Thursday 16 July 2015

మరోదారి

చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిన పేదరాసి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు ఎంత అల్లి చెప్పినా వాటిని అల్లి చెపుతున్నారని మనకు తెలిసినా వినసొంపుగానే కాదు, సరదానూ తెలియని ఆసక్తినీ రేపేవి. అంతే కానీ నిజంగా తెనాలి రామకృష్ణడు అంత తెలివిగలవాడా అనే అనుమానమూ రాలేదు, అక్బర్ ముందు బీర్బల్ చూపిన చతురత నిజమేనా అనే సందేహమూ మనకు కలగలేదు. పెదరాసి పెద్దమ్మ పై అల్లిన కథలను ఈనాటికీ వింటునే ఉన్నాం. మనలానే ఇతరదేశాల వారూ ఓ తెనాలి రామకృష్ణుడు, బీర్బలు లాంటి పాత్రను వారూ సృష్టించుకున్నారు. అతడే  ముల్లా నసీరుద్ధీన్. చతురత, కాస్త అమాయకత్వం కలబోసిన ఈ కథల్ని మన తెలుగులో చెప్పాలని చిన్న కోరిక పుట్టింది.............

ఒకరోజు తన స్నేహితులతో టీ దుకాణంలో ఉన్న నసీరుద్ధీన్ “అతిధ్యమివ్వడంలో నాకు సాటి ఎవరూలేరు” అంటూ ఢాంబికాలు పోయాడు. ఇంతలో అతని పక్కనే ఆశపోతు స్నేహితుడొకడు “చాలా మంచిది అయితే రాత్రి భోజనానికి మమ్మలందర్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చుగా,” అన్నాడు.

నశీరుద్ధీన్ తన స్నేహితులందరినీ గుంపుగా కూడదీసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దరిదాపులకు వచ్చాకా, “నేను ముందుగా వెళ్ళి మీరంతా వస్తున్న సంగతి నా భార్యతో చెప్పి వస్తాను” అని వారిని అక్కడే ఉండమని చెప్పి ఇంటిలోనికి ప్రవేశించాడు.

భార్యకు తన స్నేహితులు రాత్రి భోజనానికి వచ్చిన సంగతి చెప్పగానే ఆమె “ఇంట్లో తినడానికి ఏమిలేవు, వాళ్ళకు భోజనం పెట్టడానికి వీలుపడదు వెళ్ళిపోమని చెప్పు” అంది.

“నేను చేయలేను. అలా చేస్తే మంచి ఆతిథ్యమిస్తాన్న నా కీర్తికి కళంకం”.

“మంచిది, అలాగయితే నువ్వు మేడ మీదకు వెళ్ళు. నువ్వు బయటకు వెళ్ళావని చెప్పి వాళ్ళను పంపేస్తాను” అంది భార్య.

ఓ గంట గడిచేనాటికి తమ స్నేహితుడి కోసం ఎదురుచూసి అలసిన అతిథులు విసుగు చెంది గుంపుగా ఇంటి ద్వారం ముందు గుమిగూడి “మమ్మల్ని లోపలికి ఆహ్వానించు నశీరుద్ధీన్” అని గట్టిగా అరిచారు.

ఇంతలో నశీరుద్ధీన్ భార్య గుమ్మం దగ్గరకు వచ్చి “నశీరుద్ధీన్ లేడు బయటకువెళ్ళాడు” అని జవాబిచ్చింది.

“అదేమిటి మేం చూస్తూనే ఉన్నామే! మేమంతా గుమ్మం దగ్గరే ఉంటే అతగాడు ఎలా బయటకు వెళతాడు” అన్నారు వాళ్ళు.

ఆమె ఏం మాట్లాడాలో తెలీక మౌనంగా ఉండిపోయింది.

ఇంతలో పై అంతస్తు కిటికీ లోంచి కింద జరుగుతున్నదంతా చూస్తున్న నశీరుద్ధీన్ ఇక ఉండబట్టలేక కిటికీలోంచి తల బయటకు పెట్టి “నేను పెరటి గుమ్మం గుండా బయటకు వెళ్ళకూడదా ఏమిటీ?” అని వాళ్ళకు సమాధానం ఇచ్చాడు.

మరో కథతో మళ్ళీ కలుద్దాం..... :)




1 comment:

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...