Monday, 1 July 2019
Monday, 22 April 2019
నమ్మకం...
రైల్ ఇంజన్ మోత ఊరి కట్టవ దాటి వినిపిస్తుంది. కట్టెలమోపు తలకెత్తుకుని
నడుస్తున్న చిట్టెమ్మ దూరంగా ఉన్న కూతుర్ని గట్టిగా పిలుస్తుంది. రైసుమిల్లులోని ధాన్యం
ముక్కిన వాసన గంథిగాడి కొట్లోంచి వస్తున్న అగరబత్తీల సుగంధాన్ని కమ్మేసింది. ఆ
సాయంత్రవేళ తాటితోపు దాటి సైకిల్ మీద రైయ్ మని పోతున్నాను. నిన్నరాత్రి ఇంట్లో
జరిగిన గొడవ సంగతి ఆలోచిస్తూ...సడెన్ గా.. నా ఎదురుగా వస్తున్న సైకిల్
రాసుకుపోయింది. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది. రాసుకుపోయిందో, ఎక్కడన్నా
గీరుకుందో,.. ఆగి చూసుకుని మళ్లీ తొక్కుతున్నాను. స్కూలు దాటి గుర్కావోళ్ళ బీడు
దాటి మలుపుతిప్పాను.. ఊళ్ళోకి.
**
గుమ్మం తెర పక్కకు జరిపి బయటకు వచ్చింది వెంకటలక్ష్మి. ఎత్తరుగు మీద
కూర్చోమంటూ సైగచేస్తూ... గరుకునేల, పక్కనే కోడి గంపలు.. ఒకటే రెట్టల కంపు..
తలెత్తితే పైన కప్పులోంచి దూలంమీదకు ఎగిరి కూర్చున్న కోడిపుంజు నా వంకే చూస్తుంది.
తోకెత్తుతూ..
కాస్త పక్కకు జరిగాను. నిటారుగా కార్చోడానికి నానా తంటాలు పడుతూ..
లోపలికన్నా పిలవచ్చుగా.... అంతే మొద్దులంటే అందరికీ లోకువే.. దీనికి మరీను.
పైగా ప్రాణ స్నేహితురాలు..నేనంటే ఇంత చిన్నచూపున్నా.. దీన్ని ఎందుకు భరిస్తానో
నాకే సరిగ్గా తెలీదు.
నాకు ఎదురుగా మొక్కల పీట లాక్కుని కూర్చుంది తను.
“ఏంటే.. ఇలా
ఒచ్చావ్.. ఇంకా పరిక్షలు కాలేదా”.. వెంకటలక్ష్మి వెటకారం నవ్వు..
“మొన్నే అయిపోయాయ్”...
“ఈసారన్నా
పాసవుతావా.. లేదంటే మళ్ళీ దండయాత్రేనా”..?
“ఏమోనే పాస్ కావాలని
మాత్రం రాసాను. అవుతానో లేదో సరిగ్గా తెలీదు”.
“అలా అంటే ఏలా? మీ చెల్లి చూడు.. నీతో
చదివి పాస్ అయ్యి ఎంచక్క హాస్టల్లో చేరి కాలేజి చదువు చదువుతుంది. మరి నువ్వో”..
ఎదురుగా అరిగిపోయిన రుబ్బురోలు పొత్రం ముఖాన్న వేసి కొట్టాలనిపించింది.
బలవంతంగా..ఆపుకున్నాను...“అవునే.. నేను దద్దమ్మనే నాకు
చదువబ్బదు. ఏం చేయను.
నాకు చదవాలని లేదు మొర్రో అని చెపుతున్నా విని చావడంలేదు..
కొంపలో”..
సర్రున లేచి అరుగు దిగాను.
“అది కాదే.. నేను
నిన్ను ఏం అనడంలేదు. ఏదో మాట్లాడాలన్నావ్.. అనవసరంగా ఏదో మాట్లాడాను. రా ఇలా
కూర్చో”..
“లేదే.. నేను
ప్రశాంతి ఇంటికి వెళుతున్నా.. వీలైతే అక్కడికే రా.. అందరం కలుద్దాం”..
“సరే.. ఓ అరగంటలో
నాన్న వస్తారు. చెప్పి వస్తాలే”..
“ఊ”..
మెట్లు దిగి.. సైకిల్ దగ్గరకు నడిచాను.
“ఏమే..”
“ ఆ..ఆ..”
“కోపం వచ్చిందా??”
“అదేం లేదే.. కోపం
ఏం లేదు. విని విని అలవాటైపోయాయి.. ఈ మాటలు.
వస్తా.. నువ్వు త్వరగా వచ్చేయ్”..
రవిగాడి మిఠాయికొట్టు సందు దాటి.. ఊళ్ళో ప్రశాంతి ఇంటి వైపుకు వెళుతున్నాను.
**
రైల్ ట్రాక్ దగ్గరగా పెద్ద మండువా లోగిలి ఇల్లు.. చుట్టూ చెట్లు.. దారంతా
బురద.. మధ్యలో పళ్ళకిలించి పలకరించే స్నేహితులు. అందరినీ దాటి ప్రశాంతిని చూసి, వాళ్ళ
వరండాలో ఈ బరువైన దేహాన్ని వాలుకుచ్చీలో మోపి.. ఆంటీ ఇచ్చే చిక్కని కాఫీ గొంతులో
పోసుకున్నాకా గానీ.. మళ్ళీ మనిషినికాలేదు.
ఏదో ప్రశాంతత ఉంటుంది ఆ ఇంట్లో.. అందరూ దేవదూతల్లా ఆనతారు నా కళ్ళకు. ఎంతో
ఆనందాన్ని పేర్చి కట్టారనుకుంటాను ఆ ఇంటిని.. ఎవరిని చూసినా నవ్వు ముఖాలతో
పలకరిస్తారు. ఇక తిండి విషయంలో అయితే ఆపేసి, కడుపు పట్టనంత కూరి పంపుతారు. ఆంటీకి
నేనంటే ప్రాణం. ఒక్క నేనే కాదు వాళ్ళ అమ్మాయి స్నేహితులెవరన్నా ఆమెకు ఇష్టమే...
ఇక మా ప్రశాంతికి నేనంటే మరింత ఇష్టం. బహుశా మా స్నేహితులం అంతా కలిసినప్పుడు అక్కడ నన్ను మాత్రమే ఎక్కువ తలుచుకోవడం..నేను లేనప్పుడు వెలితిగా ఫీల్ కావడం,. బాధన్నా, ఆనందమైనా ఇద్దరం కలిసి పంచుకోవడం.. ఇందుకేనేమో.. నా
తోబుట్టువులకన్నా అదో పదిరెట్లు ఎక్కువ నాకు.
నాకు బాధ కలిగితే దాని కళ్ళల్లో కన్నీరొలుకుతుంది. ఈ విషయంలో నేను చాలా లక్కీ.
మనసు మరీ భారంగా.. నా చుట్టూ జరుగుతున్న చాలా సంగతులను నేను డీల్ చేయలేని క్షణం
వచ్చినప్పుడు నేను పలకరించే గుమ్మం ప్రస్తుతానికి ఇదొక్కటే...
**
అమాయకత్వాన్ని, కాస్త గడుసుదనాన్ని సమపాళ్ళలో కలిపితే అది అచ్చంగా మా ప్రశాంతిలా తయారవుతుంది.
“ఏమే.. కనకాంబరాలు
పెట్టుకుంటావా.. మా దొడ్డోవే.. చూడు ఎంత బావున్నాయో”.
చేతిలో నాలుగు మూరల పూలదండ పట్టుకుని నా ఎదురుగా నిలబడింది ప్రశాంతి. లూజు
పంజాబీ డ్రస్సులో మరీ పుల్లలా ఆనుతుందీరోజు. ఆ బక్కశరీరానికి ఇక ఒళ్ళు రాదు. ఇది
మా అందరికీ తెలిసిన సంగతే..
కానీ జుట్టు కూడా తక్కువే. ఆ పలచని బుర్రకు రోజూ నరకమే.. చూసిన ప్రతి పువ్వూ
తలలో తురిమేసి.. సాయంత్రానికి తలపోటంటూ వాలిపోతుంది. ఇక కొన్నాళ్ళకు బలహీనమై
జుట్టు రాలిపోతుందని...
మల్లీపూలు, సన్నజాజులు, చామంతులమీద ఇష్టాన్ని చంపుకుని
తేలిగ్గా ఉండే కనకాంబరాల మీద పడింది. ఇదిగో ఇప్పుడు నాకు అవే ఇస్తుంది
పెట్టుకోమని.
“వద్దే తల్లి.. నాకు
ఇప్పుడు ఏం పెట్టుకోవాలని లేదు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
తమరు ఈ డెకరేషన్
కానిస్తే మన అడ్డాకు పోదాం”..
“నేనా..
ఇప్పుడా..అమ్మ పేరంటానికి వెళదాం అందే”..
“సరే.. రేపొస్తాలే..
బై”
“ఆగవే బాబు..నీకు మరీ
దొందరే.. చెప్పేది అస్సలు వినవు..సరే పద.. అమ్మకు ఏదోటి చెపుతాలే”..
**
అసలు మరొకరిని నా సైకిల్ మీద మోస్తున్నానన్న సృహే నాకు లేదు. అంత తేలిగ్గా ఉంది ప్రశాంతి.. రైల్వే కోటర్స్ దాటి స్టేషన్ వైపు వచ్చాం. ఇదే మా అడ్డా... నేను, ప్రశాంతి ఎక్కువగా కలుసుకునే చోటు. ఈ రైల్వే స్టేషనంటే
మాకు చాలా ఇష్టం. ప్రశాంతంగా ప్రశాంతితో కలిసి ఎన్ని కబుర్లు పంచుకున్నానో ఇక్కడ.
మేం ఇద్దరమే కాదు. ఇంకో నలుగురు ఉన్నారు. అంతా వీలుదొరికితే ఇక్కడే కలుస్తాం.
స్టేషన్ కు మూలగా ఉన్న బెంచీ మీద కూర్చున్నాను. వెనగ్గా వచ్చింది తను.
“వెంకటలక్ష్మి
కాసేపట్లో వస్తానంది. అది వచ్చేలోపు నీకు ఓ సంగతి చెప్పాలి”. రెండు చేతులూ
నలుపున్నాను.. చేతులకయిన చెమట స్కట్ కి తుడుచుకుని ఏదో చెప్పబోయాను.
“ఏంటది”.. కూడా తెచ్చుకున్న జీళ్ళు
చప్పరిస్తూ.. నా పక్కనే కూర్చుంది ప్రశాంతి.
“ముందు నువ్వా తిండి
ఆపు..తర్వాత చెపుతాను”.
మరేం మాట్లాడకుండా పక్కనే తుప్పల్లోకి కోపంగా నోట్లో జీడి విసిరేసి,
చేతిరుమాలుతో చేయి తుడుచుకుంటూ.. “చెప్పవే బాబు.. మరీ అంత కొంపలు మునిగిపోయే
విషయం ఏంటో”.. విసుక్కుంది.
“నీకు కాదుగానీ.. నా
కొంప మునిగే సంగతే”..
“ఆ.. ఏంటి.. అర్థం
కాలేదు”.
“అవునే.. నాకు
పెళ్ళి చేసేస్తున్నారు..ముహుర్తం పెట్టేసారు”.
“అవునా.. అదే మీ
మావయ్య అన్నావ్.. ఆయనేనా”..
“ఆ.. అవును”.
“మరి అతనంటే నీకు
ఇష్టం లేదన్నావ్ కదా”..
“లేదు”..
“మరి అంకుల్ కి
చెప్పు”..
“ఏంటి చెప్పేది.
మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు చిన్నగా చెప్పాను. మావయ్యంటే నాకు ఇష్టంలేదు. అతను
అందరిలా సరదాగా ఉండడు. కనీసం నాతో మాట్లాడడు. పైగా నాకు అతనంటే భయం అని. ఈ పెళ్ళి
నాకు ఇష్టం లేదని,. మీరే అమ్మతో చెప్పండి అన్నాను”.
“మరి అంకులేమన్నారు”.
“ఏమీ అనలేదు”.
“ఆయన “కీ” దగ్గరకు వెళ్ళి ఇదే
మాటచెప్పారు”.
“కీ”.. “ఎవరే”..
“అదే నే మా అమ్మ”..
“మరి ఆంటీ ఏమంది”
“దానికి మా అమ్మ..
ఏం వెధవ వేషాలేస్తుందా.. నా తమ్ముడికేం బంగారం. ముండని.. కాళ్ళు విరగ్గొట్టి మరీ.. పెళ్ళి జరిపిస్తానని
చెప్పండి” అన్నదట. అదే
తిరిగొచ్చి చెప్పారు. అప్పటి నుంచీ అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. ఇంట్లో
ఉండాలంటేనే చిరాగ్గా ఉంటుంది. ఎవరూ నాతో సరిగా మాట్లాడరు. ఏదో నేరం చేసినదాన్ని
చూసినట్టు చూస్తున్నారు.
“అవునా.. పోనీ నేను
మాట్లాడనా ఆంటీతో”..
నవ్వొచ్చింది.
“ఎందుకే
నవ్వుతున్నావ్”..
“ఏం లేదే.. మా అమ్మ
చేతిలో నువ్వు దెబ్బలు తింటున్నట్టు ఊహించుకున్నాను”..
“పోవే”..
“మా అమ్మ ఎవరి మాటా
వినదే.. ఇక నాన్నగారు... బసవన్న జాతి... అక్కడ మన ఆర్తనాదాలు ఎవరికీ చెవుల వరకూ చేరవ్”..
“మరెలాగే”..
“ఏమో..ఆలోచించి..
ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది. అమ్మనాన్నే అర్థం చేసుకోకపోతే ఎవరితో చెప్పను.
ఏదైనా మాట్లాడితే మునుపు జరిగిన సంగతులన్నీ ఎత్తి తిడుతున్నారు. నేను వాళ్ళ గుండెల
మీద కుంపటినంట.. నన్ను వదిలించుకుంటేగానీ వాళ్ళ పరువు నిలబడదట.. ఇంకా ఎన్నాళ్ళు ఈ
దరిద్రాన్ని భరించాలని అంటున్నారు. నాకు తెలీక అడుగుతాను. కన్నప్పుడు,
పెంచినప్పుడు ఉన్న ప్రేమ పెళ్ళిచేసి పంపేటప్పుడు ఎందుకు ఉండదే... ఏదో పాత
వస్తువును వదిలించుకున్నట్టు వదిలించికోవాలని చూస్తారెందుకు. మనల్ని కనమని మనం
అడిగామా?” కన్నీరు పొరకట్టి చూపుకు అడ్డుపడింది.
అసలేం జరిగిందే.. తల్లీ..
అదే చెపుతున్నా...
తెలుసుగా నేను కాస్త అందంగానే ఉంటాను. అదే నాకు శాపమై కూర్చుంది.. పైటేసిన
పదోరోజే నన్ను పెళ్ళి చేసుకుంటానని మా యార్డులో బిల్టింగ్ కాంట్రాక్టర్ రవీంధ్ర కబురంపాడు.
అమ్మకు ఇదేం నచ్చలేదు.
నాకు మేనరికం ఉందని, రవీధ్రవాళ్ళతో గొడవపడింది.. దీనంతటికీ నేను వాడితో చనువుగా మసలడమే కారణం అన్నారు అమ్మానాన్న.. ఎవడో పరాయి వాడిని నమ్మినంతలో సగమన్నా కన్న కూతుర్ని నమ్మలేదు ఇద్దరూ.. నెల రోజులు ఎవరికీ కనిపించకుండా అమ్మమ్మ దగ్గరకు పంపేసారు నన్ను. అక్కడ కూడా నన్ను సరిగా బతకనీయలేదు.. మరోకడు నేను నచ్చాను.. నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అందులోనూ అంతా నాదే తప్పన్నారు. భరించాను.. ఇప్పుడు నాకన్నా 13 ఏళ్ళు పెద్దాడిని తెచ్చి, నాకు నచ్చని పెళ్ళి చేస్తూ.. ఇంట్లో అంతా నాకోసం త్యాగాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు...నేను బంగారు పూలతో పూజ చేస్తే మావయ్య లాంటి భర్త వస్తున్నాడని తెగ మురిసిపోతున్నారు.
నాకు మేనరికం ఉందని, రవీధ్రవాళ్ళతో గొడవపడింది.. దీనంతటికీ నేను వాడితో చనువుగా మసలడమే కారణం అన్నారు అమ్మానాన్న.. ఎవడో పరాయి వాడిని నమ్మినంతలో సగమన్నా కన్న కూతుర్ని నమ్మలేదు ఇద్దరూ.. నెల రోజులు ఎవరికీ కనిపించకుండా అమ్మమ్మ దగ్గరకు పంపేసారు నన్ను. అక్కడ కూడా నన్ను సరిగా బతకనీయలేదు.. మరోకడు నేను నచ్చాను.. నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అందులోనూ అంతా నాదే తప్పన్నారు. భరించాను.. ఇప్పుడు నాకన్నా 13 ఏళ్ళు పెద్దాడిని తెచ్చి, నాకు నచ్చని పెళ్ళి చేస్తూ.. ఇంట్లో అంతా నాకోసం త్యాగాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు...నేను బంగారు పూలతో పూజ చేస్తే మావయ్య లాంటి భర్త వస్తున్నాడని తెగ మురిసిపోతున్నారు.
నా చుట్టూ జరిగినదానికి.. నేనేదో కానిపని చేసి చెడిపోయిన దాని నన్నట్టు.. నన్ను చేసుకోకపోతే
చస్తామని, వాళ్ళ పరువు కాపాడమని మావయ్య కాళ్ళమీద పడి ఒప్పించారు. ఇదీ నా మీద నా వాళ్ళకున్న
నమ్మకం.
ఎంత కాని పని చేసివచ్చినా కొడుకుని అయితే నెత్తిన పెట్టుకుంటారు. వంశోద్ధారకుడంటారు మరి అదే ఆడదాని విషయంలో అది ఇంటికి పట్టిన శని.. చీడ.. అంటారే..
“మరి ఇంతా తెలిసి మీ
మావయ్య మాత్రం ఏలా ఒప్పుకుంటాడు”..
"అదే నీకు తెలీదు.. ఇంత తెలిసాకా ఇక ఏ మగాడన్నా ఏం కోరుకుంటాడు. తనకు
అందంతోపాటు ఇలా అణిగి మణిగి తన చెప్పు చేతల్లో ఉండే పెళ్ళామయితే అన్నివిధాలా
కావాలనుకుంటాడు. మావయ్య కూడా అందుకే ఒప్పుకున్నాడు.. ఎప్పుడన్నా నేను
తోకజాడిస్తే నా గురించి తను చేసిన త్యాగాన్ని ఏకరువు పెట్టి.. నా కోరలు పీకి మూల
కూర్చోబెడతాడు.. తన వరకూ ఎందుకు .. అతనిమీద భక్తితో నా తల్లితండ్రులే నామీద గుఢచారులైపోతారు.. ఇదే జరుగుతుంది..
నాకు తెలుసు ఈ పెళ్ళి నేను తప్పించుకోలేనని..
నాకు తెలియకుండానే కన్నీళ్ళు బుగ్గల్ని తడిపి కంఠం మీదుగా కిందకి
జారిపోతున్నాయి. ప్రశాంతి నా చేతులు తన ఒడిలోకి తీసుకుంది. దూరంగా కాకినాడ వైపుగా వెళుతున్న రైలు పెద్దగా కూత పెడుతూ పట్టాలను పలకరించి పోతుంది. ఎంత మోతో.. నా
గుండెల్లో నిండిన శూన్యమంతా చెదిరిపోయేంత.. మోత..
*
Monday, 8 April 2019
ముళ్ళు....
తెలతెల్లవారుతుంది. రాత్రి ప్రయాణం వల్లేమో పెద్దగా సమయం
తెలీలేదు. నిద్రలోనే హైదరాబాద్ వచ్చేసాం. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే దిగాల్సినవాళ్ళంతా
నిద్రమత్తులో సామాన్లు గాలించి పట్టుకుని, పాచిముఖాలు సరిచేసుకుంటున్నారు.
కొందరిలో ఇంకా అదే మత్తు. కీచుమని శబ్దం చేసుకుంటూ స్టేషన్లో ఆగింది రైలు. ట్రైన్
కంపార్ట్ మెంట్ అంతా రొచ్చుకంపు. ముక్కులు మూసుకుంటూ, తోసుకుంటూ సామాన్లు
దింపుకుంటున్నారు. ఎంతటి జనమో గాలి ఆడనంత., సందు దొరకనంతమంది. అతికష్టం మీద
స్టేషన్ దాటి రోడ్డుమీదకు వచ్చాం. తెల్లారలేదు. ఆకాశం మబ్బులు పట్టి, మసగ్గా ఉంది.
“ఇంకా ఎంత సేపు.. ఇప్పుడు మనం ఎక్కడికి
వెళ్ళాలి”?
“నాకూ తెలీదు.. కనుక్కోవాలి. అందాకా
ఓపికపట్టు..ఇదిగో ఈ గట్టువార కూర్చో, నేను ఇప్పుడే ఫోన్ చేసివస్తాను”.
ఆకాశం ప్రశాంతంగా ఉంది. గాలికి ఊగుతున్నాయ్ చెట్లు.., జనంలో
కలిసి, అతను చూపుకు అందడంలేదు. ఫోన్ బాక్స్ ఎక్కడ ఉందో వెతకాలి కదూ.. నాకేం భయంగా లేదు.
తను వస్తాడు. కానీ త్వరగా రావాలి. ఇలా ఒంటరిగా ఎదురుచూడటం చాలా కష్టంగా ఉంది.
ఇద్దరు బిచ్చగాళ్ళు భుజం మీద సంచులతో నన్ను
దాటుకువెళుతున్నారు. ఏంటో ఈ పరిసరాలు కాస్త ఇబ్బందిగానే ఉన్నాయ్. త్వరగా ఇక్కడి
నుంచి వెళిపోతేనే బావుండు.
**
“మనల్ని పంజాగుట్ట లాడ్జిలో దిగమన్నాడు. ఆయన
మధ్యాహ్నానికి కలుస్తాడట. మనల్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకి ముసుగులు
కట్టుకోమన్నాడు. ఇదిగో ఈ చున్నీ నువ్వు తీసుకో..నేను టోపి పెట్టుకుంటాను. ఊ..పద
పోదాం”.
“ఇంకా తెల్లవారలేదు కదా.. మనల్ని ఎవరు
గుర్తుపడతారు..ముఖానికి ఈ ముసుగు ఎందుకు కట్టుకోవాలి”.
“ఏమో దారంటా సీసీ కెమెరాలు ఉన్నాయ్..
జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరికంటా పడద్దన్నాడు”.
“ఎందుకు.. మనం మరీ అంత ప్రమాదంలో ఉన్నామా? మనం వచ్చింది లాయర్ దగ్గరికే కదా అతను మనల్ని కాపాడతాడనేగా.. మరెందుకు
భయపడాలి”.
“ప్రశ్నలు అడుగుతూ ఇక్కడే ఉంటావా..
కదులుతావా.. నడు త్వరగా”..
“ఎందుకు విసుక్కుంటావ్... ఇప్పుడు నేనేం
అన్నాను... పద”..
**
ఆటో పంజాగుట్ట రామకృష్టా లాడ్జ్ ముందు ఆగింది, నాలుగో ఫ్లోర్,
201 గది... మురికి పూసిన గోడలు, కిళ్ళీ ఉమ్ములు, మకిలి పట్టిన లిఫ్ట్, ఇరుకు
గదులు, ఎప్పుడు చూడని వాతావరణం భయంగా, బెరుకుగా ఉంది.
తెలీకుండానే అతని చెయ్యి పట్టుకుని మరింత దగ్గరగా
నడుస్తున్నాను. బాయ్ గది తాళం తీసి లోపలికి మాతోపాటే వచ్చి “రూమ్ లో ఫోన్ లేదు. కిందకి రావాలి”. “ఏం కావాలన్నా నన్ను అడగండి సార్... క్షణంలో తెస్తాను. వస్తా సార్”..
చేతిలో పెట్టిన పదిరూపాయలు నోటు తీసుకుని వెళిపోయాడు. మంచాల
మీద పక్కలు అప్పుడే మార్చినా ముక్కవాసన వేస్తుంది గది. ఎదురుగా బాల్కనీలో పక్కగా
ఉన్న తలుపు తెరిచాను. ఇందాక మేము దిగిన రోడ్డు కనిపిస్తుంది. ఉదయం ఆఫీసులకు వెళ్ళే
వాళ్ళతో చూస్తుండగానే రోడ్డు హడావుడిగా మారిపోయింది.
“త్వరగా ముఖం కడుక్కుంటే టిఫిన్ తిని
కూర్చోవచ్చు..లేదంటే మళ్ళీ ఆకలంటావ్”..
“అవును నాకే ఆకలి నీకు వేయండం లేదే..పాపం”.
కోపంగా బాత్రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాను.
**
“అతనికి కాల్ చేసాను. పదినిముషాల్లో
వస్తున్నాను అన్నాడు”..
“ఊ”..
“నేను
కిందకెళుతున్నాను. నువ్వు రూమ్ లో జాగ్రత్తగా తలుపేసుకో.. ఎవరన్నా తలుపు కొడితే
ఎవరని అడిగిమరీ తియ్.. సరేనా”.
“ఊ..సరే”..
శేషు నా చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరం లేచిపోయి
పెళ్ళిచేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా కోర్టు, కేసు.. పోలీసులు
వెంటాడుతున్నారు. ఇదిగో ఇలా అందరినీ తప్పించుకుని తిరుగుతున్నాం. ఎవరో స్నేహితుడికి
తెలిసిన లాయర్ ని కలవడానికి హైదరాబాద్ వచ్చాం.
**
అవతలి గుమ్మం బాల్కనీలోకి వచ్చాను. గాలి చిక్కగా వీస్తుంది.
గట్టిగా ఊపిరి పీల్చుకుని అక్కడే నిలబడ్డాను. రద్దీ ఇంకా తగ్గలేదు.. దుమ్ము
కొట్టుకుపోయిన వాతావరణం లాడ్జ్ చుట్టూ పరుచుకుపోయింది. కార్లు, స్కూటర్లు పోటీగా
పరిగెడుతున్నాయ్. ఒంటి మీద నీలం చున్నీ గాలికి ఎగిరిపడుతుంది.
బాల్కనీ పిట్టగోడ అంచు పట్టుకుని వంగి లాడ్జ్ గుమ్మం ముందు
లాయర్ కోసం ఎదురుచూస్తున్న శేషూనే చూస్తున్నాను. చాలా తెలివైన వాడు. మనిషి నలుపుగా
ఉన్నా, నవ్వుతున్నప్పుడు ఆ పెదాల మధ్యన వచ్చిచేరే పళ్ళవరస దానిమ్మ గింజలు పేర్చినట్టుగా
బావుంటుంది. గుబురు మీసం, పదునైన గడ్డం, మాటల్లో, చూపుల్లో చురుకుదనం, కళ్ళతో
మత్తెక్కించి మైకంలో ఇట్టే పడేసే మగసిరి.. వెరసి శేషు.
కారు చీకటిలో కూడా ఆ కళ్ళు మెరుస్తూనే ఉంటాయ్. ఎన్నో
సందర్భాల్లో నన్ను దుఃఖపు పొరలు తాకినపుడు అతడి చేయి దగ్గరకు లాగేది. ఆ ఒడి
వెచ్చదనంలో అమ్మ ప్రేమను, నాన్నిచ్చే ధైర్యాన్ని అనుభవించాను. ఒక్కో క్షణంలో
కడుపును చీల్చుకువచ్చిన బిడ్డల్లే ఆనతాడు.
నిలువు కాళ్ళతో ఆగి ఉన్న బండికి వారగా నించుని ఉన్నాడు. అలా
ఎంత సేపయిందో..రోడ్డు మీద పళ్ళ బండి ముందు ఆగి.. లాడ్జి పేరు చదువుతున్నాడో
వ్యక్తి. నలుపు తెలుపుల షర్టు, ఊదారంగు ఫెంటు. లాడ్జి ముందున్న శేషూని పలకరించి,
బండి స్టేండ్ వేసి, ఇద్దరూ లోపలికి వస్తున్నారు.
తలకాస్త పైపైన దువ్వుకున్నాను. ఇద్దరు గుమ్మం ముందు ఆగారు.,
శేషు తలుపు కొడుతున్నాడు.
“నేనే తలుపు తీయ్”..
నెమ్మదిగా తలుపు తీసాను. ముందుగా లాయర్ గది లోపలికి
వచ్చాడు. తర్వాత శేషు.
**
పొడుగ్గా, ఆరడుగులకు కాస్త అటు
ఇటుగా ఉన్నాడు, మరీ తెలుపు కాదు, కళ్ళు నిప్పుల్లా ఉన్నాయ్...అప్పుడే సిగరెట్
తాగిన వాసనేస్తుంది. తలుపు పూర్తిగా వేయకుండా పక్కనే స్టూల్ లాక్కుని కూర్చున్నాడు.
“ఊ.. ఇప్పుడు చెప్పండి.. ఏంటి మీ విషయం”..
“ముందు మీరు కాఫీ గానీ, టీగానీ తాగండి.. తర్వాత మాట్లాడుకుందాం”.. అన్నాను.
తలకాస్త పైకెత్తి, “అవసరం లేదు.. నేను ఇంటి దగ్గర తాగే వచ్చాను”.
ఫేన్ గాలి పెంచి అతన్నే
చూస్తున్నాను. గాలి తగిలేట్టు కాలర్ పెకెత్తి మాటలు మొదలు పెట్టాడు.
“మీరు ఇప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నారో.. మరిచిపోతున్నారు.. ముందు ఆ తలుపు
మూయకండి.. ఎవరన్నా వస్తే మన ముగ్గురినీ మూసేస్తారు.. నేను మీకు సాయం చేస్తున్నాను
అనుకుంటారు. త్వరగా కేసు వివరాలు చెపితే తర్వాత ఏం చేద్దామన్నది ఆలోచిస్తాను.”
“అది కాదండి” శేషు ఏదో
చెప్పబోయాడు.
“చెప్పాగా.. అంత టైం లేదు”.
“నాకు ఇది వరకే పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు,
ఇప్పుడు నా స్నేహితుడితో వచ్చేసాను. నా భర్తతో సహా అంతా వెతుకుతున్నారు. పోలీసులు
తప్పంతా శేషుదే అంటున్నారు. ఇది నా ఇష్టంతో నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో అతని
తప్పేంలేదు”. చెప్పాను.
అంతా విని.. శేషు వంక కాస్త అనుమానంగా ముఖం పెట్టి.. “నీ
ముఖం చూస్తుంటే నువ్వే కిడ్నాప్ చేసినట్టుగా ఉంది. ఈమె కాదంటుందేంటి”.
“లేదండి.. నేనేం బలవంతం
చేయలేదు. తన ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం”..
“ఊ”..
“మరి ఆమె కుటుంబం అంతా నువ్వే చేసావంటుంది. కాదని
ఏలా చెపుతావ్...ఇదంతా కాదు గానీ నేను ఒకటి చెప్పనా..ఇక్కడ నాకేదో అనుమానంగా ఉంది..
మా ఇంటికి రండి.. సాయంత్రం ఈ సమస్యను సింపుల్ గా మాట్లాడుకుని తేల్చేద్దాం.. ఇక్కడ
ఎక్కువ సేపు ఉంటే మీకే ప్రమాదం”.
అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇద్దరం.. బరువుగా ఊపిరి తీసుకున్నాం.
“శేషు మనం మరీ ప్రమాదంలో ఉన్నామా.. లాయరే అలా
కంగారుపడుతున్నాడు”..
“ఏమో.. తెలీదు.. చూద్దాం.. సాయంత్రం
వెళుతున్నాంగా.. ఏం జరుగుతుందో”.. పక్కమీద వాలిపోయాడు శేషు.
**
బంజారా హిల్స్.., సాయంత్రం ఆరు దాటింది. విశాలమైన అపార్ట్
మెంట్.. గేటు దాటి లాయర్ పేరు చెపితే, సెక్యూరిటీ మూడో అంతస్థుకు వెళ్ళమన్నాడు. గేటు
ముందు నాలుగు వరసలుగా కట్టి, లాన్ లో రకరకాల మొక్కలు వేసారు. అన్నీ క్రోటన్
మొక్కలే. వాటినే చూస్తూ లిఫ్ట్ ఎక్కాను. గుమ్మం ముందు భూషణం ఎమ్.ఎ.ఎల్.ఎల్.బి అని
ఉంది. శేషు రెండుమార్లు కాలింగ్ బెల్ నొక్కాడు. మూడోమారు తలుపు తెరుచుకుంది.
ఓ నలభై ఐదేళ్ళామె తలుపు తీసి మేము తెలిసినట్టుగా మావంక చూసి
నవ్వింది. పలకరింపుగా మేమూ నవ్వాం. పెద్ద
హాలు సోఫా సెట్, పైన షాండ్లియర్ వేలాడుతుంది. నిలువుగా అద్దాల తలుపు.. దాన్ని దాటి
యాక్వేరియం.. నాలుగు టైగర్ ఫిష్ లు తిరుగుతున్నాయ్. లోపల గవ్వలు పేర్చి, బ్లూ లైట్
వెలుతుంది.
ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. ఆయన లోపలి నుంచి వచ్చాడు. “అదే
మీ సంగతే ఆలోచిస్తున్నాను. మా ఆవిడ సలహా కూడా అడిగాను. మీరు ఈ ప్రమాదం నుండీ
బయటపడాలంటే ఒకటే మార్గం.. ఆ అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్
చేయడమే”.
“మరి.. వాళ్ళ వాళ్ళు తీసుకుపోతే”..శేషు కంగారు పడ్డాడు.
“ఆగవయ్యా.. ఎందుకు తొందర… చెపుతున్నాగా.. ఆమె బాధ్యత నాది. నేను ఇలా ప్రవేశపెట్టి అలా తీసుకు
వచ్చేస్తాను. సరేనా”..
“లేదండి. మీకు తెలీదు. నేను ఒకసారి వెళితే
తిరిగిరానీయరు. ఇంత జరిగాకా నేను అక్కడ ఉండలేను. అర్థం చేసుకోండి”. గట్టిగా అనేసాను.
ఆమె మా మాటలు వింటూ.. “అలా కాదు. ఆమెని నేను కొన్నిరోజులు
మా ఆర్గనైజేషన్ లో పెడతాను. అన్నీ సర్దుకున్నాకా తిరిగి వస్తుంది. ఏమంటారు.. ఈ
సమస్యకు ఇదే సరైన పరిష్కారం”.
మేం ఇద్దరం ముఖం ముఖం చూసుకున్నాం.
ఆయన “సరేనయ్యా.. మీరు ఉదయం కలవండి
కొన్ని పేపర్స్ ఉన్నాయి అమ్మాయి సైన్ చేయాల్సినవి.. సరేనా.. ఇక వెళ్ళిరండి”.
ఇద్దరూ గుమ్మం వరకూ వచ్చి సాగనంపారు.
**
లాడ్జిలో మంచం మీద దొర్లుతున్నాం.. మనసంతా చిరాగ్గా ఉంది. “ఇంతా
చేసింది దూరం కావడానికా.. ఇన్ని కష్టాలు పడ్డామే.. ఛీ”..
విసుక్కున్నాను.
“అది సరే.. అసలు వాళ్ళిద్దరూ నా గురించేం
చెప్పరే.. అంతా నీ విషయమే మాట్లాడారు”..
“అదే.. నాకూ అర్థం కాలేదు” అన్నాను.
ఈలోపు ఎవరో తలుపు కొడుతున్నారు. శేషు తలుపు తీసాడు. ఎదురుగా
బాయ్.. “ఏంటి?.. “మీకు ఫోనొచ్చింది సార్”...
“మాకా”..?
“అదే లాయర్ గారికి ఇచ్చాం గా.. అక్కడి నుంచే
అయి ఉంటుంది. పద నేనూ వస్తా”..చున్నీ మెడ చుట్టూ వేసుకుని..
కూడా నడిచాను.
**
“హలో.. చెప్పండి సార్”..
“ఏం లేదయ్యా.. నాకు అర్జెంట్ పని తగిలింది,
ఊరెళ్ళాలి.. మీరు రేపు ఇక్కడే ఆగండి.. నేను ఎల్లుండి కలుస్తాను.. సరేనా”..
“ఆ.. ఆ.. సరే సార్”..
“ఫోన్ అమ్మాయికివ్వు”..
“ఇదుగోండి ఇస్తున్నా”..
“చూడు మాట్లాడతారట”..
“నాతోనా”..
“ఊ”..
“హలో సార్”..
“ఆ.. అమ్మాయ్.. నీకో మాట చెపుదామని
ఫోన్ చేసాను. నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావ్.. నాకెందుకో అతను నమ్మదగే వ్యక్తిగా
కనిపించడం లేదు. నీకెందుకు అంతా నేను చూసుకుంటాను.. నువ్వు నా దగ్గరే ఉండిపో.. ఇక
నువ్వు ఏలాగూ ఇంటికి వెళ్ళినా మీవాళ్ళు రానివ్వరు. వీడితో ఎన్నోరోజులు సుఖపడలేవు.
నా మాటవిను. నేను నీకు మా ఆఫీస్ లో టైఫిస్ట్ కింద ఉద్యోగం వేయిస్తాను. మంచి
భవిష్యత్ ఉంటుంది. ఏమంటావ్.. ఏంటి వింటున్నావా”!...
“ఆ.. వింటున్నానండి”..
“చెప్పేది విను.. ఇలాంటి వన్నీ
మీరు డీల్ చేయలేరు”.. నేనంటే సంఘంలో పేరున్నోడిని... వెకిలి
నవ్వు”..
ఫోన్ శేషుకి ఇచ్చేసాను.
**
“పద పోదాం”..
“ఎక్కడికి”?
“ఎక్కడికైనా సరే.. ఇక్కడమాత్రం
వద్దు”..
“ఎందుకు”..??
“దారితప్పి వచ్చాం.. ఇది మన
దారికాదు”.
మనసులోనే ఈ దారంతా
ముళ్ళున్నాయ్” అనుకుంటూ... శేషు చేయి పట్టుకుని మెట్లు
దిగాను.
*
Subscribe to:
Posts (Atom)
విడుదల ఏది?
గత అనుభవాలు ఈటెలు,బాకులై తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా చేసి నడిచే దారిలో నేనో గులకరాయిని జ్ఞాపకాలు చెదిరిన కాగితం కట్టలతో వేల ...
-
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్...
-
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర...
-
నా మొదటి కథ "పొరుగింటమ్మాయి" http://patrika.kinige.com/?p=1038&view-all=1 కినిగె పత్రికలో చదవండి. ప్రపంచం అంతా...