Monday 23 August 2021

ఎవరికి తెలుసు..

 



ఎవరికి తెలుసు 

ఇక్కడంతా నిశ్శబ్దం

తేలియాడుతున్న కోరికలు

గిరికీలు కొట్టే మోహాలు


ఈ హృదయం పడే 

వేదనను కాస్త లక్ష్యపెట్టు

ఎందుకంటే మనమధ్య

కొట్టుకుపోయే ఘడియలెన్నో

పుట్టుకొస్తాయి.


ఉద్వేగంతో ఉద్రేకంతో గాలి

పట్టుకొచ్చిన అగరబత్తీల

సువాసనలే కాదు.


వేడెక్కిన మనసు పంపే

విరహతాపాలు కూడా

కొట్టుకొస్తాయి.


కాస్త భరించు


ఎప్పుడైతే నువ్వు 

హృదయంతో పలకరించడం

మరిచిపోయావో

అప్పుడే

వెన్నెలను మరిచిపోయింది

లోకం


చీకటిలోకి తోసుకుంటూ

గోడల మీద పడిన నీడలు

నీ జాడ వెతుకుతున్నాను.


ఒక్క క్షణం కనిపించు

మసకబారిన మనసుకు

మంత్రం వేయి

Sunday 22 August 2021

జ్ఞాపకాల్లోంచి ..




 ప్రేమ ఊసు ఎత్తినప్పుడల్లా

జీవిత సారాన్ని వేళ్ళతో లెక్కగట్టి
నీటిపాయలా జారుకుంటావు..
అయినా నీ చిరునవ్వు
కోసం ప్రాధేయపడతాను.
జ్ఞాపకాల్లోంచి
తొంగి చూస్తున్నప్పుడు
వేకువనే మేలుకున్న సుర్య
బింబమల్లే కనిపిస్తావు.
ప్రేమనీ..విరహాన్నీ నీమీద
చల్లి పోతున్నప్పుడు నా
ఆలోచనామృత జ్వాలలోంచి
నిప్పుకణికవలే ప్రకాశిస్తావు.
యవ్వనం జారిపోతూనే ఉంది
దోసిలిలోని ఇసుక మాదిరి..
నేను నీ గురించే ఆలోచిస్తాను..
చమ్మగిల్లే కళ్ళతో వ్యర్థమైన కోరికను
గుప్పిట పట్టుకుని ఒంటరితనాన్ని
సాయం అడుగుతాను.

Friday 20 August 2021

యవ్వనం జారిపోతూనే ఉంది

 



యవ్వనం జారిపోతూనే ఉంది

దోసిలిలోని ఇసుక మాదిరి..
నేను నీ గురించే ఆలోచిస్తాను..
కాంతి వలయాల సాయంతో
లీలగా ఎక్కడో ఒకచోట నీ మాటలు
వినిపిస్తూనే ఉంటాయి..
కవ్వింపు లేని మాటలవి.
ఉత్త జ్ఞాపకాలుగా మిగిలిన ఆనవాళ్ళు
భావాల బంధాల్లోంచి
తొంగి చూస్తున్నప్పుడు
నువ్వు గోపురం నీడల్లోంచి
వేకువనే మేలుకున్న సుర్య
బింబమల్లే కనిపిస్తావు.
ప్రేమనీ..విరహాన్నీ నీమీద
చల్లి పోతున్నప్పుడు నా
ఆలోచనామృత జ్వాలలోంచి
నిప్పుకణికవలే ప్రకాశిస్తావు.
అప్పుడు..
నీ పెదవుల మీద ఒలికే చిన్న చిరునవ్వు
కోసం ప్రాధేయపడతాను.
జీవిత సారాన్ని నీ ముని వేళ్ళతో లెక్కగట్టి
నీటిపాయలా జారుకుంటావు..
చమ్మగిల్లే కళ్ళతో వ్యర్థమైన కోరికను
గుప్పిటిలో పట్టుకుని మళ్ళీ ఒంటరితనాన్ని
సాయం అడుగుతాను.

Wednesday 18 August 2021

మాట్లాడు..


 మాట్లాడు..

ఏ మంత్రమేస్తే నీ హృదయపు 

శిల పగులుతుంది..

ఏ హొయలు కుమ్మరిస్తే

నీ మనసు నాదవుతుంది.

నీ మౌనంతో ముక్కలైపడి ఉన్న

గుండెను బూడిద చేయకు

కాస్త సవ్వడి చేయి..మిణుమిణుకు

మని మెరిసే ప్రేమను జ్వలింపచేయి

ఏమాత్రం ఆలస్యం చేయకు

కలిసి నడిచిన దారులన్నీ

ఇప్పుడు నేనులేక మూగబోతే

ఒంటరిగా ఆదారిలో

ప్రయాణించు..

తిరిగి చూడు..ఆ వాకిలికి

నీ చూపులు తగిలించు

నా పరిమళం మళ్ళీ 

నిన్ను అల్లుకుంటుంది.

పైకిచూడు..వేల చుక్కలను

దివివిటీలుగా వెలిగించి

పట్టుకో

నా ఆత్మలోకి ప్రాణమల్లే

చొచ్చుకుని పో..

నాకోసం ప్రేమగీతాలు ఆలపించు

మళ్ళీ వసంతమల్లే నీ గుండెల్లో

పూస్తాను.

ఇకనైనా సాహసం చేయి..

భగ్న హృదయాన్ని కౌగలించుకొని

ప్రేమించు..

Tuesday 17 August 2021

ఆ ఒంటరి వర్షపు రాత్రిళ్ళు..



 ఎన్నిమర్లు ఈ వెలుతురు 

పిట్ట రాగానే జాలిజాలిగా 

రాలిపడే

పారిజాతాలమల్లే 

నిశ్శబ్దంగా నేల రాలాలి...

ఎన్నిమార్లు ఈ కన్నీళ్ళను 

కనపడనీయకుండా

లోనలోనే ఏడ్వాలి.

నగ్నత్వం నిండిన 

నీ మనసు సుఖ 

స్వప్నాలను కంటూ ఉంటే...

ఆ ఒంటరి వర్షపు రాత్రిళ్ళు 

ఎంత వేదనతో గడిచాయో...

జారిపడిన ముత్యపు చినుకుల్లా 

నా కోర్కెల్ని ఒలకబోసాను.

గుండెలు హత్తుకున్న

ఆ రెండు మేఘాలను 

చూస్తున్నప్పుడు

పచ్చని చెట్లపై వాలే

పిట్టల గుంపుల ప్రేమ ఊసులే

జ్ఞాపకం వచ్చాయి.

నవ్వకు...నేను సంతోషించి

ఎరగను. కాలం చెక్కిలిపై నువ్విచ్చిన

గోరువెచ్చని ముద్దు సాక్షిగా

ఇంకా ఒంటరినే..

Sunday 15 August 2021

గాలికి వేలాడుతున్న చెట్లు




 నన్ను వదలి నువ్వెళ్ళిన ప్రతిసారీ

ఎవ్వరూ లేని తీరానికి పోయి

దుఃఖపు పొరను అడ్డం పెట్టుకుని

ఈ ప్రాణాన్ని విడుస్తాను.

నడుస్తున్న దీపపు నీడల మధ్య

గాలికి వేలాడుతున్న చెట్లు

ఊగుతూ తలలూపుతూ

నిశ్శబ్దాన్ని ఛేదించే లోపు 

ఆయుధం కోసం ఎదురుచూస్తాను.

నడిరేయి నిదురలో కలవరింతలై

ఆకాశం కార్చే కన్నీరు ఆగితే

నిన్ను ప్రేమించడం మరిచిపోతాను.

ఈ మాయలో చేతికి దొరికిన

ఆనందాన్ని జారవిడుస్తాను.

మాటలన్నాలేని ఒంటరితనంలో

నీ తలపు పొలమారక ముందే

బయటి ప్రపంచంలోకి పారిపోతాను

Saturday 14 August 2021

నిజమైన ప్రేమకు చిహ్నాలు ఎవంటావా!


 నిజమైన ప్రేమకు చిహ్నాలు ఎవంటావా!

అవే..ఆ పూలే...అటు చూడు

ఆ పారిజాతాల చెట్టు కింద 

నిలబడినప్పుడు నీకోసం 

చూస్తూ ఆ బాల్కనీ 

మెట్ల దారిని పూజిస్తాను.

ఈ హృదయానికి 

పెద్ద అరలను అమర్చుకుని 

ఖాళీగా ఉంచుతాను.

నీవు వచ్చి ఆ నీడనే నిలబడతావని 

ఆశ పడతాను.

కన్నుల నుంచి ఇన్నాళ్లూ 

పారించిన కన్నీటి ధారకు

జవాబును అక్కడే వెతుకుతాను.

పచ్చని ఈ చెట్ల చాటున వాలిన

గోరువంకల జంట సాక్షిగా

ప్రశాంతంగా ఉండటం కోసం 

నీ సమక్షాన్ని కోరుకుంటాను.

ఈ పారిజాతాలు ఉన్నాయి చూడు

నీకోసం రోజూ పూస్తాయి.

మెరుపు మెరిసినప్పుడల్లా మెరుస్తూ 

సువాసనల్ని సుదూరాలకు వెదజల్లుతాయి. 

వెచ్చని నీ ఊహలను చల్లబరుస్తాయి.

ముళ్ళునెరగవు, 

సువాసనే వాటి చిరునామా మరి

వలపును తెలిపేందుకు గులాబీల కన్నా

ఏమాత్రం తీసిపోవు.ఒసారటుగా వస్తే నీకూ చూపిస్తాను.

Friday 13 August 2021

నీకోసం మెరుస్తాను.


 ఈసాయంత్రం నన్నో దీపం

చుట్టుముట్టి  పొగలా అల్లుకుంది

ఆ వెలుగులో

గులాబీల రంగులో

నీకోసం మెరుస్తాను.

అప్పుడూ నువ్వు మౌనంగా

నిలబడిపోతావు.

నీటి చినుకులా పాకుతూ

నీ సమక్షాన్ని అనుభూతి

చెందుతాను.

ఎన్నోమార్లు చెపుతాను

ఇది నువ్వేననీ..

ఈ నవ్వు నీకోసమేననీ

పిరికి గుండె పక్కకు

లాక్కుపోతుంది నిన్ను

చుట్టూరా కురుస్తున్న అనంత

మైన ప్రేమలో ఖైదునైపోతాను

నా శరీరాన్ని పరికించి చూస్తే సిగ్గుతో

నీ వేళ్ళ ఆనవాళ్లు కలగలపి

నిశ్శబ్దంగా ముడుచుకుపోతుంది.

నువ్వు తుఫానువై చుట్టుకుంటే

తుంపరగా, చిరుజల్లులు కురుస్తూ

దూరంగా మిగిలిపోతాను.

నీ గురించే ఆలోచిస్తున్నాను




 నీ గురించే ఆలోచిస్తున్నాను

బయట వర్షం పడుతుంది.

నీ నుంచి పారిపోలేక 

నీ ఆలోచనలోకి ఒదిగిపోయి

నాలాగే నువ్వూ 

తడిచి ఉంటావని చిన్న ఊహ

ఈ స్తబ్దత నిండిన

రాత్రుళ్ళు రాలిపడిన పూలను

దోసిళ్ళతో పట్టుకుని 

నీ నవ్వు లాంటి నవ్వుకోసం

నీ రూపం లాంటి రూపంకోసం

ఎన్నోమార్లు తరచి చూసాను.

ఈ రెండు కళ్ళకూ దిక్కుసూచిని

తగిలించి స్వేచ్ఛమైన ప్రదేశానికి

దారులు వెతికాను.

నా నిష్కల్మషపు కళ్ళకు నిన్ను

వెతకడమే పనైపోయింది

ఒకరిని ఒకరం హత్తుకుని

నడుస్తున్న దూరం మన

జీవిత కాలానికి సుగంధాన్ని

అద్దుతుందని చిన్న ఆశ...

Wednesday 11 August 2021

నీకూ నాకూ మధ్య



 నీకూ నాకూ మధ్య ఖాళీలో

కుప్పగా పోగైన బతుకు ఆశకు

మృత్యువు రొదకు మధ్య

ప్రేమ నీటి చలమలా ఊరుతుంది.

ఎన్నింటి నుంచి విముక్తి 

ప్రసాదించమని వేడుకోవాలి.

ఓ క్షణం ఇద్దరి మధ్యా ఏమీ లేదని

తీర్మానం చేస్తుంది.

మరోమారు కళ్ళు మూసి 

తలుపు చాటున నిన్నే నిలబెడుతుంది

ఒంటరి అడుగుల్లో నీ అడుగులు

కలుపుతూ...నువ్వు నాకున్నావనే

ఆశను పుట్టిస్తుంది.

మృత్యువు లాంటి ప్రేమ

బతుకు కళేబరాన్ని ఆవరించిన

అనంతమైన కాంక్ష

నేను పారిపోలేక

గింజుకుంటున్నాను.

ఈ దేహంతోటి రక్తం తోటి

వాదులాడి అలసి తిరిగి వస్తున్నాను

నువ్వు చూపించిన దారిలో ప్రేమన్నావే

అక్కడికే..

చీకటి పూసుకున్న పునాదుల

గుండా తడుములాడుతూ, 

తత్తరపడుతూ నడుస్తున్నాను.

మరోదారి లేదు.

Tuesday 10 August 2021

ఎట్లా మరిచిపోను నిన్ను



 ఎట్లా మరిచిపోను నిన్ను

కొలనులో తేలియాడే కలువను

మరిచిపోతారా ఎవరైనా..

నేనూ అంతే..

చీకట్లో ప్రతి నీడనూ 

నువ్వేనని భ్రమ పడతాను.

నా ప్రతి ఆశలోనూ నువ్వే ఉన్నావని

లెక్కగడతాను.

రాత్రికి రాత్రికి మధ్యలో నిన్ను

కలవమని గాలితో కబురు

పంపుతాను.

ప్రియా..

నీ స్పర్శ లేకుండానే కాలం

గడిచిపోయింది.

నీ కోసం వెతుకుతూ

వెర్రి చూపులతో 

దిగులు కళ్ళతో

వీధి వాకిలిలో నిరీక్షణతో 

ఈ పాదాలు అలసిపోయాయి.

నా వేయి కళ్ళనూ నక్షత్రాలుగా

చేసికొని కాచుకున్నాను.

చంద్ర వంకవు ఎట్లా మరువను నిన్ను...

Friday 6 August 2021

జ్ఞాపకం




 ప్రేమను సఫలం చేసుకోడానికి 

ఎన్ని వ్రతాలు పూనాలో

లోలోన దాగున్న నీ జాడకు 

పరిపూర్ణతను చేర్చి..

భాధారవంతో మృధురమైన 

గానం అది

నీ స్పర్శచేత పులకించిన

జ్ఞాపకం

అంతం తెలియని లోకాలకు

ద్వారాలవి

నీ ఊహతో ఈ ప్రేమను

అనుభవిస్తున్నాను.

ప్రతి నిముషాన్నీ సందేహిస్తున్న

ఈ వాంఛల్నీ భ్రమల్నీ నీ స్పర్శతో

తరిమికొట్టు

నీ కౌగిలితో ఆనంద బంధాలను

వేయి

బాటలోగాలి మేల్కొని

ఈ ఏంకాంతంలో నాకు

తొడయింది.

ప్రియా..మసక చీకటిలో

మరో రోజు గడిచిపోయింది.

నీవు తెచ్చిన ఆనందాన్ని

దేనితో కొలవమంటావు

ఈ నిశ్శబ్దాన్ని ఈ చీకటిని

ఈ దీపకాంతిలో తరిమి వేయి

Thursday 5 August 2021

మసకబారిన రాత్రి


 


పగిలి వెక్కిరించే హృదయాన్ని

మోసుకు తిరుగుతున్నాను.

వేయి కన్నీటి చుక్కలు, 

నూరు కలవరింతలు

ఈ మనసుకు ప్రేమలు,ఆశలు, 

కన్నీళ్లు లేకపోతే బావుండును.

నువ్వు పరిచయం కాని రోజుకు 

పారిపోతే బావుండును.

అస్తమించే సూర్యుని ముఖమల్లే

మసకబారి ఉంది నా మోము

నీ ఒడిలో నలిగి నశించే మల్లెల

సుగంధాన్ని వెనక్కు తెవాలని

ప్రేయాశ పడతాను.

చూడు..ఈ హృదయాన్ని 

ఆక్రమించిన చీకటిని.

వెలుగు పరుచుకోని 

మసగబారిన మూలల్ని

నిద్రలో మునిగిపోయిన

అంధకారాన్ని

ఎక్కడో చీకటి పొరలను తొలగించి

మనసులో వెలుగు నింపాలని విశ్వ

ప్రయత్నం చేస్తున్నావు.

మన మధ్య లేకుండా పోయిందేదో

మళ్ళీ తిరిగి రాదు కదూ..

Wednesday 4 August 2021

దేహపు పంజరం




తెల్లవార వస్తుంది

నిన్నటి కలే మళ్ళీ తరిమినట్లుగా

అదే ఛాయ

ఆ మాయా రాత్రికి నీ తలపే 

ఊపిరి పోసింది.

మచ్చిక కాని ఊహల్లో విహరిస్తూ

ఓడిపోయిన దిగుళ్ళను పక్కకు

నెడుతూ..

ఎన్నో క్షణాలు ముని వేళ్ళతో

లెక్కగట్టాను.

నా మనసంతా నీదన్నాను.

నువ్వు నా జాడే తెలీదన్నావు.

ఈ హృదయం ముక్కలుగా 

విడిపోయిన క్షణం అది.

నీ తేనియ కలలన్నీ రక్తం చిందిస్తూ

ఊపిరి సలపనీయని రాత్రి అది

ఏకాంతం ఈ దేహపు పంజరం

లోంచి ఎగిరిపోయిన రోజు

చంద్ర బింబం కుంకుమ వర్ణం 

పూసుకున్న క్షణం అది

నిన్ను ఆదరించలేక దూరంగా

తరమలేక నిశ్చలంగా నిలబడిపోయి

నేను..

Tuesday 3 August 2021

మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తావు.




ఆనాడే నిన్ను అడిగి 

ఉండాల్సింది. ఈ చీకటి

కూపంలోంచి నన్ను 

ఎత్తుకుపోతావా అని.

కవ్వమల్లే మనసును 

చిలికేస్తుంది నీప్రేమ.. విసిగెత్తి 

నిద్రను కళ్ళమీదకు లాక్కుంటాను.

నువ్వులేని ఏ రాత్రినీ 

మరిచిపోలేను. ఒక్కోక్షణం 

మనసులో సుడులు తిరిగి

బాధ పెడతావు

మరోసారి మంత్రమేసి 

ఒళ్ళోవాలిపోతావు.

నువ్వే నువ్వే కావాలని 

నీ సుందర రూపాన్ని 

జాబిలికి అడ్డం పెడతాను.

చివరికి వెక్కిరింపుగా 

మేఘాలు అడ్డం వస్తాయి.

ఎప్పటికి మల్లే ఉదయం

కాగానే మళ్ళీ కొత్త ఆశగా 

పుట్టుకొస్తావు.

అర్థం కాని కలవరంలోంచి 

చిరునవ్వు పులుముని 

నీకోసమే మళ్ళీ పుడతాను.

Monday 2 August 2021

గాలి కుచ్చిళ్ళు..



వర్షం వెలిసినా 

ఈ దేహపు ఆకాశాన

నీ పై కోరిక మాత్రం 

జల్లుగా కురుస్తూనే ఉంది.

లీలగా వీచే గాలి ఊళలకు

కమ్మని పాట కట్టి వేపమాను

కింద ఎదుచూస్తోంది మనసు

గాలి కుచ్చిళ్ళు సవరించుకుంది

జాబిలి నవ్వు

ఎరుపెక్కిన గులాబీల

ఛాయను అరువుతెచ్చుకుంది

ఎగిరే పక్షి ఆకాశాన్ని కొలిచి వచ్చింది

చందమామ తప్ప ఎవరూ అడ్డులేరంది

నా తనువును స్పృశించేందుకు నీ

ప్రేమ కావాలి.

మొక్కల కుదుళ్ళను ఊపేసిన వర్షానికి

సమస్తాన్ని కౌగలించుకొని పోయే ప్రేమకు

వెనుక నీ స్పర్శ కావాలి.

ప్రేమించడం తెలిసినంతగా

మరిచిపోవడం తెలియడం లేదు

మరి..

కళ్ళల్లో నీళ్ళు తిరిగి వెక్కిరిస్తాయి

నలుపు తెలుపు రంగు వెలిసిపోయి

వెర్రిగా నవ్వుతాయి.

ఆకాశాన్ని నిర్లక్ష్యంతో చూస్తున్నప్పుడు

నక్షత్రాలు జారి పరాయిగా మారిపోతాయి.

వేవేల తలలు రాల్చి నన్ను చీకటిలోకి

నేట్టేస్తాయి తూనీగలు..

ఎటుచూడు శూన్యం తప్ప 

మరేం కనిపించదు.

Sunday 1 August 2021

రాత్రి కాంతిరేఖ

 మరొకరోజు మరో సమయం...

..................

ఆ రోజుల్లాంటి రోజు 

మళ్ళీ వస్తుందా? ఏమో!

నిశ్శబ్దంగా నీ కళ్ళల్లో 

నా రూపాన్ని వెతికిన రోజు

అదృశ్యంగా దేహాన్ని తాకి



మాయమైన గాలి 

నా నుదిటిమీద నీ పెదవులు

వేసిన ముద్ర

గడ్డి కుదుళ్ళు గాలి 

వాటుకు ఊగిసలాడిన రోజు

మెరుస్తున్న నీటి తునకల మధ్య

నువ్వు ఇచ్చిన గోరు వెచ్చని ముద్దు

గతం అర్థాన్ని వాస్తవంలో తడిమి

నా తనువు నీ ఒడిలో వాలిన ఆరోజు

రాత్రి కాంతిరేఖ నిన్ను చూసి

కన్నుగీటిందే అదే రోజు

ఎక్కడికి పోయాయి ఆరోజులన్నీ

ఆ జ్ఞాపకాలను గమనిస్తూ..

అర్థాన్ని వెతుకుతూ..

ఓ సాయంత్రం నీ కౌగిలిని కలగంటూ

నేను..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...