Saturday, 16 March 2019

నాన్న అడుగు...






నాన్నంటే గొప్ప స్నేహం, ఆయనంటే ఎక్కడలేని ప్రేమ, గౌరవం. ఇవన్నీ కలగడానికి ఆయన నాతో మెలిగిన విధానమే కారణం. ఇప్పుడు మా మధ్య ఎలాంటి బంధం లేకున్నా... నేను నేనుగా ఉండడానికి ఆయన మాటలే కారణం. మొదటి బిడ్డనని నేనంటే చాలా ప్రేమ చూపేవారు. గుండెల మీద పడుకోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెప్పేవారు. అలా పడుకుని కబుర్లు వింటుంటే ఆయన గుండె చప్పుడులో నాపేరే వినిపించేది.

మనిషి తన పూర్తి జీవిత కాలంలో తనని ఎక్కువ ప్రభావితం చెసింది ఎవరు అని అడిగితే ఎక్కడో గాంధీ అనేకన్నా ముందుగా తమ తల్లో, తండ్రో అనే చెపుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మసిలి, పెరిగి పెద్దగా అయ్యేది వారి మధ్యనే కనుక తమ మొదటి అడుగులు పడేవేళ వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు. నేనూ అంతే...

నాన్నగారి కూడా ఎక్కడికన్నా వెళ్ళే స్వతంత్రం, ఏదైనా మాట్లాడే స్వేచ్ఛా నాకు ఉండేది. అన్నం తినేప్పుడు ఆయన కంచంలో గోరు ముద్దలు కలిపి పెట్టేవారు. ఏది కొనాలన్నా శాంతిగాడికి ఇది బావుంటుందే అనేవాళ్ళు. ఇక్కడ ఇంకోమాట చెప్పాలి. నాకు అమ్మకన్నా నాన్నగారి దగ్గరే చనువుండేది. అమ్మ ఎప్పుడూ మమ్మల్ని అంటే ఆడపిల్లల్ని కాస్త దూరంగానే చూసేది. ఒక్క తమ్ముణ్ణి తప్ప. మరి వాడు ముగ్గురు ఆడాళ్ల తరువాత పుట్టిన వంశోద్ధారకుడనే భావన ఆమెది. అదీ కాదనలేం..

నాన్నతో కబుర్లలో ఎన్ని జీవిత సత్యాలో దొర్లేవి. భారతం, భాగవతం, రామాయణం ఇలా మొదలు పెట్టి బైబిల్ సంగతులు కూడా ఆయన చెప్పేవారు. అందులో అప్పుడప్పుడూ తమ జీవితాన్ని మొదలుపెట్టిన తొలినాటి రోజులను గురించి చెప్పేవారు. అవన్నీ మిగతా తోబుట్టువులకన్నా నామీద ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పాలి. అందుకే నేను నా వెనుకటి రోజులను పధిలంగా దాచుకుంటాను. వెనకటిరోజులు మరిచిపోను. ఇప్పటికీ నేను వాటిని పాటిస్తాను. పాటిస్తూనే ఉంటాను.

మనుషులు మారతారు.. మారుతూనే ఉంటారు, దాన్ని మన బలమైన గుండె తట్టుకున్నా, లేకున్నా అది సహజం. ఇదిలా ఉంటే నాన్నగారికి నాకు మధ్య ఉన్న స్నేహం నెమ్మదిగా వీగిపోవడం మొదలైంది. దానికి మనుషులు కన్నా ఎక్కువ పెరుగుతున్న నా వయసే అందుకు కారణం అయింది. ఇద్దరం సైకిళ్ళ మీద బయటకు వెళ్ళడం మానేసాం. నెమ్మదిగా నాకు ఆయన ఇచ్చిన అపారమైన స్వేచ్ఛ తరిగిపోవచ్చింది. దాని స్థానంలో హద్దులు గీయడం మొదలైంది. దానిని ఏలా కాదనాలో తెలీలేదు. కానీ గుండెలో ఎక్కడో నేను ఆడపిల్లనని దూరం పెడుతున్నారని అనిపించేది. తమ్ముడు ఎదుగుతున్నాడు, వాడితో ఆయన బయటకు వెళ్ళడం, ఎక్కువగా మాట్లాడటం చేసేవాళ్ళు.

ఇక నాతో ఆయనకు, ఆయనందు నాకు ఉన్న చనువు మాయం అయిపోయింది. ఆయన నన్ను చూసే చూపూ మారింది. నాకున్న వయసుకన్నా ఓ పదేళ్ళు పెంచి చూడటం, అలానే నాతో మాట్లాడటం చేసేవారు. ఇది తోబుట్టువులకూ అంటించారు. దీనికంతటికీ ముఖ్య పాత్రధారి మా అమ్మ. ముగ్గురు ఆడబిడ్డల్లో పెద్దదాన్ని త్వరగా వదిలించుకోవాలంటే ఆమెకు తోచిన మార్గం ఇదే మరి. అంటే నాకు 15 సంవత్సరాలైతే దానికి 10 ఏళ్ళు కలిపితే హమ్మో దీన్ని త్వరగా పెళ్ళిచేసి పంపేయాలన్న ధ్యాస ఆయనలో కలిగేలా మాట్లాడేది.

దీనితో నాచూపు, నా మాట నా ప్రవర్తనా అన్నీ గమలించేవారు. పైగా దీనికి తోబుట్టువులు గుఢచారులు. ఎవరు ఏలా ఏడిచినా నాగోల నాదిలా ఉన్నా... మనసులో ఎక్కడో ఇక్కడ కాకుండా వేరేచోటే నాకు స్వేచ్ఛ ఉంటుందా అనే ఆలోచన కలిగేలా చేసేవి ఆ క్షణాలు. రాత్రుళ్ళు ఎక్కువగా ఆలోచించేదాన్ని ఎక్కడ దొరుకుతుంది స్వేచ్ఛ అని.
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు పెద్దదాన్ని అయిన నక్షత్రం బాగాలేదని మా అమ్మ గగ్గోలు పెట్టడం కొసమెరుపు. ఇక అప్పుడే ఏదో తుఫాను వచ్చింది. అంతే దానికీ నేనే కారణం అన్నారు. ఇక పూజలు, హోమాలు, మనపై నిఘాలు ఒకటేమిటి అన్నీ తిరగబడిపోయాయ్.

వీటన్నింటితో నాన్నగారితో మాట్లాడాలన్నా భయం వచ్చి చేరింది. ఏదో చెప్పేసుకోవాలనిపించేది. ఇదంతా చాలా బాధగా ఉంది నన్ను వేరేలా చూడకండి అని చెప్పాలనిపించేది.. కానీ మళ్ళీ...ఏం మాట్లాడతాంలే అనుకునేదాన్ని. ఆయన ఆలోచనలో నాకు అప్పటికే పెళ్ళీడు దాటిపోయి ముదిరిపోయి గండెలమీద బరువైన కుంపటినైపోయాను. సరే దీన్ని మన కొంపలోంచి ఎంత త్వరగా పంపేయాలనే ఆలోచిస్తున్నారనిపించేది ఆయన్ని చూసిన ప్రతిసారీ...

దూరం దగ్గర అనేవి మన ఆలోచనను పడ్డే ఉంటాయి. ఓ పాత పాట విన్నా, పురాణం గురించి మాట్లాడినా, పాతతరం సినిమాలు చూసినా, రేడియో విన్నా, వర్షంలో పకోడీలు తిన్నా, మంచి భోజనం చేసినా... గొప్ప వాఖ్యాలు తారసపడినా, చిన్న విజయం అందుకున్నా, కష్టాలు వెనక్కు నెడుతున్న క్షణాలన్నింటిలోనూ ఆయనే గుర్తుకువస్తారు. 

1 comment:

  1. కటువు నిజమైనా,దాదాపు అందరి మాతృమూర్తుల జీవితంలో ఇలాంటి సంఘటనలు అధికం. మీ అబ్బాయిలో నాన్నను చూసుకొని ఆనందించండి అక్క..

    ReplyDelete

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...