పంచాయతీ మెట్లు





ఫ్రెండ్ దగ్గర ఫిజిక్స్ పుస్తకం తీసుకుని ఇంటికి వస్తుంటే, గుర్కావోళ్ళ బీడు దాటాకా, ఎర్రమట్టి రోడ్డంపట పసుపునీళ్ళు కాలవ కట్టి, ఆ దారంతా బురదైపోయింది. ఉదయం ఇటెల్లినప్పుడు లేని బురద ఇప్పుడెలా వచ్చిందా అని సైకిల్ నెమ్మదిగా దాటిస్తుంటే.. ఆ మలుపులోంచి పెద్దగా శోకండాలు ఇనిపించాయ్. ఈ ఊళ్లో పెళ్లయినా, చావైనా ఈ శోకండాలు మామూలే. పెళ్ళయితే పిల్ల అత్తారింటికి పోతుందని, చావైతే అందరిలానే చచ్చినోడి మీద ప్రేమతోనో తీసుకున్న అప్పు ఎగొట్టాడనే బాధతోనో రకరకాలుగా ఏడుత్తారు. 

ఆ ఏడుపులు కృష్ణమూర్తి ఇంటి నుంచే వచ్చేది. వాళ్లమ్మ గానీ చచ్చిపోయిందాని సైకిల్ ఆపి సందులోకి తిరిగితే చామంతి, గులాబీ పూరేకులు నేలంతా పడున్నాయ్. తెలిసిన ఆడోళ్ళంతా ఆ ఇంటి ముందు టెంటులో కూచుని ఉన్నారు. చచ్చిపోయింది వాళ్లమ్మ కాదు, కృష్ణమూర్తే! కుర్చీలో చామంతి దండేసిన కొడుకు ఫోటో ముందు తలబాదుకుంటూ ఏడుత్తుంది వాళ్ళమ్మ. పక్కనే స్టీలు గ్లాసులోని అగరబత్తుల చుట్టూ అప్పటి వరకూ వెలిగి ఆరిన బూడిద పడుంది. ఎలా చచ్చిపోయాడని మా క్లాసు సూరి గాడిని అడిగితే గుండె పోటన్నాడు. “ఆదోరం బానే ఉన్నాడు. నిన్న మధ్యాన్నం కొద్దిగా నీరసంగా ఉందని చెప్పి ఆసుపత్రికెల్లొచ్చాకా, రాత్రి నిద్దట్లో గుండాగిపోయిందంట. శవాన్ని ఇప్పుడే శ్మశానానికి తీసుకుపోయారు” అని చెప్పాడు. 

నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆ మనిషి గుండెనొప్పి వచ్చేంత పీలగా ఉండడు. మంచి రంగుతో దిట్టంగా, బరువైన మనిషి. వయసు సరిగ్గా తెలీదు కానీ, మీసాలు తీసేసి, బైక్ మీద ఫోజులు కొడతా తిరిగేవోడు. నేను గౌనుల్లో ఉన్నప్పటి నుంచి, తర్వాత పరికిణీలు, ఓణీల్లోకి మారినా అతనిది అదే వాటం. 

***

నాన్న ఉద్యోగం కారణంగా మేం ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకి వచ్చేనాటికి ఇక్కడ చుట్టూ తాటిచెట్లతో కట్టవ మాత్రమే ఉండేది. గవర్నమెంటు టెండర్లు వేసి కాంట్రాక్టర్లతో ఈ పద్నాలుగు ఎకరాల చుట్టూ గోడ కట్టించాలనుకుంది. అప్పుడే ఇక్కడికి వచ్చాడు కృష్ణమూర్తి. ఓ కాంట్రాక్టరు చేతికింద పద్దులు రాస్తూ, కూలీలతో పని చేయిస్తూ తెగ హడావుడి చేసేవాడు. 

ఒకరోజు మధ్యాహ్నం ఎండలో  పిల్లలమంతా నీళ్ళ బోదిలో ఈత కొడుతుంటే, బోరు అరగంట నుంచి తిరుగుతుందని, మోటరు ఆపేందుకు మా ఇంటి వైపొచ్చాడు మొదటిసారి. గట్టు మీద నిలబడి, “ఏయ్ పిల్లలు ఏంటిది.. బోరు ఊరికే వదిలేస్తే ఎలా.. మీ నాన్న లేడా” అని గదమాయించేసరికి.. “నాన్నేంటి.. నాన్నగారు! ఆ షెడ్డులో ఉన్నారు. అక్కడికి పోయి అరవరా!” అన్నాను.

కోపంగా ముందుకు వంగి నా మీదకు రాబోయాడు. ఈలోగా “ఎవరదీ. ఏంకావాలంటూ” వచ్చింది అమ్మ. అతను కాసేపు ఆమెనే చూస్తూ, “అది అదేం లేదండీ.. మోటరు తిరుగుతుందని.. కట్టేద్దామని వచ్చాను,” అని నసిగాడు. 

మా అమ్మ ఎవరినీ అంత త్వరగా పలకరించే మనిషి కాదు. రూపంలో అందంగా  ఎదుటోళ్ళని చూపుల్తో నిలబెట్టేస్తుంది. కోపం వచ్చిందా అదే చూపులతో కాల్చేస్తుంది కూడా.

ఆ రోజే మా పిన్ని కూతురు ఈశ్వరి చెప్పింది వాడిని ఊళ్ళో అంతా సల్మాన్ ఖాన్ అంటారని. “వాడు సల్మాన్ ఖాన్ ఏంటే, వాలకం చూస్తే చీకేసిన తాట్టెంకలా ఉంటే!” అని వెటకారంగా నవ్వాను. అది మొదలు కృష్ణమూర్తి ఎక్కడ కనిపించినా “సల్మాన్” అని పిలిచి, గట్టిగా నవ్వేదాన్ని. నేను ఒక్కద్దాన్నేనా, మా స్కూలు వైపు వచ్చాడంటే స్నేహితులందరం కలిసి “సల్మాన్ సల్మాన్” అని ఏడిపించేవాళ్ళం. వాడికి నా మీద పీకలదాకా కోపం వచ్చినా, మా అమ్మంటే ఉన్న భయంతో కోపాన్ని లోపలే మింగేసేవోడు.

సల్మాన్‌కి ఆడపిల్లల పిచ్చి బాగా ఉండేది. యార్డ్ లోకి పనికోసం వచ్చే ఆడాళ్ళతో ఎటకారాలు ఆడేవాడు. వాళ్ళలో వాణి అని ఒక అమ్మాయుండేది. గుర్కావోళ్ళ బీడులో ముందొరస పాక. నాన్న చిన్నప్పుడే పోతే చదువు మానేసి, కూలి పనులకి ఎళ్ళేది. వాణీ నాకన్నా పెద్దది, ఓ పద్దెనిమిదేళ్ళుంటాయి. ఎవరిని చూసినా నవ్వుతూ పలకరించేది. చెల్లెళ్ళతో తొక్కుడు బిళ్ళ ఆడేప్పుడు అన్నం తినడానికి బోరు వైపు గానీ వస్తే, కాసేపు మాతోపాటు ఆడేది. మనిషి లంగా ఓణీలో ముఖం మీద సోబి మచ్చలతో మోటుగా ఉండేది. మా అమ్మ అప్పటికి ఏం అనకపోయినా తర్వాత ఆ పిల్లతో ఎందుకు ఆడారని తిట్టేది.

***

కొద్దిరోజులుగా వాణీ మా యార్డు వైపు రావడం పూర్తిగా మానేసింది. అమ్మని అడిగితే “దానికి ఇటువైపు వచ్చి తినాల్సిన పనేంటే.. యార్డు మొత్తం సల్మాన్ గాడితో తిరగడమే సరిపోతుంది. అయినా అదెటుపోతే మీకెందుకు పోయి ఆడుకోండి” అని కసిరేసింది. 

ఎండాకాలం మొదట్లో  స్కూలు అయిపోయాకా, పిల్లలంతా మామిడి పిందెలకని సుబ్బారావుగారి మామిడి తోటకి వెళితే ఓసారి సల్మాన్‌తో పాటూ వాణీ కనిపించింది. మమ్మల్ని చూసి అప్పటికి తలవంచుకుని వెళిపోయింది కానీ.. ఆ తర్వాత నుంచి అక్కడికి వెళ్ళిన ప్రతిసారీ తోటోళ్ళ కాపలా గుడిసెలో వాణీ, సల్మాన్ కనిపించేవాళ్ళు. ఇద్దర్నీ పాక దడిలోంచి చూసి గట్టిగా “సోగ్గాడు సల్మాన్” అని ఏడిపించే వాళ్ళం. 

ఓరోజు వాణీ వాళ్ల అమ్మా, పిన్నీ కలిసి యార్డులో కాంట్రాక్టర్‌తో గొడవ పడుతుంటే నాన్న ఏంటో కనుక్కోడానికి ఎళ్ళారు. నేనూ ఆ గొడవేంటో చూడాలని నాన్న వెనకే పోయి జీడిచెట్టు ఎక్కి కూచున్నాను. వాణీ అమ్మ గట్టిగా అరుస్తుంది. సల్మాన్ టాక్టర్ చక్రానికి ఆనుకుని, తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాడు, తన తప్పులేదన్నట్టుగా. అప్పటికి వారం నుంచి వాణీ యార్డు వైపు రావడంలేదు. “పిల్లని తిప్పుకున్నన్ని రోజులు కూడా తిప్పుకుని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేసాడు బాబు. తండ్రిలేని పిల్ల.. మీరే అతగాడ్ని అడిగి చూడండి..నిజమో కాదో” కన్నీళ్ళు పెట్టుకుంది వాణీ తల్లి. 

కాంట్రాక్టర్ “నాకేం తెలుసునమ్మా, కూలికి వస్తే సాయంత్రానికి ఇంతని లెక్కగట్టి ఇచ్చి పంపడం తప్ప. ఎవరు ఎవరితో తిరుగుతున్నదీ చూసుకుంటూ కూచోవడమేనా నా పని. అయినా ఆడు మగాడు ఎలాగన్నా తిరుగుతాడు. నీ పిల్లకేం వచ్చింది. బరితెగించి తిరిగితే కడుపు రాదా.. పోమ్మా ఇక్కడ నుంచి..  నా పని చెడగొట్టకుండా.. పంచాయితీకి పోయి చెప్పుకో” కసురుకున్నాడు. 

అక్కడున్న ఎవరూ ఆమె వైపు మాట్లాడకపోయే సరికి ఆమె తన చెల్లెల్ని తీసుకుని ఏడుస్తూ వెళిపోయింది. 

తర్వాత వాణికి న్యాయం చేయమని విషయాన్ని పంచాయితీలో పెట్టింది వాళ్ళమ్మ. పంచాయితీ పెద్దలు కృష్ణమూర్తి పనిచేసే చోటు కాబట్టి మా యార్డులో అందర్నీ కూడా కలిసి, మా నాన్నతో కూడా మాట్లాడి వెళ్లారు. నాన్నని పంచాయతీకి వచ్చి సాక్ష్యం చెప్పమన్నారు. వాళ్ళు అలా వెళ్ళగానే అమ్మ విషయం ఏంటని అడిగింది. “ఏముంది వాణికి, కృష్ణమూర్తికీ ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం చెప్పమంటున్నారు. అతను పెద్ద కులపోడు కదా” అన్నారు నాన్న. 

అమ్మ నాన్న మీద కస్సుమంది, “ఏం మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళి పంచాయతీలో! వాళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి చేసిన దానికి, మనం ఎటు చెప్పినా కక్ష పెట్టుకుని రేపు మన పిల్లల మీద పడతారు. ఊరుగాని ఊరు వచ్చాం. ఇది ఓరోజుతో పోయేది కాదు. ఎవరికీ ఏమీ చెప్పద్దు. పంచాయితీ రోజు పనుందని కాకినాడ ఎళిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను” అంది. 

***

పంచాయితీ రోజు. అమ్మ చెప్పినట్టుగానే ఒక రోజు ముందే నాన్న కాకినాడ ఎళిపోయారు.  మా స్కూల్లో మధ్యాహ్నం ఇంట్రవెల్లో నానాజీ షాపు ముందు మేం నలుగురు ఫ్రెండ్స్ కలుసుకున్నాం.

“ఆళ్ళిద్దరూ ఆ తోటలో ఉండటం మనం చూసాం కదే” అన్నాను.

“ఆ చూసాం.. కానీ ఆ సంగతి పంచాయితీలో చెబితే మన పెద్దోళ్ళు చంపేయరూ,” ముందే కంగారు పడింది శ్రీదేవి.

“మరెలా.. పాపం వాణి.. ఈ సల్మాన్ గాడిని నమ్మేసింది. ఎలాగే.. ఏదైనా ఆలోచించండే” అన్నాను. 

మంగతాయారు “ఏంటి ఆలోచించేది.. ఎనిమిదో క్లాసు చదివే మనం ఎల్లి ఏం చెప్పినా ఎవరూ పట్టించుకోరు. పైగా పిల్లకాయలకి ఇక్కడ పనేంటని తరిమేత్తారు. అక్కడికి పోయి చెబితే వాణి సంగతి ఏమోగానీ… ఇళ్ళల్లో మనందరి ఈపులు సాపైపోవడం ఖాయం” అంది. 

“మీ నాన్నే వంక పెట్టి ఊరికి ఎళిపోయాడు. మనం ఏం చేయగలం. వాణి మీద మనం జాలిపడతాం సరే, రేపు మన మీద ఎవరూ జాలి పడరే. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు” ఓ పక్క నుండి అంతా నీరుగార్చే పనిలో ఉంది శ్రీదేవి. 

“వాణీ కూడా మనలాంటిదేనే.. ఈరోజు వాడు దాన్ని ఇంత చేసాడు. రేపు అదే నేనైతే మీరు ఇలాగే పిరిగొడ్డుల్లా మాట్లాడతారా” అన్నాను. మంగ సర్రున బెంచి మీంచి లేచి “అమ్మా తల్లీ.. వాడితో నువ్వు.. ఛీ ఛీ.. పోలిక చాలా దరిద్రంగా ఉంది.. ఇంక ఆపేయ్.. నీకో దండం” ముఖం చిరాగ్గా పెట్టింది.

“నీకేమే బాగానే వెళదాం.. చెబుదాం అంటున్నావ్ కానీ.. మా అమ్మ కొట్టే దెబ్బల కన్నా.. తిట్టే తిట్లు భరించలేం. రెండు వీధులకి ఇనిపించేలా తిట్టుద్ది” అంది మంగ. 

ఇదే సందని సరోజ మొదలెట్టేసింది. “మా అమ్మ కూడా అంతేనే.. కొట్టడం మొదలుపెడితే చేతిలో ఏం ఉన్నదీ చూసుకోదు.. చీపురుకట్ట, పాల చెంబు, గరిటే ఏదైనా ఇసిరేసి తర్వాత కొట్టడానికి కర్ర గురించి ఎతుకుద్ది తెలుసా”

“ఏమే.. కొడితే కొట్టించుకోవచ్చు. దెబ్బలు నాలుగు రోజులుండి మానిపోతాయ్. కానీ మా అమ్మ చదివింది చాలు..పెళ్ళి చేసేత్తానంటాదే.. మీకు తెలుసుకదా.. పదో క్లాసు కాందే పెళ్ళి చేసుకోను నేను” అని శ్రీదేవి. 

“పోనీలేవే.. నీ మావయ్యంటే నీకు ఇష్టమే కదా. పెళ్ళయ్యాకా.. అక్కడే చదువుకో. నీకు ఈ తన్నులు కూడా తప్పుతాయ్” అన్నాను. అంతా హాయిగా నవ్వుకున్నాం. 

ఇలా చాలాసేపు కూచుని ఆలోచించాకా.. సరోజ, నేను, మంగతాయారు, దేవి కలిసి ఏది ఏమైనా సాయంత్రం పంచాయితీలో వాణీ, సల్మాన్ కలిసి తిరిగింది మేం చూసామని చెప్పేయాలనుకుని నిర్ణయానికి వచ్చాం. సరోజ వాళ్ళమ్మ కొట్టే దెబ్బల భయానికి గుర్కావోళ్ళ బీడు దాటగానే జారుకుపోయింది ఏడుపు ముఖం ఏసుకుని. మేం ముగ్గురం మాత్రం పంచాయితీ ముందు సైకిళ్ళు ఆపి భయం భయంగానే అందరూ వచ్చే వరకూ ఎదురు చూసాం. అక్కడ చాలామంది నాకు తెలిసినోళ్ళే. మా ఇంటి చాకలి, పాలేరు ఈరిగాడు, ఆడి పెళ్ళాం పంచాయితీకి ఒచ్చారు. పాల కేంద్రం దగ్గర అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే ముసలోళ్ళంతా చేరారు. కొందరు తెల్ల పంచల్లోనూ, ఇంకొందరు పనికెళ్ళి వస్తూ భోజనం క్యారేజీలతో, భుజాన పారా గునపాలతో చేతిలో కొడవళ్లతో నిలబడిపోయారు. తీర్పులో ఏం చెబుతారా అని కొందరూ, ఆ ఎప్పుడూ చెప్పేదేకదా జరిమానా కట్టించి వదిలేత్తారని కొందరూ మాట్లాడుకుంటున్నారు. మేం ముగ్గురు ఫ్రెండ్స్ పంచాయితీకి పక్కనే, ఓ ఎత్తు అరుగు మీద నిలబడి చూస్తున్నాం.

సల్మాన్, వాణితో పాటు, వాళ్ల పెద్దోళ్ళు కూడా వచ్చారు. వాణీ ముఖం ఏడ్చి ఏడ్చి అలసటతో వాడిపోయి ఉంది. సల్మాన్ ఎప్పట్లానే నవ్వు ముఖంతోనే లోపలికెళ్ళాడు. ఊరి వాళ్ళెవ్వరూ ఇద్దరూ కలిసి తిరిగింది చూడలేదని చెప్పారు. వాణీ ఎక్కడో ఎవరితోనో తిరిగి వచ్చిందని, ఈ ఊరిలో వాళ్ళెవరూ తన కడుపుకి కారణం కాదని తేల్చేసారు పంచాయితీ పెద్దలు. చాలా సేపు వాదించుకున్నారు ఇద్దరి వైపు పెద్దవాళ్ళు. పంచాయితీ పెసిడెంటు ఐదు వేల నగదు, రెండు మేకల్ని జరిమానా కట్టేలా తీర్పు ఇచ్చాడు. తీర్పు విని వాణీ బిగ్గరగా ఏడుస్తున్న ఏడుపు తప్పితే కాసేపు ఇంకేం వినిపించలేదు అక్కడ.

అప్పుడే మేం ముగ్గురం పంచాయితీ మెట్లెక్కి లోపలికెళ్లాం. జనాలంతా మా వైపు ఏంటి సంగతన్నట్టుగా చూసారు. పెసిడెంటు మమ్మల్ని చూడగానే, “చదువుకునే ఆడపిల్లలకి ఇక్కడేం పని పోండి” అంటా గట్టిగా అరిచాడు. బెదిరిపోయిన మంగా, శ్రీదేవి నా చేయి విడిపించేసుకుని వెనక్కు ఎళ్ళబోయారు. నేను కాస్త ధైర్యం తెచ్చుకుని “ఈళిద్దరినీ మేం సుబ్బారావు మామిడితోటలో చాలాసార్లు చూసాం,” అన్నాను. పంచాయితీలో అందరూ మాట్లాడటం ఆపేసి నా వైపే చూస్తున్నారు. వాణి ఏడుపు కూడా ఆగింది. 

“అవును మేం వీళ్ళని ఆ గుడిసెలో ఉండగా చూసాం. పాపం వాణి చాలా మంచిది. మీరు బీదోళ్లయితే పట్టించుకోరని తెలుసు. మీ కులపోళ్ళు తప్పు చేసినా ఎనకేసుకుని వచ్చి చిన్నచిన్న జరిమానాలేసి వదిలేస్తారనీ తెలుసు. ఎప్పుడూ ఇంతే కదా,” అని ఇంకా ఏదో అనబోతుంటే–. 

“ఏయ్ పిల్లా.. నోటికొచ్చింది వాగితే.. చెట్టుకు కట్టేయిత్తాను.. మీ నాన్న వచ్చి జరిమానా కట్టి ఇడిపించుకెళ్లాల్సి ఒత్తాది” అరిచాడు పెసిడెంటు.

“చూసింది చెబుదామని వచ్చాం” అన్నాను. 

“ఏం చెబుతారు.. చెప్పింది చాలు. మర్యాదగా ఇక్కడ నుంచి పోండి,” పెద్దలంతా కలిసిపోయి అరిచారు. వచ్చేస్తుంటే వాణి ఇంకా బిగ్గరగా ఏడుస్తూ ఉండిపోయింది.
  
ఆ రోజు సాయంత్రం మా అమ్మ చింతబరిక తీసుకుని అది చీకిపోయి, ఇరిగేంత వరకూ కొట్టింది. మంగా, శ్రీదేవి వాళ్ళ ఇళ్ళల్లో కూడా పరిస్థితీ అదే అని మరుసటి రోజు స్కూల్లో తెలిసింది. ఓ పక్కకి పోయి ఎవరికి ఎన్ని వాతలు తేలాయో చూసుకుని నీళ్ళు తిరిగిన కళ్ళతో నవ్వుకున్నాం. 

***

ఆరోజు పంచాయితీ తర్వాత వాణీ సంగతి ఏమైందో ఎవరికీ తెలీదు. తను మళ్లీ గుర్కావోళ్ల బీడులో కనిపించలేదు. నెమ్మదిగా తన విషయం అందరితో సహా ఊరూ మర్చిపోయింది. కృష్ణమూర్తి బాగా కట్నం తీసుకొని, ఘనంగా పెళ్ళి చేసుకున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ ఊళ్ళోనే స్థిరపడ్డాడు. పలుకుబడి పెరగటంతో పాటే, ఆ తర్వాత ఆడోళ్ళని ఏం చేసినా ఇక జరిమానాలు కూడా కట్టే సందర్భాలు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడన్నా దారంట ఎదురైతే, నా ముఖంలోకి కోపంగా చూసేవాడు. నేను మరీ గుర్తుపట్టినట్టుగా కాకుండా చిన్న నవ్వు నవ్వేసి అక్కడ నుండి వెళిపోయేదాన్ని. 

సరోజ పదోతరగతి అవగానే వాళ్ళ పెద్దమ్మ పిల్లల్తో కాకినాడ ఇంటర్ కాలేజీలో చేరిపోయింది. మంగతాయారు, నేను అనపర్తి ఇంటర్ కాలేజీకి రోజూ బస్ కెళ్ళి వస్తున్నాం. ఇక శ్రీదేవి పదో తరగతి అవ్వగానే వాళ్ల మావయ్యను పెళ్ళి చేసుకుని, కాపురం చేసుకుంటూ ప్రెవేటుగా ఇంటర్ కట్టింది. ఫ్రెండ్స్ నలుగురం ఊళ్లో బంగారమ్మ జాతరకి తప్పకుండా కలుసుకుని ఏడాది కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాం.

***

ఇలా గుండెపోటొచ్చి కృష్ణమూర్తి చనిపోయిన చాలా రోజులకి వాణీ తిరిగి ఊరికి వచ్చిందని తెలిసి, సైకిలు మీద గుర్కావోళ్ళ బీడు కేసి ఎళ్ళాను. వాళ్ళ పాక ముందు రోట్లో పిండి రుబ్బుతూ, పక్కనే కూచున్న తన నాలుగేళ్ల కొడుకుని సుద్ద తినద్దని అరుస్తూ కనిపించింది.

*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"