Friday, 29 March 2019

అవే చూపులు.....



నాలుగైపోయింది ఈ పిల్ల ఇంకా లేవడం లేదు. ఒసేయ్ లేస్తున్నావా..లేదా?
 పాలోళ్ళు వచ్చి కూచుంటారు. ఇంతలా అరుస్తున్నా వినవే..లే.. నాకు నాలుగు గేదెల పాలు పితికే పనుంది. నువ్వు మూడన్నా అందుకుంటే కాస్త సులువవుతుంది పని.
..లే..లే...

నాన్నగారి మాటలు గత నాలుగేళ్ళుగా అలవాటైపోయాయి. తెల్లారి సుప్రభాతం ఏలా ఉంటుందో మరిచిపోయాను ఈ మాటలే, నాకు మెలుకొలుపు. ఏనాడు నేను లేవనని.. పడుకోవాలని ఉందని ఎందుకు చెప్పలేను. ఏమో నేనే ఇలా ఉన్నాను. మిగతా ముగ్గురూ పనులకు కాస్త దూరం. పెద్దక్క చేసినన్నాళ్ళూ చేసి పెళ్ళి చేసుకుని వెళిపోయింది, ఇక తమ్ముడు పరవాలేదు కాస్త పాలు పోయడానికి తోడొస్తాడు . చిన్నక్కకు అసలు వంటగది ఎక్కడుందో తెలీదు.

ఏదైనా మాట్లాడితే అమ్మ.. అది రోగిష్టిదే ఏం చేస్తుంది పనులు అంటుంది.

మరి నేను కాదా.. అడగాలి గట్టిగానే అడగేయాలి ఈరోజు...

పాలు పితికి పితికి చేతివేళ్ళు వంకర్లు తిరిగిపోయాయ్.. తెల్లారుజామున నాలుగింటికి లేస్తే.. మళ్ళీ రాత్రికే పడుకోవడం. పాల పనంతా తెముల్చుకుని కాలేజీకి పోవాలి. సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ అదే పని. ఈ పేడ, రొచ్చు కంపుతో, నేనూ అదే వాసన కొడుతున్నాను. అమ్మకు మరే వ్యాపారం దొరకలేదు చేయడానికి. ముందు తనే చేస్తుందనుకున్నాం, నెమ్మదిగా నాన్నగారు, అక్క, ఇప్పుడు అందర్నీ వదిలి నన్నే పట్టుకుంది. ఇంటి చాకిరీ, పాల పని అంతా నేనే చేయాలి.. నాతోటి వాళ్ళంతా చక్కగా ముస్తాబై సినిమాలకు, షికార్లకు పోతుంటే మరి నేనో పేడ చేతులతో, పాలు పితుక్కుంటూ, వీధిలో తిరుగుతున్నాను. ఛీ.. ఒక్కోసారి ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడికిపోను. లేదంటే పెద్దక్కలా పెళ్ళన్నా చేసుకుపోవాలిగానీ లేదంటే నాకు ఈ చాకిరీ నుంచి విముక్తి లేదు.

**

సురేష్ చాలా అందంగా ఉంటాడు. కలుపుకోలుగా, సరదాగా ఉండే సురేషంటే నాకు చాలా ఇష్టం. తను మా మావయ్య కొడుకు. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి దొంగతనంగా చూస్తాను తనని. నాతో సరదాగానే మాట్లాడతాడు. కానీ నాకే ఏదో భయం. అమ్మా, అమ్మమ్మ, అక్కలు చూస్తారనే భయం. సురేష్ అంటే మా ఇంట్లో ఎవరికీ నచ్చదు. నాకన్నా ఆర్నెల్లు చిన్న. అయినా తనంటే నాకు చెప్పలేనంత ఇష్టం. తనకి ఏం అనిపిస్తే అదే మాట్లాడతాడు. స్నేహితులు ఎక్కువే.. ఎప్పుడూ గుడి దగ్గర అరుగుమీద ఫెండ్స్ తో కబుర్లు చెపుతూ కనిపించేవాడు. సరిగా కాలేజీకి పోడవం లేదని అత్త విసుకున్నా వినేవాడు కాదు.

సన్నగా, రివటలా ఉండే సురేష్ పవన్ ఫేన్. ఆ హీరో అంటే తెగ ఇష్టపడేవాడు. సెలవుల్లో తనతో పేకాట ఆడేవాళ్ళం, అప్పుడు మేం ఇద్దరం గొడవలు పడేవాళ్ళం. అంతా మేము కొట్టుకుంటున్నాం అనుకునేవారు గానీ.. అది ప్రేమకు ముందు జరిగే తంతని తెలిసేది కాదు వాళ్ళకు.

**

ఈరోజు తల నరాలు బాగా నొప్పిగా ఉన్నాయ్. ఎవరో గునపంతో మెదడులో పొడుస్తున్న ఫీలింగ్.. ఒంట్లో నరాలన్నీ జివ్వున లాగేస్తున్నాయ్.. వాంతయ్యేలా ఉంది. అమ్మని పిలవాలన్నా ఓపిక లేదు.

బయట ఎవరితోనో అమ్మ చెపుతున్న మాటలు వినిపిస్తున్నాయ్..

దానికి ఈరోజు బాలేదండి.. ఎప్పుడూ ఇంతే తలపోటు అంటుంది. నాలుగు పసరవాంతులు అయ్యాకా కానీ మళ్ళీ తేరుకోలేదు.

నాకు సురేష్ ని చూడాలని ఉంది. వాడి కళ్ళల్లో నన్ను చూస్తున్నప్పుడు కలిగే ఆ మెరుపును చూడాలని ఉంది. నేనంటే ఉన్న ఇష్టాన్ని తెలుసుకోవాలని ఉంది. కానీ ఏది కదలలేకపోతున్నానే..

**

నాలుగు రోజులకు గానీ నా ఆరోగ్యం చక్కబడలేదు. పెదమావయ్య కూతురు పెళ్ళికి అంతా వైజాగ్ ప్రయాణమయ్యాం. అందరికన్నా నాకే ఎక్కువ ఆనందంగా ఉంది. ఓ రెండు రోజులన్నా పాల పని తప్పినందుకు.. మరోపక్క సురేష్ వాళ్ళ ఫేమలీ కూడా వస్తున్నారని నాన్నగారంటే తెలిసింది. 

అక్కడన్నా నా ప్రేమ గురించి తనకి చెప్పేయాలి. కానీ అమ్మావాళ్లంతా ఉంటారే..ఏలా..?

పెద్దమావయ్యది కలిగిన కుటుంబం. బాగా సంపాదించారు. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ లో మంచి ఉద్యోగం. అక్కడే జరుగుతుంది పెళ్ళి. బంధువులమంతా వచ్చేసాం. పెళ్ళికూతురు అంత అందగత్తెకాదు.కానీ డబ్బు ఉందిగా.. తనంటే అందరికీ భలేగారం. ఎంత ముద్దుగా చూసుకుంటున్నారో. తనేం చేసినా మురిసిపోతున్నారు. నాకు ఒక్కసారన్నా అమ్మనాన్నల నుంచి అలాంటి ప్రేమ దక్కలేదు. ఇదంతా చాకిరీ మయం. ఎంత వద్దనుకున్నా.. రెండురోజులు తప్పిందనుకున్న పాల పనే గుర్తుకువస్తుంది. అలవాటైపోయింది కదా.. అందుకేనేమో..

ఇంకా సురేష్ వాళ్లు కనబడలేదు. నా కళ్ళు ఎవరూ గమనించకుండా సురేష్ కోసమే వెతుకుతున్నాయ్.. వాళ్ళకి వేరే చోట రూమ్స్ ఇచ్చారట. సాయంత్రానికి వచ్చారు. మొద్దునిద్ర ముఖం వేసుకుని బద్దకంగా వస్తున్నాడు మావైపు సురేష్. ఎంత కనిపించకూడదనుకుంటున్నా తను నా దగ్గరకు రావడంతోనే మనసులోంచి ఆనందం తన్నుకువచ్చి పెదాలపై కనిపిస్తుంది. ఏమిటిది నన్ను నేను మరీ ఇంతగా బయటపెట్టేసుకుంటున్నాను. తనేమనుకుంటాడు.

రాత్రికి సంగీత్ ఫంక్షన్ మొదలైంది. ఆడపిల్లలం అంతా ముస్తాబై హాల్లోకి వచ్చాం. ఈలోపు చిరుతసినిమాలో యమహో యమ్మ..ఏం ఫిగరో సాంగ్ ఫ్లేచేసి డాన్స్ చేస్తున్నాడు సరత్. అదే సురేష్ తమ్ముడు. ఇంతలో మా తమ్ముడు సురేష్ ని ముందుకు తోసాడు. తను డాన్స్ చాలాబాగా చేస్తాడు. చిన్నతనంలో ప్రేమికుడు పాటకు ఎంత బాగానో డాన్స్ చేసేవాడు. ఒన్స్ మోర్ చెప్పి డాన్స్ చేయించేవాళ్ళం. మళ్ళీ చానాళ్ళకు తన డాన్స్ చూస్తున్నాను.

ఎంత బాగా చేస్తున్నాడో.. ఆపాట.. ఆ డాన్స్ అంతా నాకోసమే అనిపించేంతగా ఉంది. సరిగ్గా చేస్తున్నవాడల్లా నా వైపు వచ్చిన వెంటనే, తెగ సిగ్గుపడిపోయాడు. నాకూ సిగ్గేసింది. ఆ చూపులు నాతో ఏదో చెపుతున్నట్టుగా అనిపించడం మొదలు పెట్టింది ఆక్షణం నుంచీ.

మరునాడు ఉదయం పెద్దళ్ళంతా పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న టైంలో పిల్లలమంతా ఓ రూమ్ లో చేరి పేకాట మొదలు పెట్టాం. మళ్ళీ అవే చూపులు. అందరూ ఎవరిగోలలో వాళ్ళం ఉన్నారు. తనకి నేను ప్రేమిస్తున్న సంగతి ఏలా చెప్పాలో తెలీయంలేదు. తనూ ఏదో చెప్పాలని చూస్తున్నాడని తెలుసు. కానీ ఏలా...

సాయంత్రం పెళ్ళిరాట పాతుతున్నారు, బజంత్రీలు మోతలో నెమ్మదిగా నా పక్కకు వచ్చిన సురేష్ నా చెవిలో ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచీ నా గుండె మరింత రెట్లు గట్టిగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. చెప్పలేనంత సిగ్గేసింది. ఓ పక్క ఎవరన్నా చూలారేమోనన్న భయం కూడా.. అన్నీ కలిపి చెప్పలేని వింతగా అనిపించింది. ఏదో బాధ, భయం, ప్రేమ, ఇకపై తనే అన్నీ అనే ఫీలింగ్. అన్నీ తలిపి కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చేసాయ్. నేనూ తనని ప్రేమిస్తున్న సంగతి చెప్పేలోపు సురేష్ అక్కడి నుంచి వెళిపోయాడు.

**

కాసేపటికే కాలేజీలో ప్రోజెక్ట్ వర్క్ పనిమీద పెళ్ళికి ఉండకుండా వెళిపోతున్నాడని తమ్ముడు అంటుంటే గుండె దిగేలైపోయింది. చికటిపడుతుండగా తన లగేజ్ పట్టుకుని జీప్ మీద బస్ ఎక్కడానికి వచ్చిన సురేష్ కళ్ళల్లోకి చూడలేకపోయాను. అప్పటివరకూ ఈ పెళ్ళి సందడి ఎంతగా నచ్చిందో అంత పేలవంగా తయారైపోయాయ్ పరిసరాలు. తను లేకపోతే అక్కడ నాకంటూ ఏం లేనట్టుగా అనిపించింది. అందరికీ బై చెప్పి జీప్ ఎక్కాడు. పెద్దాళ్ళంతా తనని సాగనంపి లోపలికి వెళ్ళిపోతే, నేను మేడమీద నుంచి సురేష్ నే చూస్తున్నాను. జీప్ వెనక భాగంలో కూర్చున్న సురేష్ నన్ను చూసి ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.

ఇక ఏం చెప్పను..   





1 comment:

  1. ఇది ఇంతకు ముందు రాసిన "గొడ్డొచ్చిన వేళ"కి sequel?

    ReplyDelete

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...