రాజీ.. జీవితంలో..
ప్రతి మనిషి తన జీవితంలో బాగా ప్రేమించిన మనిషి గురించో లేక ధ్వేషించిన వాళ్ళ గురించో మనసు పొరల్లో తేలుతూనే ఉంటుంది. ఇందులో కొన్నిఎంత వద్దనుకున్నా గుర్తుకువస్తూనే ఉంటాయి. మరికొన్ని ఆ జ్ఞాపకాల రొద మొదలైనప్పుడు తెరలు తెరలుగా గతం వైపుకు మన ప్రమేయం లేకుండానే తీసుకువెళతాయి. ఇలా ఆలోచించిన ప్రతిసారి నా మెదడులో ఓ ఆలోచనగా పుట్టి దానికి రూపాన్ని ఇస్తే అది మా రాజీ పిన్నే అవుతుంది. ఇంత బలంగా ఆమె నాలో నిలిచిపోడానికి కారణం బాల్యం అద్దిన రంగుల తెరమీద రాజీ పిన్ని జీవితాన్ని దగ్గరగా చూడగలగడమేనేమో. కాలం కొన్ని కట్టుబాట్లకు కట్టేస్తే ఆ గుంజ చుట్టూతా తిరక్కుండా.. పలుపుతాడును తెంపుకు పారిపోయిన లేగ దూడలా అనిపిస్తుంది రాజీ పిన్ని. తను అలా మనసులో మెదిలిన ప్రతిసారీ తనకూ, నాకూ జీవితం ఒకలానే రాత రాయాలనుకోవడమే నన్ను పిన్నికి దగ్గరచేసిందా అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా రూపంలో కూడా మా ఇద్దరికీ పోలికలు ఉండటంతో నేను ఆమెను ఇంత దగ్గరగా తెచ్చుకోగలుగుతున్నానేమో తెలీదు. నాలుగురోజుల క్రితం తననుంచీ వచ్చిన ఆ ఫోన్ కాల్ మళ్ళీ నన్ను రాజీపిన్ని చూట్టూ నా బాల్యాన్ని వెతుక్కునే ఆలోచనలో పడేసింది. “ ఏలా ఉన్నావే.. ఎక్కడ...