Monday 30 September 2013

మనం కోల్పోయిన ప్రపంచాన్ని గుర్తు చేసే "బంగారు మురుగు"



శ్రీరమణ గారు రాసిన "బంగారు మురుగు" కథ చదివాకా, నా బాల్యం గుర్తుకు వచ్చింది. బామ్మ అందరికీ బాల్యపు తీపి గుర్తు. ఈ కథ చదువుతుంటే, మా బామ్మ కూడా ఇలానే ఉండేది అనో, ఇలాంటి బామ్మ నాకూ ఉంటే ఎంత బాగుండేది అనో అనుకోని వారు ఉండరు.

ఇది అరవై ఏళ్ల బామ్మకూ, ఆరేళ్ల మనవడికీ మధ్య సాగే కథగా మాత్రమే గాక, మన మధ్య జరుగుతున్నదా అన్నట్టూ, ఆ కథలో మనమూ పాత్రలై ఉన్నామా అనిపించేట్టూ సాగుతుంది. గట్టి పిండంగా పేరు తెచ్చుకున్న బామ్మకు మనవడన్నా, తన చేతికున్న బంగారు మురుగు అన్నా, తాను పుట్టింటి నుంచి కాపురానికి వస్తూ తెచ్చుకున్న పెరటిలోని బాదం చెట్టన్నా ప్రాణసమానాలు. ఈ బాదం చెట్టే బామ్మా మనవళ్ల స్థావరం. ఇద్దరికీ రోజులో మూడు వంతులు అక్కడే కాలక్షేపం. బామ్మ తత్త్వం ఎవరికీ బోధపడదు. ఎదుటివారిని మాట్లాడనీయక, తన దైన వాగ్ధాటితో, ప్రేమావాత్సల్యంతో అబద్ధం చెప్పాలనుకున్న వారితో కూడా నిజం చెప్పించగలదు. కొడుకూ కోడలూ ఆస్తిని స్వామీజీలకు కైంకర్యం చేస్తూంటారు. బామ్మ మాత్రం వచ్చే పోయే స్వామిజీలను ఆటపట్టిస్తూంటుంది. ఒక స్వామీజీ దృష్టి బామ్మ బంగారు మురుగు మీద పడుతుంది. దాన్ని ఎలాగైనా తనకు దక్షిణగా దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. బామ్మ మాత్రం ససేమిరా అంటుంది. స్వరాజ్య పోరాటమప్పుడు గాంధీ గారు తమ ఊరు వచ్చి గుమ్మం ముందు జోలె పట్టినా ఇవ్వనిదాన్ని ఇప్పుడీ సర్కస్ కంపెనీకి ఎందుకు ఇస్తానంటుంది. కూతురి కళ్లూ దాని మీద పడతాయి. ఐనా బామ్మ పట్టువిడవదు. దాని మీద ఆమెకు కాపీనమని మనకు అనిపిస్తుంది. కాలం గడుస్తుంది. బామ్మ ఎంతో చొరవతో మనవడి పెళ్లి చేయిస్తుంది. మనవడు వేరే ఊళ్లో కాపురం పెడతాడు. బామ్మని రమ్మన్నా రాదు "నా ఊరు నా నేల.. ఇక్కడే మట్టయిపోవాలిరా..." అంటుంది. జబ్బు పడి మంచం పట్టిన రోజుల్లో చూట్టానికి వచ్చిన మనవడి కంగారు చూసి "నిన్ను వదిలి ఎక్కడికి పోతాన్రా వెర్రి నాగన్నా... అలా వెళ్లి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా..." అంటూ ధైర్యం చెప్తుంది. చనిపోయాకా, తీరా చూస్తే ఆమె బంగారు మురుగు గిల్టుదని తేలుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మనవడు మాత్రం గ్రహిస్తాడు, బామ్మ తన పెళ్లి జరిపించింది ఆ బంగారు మురుగుతోనే అని.

శ్రీరమణ గారు ఈ కథను మలచిన తీరు, ఆయన శైలి నాకు నచ్చాయి. శ్రీరమణ గారు బామ్మలో చాలా కోణాలనే చూపించారు. మాటల్లో దర్జా, దర్పం, నేర్పుగా మాట్లాడి ఎదుటివాళ్లని ఆట కట్టించగల వాక్చాతుర్యం, తను అనుకున్నది సాధించగల పట్టుదల, ప్రేమా, వాత్సల్యమూ, దయా... ఆమె సుగుణాలు.

ఈ కథలో బామ్మ మాటలు కొన్ని:
"దయ కంటే పుణ్యంలేదు, నిర్దయ కంటే పాపం లేదు. నాది అనుకుంటే దుఖం, కాదు అనుకుంటే సుఖం."
"చెట్టుకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం... నాకు తెలిసిందవే."
"ఆ పిల్ల గోరంటాకుతో పారాణీ పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి, నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడు నోరు పండాలి. మీ కడుపు పండాలి,  నేను మళ్ళీ నీ ఇంటికి రావాలి."
అమ్మ తరువాత తన పొత్తిళ్లలో దాచుకుని ఆప్యాయంగా గారాబం చేసేది బామ్మ ఒక్కతే. ఆమె దగ్గర ఉన్న చొరవ మరెక్కడా ఉండదు. అమ్మ పెట్టడం ఆలస్యం చేస్తే తాను ఆప్యాయంగా కడుపు నిమిరి అన్నం తిన్నా్వా నాన్నా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కడుపు తడుముతుంది.

ఉమ్మడి కుటుంబాలు పోయాయి, ఒంటరి జీవితాలు వచ్చాయి. ఈ హైటెక్ యుగంలో అలాంటి ఆప్యాయతలకు అనురాగాలకు దూరంగా చాలా దూరంగా వెళిపోతున్న మనం, మన కడుపున పుట్టిన పిల్లల గురించి మాత్రమే ఆలోచించే మనం,  ఒక సంపాదనా యంత్రాలుగా మనుగడ సాగిస్తున్నాం. ఇలాగే సాగితే ఈ ఆప్యాయతలు మనకు పుస్తకాల్లో మాత్రమే చదువుకోవటానికి మిగిలిపోతాయి. మన చిన్నతనంలో పొందిన ఆప్యాయతను మన పిల్లలకు అందీయలేకపోతున్నాం. వాళ్ళకు ఏం దూరం చేస్తున్నామో ఆలోచింపజేస్తుంది ఈ కథ.

5 comments:

  1. 'మిధునం' పుస్తకంలోని కథలన్నీ ఆణిముత్యాలే.

    ReplyDelete
  2. జ్యోతిర్మయి గారు అవును మిధునం కథలన్నీ నాకూ నచ్చాయి.

    ReplyDelete
  3. bagundi , midhunam anedi oka katha kaada?pustakamaa?

    ReplyDelete
  4. sravankumar గారు, ధన్యవాదాలు. శ్రీరమణ గారి పది కథల సంపుటి పేరు "మిథునం". ఇందులో "మిథునం" ఒక కథ. "బంగారుమురుగు" కూడా ఇందులోదే. మిథునం కథను చిత్రకారుడు బాపు దస్తూరితో రచన మాస పత్రిక వాళ్లు విడి పుస్తకంగా ప్రచురించారు. అలాగే కొందరు వ్యక్తులు షష్టిపూర్తి సందర్భాల్లో ఆ కథ ఒక్కదాన్నీ విడిగా ప్రచురించి అందరికీ పంచిపెట్టారని విన్నాను.

    ReplyDelete
  5. మీ రెవ్యూస్ చదూతుంటె ఇన్నాళ్ళూ చాలా మంచి రచనలు మిస్ అయ్యానని తెలుస్తోంది

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...