Friday 22 March 2019

భుమిడిపాటి సోమయాజులు..





నల్లబోర్డు మీద.. "స్వారోచిష మను సంభవము" ప్రవరుని స్వగతం.. అని రాసి ఉంది.

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్....

అంతా పద్యాన్నిపెద్దగా చదువుతున్నాం... తెలుగు పుస్తకంలో తల వాల్చి ఏదో చెప్పబోతున్న మా తెలుగు మాస్టారు ఉన్నట్టుండి తలపైకెత్తి చేతిలోని డస్టర్ గల్లోకి ఎగరేసారు. అది అబ్బాయిలమీదకు పోయింది. ఆడపిల్లలంతా గొల్లుమన్నాం. నోరుమూయండి ..అంటూ గట్టిగా అరిచి మళ్ళీ పుస్తకంలో తలవాల్చేసారు మాస్టారు. ఆయనకు కోపం వచ్చేపని ఎవరు చేసినా ఇలానే బోర్డు తుడిచే డస్టర్ తో కొట్టేవారు.

స్కూళ్ళు తెరిచి అప్పటికి నెల కావస్తుంది. కొత్త యూనీఫాంలు, కొత్త పుస్తకాలు, కొత్త స్నేహితులు అంతా అలవాటైపోయారుగానీ ఇంకా ఈ తెలుగు పాఠం మాత్రం ఇంచి కూడా ముందుకుపోవడంలేదు. రోజూ అదే పద్యం. వింటే వచ్చినట్టే ఉన్నా, పదాలు పట్టుబడవే.. ఇక పదోతరగతిలోకి వచ్చి వేళ బాగోలేదేమో, మా తెలుగు మాస్టారు అదే భూ.సో మాస్టారి బారిన పడనివారంటూలేరు.

ఇస్త్రీలేని పొడవుచేతుల చొక్కా, కాస్త పలచని పంట్లాము, నుదుటికి తిరుచూర్ణం, చేతికి పాతకాలపు వాచి, వెరసి మా తెలుగు మాస్టారు భుమిడిపాటి సోమయాజులుగారు. మనిషి ఎంతో మంచి వారు. కాస్త చెవుడు ఉన్నా, ఎదుటివారి పెదవుల కదలికను బట్టి, వాళ్ళు పలికే పదాలని ఇట్టే పట్టేసేవారు. ఆయనకు నోటితో చెప్పలేక, చేతిమీద రాసి చూపించినా తెలుసుకునేవారు. తెలుగు క్లాసు జరుగుతుందంటే మాస్టారు కంఠం కంచుగా మారిపోయేది. ఇప్పటికీ తెలుగు పద్యాలు వల్లెవేస్తుంటే ఆయన కళ్ళముందు కదలాడుతారు. బిగ్గరగా గాత్రాన్ని సవరించుకుని పద్యం చదివేవారు. అలా క్లాసులో పిల్లలందరూ పాఠం నేర్చుకున్నారు అని ఆయనకు అనిపించాలి అప్పుడే కొత్త పాఠం.

ఇప్పటికీ ప్రవరుని స్వగతం... వరూధినీ ప్రవరాఖ్యులు కథంటే శృంగార కావ్యమనే ఆలోచనే తట్టదు. అల్లసానివారి పద్య కావ్యం అందాన్ని మా మాస్టారు చెప్పిన తీరు ఏమని చెప్పాలి. హిమాలయ పర్వత అందాలను, పాదలేపనంతో ప్రవరుడు ఒకచోటినుంచి మరోచోటికి ఎగిరి వెళ్ళడం, వరూధినీ కనిపించడం, అక్కడ పైనుంచి కిందకు దూకే సెలయేళ్ళు, ఆ సెలయోటి నీళ్ళు రాళ్ళను తాకే సవ్వడి, అప్పుడు వినిపించే మృదంగ నాదం ఇవన్నీ ఆయన మాటల్లో వర్ణిస్తుంటే మేము ఊహించుకున్నాం. అదంతా అందటి అద్భుతంగా వర్ణించి చెప్పడం ఆయనకే సాధ్యం అయింది. తెలుగు పదాలకుండే శబ్దాలు, స్పష్టంగా అర్ధాన్ని పలకడం ఇవన్నీ ఆయన నేర్పినవే. అందుకే మరి తెలుగు నాలాంటి వారికి కూడా ఇంతగా వంటబట్టిందంటే ఆయన పుణ్యమే. ఇప్పటి తరంలో పిల్లలు తెలుగు రాయడం, మాట్లాడటం తక్కువే.

ఇక మా మాస్టారుకి కోపం కూడా జాస్తీనే. మాస్టారు చేతిలో ఎప్పుడూ పొడవాటి ఎదురు బెత్తం ఉండేది. దానితో అరచేతిమీద రెండు బెబ్బలు గట్టిగా వేసేవారు. ఇక బెత్తం అందుబాటులో లేనప్పుడు ఆయన చేతినే మా మీద ప్రయోగించేవాళ్ళు. గట్టిగా చెవి మెలితిప్పి మరీ పద్యం అప్పగించుకునేవారు. ఆయన చెవి మెలితిప్పారంటే ఓ రెండురోజులు చెవి తోముకోవాలన్నా కుదిరేదికాదు. ఇక మగపిల్లలకి తొడపాసాల బహుమతి బాగానే ఇచ్చేవారు. బోర్డుమీద అక్షరాలను రాసేటప్పుడు కూడా ఎంతో అందంగా రాసేవారు. అక్షరాలు అందంగా రాస్తే తలరాత కూడా అంత అందంగా ఉంటుంది అనేవారు. ఆయన సంతంకం కూడా తెలుగులోనే  అని చేసేవారు.

పది పరీక్షలు దగ్గరికొచ్చాయి, అంతా పాసవుతారన్న నమ్మకం ఆయనకున్నా నామీద నాకు నమ్మకం లేదు. పైగా మాస్టారంటే నాకు భయం కూడా. హెడ్ మాస్టారు ప్రెవేట్ క్లాసులు పెట్టి పదిమంది పిల్లల్ని ఒక్కో మాస్టారుకి అప్పగించారు. ఆరున్నర, ఏడు వరకూ స్కూల్లోనే చదివించేవారు. నేను మా మాస్టారి దగ్గరే పడ్డాను. అందరు మాస్టార్లు చీకటిపడుతుందిగా పోనీలే ఇంటికి పంపేద్దాం అనుకున్నా మా మాస్టారు పంపేవారు కాదు. ఏ సబ్జట్ చదవకపోయినా వదిలేవారుగాని ముందు తెలుగు చదవాల్సిందే అనేవారు. ఆ పద్యాలు, తాత్పర్యాలు చదివి అప్పగించాకే ఇంటికి పంపేవారు. అన్ని పరీక్షలు ఏలా రాసినా తెలుగు పరీక్ష మాత్రం చాలా తృప్తిగా రాసి పరీక్ష హాల్లోంచి  గర్వంగా బైటకొచ్చాను. పది తప్పినా, తెలుగులో మాత్రం 83 మార్కులు వచ్చాయి.

ఇప్పటికీ తెలుగంటే ఇంత ప్రేమ కలిగిఉన్నామంటే అదంతా మా మాస్టారు చలవే. మాస్టారు ఎక్కడ ఉన్నా నా పాదాభివందనాలు....



2 comments:

  1. అందరి తెలుగు మాష్టారు ఇలానే ఉంటారా?... తెలుగు గొప్పతనం ఏంటో తెలియదు కానీ మన భావాన్ని పూర్తిగా వ్యక్తపరిచే శక్తిని ఇచ్చినందుకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి అనుకుంట, మనం మన తెలుగు మాష్టరుకు బాకీ పడిపోయినట్లు

    ReplyDelete
  2. బాగా రాశారు
    మా ఉపాధ్యాయుల దయ వలన తెలుగు మాష్టారు అవగలిగాను.
    గురుదేవులకి పాదాభివందనాలు

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...