Saturday 3 December 2016

అందుకే నేనటుగా వెళ్ళను.





ఊహతెలిసాకా నా తొలి జ్ఞాపకం నాన్నగారి వేలు పట్టుకుని నడుస్తున్నాను. ఎక్కడికో తెలీదు. తెలతెలవారుతుంది. మంచాల పై నుండీ నిద్రను వదిలించుకోని జనం. పాచి ముఖాలతో వాకిళ్ళు ఊడుస్తున్న ఆడవాళ్ళు. పాల సైకిళ్ళు. నాన్నగారిని దారంటా అంతా పలకరిస్తున్నారు. ఆయన  చాలా వేగంగా నడుస్తుంటే ఆయన్ను అందుకోవాలనే నా ప్రయత్నం.
  • *  *  *

సాయంత్రం అవుతుంది, పెద్ద చెరువు, దాని గట్టు చుట్టూ ఎతైన కొబ్బరి చెట్లు, పిట్టల కూతలు, వాతావరణం చల్లగా ఉంది. సంతోషి మాత గుడిలో ప్రసాదం కోసం పార్కు బెంచీ మీద కూర్చుని గుడివైపే చూస్తున్నాం నేను, చెల్లి. గుడికి కాస్త దూరంలో పశుల ఆసుపత్రి. కటకాల గదికి పెద్ద తాళం కప్ప వేళాడుతూ ఉంటుంది ఎప్పుడూ. మేమొచ్చిన దగ్గరనుండీ ఓ రెండు మార్లు చూసుంటాను డాక్టర్నిఅంతే.

ఈ ఆసుపత్రికి కాస్త దూరంలోనే ఉంటాం మేము. మొదటిసారి  ఈ వీధికి అద్దె ఇంటికోసం వచ్చినపుడు, "పెద్ద అరుగుల ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందండి ఓసారి కనుక్కోండి" అన్నాడు పోస్టుమాస్టారు. అంతే నాన్నగారు నన్ను తీసుకుని ఇటుగా వచ్చారు. అదే నేను చేసిన పెద్ద తప్పని చాలాసార్లు ఫీలయ్యాను. లేదంటే ఎవరు రాకాసి పాపమ్మ ఇంట్లో అద్దెకుంటారు.

ఆరోజు నాన్నగారితో ఆలమూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే,  మంచాలు వాకిట్లో వేసి, వాటి మీద కొబ్బరిచిప్పలు ఆరబెట్టి ఉన్నాయి. ఇల్లంతా కొబ్బరి చిప్పలే. ఇల్లు చూడడానికి వచ్చిన మాకు కూడా చిన్న చంబులతో కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. నాకు కొబ్బరి నీళ్ళంటే చాలా ఇష్టం. సరే ఆడుకోవడానికి ఎదురుగా పెద్ద స్థలం ఉందికదాని, నాన్నగారు "ఇల్లు బాగుందా" అని అడగగానే "ఆఆఆ బాగుంది నాన్నగారు" అనేసాను. కానీ పాపమ్మ పరమ గయ్యాళి. ఆ సంగతి అప్పుడు తెలీలేదే. మేము బారెడు పొద్దెక్కేదాకా నిద్ర లేవమని, రెడియోకి అతుక్కుపోతామని, ఎప్పుడూ అల్లరి చేస్తామని, ఓఓ తిడుతూనే ఉండేది. అమ్మకు ఆమెకూ ఎప్పుడూ గొడవలే.

 మా అల్లరి భరించలేక ఇల్లు ఖాళీ చెయ్యమన్నపుడు, ఆవిడతో అమ్మ చేతులూపుతూ వాదులాడటం  ఇప్పటికీ లీలగా గుర్తుంది. కొత్త ఇంటికి వచ్చేసాం గానీ, శుక్రవారం నాడు పెట్టే సంతోషిమాత ప్రసాదం మీదనే ఉండేది మనసు. ఇంటి ఎదురు పార్కులో నా నేస్తాలతో ఆడుకోలేకపోతున్నందుకు, తెగ బాధ పడిపోయేదాన్ని. ఎన్ని ఆటలాడుకున్నానో ఆ పార్కులో.

కొన్ని జ్ఞాపకాలు ఎంత వయసొచ్చినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలు నాకు కాస్త ఎక్కువే. ఎందుకంటే నేను జ్ఞాపకాలతోనే ఎక్కువ కాలం గడుపుతాను గనుక. కొన్ని లీలగా గుర్తుంటే, మరికొన్ని చాలా బలంగా, గాఢంగా గుర్తుండిపోయాయి. బాల్యం దేవుడు నాకిచ్చిన వరం. అందులో ఎందరి ముఖాలో, భుజాలపై చేతులు వేసుకుని తిరిగిన స్నేహితులను, ఆటలాడుకున్న బడిని, గుడిని, కోనేరును, ఉయ్యాలలూగిన మర్రిచెట్టును ఎప్పటికీ మరిచిపోలేను.

"you may forget your childhood, 
but your childhood does not forget you"- michael dibdin


చాలాసార్లు అనిపిస్తుంది ఈ జ్ఞాపకాలను వెతుక్కుంటూ, మళ్ళీ ఆ పరిసరాలకు వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. మళ్ళీ కాస్త భయం వెనక్కులాగుతుంది. ఏమో నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఊరు తన రూపు మార్చుకుని, అప్పటి పెంకుటిళ్ళ స్థానంలో నేటి కాంక్రీటు భవనాలు రావచ్చు. మా బడి పడగొట్టి, పెద్ద ధాన్యపు గొడౌనే కట్టచ్చు. నా చిన్ననాటి జ్ఞాపకాల తెరలో వచ్చి చేరే కొత్తమార్పులను నేను ఎప్పటికీ స్వగతించలేను. ఆ జ్ఞాపకాలన్నీ నా మనుగడ ఈ భూమి మీద ఉన్నంత వరకూ ఓ మధుర స్వప్నమల్లే నిలిచిపోవాలనే కోరుకుంటాను. అందుకే నేనటుగా వెళ్ళను.




















No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...