Friday 22 March 2019

తొలివలపు....


ఉదయం ఆరుగంటల నుంచీ అప్పాజీ కొట్టుమలుపులో తనకోసం ఎదురుచూస్తున్నాను. ఈ అభిగాడి ప్రేమ గోల నా పీక్కి చుట్టుకునేలా ఉంది. శైలూ అంటే వాడికి ప్రాణం.. ఈ ఊరు వచ్చిన తరువాత నాకు అభీ తెలిసింది ట్యూషన్ లోనే. మొదటిసారి మానాన్న పంతులుగారి ట్యూషన్ లో చేర్పించినపుడు మా ఎనిమిదో తరగతిలోనే కొత్తగా చేరిన అభీని ఆయన తమ్ముడి కొడుకని పరిచయం చేసారు పంతులుగారు. అభీ నన్ను చూసి చిన్నగా నవ్వాడు. అంతక మునుపు క్లాసులో తెలిసినా ఎవరితోనూ అంతగా మాట్లాడేవాడు కాదు. ఇద్దరం ఒకే క్లాసు గనక ఒకే దగ్గర కూర్చునే వాళ్ళం. తనకు లెక్కలు బాగా వచ్చు. నాకు తెలియని విషయాలన్నీతన దగ్గరే నేర్చుకునేవాడిని. వాడికి నా అంత చురుకుదనం లేదు. కలుపుగోలు తనం తక్కువ. ఇద్దరం స్నేహితులమయితే అయ్యాం గానీ, ప్రాణ స్నేహితులం కావడానికి మరికాస్త సమయం పట్టింది.

పరీక్షలైపోయి ఈలోపు వేసవి సెలవులు రాగానే వాళ్ళ ఊరు నుండీ నాకోసం లెక్కల గైడు తెచ్చాడు. అది వాళ్ళ అన్నయ్యదట. అప్పటితో ఎనిమిది నుండీ తొమ్మిదో తరగతికి ప్రమోషన్ వచ్చేసింది. అదిగో ఇక్కడి నుండే మా ఇద్దరి స్నేహానికీ, వెరసి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఓరోజు మాత్రికలు చేసుకుంటూ బిజీగా ఉన్నాం. పంతులుగారు అరుగుమీద టీ తాగుతూ వాళ్ళ చిన్నమ్మాయికి హిందీ పాఠాలు చెపుతున్నారు. ఇంతలో మా క్లాసులో చదివే శైలు, రాజు ఇద్దరూ వాళ్ళ నాన్నతో వచ్చారు. మాస్టారు తో మాట్లాడి ఇద్దర్నీ ట్యూషన్ లో చెర్పించాడాయన. అప్పటి వరకూ లెక్కలు చేయడంలో మునిగిపోయిన అభీ శైలూనే చూస్తుండటం నేను గమనించాను.. శైలు మా ఇద్దర్నీ చూసి చిన్నగా నవ్వింది. నేనూ నవ్వాను. అభిగాడి పెదాలమీద నవ్వు చాలాసేపు అలానే ఉండిపోయింది.

అక్కడినుండీ నేను ట్యూషన్ కి వచ్చేసినా, అభీ కళ్ళు గేటుమీదనే ఉండేవి. అది ఎందుకో నాకు తెలుసు.. శైలు రావడం కోసమే అభి ఎదురుచూసేవాడు. తనకి ఎదురుగా కూర్చుని పుస్తాకాన్ని పైకి జరిపి ఆ సందులో నుంచీ శైలుని గమనించేవాడు. తనతోమాట్లాడాలని తెగ ఆరాటపడేవాడు. వాడి ఆరాటం నాకు తెలిసినా ఏం తెలీనట్టు ఉండేవాడిని.

తనతో ఏం మాట్లాడాలన్నావాళ్ళ అన్నయ్యంటే అభీకి భయం. అభీకే కాదు స్కూల్లో చాలామంది అబ్బాయిలు రాజంటే భయపడేవారు. వాళ్ళ చెల్లి జోలికి వస్తే తన్నేవాడు. పైగా అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ మా క్లాసే. ఇంకేం మాట్లాడటం. అందుకే ఇక అభీకి శైలూతో మాట్లాడటానికి  వీలు చిక్కేది ట్యూషన్ లోనే. ఇద్దరూ పోటీపడి చదివేవారు. మా పంతులుగారు కూడా వాళ్లని తెగ పొగిడేవారు. శైలుతో ఉన్నంత సేపు అభీ పుర్తిగా వేరుగా ఉండేవాడు. చుట్టూ జరుగుతున్నది పట్టేదికాదు.

ఒక్కోసారి రాజు ట్యూషన్ ఎగ్గొట్టినప్పుడు ఇద్దరూ చదువుకునేవారు. అభి ఏం మాట్లాడినా చదువు పరంగా శైలు వినేది. తనతో చురుగ్గా మాట్లాడేది. శైలూకి చదువుతప్ప మరో ధ్యాస ఉండేదికాదు. అందుకే అభీగాడి గోడు తన వరకూ చేరలేదు. ఇక ఇలానే ఈ సంవత్సరం గడిచిపోతే తనని వాళ్ళ నాన్నగారు ఊరిలో కాలేజీలో చేర్పించేస్తారనే భయం అభికి పెరిగిపోయింది. శైలూకి తన ప్రేమ విషయం చెప్పేద్దామని దానికి నాసాయం అడిగాడు. తప్పదుగా వాడు నాకు ఫ్రెండు. సాయం చేస్తాను అన్నాను. అదిగో అందుకే ఇక్కడ శైలుకోసం గంటనుండీ ఎదురుచూస్తున్నాను. తనకి ఈరోజు ఎలాగన్నా అభిగాడి బాధ చెప్పాలి. కానీ శైలూ కూడా వాళ్ళన్న రాజు ఉండకూడదు. ఉన్నాడా నా వీపు పగులుద్ది. అందుకే వాడికి నేను అప్పాజీ కొట్లో ఏదోటి కొనిచ్చి కాసేపు ఆపుతాను. ఈలోపు అభీగాడు వాడి గోడు శైలూతో  వెళ్ళబోసుకుంటాడు ఇదీ ఫ్లాను. రాజుగాడు నా మాట విని ఆగితే సరే లేదంటే అభిగాడి వీపు సాపైపోద్ది.

శైలూ ఒక్కరోజు కూడా ట్యూషన్ మానేదికాదు. ఈరోజు ఎందుకో బాగా ఆలస్యం చేసింది. అదిగో వస్తుంది.. వైట్ షర్టు, కుచ్చులున్న బ్లూ స్కట్ లోపలికి టక్ చేసుకుని రెండు జడలు రిబ్బన్ తో సగానికి మడిచి కట్టింది. పుస్తాకాల బరువు మోసుకుంటూ సత్యనారాయణ రైస్ మిల్లు దాటి మా స్కూలు గ్రౌండు వైపు వస్తుంది శైలజ. కూడా వాళ్ళ అన్నగాడు రాజు కూడా వస్తున్నాడు. కాస్త కంగారేసింది కానీ ఫ్రెండ్ కదా పైగా మాటిచ్చాను. కాస్త ధైర్యం తెచ్చుకని సైకిల్ ముందుకు పోనిచ్చాను. అప్పాజీ కొట్టు మలుపుకి ముందే మా స్కూలు గేటు దగ్గర ఏదో పనుందంటూ రాజుగాడిని ఆపాను.

శైలు ట్యూషన్ వైపు వెళిపోయింది. రాజుగాడు ఏంటిరా విషయం అన్నాడు ఏదో చెప్పి అప్పాజీ దగ్గర కూర్చున్నాం. ఓ అరగంట తర్వాత  ఇంకా  ఆపితే  వాడికి ఎక్కడ అనుమానం వస్తుందోనని ట్యూషన్ కి వెళిపోయాం.  నాకు ఒకటే ఆత్రం అభిగాడు అసలు చెప్పాడా.. శైలు ఏమంది?. కోపంతో వాళ్ళన్నయ్యకు చెప్పేస్తుందా.. లేదంటే ఒప్పుకుందా అసలు  ఏం తెలీడంలేదే... నేను వెళ్ళేప్పటికి అభీ మౌనంగా ఉన్నాడంతే.. నేను పలకరిస్తే స్కూల్లో చెపుతారా అన్నాడు.

అయ్యబాబోయ్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంకా గంటసేపు ఆగాలా.. నాకు పిచ్చిపట్టేలా ఉంది. పంతులుగారు చెపుతున్నది మెదడు వరకూ చేరడం లేదు. అక్కడ నాకు ఎదురుగా కూర్చున్న రాజుగాడు వీడెందుకు ఈరోజు ఇలా అయిపోతున్నాడు అని నావైపు కాసింత అనుమానంగా చూస్తున్నాడు.
ఎలాగైతేనేం గంట... రెండు రోజులు గడిచినట్టు గడిచింది. ఇలా ట్యూషన్ వదలగానే అభిగాడి జబ్బ పట్టుకుని నా సైకిల్ మీద కూచోబెట్టుకుని స్కూల్  గ్రౌండులోకి  స్పీడుగా తొక్కుకుని తీసుకుపోయా... చెప్పరా ఏమైంది  తనకి నీ మనసులో మాట చెప్పావా?.. చెప్పారా.. కానీ తనేం మాట్లాడలేదు... అలా అని కోపగించుకోలేదు. ఊరికనే అలా చూసిందంతే... అది ఏలా అర్థం చేసుకోవాలో తెలీడంలేదు.  చెపుతూనే గ్రౌండులోని తాటిచెట్టుకు జారబడిపోయాడు.

అదేం కాదులే.. తను అందరిలా కాదుకదా.. పైగా వాళ్ళన్నయ్య అంటే భయం కూడా.. నెమ్మదిగా తను కూడా చెపుతుందిలే.. కంగారు  పడకు అని ధైర్యం చెప్పాను. ఇద్దరం కాసేపు అదే మాట్లాడుకున్నాం. రాజుగాడి గురించి  మాట్లాడుకుని కాసేపు నవ్వుకున్నాం. 

ఇక అక్కడి నుంచీ శైలు  అభీవంక వారగా చూసేది. మా అభీ ఆ చూపుకే మెలికెలు తిరిగిపోయేవాడు. తొమ్మిదో తరగతి అయిపోయింది. పదిలో అంతా చదువుమీదనే ఉండేవాళ్ళం. సడెన్ గా ఓరోజు వాళ్ళ నాన్నగారికి మంచి ఉద్యోగం వచ్చిందని, అందరూ వేరే ఊరు వెళిపోతున్నారని తెలిసి నేను అభీ పరుగెత్తుకుని వెళ్ళాం. అప్పటికే వాళ్ళు వంతెన వరకూ వెళిపోయారు.

అక్కడే భాస్కర్ హొటల్ ముందు బస్ కోసం ఎదురుచూస్తున్నారు.  శైలు  మమ్మల్ని చూసింది. వాళ్ళన్నయ్యకు కనిపించకుండా బడ్డీకొట్టుకు ఆనుకుని నించున్నాం. అభీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయ్. శైలు చూపులూ అలానే ఉన్నాయ్. కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు ఇద్దరూ, అలా చాలాసేపు చూసుకున్నారు.
....
ఆ తరవాత అభీని ఆ చూపులు చాలా ఏళ్ళు వెంటాడాయ్.. మేమిద్దరం కలిసిన ప్రతీసారీ తన మాటల్లో శైలు గురించిన ప్రస్తావన తప్పకుండా ఉండేది. కానీ మా ఇద్దరీకీ తెలుసు బాల్యంలో తెరలా పరుచుకున్న ఆకర్షణ కుప్పగా చేర్చి దానికి ప్రేమ అని పేరు పెట్టాలంటే దానికి ఇద్దరూ సన్నద్ధంగా ఉండాలని. శైలు ఆ తరవాత ఎంత చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడినా, లేదా గృహిణిగా మారినా అభీని తాకిన అనుభుతి శైలుని తాకి ఉండలేదేమో.. అసలు విషయం తనకే తెలియాలి.

2 comments:

  1. శ్రీ శాంతి గారు.. మీరు రాసిన ," లోపలి అలలు" కళ్ల ముందు కదిలే అలలా.. అచ్చం జరుగుతున్నట్లు గా కొద్ది నిముషాలు మైమరిపించాయి.. తొలి వలపు చాలా మంది జీవితం లో జరగొచ్చు.. కానీ ఆ సంఘటనల్ని చాలా బాగా వర్ణించారు.ధన్యవాదములు. ఈ కాదని నా స్నేహితులలో ఒకరు నాకు పరిచయం చేసారు. వారికి కూడా ధన్యవాదములు..మీకు గొప్ప writing skills unnaayi..I wish u All the Best..

    ReplyDelete
    Replies
    1. నమస్తే... ఇది నా గొప్పతనం కాదు.. నాకు సాహిత్యాన్ని పరిచయం చేసి, నా వెన్నంటి ఉన్న నా గురువుది. మీ కామెంట్లన్నీ ఆయనకే చెందాలి. నేనే కాదు, నాలా చాలామంది తమలో టాలెంట్ ఏమిటో పరిస్థితులు చెపితేనేగానీ తెలుసుకోలేరు. మొత్తనికి నా అలలు మీ మనసుల్ని తాకుతున్నందుకు సంతోషంగా ఉంది. మునుముందు పోస్టుల్ని కూడా చదువుతూనే ఉండండి..
      ధన్యవాదాలు..

      Delete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...