Monday 1 April 2019

ఏ నిముషానికి ఏమి జరుగునో....



అర్థరాత్రి ప్రయాణం, నీరసంగా, నిద్రలేక ముఖమంతా పీక్కుపోయి ఉంది. అసలు ప్రయాణం చేసే అలవాటు అంతగాలేదేమో.. ఒకటే చిరాకు.. పైగా రాత్రెప్పుడో తిన్న తిండి. ఆకలేస్తుంది. నేనొక్కత్తినే కాదుగా లోపల బొజ్జలో బుల్లి బుజ్జాయ్ ఉన్నాడని తెలిసినప్పటి నుండీ ఆకలి మరీ ఎక్కువగా ఉంది. కాస్త వికారంగా, ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది.

ఎక్కడి ప్రయాణం పద్నాలుగు గంటలైంది ఇల్లు వదిలి. మధ్యలో ఈ బాత్రూం గొడవొకటి. ఏం చెయ్యాలి తప్పదు.. నా ఇబ్బంది చూసి., తనకీ కంగారుగానే ఉంది. కానీ ఈ ప్రయాణం కూడా నా గురించేగా. డాక్టర్ ని కలిసి టెస్ట్ లు చేయించుకుని వెళిపోతే.. తర్వాత మళ్ళీ నెలకే రావడం. అంతకీ నాలుగు సార్లు అడిగాడు. ఏమైనా తింటావా అని. ఈ ట్రైన్ వాతావరణం కొత్తగా ఉండి ఒకటే వికారం చంపేస్తుంది.

**

మనసు కూడా ఏం బాగాలేదు. ఎన్నో దిగుళ్ళను దిగమింగి ఉన్నాను. ఇంట్లో అంతా గుర్తుకువస్తున్నారు. ముఖ్యంగా అమ్మని చూడాలని ఉంది. ఈ సమయంలో తను నా పక్కన ఉంటే నాకేం కావాలో చూసేది కదా అనే దిగులు. ఒక్క నిర్ణయం నన్ను ఇంట్లో అందరికీ దూరంగా పెట్టింది.  ఎవరికీ నచ్చని ప్రేమ, పెళ్ళితో అందరికీ దూరంగా ఉంటూ, ఇప్పుడు ఆ మారుమూల ఊర్లోంచి డాక్టర్ దగ్గరకు హైదరాబాద్ వచ్చాం.

**

మోతీనగర్ చాలా ప్రశాంతమైన ప్రదేశం, చుట్టూ పచ్చదనం, కిలోమీటరుకు ఒక పార్కు, అన్నీ సొంతిళ్ళు, అపార్ట్ మెంట్లు. పొందికైన ఆ వాతావరణంలో ఓ స్నేహితుని ఇంటికి బయలుదేరాం. బస్టాండ్ నుండీ కిలోమీటర్ దూరంలో ఉందా ఇల్లు. వీధికి రెండువైపులా నాటిన తంగేడు చెట్లు రోడ్డంతా పచ్చగా పసులు పూల దారులు వేసాయి. ఎంత అందంగా ఉందో చూడడానికి. ఈ రోడ్లన్నీ ఎప్పుడో చూసానని గుర్తుంది. అవును చూసాను. నేనిటుగా వచ్చాను. ఎందుకు ఇక్కడికి వచ్చానో వంశీతో చెప్పనా..వద్దా..?

రెండంతస్థుల మేడ, దిగువున పార్కింగ్ లో కారు పెట్టి ఉంది. కింద వాటా ఎవరికో అద్దెకిచ్చినట్టున్నారు. పైకి మెట్లెక్కి పూల కుండీల పక్కగా ఉన్న కాలింగ్ బెల్ కొట్టాం. వంశీ స్నేహితుడు నవ్వుతూ వచ్చి తలుపు తీసాడు. లోపల సోఫాలో కూర్చున్నాను. గదిలోంచి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు వచ్చి పలకరించారు. అతని భార్య పుట్టింటికి వెళ్ళిందట ఆమెను గురించి నాలుగు మాటలు చెప్పాడు.

పెద్దామె నా పరిస్థితి గమనించినట్టు లోపల గదిలోకి వెళ్ళమ్మా కాస్త స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, ఇంతలో టిఫిన్ పంపుతాను అంది. ఇల్లంతా విశాలంగా చాలా నీట్ గా, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళ స్థితికి తగినట్టుగా ఉంది. ఇంటీరియల్ డెకరేషన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. గదిలో లగేజీ ఓపెన్ చేసి బాత్రూంలో స్నానానికి వెళ్ళాను.

దాదాపు గంట సేపు అలా నీళ్ళు పోసుకుంటూనే ఉన్నాను. ఎంతో హాయిగా ఉంది శరీరానికి. తయారై హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. కాస్త కొత్తగా ఉన్నా, ఆ ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఆకలితో తెలీకుండానే నాలుగు పూరీలు తినేసాను. వంశీ స్నానం అయ్యి వచ్చే సరికి నా టిఫిన్ అయిపోయి గదిలోకి వచ్చి పడుకున్నాను.

**

ఉదయం నుంచీ కంగారుగా ఉన్న నా ముఖాన్ని ఇట్టే కనిపెట్టేసాడు వంశీ. తనకు నా ప్రతి కదలికా తెలుసు, నాలో ఆనందం, విచారం, అన్నీ తనకు ఇట్టే తెలిసిపోతాయి. నా దగ్గరగా వచ్చి, మంచం వారగా కూర్చుని ...

ఏంటి ఉదయం నుంచీ నాకు చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు. చెప్పరా.. ఏంటి

ఏం లేదు.. అది.. అది..

ఊ.. చెప్పు..

ఈ పక్క వీధిలోనే చెల్లి వాళ్ళు ఉంటారు.. నాకు చెల్లిని చూడాలని ఉంది..

ఇప్పుడా.. ఎవరన్నా చూస్తే అనవసరంగా ఇబ్బందుల్లో పడతాం.. ఇప్పుడు ఈ పరిస్థితిలో అవసరమా.. వద్దు రా.. డాక్టర్ కి చూపించుకుని నెమ్మదిగా వెళిపోదాం.. సరేనా..

అది కాదు. మళ్ళీ ఇక్కడి మళ్లీ వస్తామో లేదో.. దాన్ని చూడాలని.. బాగా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తాను. తనకి కనిపించకుండా ముఖానికి ఏదైనా ముసుగు కట్టుకుంటాను. ఫ్లీజ్.. ఫ్లీజ్ వంశీ..

సరే నీ ఇష్టం...

ఇబ్బందిగానే సరే నన్నాడు.

**

ఇద్దరం చెల్లి ఇంటికి ఎదురుగా ఉన్న కిరణా షాపు అరుగుమీద కూర్చున్నాం. ముఖానికి తెల్లని చున్నీ బిగించి కట్టాను. చెల్లి బాల్కనీలోకి వస్తుంది కదా అని, నా చూపులు నిలిపి ఎదురుచూస్తున్నాను. రెండు గంటలు పైనే అయింది. ఎంతకీ తను రాలేదు. వంశీకి విసుగ్గా, నేను చేసే పని పిచ్చిగా అనిపిస్తుంది.

వద్దురా.. ఇలా ఎంతసేపని చూస్తావు.. తీరా తను వస్తే ఏం చేస్తావ్..

ఏమో తెలీదు. కానీ తనని చూడాలి..

ఆ దారిన పోయేవాళ్ళంతా ముసుగుతో షాపు ముందు మమ్మల్ని వింతగా చూస్తున్నారు.

ఈలోపు చెల్లి బాల్కనీలోకి వచ్చింది. నేను అలానే దాన్ని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయాను. ఆ బిల్డింగ్ గేటులోంచి తన బండి తీసుకుంటూ మరిది కనిపించాడు. ఎందుకో గుండెవేగంగా కొట్టుకుంది. ఇప్పుడు నేనిలా అతనికి కనిపించి చెల్లి సంసారంలో ఇబ్బందులు తెస్తున్నానా అనిపించి..

వంశీ ఇక్కడి నుంచీ పద వెళిపోదాం.. గట్టిగా తన చేయి పట్టుకుని ఏడుస్తూ అక్కడినుంచీ వెనక్కు వచ్చేసాను.

నా నడకలో వేగాన్ని, నేను పడుతున్న కంగారునీ చూసిన వంశీకీ కన్నీళ్ళొచ్చాయి. 

ఇద్దరం ఇంటికి వచ్చేసాం. గదిలో ఏడుస్తున్న నన్ను దగ్గరగా తీసుకుని
 ఎందుకురా.. అన్నీ వద్దునుకున్నావ్.. మళ్ళీ నువ్వే కావలంటున్నావ్.. ఇలా కంగారు పడి పరిగెత్తితే నీ ఆరోగ్యం ఏం అవుతుంది..

మనం వద్దనుకున్న వాళ్ళను కలవాలనుకోవడం.. మనకు, వాళ్ళకూ ఇద్దరికీ ఇబ్బందే.. వదిలై.. రెండు పడవల మీద నిలబడాలని అనుకోకు..

మనం ఈరోజే వెళిపోతున్నాం.. మళ్ళీ ఎప్పుడూ ఇటువైపు నిన్ను తీసుకురాను. కాసేపు పడుకో.. రాత్రికి మన ప్రయాణం.

వంశీ గదిలోంచి వెళిపోయినా తన మాటలు అలా చాలాసేపు వినిపిస్తూనే ఉన్నాయ్.
సాయంత్రం ఆరవుతుంది. ఎవరో డోర్ కొట్టారు.

లేచెళ్ళి తీసాను. ఎదురుగా చీపురు పట్టుకుని పనమ్మాయి.. నించుని ఉంది.
కొత్తగా కనిపించిన నన్ను కాసేపు పైకీ కిందకీ చూసింది.

గది తుడవాలమ్మ కాసేపు ఇలా హాల్లో కూర్చుంటారా..

వెళ్ళి హాల్లో కూర్చున్నాను. ఇంకా నిద్ర మత్తు వదల్లేదు. మరో గంట పడుకోవాలని ఉంది.

గదిలోంచి బయటికి వచ్చి వెళ్ళండమ్మా.. అంది.

లోపలికి వెళిపోతున్న నన్ను కాస్త అనుమానంగా చూస్తూ..

మీరు.. మీరు.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందమ్మా..

నన్నా..

నాకు.. ఏం చెప్పాలో తెలీలేదు..

నన్నా.. నన్నెక్కడ చూసావ్.

నేను ఇదే మొదటిసారి ఇటు వచ్చింది.

లేదు. ఆరునెల్ల క్రితం మీరు మా ప్రభమ్మ ఇంటికి గృహప్రవేశానికి వచ్చారు కదమ్మా.. మీరు ప్రభమ్మ అక్కయ్యగారు కదా.. అంది.

అబ్బే.. కాదు. నువ్వు ఎవర్నో నేననుకుంటున్నావ్.. కంగారుగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను.

*


No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...