Friday, 30 October 2020
అక్కడే నేనూ ఉన్నాను..
Wednesday, 28 October 2020
అప్పుడు జీవితం ఇలా ఉండదు..
రహదారులంట పోతూ నువ్వు కలలుగనేది కాదు జీవితమంటే..
ఎరుపెక్కిన ఉదయపు కాంతిని చూసిన ప్రతిసారీ బాధ్యతల భుజాలను తడుముకుంటావు
జోరుగా చక్కర్లు కొట్టిన దారులంట.. అడుగులో అడుగులేసుకుంటా ఆలోచిస్తావు..రేపేమిటని
జేబునుంచీ తీసే ప్రతినోటు మీదా రేపటి తనవంతు బాధ్యత ఏమై ఉంటుందా అనుకుంటావు
మారిపోతావు నువ్వు సగటు ఉద్యోగిగా.. సంసారిగా.. బాధ్యత ఎరిగిన మనిషిగా
సరదాలకు వీలుచిక్కని సమయాలు నిన్ను వెక్కిరిస్తాయి..
సాయంత్రానికి చమట చుక్కలతో సావాసం పెరుగుతుంది..
నిజాల వెంట పరుగులు పెడతావు... నిజాన్నే కలగంటావు..
ఆడంబరాలను అదుముకోవు.. ఆస్వాదనకు లొంగిపోవు..
నీతో సావాసం చేసిన వారెవరూ ఉండరప్పుడు...
బాధ్యతల బరువులతో వంగిన భూజాలమీద మోయలేని బరువులు మోస్తావప్పుడు
కొత్తవారితో కొత్తల్లో కొత్త ప్రపంచాన్ని చూస్తావు.. నెమ్మదిగా పాతబడిపోతావు
నీతో ఆడలాడిన నేస్తాల భుజాలు నేలలో కూరుకుని నిన్ను చూడలేరు
చిన్నతనంలో తిరుగాడిన వీధులన్నీ నువ్వే ప్రయాణించలేనంత ఇరుకైపోతాయి..
అప్పుడు జీవితం ఇలా ఉండదు.. రంగుల తెరలు నీ ముందు కల్పితాలని తేలిపోతాయి.
కలగన్నావా నన్ను..
నీలి ఆకుపచ్చ చీరకట్టి చేతులకు మట్టిగాజులతో రేయినంతా నూరి కళ్ళకు కాటుకగా పెట్టుకన్నాను
ఇక్కడి కలలకు స్వస్తిచెప్పి నీకలల ప్రపంచంలోకి అభిసారికనై అడుగులు వేస్తూ..
ఆ వంటగది కిటికీదాటి గుమ్మానికి అనుకుని నిలుచున్నాను...కనిపించానా..
దిగుళ్ళబావికి తాళాలు వేసి చిరునవ్వుల సంతకంతో నీకోసం ఎదురు చూస్తున్నాను..
పసిపాపలా నీ జతగా నా హృదయాన్ని లంకెవేయాలని నీముందు ఉంచాను..
నా చుట్టూ ఉన్న ఈ గంభీరమైన మనుషులు కనిపెడతారని భయంతో ఎదురుచూస్తున్నాను నీకోసం..
ఎరుపెక్కిన బుగ్గల నిగ్గు.. నీమీద ప్రేమను అందరికీ చెపుతుందేమోననీ తలుపుతో దాగుడుమూతలు ఆడుతూ ఇక్కడే నక్కి ఉన్నాను.
నువ్వు చూస్తావని కదూ ఇంత ముస్తాబూ చేసుకుంది..ఈ నీలిరంగును పులుముకుంది..కనిపించానా మరి..
ఒంటరి బాటలవెంట నగ్నదేహాల అందాలకై వెతికే నీ చూపులకు నేను కనిపించానా..కలగన్నావా నన్ను..
Tuesday, 27 October 2020
చెట్లు చెప్పిన సాక్ష్యం...
మొదట నమ్మలేదు నేను... నువ్వు నాతోనే ఉన్నావని వాదించాను..
లేవంటూ.. నా ఆలోచనలను అక్కడే ఆపేసాయి చుట్టూ ఉన్న చెట్లు..
నువ్వు తడిమి వదిలిన తడి పెదవుల జాడలు ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నాను
నువ్వు నేను కలియదిరిగిన చోట నీ కాలి జాడలు.. నీ చేతి గురుతులు ఉన్నాయన్నాను
తప్పదు బాధగానే ఉంటుంది.. నిజాన్ని ఒప్పుకోవడం.. లేడు పొమ్మన్నాయి..
రాత్రి చలికి ఒణికి తేమగా మారిపోయిన నేలంతా మనం కలిసి నడిచిన ఆనవాళ్ళు..
మౌనంతో కొన్ని.. మైకంలో కొన్ని.. ప్రేమలో తెలియాడిన క్షణాలు..
విచ్చుకున్న కాడమల్లెల సుగంధాల వెంట నీతో గడిపిన క్షణాలకోసం వెతుకుతూ వెళ్ళానటు
రాలిపడిన పూల పుప్పొడిని తొక్కుకుంటూ కాలిబాట వెంట నీ ఆలోచనలను మోస్తూ..
నీతో కలిపి ఎన్నో మధుర జ్ఞాపకాలను పేర్చుకున్నాను ఇక్కడ..
గుబురుగా అల్లుకున్న మల్లె పందిరికింద నీతో గడిపిన క్షణాల ఖరీదు తెలపమన్నాను
వెతుకుతున్నాను నీకోసం.. తిరిగి తిరిగి విసిగి వేసారి అక్షరాలను తోడుగా రమ్మన్నాను..
నా వేదనా భరిత విరహాన్ని నీ వరకూ చేర్చమనీ.. నీ సమక్షంలో నేను పొందిన ఆనందాన్ని తిరిగి ఇవ్వమనీ..
అప్పుడూ చెట్లు నన్ను చూసి జాలిగా నవ్వుతూనే ఉన్నాయి..
నువ్వు లేవనీ మౌనంగా సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి.
Monday, 26 October 2020
కలగంటున్నాను...
ఒక వేడి మధ్యాహ్నపు మగత నిద్దురలో కలగంటున్నాను..
ఇసుక ఎడారుల్లో ఎరుపెక్కిన గోధుమ వర్ణాన్ని తాకుతున్న ఎండ
మైదానం నిండా నీరూరుండని దారుల గుండా దాహంతో వగరుస్తూ..
చిగురుటాకుల చప్పుళ్ళ కోసం, చెట్ల నీడ కోసం వెతుకుతున్నాను.
వెచ్చని ఇసుక తిన్నలపై అలుపొచ్చి నీరసిల్లి మోకరిల్లాను
బడలిక.. పెద్ద గీత ముందు చిన్న గీత..
రాలిపడిన పూల పుప్పొడి వాసనలతో ముక్కుపుటాలకు ఇక్కడ బోలెడు పని
నీటి గుంటల మాటున దాగి సయ్యాటలాడుతున్న చిట్టి చేపల సందడి
అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నేలకు ఆకాశానికీ నిచ్చెన వేస్తున్న ఆలోచనలు
ఒక రోజు మరో రోజులోకి మారిపోతూ.. మత్తు కళ్లు జోగిపోతూ
కల కంటున్నాను.. సుందర దృశ్యాలను.. ఇసుక తిన్నెలను.. ఎండమావులను
Wednesday, 21 October 2020
సుదూర తీరాలకు....
ప్రతిరోజూ నేను చూసే ఉదయమే ఈరోజు వన్నెతగ్గి కనిపించింది..
నా ఆలోచనల శ్మశానపు రోదనలను చీల్చుకుని పుట్టిన ఉదయం..
దారితప్పిపోయాను ఈ అడవిలో.. ఎంత నడుస్తున్నా తరగని దూరం
ఆ చెట్లకేం తెలుసు నేను ఎదురుపడతానని.. వాటి నీడలో సేదదీరుతాననీ.
.
అడివంటే చుట్టూ ప్రకృతి ఒడిలో రాత్రికి పగలుకూ భేదమే తెలీని స్వర్గమనీ భ్రమ పడ్డాను..
పక్షుల కూతన్నా వినపడని ఈ అడవిలో అందాన్నంతా ఎవరెత్తుకెళ్లారు..
దారంటా చేతులు నరికేసిన చెట్లను పలకరించాను.. కుశలం అవేం చెపుతాయి.
అసలు శూన్యంలో గిరికీలు కొట్టే నా ఆలోచనలకు కుశలమడగడం ఏం తెలుసుననీ..
మరో మనిషి ఆహాకారాలు చెవిన పడని దారులంట పోతూ...
పగటి కలల్లో పల్టీలు కొట్టే కోరికలు ఒంపిన కాళీలను పూరిస్తున్నాను..
ముళ్ల పొదల్ని తప్పించి కాలిబాటలు వేస్తూ.. సుదూర తీరాలకు నడక..
అడవినంతా రాజుకున్న దావాగ్నిలో ప్రాణాలకోసం పరుగులెత్తే జీవాలతో నేనూ పరుగెడుతున్నాను..
కాలి బూడిదైపోతున్న అడవి దారంతా పగుళ్ళు పడిన నేల..
భీతిల్లి పరుగుతీస్తున్న జీవాలతో కలిపి నిప్పంటుకుని నివురునైపోతానేమో తెలీదు..
విడుదల ఏది?
గత అనుభవాలు ఈటెలు,బాకులై తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా చేసి నడిచే దారిలో నేనో గులకరాయిని జ్ఞాపకాలు చెదిరిన కాగితం కట్టలతో వేల ...
-
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్...
-
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర...
-
నా మొదటి కథ "పొరుగింటమ్మాయి" http://patrika.kinige.com/?p=1038&view-all=1 కినిగె పత్రికలో చదవండి. ప్రపంచం అంతా...