Monday, 1 September 2014
గుమస్తా మరణం
నేను చేసిన మొదటి అనువాదం కినిగె పత్రికలో
(ఆంటన్ చెఖోవ్ “డెత్ ఆఫ్ ఎ క్లర్క్” కు శ్రీశాంతి దుగ్గిరాల అనువాదం)
ఒక మంచి సాయంత్రవేళ, అంతకన్నా మంచివాడైన
ఆఫీసు గుమస్తా ఇవాన్ దిమిత్రిచ్ చెర్వియాకో నాటకశాల రెండవ వరసలో కూర్చుని
ఒపెరాకళ్ళద్దాలలోంచి ప్రదర్శనలో లీనమైపోయి చూస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి…
ఈ “కానీ ఉన్నట్టుండి” అనే మాట కథల్లో తరచుగా వస్తుంది. రచయితలు చెప్పేది
ముమ్మాటికి నిజం. మనిషి జీవితంలో ఉన్నట్టుండి జరిగే సంఘటనలు ఎక్కువే. కానీ
ఉన్నట్టుండి అతని ముఖం ముడుచుకుంది, అతని కళ్ళు చక్రాల్లా గుండ్రంగా
తిరిగాయి, అతని ఊపిరి నిలిచిపోయింది. చేతిలోని కళ్ళద్దాలను కిందకు దించి
ముందుకు వంగుతూ “హాచ్…!” అంటూ తుమ్మాడు చర్వియాకో. తుమ్మటం అనేది ఏం
నిషిద్ధం కాదు. ఎవరైనా ఎక్కడైనా తుమ్మచ్చు. రైతులు తుమ్ముతారు.
కొన్నిసార్లు పోలీసు అధికారులూ తుమ్ముతారు, అంతెందుకు కౌన్సిలర్లు కూడా
తుమ్ముతారు. మనుషులందరూ తుమ్ముతారు. చర్వియాకో ఈ పరిణామానికి ఏమీ ఇబ్బంది
పడలేదు. చేతిరుమాలుతో తన ముక్కును మర్యాదపూర్వకంగా తుడుచుకున్నాడు. తర్వాత
చుట్టూ చూసి తాను తుమ్మడం వల్ల ఎవరికైనా నష్టం కలిగిందేమోనని చూశాడు. కానీ
ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. స్టాల్స్ లో తాను కూర్చుని ఉన్న వరుసకు ముందు
వరసలో ఓ ముసలి వ్యక్తి జాగ్రత్తగా తన బట్టతలను, మెడను చేతి తొడుగులతో
తుడుచుకుంటూ ఏదో చిన్నగా గొణిగాడు.
చెర్వియాకో ఆయన్ని రవాణాశాఖలో ఉన్నతోద్యోగి జనరల్ బ్రిజలోవ్‌గా గుర్తించాడు.
“నా నోటి తుంపర్లు ఆయనపై పడ్డట్టున్నాయి.
ఆయన నాపై అధికారి కాకపోయినా, ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. వెంటనే
క్షమాపణ కోరాలి” అనుకున్నాడు చెర్వియాకో.
అతడు చిన్నగా దగ్గుతూ ముందుకు వంగి జనరల్ చవిలో రహస్యంగా, “క్షమించాలి, నేను పొరబాట్న మీమీద తుమ్మాను…”
“పరవాలేదు, పరవాలేదు…”
“నేను… నేను కావాలని చేసిన పనికాదు. ఏదో పొరబాట్న…”.
“సర్సరే! మీరు దయుంచి కూర్చోండి నన్ను ప్రదర్శన చూడనీయండి”.
చెర్వియాకోకి ఏం చేయాలో తెలియలేదు. వెర్రి
నవ్వు నవ్వాడు. మరలా స్టేజీ వైపు దృష్టి సారించాడు. ప్రదర్శనను
చూస్తున్నాడు కానీ, మునుపటిలా ఆనందించలేకపోయాడు. ప్రదర్శనకు విరామం
ఇవ్వగానే చెర్వియాకో జనరల్ వైపు వెళ్ళి, కాసేపు చుట్టూ తిరిగి, చివరకు తన
జంకును అణుచుకుని, దగ్గరగా వెళ్ళి ఇలా గొణిగాడు:
“నేను మీమీద తుమ్మాను. క్షమించండి సార్… నేను అలా చేసి ఉండకూడదు”.
“అయ్యో, ఇక ఆ విషయం వదిలేయండి… నేను
ఎప్పుడో మరిచిపోయాను. మీరు మాత్రం ఇంకా అదేపట్టుక్కూచున్నారు,” అన్నాడు
జనరల్, తన కింద పెదవిని కొరుకుతూ.
“ఆ విషయాన్ని మరిచిపోయానంటున్నాడు గానీ
అతని కళ్ళు మాత్రం ద్వేషంతో మండుతున్నాయి” అనుకున్నాడు చెర్వియాకో. “కనీసం
మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. నేను ఆయనకి సంజాయిషీ చెప్పి తీరాలి.
ఇక్కడ జరిగింది ఒక ప్రకృతిసహజమైన కార్యమని వివరించాలి. లేదంటే ఆయనపై
ఉమ్మానని అనుకుంటాడు. ఇప్పుడలా అనుకోకపోయినా, మున్ముందు అనుకోవచ్చు”.
తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు చెర్వియాకో.
తన మర్యాదహీనమైన ప్రవర్తన గురించి భార్యకు చెప్పుకున్నాడు. ఆమె అతని
మాటల్ని మొదట తేలిగ్గా తీసుకుంది. బ్రిజలోవ్ గురించి తెలుసుకున్న మీదట
కాస్త కంగారు పడింది. కానీ బ్రిజలోవ్ పని చేసేది వేరే విభాగంలో అని
తెలుసుకుని కాస్త కుదుట పడింది.
“ఏది ఏమైనా నీవల్ల పొరపాటు జరిగింది కనుక
ఆయనకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆయన నీకు ఇతరుల ముందు ఎలా ప్రవర్తించాలో
బొత్తిగా తెలియదనుకుంటాడు,” అంది.
“అదేకదా! నేను ఆయనకి క్షమాపణ చెప్పాను.
కానీ ఆయన ప్రవర్తన చిత్రంగా ఉంది. ఒక్కముక్క సరిగా మాట్లాడలేదు. పైగా అక్కడ
మాట్లాడటానికి అంత సమయం కూడా లేదనుకో,” అన్నాడు చెర్వియాకో భార్యతో.
ఆమర్నాడు శుభ్రంగా క్షవరం చేయించుకుని,
కొత్త యూనీఫాం వేసుకుని తయారై, బ్రిజలోవ్ కు క్షమాపణ చెప్పటానికి
బయలుదేరాడు చెర్వియాకో. జనరల్ ఆఫీసులో అతిథుల గదిలోకి ప్రవేశించగానే అక్కడ
చాలామంది అర్జీదారులు కనిపించారు. వారి అర్జీలు అందుకుంటూ జనరల్ కూడా
అక్కడే ఉన్నాడు. వరుసగా అందరి అర్జీలూ అందుకుంటూ చెర్వియాకోవ్ వంతు
వచ్చేసరికి కళ్ళెత్తి చూశాడు జనరల్.
“నిన్న… ప్రదర్శనశాలలో మీకు
గుర్తుండేవుంటుంది… సార్ నేను హఠాత్తుగా తుమ్మాను సార్, పొరబాట్న మీమీద ఆ
తుంపర్లు పడ్డాయి సార్” చెప్పడం మొదలు పెట్టాడు గుమస్తా…
“ఏమిటీ గోల… ఇక చాలు! నేను మీకేం చేయగలను” అంటూ ఆయన తర్వాతి అర్జీదారు వైపు చూశాడు.
“ఆయనకు నాతో మాట్లాడటం ఇష్టం లేనట్టుంది,”
అనుకున్నాడు పాలిపోయిన ముఖంతో. “దీని అర్థం అతడు కోపంగా ఉన్నాడు. నేను ఇలా
ఊరుకోకూడదు. ఎలాగైనా వివరించాలి.”
జనరల్ తన ఆఖరు అర్జీదారు నుండి అర్జీ తీసుకుని లోపలి గదిలోనికి ప్రవేశిస్తుండగా చెర్వియాకో జనరల్ వెంటనడుస్తూ చిన్నగా గొణిగాడు:
“సార్ మిమ్మల్ని ఇలా
ఇబ్బందిపెడుతున్నానంటే దానికి కారణం నాలోని పశ్చాత్తాపం అని అర్థం
చేసుకోండి… నేను అలా కావాలని చేయలేదు, మీరు నమ్మాలి!”
జనరల్ ఓ విషాదపూరితమైన ముఖం పెట్టి చేయి విదిలించాడు. “వేళాకోళంగా ఉందా” అంటూ తలుపు భళ్ళున ముఖం మీద వేసుకున్నాడు జనరల్.
“ఏంటి వేళాకోళమా! ఇందులో వేళాకోళం
ఏముంది!” అనుకున్నాడు చెర్వియాకోవ్, “ఈయన అవటానికి మళ్ళా జనరల్! కానీ ఇంత
చిన్న విషయం అర్థంచేసుకోలేకపోతున్నాడు. ఇలాగే ఐతే ఇంక ఈ గీరమనిషిని క్షమాపణ
అడగను గాక అడగను. ఏదైతే అదవనీ. ఇక ఉత్తరం ద్వారానే నా క్షమాపణలు
కోరాలిగానీ నేనుగా రానే కూడదు ఇక్కడికి!”
అనుకుంటూ చెర్వియాకోవ్ ఇంటికి నడిచాడు.
కానీ ఉత్తరం రాయలేదు. ఎంతగా ఆలోచించినా ఆ ఉత్తరం ఎలా రాయాలో తెలియలేదు.
మరుసటి రోజు మరలా స్వయంగా తనే వెళ్లాల్సివచ్చింది.
జనరల్ ఎందుకొచ్చావన్నట్టుగా చెర్వియాకో
ముఖంలోకి చూడగానే, “మీరన్నట్టు నిన్న నేను ఇక్కడికి వచ్చింది మీతో వేళాకోళం
ఆడటానికి కాదు సార్. ఆరోజు నేను తుమ్మినపుడు ఆ తుంపరలు మీమీద పడటం వల్ల
క్షమాపణ అడుగుదామని వచ్చాను. మీతో కలలోనైనా వేళాకోళమాడగలనా? అలా
వేళాకోళమాడుతూపోతే ఇక మర్యాదస్తులకు మిగిలే మర్యాద ఏముంటుంది సార్…”
“బయటకు పో!” గట్టిగా అరిచాడు జనరల్, కోపంతో కమిలిపోయిన ముఖంతో ఊగిపోతూ,
గట్టిగా కాలిని నేలకు తాకిస్తూ.
ఆ మాటలకు చెర్వియాకోకి కడుపులో ఏదో నరం
తెగినట్టయింది, ఏం కనపడక ఏవీ వినపడక అలాగే నెమ్మదిగా ద్వారం వద్దకు
నడిచాడు. కాళ్ళీడ్చుకుంటూ యాంత్రికంగా ఇంటికి చేరుకుని, ఎవరితోనూ మాటయినా
మాట్లాడక, యూనిఫాం కూడా తీయకుండా, అలాగే సోఫాలో కూలబడి ప్రాణాలు విడిచాడు
గుమస్తా.
*
Subscribe to:
Posts (Atom)
విడుదల ఏది?
గత అనుభవాలు ఈటెలు,బాకులై తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా చేసి నడిచే దారిలో నేనో గులకరాయిని జ్ఞాపకాలు చెదిరిన కాగితం కట్టలతో వేల ...
-
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్...
-
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర...
-
నా మొదటి కథ "పొరుగింటమ్మాయి" http://patrika.kinige.com/?p=1038&view-all=1 కినిగె పత్రికలో చదవండి. ప్రపంచం అంతా...