ఎన్నో జ్ఞాపకాలను పారేసుకున్నాను ఇక్కడ.. అదే ఇక్కడే..
ఆ గుడి మలుపులో.. ఆ సంతలో.. ఆ కాలవ గట్టున మర్రి చెట్టు కింద..
మధ్యాహ్నాలు గన్నేరు పూల చెట్టుకింద ఉప్పల గుప్ప ఆడిన రోజును వెతుకుతున్నాను..
తాటితాండ్ర, రేగిపళ్ళు పంచుకున్న స్నేహితుల కోసం వెతుకుతున్నాను..
చెట్టుకొమ్మల్లో జామకాయలు అందుకున్న నేస్తాలకోసం వెతుకుతున్నాను..
చిలిపిగా ఎప్పటికీ విడిపోమని చేసుకున్న బాసలను వెతుకుతున్నాను..
దీపాల వేళ నిదురలో కలవరించిన అమ్మమ్మ మీది బెంగను వెతుకుతున్నాను..
వాకిట్లో వేసిన రంగవల్లుల సొగసును.. నాన్న ఇచ్చిన మెచ్చుకోలునూ వెతుకుతున్నాను..
నేను చేసిన అల్లరికి నాయనమ్మ తిట్టే తిట్లను వింటూ అమ్మ చూపించిన కోపాన్ని వెతుకుతున్నాను..
నాజూగ్గా పండిన గోరింటాకు చేతులను చూసి మురిసిపోయిన చిన్నతనాన్ని వెతుకుతున్నాను..
ఏదీ కనిపించదే.. దివిటీలు పట్టుకుని వెతికినా ఆనాటి రోజులు మళ్ళీ తిరిగిరావేం..
No comments:
Post a Comment