసి మంచిదైన నామనవరాలు ఈ ఊరోళ్ళకు చెడ్డదైపోయింది. నంగనాచిలా వసంత ఊరోళ్ళోతో చొరవగా మసులుకోవడం, పరాయి మగాళ్ళతో రాసుకుపూసుకు తిరిగినా అందరికీ మంచిదైపోయింది. ఒక కుటుంబానికి కష్టమొస్తే ఓదార్చే వారికన్నా, ఆనందించేవారే ఎక్కువ. ఎదుటివాళ్ళను తూట్లు పొడవాలని చూసే రాబందులే ఉన్నారు మన చుట్టూ. మనకో కన్ను పోయినా పరవాలేదు, ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలనేవారికి ఉదాహరణలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ళ పాత్రలు. వయోభేధం చూడకుండా తండ్రిలా లాలించి, ఎత్తుకు పెంచిన మేనమామే ఆమెకు భర్తయ్యాడు. తన మనవరాలు తనింటి కోడలు కావాలనుకుందే కానీ దాని జీవితం వయసు ముదిరిన కొడుకుతో చివరిదాకా ఎలా ఉంటుందో ఆలోచించలేదు మూలింటామె.  సమస్యను సృష్టించుకునేది, దాని ఫలితం చూసి విచారించేది మనమే.  కొనామె అమాయకపు మనసుకు, ప్రేమ ఎరుగని మనసుకు, ఎవరు జాలి చూపినా, కాస్త ప్రేమగా మాట్లాడినా ఆమె జన్మ ధన్యమే. కళాయోడి అమాయకపు మాటలు ఆమె మనసులో అంతగా ముద్ర వేశాయి. ఆవేశంలో తప్పుచేసానని అనుకుని మళ్లీ ఇంటికి రావాలనుకోలేదు కొనామె. ఒకసారి ఆ గడప దాటాకా ప్రాణం పోయినా తిరిగి ఆ గడప తొక్కకూడదనుకుంది. తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండిపోయింది. కొనామె వెళ్ళాలనుకున్నా ఆ ఇంట ఏం మిగిలింది కనుక. పాడి పోయింది. పచ్చని చెట్లు మోడులైనాయి. తనకు ఇక ఆ కుటుంబంతో రుణం తీరిపోయిందనుకుంది. గడప దాటిన ఆడది ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకుంది. దానికి కారణాలు ఏమిటి అని విశ్లేషించనవసరం లేకుండా సూటిగా ఆమె కుటుంబ పరిస్థితులు చెప్పుకు రావడం అనవసరం అని రచయిత ఆ ఆలోచనను పాఠకుని మనస్సుకే వదిలేసాడు.

కాలం మారుతున్నా మరెంత మారినా, మనిషి ఆలోచనలో మార్పురానంత వరకు స్త్రీ జీవితంలో పెద్దగా మార్పురాదు. భర్తతో ఏం పొరపచ్చాలో తెలపడం అవసరం కాదు ఇక్కడ మూల విషయం. ఓ స్త్రీ ఇల్లు విడిచి వెళ్ళిందంటే తన కుటుంబం, జాలి తలచి వెనక్కు తీసుకు వెళ్ళాలన్నా సాహసం చేసినా కూడా హర్షించదు కదా దుమ్మెత్తి పోస్తుంది ఈ లోకం. అదే ఓ మగాడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా అది ఆడదాని లోపం కిందకే జమ కడుతుంది. ఎందుకు ఈ వ్యత్యాసం.  

మనవరాలినిపైనే ప్రాణాలు పెట్టుకున్న మూలింటామె ప్రాణాలు విడిచే క్షణంలో చివరి మాటలు కూడా మనవరాలి మీద తన ప్రేమను మరోసారి తెలిపాయి."నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేకాని, మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నాకాళ్ల కాడా చుట్టకలాడే పిల్లిని చంపలేదే" పిల్లిని చంపితే దానంత ఎత్తు(బరువు) బంగారం దానం ఇవ్వాలనే నమ్మకం ఉంది. అంటే పిల్లిని చంపినా పాపమేమో గాని నా మనవరాలు చేసిన ఆలోచన, తీసుకున్న నిర్ణయం తప్పుకాదని మరోసారి చేప్పిందన్నమాట. 






Sunday 23 March 2014

సాయంకాలమైంది పుస్తకం పై నా రివ్వూ


మనిషి తన జీవితాన్ని ఎంత గొప్పగా జీవించాలని ప్రణాళికలు వేసుకున్నా, తనకు జీవిత చరమాంకలో ఓ ఆలంబన అనుకున్న బంధాలు వేసే ఉచ్చులో పడక తప్పదు. తాను విధించుకున్న నియమాలను కడదాకా నిలపడం కోసం బిడ్డలను సైతం వదులుకున్న సుభద్రాచార్యులు కథే సాయంకాలమైంది.





మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన సాయంకాలమైంది.


గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “సాయంకాలమైంది” నవలలోనే పరిచయం చేసుకున్నాను.
శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ కథ నాలుగు తరాలను మనకు పరిచయం చేస్తుంది. పద్మనాభం అనే ఊరిలో ఆలయపూజారులైన సుభద్రాచార్యులవారి అంత్యక్రియలతో కథ ప్రారంభం అవుతుంది. ఆయన కొడుకు తిరుమల అమెరికా నుంచి తండ్రి అంత్యక్రియలకై ఊరికి వస్తాడు.
కథ మొత్తం సుభద్రాచార్యులవారి చుట్టూ తిరుగుతుంది. కుంతీనాథాచార్యులు కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు సుభద్రాచార్యులది మూడవతరం. నాలుగవతరం వాడు చినతిరుమలాచార్యులు (తిరుమల). పూర్వీకులంతా వైష్ణవ సాంప్రదాయాన్నీ, ధర్మ జ్యోతిష తర్కశాస్త్రాలని అవపోసన పట్టిన నిష్ణాతులు. తాత, తండ్రి తరువాత వైష్ణవ సనాతన సాప్రదాయాన్ని కాపాడే భాద్యతను సుభద్రాచార్యులు తన భుజాన వేసుకుంటాడు. కుమారుడికి తన తండ్రి పెద తిరుమలాచార్యుల పేరు పెట్టుకుంటాడు. చిన తిరుమలతో చిన్నతనం నుండీ నిష్ఠగా మూడు పూటలా సంధ్యావందనం చేయిస్తారు. తిరుమల నాలుగో యేటికే భగవద్గీత శ్లోకాలు అసర్గళంగా చదువుతాడు. దాంతో కొడుకు తన తదనంతరం వైష్ణవ సాంప్రదాయాన్ని, అర్చక వృత్తినీ చేపడతాడని ఎంతో ఆశ పెట్టుకుంటాడు సుభద్రాచార్యులు. సుభద్రాచార్యులవారి భార్య వరదనమ్మ, ఆమెకు భర్త, కొడుకు తిరుమల, కూతురు ఆండాళ్ళు, మడి, ఆచారం, స్వామివారిని సేవించడం ఇవే ప్రపంచం. భర్తనూ, బిడ్డలనూ పిచ్చిగా ప్రేమించే ఓ తల్లి.
చినతిరుమలాచార్యునిలోని పఠనాశక్తిని గ్రహించిన వెంకటాచలం అతని ఉన్నతికి సాయపడతాడు. తిరుమల చదువులో రాణించడం వరదమ్మకు సంతోషాన్ని కలిగించింది. ఆంగ్లచదువులో పడి కొడుకు తమ సాంప్రదాయానికి నెమ్మదిగా దూరమౌతున్నాడని గ్రహించిన సుభద్రాచార్యులు ఉన్నత చదువులకు మొదట అంగీకరించడు. కానీ తిరుమల ఆసక్తిని చూసి అందరూ నచ్చచెప్పటంతో ఒప్పుకుంటాడు.
కొత్త చదువుతో తిరుమల వేషభాషలు మారతాయి. పంచెకట్టు, పిలకముడీ పోయి పట్నంపోకడలు వచ్చి చేరతాయి. కొడుకులో వచ్చిన మార్పు వరదమ్మకు కాస్త బాధ కలిగించినా, మనసుకు సర్ది చెప్పుకుంటుంది. తిరుమలలో సాంప్రదాయాలపైన చిన్ననాడు ఉన్న పట్టు పెద్దయ్యాకా చదువుతో వచ్చిన మార్పు వల్ల సన్నగిల్లుతుంది. కాలేజీలో గోల్డుమెడల్ సాధిస్తాడు. ఉన్నత ఉద్యోగం సంపాదించి అమరికా ప్రయాణం కడతాడు.
అమెరికా జీవనం తిరుమలలో చాలా మార్పును తెస్తుంది. చిన్ననాటి నుంచి తండ్రితో కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం పెంచుకున్న తిరుమల ఆమె మరణించిన తర్వాత తండ్రి పట్ల తన బాధ్యతను క్రమంగా విస్మరిస్తాడు. తండ్రి మరణం కూడా తిరుమలను పెద్దగా బాధిచదు.
ఈ కథతో సమాంతరంగా మరో కథ సాగుతూ వస్తుంది. కుమ్మరి కులస్థుడు కూర్మయ్య చదువు పట్ల అమితమైన ఆసక్తిని చూపిస్తాడు. అది గమనించి తనకు వచ్చిన చదువు చెపుతాడు ఆ ఊరి హెడ్డు కానిస్టేబులు అవతారం. ఆరునెలల్లో పెదబాలశిక్ష, సుమతీ శతకం వచ్చేస్తాయి. ఆ ఊరిలో ప్రభుత్వోద్యోగం చేసుకునే కామేశ్వరరావు కూర్మయ్యను అప్పటికే చదువు కొంటున్న చిన తిరుమలతో పరిచయం చేస్తాడు. యాభై సంవత్సరాల క్రితం తన ముత్తాత కుంతీనాధాచార్యులు ఏ జాతివాడు ఎదురొచ్చాడని తన ఊరు వదిలి వచ్చేస్తాడో, అదే జాతి వాడు కూర్మయ్యకు ఇప్పుడు తిరుమల చదువు చెప్తాడు. అతని చెల్లి ఆండాళ్లు కూర్మయ్యతో ప్రేమలో పడుతుంది. తల్లితండ్రులను ఎదిరించి అతన్ని పెళ్ళి చేసుకు వెళిపోతుంది.
నవలలో ఇంకో ప్రధాన పాత్ర నవనీతం. చాలా ధైర్యస్తురాలు. తన మీద జరిగిన అఘాయిత్యానికి పొన్నయ్యను హత్య చేసి జైలుకు వెళ్ళింది. ఆమె తరపున వాదించి జైలు నుంచి తప్పించిన సంజీవికే భార్యగా నూతన జీవితం ప్రారంభిస్తుంది.
భార్య మరణంతో సుభద్రాచార్యులవారి జీవితంలో వెలుగు పోయి చీకటి ప్రవేశించింది. వరదమ్మ పోయాకా “మడిబట్ట ఆరవేయడం కొత్త, నళినాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవడం కొత్త. తీర్థవటిని చేబూని ‘వరదా’ అని ఈ ఏభై ఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద రాకపోవడం కొత్త.”
ఈ నవలలో ‘నవనీతం’ తర్వాత నాకు అంత బాగా నచ్చిన మరో పాత్ర రేచకుడు. తనకు కాలు తీసేసారన్న సంగతి, తల్లి చనిపోయిందన్న సంగతి అమెరికాలో ఉన్న తన కొడుక్కి తెలిస్తే బాధపడతాడని చెప్పకుండా దాస్తాడు. కుర్చీలో దర్జాగా కూర్చుని చుట్ట తాగుతూ జనం ఎక్కడ తన అవిటితనం పట్ల జాలిపడతారో అని అందర్నీ దూరంగా ఉంచే పాత్ర. మూడేళ్ళ తర్వాత తొలిసారి దేశానికి తిరిగి వచ్చిన తిరుమల అమెరికా మిత్రుడు విష్ణుమూర్తి కోరగా అతని తండ్రి రేచకుణ్ణి చూడటానికి విశాఖపట్నం నుంచి గిరిగాం వెళ్తాడు. మొదట అతన్ని కలవడం ఇష్టపడడు రేచకుడు. నెమ్మదిగా కొడుకు ఎలా ఉన్నాడో అని ప్రశ్నలు వేసే రేచకుడి కళ్ళల్లో ఆనందాన్ని గమనిస్తాడు తిరుమల.
“మీకు కాలు లేదని మీ అబ్బాయి నాకు చెప్పలేదే?” అని అడుగుతాడు.
“నాక్కాలు లేకపొతే ఆడికేమయింది బాబూ! గిరిగాం రైతునాకొడుక్కి కాలుంటేనేం పోతేనేం? నా కొడుకు దొర. సీమలో పెద్ద ఉద్యోగం సేత్తున్నాడు. అది చాలు నాకు.” “మనకి ఒంటి నిండా సక్కెరే బాబూ! తీపి తినక్కరలేదు. సిన్నప్పట్నుంచీ నేను ఇమాం పసందు అంటే పీక్కోసుకుంటాను. ఆరువేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి, తొలకరిదాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీయవ్వ.. పోతే దొర బిడ్డలాగా పోవాలి కానీ, ఏడుత్తూ బతికితే ఏం లాభం?”
తనని ఎగతాళి చేసిన రైతుకు బుద్ధి చెప్పాలని పంతంగా కొడుకుని శ్రీకాకుళంలో ఇంగ్లీషు మీడియం చదివిస్తాడు. కొడుకుతో ఇంగ్లీషు పాఠం చదివించుకుని మురిసిపోయాడు. విష్ణుమూర్తి చదువయ్యాకా వ్యవసాయం చేస్తానంటే గొడవపెట్టి మరి తనే బలవంతంగా అమెరిగా పంపిస్తాడు. అమెరికా వెళ్ళిన ముప్ఫయ్యేళ్ళ కాలంలో కొడుకు ఆరుసార్లు మాత్రమే ఇండియా వచ్చాడు.
ముప్ఫయ్యేళ్ళుగా విష్ణుమూర్తి పంపిన వస్తువులన్నీ ఓ గది నిండా బొమ్మల కొలువులా తీర్చి దిద్దాడు రేచకుడు. ఓ శాలువా తీసి “ఈ సిల్కు గుడ్డ ఆల్లమ్మ కోసం పంపించాడు ఆరు నెలల కిందట!” అన్నాడు గర్వంగా. “మరి ఆవిడ వాడుకోలేదేం?”
“ఎలా వాడుతాదయ్యా! ఈ లోకంలో ఉంటేగా వాడుకోడానికి! …సచ్చిపోయి నాలుగేళ్లయింది. సచ్చిపోయిన తల్లిని నాలుగేళ్ళు ఆడి మనస్సులో బతికించాను. నేను గొప్పొన్నా, కాదా సెప్పు బాబూ! … అమెరికా నుంచి వస్తే కాలుపోయిన నాన్ననీ, సచ్చిపోయిన తల్లినీ తల్చుకు ఏడుత్తాడని పూర్ణయ్య పంతులు గారితో చెప్పి అవాకులూ చెవాకులూ రాయిత్తాను..”
ఇంతటి రేచకుడూ భార్య చివరి క్షణాల్లో ఆమెకిచ్చిన మాటకోసం తనకెంతో ఇష్టమైన ఇమాం పసందు తినడం మానేశాడు. “తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకి ఇచ్చిన మాటని తప్పలేరా?” అన్న తిరుమల ప్రశ్నకి గిలగిల్లాడిపోయాడు రేచకుడు. “కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని” ఈ మాటలంటున్నప్పుడు రేచకుడి కనుకొలకులలో మంచిముత్యం లాంటి నీటిచుక్క తళుక్కుమంటుంది. సంతానానికి దూరమయితే అనుభవించే వేదన భరించగలిగేది కాదు. ఆ వేదన దిగమింగి బిడ్డ క్షేమాన్నే కోరుకునే ఈ పాత్ర పుస్తకం మూసినా గుర్తుండిపోతుంది.
చివరగా… తిరుమల అమెరికాలో ఉండి మంచి ఉద్యోగం, డబ్బు, పేరూ అన్నీ సంపాదించుకున్నాడు గానీ కన్న తల్లిదండ్రుల ఆఖరి గడియల్లో వారి సేవ చేసుకోలేక పోయాడు. చివరి చూపు కూడా నోచుకోలేని అభాగ్యుడయ్యాడు. కాలంతో వచ్చే మార్పు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది వివరించే కథ ఇది. అన్ని పాత్రలకు ఒక కథ ఉంది. ఎన్నో పాత్రలు కథలో ఉన్నా, రేచకుడు, నవనీతం, సంజీవి పాత్రలు పాఠకుని గుండెల్లో సజీవంగా నిలిచిపోతాయి.
– శ్రీశాంతి దుగ్గిరాల

Saturday 15 March 2014

కినిగె పత్రికలో నా కథ "మీసాలోడు"

ఈ మీసాలోడు నిజంగా ఉన్నాడు. చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండేవాడు. కథలో జరిగిన చాలా విషయాలు నిజంగా జరిగినవే. మరీ కథలో అంత కాదు గానీ, మా అమ్మ కూడా అంతే. ఇలా నాకు ముఖపరిచయం మాత్రమే ఉన్న మీసాలోడు ఒక కథగా మారతాడని అంతకుముందెప్పుడూ అనుకోలేదు. అతని హత్య జరిగిన తర్వాత నిజంగానే నేను కథలో జరిగినట్టే ఫీలయ్యాను. కథని మగ పాత్రతో ఎందుకు చెప్పించానో నాకూ తెలీదు. కథ చదివి మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను.



తెల్లవారుజాము నాలుగున్నరకు నాగదిలో అలారం మోగింది. అప్పటికే కలతనిద్రలో ఉన్నానేమో ఆ మోతతో మెలుకవ వచ్చేసింది. ఓ సంవత్సరంగా నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది లెండి. అంటే నావయసు ఏ అరవయ్యో అనుకునేరు, ముప్ఫయ్యే. ఇంకా పెళ్ళి కాలేదు. కోడలు రావాలని అమ్మకు ఎంత ఉన్నా, నాకు మాత్రం ఈ బ్రహ్మచారి జీవితమే బాగుంది. ఏదో వంకచెప్పి ఇంకొన్ని రోజులు ఇలా కానిచ్చేద్దామనే ఉంది.
ఈ మధ్య నేనూ – నా ఆరోగ్యం అనే ప్రాతిపదికన రోజూ ఉదయాన్నే వాకింగ్ మొదలెట్టాను. ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా నడక తరువాత అలసిన శరీరానికి చక్కని వేడినీటి స్నానం, మంచి ఫలహారం తరువాత పట్టే నిద్ర ఉంది చూసారూ ఆ సౌఖ్యాన్ని వర్ణించడం కష్టమండీ.
పగలు, రాత్రి తేడా లేకుండా వాహనాలు పోయే రోడ్ల మీద కాకుండా నా నడకను మా ఇంటి నుండీ ఓ మైలు దూరంలో ఉన్న జనచైతన్యా హౌసింగ్ బోర్డు వాళ్ల స్థలాల్లో చేస్తాను. ఆ స్థలాలు పదమూడు ఎకరాల్లో ఉన్నాయి. ఎర్రమట్టితో రోడ్డు వేసి ఫ్లాట్లుగా విడగొట్టారు. ఆ దారంతా ఉదయం, రాత్రి సమయాల్లో పెద్దగా జనసంచారం ఉండదు. మిగిలిన సమయాల్లో బండి మీద పోయేవాళ్లు ఈ మార్గం గుండా మాధవపట్నం వెళతారు. ఉదయం మంచుపడే వేళల్లో అలా నడుచుకుంటూ పోతే ప్రశాంతంగా ఉంటుంది. రోజూలానే నా ఉదయపు నడకకు కావలసిన కవచాలు ధరించి ఇంటి నుండి బయలుదేరాను.
ఈ స్థలాల పొలిమేరను ఆనుకుని రైల్వే ట్రాక్ వెళ్తుంది. అటూ ఇటూ ముళ్ల కంపలు ఉంటాయి. అక్కడ కొందరు గుంపుగా నిలబడి తుప్పల మధ్యకు చూస్తూ వాళ్లల్లో వాళ్లే మాట్లాకుంటున్నారు. నేను నడకవేగాన్ని పెంచి వాళ్లను చేరుకున్నాను. రోడ్డుకు వారగా ఉన్న తుప్పల మధ్య ఓ శవం. దానికి కొద్ది దూరంలో బైకు పడి ఉన్నాయి. ఆ ప్రదేశం చుట్టూ పెద్దగా ఘర్షణ జరగిన ఆనవాళ్ళున్నాయి. ఇక పోలీసులు రావడం ఒక్కటే తరువాయి.
ఆ బైకును చూస్తే చాలు ముఖం చూసి గుర్తు పట్టనవసరం లేకుండానే మనిషి ఎవరన్నదీ అక్కడ వున్న వాళ్లందరికీ అర్థమైపోయింది. అది మా మీసాలోడి బైకు. అవును మేమంతా – అంటే నాలాంటి వయసులో ఉన్న అబ్బాయిలంతా వాణ్ణి హీరో అనుకుంటే (ఆకారానికి మాత్రమే), పెద్దాళ్ళంతా విలన్ అంటారు. ఆరడుగుల పొడవుతో, పొడవుకు తగ్గ లావుపాటి శరీరంతో ఉంటాడు. నల్లని బుర్రమీసాలతో రాజకీయ నాయకుడిలా ఖద్దరు బట్టలు కడతాడు. చేతికి తనకు తగ్గట్టే పెద్దసైజు వాచీ, సెల్ ఫోన్ వెరసి ఆకారం మొత్తం యముడిలా ఉంటుంది. యముడి దున్నపోతు మాదిరిగా వీడు రెండు వీధుల అవతల ఉండగానే పెద్దగా మోత చేస్తూ అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుందా బైకు. వాడు వీధి దాటగానే గాలిలో ముక్కులు పగిలేలా సెంటువాసనా.
meesalodu1నేను పైకి గొప్పగా చెపుతున్నాకానీ ఇక్కడ వున్న వాళ్ళంతా తమ మనసుల్లో చాలా సంబరపడిపోతున్నారు. మనిషి చస్తే సంబరమేంటా అనుకుంటున్నారా. చచ్చినవాడు అపర కర్ణుడేం కాదు. ఆకారం బాగున్నా వీడికి వికారాలు ఎక్కువే. వీడి గురించి నాకు తెలిసింది చెపుతాను.
మనిషి రక్తాన్ని దోమ తొండంతో తాగితే వీడు వడ్డీల రూపంలో తాగేస్తాడు. అప్పుకోసం మీసాలోడి గుమ్మం తొక్కినవాళ్ళకు ఈ జన్మకు ముక్తి ఉండదనేది జగమెరిగిన సత్యం. కానీ అవసరం వాడి గుమ్మం ఎక్కేలా చేస్తుంది మరి. మీసాలోడికి పిల్లల్లేరు. భార్య‘లు’ ఉన్నారు. రాంబాబు అనే తమ్ముడున్నాడు. పైకి వీళ్లు రామలక్ష్మణులే కానీ, వాలి సుగ్రీవుల్లా వాళ్ళల్లో వాళ్లకు పడి చావదు.
మీసాలోడి గురించి నాకు అందరికన్నా కాస్త ఎక్కువే తెలుసు. అంటే నేను వాడి అనుచరుణ్ణి అనుకునేరు! ఐదేళ్ళ కిందట ఓ శుభముహర్తాన మా ఇంటికి ఎదురుగా ఉన్న బంగళాలోనికి మీసాలోడు సతీ సమేతంగా (ఎన్నో భార్యో నంబరు తెలీదు) అన్ని హంగులతో అద్దెకు దిగాడు. ఆమె పేరు శకుంతల, మీసాలోడి ఒడ్డూ పొడవుకు తగ్గట్టూ ఉంటుంది. వయసు మరీ చిన్నదేంకాదు. నలభై ఉంటాయి. అలంకారంతో ఆ వయసు బైట పడకూడదని తెగతాపత్రయ పడుతుంది. ఇరుగుపొరుగు ఆడవాళ్ళతో డాంబికాలు పోతూ, మొగుణ్ణి తెగపొగిడేస్తుంది.
మీసాలోడి వడ్డీవ్యాపారం, రియలెస్టేటు, బిజినెస్ సెటిల్మెంట్స్, మిగతా వ్యవహారాలన్నీ ఈ ఇంటి నుండే జరిగేవి. వచ్చే జనం పోయేజనంతో ఎప్పుడూ ఆ ఇల్లు కోలాహలంగా ఉండేది. నేను ఇదంతా మా మేడ మీద పచార్లు చేస్తూ గమనించేవాణ్ణి. అప్పుడప్పుడూ మా ఇంటి పిట్టగోడ మీంచి చూసేవాణ్ణి. ఇందులో ఎలాంటి చెడ్డ ఆలోచనా లేదండీ. మీసాలోడు చెడ్డోడని తెలిసినా వాడికున్న ఫాలోయింగ్ నాకు నచ్చేది. మా వీధిలో పెద్ద దుకాణం ముందు నాలాంటి కుర్రకారంతా చేరి వాడి గురించే మాట్లాడుకునేవారు.
వడ్డీకి డబ్బులివడం, చక్రవడ్డీలూ బారువడ్డీలూ వేయడం, అవి సమయానికి రాకపోతే మనుషులతో బెదిరించి వసూలుచేయడం… ఇలా వచ్చిన ఐదేళ్ళల్లోనూ అందరి ఉసురూ పోసుకుని బాగానే పేరూ, డబ్బూ సంపాదించాడు. మీసాలోడు చచ్చాడంటే అప్పులు తీసుకున్నవాళ్ళంతా పీడా పోయిందని తీసుకున్న డబ్బు కట్టనవసరం లేదని లోలోపల తెగ సంబరపడిపోతున్నారు. నాకూ వాడికీ ఎలాంటి రుణబంధమూ లేదు కాబట్టి మీసాలోడు నా వరకూ హీరోనే. ఈ హత్యకు ముందురోజే అతన్ని హైవే మీద చూసాను. నన్ను గుర్తుపట్టినట్టు నవ్వాడు కూడా, ఏది ఏమైనా నా కళ్ళముందు ఇంకా ఆ మీసాలోడు తన బైక్ మీద తిరుగుతున్నట్టే ఉంది.
* * *
అప్పుడే ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. కొందరు సంతోషిస్తే, కొందరు అయ్యో అన్నారు. బ్రిడ్జి దగ్గర గుమికూడిన మా కుర్రాళ్ళమందరం అలాంటోడు మళ్ళీ పుట్టడురా వాడి దర్పం, ఆ ఠీవీ ఎవరికీ రావు అంటూ తెగ బాధ పడిపోయాం. హత్యాస్థలానికి కాస్తదూరంలో ఉండి జరిగేదంతా చూస్తూ నిలబడిపోయాం. మధ్యాహ్నానికి శవపంచనామా అదీ పూర్తయి శవాన్ని పోలీసులు స్వాధీన పరుచుకుని, మొదటగా చూసిన వారినందరినీ యక్షప్రశ్నలూ వేసి వదిలారు.
అంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు బరువైన హృదయాలతో బయలుదేరాం. ఎందుకో మనసంతా మీసాలోడి ఆలోచనలతో గందరగొళంగా ఉంది.
* * *
ఇంటికి రాగానే మా అమ్మ తెగబాధపడిపోతూ నాకు ఎదురొచ్చింది. “విన్నావారా మీసాలోడిని ఎవరో హత్య చేసారట పాపం,” అంటూ తన ధోరణిలో తను ఆ వివరాలు చెపుతుంది. ఇక్కడ మా అమ్మ గురించి మీకు ఓ విషయం చెప్పాలి, ఉదయాన్నే పెద్ద పనున్నట్టు లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకుని టీ తాగుతూ టీవీ ముందు వాలిపోతుంది. ఆ ఇది పెద్ద విషయమా అంటారా… అలా కాదండీ బాబు! ఈ కాలంలో అందరి ఆడవాళ్ళలా సీరియళ్ళు తెగపిచ్చిగా చూస్తూ ఇంటి సంగతీ, వంట సంగతీ, ఒంటి సంగతీ మరిచిపోతే పరవాలేదు. వాళ్ళందరికీ కాస్త భిన్నం మా అమ్మ. ఎలాగంటారా.
meesaalodu2మాములుగా మనం అందరం ఈనాడు పేపరులో జిల్లా ఎడిషన్ ఓసారి చూసి చదవడానికి తెగ ఇబ్బంది పడిపోతాం, ఉదయాన్నే ఈ పాడు చావు వార్తలెందుకులే అనుకుంటూ పక్క పేజీకి పోతాం. టీవీలో చావు న్యూస్ చూసినా అంతే తీరుగా కాస్త చూసి పక్క ఛానల్ మార్చేస్తాం. కానీ అమ్మ అలా కాదు ఉదయాన్నే టీ తాగుతూ కేబుల్ కనెక్షన్ సౌజన్యంతో టీవీ9 వారి నిరంతరంగా ప్రసారమయ్యే క్రెం న్యూసునూ, వాడు తిప్పి తిప్పి చూపించే స్క్రోలింగులనూ చదువుతూ ఆ హత్యల గురించి తెగ ఫీలయిపోతుంది. ఇది కూడా పెద్దగా అభ్యంతరం కాదు, ఆవిడ ఓపిక. కానీ ఆవిడకు ఉదయాన్నే దొరికిన వాళ్లందరి మీదా – అంటే ఇంట్లో మా అందరి మీదా ఆ వార్తల ప్రభావం పడుతుంది (ముఖ్యంగా నాన్నగారు ముందుగా బలైపోతారు, ఆ తరువాత మేము). అదెలాగంటే.
ఏదో సినిమాలో శ్రీలక్ష్మి ఆగకుండా పాలవాడికీ, పూలవాడికీ తాను చూసిన సినిమాల గురించి టైటిల్స్ నుండీ శుభం కార్డు వరకూ చెప్పినట్టు మా అమ్మ కూడా టీవీలో ఓ హత్య వార్త చూసి అది ఎలా జరిగిందో దాన్ని ఎవరు చేసి ఉంటారో అసలు ఆ హత్య జరగడానికి కారణాలు అన్నీ తన ఇంటిలిజెంట్ బుర్రతో ఆలోచిస్తూ దొరికిన వారి ప్రాణాలు తీసేస్తుంది. అక్కడితో ఆగదు, ఆ వార్తని బుర్రలో ఫీడ్ చేసేసుకుంటుంది, నాలుగు రోజుల వరకూ పోలీసులు హంతకుణ్ణి కనుక్కున్నారా లేదా అంటూ అన్ని ఛానళ్ళూ వెతుకుతుంది. ఏదో వాళ్ళ కర్మ కాలి (మాది కూడా) పోలీసులు పట్టుకోకపోతే మా అమ్మ నోటి నుండి వచ్చే “ఎర్ర అక్షరాలు” (అవే నండీ తిట్లు) ప్రవాహంలా తనంతట తాను ఆ వార్త మరిచిపోయే వరకూ పారుతూనే ఉంటాయి.
ఆ మధ్య “నేరాలూ ఘోరాలు” గోంగూరా అంటూ వచ్చిన ప్రోగ్రాంను ఆదర్శంగా తీసుకుని ఈ వార్తలు చూపించే చానళ్ళు ఎక్కువయ్యాయి. హత్య ఎలా చేసారు, ఏ ఆధారాలు వదలడంతో దొరికిపోయారు అంటూ చూపించడం వచ్చాకా మా పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. “కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు” తయారయింది మా పని.
ఆవిడ మాటలు వినపడనట్టు నా రూంలోకి వెళిపోయాను. రెండు రోజులు గడిచాయి. అందరి మనసుల్లోనూ ఈ హత్య మరుగున పడిపోయింది. నేను మళ్ళీ నా ఉదయపు నడకను కొనసాగించాను. హత్య జరిగిన ప్రదేశం సమీపించగానే ఒక్కసారిగా గంభీరమైన మీసాలోడి ముఖం నా కళ్ళ ముందు తెరలా కనిపించి మాయమయ్యేది.
మూడోరోజు సాయంత్రం మా ఇంటి ముందు పోలీసు వ్యాను ఆగింది. అందులోనుండీ ముగ్గురు మఫ్టీలో ఉన్న పోలీసులు దిగి సరాసరి మా ఇంటి ముందుగది లోకి వచ్చేసారు. అప్పటి వరకూ సీరియస్ గా క్రైం వార్తలు చూస్తున్న అమ్మ ఒక్కసారిగా కంగారుపడి గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. నాకూ విషయం అర్థంకాలేదు. కాస్త కంగారూ వేసింది.
అసలు సంగతేంటంటే, పోలీసుల మాటల్ని బట్టి వాళ్ళు మా అమ్మ కోసం వచ్చారని అర్థం అయ్యింది. నా గుండెల్లో ఒక్కసారిగా సినిమాలో చూపించినట్టు అగ్ని పర్వతం బద్దలైంది. ఈవిడ హత్య కేసులు తేలకపోతే పోలీసుల్ని నోటికొచ్చిన బండబూతులన్నీ తిడుతుందని గిట్టని వాళ్ళు రిపోర్టు చేయలేదుకదా అనుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళి నుంచున్నాను. సమయానికి నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. అందరికీ నమస్కారం పెట్టాను.
నన్ను చూడగానే హెడ్డు “మీ అమ్మగారిని రేపు ఓసారి పోలీస్ స్టేషన్ కి తీసుకురమ్మని ఎస్.ఐ గారు చెప్పమన్నారండి” అన్నాడు.
చచ్చాం అనుకున్నంతా అయ్యింది. ఇప్పుడెలారా దేవుడా అనుకుంటూ వాళ్ళను చూడగానే పూడుకుపోయిన నా గొంతు పెగిల్చి “ఎందుకండీ మా అమ్మ ఏం చేసారు” అన్నాను అతి కష్టం మీద.
“ఏ సంగతీ మీరు ఎస్.ఐ గారినే అడగండి” అన్నాడు బొంగురు గొంతుతో. “రేపు ఉదయం తీసుకురండీ” అంటూ వచ్చినంత వేగం గానూ వెళిపోయారు.
అమ్మ మీద ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏం తెచ్చి పెట్టిందో, అసలు ఏం జరుగుతుందో తెలియక నా కోపం నషాళానికి అంటింది. అమ్మను తిడదామని ఆమె వైపు చూద్దును కదా గోడకు కొట్టిన పిడకలా గట్టిగా అత్తుక్కుపోయింది.
నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. ఆయన సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు. అసలే బెదిరిపోయిన అమ్మను నాన్న వచ్చే వరకూ ఏం ప్రశ్నలు వేయలేదు. ఒక్కసారిగా భయంతో జ్వరం తెచ్చుకుని మంచమెక్కేసింది.
అసలు ఏం జరిగిందో నెమ్మదిగా నాన్ననే కనుక్కోమన్నాను. “అడిగాన్రా అసలు అది ఏం ఎరగనంటుంది” అన్నారు. సాయంకాలం దాకా బాగా ఆలోచించాకా నాకు ఓ విషయం తట్టింది. రాత్రికి నెమ్మదిగా అమ్మనడిగి నాకు వచ్చిన అనుమానాన్ని రూఢీ చేసుకున్నాను.
రెండు రోజుల క్రితం మీసాలోడి హత్య జరిగాక మా కాలనీ ఆడాళ్ళంతా శకుంతలను పరామర్శించడానికి వాళ్ళింటికెళ్ళారు. అందరితో మా అమ్మ కూడా వెళ్ళింది (కాస్త కుతూహలంతో). అందరూ మాట్లాడటం అయ్యాకా, మా అమ్మ కూడా తన ధోరణిలో ఓదార్పు మాటలకు బదులు పెద్ద నేర పరిశోధనా నిపుణురాలిలా, “అసలు హత్య రాత్రి 8 నుండి 9 గంటల మధ్య జరిగి ఉండాలి. మీతో ఆఖరుగా 7.30కి మాట్లాడారన్నారు. చివరిసారిగా ఆయన్ను చూసింది నేనే అయితే. ఆయన నిన్న 7.45 నిముషాలకు హైవే మీదుగా వెళుతూ కనిపిచారు. అంటే ఈ మధ్యలోనే ఎవరో తెలిసివాళ్ళే జనచైతన్యా మార్గంలో కాపు కాసి హత్య చేసి ఉండాలి” అన్నదట.
అంతే ఆ మాటలు విన్న శకుంతల పోలీసులకు ప్రత్యక్షసాక్షిగా మా అమ్మ పేరు చెప్పింది.
అదీ నిజమే చివరగా చూసింది మేమిద్దరమే. తీగ లాగితే డొకంతా కదిలినట్టు ఎందుకొచ్చిన గొడవ అనుకుని ముందు ఈ వ్యవహారంలో నుండి అమ్మని బయటపడేయటం ఎలాగో ఆలోచించాను. నాన్నగారికి జరిగిన విషయం చెప్పాను. ఇద్దరం ఉదయాన్నే ఎస్.ఐని కలిసి అమ్మకు మతి స్థిమితం సరిగా లేదని చెప్పి, అనవసరంగా ఈ విషయంలోకి లాగద్దని బతిమాలి చేతులు తడిపి ఎలాగో అక్కడి నుండి బయటపడ్డాం.
* * *
దాదాపుగా సంవత్సరం కావస్తుంది మీసాలోడు పోయి. బాకీ తీర్చనవసరం లేదని సంబర పడినంత సేపు లేకుండా పోయింది మా ఊరోళ్ళకు. వడ్డీల బకాసురుడు పోయాడనుకున్న నెలకు వాడి తమ్ముడు ఆ స్థానాన్ని బర్తీ చేసాడు. ఇక మీసాలోడిని ఎవరు చంపించారో అందరికీ తెలిసినా ప్రజలంతా భయం వల్ల, పోలీసులు డబ్బువల్ల నోరు తెరవలేదు.
మా ఇంటి విషయానికి వస్తే ఇప్పుడు మా అమ్మ ఉదయాన్నే క్రైం వార్తలు చూడటం మానేసి పూజ గదిలోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

*

శ్రీశాంతి దుగ్గిరాల

Friday 31 January 2014

అమరావతి కథల పై సమీక్ష

సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో



“అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గల గల పారుతున్న కృష్టానది. అద్గదీ అమరావతి.”
అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన 100 కథల సంపుటి. సత్యంగారి రచనకు బాపూ గారి బొమ్మలు, ముళ్ళపూడి వెంకట రమణగారి ముందు మాట మరింత వన్నెతెచ్చాయి. ఈ కథల్లో తనకు పరిచయమున్న ఊరిని, ఊరివారినీ మనకు పరిచయం చేసారు. కథ నిడివి చిన్నదైనా కథ చెప్పిన తీరు, కథా amaravathi_kadhaluవిషయం నిరాడంబరంగా ఉంది. అమరావతి ఊరితో ఆయనకున్న అనుబంధం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రాజులు, దొరలు, దొంగలూ, సామాన్య ప్రజలూ, అందరూ కథా పాత్రలే. ఒకింత హాస్యము, వ్యంగ్యమూ కలబోసి చెప్తారు. ప్రతీ కథా క్లుప్తంగా, సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఈ కథలను చదువుతున్న పాఠకుడి మనసుకు కృష్ణానది గలగలలు వినిపిస్తాయి. అమరావతి పరిసరాలు ఒక్కసారి పలకరిస్తాయి. అతి సరళంగా ఉండే ఆయన శైలి మామూలు పాఠకుడు కూడా సులువుగా అర్థం చేసుకోగలడు.
ఒకనాటి అమరావతి నగరం దేదీప్యమానంగా వెలగడం చూపుతూనే, ఈనాడు ఎంత నిరాదరణకు గురౌతున్నదో చెప్పుకొచ్చాడు రచయిత. ఒకనాడు రథాలతో, గుర్రాలతో, సైనిక విన్యాసాలతో పురవీధులు ఎంతో రమణీయంగా ఉండేవి. ఇప్పుడు ఆ వీధుల వెంట కుక్కలూ, గాడిదలూ నడుస్తున్నాయి. ముత్యాల మూటలు బళ్ళకెత్తి నడిచిన ఆ వీధులంట ఇప్పుడు పొట్టు బస్తాల వెళుతున్నాయి. శుభ్రం తగ్గిపోయి, రోడ్లంట చెత్త పేరుకుపోయింది. ఆ గుడిగోపురాలు, బౌధ్ధారామము అన్నీ పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. వీటన్నింటినీ చూస్తూ మౌన సాక్షిగా నిలిచింది కృష్ణవేణి.
మొత్తం పుస్తకంలో నాకు నచ్చిన కొన్ని కథల గురించి చెప్తాను:
వరద:— కృష్ణ పొంగి ప్రళయ రూపం దాల్చింది. అమరావతిని అతలాకుతలం చేసేసింది. పూరిళ్లూ భవంతులూ అన్నీ మూకుమ్మడిగా కొట్టుకుపోయాయి. వరద శాంతించాకా పేదా, గొప్ప భేధం పోయింది. శాస్త్రిగారికీ, సంగడికీ ఉన్న దూరాన్ని చెరిపేసిందీ వరద. ఆకలికి కులంలేదంటూ మనషులు తమ చుట్టూ కట్టుకున్న గోడల్ని కూల్చి వెళ్ళి పోయింది. ఊరి వారంతా సహపంక్తి భోజనాలరగించారు. కృష్ణకు మళ్లీ వరద వచ్చే నాటికి కొత్త గోడలు పుట్టుకొస్తాయి.
సుడిగుండంలో ముక్కుపుడక:— ఎలికలోళ్ల బాచిగాడి తాతలు తండ్రులూ అంతా రత్నాల కోసం కృష్ణ సుడిగుండాలు గాలించినవారే. ఒక్క రత్నమూ దొరకలేదు, శ్రమకు ఫలితం దక్కలేదు. ఒకరోజు యధావిధిగా బాచిగాడూ, భార్య సింగి సుడిగుండం ఎండిన గుంటలో రతనాల కోసం వెతుకుతున్నారు. వీళ్ల పని చూసిన భూమయ్య భార్య సూర్యకాంతానికి అక్కడే పోయిన తన ముక్కుపుడుక సంగతి గుర్తొస్తుంది. భార్య ఈ సంగతి చెప్పేసరికి భూమయ్య తెల్లారే లోగా ఆ ముక్కుపుడుక వెతికి తేవాలని జంటకి హుకుం జారీచేస్తాడు. పసివాడి ఆకలిని కూడా లెక్కచేయక అదే పనిగా వెతుకుతారు. చివరికా ముక్కుపుడక దొరికే సరికి పెద్ద రత్నమే దొరికినంత ఆనందిస్తారు. ఆశ చావని ఆ జంట పరుల సొమ్ము ఆశించక ఇంకా కృష్ణలో వెతుకుతూనే ఉంది.
పుణుకుల బుట్టలో లచ్చితల్లి:— ధనానికి మనిషి ఇచ్చే ప్రాముఖ్యం, ఆ ధనంతో మనిషికి వచ్చే ప్రాముఖ్యాన్ని చక్కగా తెలుపుతుందీ కథ. పుణుకుల సుబ్బాయి కాస్తా డబ్బురాగానే సుబ్బారావుగారు గా మారినట్టు.
రాగి చెంబులో చేపపిల్ల:— ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల? బాంఢ శుద్ధిలేని పాకమేల? చిత్త శుద్ధిలేని శివ పూజలేలరా? అని వేమన అన్నట్లు, ఆచారాలనేవి మనం తెచ్చి పెట్టుకున్నవే. సుబ్బమ్మగారు అచారం పేరుతో ఎంత మూఢత్వంలో కూరుకుపోయి ఉన్నదో ఈ కథ చెపుతుంది.
అన్నపూర్ణ కావిడి:— అన్నపూర్ణకావిడితో యాచించి తెచ్చుకున్న కాస్తలో తనకన్నా బీదవారికి అన్నం పంచి, తాను మిగిలితే తింటాడు లేదంటే కృష్ణాజలంతో కడుపు నింపుకుంటాడు శరభయ్య. జీవితం పై విరక్తి నుండి వైరాగ్యంలోకి వచ్చిన శరభయ్య, తనకున్న దాంట్లోనే నలుగురికీ పంచుతూ తృప్తిగా పోయాడు.
కాకితో కబురు:— జువ్వి తన మనసులోని బాధనంతా కాకులతో, ఉడతలతో, రామ చిలకలతో చెప్పుకునేది. వేయి కళ్లతో అతని రాక కోసం ఎదురు చూసేది. ధ్యాసంతా మామ చింతాలు మీదనే, ఎప్పటికైనా తన బతుకు పండిస్తాడని ఆ చిన్నదాని ఆశ. ఎప్పటికీ తీరని ఆశ. నేను ఏడవటం లేదని మామతో చెప్పమంటూ కాకితో కబురంపిస్తుంది.
తులసి తాంబూలం:— సుష్టిగా భోజనం చేసాకా, కమ్మగా వేసుకునే తాంబూలమే ఆ ఇంటి వారికి భోజనమై ఆకలి తీర్చింది. వామనయ్య, తాయారమ్మల నోరు పండించింది.
బాకీ సంతతి:— తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం తన రక్తాన్ని కరిగించాడు. ఏడాదంతా కష్టించి పండించిన పంటను కళ్ళెం నుండే తీసుకెళ్ళినా సహించాడు, కడుపుకు గంజి తాగాడు, బాధ పెట్టినా ఊరుకున్నాడు కానీ, బాకీ మొత్తాన్ని జమచేసుకోడానికి పొలం దున్నే ఎద్దుల్ని జప్తు చేయటం దాకా వచ్చేసరికి సహించలేకపోయాడు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకు పడ్డాడు. కోపంతో బుసలు కొట్టాడు. కానీ తన ఎద్దుల్ని తిరిగి ఇచ్చేస్తాననే సరికి అంత ఆవేశమూ చల్లారిపోయింది. కృతజ్ఞతతో చిన్న పిల్లాడై ఏడుస్తాడు.
అంపకం:— శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతూ, అల్లుడికి కూతురి మీద కోపం వస్తే తనకు కబురు చేయమని తాను తక్షణమే ఇంటి ముందుంటాననీ అంటాడు. ఆ కోపం తన మీద తీర్చుకో మంటాడు. ఆడపిల్లను కన్న ప్రతి తండ్రీ తన బిడ్డను అత్తవారింటికి పంపేటప్పుడు పడే ఆవేదనా రూపమే అంపకం.
తృప్తి:— పది మందికి వంట చేసి వడ్డించే వారికి, అతిథులు కడుపు నిండుగా భోంచేసి వంటకాలు బాగున్నాయంటే చాలు, ముఖంలో వేయి తారా జువ్వల వెలుగు వస్తుంది, ఆ మాటలతోనే కడుపు నిండి పోతుంది. పూర్ణయ్య తీరు అదే. పది మందికీ పెట్టడంలోనే తన తృప్తి చూసుకుంటాడు.
ఈ కథలు మచ్చుతునకలు మాత్రమే. ఇంకా ఈ 100 కథల్లో మనకు గుర్తుండిపోయే కథలు చాలానే ఉన్నాయి. ఈ పుస్తకం 1979 సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకుంది. వీటిని ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ హిందీలో ధారావాహికగా నిర్మించారు. సత్యం శంకరమంచి ఈ కథల ద్యారా అమరావతికి చెరగని గుర్తింపు తెచ్చారు.
– శ్రీశాంతి దుగ్గిరాల

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...