చలం తలంపై నేను.. (శ్రీశాంతి మెహెర్)
చలం సాంగత్యం ఉదయం పూట నాకు కొత్తకాకపోయినా, ఈరోజు ప్రత్యేకంగా చలాన్ని మనసుకు హత్తుకున్న ఫీలింగ్ కలిగింది. అతను మరింత దగ్గరగా అనిపించాడు. మెహెర్ వాక్యాలు ఎప్పుడో చదివేసిన అనుభూతి కలిగింది. గతంలోనే అమీనాపై మెహెర్ వ్యాసం రాసినా, ఇప్పుడే మొదటిసారి చదివాను. మామూలు నా రద్దీ సమయంలో ఆ వ్యాసాన్ని చదవబుద్దేయలేదు. చక్కని ప్రశాంత ఉదయంలో చలాన్ని ఆకళింపు చేసుకోవడం నిజంగా గొప్ప అనుభవం. అలాంటి రచనను అందులోని అద్భుతమైన ఘట్టాలను, వ్యాక్తులను, పాత్రలను తలుచుకోవడం అదీ ఉదయంలో నాకు చాలా మంచి అనుభూతిని ప్రసాదించింది. మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఒక్కద్దాన్నే కూర్చుని చదివాను. అచ్చులో లోపాలను వెతికేందుకు చదువుతున్నానన్న మాట మరిచిపోయాను. చలం తనలోకి లాగేసుకుంటాడు. నాకు అర్థం అయిన అతని రాత తాలూకు స్పర్శ అలాంటిదని నా అభిప్రాయం. అతనితో అతని రచనతో కలిసిపోవడం బావుంటుంది. అమీనాలో అతను చూసిన అమాయకత్వాన్ని, ఆమె మీద ఇష్టాన్ని, ప్రేమని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు, చూపించలేకపోయాడనే ఆలోచన నాకు అస్తమానూ కలుగుతుంది. అదే ఈరోజూ కలిగింది. సంఘం కట్టుబాట్లను పట్టించుకోని చలం, గౌరవమైన ఉద్యోగం అంటాడు.. కట్టుబాట్లలో లేని వాడికి ...