Monday 2 August 2021

గాలి కుచ్చిళ్ళు..



వర్షం వెలిసినా 

ఈ దేహపు ఆకాశాన

నీ పై కోరిక మాత్రం 

జల్లుగా కురుస్తూనే ఉంది.

లీలగా వీచే గాలి ఊళలకు

కమ్మని పాట కట్టి వేపమాను

కింద ఎదుచూస్తోంది మనసు

గాలి కుచ్చిళ్ళు సవరించుకుంది

జాబిలి నవ్వు

ఎరుపెక్కిన గులాబీల

ఛాయను అరువుతెచ్చుకుంది

ఎగిరే పక్షి ఆకాశాన్ని కొలిచి వచ్చింది

చందమామ తప్ప ఎవరూ అడ్డులేరంది

నా తనువును స్పృశించేందుకు నీ

ప్రేమ కావాలి.

మొక్కల కుదుళ్ళను ఊపేసిన వర్షానికి

సమస్తాన్ని కౌగలించుకొని పోయే ప్రేమకు

వెనుక నీ స్పర్శ కావాలి.

ప్రేమించడం తెలిసినంతగా

మరిచిపోవడం తెలియడం లేదు

మరి..

కళ్ళల్లో నీళ్ళు తిరిగి వెక్కిరిస్తాయి

నలుపు తెలుపు రంగు వెలిసిపోయి

వెర్రిగా నవ్వుతాయి.

ఆకాశాన్ని నిర్లక్ష్యంతో చూస్తున్నప్పుడు

నక్షత్రాలు జారి పరాయిగా మారిపోతాయి.

వేవేల తలలు రాల్చి నన్ను చీకటిలోకి

నేట్టేస్తాయి తూనీగలు..

ఎటుచూడు శూన్యం తప్ప 

మరేం కనిపించదు.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...