ఉప్పుకారాలతో పంచుకు తిన్న జామకాయలు..
గోనెసంచులు పరుచుకుని తెరమీద బొమ్మల్ని చూసి మురిసిన బాల్యం
గుడి ముందు భక్తి నటిస్తూ ప్రసాదం అందుకున్న రోజులు..
చెరువు గట్టు మీద మర్రిచెట్టుకు ఊగిన ఉయ్యాల ఆటలు..
ఒకరితో ఒకరం పోటీపడి ఆడి అలసిపోయిన ఉప్పల గుప్ప..
మట్టి కుండలు మధ్య ఆరబోసి ఉన్న ఊక మేటలు..
ఆగకుండా తిరుగుతున్న కుమ్మరి చక్రం..
మట్టి చెరిగి కుప్పగా పోసి.. మరో సృష్టికి తావిస్తూ..
నీళ్ళ బిందె భుజాన ఎత్తుకుని తడిచిన చీరతో..
పగిలిన అద్దం ముందు జుట్టు సవరించుకుంటూ..
నాతో ఆటలాడి ఓడిపోయి ఉడుక్కున్న వెంకటలక్ష్మి..
శనగచ్చుకోసం పోగుచేసిన ఇనుప సామాను..
దిపావళికి అమ్మ చేతి పాకం గారెల కోసం పడిగాపులు..
బుల్లి టీవీ ముందు పోటీపడి కళ్లప్పగించి చూసిన మహా భారతం..
నాన్న పట్టుకొచ్చే బాదం హల్వా కోసం జరిగిన చిన్నసైజు యుద్ధాలు..
పూలమ్మి తెచ్చే బుట్ట పూలతో గుప్పుకున్న వాలు జడలు..
వాన చినుకున్నల్లో తడిచి తెచ్చుకున్న జ్వరానికి అమ్మపెట్టిన పత్యాలు..
బుట్ట బొమ్మల్లా ముస్తాబై స్నేహితులతో ఆడిన గొబ్బమ్మలు..
చెదిరిపోయిన నా బాల్యానికి చెరగని గురుతులు..
No comments:
Post a Comment