Wednesday 16 October 2013

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోయే వేళ దోసిళ్ల కొద్దీ అమృతాన్ని తాగిన కవిగానే తిలక్ నాకు తెలుసు. ఈ కథతో ఆయన నాకు కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యాడు.

కథా విషయం:– ఊరికి దూరంగా పచ్చని పొలాల నడుమ, చింత చెట్లు తుమ్మ చెట్ల మధ్య, చూరు వంగి, గోడలు బెల్లులు ఊడి ఉందా ఇల్లు. మనుష్య సంచారం ఆ ఇంట ఉందా అనే సందేహం కలగక మానదు కొత్త వారికి. ఆ ఇంటిలో ఒక యువతి, ఆమెతో పాటు ఒక అవ్వ ఉన్నారు.

వాతావరణం దట్టమైన మబ్బులతో కప్పి ఉండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇరవై మూడేళ్ళ ఆ యువతి ఇంటి వరండా లోంచి అలా కురుస్తున్న వర్షాన్ని చూస్తూంది. తనలో రేగుతోన్న ఆలోచనలకు, దిగులుకు, దుఃఖానికి రూపాన్ని వెతుకుతున్నట్లు ఉన్నాయామె శూన్యపు చూపులు.

రోడ్డంతా గతుకులతో బురదతో నిండి ఉంది. వర్షపు నీరు ఆ ఇంటిముందు కాలువలుగా ప్రవహిస్తుంది. చలిగాలి కూడా తోడయింది ఆ వాతావరణానికి.

అంతలో వర్షంలో తడుస్తూ, బురదలో కాళ్లీడ్చుకుంటూ ఆ ఇంటి మందుకు వచ్చాడో యువకుడు. తాను తన మిత్రుణ్ణి కలవడానికి గాను ఈ ఊరు రావలసి వచ్చిందని, తిరిగి రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సిన తనకు వర్షం అడ్డంకిగా మారిందని అంటాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి వాన తెరిపిచ్చాకా తెల్లవారి వెళ్ళమంటుందామె. అవ్వ అతన్ని లాంతరు వెలుగులో చూసి  లోపలికి రమ్మంటుంది. అతను తన పేరు జగన్నాధం అని చెపుతాడు. కమ్మని భోజనం తిని, తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఆ యువతి తన పేరు రమ అని పరిచయం చేసుకుంటుంది. ఆమె మనసు మూలలో ఎక్కడో అతడు తన చిన్ననాటి మిత్రుడేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ అతని గతం విన్నాకా అది నిజం కాదని తెలుసుకుంటుంది.

తనకు ఒక ఊరంటూ లేదని, ఎవరు లేని ఒంటరినని, గతంలో సైన్యంలో పని చేసి ఎన్నో దేశాలు తిరిగి వచ్చానని చెపుతాడు. ప్రస్తుతం ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నానని చెపుతాడు. అలాగే ఆమె ఇంకా పెళ్ళి చేసుకోపోవడానికి కారణం ఏమిటని చొరవగా ప్రశ్నిస్తాడు. రమ ఆ ప్రసక్తి తప్పించుకోజూస్తుంది. అతను పట్టుబట్టి పదే పదే అడిగేసరికి తన గతాన్ని పంచుకుంటుంది.

రమ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఆమెను అనాధాశ్రమంలో చేర్పించి ఎటో వెళిపోయాడు. ఆ చిన్నతనంలో ఆమెకు ఏకైక స్నేహితుడు విజయుడు. అతనికి రమ అంటే వల్లమాలిన ప్రేమానురాగాలు. సవతి తల్లి చేత దెబ్బలు తిని మరీ ఆమెను సంతోషపెట్టేవాడు. వయసుతో పాటూ ప్రేమ పెరిగింది. సవతి తల్లి బలవంతంగా మరో పెళ్ళి చేయాలని చూస్తే ఆమెను కొట్టి ఊరు నుండి పారిపోయాడు. కొన్నాళ్ళకు తాను సైన్యంలో చేరానని, బతికి ఉంటే మళ్ళీ కలుస్తానని అతణ్ణించి రమకు ఉత్తరం అందింది. యుద్ధం ముగిసిన ఎన్నాళ్ళయినా అతను మాత్రం తిరిగి రాడు. ఈలోగా అనాథాశ్రమంలో రమను చేరదీసిన వార్డెన్ చనిపోవడంతో ఆమెకున్న ఆ ఒక్క నీడ కూడా కరువవుతుంది. ఓ పెద్దమనిషి మాయమాటలతో ఆమెను ఈ ఊరు తీసుకువచ్చి అవసరం తీరాకా ఒంటరిగా వదిలేస్తే చివరకు అవ్వే ఆమెకు దిక్కైంది.

ఈ కథంతా విన్నాకా చలించిపోయిన జగన్నాధం రమకు తోడుగా నిలవాలనుకుంటాడు. ఆ మాటతో ఆమెలో బతుకుపై ఆశ చిగురించింది. అతను తనకు ఉన్నాడన్న భద్రతలో హాయిగా నిద్రపోతుంది.

వీరి మాటలన్నీ చాటుగా విన్న అవ్వ, జగన్నాధాన్ని గది నుంచి బయటకు పిలుస్తుంది. రమ డబ్బు కోసం ఇలాంటి అబద్దాలనే ఇంటికి వచ్చే ప్రతీ విటునితోనూ చెపుతుందని అవి నమ్మవద్దనీ అతని మనసు కలుషితం చేస్తుంది. అది నమ్మిన జగన్నాధం మనసు వికలమై, తన డబ్బు పర్సును రమ పడుకుని నిద్రపోతున్న మంచం మీదకు విసిరి ఆ ఇంటి నుండి వెళిపోతాడు.

మర్నాడు రమ నిద్రలేచి జగన్నాధం కోసం వెతుక్కుంటుంది. అవ్వని అడిగితే డబ్బు ఇచ్చి వెళిపోయాడంటుంది. రమ నివ్వెరపోయి, అతనికి నువ్వేం చెప్పావని నిలదీస్తుంది. నువ్వు వెళిపోతే నా దిక్కేం కాను, అందుకే నీదంతా నటన అనీ, వచ్చిన ప్రతి వాడి దగ్గరా ఇదే వేషం వేస్తావనీ చెప్పానంటుంది.

రమ ఆవేశంతో శివాలెత్తి అవ్వని ముక్కాలిపీటతో కొడుతుంది. జగన్నాధం విసిరేసిన పర్సు తీసుకుని ఆదరాబాదరాగా రైల్వే స్టేషన్‌కు పరుగుపెడుతుంది. గోతుల్లో పడి లేస్తూ వళ్లంతా బురద గొట్టుకుపోయి స్టేషన్‌కు చేరుకుంటుంది. అప్పటికే రైలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చేసి ఉంటుంది. ఆమె పెట్టెలన్నీ వెతుకుతుంది. ఆఖరు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చున్న జగన్నాధం ఆమె కంటపడతాడు. ఈలోగా రైలు కదలడం మొదలవుతుంది. ఆమె కిటికీ పక్కన పరిగెడుతూ చేతిలోని పర్సును పెట్టెలోకి విసురుతుంది. జగన్నాధం మొదట ఆమెని పోల్చుకోలేకపోతాడు. ఫ్లాట్‌ఫాం మీద కుప్పకూలిన ఆమెను చూసి జాలిపడుతూ పర్సు తీసి చూసుకుంటాడు. పర్సులో అతని డబ్బులన్నీ యథాతథంగా ఉంటాయి. అతని ఫొటో తప్ప.

నా అభిప్రాయం:– కాలం ఆడిన ఆటలో ఓడిపోయి అవ్వ చెంతకు చేరిందా అభాగ్యురాలు. ఆమె అందాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించాలని ఆశించిందా అవ్వ. ఆమె కంటూ బంధాలు ఉంటే ఎక్కడ తనకు రాబడి పోతుందో అనే భయంతో పసికందును కూడా దూరం చేసింది అవ్వ.

చిన్న ఓదార్పు కోసం ఎదురు చూసే అమాయకురాలు తనకు ఎదురైన మనిషిని మనసున్నవాడిగా భావించి తన మనసులో చెలరేగుతున్న గతం తాలూకు జ్ఞాపకాలను, చేదు నిజాలను, తాను బతుకుపై పెట్టుకున్న ఆశలను అతనితో పంచుకుంది. ఈ అనుకోని అతిథి తన గతం తెలిసీ భర్తగా తన చేయందుకుంటాడనీ, తన జీవితానికి చిరు దివ్వెగా ఉంటాడనీ ఆశపడింది. పెళ్ళి అనే బంధంలోని తీయదనాన్ని తలచుకుంటూ, తెల్లవారితే తన జీవితంలో ప్రకాశించే వెలుతుర్ని కలగంటూ నిదురలోకి జారుకున్న ఆమెకు అంతా కల్ల గానే మిగిలిపోయింది. మళ్ళీ తన జీవితంలో చీకటే మిగిలింది.

నిజ జీవితానికి దగ్గరైన కథను రచయిత సరళంగా చెప్పిన తీరు మనసు కదిలించేలా ఉంది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడి ఓడిపోయిన జీవితం ఆమెది. ఒక్కరాత్రిలో ప్రేమించిన వాడు, అంత త్యరగానూ ద్వేషించాడు. తన జీవితానికే గమ్యం లేని వాడు, చివరకు ఆమెనూ ఒక గమ్యానికి చేర్చలేకపోయాడు.

9 comments:

  1. చక్కటి కధకు చెక్కిన సమీక్ష బాగుంది.

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. తిలక్ గారి కథ, మీ సమీక్ష రెండూ బాగున్నాయి

    ReplyDelete
  3. కధ చాలా భాగుంది. వెంటనే ఈ కధ చదవాలి.

    ReplyDelete
  4. నేను చిన్నప్పుడు 5వ తరగతి సెలవుల్లొ మావూరి లైబ్రరీ లో తిలక్ కథలు కొన్ని చదివాను. ఇప్పుడు మీ సమీక్ష చదూతొంటే ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి.నా మట్టుకు నాకు తిలక్ కథలు కవిత్వం లా కవిత్వం కథ లా అనిపిస్తుంది. మనకున్న గొప్ప కథకుల్లొ నిస్సందెహంగా తిలక్ అగ్రగణ్యుడు . Thank u

    ReplyDelete
  5. పాపిని శివశంకర్ "చివరి పిచుక" చదివారా...హృదయాన్ని కదిలిస్తుంది..

    ReplyDelete
  6. ధన్యవాదాలు కిషోర్ గారు , లేదండీ చదవలేదు. చదువుతాను.

    ReplyDelete
  7. తిలక్ కథలు చాలా బాగుంటాయి.
    మీరు సమీక్షించిన ఈ కథని "ఎడారి వర్షం" అని షార్ట్ ఫిలింగా తీసారు.
    యుట్యూబ్‌లో చూడచ్చు.

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...