Friday 25 August 2017

ఈమధ్య నేను చదివిన కథ....


చెదిరిపోయిన బంధాలు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీలో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అవి నిన్ను విడిచి దూకంగా పోయినప్పుడు నువ్వు పడ్డ బాధనంతా పంటికింద నొక్కిపెట్టి ఒక్కసారిగా కట్టలు తెంచుకు వస్తున్న దుఖాఃన్నంతా కంటి కొనల్లో ఆపి నీ ముందున్న నీ పేగు బంధాన్ని గుండెలకు హత్తుకున్న నీలో దాగున్నది మానవత్వం అనాలా దైవత్వం అనాలా?
"ఎడారి కోయిల" మధురాంతకం రాజారాం గారు రచించిన ఈ కథ చదువుతున్నప్పుడు నాలో దాచేసుకున్న గతాన్ని కాసేపు తాకింది. పల్లెటూరు, అక్కడి మనుషులు, వారి జీవితాలు, ప్రేమలు, ఆప్యాయతలు, పాడి పంటలు, ఉన్నతనానికీ లేనితనానికీ మధ్యగా ఉన్న గీతను చాలా దగ్గరగా చూపించారు.
పేగుతెంచుకుని పుట్టిన బిడ్డ ఆ బంధాన్ని కాదని దూరంగా పోతే ఆ తల్లితండ్రులు సమాజంతో కలిసి మనడానికో, లేదా వాడి తరవాత పుట్టినవాళ్ళను బ్రతికించుకోవడంలోనో నిన్ను కాసేపు మరిచిపోవచ్చు. నువ్వు రావని జీవితంతో రాజీ పడిపోవచ్చు కానీ నువ్వు పుట్టినప్పుడు ఆ తల్లి పడ్డ పురిటినొప్పులు ఆమె ఊపిరి ఉన్నంతవరకూ మరవదు.
కొడుకు రాకపోయినా తన మూలాలు వెెతుక్కుంటూ వచ్చిన మనవడిని చూసి "సుబ్బారాయుడి కళ్ళు పెద్దవయ్యాయి. ఫాలతలంలో గీతలు పడ్డాయి. ముఖంలో ఆళ్చర్యం చిందులు తొక్కింది. ఎండుపుల్లాంటి చేతులు, పైకిలేచి, రవిబాబును మంచంపైన కూచోబెట్టుకున్నాయి. ముఖమంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయాడు."
1986లో రాసిన ఈ కథ అప్పటి ఉమ్మడి కుటుంబాల వాతావరణానికి సరిపడకపోవచ్చు,లేదా కాస్త కొత్తదనంతో కనిపించవచ్చు. కానీ ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్న ఊరిలో 50 కుటుంబాల వాళ్ళ పిల్లలు అమెరికా ప్రయాణం కడుతున్నారు. ఇక తిరిగివస్తున్నారా ఇక్కడి తల్లితండ్రులను చూస్తున్నారా అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇక్కడి తల్లితండ్రులు కూడా బిడ్డల్ని అమెరికా పంపేటప్పుడే వీడు ఇక తిరిగి ఇక్కడకు రాడు. అక్కడే స్తిరపడిపోతాడు అన్న ఉద్దేశానికి వచ్చే పంపుతున్నారు. అదే వారికి సమాజంలో ఖ్యాతి కూడాను.
అందువల్ల నన్ను ఈ కథ పెద్దగా బాధించకపోయినా, రాజారాంగారి శైలి, కథ సాగిన తీరు నన్ను కట్టిపడేసాయి.
ఈకథలో నాకు నచ్చిన పేరా................
"పగటి వెలుగులు క్రమక్రమంగా తరిగిపోయి, రేజీకట్లు మెల్ల మెల్లగా ముసురుకుంటున్న ఆ మునిమాపువేళ, అపరిచితుడైన పడుచువాడొకడు కాలిబాట వెంట ఊరివైపు నడిచి రావడం గమనించి ఆడుకుంటున్న పిల్లలందరూ ఊరి ముందర గుమిగూడిపోయారు. బావిదగ్గర నీళ్ళు చేదుతున్న ఆడవాళ్ళు విగ్రహాల్లా స్తంభించిపోయి విస్మయంతో చూస్తున్నారు. రచ్చబండమీద కూచున్న మగవాళ్ళ దృష్టికూడా కాలిబాటవైపు కేంద్రీకృతమైంది."
ఊరిలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులను ఇలా వింతగా చూడటం అన్నది ఎంతో బాగా చెప్పారు.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...