Tuesday 21 July 2015

ఇక్కడ కాంతి ఎక్కువ ఉంది….



 ఒకతను నేల మీద ఏదో వెతుక్కుంటున్న నశీరుద్ధీనును చూసాడు.
ఏం పోగొట్టుకున్నావ్ నశీరుద్ధీన్ అని అడిగాడు.
నా తాళం చెవుల్ని చెప్పాడు నశీరుద్ధీన్.
వాళ్ళిద్దరూ మొకాళ్ళమీద కూర్చుని మరీ వెతకసాగారు.
కొంతసేపటికి పక్కవాడు అడిగాడు. నువ్వు దాన్ని సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నాయో చెప్పగలవా”?
నా ఇంట్లో.
మరి ఇక్కడకొచ్చి ఎందుకు వెతుకుతున్నావు”?
ఎందుకంటే నా ఇంటి బయట కాంతి ఎక్కువ ఉంది అందుకనీ”!

పిల్లి – మాంసం



ఒకరోజు నశీరుద్ధీన్ తన భార్యకు మాంసం తెచ్చి ఇచ్చి అతిధులకు వండి పెట్టమన్నాడు. భోజనం తయారైంది కానీ అందులో మాంసం కూర లేదు. భార్య ముందే తినేసింది.
ఆ పాడు పిల్లి తినేసింది. మొత్తం కేజీమాంసాన్ని అంది.
నశీరుద్ధీన్ ఆ పిల్లిని పట్టుకుని తూకం వేసాడు. దాని బరువు కేజీ ఉంది.
 పిల్లి ఇదే అయితే, మాంసం ఎక్కడునట్టు! ఒకవేళ మాంసం ఇదే అయితే పిల్లి ఏమయినట్టు?”అన్నాడు నశీరుద్ధీన్.

Sunday 19 July 2015

రహస్య వ్యాపారి


నశీరుద్ధీన్ తరుచుగా పర్సియా నుండీ గ్రీస్ కు గాడిద మీద వెళ్ళేవాడు. గాడిదకు అటూ ఇటూ గడ్డితో నింపిన తోలు సంచులను కట్టి తీసుకువెళ్ళేవాడు.

వెళ్ళిన ప్రతిసారీ సరిహద్దు వద్ద తనిఖీ అధికారులు అతడ్ని ఆపి నిష్షిద్ధ వస్తువులు ఏమైనా తీసుకువస్తున్నాడేమోనని పరీక్షించేవారు. కానీ ఎప్పుడూ గడ్డి తప్ప ఏమీ కనిపించేది కాదు.

ఓరోజు అధికారి అడిగాడు “ఏం తీసుకు వెళుతున్నావ్ నశీరుద్ధీన్?”

“నేనో రహస్య వ్యాపారిని” అని నవ్వుతూ బదులిచ్చాడు.

కొన్ని సంవత్సరాలు తర్వాత నశీరుద్ధీన్ బాగా డబ్బు గడించి ఈజిప్టులో స్థిరపడ్డాడు. ఒకరోజు అతడికి పాత తనిఖీ అధికారి తారసపడ్డాడు.

“ఇప్పుడు చెప్పు నశీరుద్ధీన్! చాలా దర్జాగా బ్రతుకుతున్నావు, మనం ఆ పర్సియా గ్రీసు దేశాల పరిధిలో కూడా లేము. అసలు ఎప్పుడూ మాకు పట్టుబడకుండా నువ్వు రహస్యంగా రవాణా చేసే ఆ సరుకు ఏమిటి?” అని అడిగాడు అధికారి.

“గాడిదలు” సమాధానం చెప్పాడు నశీరుద్ధీన్.

Saturday 18 July 2015

కుండ కనగలిగినపుడు...

ఒకరోజు నశీరుద్ధీన్ తన వంట పాత్రలను పొరుగు వాడికి విందు సందర్భంగా అరువు ఇచ్చాడు. పని కాగానే పొరుగువాడు ఆ కుండలతో పాటు ఒక చిన్న కుండను కూడా తిరిగి ఇచ్చాడు.

“ఏమిటిది?” అడిగాడు నశీరుద్ధీన్.

“న్యాయప్రకారం నీ కుండలకు పుట్టిన సంతానం నీదే కనుక నీకు అప్పగించాను” అన్నాడు పొరుగువాడు.

కొన్ని రోజులకు నశీరుద్ధీన్ అదే పొరుగువాడి దగ్గర కుండలు అరువుతీసుకున్నాడు. కానీ తిరిగి ఇవ్వలేదు.

పొరుగింటి వాడు కుండలిమ్మని అడిగితే “అయ్యో! అవి చచ్చిపోయాయి. నువ్వే కదా కుండలకి పుట్టుక ఉంది అని తేల్చావు, అప్పుడు వాటికి చావు కూడా మామూలే కదా,” అని జవాబిచ్చాడు.

Friday 17 July 2015

మనం ఇక్కడ ఎందుకున్నామంటే........

ఓ సాయంత్రంవేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద నడుస్తూ, అటుగా వస్తున్న కొందరు గుర్రపురౌతుల్ని చూసాడు ముల్లా నశీరుద్ధీన్.

వెంటనే అతడి ఆలోచనల వేగం పెరిగింది. వాళ్ళు తనను బలవంతంగా పట్టుకుని అమ్మేయవచ్చు లేక సైన్యంలో చేర్చవచ్చు అన్న ఆలోచనరాగానే పరుగందుకుని పక్కనే ఉన్న శ్మశానంలోని ఖాళీ సమాధిలో పడుకున్నాడు.

నశీరుద్ధీన్ విచిత్ర ప్రవర్తన చూసిన బాటసారులు అతణ్ణి అనుసరించారు. సమాధిలో నిలువునా బిగుసుకుపోయి, వణుకుతూ పడుకున్న ముల్లాను చూసారు.

“ఏం చేస్తున్నావ్ ఈ సమాధిలో? నువ్వు పరిగెత్తడం మేం చూసాం. మమ్మల్నేమన్నా సాయం చెయ్యమంటావా” అన్నాడు వాళ్ళలో ఒకడు.

వచ్చిన వాళ్ళు మామూలు బాటసారులే అయ్యుంటారని గమనించిన నశీరుద్ధీన్ ఇలా అన్నాడు. “మీరు ఇలా ఓ ప్రశ్న అడిగినంత మాత్రాన దానికి సూటిగా ఒక సమాధానం ఉంటుందని అనుకోవద్దు. అదంతా మీరు చూసే దృష్టికోణం మీద ఆధారపడిఉంటుంది.  అయినా  మీకో జవాబు కావాలంటే చెపుతాను. నేనిక్కడ ఉన్నది మీకారణంగా, మీరిక్కడ ఉన్నది నాకారణంగా” అన్నాడు.

Thursday 16 July 2015

మరోదారి

చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిన పేదరాసి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు ఎంత అల్లి చెప్పినా వాటిని అల్లి చెపుతున్నారని మనకు తెలిసినా వినసొంపుగానే కాదు, సరదానూ తెలియని ఆసక్తినీ రేపేవి. అంతే కానీ నిజంగా తెనాలి రామకృష్ణడు అంత తెలివిగలవాడా అనే అనుమానమూ రాలేదు, అక్బర్ ముందు బీర్బల్ చూపిన చతురత నిజమేనా అనే సందేహమూ మనకు కలగలేదు. పెదరాసి పెద్దమ్మ పై అల్లిన కథలను ఈనాటికీ వింటునే ఉన్నాం. మనలానే ఇతరదేశాల వారూ ఓ తెనాలి రామకృష్ణుడు, బీర్బలు లాంటి పాత్రను వారూ సృష్టించుకున్నారు. అతడే  ముల్లా నసీరుద్ధీన్. చతురత, కాస్త అమాయకత్వం కలబోసిన ఈ కథల్ని మన తెలుగులో చెప్పాలని చిన్న కోరిక పుట్టింది.............

ఒకరోజు తన స్నేహితులతో టీ దుకాణంలో ఉన్న నసీరుద్ధీన్ “అతిధ్యమివ్వడంలో నాకు సాటి ఎవరూలేరు” అంటూ ఢాంబికాలు పోయాడు. ఇంతలో అతని పక్కనే ఆశపోతు స్నేహితుడొకడు “చాలా మంచిది అయితే రాత్రి భోజనానికి మమ్మలందర్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చుగా,” అన్నాడు.

నశీరుద్ధీన్ తన స్నేహితులందరినీ గుంపుగా కూడదీసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దరిదాపులకు వచ్చాకా, “నేను ముందుగా వెళ్ళి మీరంతా వస్తున్న సంగతి నా భార్యతో చెప్పి వస్తాను” అని వారిని అక్కడే ఉండమని చెప్పి ఇంటిలోనికి ప్రవేశించాడు.

భార్యకు తన స్నేహితులు రాత్రి భోజనానికి వచ్చిన సంగతి చెప్పగానే ఆమె “ఇంట్లో తినడానికి ఏమిలేవు, వాళ్ళకు భోజనం పెట్టడానికి వీలుపడదు వెళ్ళిపోమని చెప్పు” అంది.

“నేను చేయలేను. అలా చేస్తే మంచి ఆతిథ్యమిస్తాన్న నా కీర్తికి కళంకం”.

“మంచిది, అలాగయితే నువ్వు మేడ మీదకు వెళ్ళు. నువ్వు బయటకు వెళ్ళావని చెప్పి వాళ్ళను పంపేస్తాను” అంది భార్య.

ఓ గంట గడిచేనాటికి తమ స్నేహితుడి కోసం ఎదురుచూసి అలసిన అతిథులు విసుగు చెంది గుంపుగా ఇంటి ద్వారం ముందు గుమిగూడి “మమ్మల్ని లోపలికి ఆహ్వానించు నశీరుద్ధీన్” అని గట్టిగా అరిచారు.

ఇంతలో నశీరుద్ధీన్ భార్య గుమ్మం దగ్గరకు వచ్చి “నశీరుద్ధీన్ లేడు బయటకువెళ్ళాడు” అని జవాబిచ్చింది.

“అదేమిటి మేం చూస్తూనే ఉన్నామే! మేమంతా గుమ్మం దగ్గరే ఉంటే అతగాడు ఎలా బయటకు వెళతాడు” అన్నారు వాళ్ళు.

ఆమె ఏం మాట్లాడాలో తెలీక మౌనంగా ఉండిపోయింది.

ఇంతలో పై అంతస్తు కిటికీ లోంచి కింద జరుగుతున్నదంతా చూస్తున్న నశీరుద్ధీన్ ఇక ఉండబట్టలేక కిటికీలోంచి తల బయటకు పెట్టి “నేను పెరటి గుమ్మం గుండా బయటకు వెళ్ళకూడదా ఏమిటీ?” అని వాళ్ళకు సమాధానం ఇచ్చాడు.

మరో కథతో మళ్ళీ కలుద్దాం..... :)




Saturday 17 January 2015

అనుభవాలు - జ్ఞాపకాలు చదివిన తర్వాత






 
చాలా రోజులుగా నాతో దగ్గరగా తన రహస్యాలు చెప్పుకున్న నేస్తం నిన్నటినుండీ నాతో మాట్లాడటంలేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడో తెలీదు. తన గురించి సగమే చెప్పాడేమో, ఇంకా నేను తెలుసుకోవలసింది అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఆఖరు పేజీ చదివాకనే తెలిసి, బాధ ఎక్కువైంది.

ఆయన జీవితం పువ్వుల బాటేం కాదు. జీవితంలో ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసమే బ్రతికి, ఎన్నో అవమానాలూ అనారణకు గురైన సందర్భాలు, కలలో కూడా మరపుకురానంతగా దీక్షబూని మరీ సాధించిన జ్ఞానం, ఏనుగంత ఎత్తు రచనలు చేయాలన్న తపన, దానిలోనే తనువు చాలించడం మహానుభావులకే సాధ్యం. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘అనుభవాలు -జ్ఞాపకాలూను’ చదువుతున్నప్పుడు నాకు మొదట ఎంత త్వరగా ఈ పుస్తకం పూర్తి చేసి కొత్తది మొదలు పెడతానా అనిపించింది. కానీ వంద పేజీలు దాటాకా వారాల భోజనం, చదువుకోసం దూరాలు పోయి కొంతకాలం అక్కడే ఉండిపోవడం, తెలియని విద్యలతో పాటు మంచి నడవడికను, మర్యాదా మన్నలను తెలుసుకోవడంతోపాటు, విద్యకోసం ఆరోజుల్లో ఇంటిని, కన్నవారినీ విడిచి అంతంత దూరాలు వెళ్ళి చదువుకోవడం చూసాకా ఆనాటి పరిస్థితులగురించి రచయిత చెప్పాలనుకుంటుంది శ్రద్ధగా చదవాలని పట్టు వచ్చింది. ఆ పుస్తకం రాసేనాటికి ఆయనకు యాభైకి పైనే వయసు ఉంటుంది. అంత వయసులో కూడా తన చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఆయన ఆత్మకథ అనేకంటే, ఆయన రచనా వ్యాసంగానికి సంబంధించిన ఆత్మకథ అంటే బాగుంటుంది. తన కులవృత్తి పౌరోహిత్యాన్ని వదిలి, సంస్కృతాన్ని పక్కనపెట్టి తెలుగులో రచనలు చేయడానికి పడ్డ ఇబ్బందులను చెప్పుకొస్తున్నప్పుడు చాలా బాధ కలిగింది. నెమ్మదినెమ్మదిగా ఆయన నాకు ఓ స్నేహితుడైపోయాడు. రోజులు గడుస్తున్నకొద్దీ మా ఇద్దరి స్నేహం మరింత గట్టిపడింది. తన గురించి నాతో చెప్పే విధానం, ఆగొంతు నాకు చాలా దగ్గరగా అనిపించాయి. పుస్తకం ఇంకా వంద పేజీలు ఉందనగా నాకు బెంగ పట్టుకుంది. అయ్యో అప్పుడే అయిపోతుందే దీనికో పొడిగింపు ఉంటే బాగుండునుకదా అని. చివరికి దాచుకుదాచుకు చదివేసాను. ఆఖరు కొచ్చేసరికి అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆయన జీవిత విశేషాలు తెలుసుకోలేకపోయినందుకు చాలా విచారం కలిగింది. పాఠకులే కాదు, ముఖ్యంగా ప్రతి రచయితా చదవవలసిన పుస్తకం అనుభవాలు-జ్ఞాపకాలూను.

ఇప్పటి రచయితకి తన కథను ప్రింటు వరకూ తీసుకువెళితేనే పాఠకునికి చేరుతుందని ఆలోచించనవసరం లేదు. దానికి చాలా సోషల్ మీడియా సహయం ఉంది. మనకు ఆయన పడ్డ పాట్లు పడనవసరమేలేదు. మంచికో చెడుకో.

ఈ ఖాళీలను పూరింపుము..!!

శ్రీశాంతి.. 28-3-2024 ఖాళీతనం ఒక్కోసారి మరీ ఇబ్బంది పెట్టేస్తుంది. అది బుర్రలో పుట్టి, ఆలోచనను కూడా ఖాళీ చేసి ఏదీ తోచకుండా చేసిప...