Wednesday 6 September 2017

ఈమధ్య నేను చదివిన కథ.......






బిడ్డను పోగొట్టుకోవడం అన్నది ఓ శాపం. చెట్టుకు వచ్చిన పిందెలన్నీ నిలవనట్టే పుట్టిన బిడ్డలందరూ నూరేళ్ళు ఉండాలని లేదు. కానీ కలనైనా తన బిడ్డలు దీర్ఘాయువుతో ఉండాలనే కోరుకుంటుంది ప్రతి తల్లీ. విధి మోసం చేసినప్పుడు. తన బిడ్డను ఎత్తుకుపోయినప్పుడు. ఆమెకు మిగిలేది మరో ప్రపంచమే. తను తప్ప ఎవరూలేని ప్రపంచం.  ఈ ప్రపంచాన్ని, ఈ బాధను నేను ఇంతకముందు ఎరిగి ఉన్నాను కనుక ఈకథ నన్ను చాలా సులువుగా తనలోనికి లాగేసుకోగలిగింది.

“బదిలీ” ఇది కథకాదు. ఓ అమ్మ ఆక్రోశం. ఆమె పోగొట్టుకున్న బిడ్డకోసం పడే వేదన. ఆమెకు మాత్రమే సొంతమైన ప్రపంచానికి కాసేపు మనల్నీ తీసుకువెళ్ళి తన కథ చెప్పి, తిరిగి పంపేస్తుంది. ఆమెతో పాటుగా ఆ కథలోకి వెళ్ళినప్పుడు కన్నీరు ఎప్పుడు నాకళ్ళలో పుట్టి చెంపల మీదుగా జారిందో గమనించనేలేదు నేను. అలా వెళ్ళడం ఒక్కటే నా చేతుల్లో ఉంది. కథ చదవడం పూర్తి కాగానే నేను ఎంత బలంగా ప్రయత్నించినా అణువంతైనా ఈ కథ తప్ప మరోటి ఆలోచించలేని స్థితికి వచ్చేసాను. ఏదో బాధ. అందులోంచి కథలో ఉన్న సారాంశం అంతాపట్టుకుని ఆలోచించే శక్తిని కోల్పోయాను అనిపిస్తుంది. నన్ను పట్టి ఆపేసింది. ఆ తల్లీ బిడ్డలే. వారే ఉన్నారు నేను చదివిన, నాకు అర్థమైన చోటల్లా.

కొన్ని కథలు, అందులోని పాత్రలు మనల్ని వెంటాడటం మామూలే, కానీ అదే కథ నీ జీవితంలో జరిగి, నీకూ ఆ బాధ తెలిసినప్పుడు అప్పుడు నీ మానసిక స్థితి ఏలా ఉందో రచయిత(త్రి) కచ్చితంగా చెప్పగలగటం ఓ అద్భుతమే.

రచయిత్రి ఆర్. వసుంధరా దేవి గారు రాసిన ఈ “బదిలీ” కథ ఓ తల్లి బిడ్డను పోగొట్టుకున్నప్పుడు ఆమె అనుభవించే మానసిక స్థితి. మిగతా కథంతా కొత్తగా ఏం అనిపించలేదు. పట్టలేనంత బాధను భరించాల్సి వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్నవారు ఆ బాధను పంచుకోనప్పుడు ఆమె పడే వేదన అక్షరాల్లో వర్ణించలేనిది. ఎవరు మరిచిపోయినా ఆ బాధను తల్లి మాత్రం ఎప్పటికీ మరువలేదు.

ఒక కోట్ : నాకు ప్రపంచం లేదు. బదిలీ అయిపోయింది. నాలోకి బదిలీ అయిపోయింది. ఇప్పుడు నేనే ప్రపంచాన్ని.

Saturday 2 September 2017

ఈమధ్య నేను చదివిన కథ..........




చలం ఈ పేరు వెనక ఓ అగాథం, ఓ అంతుచిక్కని రహస్యం కనిపిస్తాయి ఎప్పుడూ. నిజానికి ఆయన నాకు ఎప్పటికీ అర్థం అయ్యీ అవ్వనట్టు ఉండిపోతాడు కామోసు. ఆయన రచనలు ఏది చదివినా కొన్ని రోజులపాటు వెంటాడి వేధిస్తాయి. ఈమధ్య నేను చదివిన “సుశీల” కూడా అలానే అనిపించింది. ఓ వందేళ్ళ తర్వాత కూడా మనిషి ఆలోచనా తీరుకు సరిపడా చలమే ఆలోచించేసి తన వాదనలని లేదా సందేశాల్ని ఇలా కథల రూపంలో మన మీదకి వదిలేసాడా అనే అనుమానమూ కలుగుతుంది నాకు. ఆడదానికి స్వేచ్ఛ లేదు అని తన ప్రతి కథలోనూ చెప్పుకొచ్చే చలం ఈ కథలో పూర్తి స్వేచ్ఛ ఉండీ ఆకర్షణలో పడే స్త్రీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ కథకు సుశీల అని పేరు పెట్టినా నాకు ఆమె భర్త అయిన నారాయణప్పగారి గురించే కథ చెప్పాడు అనిపించింది. అతని చుట్టూ మాత్రమే సుశీల ఉంది అనిపించింది.

ప్రేమకి, ఆకర్షణకి, వాత్సల్యానికి, బాధ్యతకి తేడాను చూపుతూ సాగుతుంది కథ. అతడు ఓ సంఘసంస్కర్త, భార్యను అప్పటి సమాజ కట్టబాట్లకు తగ్గట్టు వంటగదిలో కూర్చోబెట్టలేదు. ఆమెకు ఆస్తి, హోదా, తన స్నేహితులతో కలిసి తన వాదనలు వినిపించే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె చేస్తున్నది తప్పని తెలిసినా ఎక్కడా సుశీలను కట్టడి చెయ్యాలనే ఉద్దేశ్యం లేనివాడిగా కనపడతాడు. ఓ కోణంలోంచి ఆలోచిస్తే అసమర్థునిగా కూడా కనిపిస్తాడు.

ఇటు భర్తను మోసగించి మరో వ్యక్తితో ప్రేమలో పడటం అన్నది సులువుగా జరిగినా భర్తను వదిలివెళ్ళేందుకు ఆమె చెప్పే కారణాలు సుశీలకు తన భర్తమీద ఉన్న ప్రేమను, భార్యగా ఆమెకున్న బాధ్యతను చూపుతుంది. నేను ఆలోచించింది సుశీల వైపు నుండీ కాదు. అలా అని ఆమె చేసింది తప్పనీ అనను. ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న చిన్న గీతను మాత్రమే చూసాను. కథ అంతలోనూ నాకు నారాయణప్పగారి వ్యక్తిత్వం నచ్చింది. అదే నన్ను ఇంకా లోతుగా ఈ కథ గురించి ఆలోచించేలా చేసింది.

ఒక కోట్:  “కొందరు స్త్రీలు వారినెవరికిచ్చి పెళ్ళి చేస్తే వారిని వెంటనే ప్రేమిస్తారు. ప్రేమించినట్టే వుంటారు. ప్రేమించామనే వారూ అనుకుంటారు. దాంట్లో యేమీ మోసం లేదు. చాలా నమ్మకస్తులు. కానీ యెప్పుడో వొకప్పుడు, యెవరో కొత్తవారి మీద నిలపరాని ప్రేమ కలుగుతుంది వారికి. వారి హృదయాలు యెవరికోసం చెయ్యబడ్డాయో అటువంటి వారిని కలుసుకుంటారు. అపుడు ఆ మహాగ్నిలో ఈ పూర్వపు ప్రేమా, నీతీ, విశ్వాసమూ అన్నీ దగ్ధమవుతాయి. యెవరూ ఆపలేరు. కొన్ని బయటకి వస్తాయి. కొన్ని ఒకరిద్దరికి తెలిసి ఆగుతాయి. కొన్ని బైటకి రానేరావు యీ విషయాలు.”

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...