ఒంటరిగా కూర్చుని
ఆలోచనలు చిలికినపుడు
చిగురులు వేసిన చిన్నతనం
కనిపిస్తుంది.
బాల్కనీ కొసల్లో నిలబడి
చూస్తుంటే
పరుగులెత్తి కలలు కన్న
పసితనం వెక్కిరిస్తుంది.
ఈ భయంకర ఏకాంతం
మరిచిపోయిన గురుతులెన్నో
తడుముతూ ఎన్నో
జ్ఞాపకాలను నిద్ర లేపుతుంది.
స్నేహితుల కబుర్లు
అమ్మ విసుర్ల మధ్యలో
మధ్యాహ్నం పంచుకు తిన్న
పప్పన్నం జ్ఞాపకంగా
తడుముతుంది
పొలిమేర్లలో గంతులేస్తూ
ప్రేమకోసం వీధులన్నీ
వెతికిన యవ్వనం
నవ్వుతుంది
తోటలోని సీతాకోకలన్నీ
పట్టు పావడా కట్టుకుని
అల్లుకున్న కల
తరుముతుంది.
సంధ్యాకాశంలో చెట్లని
పెనవేసి గాలి నీడన సేదతీరిన
సాయంత్రం నవ్వుతుంది.
బెరుకు గుండె వదులుకున్న
ప్రేమలేఖ చిత్రంగా వాస్తవంలోకి
చొరబడుతుంది.
పక్షుల్లా రెక్కలు లేవని
ఎగిరెగిరి పడే ఏకాకి
హృదయాన్ని తోడు కోసం
గతం వైపు పంపుతుంది.
No comments:
Post a Comment