పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పిచ్చి మనసు..

చిత్రం
ఉత్తప్పుడు పాటలెన్నో పాడుతుంది మనసు.. అందరిలో నిన్ను బయటకు తేవాలంటే భయం దానికి.. ఈ పుష్పించిన ఉదయాల్లో నిన్ను గురించి ఊహిస్తుంది.. చీకటిలో కాంతిని నింపుకున్న కళ్ళతో వెతుకులాడుతుంది.. ఆలోచనలకు రెక్కల్ని తొడిగి.. ఊహలు చెప్పే ఊసులన్నీ బుద్దిగా వింటుంది.. పిరికితనాన్ని మోస్తూ మాయను పూసిన నవ్వు నటిస్తుంది. గమనింపుకొచ్చిందా? ఇల్లంతా కాంతి నింపాలని చీకటి గదిలోంచి కలలు కంటుంది.. దీపకాంతిలో నీ నీడను కలగని..మాయమయ్యే నీడలతో కబుర్లాడుతుంది.. శూన్యంలో ఏం వెతుకుతుందో మరి.. వెన్నెల గుబులు పుట్టిస్తుందట.. నిన్ను గుర్తుచేసి.. సమాధానంగా నువ్వు లేవంటుంది.. ఎవరు వద్దన్నారు.. ఆ గోడల ఊసులు ఎన్ని రోజులు..

చలిగిలి...

చిత్రం
జివ్వున లాగుతున్న నేలకు తెలుసు ఇది చలిగిలి కాలమనీ.. చల్లదనాన్నే చిరునామాగా చేసుకున్న చెట్ల గుబుర్లకు.. చిట్టి చినుకుల్లా చలిని మోస్తన్న గడ్డి నేలకు తెలుసు.. తెల్లరుజామున వణుకుతూ చలిమంట కాగే పల్లెకు చలిగిలి పరిచయమే.. కొత్తగా ప్రేమను అనుభవిస్తున్న జంటలకు తెలుసు చలిగిలి చేసే దగ్గరితనం... రోడ్లన్నీ చలికి భయపడుతున్నాయి.. దుప్పటికప్పుకుని జోగుతున్నాయి.. మరి.. పొగమంచు కప్పేసిన ఈ చోటంతా చలికి కుచించుకుపోతుంటే వెచ్చదనాన్ని వెతుకుతానేం వెర్రిగా..

నృత్యం చేస్తున్న గాలి..

చిత్రం
ముతైదువ ముఖంలా పసుపు పరుచుకుంది ఆకాశాన్నంతా... సూర్యకాంతికి ఆకుల చాటున దాక్కున్న పూల మొగ్గలు.. ఉదయకాంతిలో నలుపు తెలుపులు మాయమైన చోటది.. హృదయాన్ని తాకిన చల్లగాలి పెట్టే గిలిగింతల మధ్య.. ఉదయం మధ్యాహ్నంగా సాయంత్రంగా రూపుమార్చుకుంది.. ప్రవాహంలో కొట్టుకు వస్తున్న దీపాల సమూహంలా.. బడలిక తెలియని మనుషుల మధ్య అదో సంబరం.. గాలికి ఒణికే దీపాల ముందు మైమరచి నృత్యం చేస్తున్న గాలి.. తళుక్కున మెరుస్తున్న నుదుటి మీది కుంకుమ రేఖతో.. ఎర్రని చీరలో ఆవల కాపుకాచి నిలుచున్నాను.. అటుగా వచ్చే నిన్ను పట్టుకోవాలని.. నీ చూపులకు నా చూపులు గురిపెట్టాను.. ఇకనైనా కనిపించు మరి...

నేను నిజమంటాను..

చిత్రం
కొలనులో తామర పువ్వు నవ్విన ప్రతీసారీ నీ జ్ఞాపకం తడుముతుంది.. ముసిరే చీకట్లలో ఆ చెట్లచాటున నువ్వే దాగున్నావని భ్రమ నాకు.. మనసుని ఆరాతీస్తాను... అది నువ్వేనా అని.. ఏమో అంటుంది మరీ ఏం ఎరగనట్టు... బిగి కౌగిలిని కలగంటాను.. అదీ కలేనా.. నీటిలో తామరాకును పట్టుకున్నా... చెట్టు నీడన నిల్చున్నా నీ నీడలే.. ఆనవాళ్ళే.. ఎవరికి తెలుసు.. ఎక్కడ నక్కావో.. వెతికి వెతికి వచ్చానిటు.. ఊరంతా నిన్ను చూడలేదంటుంది... నేను అక్కడే ఉన్నావంటాను.. వాళ్ళు భ్రమంటారు.. నేను నిజమంటాను.. కలలో నువ్విచ్చే ముద్దు నా పెదాలపై అంటిన తడి.. అన్నీ నిజాలల్లే తోస్తాయి.. ఏం చెప్పేది... నేను అనుభవించిన నీ స్పర్శ నిజమేనంటాను.. ఏం...

చిరుగాలికి మాయే వస్తే...

చిత్రం
విరబూసిన వసంతాన్ని నీకోసం తెంచుకు వస్తుంది.. కన్నుల్లో ఎర్రజీరల్ని తీసేసి కన్నీళ్ళే తెలియని నగరానికి నిన్ను తీసుకుపోతుంది.. ప్రకృతిలో పుసిన పూలన్నీటికీ తెనెల దారలు కురిపిస్తుంది.. ఎర్రబడ్డ సూర్యునీ చల్లబరిచి నీ చేతికిస్తుంది.. పగిలిన హృదయాలకు చికిత్స చేసి తీయని స్వప్నాలవైపు నడిపిస్తుంది. ఆగిపోయి ఆలోచిస్తున్న చెట్లకు నడక నేర్పుతుంది.. కాలాన్ని కదలకుండా కుర్చీలో కూర్చోబెడుతుంది.. అప్పుడప్పుడూ గలగల పారే ఆలోచనలు చేసే సవ్వడికి అడ్డుకట్టవేసి జీవిత తత్వం నేర్పుతుంది.. స్తబ్దుగా పడి ఉన్న నీ రోజులో వలపు ప్రేమను కురిపించి నిన్ను తనతో ఎత్తుకుపోతుంది.. జాగ్రత్త మరి..

ఆ చెట్ల అక్షింతల సాక్షిగా...

చిత్రం
చిరుజల్లుల వరమిచ్చావా..నిదురగొన్న కన్నులతో నీ ముందు వాలాను.. కుంకుమ రేఖ దిద్దుకున్న ఆకాశానికి నువ్వు గిల్లిన బుగ్గను చూపించాను.. నా చిరునవ్వుల బహుమతిని నీకోసం పట్టుకొచ్చాను.. నాలుగు పాదాల మన నడక చేర్చిన చెట్ల గొడుగు కింద చేరి గువ్వపిట్టలల్లే కబుర్లాడుకున్నాము.. మంచు కురిసి రాతిరి గుతులను మోస్తున్న గడ్డి పరకల మీద పాదాలుంచి ఆడుకున్నాము.. మాటల మధ్య నవ్వుల ముత్యాలను ఏరుకున్నాము.. మన మధ్య ఉన్న ఏ ఋతువు ఇంత అందంగా ఉండదేమో..నువ్వు నవ్వినంత అందంగా.. గాలికి ఊగే చెట్ల ఆకులు వేస్తున్న వాన అక్షింతల సాక్షిగా మనది మనువెరుగని మధురమైన బంధం..

మనతో నడుస్తున్నాయి..

చిత్రం
ఆ గోదారి వంతెన మీద పోతున్న రోజు గుర్తుందా.. ఎంత సంబరాన్ని ఎత్తుకెళ్ళాం ఇద్దరం.. జోరుగా పోతున్న బండితో పరుగులెడుతున్న చెట్టు చేమలు.. కలలు కంటూ పాతరోజుల్ని తలచుకుంటూ.. ఎటుపోతున్నా అవే వెంటాడుతూ..అలా ఎంత దూరమో మన ప్రయాణం.. గోదారి నీళ్ళంత స్వచ్ఛమైన గతాన్ని వెతుకుతూ చిన్ననాటి జ్ఞాపకాలను తడుముకుంటూ..ఎంతో దూరం..

చెదరని బాల్యం..

చిత్రం
ఉప్పుకారాలతో పంచుకు తిన్న జామకాయలు.. గోనెసంచులు పరుచుకుని తెరమీద బొమ్మల్ని చూసి మురిసిన బాల్యం గుడి ముందు భక్తి నటిస్తూ ప్రసాదం అందుకున్న రోజులు.. చెరువు గట్టు మీద మర్రిచెట్టుకు ఊగిన ఉయ్యాల ఆటలు.. ఒకరితో ఒకరం పోటీపడి ఆడి అలసిపోయిన ఉప్పల గుప్ప.. మట్టి కుండలు మధ్య ఆరబోసి ఉన్న ఊక మేటలు.. ఆగకుండా తిరుగుతున్న కుమ్మరి చక్రం.. మట్టి చెరిగి కుప్పగా పోసి.. మరో సృష్టికి తావిస్తూ.. నీళ్ళ బిందె భుజాన ఎత్తుకుని తడిచిన చీరతో.. పగిలిన అద్దం ముందు జుట్టు సవరించుకుంటూ.. నాతో ఆటలాడి ఓడిపోయి ఉడుక్కున్న వెంకటలక్ష్మి.. శనగచ్చుకోసం పోగుచేసిన ఇనుప సామాను.. దిపావళికి అమ్మ చేతి పాకం గారెల కోసం పడిగాపులు.. బుల్లి టీవీ ముందు పోటీపడి కళ్లప్పగించి చూసిన మహా భారతం.. నాన్న పట్టుకొచ్చే బాదం హల్వా కోసం జరిగిన చిన్నసైజు యుద్ధాలు.. పూలమ్మి తెచ్చే బుట్ట పూలతో గుప్పుకున్న వాలు జడలు.. వాన చినుకున్నల్లో తడిచి తెచ్చుకున్న జ్వరానికి అమ్మపెట్టిన పత్యాలు.. బుట్ట బొమ్మల్లా ముస్తాబై స్నేహితులతో ఆడిన గొబ్బమ్మలు.. చెదిరిపోయిన నా బాల్యానికి చెరగని గురుతులు..

నేనెక్కడా లేను..

చిత్రం
నేనో ఒంటరి బాటసారినై వచ్చాను ఇటు... వేగం లేని నడక నాది..నలుగురు కబుర్లాడే చోట నేను ఇమడను..సంబరాల్లో.. సరదాల్లో...నేను లేను.. వీగిపోతున్న ఆలోచనలతో విరాగినై పోతున్నాను..ఉషోదయాలు తప్ప..నాతోడుగా మరేదీ లేదు..నిదుర తెలియని కన్నులతో..ఏటవాలు చూపులతో.. తెలియని దాలులంట నా పయనం.. నేస్తాలను ఎరుగని శాపగ్తస్తురాలిని..వలపు పలుకుల జాణతనం లేని కురూపిని.. ప్రకృతి అందాన్ని పులుముకుని మురిసిపోతున్నాను.. తోడులేని పయనంలో ఆలోచనల ఆసరాతో ప్రయాణం నాది. గమ్యం తెలియని నడక.. ఆత్మీయులు లేని ఆవాసం నాది.. నేనెక్కడా లేను..చీకటి దారుల్లో తప్ప..

హృదయం..

చిత్రం
  ఉదయం చేతికి అంటుకుందే..కాడమల్లెల సుగంధం..ఇప్పటికీ నాతోనే ఉంది.. ఎన్నిమార్లు చూసుకోను..ఈచేతిని..నీ స్పర్శను వెతుకుతూ.. నీ ఆలోచనలనంత గాఢంగా నన్ను అల్లుకుపోయింది..నీకై వేచి చూస్తున్న నా కళ్ళకు నీ రూపు మాయనట్టు.. ఆకాశమంత ఆశతో.. నీఒడిలో ఒదిగిపోవాలని..నీకోసం ఎదురుచూస్తున్నా.. మరో జన్మకూ మన ప్రయాణం ఇలానే ఉంటుందని ఎవరు చెప్పారో తెలీదు..పిచ్చి హృదయం అదే నమ్ముతుంది.

వేచి ఉన్నాను ఇక్కడే..

చిత్రం
పరిణతి లేని జీవితానుభవాలతో..... వేగంగా పరుగందుకున్న కాలం చక్రాల కింద నలిగి.. చిద్రమైపోయి..ఆకలి గొన్న చూపులతో..ఉన్నాను..ఈ గుట్ట మీద.. గతం మిగిల్చిన జ్ఞాపకాలను నెమరువేస్తూ... పారే సెలయేరు, పరుచుకున్న ఆకాశం నాకు స్నేహితులు.. అప్పుడప్పుడూ వచ్చి పోయే ప్రేమ జంటలు..నాకు కాలక్షేపం.. చీకటి పొద్దులో గూళ్ళవైపుగా ఎగిరే ఈ పక్షులు నాకు బంధువులు.. మారుతున్న కాలాలు సెలవు తీసుకుంటున్నాయి.. వసంతం, గ్రీష్మం నేను ఎరుగనివి కావు.. ఆ చెట్ల గుబుర్లలో నా అనుభవాల అంబుల పొదిని దాచి ఉంచాను.. రేపటి వైపు నా అడుగులు కదపాలనీ...కాస్త ఉత్సాహం కోసం పడిగాపులు కాస్తూ..

ఉదయం తప్పిపోయింది..

చిత్రం
ఈ ఉదయం..రోజూలా లేదు.. వెలుగు పరుచుకున్న ఆ నేలమీద నాతో ఎప్పుడూ ఉండే నీ నీడలేదు.. తప్పుకుంది..నీరయింది..నా నుంచీ దూరంగా పోతుంది.. ఎంత బాగుంది నిన్న నువ్వు నా చేతిలో చేయివేసి నాతో ఊసులాడిన రోజు.. ఎవరో కాదు..నా మనసేమంటుందో తెలుసా..నువ్వు దూరమవుతావనీ.. ఎంత చెప్పినా.. కథ సిద్ధం చేసి నాకు నచ్చజెపుతుంది.. ఉత్త ఈసడింపులతో నెట్టుకొస్తున్నాను..లేదు నువ్వు నాతోనే ఉన్నావనీ.. నువ్వు మనసుకు గాయం చేసుకుని ఉన్నావనీ..అది మోసుకొచ్చిన కబురు..నిజం చెప్పు..

భానూదయం...

చిత్రం
ఉదయాల్లో తెల్లగా మారిపోతావు...సాయంత్రాలు ఎరుపు వర్ణమే.. రాత్రికి నల్లని రంగు పులుముకుని నాతో జత కడతావు... నీకోసం తలుపులు తెరచి పలకరిస్తాను ప్రతి ఉదయం... నా కళ్ళల్లో పడాలని తెగ తాపత్రయం.. ఏంటో నీకు.. నీటి అలలపై సయ్యాటలాడుతూ మెరుస్తావు.. ఎర్ర జాంపండే గుర్తుకొస్తుంది నిన్ను చూస్తేనూ... సీతాకోక చిలుక రెక్కల ఆటలో నీ అందం కనిపిస్తుంది.. మందారాలు పూసినా నువ్వే మెరుస్తావు.. అందానికీ నా ఆనందానికీ మధ్య నీరాక ఎప్పుడూ కొత్తగానే తోస్తుంది.. ప్రతి రాతిరీ కలగంటాను నీరాకను..తెలిసిందా..మరి నేను నీకైమవుతాను...

ఈరోజు నువ్వు రాలేదు కదా..

నీ జాడ లేదు నాతో...అంతా వెతికి అలసిపోయాను.. ఎందుకు దూరంగా పోయావో..వెలితినంతా నాలో నింపేసి.. గాఢత తెలీని నీ ప్రేమ ఈరోజు నన్ను నిలువనీయడం లేదు..ఉన్నపళాన నీ దగ్గర కు పరుగెత్తుకురానా.. మన గుర్తులన్నీ పట్టుకుని.. నీ ఛాయ నామీద పరుచుకున్న కలతనంతా తీరుస్తుందనే ఆశతో... ఇంద్ర ధనస్సు రంగులన్నీ పట్టుకుని వస్తున్నాను.. నా గాయపడిన హృదయానికి చికిత్స చేయాలి.. మరి.. నిన్నటి నుంచీ మరిచిపోయిన...నీకు నచ్చిన నా నవ్వు ని బహుమతిగా ఇస్తాను బదులుగా... ఏమంటావు.

ఈ చలి మన దేహాన్ని కప్పేసింది...

చిత్రం
నిన్ను పక్కనే కూర్చుని ఉండమన్నానా..మరేంటో నువ్వు... నా పక్కనే ఉంటూ ఏటో పోతావు..వెతుకుతాను..పట్టుకుని తీసుకువస్తాను.. మళ్ళీ మామూలే... వెచ్చదనం కోసం వెతుకుతూ నీ భుజాన్ని నొక్కిపెడతానా..పక్కకు నెట్టేస్తావు.. ఇద్దరూ ఒక్కరమై దగ్గరగా చేరాకా..ఇంకా చలేమిటి.. రహదారులన్నీ నిశ్శబ్దాన్ని పులుముకున్నాయి.. నువ్వూ నేనూ ఇద్దరమే అతిథులుగా.. పోతున్నాం. ఎంతటి చక్కని ఉదయం ఇది ఆస్వాదించు.. రాకూడని దారులంట ఏం వెతుకుతూ పోతున్నామో..నీకైనా తెలుసునా.. మసకచీకటిలో మౌనాన్ని తోడు తీసుకుని ఇద్దరమూ..వెచ్చదనంతో స్నేహం చేసాం.. ఊరంతా జోగుతుంది... నువ్వూ నేనూ తప్ప..

ఎవరా పిలిచేదీ..

ఎవరు పిలుస్తున్నారు నన్ను.. అక్కడ ఆకాశంలో దట్టంగా అల్లుకున్న మేఘాలేనా.. లేక..వేగంగా తీరాన్ని తాకి చెదిరిపోతున్న అలలా.. ఏ క్షణానా కరగని ఊహలా.. ఉరుముతున్న మేఘాన్ని అంటిన వాన చినుకులా..గతాన్ని మరిచిపోయిన నా కన్నీళ్ళా.. అసలు ఎవరా పిలిచేది..నేను ఎవరో తెలీని ఓ అగంతక స్వరమా.. గాఢంగా నా చుట్టూ అల్లుకున్న అపోహల వలయమా.. చీకటి అలముకున్న ఆ గది గుహలో గతం తాలూకు నిట్టూర్పులు విడుస్తున్న నా కలత నిద్రా.. ఎవరా పిలిచేది..నాలో సుడులు తిరుగుతున్న గతాన్ని పక్కకు నెట్టేసిన ప్రస్తుతమా..