Thursday, 28 December 2023
మళ్ళీ మనం ప్రేమను తెచ్చుకునేంత
తేదీ మారుతుందా?
Sunday, 8 October 2023
స్వగతం...
మబ్బు పట్టడం, వర్షం చినుకు నేలకు రాలినపుడు మట్టివాసనేయడం, గాలిలో ధూళి కణాలు ఎగిరి ముఖాన్ని తాకడం, నీటిలో చిట్టి చేపలు గంతులేయడం. కొబ్బరి ఆకులు గాలికి తలలూపడం, అమ్మ గట్టిగా అదిలించి పిలవడం, నాన్న గుండెల మీద ఆడుకోవడం, ముద్దొచ్చి బుగ్గగిల్లితే నా ఏడుపు నాకే కొత్తగా అనిపించడం అంతా నేను కొత్తగా ప్రపంచంలోకి వచ్చానని తెలిపిన సమయాలు. నా అనే ఎరుకను ఇచ్చిన సందర్భాలు... ఇదే నా ప్రపంచం అని.. ఇక నుంచి నేను ఇక్కడే మనాలని,, గత జన్మ వాసనలు మరిచిపోయి.. కొత్త జన్మలో ఇమిడిపోయిన సందర్భాలు అవి. అన్నీ కొత్తగా వింతగా దోచిన విషయాలివి. నాతో పాటు తోబుట్టువులు, స్నేహితులు, చుట్టాలు ఎందరో, నేను అని, నాకు అని తెలియని రోజుల్లో బాల్యంలోకి చొచ్చుకుని పోయినపుడు నాకు కనిపించే దృశ్యాలు ఎన్నెన్నో.. వాటికి తోడుగా నాకు మిగిలిన జ్ఞాపకాల దొంతరలో తిప్పే ప్రతి పేజీలో ఓకథ. (శ్రీ)
నిరీక్షణ..
పాటలన్నీ నిశ్శబ్దంలోకి ఇంకిపోయాయి..
సాయంత్రాలు నీ ఊహను బరువుగా మార్చేసాకా..
మళ్ళీ రాత్రికి తేలియాడే ఆలోచనలు, ఆ వెచ్చని కౌగిలి,
ఆ మరిచిపోలేని మైమరపు,
నన్ను లాక్కెళ్ళే ఆ గదిలోని అగరబత్తీల వాసన..
నేను నువ్వయిపోయే క్షణాలకు అప్పగించేసుకున్న రాత్రి రాపిడిలో..
ఇంకో రోజు కలగా కరిగిపోయింది.
ఇదంతా నీకు అర్థంకాదులే..
ఒంటరిగా కూర్చుని చూడు.. ఆలోచించు
Wednesday, 27 September 2023
అవలోకనం..
మబ్బు పట్టడం, వర్షం చినుకు నేలకు రాలినపుడు మట్టివాసనేయడం, గాలిలో ధూళి కణాలు ఎగిరి ముఖాన్ని తాకడం, నీటిలో చిట్టి చేపలు గంతులేయడం. కొబ్బరి ఆకులు గాలికి తలలూపడం, అమ్మ గట్టిగా అదిలించి పిలవడం, నాన్న గుండెల మీద ఆడుకోవడం, ముద్దొచ్చి బుగ్గగిల్లితే నా ఏడుపు నాకే కొత్తగా అనిపించడం అంతా నేను కొత్తగా ప్రపంచంలోకి వచ్చానని తెలిపిన సమయాలు. నా అనే ఎరుకను ఇచ్చిన సందర్భాలు... ఇదే నా ప్రపంచం అని.. ఇక నుంచి నేను ఇక్కడే మనాలని,, గత జన్మ వాసనలు మరిచిపోయి.. కొత్త జన్మలో ఇమిడిపోయిన సందర్భాలు అవి. అన్నీ కొత్తగా వింతగా దోచిన విషయాలివి. నాతో పాటు తోబుట్టువులు, స్నేహితులు, చుట్టాలు ఎందరో, నేను అని, నాకు అని తెలియని రోజుల్లో బాల్యంలోకి చొచ్చుకుని పోయినపుడు నాకు కనిపించే దృశ్యాలు ఎన్నెన్నో.. వాటికి తోడుగా నాకు మిగిలిన జ్ఞాపకాల దొంతరలో తిప్పే ప్రతి పేజీలో ఓకథ.
చిన్నతనం ఎంత గొప్పది.. అప్పుడు కనిపించే దూరాలు, చేసే సాహసాలు, కలిగే ప్రేమలు, దూరం పెట్టేసే చికాకులు.. అన్నీ విడ్డూరమే.. అది నేనేనా అనిపించేంత చిత్రవిచిత్ర సంఘటనలు.. ఎక్కడో నటి చనిపోతే.. ఇక్కడ గొయ్యితీసి, పూలు చల్లి, శిలా ఫలకం పెట్టేంత ఆలోచన ఆ వయసులో కలగడం ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు. దివ్యభారతి చనిపోయిందని తెలిసాకా నేను చేసిన మొదటి పని ఆమెకు సమాధి కట్టడం.
ఎర్రగాజులు, ఎర్రని లంగా వేసుకుని ముస్తాబై స్కూలుకి వెళ్ళాలని తెగ తాపత్రయపడ్డ క్షణాలు. అందుకున్న ప్రేమలేఖలో ప్రేమ ఎంత ఉందోనని అతని కోసం వీధులన్నీ తిరుగుతూ ఇంటిదాకా వెళ్ళి నిఘా పెట్టిన క్షణాలు.. దోబూచులాటలు.. ఓర చూపులు.. వయసు చిన్నదే కానీ.. మనసు పెద్దదని తెలుసుకున్న సమయం అది.
నాచురంగు పావడా కట్టుకుని గుడిలో ఆడుకుంటుంటే.. సువర్ణగన్నేరు పూలు నేలంతా పరుచుకుని తెల్లని దీపాల మాదిరి కనిపించి మురిసిపోయిన క్షణం. అతనితో అక్కడే ఎన్నో మరిచిపోలేని ఆడలాడిన సాయంత్రాలు..
చాక్లెట్ కాగితంతో బొమ్మలు చేసుకోవచ్చని తెలిసి.. స్నేహితురాలి ఇంటికి వెళ్ళి మరీ తెచ్చుకుని సంబరపడ్డరోజు..
చెల్లి కాలువలో పడిపోతే దానికోసం ఆలోచించకుండా దూకేసి కొట్టుకుపోయిన రోజు..
ఈ ప్రపంచంలో నేను ఉన్నానని చెప్పేందుకు బాల్యం నుంచి పునాది వేసుకుంటూ వస్తుంటే.. దానితో పాటు వయసు ఎదిగి ఎన్నో ఎదురు దెబ్బల్ని కొట్టి, రాటుదేలేలా చేస్తే.. అక్కడా నేను ఎదురుగా నిలబడగలిగానంటే.. ఈ జీవి ఎంత మొండిదై ఉంటుంది. నన్ను చూసి నేను గర్వపడే స్థితిలోనే ఎప్పుడూ ఉండాలని.. నన్ను నేను కొత్తగా రోజూ నిర్మించుకుంటూ.. సాగిపోవడం.. ఈ జన్మకు నేను చెప్పుకునే కొత్త భాష్యం.
Tuesday, 19 September 2023
ఆనందం నన్నడిగేది..
ఆనందం నన్నడిగేది..
నన్ను ఎక్కడ దాచావని
అతని చూపులో, మాటలో,
మనసులో, సాంగత్యంలో అన్నాను.
హృదయాన్ని వదిలేసానని,
నింపుకోలేదని పాపం దానికి అనుమానం
నక్షత్రకాంతిలో గాలి రేగింది..
చూపులు కలిసే చోటికి ప్రయాణం
ఆనందాన్ని వెతుకుతూ దారికాని దారుల్లోకి..
ఎండుటాకుల శబ్దానికి మల్లే గుండె శబ్దం..
పిలుపు వినిపించేంత దగ్గరగా
జీవిత రహస్యాన్ని తెలుసుకున్నట్టుగా..
ఆకాశాన్నంతా పూడుస్తున్నాను,
ఇంకా ఆనందం పట్టలేనంత ఉంది.
నింపుతున్నాను, అంతటా, అతనితో కలిసి..
ప్రేమ పుష్పాన్ని వికసింపచేయడానికి..
Monday, 18 September 2023
నీ రూపాన్ని చూసే వీలు లేకపోతే..
ఎప్పటికీ నాకు ప్రేమ దొరక్కపోతే..
పగటిని రాత్రి కలిసే చోట
కలిసిపోతాను.
నీ రూపాన్ని చూసే వీలు లేకపోతే
ఉదయకాంతిని అరువడుగుతాను.
విషాదాన్ని, ఒంటరితనాన్ని మోయలేక
అలలపై విడిచిపెడతాను.
అప్పటికీ నువ్వు కనిపించకపోతే
అంతులేని విషాదంలోకి దూకిపోతాను.
ఉదయాన్ని శపించే వీలులేదుకానీ,
లేకుంటే వెలుగునే బహిష్కరిస్తాను.
గుస గుసగా ప్రేమ కబుర్లు వినిపిస్తే..,
నేల చూపులు చూడలేను.. వెతుకుతాను. అన్నివైపులా
నువ్వు కలిపించే దారలంట..
Friday, 15 September 2023
కళ్ళు..
కొత్తవారిని కళ్ళు వెంబడిస్తాయి.
రెండు కళ్ళను నాలుగు చేసి
చూపులు కలిపేందుకు చూస్తాయి.
దారులన్నీ తిరుగుతుంటే కొత్త ముఖాలు
విడివడి జతపడి
ముఖాలకు తగిలించుకున్న చూపుల లెక్కలు
దొంగచూపులు కొన్ని, దొరచూపులు కొన్ని
దోబూచులాటలు కొన్ని, అన్నీ కళ్ళే ఇక్కడ.
ఆరాధనలు కొన్ని, ఆత్రాలు కొన్ని.
ఇన్ని చూపులు దారులు తప్పినపుడు
చీకటిని మింగి నిదరోయినప్పుడే శాంతి.
Friday, 8 September 2023
పువ్వుల మల్లే ఊగుతూ..
కదలని ఆలోచనలతో, ముతకబడి
ఖైదీగా ఆలోచిస్తోన్న క్షణాన
ద్వారం ముందు
స్వేచ్ఛగా ఊగుతున్న మందార పువ్వు
నవ్వుతుంది నన్ను చూసి..
బద్దలైన కాంతి బండారానికి,
తలుపులన్నీ తీసుకుని
బైట తిరిగే స్వేచ్ఛకోసం
నిద్రలోంచి మేల్కొని
పువ్వుల మల్లే ఊగుతూ
పోతాను. స్వేచ్చకోసం..
ప్రేమంటే ఏమిటని నీ హృదయాన్ని అడిగిచూసావా?నీకోసం తపించే మనసు, నీకోసమే దేహంతోటి రక్తంతోటీ పెనుగులాడి గాఢమైన దుఃఖంలో ఒదిగిపోయి నిన్ను అడుగుతున్నాను ప్రేమంటే ఏమిటి? నువ్వంటే ఓ బలహీనత
రెండు హృదయాల మధ్య మంచు పల్లకీ నువ్వు.. కలం అంచులకు వ్రేలాడే స్వప్నాక్షరం నువ్వు. సూక్ష్మంగా వినిపించే నాగుండె సవ్వడి నువ్వు.
నువ్వు..
నువ్వంటే ఓ బలహీనత
రెండు హృదయాల మధ్య మంచు పల్లకీ
కలం అంచులకు వ్రేలాడే స్వప్నాక్షరం
సూక్ష్మంగా వినిపించే నాగుండె సవ్వడి..
Thursday, 7 September 2023
నీకిచ్చిన కాన్కను పోగొట్టుకున్నావా..
చీకటి నలుపులను దాటి
వేకువ దారులంట పయనించి
చినుకుల తోరణాలను కట్టి,
హృదయాన్ని అద్దంగా చూపితే
అందుకోలేక జారవిడిచావా..
ఫలించని కలలా..
తక్కిన జీవితంలోకి..
అలముకున్నట్లుగా..
అజ్ఞానంలో కొట్టుకుపోతున్న మేఘంలా
మిగిలిపో..
పిలిచినా పలకకు. ఆగిపో అక్కడే..
వాన చినుకుల చిటపటలన్నీ
రమ్మని పిలిచినా సరే..
రాకు ఇటువైపు..
Wednesday, 30 August 2023
అక్షర సాగరానికి ప్రయాణం కట్టిన వేళ...
కాలం ముల్లు తిరిగే సమయంలో ఏ ధూళికణంగా ఈ భూమి మీదకు వచ్చిపడ్డానో తెలీదు. నక్షత్రాలు, జాతకాలతో సంబంధం లేకుండా పుట్టుక జరిగిపోయింది. దిక్కులు చూస్తూ తండ్రి దగ్గరకు తీసుకుంటే, ఆడపిల్లేనని మూతి బిగువుల మధ్య గుండెల మీద కుంపటిలా ఎదిగి, ఎవరికీ కాని ఓ అర్భకమైన జీవితాన్ని జీవిస్తున్న నాకు అక్షరం అమృతమని తెలిసింది మీ వల్లనే. గుక్కపెట్టి ఏడ్చే పసి బిడ్డకు పాలిచ్చి లాలించినట్టు.. దిక్కుతోచని నా జీవితానికి మార్గదర్శకత్వం వహించిన ప్రాణధాతవు. మనుష్యలకు అర్థంకాని దైవత్వాన్ని మోస్తున్నవాడిగా, ఈ చరాచరసృష్టిలో రెండు ప్రాణాలు కలిపి నడిచే దారుల్ని బలవంతంగా తెంపుకు తెచ్చుకున్న ఆడమ్ ఈవ్ ల ప్రేమ ఎంత పవిత్రమైనదో అటువంటి ప్రేమను పొందగలిగిన మనం అంత అదృష్టవంతులం.
సృష్టి రహస్యం ఏదైనా కానీ.. మన ఇద్దరి కలయిక మరో చరిత్ర అయింది. గోదారికి ఎదురీది అనంత వాహినిలో పడి నీటి అలజడికి, సంఘపు కాఠిన్యానికి గురై మినుకు మినుకుమనే మన జీవితాలను మళ్ళీ వెలిగించుకున్నాం. నిరాశ తప్ప ఆశలేని జీవితంలోకి వసంతం కన్నా మించిన వెలుగును తెచ్చావు. నువ్వు అక్షరదానం చేసాకా.. నేనో కలంగా మారాను. నీ తలపులో పుట్టుకొచ్చిన వేల అక్షరాలను కాగితం మీద ఒలకబోస్తూ.. ఇదిగో నా ప్రయాణం ఇంతవరకూ వచ్చింది. అమ్మ కొట్టిన బిడ్డ ఉగ్గబెట్టిన దుఃఖాన్ని పెల్లుభిగించినట్టు.. నా అక్షర ప్రయాణానికి ఆదివి నీవే.. నమస్సులు చాలా చిన్నవైపోతాయేమో.. మరో జన్మ ఉంటే మళ్ళీ నీ అడుగులో అడుగునయ్యే వరం మాత్రం ఇవ్వు. లవ్వూ
ఫణి..
Saturday, 29 July 2023
చలం తలంపై నేను.. (శ్రీశాంతి మెహెర్)
చలం సాంగత్యం ఉదయం పూట నాకు కొత్తకాకపోయినా, ఈరోజు ప్రత్యేకంగా చలాన్ని మనసుకు హత్తుకున్న ఫీలింగ్ కలిగింది. అతను మరింత దగ్గరగా అనిపించాడు. మెహెర్ వాక్యాలు ఎప్పుడో చదివేసిన అనుభూతి కలిగింది. గతంలోనే అమీనాపై మెహెర్ వ్యాసం రాసినా, ఇప్పుడే మొదటిసారి చదివాను. మామూలు నా రద్దీ సమయంలో ఆ వ్యాసాన్ని చదవబుద్దేయలేదు. చక్కని ప్రశాంత ఉదయంలో చలాన్ని ఆకళింపు చేసుకోవడం నిజంగా గొప్ప అనుభవం.
అలాంటి రచనను అందులోని అద్భుతమైన ఘట్టాలను, వ్యాక్తులను, పాత్రలను తలుచుకోవడం అదీ ఉదయంలో నాకు చాలా మంచి అనుభూతిని ప్రసాదించింది. మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఒక్కద్దాన్నే కూర్చుని చదివాను. అచ్చులో లోపాలను వెతికేందుకు చదువుతున్నానన్న మాట మరిచిపోయాను. చలం తనలోకి లాగేసుకుంటాడు. నాకు అర్థం అయిన అతని రాత తాలూకు స్పర్శ అలాంటిదని నా అభిప్రాయం. అతనితో అతని రచనతో కలిసిపోవడం బావుంటుంది. అమీనాలో అతను చూసిన అమాయకత్వాన్ని, ఆమె మీద ఇష్టాన్ని, ప్రేమని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు, చూపించలేకపోయాడనే ఆలోచన నాకు అస్తమానూ కలుగుతుంది. అదే ఈరోజూ కలిగింది. సంఘం కట్టుబాట్లను పట్టించుకోని చలం, గౌరవమైన ఉద్యోగం అంటాడు.. కట్టుబాట్లలో లేని వాడికి ఉద్యోగం మీద అంత మమకారం ఎందుకో అర్థం కాలేదు. కట్టుబాట్లను తెంచుకున్నవాడిలా పూర్తిగా లేనందుకు విచారం అనిపిస్తుంది. అతనిలోని ఏ క్వాలిటీ అయితే నాకు నచ్చుతుందో ఆ అరాచకత్వానికి పూర్తిగా లోబడకుండా ఏదో తెగని బంధంతో అటు ఇటు ఊగిసలాడుతున్నట్టుగా ఉంటాడు. ఏమో మొత్తం తెంపుకువెళిపోతే అతగాడు బైరాగి అయ్యేవాడేమో.. తెలీదు. కానీ చలాన్ని అలా పరిస్థితుల మధ్య నలిగి, తెగతెంపులు చేసుకోలేని వ్యక్తిగా అతని మథనాన్ని చూడటం కాస్త చివుక్కువనే సంగతే నాకు.
కుటుంబం, బిడ్డలు, ప్రేమలు, ఉద్యోగం అనే సంకెళ్ళు కూడా ఉండకుండా ఉండి ఉంటే చలాన్ని ఎలా చూడగలమో అనే ఆలోచన కలిగినపుడు నవ్వు వస్తుంది. నేను అలా చూడలేననే విషయం స్పురణకు వచ్చి నన్ను యావగించుకుంటాను. నలుగురు చూస్తారని, సభ్యతగా ఉండడానికి ప్రవర్తించే నేను.. చలాన్ని ఎందుకు తెంపుకు పొమ్మంటున్నానా అని.. నిజానికి మనం చాలావాటికి బద్ధులం. చాలావాటికి లోబడే బతుకుతాం. కానీ మన రచయితలు, మన హీరోలు అలా ఉండకూడదని కోరుకుంటాం. ఇది మనసు చేసే యాగీ.. పైకి కప్పుకుని తిరుకుతాం కానీ లోపల ఎప్పుడూ ముల్లుగా గుచ్చుకుంటూనే ఉంటుంది.
నిజాన్ని అబద్ధంగా మారుస్తూ, అబద్ధాన్ని నిజంచేస్తూ,, లోపల గింగిర్లుతిరిగే ఆలోచనలకి నవ్వును పులిమేసి బయటకు బట్వాడా చేస్తూ రోజులో ఎన్ని రంగులు మారుస్తామో.. కదా.. నా వరకూ నేను చాలా ఆలోచనలను, చిలిపి తనాన్ని లోపలే కుక్కేస్తూ ఉంటాను. క్షణకాలం నాలా ఉంటే.. ఎన్నో సమయాలు నాలా ఉండను. రోజులో నన్ను నేను వెతుక్కునే తరుణంలో ఎన్ని ముసుగులేసుకుంటూ ఉంటానో.. ఎందుకో చలాన్ని చదివితే ఈ ముసుగు విప్పదీసి బయటకు బలంగా వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ రద్దీ అని ప్రశ్న వేసుకోబుద్దవుతుంది. చాలా హడావుడిగా భూమిమీదకు బట్వాడా అయిపోయి పొడిచేసింది ఏమిటనే ఆలోచన ఇంకా లోతులోకి భూమిలోకి కూరుకుపోయేలా చేస్తుంది. ఏమో ఉదయం చలాన్ని పలకరించాకా.. బండి మీద ఆఫీసుకు వస్తూ ఇంకా బలంగా ఆలోచించాను. అతన్ని నా బండి వెనుక సీటులో బరువుగా ఎక్కించుకుని తీసుకువచ్చినట్టు అనిపించింది. కానీ ఇప్పుడో వాక్యాల్లో తేలిపోతున్నాడు. ఆ బరువు ఇప్పుడు లేదు. ఉద్యోగపు రాపిడిలో, ఒత్తిడిలో ఉదయం ఉన్న అతను ఇప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్యాసంలో కూర్చున్నాడేమో.. సాయంత్రం మరోమారు చదవాలి.
Friday, 7 July 2023
హృదయమా..!
ఒంటరితనంతో హృదయం కాచుకున్నప్పుడు
నీ వలపు గుర్తుకొచ్చినపుడు
నేనా ఆలోచనలో ఉన్నప్పుడు
ఈ ఏకాంతాన్ని నీడ కప్పేసినప్పుడు
నీ ఆలోచన చుట్టుకుంటుంది.
చిగురు కొమ్మను పలకరించినట్టు
మొగ్గ తొడుగు విడినట్టు
పూల సువాసనలు గాలిని పులుముకున్నట్టు
ఇటుగా వచ్చి పలకరించే
మనిషి నీవే కావాలనుకుంటాను.
అట్లా కూచుని గాలికి గుమ్మంలో
ఊగే చెట్టు ఆకుల్ని చూస్తున్నప్పుడు
దీపాన్ని దాచుకోవాలనే
ఆలోచనలో తెల్లవారుతున్నప్పుడు
హృదయమా..!
ఈ మనసుకు వచ్చి అతుక్కునే
ఆలోచనల్లో నువ్వూ
జతౌతావు.
Thursday, 6 July 2023
Wednesday, 5 July 2023
ఏం అర్హతలుండాలో చెప్పు కాస్త..
నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయని
కాసేపు కూర్చుంటే నీ ఆలోచన అల్లింది
నలుపు చారల చీరలో ఆమె ఎదురైంది
అలసిన ముఖం, చెమటకు కరిగిన కుంకుమ
అచ్చం నువ్వు చెప్పిన పాత్రలానే ఉంది ఆమె
కుచ్చిళ్ళను ఓ చేత్తో పట్టుకుని, కాలి పట్టీలు
మోగిస్తూ నాలుగు అంగల్లో నన్ను దాటుకు
వెళ్లింది.
నలుపుదనం, పసుపు పాదాలు, నుదుట కుంకుమ
మైదానంలో కలిసుంటానా ఆమెను
లేక అనసూయనా, సులోచనేమో
గుర్తురావడం లేదు.
నీలా అల్లిక నాకు కుదరదు కానీ
నీ చూపు ఆమెను తాకి అక్షరమైంది కాబోలు
నేను అచ్చంగా పట్టుకోలేకపోయాను. నీ కథానాయిక
పోలికలు నాకు పాత్రపరంగానే తెలుసు. మరి నువ్వో కళ్ళతోనే స్కేన్ చేసి రాసి ఉంటావు.
ఏం మాయ చేస్తావో.. ఆ పాత్రలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తెలీదు. నిజంగా ఉన్నారా ఇక్కడ? లేక దేవలోకంలోంచి పట్టుకొచ్చావా? నీకథల్లో పాత్రలయ్యేందుకు, నీ కథలో కథానాయిక కావాలంటే ఏం అర్హతలుండాలో చెప్పు, ఈసారి సరిగ్గా పట్టుకుంటాను. వెతుకుతాను. ఏ దేవాలయానికో వస్తుందేమో.. సరేనా.
Sunday, 2 July 2023
నొప్పి తెలియని ప్రయాణం కావాలి
ఈదుకుంటూ గడిచిపోతున్న
కాలం కొలనులో గాలం వేస్తే
నేనే చిక్కాను.
ఒంటరి కాగితం పడనై
తేలుతూ, ఈదుతూ
ఆకాశాన్ని అందుకుంటాననే ఆశతో
పోతున్నాను పైపైన ఊగుతూ..
గురుతుపెట్టుకున్న దారులు లేవు
ఒకటే ప్రయాణం, సాఫీగా చేరాలని
ఈలోపు నీళ్ళు పడవలోకి రాకూడదు.
నొప్పి తెలియని ప్రయాణం కావాలి.
వాన చినుకులకు నానకూడదని,
అసలు వానే రాకూడదని
మొక్కుతూ, ఊగుతూ ప్రయాణిస్తున్నాను.
ఒడ్డుకు చేరిపోతే చాలు
ఊపిరి బిగబట్టే బాధ తప్పుతుంది.
Tuesday, 23 May 2023
ఈ పాటతో గతానికి బదిలీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
ఈ పాట నిన్నటి నుంచి తరుముతోంది. జీవితం వేసిన సంకెళ్ళను తెంచుకుని వచ్చేట్టు చేసిన పాటిది. జీవితమాధుర్యాన్ని పంచుకున్న పాట. అతని పిలుపు అతని ప్రేమ, విరహం అన్నీ కలగలిసి నన్ను నీవైపుకు లాగిన పాట. నీ పిలుపుకు మనసూరుకోక రాలేక పరుగెత్తుకొచ్చిన రోజులు.
Sunday, 21 May 2023
వాన చినుకుల అక్షింతలు 22-5-23
ఇంకో పేజీ ఉందా? ఈ మగత తొలుగుతుందా? ఎగిరెగిరి రెక్కలార్చుకుని నీ ఒడిలో సేదదీరనిస్తుందా? ఒడ్డున వొరుసుకు ప్రవహించే నదిలా ఒంటరిగా వదిలేస్తుందా? ఏమో..(శ్రీ)
ఎన్నో వసంతాలను దాచుకున్న జీవితమిది.. వాన చినుకుల అక్షింతల సెలయేరు.., ఎక్కడో కురిసిన వర్షం ఈ ఉదయాన్ని పులకింపజేసి... నన్ను స్పృహలోనికి తెచ్చిన కాంతి కోరికల ఇంద్రధనస్సు వైపు నడిపిస్తుంది. (శ్రీ)
విడుదల ఏది?
గత అనుభవాలు ఈటెలు,బాకులై తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా చేసి నడిచే దారిలో నేనో గులకరాయిని జ్ఞాపకాలు చెదిరిన కాగితం కట్టలతో వేల ...
-
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్...
-
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర...
-
నా మొదటి కథ "పొరుగింటమ్మాయి" http://patrika.kinige.com/?p=1038&view-all=1 కినిగె పత్రికలో చదవండి. ప్రపంచం అంతా...