పోస్ట్‌లు

2024లోని పోస్ట్‌లను చూపుతోంది

సాక్ష్యం ఏదీ..

ఇంకిపోయిన ఇష్టాల ఆనవాళ్ళు తడుముతుంటే.. కాలానికి అడ్డంపడి చక్రాల కింద మన ప్రేమ నలుగుతుంది. తొలిపొద్దు మలిపొద్దుగా మారి జారిన కాలానికి పరుగందుకుంది..  జోలపాటగా మారిన ఊసులన్నీ ఏమైనట్టూ ఊరికే ఊగాడిన మనసు బాసలన్నీ ఎటు వైపుగా దారి తప్పిపోయాయి.. ఈ మనసు గురుతులు తప్ప మరే ముంది సాక్ష్యం చుట్టుకున్న చలిగాలిని ఆపాలనీ ఆ నెగళ్ళ చుట్టూ చలికాచుకున్న కాలాన్ని.. జ్ఞాపకాలలో చేర్చాగలనా..  ఎన్ని ప్రేమ సందేశాలు పంపాను దేనికీ జవాబు లేదు.  నీటి పొరలు కళ్ళకు అడ్డంపడి మసకబారిన చూపులకు ఎటు చూడు నీ రూపమే..  ఎన్ని రోజులని వెతకను ఆత్రపడే మనసు కరువైపోయాకా మిగిలిన ఈ శూన్యాన్ని పేర్చుకుంటూ.. పోతున్నాను.

నీలోకి ఒలికిపోయాననీ..

చిత్రం
ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి వీడ్కోలు పలికాను. అసంపూర్ణంగా ఉన్న చాలా ప్రశ్నలకు జవాబులు వెతికాను. నీకిదంతా ఉత్త చాదస్తంగా  అనిపిస్తుంది కానీ.. రద్దీ రద్దీ దారులంట పోతున్నా  నీ ఆలోచన నిలువనీదు. ఏదో కంగారు.. పూల దారులంట నడిచినా మబ్బులు, మెరుపులు, చినుకులు..నువ్వు కమ్మేసినట్టూ ఉంటుంది.  ఉదయాలన్నీ నక్షత్రాల వేళలోకి కలిసిపోయేవేలే అనే భావన కలుగుతుంది.  విషాదాన్ని మోయగలిగేది,  కన్నీరును ఆపగలిగేదీ నీ ఊహే నాలోకి తొంగి చూసుకున్నా నువ్వే.. నమ్ము

మనసు ఆగం అయిపోనాది.. థ్యాంక్యూ 'సన్ ఆఫ్ జోజప్ప'

చిత్రం
ప్రతి జీవితానికి దాటి వచ్చిన దారి ఒకటి ఉంటుంది. పుట్టుక నుంచి చావుదాకా దాటేసి వచ్చిన బాల్యం, కౌమారం, యవ్వనం ఇలా దశలన్నీ దాటి వచ్చి అనుభవాల మధింపులో పూర్తిగా జీవిత పరమార్థం తెలుసుకుని నిలబడేందుకు పట్టే సమయం అంటూ ఒకటి ఉండే తీరుతుంది. ముఖ్యంగా ఈ దశలన్నింటిలోనూ ప్రధానమైనది బాల్యం. బాల్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే మోస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ బిడ్డల చూట్టూ ఉండే వాతావరణం, పెరిగే తీరు, మాట్లాడే మాట, బంధాల పటుత్వం, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, సమాజం కూడా వాళ్ల పెరుగుదలను శాసిస్తుంది. ఇదంతా వేదంతంగా కనిపించినా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య దశ బాల్యమే. బాల్యానికి అమ్మానాన్నల ప్రేమతో పాటు చాలా కావాలి. పుట్టుక మనచేతిలో లేనట్టే పెరిగే విధానం కూడా మన చేతిలో లేదు. నాకు తెలిసి బాల్యం ఇంత ప్రాధాన్యమైన దశ అని నేను నొక్కి చెప్పడానికి చాలా కారణాలున్నాయి. బాల్యంలో భయం తెలియక పెరిగే విధానం ఒకలా ఉంటుంది. భయం తెలిసి పెరిగిన పిల్లల తీరు మరోలా ఉంటుంది. అసలు బాల్యమే శాపంగా మారిన పిల్లల జీవితాలు కూడా నేను చూసి ఉన్నాను. మనం మామూలుగా అనుకునే చాలా విషయాలు పిల్లల మనసుల్లో ఎంతగా ముద్రవేసుకుంటాయో.. ఇప్...

బాల్యం లెక్కలు..

చిత్రం
ఇప్పటి నేను ఏ హీరోనూ ఫాలో కాను. ఫ్యాన్ అస్సలే కాను. ఏ రాజకీయ నాయకులతో నాకు పనిలేదు. ఎవరికీ నేను మద్దతులు ఇవ్వను. ఇదంతా స్వవిషయం. సరే దేవానంద్, షమ్మీ కపూర్, గోవిందా, ఇలా కొందరిని మాత్రమే ఆరాధించే నాకు చిన్ననాటి జ్ఞాపకంలో ఓ హీరో అలా నిలిచిపోయాడు. ఎంత ఆరాధనో అది. అతని పోస్టర్ ఎదురుగా కూర్చుని ఎంత ఆలోచించేదాన్నో, ఇంటి నిండా సినిమా పోస్టర్లు అతికించే రోజుల్లో పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. తాటాకు తడికలకు సినిమా పోస్టర్లు అతికించేవారు, హోటళ్లకు, ఇళ్ళల్లో కూడా అలా అంటించడం అలవాటుగా ఉండేది. ఇప్పటి రోజుల్లో అయితే గోడ పాడవుతుందని, పెయింట్ పోతుందనే గొడవ అప్పుడు లేకపోవడం సంతోషం. అప్పటి ఊహ, ఆలోచనలు భలే ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటి రోజులకు పూర్తి భిన్నంగా.. కొన్ని జ్ఞాపకాలు ఎంత తీవ్రంగా బలపడిపోతాయంటే ఎంత కాలం అయినా అలా నిలిచిపోతాయి. ప్రేమ అనే మాటకొస్తే అది పుట్టేందుకు వయసుతో లెక్కలు వేస్తాం కానీ.. అప్పటికి ఆరేళ్ళు కూడా లేని నేను ఇతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎవరో ఏంటో కూడా తెలీదు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికి, ఈరోజు వరకూ కూడా అతని కోసం చూసానంటే నమ్మండి. ఈవేళ ఏదో రీల్ చూస్తుంటే కనిపించాడు. వెతగ్గా అతన...

గన్నేరు అక్షరాలు..

చిత్రం
  అలవోకగా కవిత పుట్టడం లేదు. లోతుగా తవ్వి తీయాల్సి వస్తుంది. ఒక్కోసారి తెగి, ముక్కలై దొరుకుతాయి అక్షరాలు మరోసారి కన్నీళ్ళు పెట్టించే పంక్తులు పొంగుతాయి. విరహంతో, ప్రేమతో నిండి రేపటిపై ఆశను పట్టుకువస్తాయి. చుక్కలు రాలిపడి, నెత్తురోడుతున్నట్టు వస్తుంది ఆలోచన. అమృతాన్ని నింపే పంక్తులు, ఆలోచనలై రాలిపడే గన్నేరు అక్షరాలు లోన విషాదపు సంగతీ, హృదయాంతరపు సంతోషాన్నీ పట్టుకుంటాయీ అక్షరాలు.. అగాధం నుంచి అనంతం దాకా నాలోని చీకటి కోణాలన్నీ కవిత్వానికి ఎరుకే.. దిగులప్పుడు, ఆనందాన్ని ఎకరువు పెట్టేప్పుడూ మాటలను సంభాళించేది ఈ కవిత్వమే మరి..

గాయం

చిత్రం
చీకట్లో ఓమూల విడిచిపెట్టి పోయే దైన్యాన్ని తగిలించాను. ఒక్క చుక్క అమృతం కోసం సముద్రలోతుల్ని గాలించాను. ప్రశ్నించే నీ కళ్ళలో అమృత జాడల్ని వెతికాను‌. ఏదీ దాచుకోలేదు, జీవితాన్ని తెరచి నీముందు ఉంచాను. ఇదేం హృదయభారమో తెలీదు. ముళ్లను దాటే అవరసమే ఎప్పుడూ సంతోష ఛాయల్ని వెతుక్కోవడమే ఎప్పటికప్పుడు బాటసారినై ఒదలని పాటలా కమ్మేసుకుంది నీ జ్ఞాపకం. నీ మాటలు ఉండుండీ అర్థం కావడం లేదు. నిన్నటి ఉదయాన గుండెలకు హత్తుకున్నా కూడా.. తృప్తి కలగలేదు. హృదయాన్ని ఇచ్చేసుకోవడమే తెలిసిన నాకు గాయాల సలుపు ఎప్పుడూ పరిచయమే.. (శ్రీశాంతి మెహెర్ )

అలరాసపుట్టిళ్ళు).. అదే ఇప్పుడైతే.. సత్యవతి ఏం చేసేది..?

చిత్రం
మనసుకు ఏది హాయి.. ఏది సోగయం, ఏది మైకం, ఏది మరపు రత్నాలలో లేని సొగసు, మణులలో లేని మెరుపు, ధనంలో, బంగారంలో నగల్లోలేని ఆనందం మంచి మనసులో, ఆప్యాయతలో ఉంది. స్వచ్ఛమైన మనసులు ఎందుకు అల్లుకుంటాయో తెలుసుకునే లక్షణం కొందరికే సొంతం. నిశ్చలమైన ప్రేమ, అరమరికలు లేని ప్రేమ విజయం సాధించాలంటే.. ఈ భారతావని మెదడు పురిటి బిడ్డంతే ఉంది మరి. కులం, మతం, ధనం, అంతస్తుల తూకాల మధ్య వేలాడుతుంది. పరువు ప్రతిష్టల అంచుల తేడాలో తూగలేక ఊగిసలాడుతూనే ఉంది.  ఆడదాని మనసు ఎరిగి వివాహాలు జరిగితే ఇక చెప్పేదేముంది. ఆడదాని మనసు తెలుసుకోగలిగితే ఇక ఇంత ఉపోద్ఘాతం ఎందుకు. మనసులో మాయలేని మనిషిలేడు. ఉన్న కాస్త జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసుకుని, ఆస్తులనీ, అంతస్తులనీ, బంగారాలని, పరువని, నరకానికి ద్వారాలు తెరిచేది మనమే.. ఆ మండువాకి సత్యవతే అందం. ఆమె లేని ఇల్లు పాడు బడింది. చెప్పుకొచ్చిన కథలో.. తొలి పేరాల్లోనే బీటలువారిన నేల, పగుళ్లు తేలిన వసారా, మండువా, గోడలు, ఎటు చూసినా ఈన్యం. ఎటు చూడు నిర్మానుష్యంతో, నిర్లక్ష్యంతో  ఉన్న ఆ చావిట్లో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆఖరి ఘడియల్లో ఉన్నాడు సుబ్బారాయుడు. అతని కోసం పట్నవాసం పోయిన తమ్ముళ...

ఆ రోజులకో వాసనుంది

ఆ రోజులకో వాసనుంది.. 17-5-2024 శ్రీశాంతి మెహెర్ ................................. ఆ రోజులకో వాసనుంది. అమ్మలాంటి కమ్మనైన వాసన  నేతి ముద్దలు తిన్న కమ్మదనం అది వెన్నెలంత చల్లదనం స్వేచ్ఛ తప్ప మరో మాట తెలీని రోజులవి కాళ్ళకు పరుగు తప్ప, అలసట తెలీదు.. బద్దకంగా పక్క దులిపిన రోజులు మిక్చర్ పొట్లం తెచ్చిన గొడవలో గోళ్ల రక్కులు, పంటి గాట్లు తమ్ముడితో కుస్తీపట్లు అమ్మతనం చేతకాని రోజుల్లో  పెద్దరికాన్ని భుజాన వేసుకుని  అరిందాతనం ఆ రోజులకో వాసనుంది.. కమ్మదనం తప్ప మరో మాట తెలీని రోజులవి.  తిరిగిరావు.. తెంపి తెచ్చుకోలేము మనకు పుట్టిన బిడ్డల్లో బాల్యాన్ని  కాసేపు చూసి మురిసిపోగలం  మహా అయితే..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పెదాలను మెలితిప్పుతూ.. నాలుకతో స్నేహం చేస్తావు చూడు అదే ముద్దు నన్ను వెక్కిరిస్తుంది. వెచ్చని నీటి ఆవిరిలా అలముకుంటూ అదే ఊహ.. దూరంగా జరిగిపోతున్న జ్ఞాపకాలతో తెంపుకోలేని సంకెల ఈ ముద్దు గాఢంగా హత్తుకుంటూ పెదాలతో ప్రేమను బట్వాడా చేస్తావు చూడు,, అదే ముద్దు కదిలిపోతున్న ఆలోచనల్లా గుండెల్లో గుబులు పుట్టిస్తో వడపోతల రాపిడితో ముద్దు చుట్టూనే ఆలోచన ఎంత తెంపినా తెగని రొదలా కాలంతో పోటీపడి పొడిబారిపోతోంది.

మంకెన్నలందం..4-4-2024

ప్రేమిస్తాను ఎప్పటికీ..  నిదురతో వాలిపోయే కళ్లను నిటారుగా చేసి,   రాధామాధవాలంత మనోహరంగా నీరాక కోసం చూస్తాను.. ఆరు బయట సాయంత్రాలు విచ్చుకునే చంద్రకాంతలనడుగు గుమ్మనికి నా కళ్లను అప్పగించేసిన తీరు చీకటి వేళకు విచ్చుకునే సన్నజాజులో.. సువాసనేస్తూ, వాకిలంతా పరుచుకుంటూ నా ఎదురుచూపును వెక్కిరిస్తుంటాయి.. మరి మల్లెలో ప్రియుని రాకలో విరహాన్ని  రాతిరికి అప్పగిస్తాయి. నిదురలో నువ్విచ్చే ముద్దు  గులాబీలను హత్తుకున్నట్టు.. చల్లని గాలిలో, జోరు వానలో, ప్రతికాలంలో నాతో నువ్వుండే సమయాలు చాలవూ.. పూల సొగసులా.. జీవిత సౌకుమార్యాన్ని ఆస్వాదించేందుకు.. ఈ తడిపొడి సుఖ దుఃఖాలకేం తెలుసు నీ కోపంలో, ప్రేమలో దాగిన మంకెన్నలందం..

ఈ నవ్వుకు చిరునామా తెలుసా..

ఈ చిరునవ్వు ఈ పెదవుల మీద పూసి చాలా కాలమైంది.. అరుగులు పట్టుకుని పరుగు తీసామే అప్పుడు  మైళ్ళ లెక్క తెలియని నాటికీ నువ్వు.. ఆయాసం ఆటగా ఉన్ననాడు నీ కాలి వేగానికి, ఆయాసాన్ని జత చేసి పరుగందుకున్న నాడు నీతో ఉప్పల గుప్ప ఆడిన నాటిదీ నవ్వు పవిటేసిననాడు నీ చిరునామాను వెతికింది. వచ్చి చేరే అందాలకు  నువ్వు చిరునామా అవుతావని ఆశించింది. జీవిత కెరటాల్లో కొట్టుకుపోయినా, నీ సాక్షిగా ఆనాటి నవ్వు పూస్తూనే ఉంది. ఎప్పుడో ఆదమరపుగా నీ ఆలోచనలా అకాల వర్షంలా, గాలి కెరటంలా నీ జ్ఞాపకంగా నవ్వు.. మళ్లీ ఇదిగో మనసంతా పూస్తూ,  నవ్వి నవ్వి పెదవులు చిట్లేంతగా నవ్వు చిరుమందహాసం కాదు.. చిద్విలాసం. కడుపుబ్బా నవ్వే నవ్వది.. అప్పట్లానే అలానే అచ్చం బాల్యం పేజీల్లో మిగిలి గురుతుకొచ్చే చిన్ననాటి  అమాయకపు నవ్వు..పూస్తూనే ఉంది ప్రతిరోజూ నీ ముఖ మంత అందంగా.. నీ పలువరసంత చక్కగా తీయగా...

మార్పు సహజం.. 2-4-2024

శ్రీశాంతి మెహెర్ కాలంతో కొట్టుకుపోతూ మార్పుకు మార్పు చెందుతూ ఉండటం అనేది మనిషికే కాదు, ప్రకృతికీ కొత్తేం కాదు. కొన్ని నిర్ణయాలు మనిషిని ఆలోచించేలా చేస్తాయి. కొన్ని అనుసరించేలా చేస్తాయి. కాలానికి తగినట్టుగా మారడం అలవాటు పడటం పుట్టుకతోనే వచ్చి చేరుతుంది. అలా కాలంతో పాటు మనం కూడా సాగిపోతూ ఉంటాం. కొత్తకు అలవాటు పడటానికి కాస్త టైం తీసుకుంటాం ఏమో కానీ.. నెమ్మదిగా అలవాటు పడిపోతాం. కొత్త వింతగా, విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే..  నిన్న ఆకాశాన్ని పరుచుకుని ఉన్న ఆ చెట్టు కొమ్మలు ఈరోజు బోసితనాన్ని నింపుకున్నాయి. అదీ అలవాటు పడేందుకే.. నెమ్మదిగా ఆ బోసితనం అలవాటుగా మారిపోయింది. మునుపు ఉన్న ఖాళీ ఎందుకో ఇప్పుడు కొత్తగా అనిపించడంలేదు. జీవితం కూడా అంతే.. నిండుగా అనిపించిన దానికి, అలవాటు పడి కాసిన్ని రోజులు గుండె వెలితితో కొట్టుకున్న దానికి పెద్ద తేడా అనిపించదు.  నెమ్మదిగా అలవాటుగా సర్దుకుంటుంది.  మనుషులూ అంతే మనసంతా నిండిపోతారు. మరో ఆలోచనరానీయనంతగా కలిసిపోతారు. తీరాచూస్తే వాళ్ళకు మరో ప్రపంచంలో బిజీ పెరిగినపుడు మనతో దూరం జరుగుతారు. ఇది తెలిసికూడా దగ్గరై.. మళ్ళీ దూరమై.. ఇదంతా అలవాటు ...

ఈ ఖాళీలను పూరింపుము..!!

చిత్రం
శ్రీశాంతి.. 28-3-2024 ఖాళీతనం ఒక్కోసారి మరీ ఇబ్బంది పెట్టేస్తుంది. అది బుర్రలో పుట్టి, ఆలోచనను కూడా ఖాళీ చేసి ఏదీ తోచకుండా చేసిపారేస్తుంది. కొన్ని ఖాళీలను పరిస్థితులు సృష్టించి పారేస్తే.. మరికొన్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాం. ఈ ఖాళీలో నింపేయడానికి ఏదీ సరిపోదు. నిండుగా వాకిలంతా అలుముకున్న చెట్టు నేలకూలిపోతే ఏర్పడే ఖాళీలాంటిది. ఇంటి పెద్ద మాయం అయిపోతే కలిగే ఖాళీ.. నచ్చిన మనిషి దూరం అయితే కలిగే ఖాళీ.. మనసుకు ఇలాంటి ఖాళీలు అలవాటు కావు కనుక ఇబ్బందిలో, ఉక్కిరి బిక్కిరిలో ఏదీ తోచక ఏర్పడే ఖాళీ.. ఏం చేయాలో తెలిసి కూడా చేయలేకపోవడం, చేయాలనన్నా మనసుకు రాకపోవడం, నిజానికి ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితి. కాకపోతే ఆ ఖాళీని పూరించడం మాత్రం అంత సులువైన పనికాదు. రాయాలనుకున్న విషయం గురించి ఏదో ఆలోచన మొదలైనా రాయలేని ఇబ్బందిలాంటిదే ఇదీనూ.. నేను అప్పుడప్పుడూ ఏదో రాసేయాలని కూర్చుంటాను. చాలా అంటే చాలా సీరియస్గా.. కానీ తీరా కూర్చున్నాకా ఏదీ తట్టదు. అప్పటి వరకూ బుర్రను పట్టుకుని కుదిపేసిన ఆలోచనలు.. ఒక్కసారే రెక్కులు తొడుక్కుని ఎగిరిపోతాయి. ఇంకేముందీ.. ఇంతక మునుపు ఉన్న ఖాళీకన్నా ఇప్ప...

వైరాగ్యానికి అటు ఇటు..

చిత్రం
శ్రీశాంతి.. 23-3-2024 కంఫర్ట్ దీనిని ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉంటారు. జీవితంలో ఎన్ని చేసినా కూడా అవన్నీ కంఫర్ట్ కోసమే.. ఎన్ని కష్టాలు పడినా కూడా సౌకర్యం కోసమే.. లేకపోతే ఎందుకీ పాడు బతుకు అనిపిస్తుంది. నిజానికి ఎక్కడెక్కడ తిరిగినా రోజులో ఎక్కడ తిరిగి వచ్చినా, కూడా ఇంటికి చేరే సరికి కలిగే ఆనందం వేరు. నా వరకూ నాకు మెట్లెక్కి నా ఇంటి గుమ్మం ముందుకు చేరుకోగానే.. ఓ పాజిటివ్ నెస్ కనిపిస్తుంది. కొత్త ప్రదేశంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మన ఇంటి మంచం మీద పడుకున్నప్పుడు పట్టే నిద్రే నిద్ర.  హాల్లో చిన్న బొంత మీద కూర్చున్నా అదే ఆనందం. చుట్టూ మనం నాటుకున్న మొక్కల మధ్యలో కాసేపు నిలబడినా,  నచ్చిన పాట వింటూ సమయం గడిపినా ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ఆనందం.  ఇక తిండి విషయానికి వస్తే.. నాలుకకు కొత్త రుచులు కావాలి. రోజులో ఎంత చెత్త తినాలన్నా కూడా అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తిండి విషయంలో ఒకప్పుడు ఉన్న చాపల్యం ఇప్పుడు తగ్గిందనిపిస్తుంది. ఏదో తినేయాలన్న ఆత్రం తప్పితే చక్కగా అన్ని కూరగాయలూ వేసుకుని పెట్టుకున్న దప్పళం ముందు ఈ పిచ్చి తిళ్ళు ఏం బావున్నాయనిపిస్తుంది. పులిహోరను కొట్టే వంటకం...

హృదయం నిండా.. పూల వాసనలే.. !

చిత్రం
Sri santhi 22-3-2024 అందమంతా ప్రకృతిదే అయితే అది చూసి మురిసిపోయే నా జన్మ ధన్యం. ఈ చూసే కళ్ళకు కనిపించేదంతా అందమే.. ఈ భూమిమీద ఈ జీవితంలో నేను అనే మనిషిని అన్ని వాసనలను, అందాలను, సౌందర్యాన్నీ, కష్టాన్ని, సుఖాన్ని అనుభవించగలుగుతున్నానంటే అది నిజంగా దేవుడి దయే..  సరే అందం అనుకున్నాం కదా.. నేను ఆగి మరీ చూసే అందం మొక్కలది. పూలది.. వాటి సువాసనలది.. సన్నజాబులు, మల్లెలు, పారిజాతాలు, చామంతులు, గులాబీలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పూలు, బోలెడు అందాలు, అందమైన ముఖాలకన్నా పూలను చూసినప్పుడు కలిగే ఆనందం వేరు. వాటి వెనుక నేను ఆలోచించే, మురిసిపోయే క్షణాల ఆనందం మరింత గొప్పది.. నిజానికి మొక్కలంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పాలంటే బాల్యం వైపుకు చూడాలి. ఎందుకో మొక్కలు మాట్లాడతాయి అనిపిస్తుంది. చక్కని పూలతో రకరకాలుగా వాటికి తగినట్టుగా నవ్వుతాయి. ఆ నవ్వులో నాకు ఓ ఆత్మీయత కనిపిస్తుంది. నాకు మొక్కలను చూడగానే పూనకం వస్తుందని ఇంట్లో అంటారు కానీ .. మొక్కలను కొని తెచ్చి ఇంట్లో పెట్టి పెంచడం అంటే వాటికి కొత్త వాతవరణాన్ని పరిచయం చేయడం లాంటిదే..  కానీ ఏమాటకామాట.. అందంగా పెంచుకున్న మొక్కకు ఓ పువ్వు పూస...

కాల తప్పిపోయింది..

.. 19-3-2024 కొన్ని కలలు భయపెడతాయి.. కొన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకునేంత బావుంటాయి. కొన్ని తరిమితే.. మరికొన్ని భ్రమలో ఉండేట్టు చేస్తాయి. భయపెట్టేవి కూడా కలలే.. కలలే రాని నాకు చాలా రోజుల తర్వాత కలవచ్చింది. అంటే కల రాకపోవడం కూడా ఓ బాధే.. అందమైన ప్రదేశాలు... అనుకున్నవి కలగన్నవి.. ఆశించినవి ఇలా అన్నీ కలల్లా వచ్చేస్తే.. బావుంటుందని మరీ కలగనడం బావుంటుంది. అలా కలను నటించే రోజుల్లోనే నేను ఆగిపోయాను. కానీ ఈరోజు కల వచ్చింది.  ఒకింత ఆశ్చర్యం.. ఒకింత బాధ.. ఇదేంటి నేను నన్ను గురించి వెతుకుతున్నానా.. ఇదో వింత కల. నా వరకూ నాకు చాలా చిత్రంగా అనిపించింది. బహుశా వేళకు మించి నిద్రపోవడమో.. లేదా శరీరం బాగా అలిసిపోవడమో కారణం అయి ఉండవచ్చు. నిజానికి నాకు కల వచ్చిందంటేనే వింతగా ఉంది.  ఇంతకీ ల్యాగ్ చేయకుండా చెప్పాలనుకునే విషయం ఏంటంటే నా కలలో నన్ను నేనే వెతుకుతున్నాను. కానీ ఆ పెద్ద ఇంట్లో నాలా మరో ఇద్దరు కనిపిస్తున్నారు. పోనీ అచ్చం నాలాగే ఉన్నారా అంటే అలానూ లేరు. చొట్ట ముక్కులు,. తపేలా ముఖాలు.. ఛా ఈ వింత ముఖాలని శాంతి అంటున్నారేంటిరా నాయనా అని.. మళ్ళీ ఆగి చూస్తే ఇంతకీ నన్ను అక్కడ ఎవరూ గుర్తుపట్టడం లేదు....

కలలాంటి నిజం వెనుక .. 2-1-24

నక్షత్రాలు రాతిరిని అంటుకుని.. ఉండిపోయాయి.. నీ ఆలోచనలు నన్ను పట్టుకుని వదలనట్టు నిండిపొర్లే నీటిని చేపలు వదిలిపోతాయా.. నీ రహస్యాలు తెలిసిన మనసు మాసిపోనట్టు.. దీపాల్ని తీసి చూసినా నాకలల అంచుల్లో నీ ఊహే.. చీకటినలుపుల మధ్య నీ ఊహ మధురం.. నిన్ను తెలుసుకునే ప్రయత్నంలో.. వెచ్చని కౌగిలి హృదయానిక అడ్డంగా వచ్చినట్టు మెరుస్తుంది.. నక్షత్రంలా.. నా కళ్ళల్లా.. వొంటరితనాన్ని సైతం ఆవరించే సమక్షం నీది.. కావలించుకుని నాకు నీ వెచ్చదనాన్ని గుర్తుచేస్తూ.. ఇంకేం అడుగకు.. తక్కింది నా కలలో ఉంది. (శ్రీ)