నిన్న మనం వెళ్ళిన దారిలోనే
ఆ మలుపులో నేలను చీల్చుకుని
మొలిచిందా మొక్క
పూలన్నీ గాజు పూలు
నీటి బిందువులే పూలైనట్టు
నీటిపూలవి
నీ మనసంత స్వచ్ఛత వాటికి
చంద్రకాంతలు, గన్నేరులు, మంకెన్నలు, మధవీలతలకు ఉన్న సొగసంతా కలబో సుకుంది.
కుమ్మరిస్తున్న సువాసనలు నీ మాటలంత మధురం
అటుపోతుంటే అంటుకునే సోయగం ఎంతని
నలిగిపోతానని తెలిసీ నవ్వుతుంది
ప్రతి అడుగూ తన వరకూ వస్తుందని
భయపడుతూ లక్షల పాదాలకు మొక్కుతుంది.
ఏ చేతికీ చిక్కకూడదని
తన అందాన్ని తిట్టుకుంటుంది
ఎంతటి అమాయకమో
ప్రకృతిలో పూసేపూలన్నీ ఇంతేకాబోలు