Wednesday 16 September 2020

నేను ఇప్పుడు చంద్రుణ్ణి ఇష్టపడటం లేదు.....


నిశిరాతిరి చుక్కలన్నీ ఆటలాడుకునే సమయం.. దురంగా ఉన్నట్టే కనిపిస్తూ.. చేతికందేంత దగ్గరకు వస్తాయి..చుక్కలు. 


బాల్కనీ లోంచి తొంగిచూసే నిన్ను పలకరించి పరిహాసాలాడుతాయి. వాటితోడై చక్కనివాడు చంద్రుడూ మబ్బుల మాటునుంచీ తొంగి చూస్తాడు. దోబూచులాడుతాడు. మురిపిస్తాడు నిన్ను.


చల్లగాలి బరువెక్కిన దేహాన్నితాకి పోతుంది.. పూలకుండీలో విచ్చుకున్న మల్లెలు తెరలు తెరలుగా సువాసనల సందేశాలు పంపుతున్నాయి. 


అస్పష్టంగా పరదాలో నిలుచున్న ఆకారం. గగనమంతా కమ్ముకున్న ఆలోచనల్లో వెతుక్కుంటున్నాను నిన్ను. 


ముక్కుపుడక వెన్నెల కాంతిలో తళుక్కున మెరుస్తుంది. నా కళ్ళు మాత్రం మబ్బుల్లో దాగున్న చంద్రుని మీదనే. 


నన్ను ఆకర్షించాలని తను.. తనని చూడాలని నేను.. అదో రొమాంటిక్ సన్నివేశం.


అప్పుడే చలం గుర్తుకొస్తాడు.. పారే నీటి మీద నీడల సయ్యాట.. గుచ్చుకునే చూపులు.. 


ప్రేమనే భావన ఎంత సుందరమో చెపుతాడు. పరిమితులు లేని ప్రేమ.


 అందం, ఆనందం,మౌనం, గంభీరం, సెక్స్, త్యాగం వెరసి ఓ నిస్సహాయత అప్పుడు ఆవరిస్తుంది నన్ను. 


నాలోపల మనసేదో గొణుక్కుంటుంది.. నాకు మాత్రమే వినిపించేంత నెమ్మదిగా స్వరాన్ని తగ్గించి చుట్టూ వెతకమని.. 


జాడతెలీని నిన్ను గురించి ఎక్కడని వెతికేది.. 


నాకు తెలిసిన మనుషులు, ఎడతెరిపిలేని మాటలు, అర్తనాదాలు, నిరుత్సాహాలు, ఆయాసాలు, ఆపసోపాలు ఇన్నీ నాలోంచి ఈ సమయంలో పైకి వచ్చి వెక్కిరిస్తున్నాయి. 


చుట్టూ ఉన్న ప్రశాంతతలో కలిసిపోయి నన్ను భయపెడుతున్నాయి. 


గాలి బరువెక్కిపోతుంది. చుక్కలు నాకు చక్కగా అమిర్చినట్టూ ఇప్పుడు ఆనడంలేదు. 


అలికేసి, చల్లేసినట్టు ఉంది ఆకాశం. నిండా నల్లని రంగు పులుముకుని చూస్తుంది నాకేసి. పేలవంగా మారిపోతున్న ప్రేమలు, ఆప్యాయతలు, వీగిపోతున్న జీవితం మీది ఆశలు.. 


గడ్డుగా నెట్టుకొస్తున్న రోజులు.. ఆకలి దాచుకునే మధ్యతరతి గంభీరతలు.. ముఖంలో కళ తప్పిపోయి..పనిపోయిందని దిగాలు పడిపోయిన ముఖాలు.. 


ఇవే కనిపిస్తున్నాయి. ఇన్నిటిమధ్య నీ జాడ తెలీడం లేదు నాకు. నేను ఇప్పుడు చంద్రుణ్ణి ఇష్టపడటం లేదు.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...