Sunday 17 March 2019

ఫెహలా ఫెహలా ఫ్యార్ హే... ఫెహలీ ఫెహలీ బార్ హే,....





1.       నిశిలో శశిలాగ నిన్నే చూసాక...      మనసే మురిసే ఎగిసే అలలాగ...

3.       ఏదో మైకంలో నేనే ఉన్నాలే...    మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే...

5.       చీకట్లో కూడా నీడలా నా వెంటే నువ్వుండగా..    వేరే జన్మంటూ నాకే ఎందుకులే..


7.       నీతో ఈ నిముషం చాలులే.... :) :)


నాన్నగారి బదిలీలలో మాకు దొరికిన గొప్ప ప్రదేశం ఆలమూరు, ఆ వాతవరణమే వేరు. నా జీవితంలో చాలా ఇచ్చిన చోటుగా మిగిలిపోయిన ప్రదేశాల్లో ఈ ఊరు నిలిచిపోయింది. అమ్మానాన్న, తోబుట్టువులు తరువాత మరిచిపోని ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు నా ఫెహలా ఫెహలా ఫ్యార్ ను కలిసింది కూడా ఇక్కడే..

అప్పటికి పదేళ్ళు నాకు. అమ్మా గృహిణిగా మాత్రమే కాకుండా ఓ ఉద్యోగినిగా తన విధులకు హాజరవుతూ, ఇంట్లో మమ్మల్ని చూసుకునే బాధ్యతలో కూరుకుపోయి ఉండేది. అలాగే పతి సేవలోనూ మునిగి ఉండేది. ఇక తోబుట్టువులను వేసుకుని అల్లరి పనులు చేయడంలో నేనూ తెగ బిజీగా గడిపేదాన్ని. కొత్త ఊరు, కొత్త స్కూలు, కొత్త స్నేహితులు అంతా కొత్తే, అందులో నేను స్కూలు వాతావరణానికి అలవాటు పడాలంటే మరీ కొత్త, కష్టం. నా సంగతి అసలు అవసరం లేదే మా వాళ్ళకు. మాట్లాడితే చదువంటారు.

కానీ నాకు స్కూలు నచ్చింది. ఎందుకంటే స్కూలు పక్కనే చెరువు, దానికి ఆనుకుని రావి చెట్టు, అప్పుడప్పుడూ దానికి వేసి ఊగే ఉయ్యాల ఇలా ఆడుకోడానికి చాలా బావుండేవి. ఆ చెరువులో చిట్టి చిట్టి చేపలు, తామర పూలు భలే బావుండేవి. అయ్యప్ప స్వామివారి ప్రసాదం, మా భట్టీ విక్రమార్కుని వడపప్పు, పానకం భలే రుచిగా ఉండేవి. ఎన్నో సాయంత్రాలు ఆ గుడిలో గన్నేరు పూల సుగంధాలు నన్ను అవ్యక్తానందంలో ముంచి తేల్చి ఊయలూగించాయి. ఇప్పటికీ గన్నేరు పూలు చూసిన ప్రతీసారీ ఒక్క క్షణం నా జ్ఞాపకాల దొంతరలోని ఆ రోజులను చుట్టి వస్తాను.

అక్కడే ఆ ఊరిలోనే నేను ఫణీని కలిసాను. తన మాటతీరు, తన తెలివితేటలు అన్నీ నాకన్నా చాలా మెరుగ్గా ఉండేవి. జ్ఞానులు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్నతనంలోనే తెలివిగల వాళ్ళ జాబితాలో నిలిచిపోతారనుకుంటాను. మరి మన సంగతి అందుకు భిన్నమే. అయినా తనతో మాట్లాడాలనిపించేది. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, మేము నలుగురం, అందరం బాగా ఆడుకునేవాళ్ళం. నాలా ఒక్క ఆటలే కాకుండా తను గ్రంథాలయానికి వెళ్ళేవాడు. బాగా పుస్తకాలు చదివేవాడు. సరే నేను వెళదామని కూడా వెళితే ఆటలు ఆడటంలో ఉన్న మజా పుస్తకాల్లో ఎక్కడా కనిపించేది కాదు. ఓ వేళ చదివినా చందమామ కన్నా మరే పుస్తకం నాకు నచ్చేదికాదు. చందమామ కథలకోసం అక్కడిదాకా వెళ్ళాలా, మానాన్న చెపుతారులే అనిపించేది.

మరి తనతో ఉండాలని మరోపక్క ఇదిగా ఉండేది. ట్యూషన్ లో తనతో  కలిపి చదువుకున్నంత కాలం ఎంతో బాగుండేవి ఆరోజులు.. తనని చూడాలనుకోవడం, చూసాకా.. గీరపోవడం, నేనంటే తనకు ఇష్టమని తెలిసినా...నాకున్న గీరవల్ల తనతో తగువులు పెట్టుకునేదాన్ని, పలకరించినా పలకకుండా, “నేను రాను మీరు ట్యూషన్ కి వెళ్ళండి” అని అనేదాన్ని. పాపం ఏం మాట్లాడేవాడు కాదు. వాళ్ళ ఇల్లు చాలా దూరం అయినా చుట్టూ తిరిగి రోజూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ట్యూషన్ కి తీసుకువెళ్ళేవాడు. బాల్యం నాకు అందించిన తీపిగురుతుల్లో ఇది అంతకన్నా గొప్పగా దాచుకోవాల్సిన జ్ఞాపకమై నాకు మిగులుతుందని అప్పుడు తెలీలేదు. తనతో ఎలాగన్నా మాట్లాడాలి అనుకునేదాన్ని, వాళ్ళ ఇల్లు తెలుసుకోవాలని అక్కడివరకూ వెళ్ళి స్నేహితురాళ్ళను కలిసి వచ్చేదాన్ని కానీ... ఏదో అడ్డు...నన్ను ఆపేసేది. దానికి తగ్గట్టు మనసులో బాధను పంచుకునే వయసు నాకు లేకపోవడం కూడా ఓ కారణమేనేమో... తెలీదు. 

వీటిలో ఎన్ని తీపిగురుతులో గళ్ళాచొక్కా వేసుకుని పొట్టినిక్కరుతో తను కాలవగట్టు మీద కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నాడు... ఈ వీధి చివరినుండీ ఎర్రటి లంగా జాకెట్టులో రెండుజళ్ళు వేసుకుని వస్తున్నాను. రెండు వ్యతిరేఖ దృవాలు ఆకర్షించుకుంటాయంటే అర్థం అప్పుడే తెలిసింది. తన కళ్ళల్లో చిన్న వెలుగు. నాలో సంబరం. తనని దాటుకుని కుండలోళ్ళు కాలనీలోకి వెళ్ళిపోయానుగానీ.. వెళ్ళి చేయాలనుకున్న పనిమరిచిపోయాను. 

ఓరోజు నాకోసం మా ఇంటికి గ్రీటింగ్ కార్డు తెచ్చాడు. ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. ఇవన్నీ నాకోసమే చేస్తున్నాడు అని తెలిసినా తరువాత ఏం చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడున్నంత ప్రపంచ జ్ఞానం అప్పుడు ఏడిచింది కాదు. లేదంటే కథ వేరేలా ఉండేది.

ఓసారి సాహసం చేసి ట్యూషన్ అయ్యాకా నాచేతిలో ప్రేమలేక పెట్టాడు. అదే నేనే తన చేతిలోది లాక్కున్నా.. అది చూసి ఏం చెప్పాలో తెలీదు. తనకి మా అమ్మ తిట్లు పడ్డాకా.. నాతో అలిగి మాట్లాడటం మానేసాడు. నేను ఎంత బతిమాలినా మాట్లాడలేదు. ఇప్పటికీ ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని తన గురించి తలుచుకుంటే గబుక్కున ఏం గుర్తుకు వస్తుందో తెలుసా... పెద్ద బడి వరండాలో తను నించుని ఉన్నాడు, ఆ గోడకు ఇవతల కొట్టు అరుగు మీద నేను నించున్నాను. మా మధ్య వర్షం అడ్డుగా ఉంది. ఆ అడ్డును పట్టించుకోకుండా ఇద్దరం అలా చూసుకుంటున్నాం. ఎంతసేపో తెలీదు.

చివరికి విడిపోయే క్షణంలో కూడా తనని కలవాలని తెగ చూసాను. కానీ కలవలేకపోయాను. ఏమో కలిసి నేను ద్వారపూడి వెళిపోతున్న సంగతి చెప్పి ఉంటే ఎంతో బాగుండేది అని అనిపిస్తుంది ఇప్పుడు. తరువాత అది ప్రేమ అని తెలిసినా నేను సాహసించలేకపోయాను. ఆడపిల్ల జీవితంలో తోడుకోసం కలలు గనే ప్రతి క్షణంలోనూ తనే నాకు గుర్తుకువచ్చేవాడు. ఆ తరువాత నా జీవితంలో ప్రేమ పుట్టిన క్షణాలు మరి రాలేదు. చాలా వరకూ ప్రేమించాల్సిన అవసరం మాత్రమే కలిగింది.

దేవుడు మనకు ఏం కావాలో గట్టిగా కోరుకుంటే ఇచ్చేస్తాడనే మాటను ఇప్పుడు చాలాగట్టిగానే నమ్ముతున్నాను. ఎందుకంటే దాదాపు పదిహేనేళ్ళకు తను మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చాడు. ఇక ఎప్పటికీ ఉంటాడు కూడా. మనం ఇష్టపడ్డ వ్యక్తి మరో వ్యక్తిలా కాకుండా, మనలానే ఎప్పుడైతే కనిపిస్తాడో అదే అసలైన ప్రేమని నమ్ముతాను. ఎప్పటికీ ఇదే నా ఫెహలా ఫెహలా ఫ్యార్.

2 comments:

  1. "లేదంటే కథ వేరేలా ఉండేది"- ఇంత కన్నా ఇంకా వేరుగా కోల్పోయిన క్షణాల గురించి ఎవరైనా ఏమి చెప్పగలరు☺️

    ReplyDelete
  2. ఫెహలా ఫెహలా ఫ్యార్. ఛాలా భాగుంది.

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...