Wednesday, 11 December 2024

సాక్ష్యం ఏదీ..



ఇంకిపోయిన ఇష్టాల ఆనవాళ్ళు తడుముతుంటే.. కాలానికి అడ్డంపడి చక్రాల కింద మన ప్రేమ నలుగుతుంది.
తొలిపొద్దు మలిపొద్దుగా
మారి జారిన కాలానికి పరుగందుకుంది.. 

జోలపాటగా మారిన ఊసులన్నీ ఏమైనట్టూ ఊరికే ఊగాడిన మనసు బాసలన్నీ ఎటు వైపుగా దారి తప్పిపోయాయి.. ఈ మనసు గురుతులు తప్ప మరే ముంది సాక్ష్యం

చుట్టుకున్న చలిగాలిని ఆపాలనీ
ఆ నెగళ్ళ చుట్టూ చలికాచుకున్న కాలాన్ని.. జ్ఞాపకాలలో చేర్చాగలనా.. 

ఎన్ని ప్రేమ సందేశాలు పంపాను
దేనికీ జవాబు లేదు. 
నీటి పొరలు కళ్ళకు అడ్డంపడి
మసకబారిన చూపులకు ఎటు
చూడు నీ రూపమే.. 

ఎన్ని రోజులని వెతకను
ఆత్రపడే మనసు కరువైపోయాకా
మిగిలిన ఈ శూన్యాన్ని పేర్చుకుంటూ.. పోతున్నాను.

Sunday, 29 September 2024

నీలోకి ఒలికిపోయాననీ..



ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది.. 
కొన్నిసార్లు అనిపిస్తుంది. 
నేను నీలోకి ఒలికిపోయాననీ.. 

నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి వీడ్కోలు పలికాను.
అసంపూర్ణంగా ఉన్న చాలా ప్రశ్నలకు జవాబులు వెతికాను.

నీకిదంతా ఉత్త చాదస్తంగా 
అనిపిస్తుంది కానీ..
రద్దీ రద్దీ దారులంట పోతున్నా 
నీ ఆలోచన నిలువనీదు.

ఏదో కంగారు..
పూల దారులంట నడిచినా మబ్బులు, మెరుపులు, చినుకులు..నువ్వు కమ్మేసినట్టూ ఉంటుంది. 

ఉదయాలన్నీ నక్షత్రాల వేళలోకి కలిసిపోయేవేలే అనే భావన కలుగుతుంది. 

విషాదాన్ని మోయగలిగేది, 
కన్నీరును ఆపగలిగేదీ నీ ఊహే
నాలోకి తొంగి చూసుకున్నా నువ్వే.. నమ్ము

Tuesday, 24 September 2024

మనసు ఆగం అయిపోనాది.. థ్యాంక్యూ 'సన్ ఆఫ్ జోజప్ప'



ప్రతి జీవితానికి దాటి వచ్చిన దారి ఒకటి ఉంటుంది. పుట్టుక నుంచి చావుదాకా దాటేసి వచ్చిన బాల్యం, కౌమారం, యవ్వనం ఇలా దశలన్నీ దాటి వచ్చి అనుభవాల మధింపులో పూర్తిగా జీవిత పరమార్థం తెలుసుకుని నిలబడేందుకు పట్టే సమయం అంటూ ఒకటి ఉండే తీరుతుంది. ముఖ్యంగా ఈ దశలన్నింటిలోనూ ప్రధానమైనది బాల్యం. బాల్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే మోస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ బిడ్డల చూట్టూ ఉండే వాతావరణం, పెరిగే తీరు, మాట్లాడే మాట, బంధాల పటుత్వం, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, సమాజం కూడా వాళ్ల పెరుగుదలను శాసిస్తుంది. ఇదంతా వేదంతంగా కనిపించినా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య దశ బాల్యమే. బాల్యానికి అమ్మానాన్నల ప్రేమతో పాటు చాలా కావాలి. పుట్టుక మనచేతిలో లేనట్టే పెరిగే విధానం కూడా మన చేతిలో లేదు. నాకు తెలిసి బాల్యం ఇంత ప్రాధాన్యమైన దశ అని నేను నొక్కి చెప్పడానికి చాలా కారణాలున్నాయి. బాల్యంలో భయం తెలియక పెరిగే విధానం ఒకలా ఉంటుంది. భయం తెలిసి పెరిగిన పిల్లల తీరు మరోలా ఉంటుంది. అసలు బాల్యమే శాపంగా మారిన పిల్లల జీవితాలు కూడా నేను చూసి ఉన్నాను. మనం మామూలుగా అనుకునే చాలా విషయాలు పిల్లల మనసుల్లో ఎంతగా ముద్రవేసుకుంటాయో..


ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలారోజులు అయింది నేనో పుస్తకాన్ని పూర్తిగా విడవకుండా చదివి. చలం ప్రపంచం నుంచి పక్కకు వచ్చి చదివిన పుస్తకం, కథ ఏదైనా ఉందంటే అది మెహెర్ పుస్తకమో, కథో మాత్రమే అవుతుంది. అలాంటిది ఆయన చదివి ఇచ్చిన 'సన్ ఆఫ్ జోజప్ప', సోలోమాన్ విజయ కుమార్ గారు రాసిన ఈ నవలను ఈరోజే పూర్తి చేసాను. కథ తీరు గురించో, కథ శైలి గురించోకంటే ఓ పసివాడి మనసు కనిపించింది నవలంతా. చాలా దగ్గరగా పరిశీలించి చెప్పిన విధంగా అనిపించింది. ప్రతి డిటేల్ అంత చక్కగా ఇవ్వగలగడం విషయంలో రచయితకు నెనర్లు.. లోతుగా చెప్పిన ప్రతి విషయం నేరుగా గుండెల్లో దిగింది. శాపం బాల్యానిదే కాదు పిల్లగాడి జీవితంలోనే ఉంది. పుట్టుక తన చేతిలో లేదు దానికన్నా విషమమైన పరిస్థితులు.. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం, తల్లి మరో దారిలో వెళ్లడం, మేనమావలు సరిగా పట్టించుకోకపోవడం, చులకనగా చూడటం, పుట్టుకతో వచ్చిన (వైకల్యం) మార్పుతో రోజురోజుకూ మథనపడటం ఇలాంటి విషయాలు చాలా దగ్గరగా గమనించి చెప్పినట్టుగా అనిపించాయి.

గతంలో చదివిన మోహన స్వామి నవల ఎప్పుడూ తెలియని విషయాలను, అసలు ఆలోచనకు రాని సంగతులను తెలిసేట్టూ చేస్తే, ఈ నవల మాత్రం ఆ ప్రపంచానికి మరో ద్వారాన్ని తెరిచినట్టుగా అనిపించింది. ఇది ఓ మనిషి రొద. అతనికి మాత్రమే తెలిసిన ప్రపంచం, పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, డైరీ రాసుకోవడం, చిన్నతనంలో పోయిన నాన్నను దైవంలో చూసుకోవడం, కోరిక కన్నా మించిన ఆత్మీయతను కోరుకోవడం ఇవన్నీ కాస్త భిన్నంగా తక్కువ మందికి మాత్రమే దక్కే ఆత్మీయ ఆలింగనాలు.. మనసు భారాన్ని, లోపలి కల్లోలాన్నీ చెప్పుకునే దారి ఆపిల్లాడికి అవిమాత్రమే అయ్యాయి. తల్లిచాటు బిడ్డగా బ్రతకాల్సి రావడం, అన్నీ తెలిసీ పరాయివాడిని నాన్నా అని పిలవాల్సిరావడం, అతని చేతిలో పెరిగిన విధానం, భయం, నలుగురిలో పొందిన అవమానాలు, మానసిక సంఘర్షణ పూర్తిగా అతనికి మాత్రమే సొంతం అయిన బాధ అది. మరో హృదయానికి తెలిసే అవకాశమే లేని బాధ.

ఇక్కడ ఎక్కడా నేను sexuality గురించి మాట్లాడటం లేదు. అది పూర్తిగా ఎవరి చేతిలోనూ లేనిది. అతనిలోని బాధను మాత్రమే కేంద్రంగా చేసుకుని చెప్పాలనేది నా ఉద్దేశ్యం., ఒకడు ఎందుకు తీవ్రవాదిగా మారాడు, లేదా హంతకుడిగానో, పిరికిగానో మారాడంటే దానికి వెనుక బాల్యం నుంచి పెరిగిన, చూసిన పరిస్థితులే కారణం అవుతాయని నేను బలంగా నమ్ముతాను. విజయ్ కుమార్ గారు రాసిన ఈ కథలోని సుధా, సిన్నమ్మ, అమ్మ, బాబు పాత్రలన్నీ పిల్లాడి చూట్టూ వాడు అనుభవించే మనసు ఘోషను పట్టించుకున్నవి కాదు. అవ్వ, లింగ దగ్గర మాత్రమే పిల్లాడికి ప్రేమ, ఔదార్యం దక్కాయి. అతగాడి మనసులోని బాధను అర్థం చేసుకోగలిగాయి. పుట్టుకతో వచ్చిన తేడాలను వేలెత్తి చూపగలిగితే.., వెలుతురు రాగానే దైవాన్ని కొలిచే ఎందరో చీకటి పడగానే వెతికే ఈన్యానికి, చీడకు ఎన్ని పుస్తకాలు రాయాసినా సరిపోదు. సమాజం చూసే చూపు, మాట్లాడే విధానం, ఎదుటివారిని తమలోకి తీసుకునే తీరు ఇవన్నీ అతని కులం, మతం, ఆస్తి అంతస్తుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇప్పటి రోజుల్లో. అందుకే బాల్యంలో స్నేహంలో ఉండే అమాయకత్వం, పెరిగి పెద్దయ్యాకా అదే బాల్య స్నేహితుల మధ్య కరువైపోతుంది. స్టేటస్ మధ్యన వచ్చి చేరాకా, స్నేహానికి తూట్లు పడటం ఎంత గొప్పవారికైనా ఎదురయ్యేదే.

మళ్ళీ కథలోకి వస్తే పిల్లగాడు నాకు చాలా బాధను చెప్పుకున్నాడు. అతగాడి బాధను అమ్మగా విని, ఓదార్చాలనిపించింది. పిల్లగాడు సమాజం కన్నా తల్లికి చెప్పుకోలేక పడే బాధే ఎక్కువగా కనిపించింది. కథ సాగిన తీరు, ప్రతి మనిషిలో రగిలే కోరిక వెనుక పడే పాట్లు చదువుతుంటే మనిషికి కావాల్సిన కనీస అవసరాల్లో సెక్స్ అనేదానికి ఇంత పాత్ర ఇవ్వాల్సిరావడం మనిషికి అసలైన శాపం అనిపించింది. ఈ నవలలోని కథ మొదలు కావడమే పిల్లగాడితో మొదలవుతుంది. వాడి అయోమయానికి, అర్థంకాని తనానికి జతగా మనం నడిచి కథలోకి వెళ్ళడానికి కాస్త తిరుపతి యాస అడ్డంపడాలని చూస్తున్నా పిల్లాడు చేయిపట్టుకుని తనతో పాటు నడిపించుకుని తీసుకుపోతాడు. విజయ్ కుమార్ గారి రచనకు, పాత్రలను దగ్గర చేసిన విధానానికి మరోమారు మంగిడీలు.. థ్యాంక్యూ..

బాల్యం లెక్కలు..


ఇప్పటి నేను ఏ హీరోనూ ఫాలో కాను. ఫ్యాన్ అస్సలే కాను. ఏ రాజకీయ నాయకులతో నాకు పనిలేదు. ఎవరికీ నేను మద్దతులు ఇవ్వను. ఇదంతా స్వవిషయం. సరే దేవానంద్, షమ్మీ కపూర్, గోవిందా, ఇలా కొందరిని మాత్రమే ఆరాధించే నాకు చిన్ననాటి జ్ఞాపకంలో ఓ హీరో అలా నిలిచిపోయాడు. ఎంత ఆరాధనో అది. అతని పోస్టర్ ఎదురుగా కూర్చుని ఎంత ఆలోచించేదాన్నో, ఇంటి నిండా సినిమా పోస్టర్లు అతికించే రోజుల్లో పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. తాటాకు తడికలకు సినిమా పోస్టర్లు అతికించేవారు, హోటళ్లకు, ఇళ్ళల్లో కూడా అలా అంటించడం అలవాటుగా ఉండేది. ఇప్పటి రోజుల్లో అయితే గోడ పాడవుతుందని, పెయింట్ పోతుందనే గొడవ అప్పుడు లేకపోవడం సంతోషం. అప్పటి ఊహ, ఆలోచనలు భలే ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటి రోజులకు పూర్తి భిన్నంగా..
కొన్ని జ్ఞాపకాలు ఎంత తీవ్రంగా బలపడిపోతాయంటే ఎంత కాలం అయినా అలా నిలిచిపోతాయి. ప్రేమ అనే మాటకొస్తే అది పుట్టేందుకు వయసుతో లెక్కలు వేస్తాం కానీ.. అప్పటికి ఆరేళ్ళు కూడా లేని నేను ఇతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎవరో ఏంటో కూడా తెలీదు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికి, ఈరోజు వరకూ కూడా అతని కోసం చూసానంటే నమ్మండి. ఈవేళ ఏదో రీల్ చూస్తుంటే కనిపించాడు. వెతగ్గా అతనే ఇతనని తెలిసి ఆశ్చర్యం వేసింది. పేరు కనుక్కుని చూసాకా నా ఆనందం విలువ ఇంతని చెప్పలేను. ప్రేమో, ఆరాధనో మరేదో.. మనిషిని చూసి పుట్టింది కాదు. నాయనమ్మగారి ఇంటికి అతికించిన చిన్న ఫోటో అక్కడే చక్రవర్తి అని రాసి ఉండేది. అది చూసి అతని పేరు చక్రవర్తే అని చాలా ఏళ్లుగా అనుకుంటూ వచ్చాను. తలమీద క్యాప్‌తో, మంచి స్టైల్‌తో ఉండే అతగాడి పోస్టర్ నా జ్ఞాపకాల్లో బలపడిపోయింది.
నాయనమ్మ ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ గుమ్మానికి కాస్త దూరంలో అంటించిన ఈ పోస్టర్ దగ్గరకు వెళ్ళి అతన్ని చూసాకనే ఇంట్లోకి అడుగు పెట్టేదాన్ని. చాలా ఏళ్ళకి నేను వెళ్ళేసరికి ఇంటికి సున్నంవేసాకా ఆ పోస్టర్ కనిపించలేదు. నాయనమ్మను అడిగితే సున్నంవేసేవాళ్ళు తీసేసారని చెప్పింది. ఎంత దుఃఖం అంటే పైకి మామూలుగా ఉంటూనే తెగ ఏడుపు వచ్చింది. చాలా రోజులు అతను సినిమా పత్రికల్లో కనిపిస్తాడని శివరంజనిలో వెతికేదాన్ని ఎప్పుడూ కనిపించలేదు. ఇదిగో ఈరోజు దొరికింది అతని అసలు పేరు..కబీర్ బేడీ అట.. అప్పటి నా బాల్యానికి పరిచయం అయిన హీరో.. భలే హ్యేపీ నేను.
May be an image of 1 person, beard and suit

Friday, 20 September 2024

గన్నేరు అక్షరాలు..

 

అలవోకగా కవిత పుట్టడం లేదు.
లోతుగా తవ్వి తీయాల్సి వస్తుంది.
ఒక్కోసారి తెగి, ముక్కలై దొరుకుతాయి
అక్షరాలు

మరోసారి కన్నీళ్ళు పెట్టించే పంక్తులు పొంగుతాయి.
విరహంతో, ప్రేమతో నిండి
రేపటిపై ఆశను పట్టుకువస్తాయి.



చుక్కలు రాలిపడి, నెత్తురోడుతున్నట్టు
వస్తుంది ఆలోచన.
అమృతాన్ని నింపే పంక్తులు,
ఆలోచనలై రాలిపడే గన్నేరు అక్షరాలు
విషాదపు సంగతీ, హృదయాంతరపు
సంతోషాన్నీ గుర్తుచేస్తుంది.


అగాధం నుంచి అనంతం దాకా
నాలోని చీకటి కోణాలన్నీ
కవిత్వానికి ఎరుకే..

దిగులప్పుడు, ఆనందాన్ని ఎకరువు
పెట్టేప్పుడూ మాటలను
సంభాళించేది ఈ కవిత్వమే మరి..



Tuesday, 17 September 2024

గాయం



చీకట్లో ఓమూల విడిచిపెట్టి పోయే దైన్యాన్ని తగిలించాను.
ఒక్క చుక్క అమృతం కోసం సముద్రలోతుల్ని గాలించాను.
ప్రశ్నించే నీ కళ్ళలో అమృత జాడల్ని వెతికాను‌.
ఏదీ దాచుకోలేదు, జీవితాన్ని తెరచి నీముందు ఉంచాను.

ఇదేం హృదయభారమో తెలీదు.
ముళ్లను దాటే అవరసమే ఎప్పుడూ
సంతోష ఛాయల్ని వెతుక్కోవడమే
ఎప్పటికప్పుడు బాటసారినై

ఒదలని పాటలా కమ్మేసుకుంది
నీ జ్ఞాపకం.

నీ మాటలు ఉండుండీ అర్థం కావడం లేదు.

నిన్నటి ఉదయాన గుండెలకు హత్తుకున్నా కూడా.. తృప్తి కలగలేదు.

హృదయాన్ని ఇచ్చేసుకోవడమే తెలిసిన నాకు

గాయాల సలుపు ఎప్పుడూ పరిచయమే.. (శ్రీశాంతి మెహెర్ )

Friday, 19 July 2024

అలరాసపుట్టిళ్ళు).. అదే ఇప్పుడైతే.. సత్యవతి ఏం చేసేది..?


మనసుకు ఏది హాయి.. ఏది సోగయం, ఏది మైకం, ఏది మరపు రత్నాలలో లేని సొగసు, మణులలో లేని మెరుపు, ధనంలో, బంగారంలో నగల్లోలేని ఆనందం మంచి మనసులో, ఆప్యాయతలో ఉంది. స్వచ్ఛమైన మనసులు ఎందుకు అల్లుకుంటాయో తెలుసుకునే లక్షణం కొందరికే సొంతం. నిశ్చలమైన ప్రేమ, అరమరికలు లేని ప్రేమ విజయం సాధించాలంటే.. ఈ భారతావని మెదడు పురిటి బిడ్డంతే ఉంది మరి. కులం, మతం, ధనం, అంతస్తుల తూకాల మధ్య వేలాడుతుంది. పరువు ప్రతిష్టల అంచుల తేడాలో తూగలేక ఊగిసలాడుతూనే ఉంది. 

ఆడదాని మనసు ఎరిగి వివాహాలు జరిగితే ఇక చెప్పేదేముంది. ఆడదాని మనసు తెలుసుకోగలిగితే ఇక ఇంత ఉపోద్ఘాతం ఎందుకు. మనసులో మాయలేని మనిషిలేడు. ఉన్న కాస్త జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసుకుని, ఆస్తులనీ, అంతస్తులనీ, బంగారాలని, పరువని, నరకానికి ద్వారాలు తెరిచేది మనమే..

ఆ మండువాకి సత్యవతే అందం. ఆమె లేని ఇల్లు పాడు బడింది. చెప్పుకొచ్చిన కథలో.. తొలి పేరాల్లోనే బీటలువారిన నేల, పగుళ్లు తేలిన వసారా, మండువా, గోడలు, ఎటు చూసినా ఈన్యం. ఎటు చూడు నిర్మానుష్యంతో, నిర్లక్ష్యంతో  ఉన్న ఆ చావిట్లో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆఖరి ఘడియల్లో ఉన్నాడు సుబ్బారాయుడు. అతని కోసం పట్నవాసం పోయిన తమ్ముళ్ళు, మరదళ్లు చూట్టాలు వస్తున్నారు. కడ చూపు చూసేందుకు. ఎవరు వచ్చినా ప్రాణం పోయేదే.. 

వెనుకటి కథనంతా నెమరేసుకుంటుంది అక్కమ్మ. ఆ ఇంటి సౌభాగ్యం, వెలుగు సత్యవతే. చిట్టి చిలకతో ఆటలాడుతూ ఇల్లంతా కలియతిరిగడం నుంచి అమాయకంగా చెంగయ్యరాయుడి మీద చూపించిన ప్రేమ వరకూ ఉత్త పిచ్చి పిల్ల సత్యవతి, ఆ ఇంటికి ఓ పెదపాలేరల్లే వచ్చాడు చెంగయ్యరాయుడు అక్కడి వాళ్ళు అలానే చూసారు అతన్ని, మరి అతగాడు ఆమె మీద వల్లమాలిన వాత్సల్యం చూపించాడు. పెద్దలకిదేం పట్టలేదు.ఈర్ష్య పడ్డారు. కసురుకున్నారు, నలుగురూ గమనిస్తారేమోనని కంగారు పడ్డారు.  

ఎక్కడ పరువు పోతుందోనని మునసబుగారు మాట్లాడి పంపేసాడు. డబ్బు సంపాదించుకు వస్తానని చెప్పి దేశం పోయాడు చెంగలరాయుడు. డబ్బు తెచ్చేదాకా ఆగినవారేనా.. పిల్లకి పెళ్లి చేసి పంపేసారు. తొలిరాత్రి ముస్తాబు కాగానే అత్తారింటి నుంచి పారిపోయింది సత్యవతి. పోలాలకు అడ్డంపడి , వాగును దాటి ఇంటికి చేరుకుంది తెల్లారకట్ట. ఆమెని చూసి ఇంట్లో అంతా నోళ్ళు నొక్కుకున్నారు. వదినలు శాపాలు పెట్టారు. అన్నలు తలలు దించుకున్నారు. 

వాళ్లకు పరువు సంగతే కానీ, పిల్లదాని మనసు అక్కర్లేకపోయింది. అదే అర్థం అయితే కథేముంది ఇక. మళ్లీ పంపారు కాపురానికి, దయ్యం పట్టిందన్నారు. పూజలు చేయించారు. ఊరంతా చెప్పుకుంటుందని, ఆడి పోసుకుంటుందని తెగ ఇబ్బంది పడిపోయారు. ఎవరికీ ఆమె మనసు అక్కర్లేదు. ఎవరికీ ఆమె ఊసు లేదు. చిలకమాత్రం పంజరం నుంచి పాట పాడేది. తన ఇంటికి రాకపోతే ఎటు పోతుంది సత్యవతి. 

మళ్ళీ వచ్చింది పుట్టింటికి, మళ్లీ మళ్లీ వస్తూనే ఉంది. అన్నలకు పరువు మీద బెంగేసింది. ఓనాడు నరికేస్తానన్నాడు పెద్దన్నగారు అత్తిల్లు దాటి వస్తే.. కూడా తీసుకెళ్ళి దింపి వచ్చాడు. అదే ఆఖరు ఇక సత్యవతి మళ్ళీ రాలేదు. అత్తవాళ్ళు తమ దగ్గరకు రాలేదన్నారు. మునసబుగారు మంచం పట్టాడు. బెంగ పడ్డాడు. ప్రాణం విడిచాడు. సుబ్బారాయుడి తీరులో కూడా మార్పు వచ్చింది. నెమ్మదిగా దివాణం అంతా కరిగిపోసాగింది. కోడెద్దులు, పాడి, పంట, సంపదా అంతా తరిగిపోయాయి. ఈన్యం అంతా ఆవరించింది. అప్పులు మిగిలాయి. ఒక్కొక్కరుగా ఇల్లు వదిలి సంసారాలను పట్నం తీసుకుపోయారు. ఎవరికీ ఆ ఇల్లు అచ్చిరాలేదు. సుబ్బారాయుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఆ మొండి గోడల మధ్య మొండిగా కాలం వెళ్ళదీసాడు. 

ఇప్పుడు ఆఖరి రోజులు అంతా చుట్టూ ఉన్నా సత్యవతి గురించి ఎదురుచూస్తున్నాడు. అన్నట్టు సత్యవతి ఎటుపోయింది. ఎక్కడకు పోయింది. అదీ అతను మాత్రమే చెప్పాలి. అతనే చెప్పాడు చివరిగా తను రాదని, వాగులో కొట్టుకుపోయిందని, నా చేతులతోనే వాగులోకి వదిలేసానని. ఆ మనో వ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. 

ఇంతకీ సత్యవతికి ఏమైంది. పరువుకోసం ప్రాణాలు వదిలేసిందా.. తను చనిపోతానని ముందే తెలుసా.. అసలు ఊహకైనా ఆ ఆలోచన ఉందా ఆమెకు. పదే పదే పుట్టినింటికి ఎందుకు వచ్చింది. ఎటుపోతుంది పాపం ఆమెకు ఏం తెలుసును. ఆ ఇల్లుకాకపోతే మరేం ఎరుగుదును. 

అదే ఇప్పటి సత్యవతి అయితే ఏం చేసేది? 
పెళ్ళి ఇష్టంలేదని తెగేసి చెప్పేదా.. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయేదా.. లేక పెళ్ళి చేసుకుని వెళ్ళినా భర్తను మట్టుబెట్టి, ప్రియుని చేరుకునేదా.. లేక పతివ్రతగా మిగిలిపోవాలని అత్తింటి పరువు నింపే మహా ఇల్లాలుగా మారిపోయేదా.. ఏమో.. ఏమైనా కానీ..

(కళ్యాణీ సుందరీ జగన్నాథ్ .. చక్కని రాత, శైలని చెప్పడం తేలికే.. కథరాయగలిగితే రాత అదే వస్తుంది. కానీ ఎక్కడ పట్టుకుందో ఈ కథని, ఎక్కడ చిక్కిందో ఆమెకు సత్యవతి, ఎక్కడ చూసిందో, విన్నదో ఈగాథ, ఎలా ఎలా ఆమె మనసులో పురుడు పోసుకుందో కదా.. ఎంత అన్యాయం అయిపోయింది సత్యవతి అని మనసు మెలితిప్పుతుంది. అదే నేనైతే...... ఏమో)

Thursday, 16 May 2024

ఆ రోజులకో వాసనుంది

ఆ రోజులకో వాసనుంది..
17-5-2024 శ్రీశాంతి మెహెర్
.................................

ఆ రోజులకో వాసనుంది.
అమ్మలాంటి కమ్మనైన వాసన 
నేతి ముద్దలు తిన్న కమ్మదనం అది

వెన్నెలంత చల్లదనం
స్వేచ్ఛ తప్ప మరో మాట తెలీని రోజులవి
కాళ్ళకు పరుగు తప్ప, అలసట తెలీదు..
బద్దకంగా పక్క దులిపిన రోజులు

మిక్చర్ పొట్లం తెచ్చిన గొడవలో
గోళ్ల రక్కులు, పంటి గాట్లు
తమ్ముడితో కుస్తీపట్లు

అమ్మతనం చేతకాని రోజుల్లో 
పెద్దరికాన్ని భుజాన వేసుకుని 
అరిందాతనం

ఆ రోజులకో వాసనుంది..
కమ్మదనం తప్ప మరో మాట
తెలీని రోజులవి. 

తిరిగిరావు.. తెంపి తెచ్చుకోలేము
మనకు పుట్టిన బిడ్డల్లో బాల్యాన్ని 
కాసేపు చూసి మురిసిపోగలం 
మహా అయితే..

Friday, 5 April 2024

పొడిబారిన ముద్దు..



కొన్నాళ్ళుగా నీ ముద్దు
పెదవుల్ని అంటడం లేదు..
తడారిపోయింది
చప్పగా.. జీవం లేనట్లుగా..
మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా
ఈ ముద్దే తరుముతోంది
పెదాలను మెలితిప్పుతూ.. నాలుకతో
స్నేహం చేస్తావు చూడు అదే ముద్దు
నన్ను వెక్కిరిస్తుంది.
వెచ్చని నీటి ఆవిరిలా అలముకుంటూ
అదే ఊహ..
దూరంగా జరిగిపోతున్న జ్ఞాపకాలతో
తెంపుకోలేని సంకెల ఈ ముద్దు
గాఢంగా హత్తుకుంటూ
పెదాలతో ప్రేమను బట్వాడా
చేస్తావు చూడు,, అదే ముద్దు
కదిలిపోతున్న ఆలోచనల్లా
గుండెల్లో గుబులు పుట్టిస్తో
వడపోతల రాపిడితో
ముద్దు చుట్టూనే ఆలోచన
ఎంత తెంపినా తెగని రొదలా
కాలంతో పోటీపడి పొడిబారిపోతోంది.

Thursday, 4 April 2024

మంకెన్నలందం..4-4-2024


ప్రేమిస్తాను ఎప్పటికీ.. 
నిదురతో వాలిపోయే కళ్లను నిటారుగా చేసి,  
రాధామాధవాలంత మనోహరంగా నీరాక కోసం చూస్తాను..

ఆరు బయట సాయంత్రాలు విచ్చుకునే
చంద్రకాంతలనడుగు
గుమ్మనికి నా కళ్లను అప్పగించేసిన తీరు

చీకటి వేళకు విచ్చుకునే సన్నజాజులో..
సువాసనేస్తూ, వాకిలంతా పరుచుకుంటూ
నా ఎదురుచూపును వెక్కిరిస్తుంటాయి..

మరి మల్లెలో ప్రియుని రాకలో విరహాన్ని 
రాతిరికి అప్పగిస్తాయి.
నిదురలో నువ్విచ్చే ముద్దు 
గులాబీలను హత్తుకున్నట్టు..

చల్లని గాలిలో, జోరు వానలో, ప్రతికాలంలో
నాతో నువ్వుండే సమయాలు చాలవూ.. పూల సొగసులా..
జీవిత సౌకుమార్యాన్ని ఆస్వాదించేందుకు..

ఈ తడిపొడి సుఖ దుఃఖాలకేం తెలుసు
నీ కోపంలో, ప్రేమలో దాగిన మంకెన్నలందం..

Wednesday, 3 April 2024

ఈ నవ్వుకు చిరునామా తెలుసా..


ఈ చిరునవ్వు ఈ పెదవుల మీద పూసి చాలా కాలమైంది..
అరుగులు పట్టుకుని పరుగు తీసామే అప్పుడు 
మైళ్ళ లెక్క తెలియని నాటికీ నువ్వు..

ఆయాసం ఆటగా ఉన్ననాడు
నీ కాలి వేగానికి, ఆయాసాన్ని జత చేసి పరుగందుకున్న నాడు
నీతో ఉప్పల గుప్ప ఆడిన నాటిదీ నవ్వు

పవిటేసిననాడు నీ చిరునామాను వెతికింది.
వచ్చి చేరే అందాలకు 
నువ్వు చిరునామా అవుతావని ఆశించింది.

జీవిత కెరటాల్లో కొట్టుకుపోయినా,
నీ సాక్షిగా ఆనాటి నవ్వు పూస్తూనే ఉంది.
ఎప్పుడో ఆదమరపుగా నీ ఆలోచనలా
అకాల వర్షంలా, గాలి కెరటంలా
నీ జ్ఞాపకంగా నవ్వు..

మళ్లీ ఇదిగో మనసంతా పూస్తూ, 
నవ్వి నవ్వి పెదవులు చిట్లేంతగా నవ్వు

చిరుమందహాసం కాదు.. చిద్విలాసం.
కడుపుబ్బా నవ్వే నవ్వది.. అప్పట్లానే అలానే అచ్చం
బాల్యం పేజీల్లో మిగిలి గురుతుకొచ్చే చిన్ననాటి 
అమాయకపు నవ్వు..పూస్తూనే ఉంది ప్రతిరోజూ
నీ ముఖ మంత అందంగా..
నీ పలువరసంత చక్కగా
తీయగా...

Tuesday, 2 April 2024

మార్పు సహజం.. 2-4-2024


శ్రీశాంతి మెహెర్

కాలంతో కొట్టుకుపోతూ మార్పుకు మార్పు చెందుతూ ఉండటం అనేది మనిషికే కాదు, ప్రకృతికీ కొత్తేం కాదు. కొన్ని నిర్ణయాలు మనిషిని ఆలోచించేలా చేస్తాయి. కొన్ని అనుసరించేలా చేస్తాయి. కాలానికి తగినట్టుగా మారడం అలవాటు పడటం పుట్టుకతోనే వచ్చి చేరుతుంది. అలా కాలంతో పాటు మనం కూడా సాగిపోతూ ఉంటాం. కొత్తకు అలవాటు పడటానికి కాస్త టైం తీసుకుంటాం ఏమో కానీ.. నెమ్మదిగా అలవాటు పడిపోతాం. కొత్త వింతగా, విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే.. 

నిన్న ఆకాశాన్ని పరుచుకుని ఉన్న ఆ చెట్టు కొమ్మలు ఈరోజు బోసితనాన్ని నింపుకున్నాయి. అదీ అలవాటు పడేందుకే.. నెమ్మదిగా ఆ బోసితనం అలవాటుగా మారిపోయింది. మునుపు ఉన్న ఖాళీ ఎందుకో ఇప్పుడు కొత్తగా అనిపించడంలేదు. జీవితం కూడా అంతే.. నిండుగా అనిపించిన దానికి, అలవాటు పడి కాసిన్ని రోజులు గుండె వెలితితో కొట్టుకున్న దానికి పెద్ద తేడా అనిపించదు.  నెమ్మదిగా అలవాటుగా సర్దుకుంటుంది. 

మనుషులూ అంతే మనసంతా నిండిపోతారు. మరో ఆలోచనరానీయనంతగా కలిసిపోతారు. తీరాచూస్తే వాళ్ళకు మరో ప్రపంచంలో బిజీ పెరిగినపుడు మనతో దూరం జరుగుతారు. ఇది తెలిసికూడా దగ్గరై.. మళ్ళీ దూరమై.. ఇదంతా అలవాటు పడేందుకు సమయం పడుతుంది. కానీ తప్పక అలవాటు పడతాం. ఇంటి నిండా జనాలు అలవాటైనవాళ్ళు, పల్లెటూరి వాసనతో గడిపేవారు, అమ్మతిట్లు, టీచర్ అరాచకం, స్నేహితుల అల్లరి, ప్రియురాలి ముచ్చట్లు ఇవన్నీ దూరమైతే కాస్త కాదు చాలా వెలితే మిగులుతుంది. కానీ రద్దీ జీవితంలో పడి కాలం గడిచే కొద్దీ మళ్ళీ కొత్త ప్రపంచానికి బదిలీ అవుతూ ఉంటాం. నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియకు అంతులేదు. మార్పు సహజమని నమ్మేందుకు పెద్దగా సమయం తీసుకోని రోజులు కూడా ఎదురవుతాయి.

మారిపోవడం ఒక్కోసారి బావుంటుంది కానీ.. ఒక్కోసారి వెలితిగానే ఉంటుంది. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తరుముతూనే ఉంటుంది. నా వరకూ నాకు కొత్తకు అలవాటు పడటం, పాత గురించి బెంగపడటం అలవాటు కాకపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి మీకో...

Wednesday, 27 March 2024

ఈ ఖాళీలను పూరింపుము..!!


శ్రీశాంతి.. 28-3-2024


ఖాళీతనం ఒక్కోసారి మరీ ఇబ్బంది పెట్టేస్తుంది. అది బుర్రలో పుట్టి, ఆలోచనను కూడా ఖాళీ చేసి ఏదీ తోచకుండా చేసిపారేస్తుంది. కొన్ని ఖాళీలను పరిస్థితులు సృష్టించి పారేస్తే.. మరికొన్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాం. ఈ ఖాళీలో నింపేయడానికి ఏదీ సరిపోదు. నిండుగా వాకిలంతా అలుముకున్న చెట్టు నేలకూలిపోతే ఏర్పడే ఖాళీలాంటిది. ఇంటి పెద్ద మాయం అయిపోతే కలిగే ఖాళీ.. నచ్చిన మనిషి దూరం అయితే కలిగే ఖాళీ.. మనసుకు ఇలాంటి ఖాళీలు అలవాటు కావు కనుక ఇబ్బందిలో, ఉక్కిరి బిక్కిరిలో ఏదీ తోచక ఏర్పడే ఖాళీ..


ఏం చేయాలో తెలిసి కూడా చేయలేకపోవడం, చేయాలనన్నా మనసుకు రాకపోవడం, నిజానికి ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితి. కాకపోతే ఆ ఖాళీని పూరించడం మాత్రం అంత సులువైన పనికాదు. రాయాలనుకున్న విషయం గురించి ఏదో ఆలోచన మొదలైనా రాయలేని ఇబ్బందిలాంటిదే ఇదీనూ..


నేను అప్పుడప్పుడూ ఏదో రాసేయాలని కూర్చుంటాను. చాలా అంటే చాలా సీరియస్గా.. కానీ తీరా కూర్చున్నాకా ఏదీ తట్టదు. అప్పటి వరకూ బుర్రను పట్టుకుని కుదిపేసిన ఆలోచనలు.. ఒక్కసారే రెక్కులు తొడుక్కుని ఎగిరిపోతాయి. ఇంకేముందీ.. ఇంతక మునుపు ఉన్న ఖాళీకన్నా ఇప్పుడు ఇంకాస్త పెరిగి కనిపిస్తుంది.. బుర్రలో ఖాళీ..


నిన్న ఉన్న విశాలమైన ఆలోచనలు,, ఆత్రం ఈరోజు లేనట్టే.. రాయాలనుకునే విషయాన్ని తక్షణమే రాయలేకపోతే ఏదో వెలితిలోకి పోతుంది. మనసుకు చాలా అలవాటు కావాలి. బంధాలనుంచి దూరంగా తప్పుకుని ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని తెలిసి వస్తాయి. అదెలాగంటే.. ఆకు నిండా ఉన్న పదార్థాలను తినలేని పరిస్థితికన్నా,, తినడానికి ఆ పూటకి దొరికిన పప్పే, పరమాన్నం అనుకుని తినేయగలిగే తృప్తి ఉంది చూడండి అలాంటి పరిస్థితి ఉంటేనే బ్రతకు బరువు తెలుస్తుంది. 


అలా ప్రతి ఖాళీనీ పూరించుకుంటూ వస్తే.. చివరి మజిలీ కాస్త భయపెట్టేదే అయినా అలవాటు పడిపోతాం. ముసలితనం ఈ మధ్య భయపెడుతుంది నన్ను.. ఆ వయసుకు వస్తే.. నేను ఎలా ఉంటానో.. రూపంలో కాదు.. ఆరోగ్యపరంగా నా పరిస్థితి ఏంటీ అని తెగ కంగారుగా ఉంటుంది. కానీ మళ్లీ తమాయించుకుంటాను. ఖాళీలను పూరిస్తూ వస్తున్న నేను ఈ ఖాళీని కూడా పూరించుకుంటూ పోగలను అని నా విశ్వాసం. మీకూ ఇలాంటి భయాలే ఉండి ఉండచ్చు.. కానీ నాలా చెప్పుకోరు అంతే.. నిజమేనా..?

Friday, 22 March 2024

వైరాగ్యానికి అటు ఇటు..


శ్రీశాంతి.. 23-3-2024

కంఫర్ట్ దీనిని ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉంటారు. జీవితంలో ఎన్ని చేసినా కూడా అవన్నీ కంఫర్ట్ కోసమే.. ఎన్ని కష్టాలు పడినా కూడా సౌకర్యం కోసమే.. లేకపోతే ఎందుకీ పాడు బతుకు అనిపిస్తుంది. నిజానికి ఎక్కడెక్కడ తిరిగినా రోజులో ఎక్కడ తిరిగి వచ్చినా, కూడా ఇంటికి చేరే సరికి కలిగే ఆనందం వేరు. నా వరకూ నాకు మెట్లెక్కి నా ఇంటి గుమ్మం ముందుకు చేరుకోగానే.. ఓ పాజిటివ్ నెస్ కనిపిస్తుంది. కొత్త ప్రదేశంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మన ఇంటి మంచం మీద పడుకున్నప్పుడు పట్టే నిద్రే నిద్ర. 

హాల్లో చిన్న బొంత మీద కూర్చున్నా అదే ఆనందం. చుట్టూ మనం నాటుకున్న మొక్కల మధ్యలో కాసేపు నిలబడినా,  నచ్చిన పాట వింటూ సమయం గడిపినా ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ఆనందం. 

ఇక తిండి విషయానికి వస్తే.. నాలుకకు కొత్త రుచులు కావాలి. రోజులో ఎంత చెత్త తినాలన్నా కూడా అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తిండి విషయంలో ఒకప్పుడు ఉన్న చాపల్యం ఇప్పుడు తగ్గిందనిపిస్తుంది. ఏదో తినేయాలన్న ఆత్రం తప్పితే చక్కగా అన్ని కూరగాయలూ వేసుకుని పెట్టుకున్న దప్పళం ముందు ఈ పిచ్చి తిళ్ళు ఏం బావున్నాయనిపిస్తుంది. పులిహోరను కొట్టే వంటకం మరొకటి ఉందా అనిపిస్తుంది. ఏంటో రోజు రోజుకూ నేను చేసుకుతినే వంటకాలు తప్పితే బయటివి నచ్చడం లేదు. అలా అని ఇప్పుడే సన్యాసం పుచ్చుకోవాలనీ లేదు.. మరీ తిండి మీద యావ చంపేసుకు బతికేస్తే ఇక గొడ్డుకి మనిషికీ తేడా ఏముంది. 

కాకపోతే ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెరిగింది. రేపు నేను ఎలా ఉండబోతున్నానో అనే ఆలోచన రాగానే వెంటనే తినాలనే యావ చచ్చిపోతుంది. కాలాన్ని గిర గిర తిప్పే పని పెట్టుకున్న మహానుభావుడు ఎవరో గానీ.. కనిపిస్తే కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలనిపిస్తుంది. ఎందుకు త్వరత్వరగా కాలాన్ని జరుపుకుంటూ పోతున్నాడో ఏమో.. ఒక్కోరోజూ మారుతున్న కొద్దీ ఒక్కో రకమైన ఆలోచన కలుగుతుంది. 

నిన్నటిలా నేడు ఉండదు. నేటిలా మరో రోజు మారదు. కాకపోతే ఉన్న క్షణాలను అందంగా మలుచుకోవడమే జీవితం. ఏంటో నాకు కొత్తగా వైరాగ్యం కూడా అంటుకుంటుంది ఈ మధ్య. వయసుదాటిన ఎవరిని చూసినా నా రాబోయే రోజులు గుర్తుకు వస్తున్నాయి. మనసంతా బాధగా ఉంటుంది. మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నాననిపిస్తుంది. కానీ.. ఇదంతా చక్రం.. జీవన చక్రం.. అందులో వద్దన్నా జరిగే మార్పులు అంతే.. సర్దుకోవాలి.. నిజాన్ని అంగీకరించాల్సిందే.. నిజమే కదా.

Thursday, 21 March 2024

హృదయం నిండా.. పూల వాసనలే.. !


Sri santhi 22-3-2024

అందమంతా ప్రకృతిదే అయితే అది చూసి మురిసిపోయే నా జన్మ ధన్యం. ఈ చూసే కళ్ళకు కనిపించేదంతా అందమే.. ఈ భూమిమీద ఈ జీవితంలో నేను అనే మనిషిని అన్ని వాసనలను, అందాలను, సౌందర్యాన్నీ, కష్టాన్ని, సుఖాన్ని అనుభవించగలుగుతున్నానంటే అది నిజంగా దేవుడి దయే.. 


సరే అందం అనుకున్నాం కదా.. నేను ఆగి మరీ చూసే అందం మొక్కలది. పూలది.. వాటి సువాసనలది.. సన్నజాబులు, మల్లెలు, పారిజాతాలు, చామంతులు, గులాబీలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పూలు, బోలెడు అందాలు, అందమైన ముఖాలకన్నా పూలను చూసినప్పుడు కలిగే ఆనందం వేరు. వాటి వెనుక నేను ఆలోచించే, మురిసిపోయే క్షణాల ఆనందం మరింత గొప్పది.. నిజానికి మొక్కలంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పాలంటే బాల్యం వైపుకు చూడాలి. ఎందుకో మొక్కలు మాట్లాడతాయి అనిపిస్తుంది. చక్కని పూలతో రకరకాలుగా వాటికి తగినట్టుగా నవ్వుతాయి. ఆ నవ్వులో నాకు ఓ ఆత్మీయత కనిపిస్తుంది. నాకు మొక్కలను చూడగానే పూనకం వస్తుందని ఇంట్లో అంటారు కానీ .. మొక్కలను కొని తెచ్చి ఇంట్లో పెట్టి పెంచడం అంటే వాటికి కొత్త వాతవరణాన్ని పరిచయం చేయడం లాంటిదే.. 


కానీ ఏమాటకామాట.. అందంగా పెంచుకున్న మొక్కకు ఓ పువ్వు పూసిందనుకోండి. ఎంత ఆనందమో కదా.. భలే అనిపిస్తుంది. నాకైతే సంబరమే.. మొన్నామధ్య మా దగ్గరలో సింహాచలం సంపెంగ మొక్కను చూసాను. కాస్త రేటు ఎక్కువే చెప్పాడు. రెండు రోజులు తిరిగి మొత్తానికి మొక్కను అతి  కష్టం మీద మా బాల్కనీలోకి తెచ్చాను. దానికి ఇంకా మొగ్గలు రాలేదు. ఫిబ్రవరి 13న కొంటే మార్చి 20న పువ్వు పూసింది. ఇక నా సంబరానికి అవధులు లేవంటే నమ్మండి. బయట ఈ పువ్వులు దొరకడం కష్టం.. ఒకవేళ దొరికినా పువ్వు 20 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకో ఇది పూసాకా కోయబద్ది కాయలేదు. ముసిపోయాను అలా చూసుకుంటూ.. మీకూ ఈ పువ్వు ఇష్టమేనా..


ఒకప్పుడు మొక్కలు కొనితెచ్చి వాటిని పెంచి, చూసి మురిసిపోయి.. ఇలా ఉండేది. ఇప్పుడు సమయం కుదరడం లేదు.. పైగా ఇల్లు ఇరుకుగా ఉండటం కూడా మొక్కల మీద మక్కువను చంపేస్తుంది. ఓ కార్నర్‌లో పెట్టి పెంచుకోవాలి తప్పితే పెద్దగా వేరే మార్గంలేదు,. పాపం వాటిని ఇలా బంధించి పెంచడం ఇష్టలేక వదిలేస్తున్నాను. కాకపోతే ఎటన్నా పోతున్నప్పుడు మొక్కలవాడు కనిపిస్తే మాత్రం బుట్టలో మొక్కల్ని చూసి మురిసిపోవడమే.. ఏంటో బాధగా ఉంటుంది. అయ్యో వీటిని తీసుకుని వెళ్ళలేకపోతున్నానే అని. మనసులో మాత్రం గట్టిగా అనుకుంటాను. ఎందుకు నేను ఇంట్లో ఉండే సమయం తక్కువ కదా.. ఆదివారాలు తప్పితే కదరదు కదా.. అలాంటప్పుడు వీటిని పెంచే బాధ్యత మీద వేసుకోవడం.. ఇంట్లో చివాట్లు తినడం అవసరమా..అని.


అవును.. చివాట్లంటే గుర్తుకు వచ్చింది. మీ ఇంట్లో కూడా ఇలానే తిడతారా.. వీధిలో కనిపించిన ప్రతి మొక్కనూ ఎత్తుకొస్తావు,. వాటిని తెచ్చాకా చూసే నాధుడు ఎవరు. డబ్బులన్నీ తగలేస్తున్నావని. మొక్కలు కాళ్లకి అడ్డంగా ఉన్నాయని.. ఇల్లు మారేప్పుడు ఎవరు ఎత్తుకెళతారు అంత బరువైన కుండీలని.. ఇలా ఆ క్షణానికి తగిన విధంగా.. గుర్తుకు వచ్చిన తిట్లన్నీ తిట్టి పోయడం లాంటివి ఏమైనా ఉంటాయా.. ఉండే ఉంటాయి. కదా..

Monday, 18 March 2024

కాల తప్పిపోయింది..

.. 19-3-2024


కొన్ని కలలు భయపెడతాయి.. కొన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకునేంత బావుంటాయి. కొన్ని తరిమితే.. మరికొన్ని భ్రమలో ఉండేట్టు చేస్తాయి. భయపెట్టేవి కూడా కలలే.. కలలే రాని నాకు చాలా రోజుల తర్వాత కలవచ్చింది. అంటే కల రాకపోవడం కూడా ఓ బాధే.. అందమైన ప్రదేశాలు... అనుకున్నవి కలగన్నవి.. ఆశించినవి ఇలా అన్నీ కలల్లా వచ్చేస్తే.. బావుంటుందని మరీ కలగనడం బావుంటుంది. అలా కలను నటించే రోజుల్లోనే నేను ఆగిపోయాను. కానీ ఈరోజు కల వచ్చింది. 


ఒకింత ఆశ్చర్యం.. ఒకింత బాధ.. ఇదేంటి నేను నన్ను గురించి వెతుకుతున్నానా.. ఇదో వింత కల. నా వరకూ నాకు చాలా చిత్రంగా అనిపించింది. బహుశా వేళకు మించి నిద్రపోవడమో.. లేదా శరీరం బాగా అలిసిపోవడమో కారణం అయి ఉండవచ్చు. నిజానికి నాకు కల వచ్చిందంటేనే వింతగా ఉంది. 


ఇంతకీ ల్యాగ్ చేయకుండా చెప్పాలనుకునే విషయం ఏంటంటే నా కలలో నన్ను నేనే వెతుకుతున్నాను. కానీ ఆ పెద్ద ఇంట్లో నాలా మరో ఇద్దరు కనిపిస్తున్నారు. పోనీ అచ్చం నాలాగే ఉన్నారా అంటే అలానూ లేరు. చొట్ట ముక్కులు,. తపేలా ముఖాలు.. ఛా ఈ వింత ముఖాలని శాంతి అంటున్నారేంటిరా నాయనా అని.. మళ్ళీ ఆగి చూస్తే ఇంతకీ నన్ను అక్కడ ఎవరూ గుర్తుపట్టడం లేదు. ఎంత నేనేరా శాంతిని.. ఎవరినో నేనంటారేంటి.


నాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని ఇలా నాటకాలాడుతున్నారా ఏంటి.. ఇదంతా కుట్రలా గుందే. దీనికంతకీ నేను ఒప్పుకోను. ఛాఛా .. ఇంత చెండాలంగా ఉందేంటి నాకల..
తెగ తిట్టుకున్నాను. ఆ ముఖాలు చెంబులు, తపేలాలుగా ఉండటమే కాదు. ముఖాలకు సున్నం రాసుకుని మరీ వింతగా ఉన్నాయి. అవి నేనని ఎందుకు అంటున్నారో కూడా అర్థం కాలేదు. చివరికి వాటిని పట్టుకుని, నాలుగు తన్ని, "ఎవర్రా మీరంతా" అని గట్టిగా పేగులు తెగేలా అరిచి ముఖాలను గీకి లాగితే.. అవి ముసుగులని తేలింది. ఇంత పెద్ద కుట్ర పన్నిన వాడు ఎవడా అని కలంతా కలియతిరిగి ఇల్లు చేరుకున్నాను. ఆ ఇంట్లో మా ఫణిగాడు, బుడ్డోడు కనిపించారు. హమ్మయ్యా ఇప్పటికైనా సరైన ఇల్లు చేరాను. 


బాబోయ్.. ఇలా కలలో కూడా ఇల్లు మారిపోకూడదు. మారితే ఇదిగో ఇలాగే గందరగోళంగా ఉంటుంది. అని అనుకుని కళ్లు తెరిచాను. ఇంతకీ అప్పటికి టైం ఆరు.. అంగలారుస్తూ ఉద్యోగానికి పరుగుపెట్టే టైం అయిందని పరుపు మీంచి ఒక్క గంతున లేచాను.. హమ్మయ్యా.. శ్రీశాంతి మెహెర్

Monday, 1 January 2024

కలలాంటి నిజం వెనుక .. 2-1-24


నక్షత్రాలు రాతిరిని అంటుకుని.. ఉండిపోయాయి..
నీ ఆలోచనలు నన్ను పట్టుకుని వదలనట్టు
నిండిపొర్లే నీటిని చేపలు వదిలిపోతాయా..
నీ రహస్యాలు తెలిసిన మనసు మాసిపోనట్టు..


దీపాల్ని తీసి చూసినా నాకలల అంచుల్లో నీ ఊహే..
చీకటినలుపుల మధ్య నీ ఊహ మధురం..
నిన్ను తెలుసుకునే ప్రయత్నంలో..
వెచ్చని కౌగిలి హృదయానిక అడ్డంగా వచ్చినట్టు


మెరుస్తుంది.. నక్షత్రంలా.. నా కళ్ళల్లా..
వొంటరితనాన్ని సైతం ఆవరించే సమక్షం నీది..
కావలించుకుని నాకు నీ వెచ్చదనాన్ని గుర్తుచేస్తూ..
ఇంకేం అడుగకు.. తక్కింది నా కలలో ఉంది. (శ్రీ)

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...